“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, ఆగస్టు 2017, ఆదివారం

Baba Ram Rahim Singh Chart Analysis

బాబా రాం రహీం సింగ్
పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలు నేడు నిప్పుల కుంపటిలా ఉడకడానికీ, ఆ రాష్ట్రాలలో యుద్ధవాతావరణం రావడానికీ కారకుడు బాబా రాం రహీం సింగ్. ఈయన్ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా వేలాదిమంది అతని అనుచరులు రోడ్లెక్కి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఆర్మీతో యుద్దానికి కూడా తలపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అయిదు మిలియన్ల మంది భక్తులూ/ శిష్యులూ ఉన్నారు. ఈయనదొక విలక్షణమైన బహుముఖ వ్యక్తిత్వం. ఈయన జాతకాన్ని పరిశీలిద్దాం.


ఈయన 15-8-1967 న (స్వాతంత్ర్య దినోత్సవం రోజున) రాజస్థాన్ లో జన్మించాడు. 1967 లో గురువు ఖగోళంలో ఉచ్చస్థితిలో ఉన్నాడని మనకు తెలుసు. ఎవరి జాతకంలో అయితే గురువు ఉచ్చస్థితిలో ఉంటాడో వారికి జీవితంలో కనీస అవసరాలకు లోటుపాట్లు ఉండవు. అయితే ఆయా లగ్నాలను బట్టి కొంతమంది జీవితంలో బాగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మరికొందరు అంత ఉన్నత స్థాయికి చేరుకోలేరు. కానీ వారి జీవితాలు కూడా ఉన్నంతలో బాగానే నడుస్తుంటాయి.

ఈయన జనన సమయం తెలియదు గనుక ఇతర పద్ధతుల ద్వారా పరిశీలిద్దాం. ఆరోజున చంద్రుడు రెండు నక్షత్రాలలో ఉన్నాడు - జ్యేష్ట 4, మూల 1. నక్షత్ర లక్షణాలను బట్టి ఈయన మూలా నక్షత్రంలో పుట్టాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మూలా నక్షత్రం అయితేనే గురువుగారి ప్రభావంలో ఉంటుంది మరియు ఇందులో పుట్టిన వాళ్ళు రాక్ స్టార్స్ లాంటి స్టేజీ గాయకులూ అవుతారు. ఈయన ఒక గురువేగాక పాటలు పాడి ఆల్బమ్స్ రిలీజ్ చెయ్యడమూ, సినిమాలు తియ్యడమూ వాటిల్లో నటించడమూ చేస్తుంటాడు. ఈయనకు "రాక్ స్టార్ బాబా" అనే పేరుంది. 


ధనాధన్ సద్గురు
అంతేగాక ఈ నక్షత్రం ఈ పాదం అయితేనే చంద్రుడు నవాంశలో కుజునితో కలసి మేషంలోకి వస్తాడు. అప్పుడే ఈయనకు రోషమూ, పట్టుదలా, స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొదలైనవి కలుగుతాయి. అంతేగాక మూలా నక్షత్రానికి గురువు, కేతువుల లక్షణాలు కలగలసి ఉంటాయి. దీనికనుగుణంగానే వీరిలో చాలామంది గురువులై గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గొప్ప ఆశయాలతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కానీ కేతు ప్రభావం వల్ల తమ చర్యలతో తమను తామే నాశనం చేసుకుని తోకచుక్కలా అకస్మాత్తుగా రాలిపోతూ ఉంటారు. ఇవన్నీ ఈయనలో ఉన్నాయి గనుక ఈయనది మూలానక్షత్రం అని నేను భావిస్తున్నాను. అదే నిజమైతే ఈయన మధ్యాన్నం పదకొండున్నర తర్వాత నుంచి సాయంత్రం అయిదు లోపల జన్మించి ఉండాలి. ప్రస్తుతం ఇంతకంటే జననకాల సంస్కరణ అవసరం లేదుగనుక ఇంతటితో ఆపుదాం.

ఈ విధంగా నక్షత్రమూ నక్షత్ర పాదమూ తెలిస్తే చాలు మనిషి మనస్తత్వాన్నీ అతని జీవిత రహదారినీ తేలికగా చదివెయ్యవచ్చు.

రాక్ స్టార్ బాబా
రవి బుధ, ఉచ్ఛ గురువులతో కూడి కర్కాటకంలో ఉన్న యోగం ఈయన జాతకంలోని బలం. నవాంశలో రాహుకేతువుల ఉచ్ఛస్థితి వల్ల జీవితంలో ఉన్నత స్థితికి సులువుగా చేరుకున్నాడు. పది/ఏడు స్థానాలకు అధిపతి అయిన బుధుడూ, తొమ్మిదో అధిపతి అయిన సూర్యుడూ, లగ్నాధిపతి అయిన ఉచ్ఛగురువుతో కలసి బలమైన మతగురువుగా యోగాన్నిచ్చారు. కానీ ఇది అష్టమంలో ఉండటంతో రహస్య కార్యకలాపాలు కూడా ఆశ్రమంలో జరుగుతాయని సూచన ఉన్నది.

అష్టమంలో నాలుగుగ్రహాల బలమైన సన్యాసయోగం వల్ల సంసారి అయి, భార్యాపిల్లలున్నప్పటికీ ఒక బలమైన మతసంస్థకు గురువయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ను సంపాదించాడు. అయిదింట పంచమంలో రాహువు వల్ల హిందూ, ఇస్లాం, సూఫీ మార్గాల కలగలుపు అయిన సిక్కు మతంలో ఒక శాఖకు గురువయ్యాడు. ఈయనకున్న బలమైన దళితఓటు బ్యాంకు వల్ల కాంగ్రెస్ నుంచి బీజీపీ వరకూ ప్రతి రాజకీయ పార్టీ ఈయన్ను ఇరవై ఐదేళ్లుగా దువ్వి బుజ్జగిస్తూ వస్తున్నాయి.


వరద బాధితులను ఓదారుస్తూ
ఈయనకు ఆరేళ్ళ చిన్న వయసులోనే ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయంటారు. ఈయనను చూచి బాగా ఇష్టపడిన 'డేరా సచ్చా సౌదా' గురువు సంత్ సత్నాంసింగ్ ఏడేళ్ళ వయసులో చిన్నపిల్లగాడిగా ఉన్న ఈయనకు దీక్షనిచ్చాడు. ఆ సమయంలో ఈయనకు కేతు మహాదశ నడిచింది. కేతుదశలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక యోగాలున్న జాతకులకు మంచి అతీతమైన అనుభవాలు కలగడం నిజమే. కనుక చిన్నతనంలో ఈయనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగడం నిజమే కావచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ 1990 లో ఈయన్ను తన వారసునిగా ప్రకటించాడు. అప్పటికి ఈయనకు 23 ఏళ్ళు.

నవమ దశమ అధిపతుల యోగం ఉచ్ఛగురువుతో కలసి ఈయనకు అద్భుతమైన రాజయోగాన్నిచ్చింది. అయితే మత కార్యకలాపాలకు సూచిక అయిన తొమ్మిదో స్థానంలో వక్ర శుక్రుని వల్లా, పదకొండులో కుజశుక్రుల వల్లా ఈయనలో శ్రీకృష్ణ పరమాత్ముని లక్షణాలు కొన్నున్నాయని అర్ధమౌతున్నది. తులలో ఉన్న కేతువు ఇక్కడ శుక్రుని సూచిస్తున్నాడని గుర్తుంచుకోవాలి.

శుక్రుడు ఈ రాశికి మంచివాడు కాదు గనుక పదకొండో అధిపతి అయిన శుక్రుడు సూచించే ఒక శిష్యురాలి వల్లనే ఈయనకిప్పుడు మూడింది. లాభస్థానం నుంచి ఇరుగూ పొరుగూ, స్నేహితులూ, పనివాళ్ళూ, లాభాలూ, రోగాలూ కూడా సూచితాలౌతాయి.  ఈ విధంగా జాతకంలోని వివిధ అంశాలు జీవితాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవేంటో ముందుగా గమనించి గ్రహించి వాటిని దిద్దుకుంటూ ఆయా దశలలో ఎంతో జాగ్రత్తగా నడవడమే జ్యోతిషం తెలిసినవారి కర్తవ్యం. అయితే ఇంత స్థాయిలో అధికారాన్నీ హోదానూ ఎంజాయ్ చేస్తున్నవారికి అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి ఇవేవీ కనపడవు. కనుకనే పతనం అవుతూ ఉంటారు. 'నేను దైవాంశ సంభూతుడినే' అని ఈయన నమ్ముతూ ఉంటాడు. బహుశా ఈ మితిమీరిన నమ్మకమే ఈయన తాత్కాలిక పతనానికి కారణం అయి ఉండవచ్చు.

చంద్రుడు మూలానక్షత్రంలోకి వచ్చినపుడు మాత్రమే ఈయన జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడౌతాడు. లేదంటే చంద్రుడు వృశ్చికరాశి చివరలో ఉంటాడు గనుక చంద్రుడే ఆత్మకారకుడౌతాడు. ఈయనలో చంద్రుని లక్షణాలు లేవు బలంగా ఉన్న సూర్యుని లక్షణాలే ఉన్నాయి గనుక గనుక మనం చేసిన 'బర్త్ టైం రెక్టిఫికేషన్' కరెక్టే అని దీనివల్ల తెలుస్తున్నది. తన జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడు గనుకనే ఈయన పొడుగాటి గడ్డం పెంచి సింహంలాగా కనిపిస్తూ ఉంటాడు. ఈయన తీసే సినిమాలలో కూడా ఆయనకు 'లయన్ హార్ట్' అనే పేరు ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మన జాతకంలోని గ్రహాలను బట్టే మన వేషమూ, మనం కనిపించే తీరూ, అంతేగాక మన పేర్లూ, డ్రస్సులూ, వాటి రంగులూ అన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. జీవితానికీ జాతకానికీ ఇదొక సూక్ష్మమైన లింక్.

కారకాంశ లగ్నమైన మీనం నుంచి పంచమంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల ఇది ఒక గట్టి ఆధ్యాత్మిక యోగం అయినందువల్ల ఈయన పూర్తిగా మోసగాడని చెప్పలేము. గతంలో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి మీద కూడా చండాలమైన అభియోగాలు మోపబడ్డాయి. కానీ అంతమాత్రం చేత ఆయన మహనీయుడు కాకుండా పోలేదుగా? కాకుంటే, అష్టమంలో ఉన్న కుజకేతు యోగం ఈయన జాతకంలో ఉన్న రసికత్వాన్ని చూపిస్తున్నది మరి !!

'పెంపుడు' కూతురు హనీ ప్రీత్ ఇన్సాన్ తో
ఈయన జాతకానికీ రావణుని జాతకానికీ చాలా పోలికలున్నాయి. ఈయనకు రావణుని వేషం వేస్తే చాలా బాగా సూటవుతుంది. రావణునిది కూడా మూలా నక్షత్రమే. ఆయన కూడా తనలో ఎన్ని మంచి లక్షణాలున్నప్పటికీ, తానొక దైవాంశ సంభూతుడినన్న గర్వంతో అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి తనకు నచ్చిన స్త్రీలను ఇష్టానుసారం చెరబట్టే కార్యక్రమంలో, సీతాదేవిని కూడా అలాగే చెయ్యబోయి పతనం అయిపోయాడు.

రావణుడు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. రావణుని ప్రజలను అడిగితే ఆయనకంటే మంచి రాజు ఎక్కడా లేడనే చెబుతారు. అలాగే ఈయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఈయన అధిపతిగా ఉన్న 'డేరా సచ్చా సౌదా' అనే సంస్థ చాలా పెద్దది. ఇది ఎన్నో పయనీర్ కార్యక్రమాలు చేసింది. గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుంది. దీనికి వందలాది కోట్ల ఆస్తులున్నాయి. స్వచ్చత, పరిశుభ్రత, గోవధా నిషేధం, మొక్కలు పెంచడం, నిరక్షరాస్యతా నిర్మూలన, స్పోర్ట్స్ ఎంకరేజ్ మెంట్, వరదలు వంటి ప్రకృతి విలయాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చెయ్యడం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఈయన చురుకుగా చేశాడు. అదే గాక ఒక రాక్ స్టార్ లాగా పాటలు పాడి ఆల్బమ్స్ రిలీజ్ చెయ్యడం, సినిమాలు తీసి వాటికి దర్శకత్వం వహించి వాటిల్లో నటించడం వంటి పనులూ చేశాడు. ఈయన 'పెంపుడు' కూతురు హనీ ప్రీత్ ఇన్సాన్ కూడా సినీ దర్శకురాలే. ఆమె ఒకే సినిమాలో 21 వేషాలు వేసి వరల్డ్ రికార్డ్ బద్దలు చేసింది.

ఇన్ని కోణాలు ఈయనలో ఉన్నాయి గనుకనే ఈయన జాతకానికీ రావణుని జాతకానికీ చాలా పోలికలున్నాయని నేనంటాను. వీళ్ళిద్దరి నక్షత్రాలు కూడా ఒకటే.

2008 సెప్టెంబర్ లో ఈయన మీద కేసు విచారణ మొదలైంది. తమను చాలాసార్లు రేప్ చేశాడంటూ ఇద్దరు డేరా సన్యాసినులు 'మూడేళ్ళ తర్వాత' ఇచ్చిన స్టేట్ మెంట్ ను సీబీఐ తమ కేసులో ప్రధాన ఆధారంగా తీసుకుంది. ఆ సమయంలో జననకాల చంద్రుడు ఒకవైపు రాహువు (శని) తోనూ, ఇంకో వైపు వక్ర గురువుతోనూ అప్పచ్చి అయ్యాడు. అప్పుడే ఈయనకు కష్టాలు మొదలయ్యాయి.

2002 లో రంజిత్ సింగ్ మరియు రాం చందర్ చత్రపతి అనే ఇద్దరి చావులకు ఈయనే కారకుడని కేసులు బుక్ అయ్యాయి. వీరిద్దరిలో రంజిత్ అనేవాడు డేరా సన్యాసిని ఒకామె అప్పటి ప్రధానమంత్రి వాజపేయికి వ్రాసిన కంప్లెయింట్ కాపీలను విస్తృతంగా అందరికీ పంచడం వల్లనే చంపబడ్డాడని అతని తల్లిదండ్రులు అంటున్నారు. రాం చందర్ అనే జర్నలిస్ట్ కూడా ఆశ్రమంలోని చీకటి కోణాలపైన పరిశోధన చేసినందుకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించాడని పుకారుంది. ఆ సమయంలో రాంరహీం జాతకంలో రాహుకేతువులు ఆరు పన్నెండులో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. శని సప్తమంలో ఉండి చంద్రలగ్నాన్ని చూస్తున్నాడు. గురువు అష్టమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురు అనుగ్రహంతో కేసుల ప్రభావం ఈయన్ను తాత్కాలికంగా ఏమీ చెయ్యలేదు.

ఈయనకు ప్రస్తుతం ఏలినాటి శని మొదలైంది. వెంటనే కష్టాలూ ప్రారంభమయ్యాయి. ఈయన అనుచరులు ఈయనకు వ్యతిరేకంగా వచ్చిన కోర్టు తీర్పు పైన అప్పీల్ చేస్తున్నారు. ఈయనకున్న రాజకీయ పలుకుబడి వల్లా, ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ వల్లా, అన్నింటినీ మించి ఈయన ఉండేది ఇండియాలో గనుక అంతిమంగా ఈయనకు ఏమీ కాదని నా ఊహ.

ఇది ఈయన మీద మోపబడిన దొంగ కేసనీ, చివరకు ఈయన క్షేమంగా బయటకొస్తాడనీ, జైలుకు పోయినంతమాత్రాన కేసు రుజువైనట్లు కాదనీ ఈయన అనుచరులు వాదిస్తున్నారు. లక్షలాది మంది అనుచరులు ఈయన దైవాంశసంభూతుడే అని నమ్ముతున్నారు. ఇప్పటివరకూ జరిగిన గొడవలలో దాదాపు నలభై మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. సౌత్ నుంచి నార్తిండియాకు వెళ్ళే దాదాపు ౩౦ రైళ్ళు రద్దైపోయాయి. అయినా సరే, రోజుల తరబడి కుటుంబాలతో సహా రోడ్లమీదే ఉంటూ, ఆర్మీకి కూడా ఎదురు తిరిగి పోరాడటానికి ఈయన శిష్యులూ భక్తులూ సిద్ధంగా ఉన్నారు.

సొసైటీకి ఏమీచెయ్యకుండా ఊరకే సెవెన్ స్టార్ ఆశ్రమంలో కూచుని ఎంజాయ్ చేస్తుంటే ఇంత ఫాలోయింగ్ ఈయనకెలా వచ్చిందో తెలియదు.

చూద్దాం ఏం జరుగుతుందో?