“భగవంతుని పట్ల దిగులే జిజ్ఞాస"- జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

18, జనవరి 2019, శుక్రవారం

ఛీ ! లోకం పాడైపోయింది !

మొన్నొక ప్రెండ్ నాతో మాట్లాడుతూ 'ఛీఛీ ! లోకం బొత్తిగా పాడైపోయింది' అన్నాడు.

నవ్వాను.

'లోకం పాడైపోయిందా? ఎక్కడా?' అన్నాను ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'అదేంటి? కనిపించడం లేదా? ఎక్కడ చూచినా మోసం, అవినీతి, దగా, దౌర్జన్యం, నకిలీ వ్యక్తిత్వాలు, వ్యసనాలు, ముసుగులు, అబద్దాలు, ఇవేగా ! దీన్ని ఏమంటారు?' అన్నాడు.

'అవన్నీ సరేలే ! ఇందులో లోకం పాత్ర ఏముంది? మనం పాడై పోతూ లోకాన్ని నిందిస్తే ఉపయోగం ఏముంది? దానికేమన్నా ప్రాణం ఉందా మనలాగా?' అడిగాను.

'అంటే, లోకమంటే మనుషులూ సమాజమూ అనే అర్ధంలో అన్నాలే !' అన్నాడు.

'నీకు తోచిన అర్ధాలలో అనడం కాదు, ఉన్నది ఉన్నట్టు అను. మనం పాడైపోతున్నాం. లోకాన్ని పాడుచేస్తున్నాం అను' - అన్నాను.

'అదేలే, మరీ ఇంత ఘోరమా? టీచర్లు సరిగ్గా లేరు. విద్యార్ధులూ సరిగ్గా లేరు. తల్లిదండ్రులూ, పిల్లలూ సరిగ్గా లేరు. వైద్యులూ రోగులూ సరిగ్గా లేరు. అధికారులూ, ఉద్యోగులూ సరిగ్గా లేరు. భార్యాభర్తలూ సరిగ్గా లేరు. ఛీ ఛీ' అన్నాడు వాడు.

'మళ్ళీ అదే కూత కూస్తున్నావ్ ! సరిగ్గా లేరు, అంటే నీ అర్ధం ఏంటి? How can you expect absolute perfection in this relative world?' అడిగాను.

ఖంగు తిన్నాడు ఫ్రెండ్.

'సమాజం అంతా సరిగ్గానే ఉందంటావా? నేను చెప్పేది అబద్దాలా?' అడిగాడు కోపంగా.

'లేదు లేదు. నువ్వు చెప్పేవి నిజాలే. నీ ఆత్మఘోష నాకు బాగానే అర్ధమైంది' అన్నాను నవ్వుతూ.

'మరి ఇదంతా ఇలా ఎందుకుందో చెప్పు? కలిప్రభావం అని మాత్రం అనకు. ఈ మాటను వినీ వినీ విసుగొచ్చింది' అన్నాడు.

ఇలా చెప్పాను.

'చూడు. కలిప్రభావం అనేది సరే. అది నిజమే. కానీ మన ప్రమేయం లేకుండా కలి ఏం చెయ్యగలదో చెప్పు? ఏమీ చెయ్యలేదు. నువ్వు చెప్పిన దాంట్లో ఇద్దరున్నారు. మొదటి వర్గం డాక్టరు, టీచరు, అధికారి, నాయకుడు. భర్త, తండ్రి ఇలా ఉన్నారుకదా. రెండో వర్గమేమో రోగి, విద్యార్ధి, ఉద్యోగి, పౌరుడు, భార్య ఇలా ఉన్నారు. మొదటి వర్గం సరిగ్గా ఉంటె రెండో వర్గమూ సరిగ్గానే ఉంటుంది. లేదా రెండో వర్గం సరిగ్గా ఉంటె మొదటి వర్గమూ సరిగ్గానే దొరుకుతుంది.

కర్మసూత్రం ప్రకారం మన ఖర్మకు తగినవాళ్లే మనకు దొరుకుతారు. అది భర్తైనా, భార్యైనా, గురువైనా, టీచరైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదైనా ఇంతే. ఇదొక కర్మనియమం. దీన్ని ఎవరూ దాటలేరు. మనం సరిగ్గా ఉంటే, మనకు దొరికేవాళ్ళూ సరిగ్గానే ఉంటారు. మనం దారితప్పితే మనకు దొరికేవాళ్ళు కూడా అలాంటివాళ్ళే దొరుకుతారు.

ఒక ఉదాహరణ చెప్తా చూడు. ఒకప్పుడు నాయకులు నిజాయితీగా ఉండేవారు. ప్రజలూ అలాగే ఉండేవారు. క్రమంగా నాయకులు దారి తప్పడం మొదలైంది. ప్రజలూ దారితప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు నాయకులూ దొంగలే, ప్రజలూ దొంగలే. ఎవడికి చిక్కినది వాడు దోచుకుంటున్నాడు. ప్రాచీన కాలం నుంచీ ఈ దేశాన్ని ఎన్నో విదేశీజాతులు దోచుకున్నాయి. ఇప్పుడు స్వదేశీ ప్రజలూ, స్వదేశీ నాయకులే దోచుకుంటున్నారు. ప్రజలే పక్కా అవినీతిపరులుగా తయారయ్యారు. కనుక వారికి నీతిమంతులైన నాయకులు దొరకరు. నాయకులు అవినీతి పరులై, ప్రజలకు అలవాటు చేస్తున్నారు గనుక ప్రజలూ దారి తప్పుతున్నారు. ఇదొక విషవలయం.

అలాగే, అది విద్యార్దులైనా, రోగులైనా, ఉద్యోగులైనా ఎవరైనా సరే. వాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే వారికి సరైన కౌంటర్ పార్ట్ దొరుకుతుంది.' అన్నాను.

'అందరికీ అలా జరుగుతుందా?' అడిగాడు.

'జరగదు. ఈరోజు మనం పత్తిత్తులుగా మారినంత మాత్రాన రేపే మనం కోరుకునే ఆదర్శమూర్తులు దొరకరు. ప్రకృతికి కూడా మనమంటే నమ్మకం కలగాలి. అంతకాలం మనం మన నిజాయితీని నిరూపించుకోవాలి. ఆగాలి. అప్పుడే మనం అనుకునేవి జరుగుతాయి. మనకు ఓపిక ఉండాలి. మనం చేసే వెధవపనులన్నీ చేసేసి, సడెన్ గా 'ఈరోజే నేను మారుమనసు పొందాను, ప్రభువా కనిపించు' అంటే, ఎవడూ నీ ముందు ప్రత్యక్షం కాడు.

అసలు పాయింట్ అది కాదు. నువ్వు కోరుకునేవాళ్ళు నీకు దొరికినా దొరక్కపోయినా నీ ప్రిన్సిపుల్స్ మీద నువ్వు నిలబడాలి. అలా కొంతకాలం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చెయ్యగలిగితే అప్పుడు ప్రకృతి కూడా నీ నిజాయితీని గుర్తించి, నీకు తగిన పరిస్థితులను కల్పించడం మొదలుపెడుతుంది. అంతవరకూ నువ్వు నీతికీ నిజాయితీకీ నిలబడాలి.

కానీ నేటి సమాజంలో అలాంటి మనుషులు ఏరి? అందరికీ తొందరే. అందరికీ ఆత్రమే. ఏదో జారిపోతుంది. ఏదో కోల్పోతాం. అన్న భయంలో భ్రమలో ఒకడిని మించి ఇంకొకడు పరుగులు తీస్తున్నాడు. చివరికి అందరూ సర్వనాశనం అవుతారు. అది ఎవడికీ అర్ధం కావడంలేదు. నువ్వు చెప్పినది నిజమే. సమాజం అంతా కుళ్లిపోయింది. దీనిని బాగు చెయ్యడం ఎవడికీ సాధ్యం కాదు. బహుశా భగవంతుడే దిగి రావాలేమో !

ఒక చిన్న విషయం విను. ఎక్కడైనా demand ని బట్టే supply అనేది ఉంటుంది. కానీ demand చేసేవాడిలో నిజాయితీ ఉండాలి. త్రికరణశుద్ధి ఉండాలి. అప్పుడు supply అనేది ప్రకృతి నుంచి వస్తుంది. ప్రస్తుతం మన సమాజంలో నిజమైన విలువల కోసం డిమాండూ లేదు, అలా అడగడానికి కావలసిన అర్హతా ఎవడికీ లేదు. కనుక ప్రకృతినుంచి సరియైన సప్లై కూడా ఉండటం లేదు.

నీది గొంతెమ్మ కోరిక. సమాజమూ లోకమూ బాగుపడాలని ఎప్పుడూ ఆశించకు. అది జరగని పని. ఇవి ఇంకా ఇంకా సర్వనాశనం అవుతూనే ఉంటాయి. సామూహిక కర్మను అర్ధం చేసుకునే శక్తి నీకు లేదు. నీ జీవితమే నీకర్ధం కాదు. ఇక ప్రపంచకర్మను నువ్వేం అర్ధం చేసుకోగలవు? అసలలాంటి ప్రయత్నమే నువ్వు చెయ్యకూడదు.

బంతి, మెట్లమీదనుంచి క్రింద పడింది. అది దొర్లుతూ దొర్లుతూ పాతాళానికి పోవలసిందే గాని మధ్యలో ఆగి, వెనక్కు వెళ్ళదు. అదంతే !' అన్నాను.

'మరి దీనికి పరిష్కారం?' అడిగాడు.

'నాకేం తెలుసు? లోకాన్ని సృష్టించినవాడొకడున్నాడు. చేతనైతే వాడినడుగు' అన్నాను.

'చేతకాకపోతే?' అన్నాడు.

'నోర్మూసుకుని ఇంటికెళ్ళి తిని తొంగో' అన్నాను నవ్వుతూ.

ఫ్రెండ్ గాడు నీరసంగా లేచి ఇంటి ముఖం పట్టాడు.

కధ కంచికి మనం ఇంటికి !
read more " ఛీ ! లోకం పాడైపోయింది ! "

16, జనవరి 2019, బుధవారం

కలియుగ త్రిమూర్తులు

కలియుగంలో ధర్మం తగ్గిపోతుందనీ, ఏవేవో ఎక్కువైపోతాయనీ మనం చాలా చదువుకున్నాం. అవన్నీ ఎక్కువయ్యాయో లేదో మనకు తెలీదు కానీ, ఎక్కడో ఉండవలసిన త్రిమూర్తులు మాత్రం ఈలోకానికి వచ్చి చక్కగా కూచున్నారు.

త్రిమూర్తులంటే మీకు తెలిసిన దేవతలని అనుకునేరు ! వాళ్ళు కారు. ఈ త్రిమూర్తులు వేరు. ఇప్పుడు ఎక్కడ చూచినా వీళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరని మీకు అనుమానం వస్తోంది కదూ ! వినండి మరి !

బ్రహ్మ - Fast food
విష్ణువు - Use and throw
శివుడు - Speculation

ఒక్కొక్కరినీ విడివిడిగా ప్రార్ధిద్దాం. అంటే పరిశీలిద్దాం.

Fast Food

ఇదేంటో మీకందరికీ తెలుసు. నేను విడమర్చి చెప్పనక్కర్లేదు. కానీ చెప్తాను. ఫాస్ట్ ఫుడ్ అంటే రోడ్డు పక్కన ఉండే చిన్నచిన్న హోటళ్ళలో తినే తిండి కాదు. దేనికోసమూ ఎక్కువసేపు వేచి చూడలేకపోవడం. మనక్కావాల్సిన పనిని త్వరగా ముగించుకుని వెళ్ళిపోవడం. మన పనైపోయాక అక్కడ ఒక్క క్షణమైనా ఉండకపోవడం. ఇదీ ఫాస్ట్ ఫుడ్ అంటే.

ఇప్పుడు ఎవ్వరూ టైం వేస్ట్ చెయ్యడం లేదు అవసరమైన విషయాలలో. అనవసరమైన వాటిల్లో మాత్రం చాలా చేస్తున్నారు. ఏది అవసరమో ఏది అనవసరమో మాత్రం ఎవరికీ తెలీడం లేదు. కానీ ఉన్నది మాత్రం అవసరమే.

ప్రస్తుతం ఏ ఇద్దరినీ చూచినా, అవసరం లేనిదే ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. అవసరం తీరాక కూడా మాట్లాడటం లేదు. అసలిప్పుడు మనుషులనే వాళ్ళు ఎక్కడా లేరు. అవసరమే ఉంటున్నది. అవసరమే మాట్లాడిస్తోంది. అవసరమే మాట్లాడుతోంది. మానవ సంబంధాలన్నీ అవసరం చుట్టూతా తిరుగుతున్నాయి. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, కుటుంబసభ్యుల మధ్య కావచ్చు, ఎవరి మధ్యనైనా సరే, ఎక్కడైనా సరే, అవసరం ఒక్కటే ప్రస్తుతం మిగిలి ఉంది. ప్రేమ లేదు, దోమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, ఇంకేదీ లేదు, అవసరం తప్ప ! అందుకే అవసరం తీరాక ఎవరి మొహమూ ఎవరూ చూడటం లేదు. Fast food అంటే ఇదే.

Use and throw

ప్రస్తుతం మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న ఇంకో దేవత ఇది. మానవ సంబంధాలలో ప్రస్తుతం రాజ్యం చేస్తున్నది ఇదే. ఎదుటి మనిషి ఎవరైనా సరే, 'వాడుకో - వదిలేయ్' అంతే. నీకు అవసరం ఉంటే, ప్రేమను నటించు. నీ అవసరం తీరాక నిర్మొహమాటంగా ఆ మనిషిని వదిలేయ్.

బాధాకరమైన విషయం ఏమంటే, స్నేహితులు, ప్రేమికులు, బంధువులు, చివరకు భార్యాభర్తల మధ్యన కూడా ఇదే సూత్రం ఇప్పుడు రాజ్యం చేస్తోంది. ఎదుటి మనిషి నీకు ఉపయోగపడుతూ ఉన్నంతవరకూ ఆ మనిషిని ఉండనివ్వు. ఆ ఉపయోగం తీరిన మరుక్షణం తీసి అవతల పారెయ్. ప్రస్తుతం ఎవరిని చూచినా ఇదే పంధాలో కనిపిస్తున్నారు. పాతకాలంలో దీనిని స్వార్ధం అనేవారు. ఇప్పుడు 'తెలివితేటలు' అంటున్నారు. అందరినీ తన స్వార్ధానికి వాడుకుంటూ అందలం ఎక్కినవాడిని 'భలే తెలివైనవాడు' అంటున్నారు. మేనేజిమెంట్ తెలిసినవాడు అంటున్నారు. వాడే ఈనాడు సొసైటీలో ఒక ఐకాన్ అవుతున్నాడు. అంటే మనిషి పూజిస్తున్నది స్వార్దాన్నేగా !

Speculation

సమాజంలో మనం చూచే ఇంకో దేవత ఇది. ఈ పేరు చూచి షేర్ మార్కెట్ అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. అది కాదు. స్వల్పకాలిక బిజినెస్ అన్నమాట.

ప్రస్తుతం ఎవరూ ఎవరినీ పర్మనెంట్ గా అంటి పెట్టుకుని ఉండటం లేదు. శాశ్వతంగా నమ్మడమూ లేదు. పాతకాలంలో ఉన్నట్లు శాశ్వత ప్రేమలు, శాశ్వత అభిమానాలూ ఇప్పుడు భూతద్దంలో చూచినా ఎక్కడా కనిపించడం లేదు. కొంతకాలం ఒకరు, ఆ తర్వాత మరొకరు. కొంతకాలం ఒక ఉద్యోగం, ఆ తర్వాత ఇంకో ఉద్యోగం. కొంతకాలం ఒక స్నేహం, ఆ తర్వాత ఇంకో స్నేహం. ఏదైనా ఇంతే. ఏదీ శాశ్వతం కాదన్న వేదాంత సత్యాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారన్న మాట ప్రజలు !

ఒక్క హైదరాబాద్ సిటీ లోనే ప్రస్తుతం 'సహజీవనం' అనే విధానం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందట. ఒకే అపార్ట్ మెంట్ ను, నలుగురు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలూ కలసి అద్దెకు తీసుకోవడం, సహజీవనం చెయ్యడం. ఇకచాలు అనుకున్నప్పుడు వేరేచోటకి షిఫ్ట్ అయిపోవడం, లేదా చక్కగా వేరేవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం. ఇదీ ప్రస్తుత వరస ! ఆఫ్ కోర్స్ ఏదైనా ఒకటి రెండేళ్ళే అనుకోండి. ఆ తర్వాత ఎవరి దారి వారిది. ఇంకో జంటను వెతుక్కోవడమే.

ఒకచోట కొంత ప్రాఫిట్ చేసుకోవడం. ఇంకో కంపెనీ షేర్ కొనడం. మళ్ళీ దాన్ని వదిలించుకోవడం, ఇంకోదానికి షిఫ్ట్ అవడం. ఇదేగా speculation అంటే. ప్రస్తుతం మానవ సంబంధాలు కూడా ఇదే వరసలో సాగుతున్నాయి.

ఈ ముగ్గురే ప్రస్తుతం మనం పూజిస్తున్న నిజమైన త్రిమూర్తులు.

రాజకీయులైనా, భక్తులైనా, ఉద్యోగులైనా, వ్యాపారులైనా, డబ్బున్న వాళ్లైనా, డబ్బు లేని వారైనా, గొప్పవారైనా, మామూలు మనుషులైనా, ఇంకెవరైనా - ప్రస్తుతం అందరూ పూజిస్తున్నది ఈ ముగ్గరు దేవతలనే. ఇంట్లో అయినా, కాలేజీలో అయినా, ఆఫీసులో అయినా, పార్టీలల్లో అయినా, పండుగలలో అయినా, పబ్బాల్లో అయినా, పేరంటాల్లో  అయినా, గుళ్ళల్లో అయినా, గోపురాలలో అయినా -  ఎక్కడైనా సరే ఇదే వరస ! 

ప్రస్తుతం ప్రతివారి పూజామందిరంలోనూ ఎంతోమంది దేవతలు కనిపిస్తున్నారు. నిజంగా పూజించేది మాత్రం ఈ త్రిమూర్తులనే. పూజామందిరంలో దేవుళ్ల పటాలు మాత్రం రకరకాలు. ఇదొక హిపోక్రసీ ! పూజామందిరంలో ఉన్న దేవుళ్లన్నీ ఈ త్రిమూర్తుల తొత్తులు మాత్రమే. ఈ ముగ్గురినీ సంతృప్తి పరచినంతవరకే ఆ దేవతల విలువ. అది చెయ్యలేని మరుక్షణం పూజగదిలోని దేవతలు మారిపోయి వేరే దేవతలు వచ్చి కూచుంటారు.

ఈ కలిప్రభావంలో ఇంకెంత మంది ఇలాంటి దేవతలను చూడాలో ఏమో మరి?
read more " కలియుగ త్రిమూర్తులు "

15, జనవరి 2019, మంగళవారం

జ్ఞాపకం

ఒకనాడొక చర్చలో 'జీవితం అంటే ఏమిటి?' అన్న విషయం మొదలైంది.

అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా వారికి తోచిన విధంగా చెప్పారు.

నేనన్నాను - 'జీవితం ఒక జ్ఞాపకం. అంతే' అని.

అదేంటన్నారు.

ఇలా చెప్పాను.

'జీవితంలో చివరికి మిగిలేవి జ్ఞాపకాలే. ఇక్కడ ఏదీ నీతో రాదు. నీతో వచ్చేది నీ జ్ఞాపకాలే. జీవిత చరమాంకంలో వెనక్కు తిరిగి చూచుకున్నప్పుడే ఈ విషయం అర్ధమౌతుంది. అంతకు ముందు అర్ధం కాదు. ఇంకా చెప్పాలంటే, జీవితం మొదట్లోనే జీవిత చరమాంకాన్ని రుచి చూచినవాడికే ఇది బాగా అర్ధమౌతుంది.

జీవితంలో నువ్వు పొందిన సంతోషాలూ, బాధలూ, ఆశలూ, నిరాశలూ, పొంగిపోవడాలూ క్రుంగిపోవడాలూ - అవన్నీ ఇప్పుడేవి? ఎక్కడున్నాయి?

నీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. అంతే !

జీవితమంటే వర్తమానమే అని, వర్తమానంలో జీవించమని కొందరు తాత్వికులంటారు. నేను వాళ్ళను చూచి నవ్వుతాను. జీవితం వర్తమానం కాదు. అదొక జ్ఞాపకం. వర్తమానం కూడా జ్ఞాపకం అయినప్పుడే నీకు గుర్తుంటుంది. లేకుంటే దాన్ని నువ్వు గుర్తించలేవు.

నీ జీవితంలో నువ్వు ప్రేమించినవాళ్ళూ, నిన్ను ప్రేమించినవాళ్ళూ, నువ్వు ద్వేషించినవాళ్ళూ, నిన్ను ద్వేషించినవాళ్ళూ, నువ్వు కావాలనుకున్న వాళ్ళూ, నిన్ను కావాలనుకున్నవాళ్ళూ - వాళ్ళంతా ఏరి? ఇప్పుడెక్కడున్నారు?

నీ జ్ఞాపకాలలో ఉన్నారు. నీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నారు.

నీ జీవితం మొత్తం ఇంతే. అది ఒక జ్ఞాపకం ! ఒక జ్ఞాపకంగానే అది చివరకు మిగులుతుంది.

గత జన్మలైనా అంతే. అవి జ్ఞాపకాలుగా నీ సుప్తచేతన అడుగున ఉన్నాయి. ఆ లోతులకు వెళ్లి చూడగలిగితే నీకు కనిపిస్తాయి. అప్పుడు నీ గత జన్మలలో నువ్వేంటో అర్ధమౌతుంది. ఈ జన్మలో నువ్వేంటో, అసలు నువ్వెంతో అర్ధమౌతుంది.  నువ్వెవరో అర్ధమౌతుంది.

'ఏమంటారు?' అన్నాను.

వాళ్ళందరూ ఏమీ అనలేదు. మౌనంగా ఉన్నారు.

ఏదైనా అనడానికి వాళ్ళంటూ అసలుంటే కదా? వాళ్ళంతా నేనే. వాళ్ళు నావాళ్ళే. నాలోని వాళ్ళే. నా జ్ఞాపకాలే.

జీవితమంటే ఒక జ్ఞాపకమే.

కాదా?
read more " జ్ఞాపకం "

మీరంటే ఇప్పటికి నమ్మకం కుదిరింది

మొన్నొక ఫోనొచ్చింది.

'నమస్కారమండి. నా పేరు ఫలానా' అన్నాడు ఒకాయన.

'నమస్తే. చెప్పండి' అన్నా.

'నేను మీ బ్లాగును మొదట్నించీ ఫాలో అవుతున్నాను' అన్నాడు.

''మొదట్నించీ అంటే?' అడిగాను అనుమానంగా.

'అంటే మీరు బ్లాగు వ్రాయడం మొదలు పెట్టినప్పట్నించీ. అంటే 2008 నుంచీ.' అన్నాడు.

'చాలా సంతోషమండి' అన్నాను.

'అవును. మీ పుస్తకాలు కూడా అన్నీ చదివాను. మీ లేటెస్ట్ బుక్ మహాసౌరం తో సహా' అన్నాడు.

'ఇంకా థాంక్స్' అన్నాను.

'ఇప్పటికి మీమీద నాకు నమ్మకం కుదిరింది' అన్నాడు.

నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.

'అదేంటి?' అడిగాను అయోమయంగా.

'అంటే, మీరు చెబుతున్నవి నిజమే అని ఇప్పటికి నమ్ముతున్నాను' అన్నాడు.

'ఉద్దరించావులే' అనుకుని ' పోన్లెండి బ్రతికించారు' అన్నా.

'ఒక్కసారి మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను.' అన్నాడు.

'ఎందుకు?' అడిగాను.

'అంటే, మీ శిష్యునిగా మీ దగ్గర దీక్ష తీసుకుని మీ మార్గంలో నడుద్దామని నా ఊహ' అన్నాడు.

'ఉత్త ఊహేనా?' అడిగాను.

'అవునండి' అన్నాడు వినయంగా.

'మీరొక పని చెయ్యండి. 2029 జనవరిలో ఒకసారి ఫోన్ చెయ్యండి. ఆలోచిస్తాను' అన్నాను.

నిశ్శబ్దం

'అదేంటి సార్. అంటే ఇంకో పదేళ్ళు ఆగాలా?' అన్నాడు కోపం ధ్వనిస్తున్న స్వరంతో.

'అవునండి. నన్ను నమ్మడానికి మీకు పదేళ్ళు పట్టింది. మిమ్మల్ని నమ్మడానికి నాకూ కనీసం పదేళ్ళు పడుతుంది మరి. నేనూ మిమ్మల్ని జాగ్రత్తగా పరిశీలించాలిగా?' అన్నాను.

'అంటే, మేం మామూలు మనుషులం కాబట్టి పదేళ్ళు పట్టింది. మీరు గురువు కదా? అంత టైం మీకెందుకు పడుతుంది?' అన్నాడు.

'పట్టదు. కానీ సరదాకి అలా చెబుతున్నాను. మీకు తెలుసుకదా నేను జీవితాన్ని ఒక ఆటగా తీసుకుంటాను. అది నా జీవితమైనా సరే, వేరేవాళ్ళ జీవితమైనా సరే ! ఎప్పుడైనా ఒక్కోసారి నా జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటానేమో గాని, వేరేవాళ్ళ జీవితాలను మాత్రం ఎప్పుడూ ఆటగానే తీసుకుంటాను. వాటితో ఆడుకుంటాను. ఈ క్రమంలో సంసారాలు కూలుస్తుంటాను కూడా ! అది నా హాబీ. అందుకే అలా చెబుతున్నాను. మీరు మరోమాట మాట్లాడితే నన్ను కలవడానికి 2039 వరకూ ఆగాల్సి ఉంటుంది!' అన్నాను సీరియస్ గా.

అతను తెచ్చిపెట్టుకున్న అతివినయపు మాస్క్ జారిపోయింది.

'అబ్బా! అంతవరకూ మనం బ్రతికుంటామని గ్యారంటీ ఏముంది?' అన్నాడు వెటకారంగా.

'నేనుంటాను. ఎందుకంటే నేను ఆహారనియమం పాటిస్తాను. యోగాభ్యాసం చేస్తాను కాబట్టి. మీరుంటారో లేరో నేను చెప్పలేను' అన్నాను.

'అందరూ అనుకునేటట్టు మీకు అహంకారం అనేది నిజమేనన్నమాట' అన్నాడు ఇంకా వెటకారంగా.

ఈమాటను ఇప్పటికే వందలాది సార్లు వినీవినీ ఉండటంతో నాకు నవ్వొచ్చింది.

'అవును. నాకు అహంకారమే. ఏమీ తెలియని మీకే ఇంత అహంకారం ఉండగా లేనిది, ఇన్ని తెలిసిన నాకెంత ఉండాలి?' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

చాలామంది ఇంతే! వాళ్ళేదో చాలా గొప్పవాళ్ళమని అతిగా ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు గురువు దగ్గరకి రావడం ఆ గురువుగాడి అదృష్టం అని భ్రమల్లో తేలిపోతూ ఉంటారు. వాళ్లకు దీక్షనివ్వడం నా భాగ్యం అనుకుంటూ ఇలా అడుగుతూ ఉంటారు. ఇది అహంకారానికి పరాకాష్ట అని వాళ్ళకర్ధం కాదు. ఇలాంటివాళ్ళు ఈ జన్మంతా కొట్టుకున్నా ఆధ్యాత్మికంగా అంగుళం కూడా ఎదగలేరు. అసలిలాంటి వాళ్ళను నేను దగ్గరకు రానివ్వను కూడా రానివ్వను.

నన్ను నమ్మడానికి ఈయనకు పదేళ్ళు పట్టిందట ! నేనేమో ఈయన ఒక ఫోన్ కాల్ చేస్తే వెంటనే ఎగురుకుంటూ ఎదురెళ్ళి ఈయనను వాటేసుకుని యోగరహస్యాలన్నీ చెప్పేసి, దీక్షనిచ్చి, ఈయన బరువంతా మొయ్యాలట ! భలే బాగుంది కదూ ! 

లోకం ఎలాంటి మనుషులతో నిండి ఉందిరా దేవుడా !
read more " మీరంటే ఇప్పటికి నమ్మకం కుదిరింది "

12, జనవరి 2019, శనివారం

ఓటెలా వెయ్యాలి?

'నీకన్నీ తెలుసు కదా? ఓటు ఎలా వెయ్యాలో చెప్పు?' అడిగాడు మా ఫ్రెండ్ ఒకాయన ఇవాళ.

'దానికి చాలా టైముంది కదా? అప్పుడే ఎందుకు? మెల్లిగా చేస్తాలే ఉపదేశం' అన్నా నవ్వుతూ.

'కాదు. ప్లీజ్. ప్లీజ్. చెప్పవా?' బ్రతిమాలాడు.

'చేత్తో వెయ్యాలి' సీరియస్ గా అతని వైపు చూస్తూ చెప్పాను.

అతను కాసేపు నావైపు ఎగాదిగా చూశాడు.

'అబ్బా ! కాల్తో వెయ్యాలనుకున్నానే' అన్నాడు.

'నీ ఇష్టం వచ్చినదాంతో వెయ్యి. నాకేమీ అభ్యంతరం లేదు' అన్నా నవ్వుతూ.

'జోకులు కాదు. సీరియస్ గా అడుగుతున్నా. ఈ రాజకీయపార్టీలంటేనే నాకు విసుగు పుట్టింది. ఈ సారి మీరు ఎవరికి వెయ్యమంటే వారికి వేస్తా' అన్నాడు.

'చెప్పాక, చెయ్యకపోతే ఊరుకోను మరి !' అన్నా నేను కోపంగా.

'సరే చెప్పు' అన్నాడు ఒప్పుకుంటూ.

'పోలింగ్ స్టేషన్ కు వెళ్ళు. క్యూలో నిలబడు. ముందుకు నడువు.' అన్నా.

'అవన్నీ నాకు తెలుసు. ఓటు ఎలా వెయ్యాలి? అది చెప్పు' అన్నాడు.

'ఎందుకంత తొందర? చెప్తున్నాగా? బ్యాలట్ పేపర్ చేతులోకి తీసుకో. కళ్ళు మూసుకో. నీ ఇష్టదైవాన్ని మనసారా స్మరించు. కళ్ళు మూసుకుని గుద్దేయ్. చుక్క ఎవరిమీద పడితే ఆ పార్టీకే ఈసారి అధికారంలోకి వచ్చె అర్హత ఉన్నట్లు లెక్క' అన్నాను.

'ఒకవేళ ఆ గుర్తు రెండు పార్టీల మధ్యలో పడితేనో? అప్పుడు ఎవరికి అర్హత ఉన్నట్లు?' అడిగాడు ఫ్రెండ్ తెలివిగా.

'వాళ్ళ అర్హత నాకు తెలీదుగాని, అలా జరిగితే ఒక లెక్కుంది' అన్నా.

'ఏంటది?' అన్నాడు ఆత్రుతగా.

'అసలు ఓటేసే అర్హతే నీకు లేనట్లు లెక్క' అన్నా కూల్ గా.

ఫ్రెండ్ మాయమై పోయాడు.
read more " ఓటెలా వెయ్యాలి? "

రెడ్ లైట్ పౌరుడు

నీ రేటెంత?
అమ్మాయిని అడిగాడు రెడ్ లైట్ ఏరియా విటుడు
నీ రేటెంత?
ఓటర్ను అడిగాడు వైట్ డ్రెస్సులో ఉన్న నాయకుడు

వలువలు తీస్తే వెలయాలు
విలువలు వదిలేస్తే రాజకీయాలు
సుఖాన్ని కోరుతూ వ్యభిచారం
అధికారాన్ని కోరుతూ రాజకీయం

అక్కడ అమ్మాయి అస్వతంత్ర బానిస
ఇక్కడ ఓటరు స్వతంత్రపౌరుడు
అమ్మాయిది ఆకలి అవసరం
ఓటరుది ఆశల అవకాశం

ఈ ఓటరు కంటే
ఆ అమ్మాయి ఎంతో ఉత్తమురాలు
ఈ నాయకుడితో పోలిస్తే
ఆ అమ్మాయి దేవత

డబ్బుకు ఒళ్లమ్ముకుంటే వెలయాలు
డబ్బుకు ఓటమ్ముకుంటే భారతపౌరుడు
ఒళ్లమ్ముకోవడం కంటే
ఓటమ్ముకోవడం నీచాతినీచం

డబ్బిచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాడు
విటుడు
డబ్బిచ్చి అధికారాన్ని కొనుక్కుంటున్నాడు
నాయకుడు
డబ్బిచ్చి అమ్మాయి శీలాన్ని దోచుకుంటున్నాడు
విటుడు
డబ్బిచ్చి ఓటరు ఆత్మను కొల్లగొడుతున్నాడు
నాయకుడు

ఆ విటుడికంటే
ఈ నాయకుడే నికృష్టుడు
ఆ వెలయాలు కంటే
ఈ పౌరుడే కంకుష్టుడు

అక్కడ డబ్బిస్తే
కొత్త కొత్త అమ్మాయిలు దొరుకుతారు
ఇక్కడ డబ్బు తీసుకున్నా
పాత పార్టీలే మళ్ళీమళ్ళీ కనిపిస్తాయి
ఈ పార్టీల కంటే
ఆ అమ్మాయిలే నయం

ఒళ్లైనా ఓటైనా
డబ్బుకు దాసోహమేగా
రెడ్ లైటైనా వైట్ డ్రస్సైనా
రంగుల ప్రపంచమేగా...
read more " రెడ్ లైట్ పౌరుడు "

రాజకీయ రణరంగం

రాజకీయ రణరంగానికి
రంగం సిద్ధం అవుతోంది
అనవసరపు యుద్ధానికి
సర్వం సిద్ధం అవుతోంది

రణరంగం పణరంగం అవుతోంది
చదరంగం చెదరంగం అవుతోంది
సమాజపు ప్రతి అంగం చచ్చుబడుతోంది
మానవత్వం అడుగడుగునా
మానభంగానికి గురౌతోంది

వోటరుకు ఛాయిసూ లేదు
సామాన్యుడికి వాయిసూ లేదు
ఎవడు రాజైనా బోనసూ లేదు
జనాల జీవితంలోకి వీనసూ రాదు

కుల పార్టీలన్నీ
కులం పనికిరాదంటున్నాయి
మత పార్టీలన్నీ
మతం మంచిది కాదంటున్నాయి
అవినీతి పార్టీలన్నీ
అసలు ధర్మాలను చెబుతున్నాయి
వర్గపోరాట పార్టీలు
స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తున్నాయి

రావణ పార్టీలన్నీ
రామాయణం పఠిస్తున్నాయి
దుశ్శాసన పార్టీలన్నీ
దుర్మార్గాన్ని ఎండగడతామంటున్నాయి

అందరినీ ఉద్ధరిస్తామని
అందమైన అబద్దాలు చెబుతున్నాయి
అందలం ఎక్కాక
అచ్చమైన మొండిచెయ్యి చూపిస్తాయి

దయ్యాలేమో వేదాలు వల్లిస్తున్నాయి
సైతాన్లేమో నీతులు లెక్కిస్తున్నాయి
రాక్షసులేమో రాజులౌతున్నారు
దేవతలేమో దిక్కులేకుండా పోతున్నారు

అదేదో సినిమాలో చెప్పినట్లు
ఎవడైతే నాకేంటి?
ప్రతి అయిదేళ్ళకూ కనిపిస్తున్నట్లు
ఎవడొస్తే మనకేంటి?

అదే దోపిడీ ఇంకొక తీరులో ఉంటుంది
అదే అవినీతి ఇంకో ముసుగులో వస్తుంది
ప్రతిసారీ ఒక పార్టీ గద్దెనెక్కుతుంది
ప్రతిసారీ ఒక కులం బాగుపడుతుంది

కులాలు బాగుపడతాయి
దేశం మాత్రం బాగుపడదు
మతాలు వెల్లివిరుస్తాయి
ధర్మం మాత్రం కనిపించదు

అయిదేళ్ళ దోపిడీకి లైసెన్సే
ఎలక్షన్లు
గత పార్టీ దోపిడీకి సైలెన్సే
ఎలక్షన్లు

మనదేశం కర్మభూమి
ఇక్కడ ఎవడి ఖర్మ వాడిదే
మనదేశం ధర్మభూమి
ఇక్కడ ఎవడి దోపిడీ వాడిదే

ఇక్కడ వెలయాలు
కులయాలులా కులుకులు పోతుంది
ఇక్కడ తలవ్రాలు
తుంపులు తుంపులై తంపులు పెడుతుంది

ఇదొక విచిత్రదేశం
ఇక్కడ సమస్తం మోసం
ఆవేశపడితే ఈ లోకం
ఇక్కడే అవుతుంది పరలోకం

ఈ దేశంలో
బురదలో కమలంలా
బ్రతకడమే బెస్ట్
దురదున్నా చలించకుండా
నిలవడమే బెస్ట్

ఈ అధర్మాన్ని ఎవరూ ఆర్చలేరు
ఈ సమాజాన్ని ఎవరూ మార్చలేరు
ఈ సంఘాన్ని ఎవరూ తీర్చలేరు
ఈ మనుషులని ఎవరూ కూర్చలేరు

ఇదింతే ! ఇదింతే !!
ఇదింతే ! ఇదింతే !!
read more " రాజకీయ రణరంగం "

చిత్రం ! భళారే విచిత్రం !

ఎలక్షన్ల హడావుడి మొదలౌతున్నది.

అధికారంలో ఉన్నవారికి
దాన్ని మళ్ళీ దక్కించుకోవాలన్న దురాశ !
లేనివారికి
ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలన్న అత్యాస !
వీళ్ళిద్దరి మధ్యనా పడి సామాన్యుడి ఘోష !
ఇదీ మన దేశపు ఎలక్షన్ల వరస !

ఈ సందర్భంగా ఒక చిన్న పేరడీ ! వినోదపు కామెడీ !

అధికారంలో ఉన్న మంత్రులూ, సామాన్య ఓటరూ కలిసి పాడుకునే డ్యూయెట్ DVS కర్ణ సినిమాలో సినారె వ్రాసిన హిట్ సాంగ్ తరహాలో !

పల్లవి
మంత్రులు: చిత్రం భళారే విచిత్రం
ఓటరు: చిత్తం అయ్యారే విచిత్రం

అనుపల్లవి
మంత్రులు: ఈ లేకినగరుకు మా కారును రప్పించుటే విచిత్రం
ఓటరు: పిలువకనే మంత్రివర్యులే విచ్చేయుటే విచిత్రం
మంత్రులు: చిత్రం భళారే విచిత్రం
ఓటరు: చిత్తం అయ్యారే విచిత్రం

చరణం
మంత్రులు: అధికారపు జిత్తులతో  - అవినీతి కుయుక్తులతో ఓహో ఓహో హో
అధికారపు జిత్తులతో  - అవినీతి కుయుక్తులతో
సతమతమౌ మా మదిలో
ఓటరు గుర్తుకు వచ్చుట చిత్రం !
హాయ్ భళారే విచిత్రం

ఓటరు: ఎంతటి ముఖ్యమంత్రైనా ఆ ఆ ఆ ఆ
ఎంతటి ముఖ్యమంత్రైనా ఎపుడో అయిదేళ్ళల్లో
ఎంతో కొంత మా మొఖాల్ని స్మరించుటే
ఎలక్షన్ల చిత్రం
మంత్రులు: హాయ్ భళారే విచిత్రం

ఇద్దరూ కలసి:
దొంగల సామ్రాజ్యంలో ఓ ఓ ఓ
దొంగల సమాజంలో ఓహో ఓహో హో
దొంగల సామ్రాజ్యంలో దొంగల సమాజంలో
మనం మనం ఒకటౌతూ
బయటకు నీతులు చెప్పుట చిత్రం
హాయ్ భళారే విచిత్రం !

ఓటరు: అయ్యారే విచిత్రం
మంత్రులు: భళారే విచిత్రం
ఓటరు: అయ్యారే విచిత్రం
read more " చిత్రం ! భళారే విచిత్రం ! "

10, జనవరి 2019, గురువారం

దయ్యాలు - భూతాలు

మొన్న మధ్యాన్నం ఒక ఫోనొచ్చింది.

'హలో' అన్నా.

'నేను ఫలానాని మాట్లాడుతున్నా' అన్నాడు అవతల్నించి పెద్దగా అరుస్తూ.

'అబ్బా !  ఫోన్ మేనర్స్ కూడా లేవు వెధవలకి'  అని ఫోన్ని చెవికి దూరంగా పెట్టుకుంటూ, 'చెప్పండి' అన్నాను.

'సిద్ధాంతిగారేగా?' అన్నాడు మళ్ళీ అరుస్తూ.

'ఏం చెప్పాలా?'  అని ఒక్క క్షణం ఆలోచించా. 'సర్లే మనది కూడా ఒక టైపు సిద్ధాంతమేగా?' అనుకొని 'అవును' అన్నా.

'అదేనండి. నిన్న ఫోన్ చేశానుకదా అమెరికా నుంచి? దయ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా?' అంది స్వరం.

ఈ మాట్లాడేది మనిషా లేక దయ్యమా అని మాచెడ్డ అనుమానం వచ్చింది నాకు.

ఎందుకైనా మంచిదని 'హలో' అన్నా మళ్ళీ.

'అదేనండి.  నిన్న దయ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా ! మర్చిపోయారా?' అన్నాడు.

'అబ్బే ఎలా మర్చిపోతాను? అందులోనూ అమెరికా దయ్యాన్ని? పోనీ, ఇవాళ భూతాల గురించి మాట్లాడుకుందామా?' అడిగాను కూల్ గా.

అతనికి డౌటోచ్చింది.

'మీరు ఫలానా సిద్ధాంతి గారేనా?' అరిచాడు మళ్ళీ.

'కాదు! వాడి ప్రేతాత్మని !  హిహిహి' అన్నా  వికృతంగా నవ్వుతూ.

ఫోన్ టక్కున కట్ అయిపొయింది. కాసేపు చూశా మళ్ళీ ఫోనొస్తుందేమో అని. కానీ అమెరికా దయ్యానికి ధైర్యం చాలలేదులా ఉంది. ఫోన్ రాలేదు.

సిద్ధాంతికి  దయ్యాల ఊసులెంటో నాకైతే అర్ధం కాలేదు. చాలామంది కుహనా జ్యోతిష్కులు ఇలాగే అసలు సబ్జక్ట్ రాక, దయ్యాలని భూతాలని ఏవేవో మాయమాటలు చెప్పి, తాయత్తులు నిమ్మకాయలు కడుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

నిమ్మకాయలంటే  గుర్తొచ్చింది. ఈ మధ్యనే నా శిష్యురాలు ఒకామె నాకే నిమ్మకాయను మంత్రించి ఇవ్వబోయింది. ఇవ్వాలనుకుంది, ఇచ్చినంత పని చేసింది కూడా !

'నాకెందుకమ్మా ఈ నిమ్మకాయ?' అడిగాను.

'మీ ప్రియశిష్యురాలు మీకు మందు పెట్టింది. చేతబడి కూడా చేసే ఉంటుంది. అందుకే మీకు రక్షణగా ఈ నిమ్మకాయను మంత్రించి ఇస్తున్నాను. ఉంచుకోండి' చెప్పింది.

'ఏం చెయ్యమంటావు దీన్ని?' అడిగాను అనుమానంగా.

'దిండు క్రింద పెట్టుకుని పడుకోండి. తను చేసిన ప్రయోగం రివర్స్ అవుతుంది' అంది.

'నేను దిండు వాడను' అన్నా.

'పోనీ పరుపు కింద పెట్టుకోండి' అంది.

'నేను పరుపు కూడా వాడను. నేలమీద చాపేసుకుని పడుకుంటా' అన్నాను.

'చాపమీద మీ పక్కనే ఉంచుకోండి' అంది పట్టువదలని విక్రమూర్కురాలి లాగా.

'ఇది రెమెడీనా?' అడిగాను.

'అవును' అంది.

నా జన్మ ధన్యమైనంత ఫీల్ కలిగింది.

'నేను ఇంకొక రెమెడీ చెప్తాను చేస్తావా?'  అడిగాను.

'చెప్పండి' అంది.

'ఇదే నిమ్మకాయను కోసి, రసం పిండి, బాగా గ్లూకోజ్ కలిపి షర్బత్ చేసుకుని త్రాగు. నీకు వెంటనే మంచి జరుగుతుంది.' అన్నాను.

ఆమె కోపంగా చూచి వెళ్ళిపోయింది. కానీ మర్నాడే రెండు అగర్బత్తి కట్టలను తెచ్చి నాముందు పెట్టి 'ఇది మీకు గిఫ్ట్ ఇవ్వమని చెట్టుమీద ఉన్న భేతాళుడు నాకు చెప్పాడు' అంది.

'ఈ  ధూపాన్ని నువ్వూ నీ భేతాళుడూ కలిసి వేసుకోండి. ఇద్దరికీ ఒకేసారి వస్తుంది - మోక్షం ' అన్నాను.

ఆమె మళ్ళీ కోపంగా వెళ్ళిపోయింది.

ఈ విధంగా లోకుల అజ్ఞానం కొంత, అమాయకత్వం కొంత, పిచ్చి కొంత, ఇవి చాలవన్నట్టు దొంగ జ్యోతిష్కుల దోపిడీ కొంత, మంత్రగాళ్ళ మాయలు  కొంత - వెరసి దయ్యాలూ భూతాలూ మన మధ్యనే చక్కగా బ్రతికేస్తున్నాయి.

అయితే దయ్యాలు భూతాలూ లేవా? అంటే ఉన్నాయనే నేనంటాను. అవి ఉన్నాయని నాకు తెలుసు. అయితే, వాటి జోలికి మనం పోకూడదు. మనజోలికి అవి రావు. వాటి ఖర్మను అనుభవిస్తూ వాటి ప్రపంచంలో అవి ఉంటాయి. మనం అనవసరంగా వాటిని కదిలించకూడదు. వాటి ప్రపంచంలోకి మనం అడుగు పెట్టకూడదు.

సాధనామార్గంలో నడిచేవారికి  అప్పుడప్పుడూ అవి కనిపిస్తూ ఉంటాయి. హెల్ప్ కోరుతూ ఉంటాయి. రోడ్డుమీద మనం పోతూ ఉంటే ఎవరో బిచ్చగాడు ఎదురై సాయం చెయ్యమని కోరినట్లుగా ఇది ఉంటుంది. మనకు చేతనైతే సాయం చేస్తాం. లేదంటే ఊరుకుంటాం. అంతేగాని కొంతమంది క్షుద్ర మంత్రగాళ్ళు చేసినట్లు, వాటిని బంధించి ఏవేవో పనులు చేయించుకోవాలని చూడకూడదు. అది చాలా నీచమైన కర్మను సృష్టిస్తుంది. దాని ఫలితాలు కూడా మంచిగా  ఏమీ ఉండవు.

జననమరణ చక్రంలోకి సహజంగా వెళ్ళిపోకుండా ఇక్కడిక్కడే ఊగులాడుతుండే జీవులే ఈ దయ్యాలు భూతాలు. వాటి ఖర్మ చాలక అవి అలా ఊగులాడుతూ ఉంటాయి. మనకు ఇప్పటికే ఉన్న మన ఖర్మ చాలక, ఇంకా వాటి ఖర్మను కూడా ఎక్కడ నెత్తిన వేసుకుంటాం? తెలివైనవాడు ఎన్నటికీ అలాంటి పనిని చెయ్యకూడదు.కానీ తెలివితక్కువ జ్యోతిష్కులూ, మంత్రగాళ్ళూ అలా చెయ్యబోయి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో దెబ్బతింటూ ఉంటారు. వారిని నమ్మిన అమాయకులు మోసపోతూ ఉంటారు.

మనకున్న సమస్యలు చాలకనా వాటి సమస్యలు కూడా మనం తగిలించుకోడానికి?
read more " దయ్యాలు - భూతాలు "

జీవితం

ఊహలే నిజమనుకుంటూ
వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించలేకపోవడం
జీవితం

ఎక్కడెక్కడో ఆలోచిస్తూ
చేతిలోని జీవితాన్ని చేజార్చుకోవడం
జీవితం

పిచ్చిపిచ్చి గమ్యాలు పెట్టుకుని
వాటికోసం వెర్రిగా పరుగెత్తడం
జీవితం

నిజంగా తనవారెవరో తెలుసుకోలేక
ప్రతివారూ తనవారే అనుకోవడం
జీవితం

పక్కవాడికంటే వేగంగా పరుగెత్తకపోతే
తనదేదో పోతుందని భ్రమించడం
జీవితం

అన్నీ సంపాదించాక
అవన్నీ అక్కరకు రావని గ్రహించడం
జీవితం

చెయ్యాల్సిన పనిని వాయిదా వేసి
అవసరం లేని పనుల్ని అతిగా చెయ్యడం
జీవితం

అన్నీ తెలుసని అహంకరిస్తూ
అసలైనవాటిని దూరం చేసుకోవడం
జీవితం

ఈ క్షణమే శాశ్వతం అనుకుంటూ
శాశ్వతాన్ని కాలదన్నుకోవడం
జీవితం

బాధల్లో ఏడవడం
అవి తీరాక అందర్నీ అరవడం
జీవితం

ఉన్నప్పుడు విలువ తెలియక
లేనప్పుడు విలపించడం
జీవితం

పావురాళ్ళను దూరం చేసుకోవడం
నాగుపాముల్ని నమ్మడం
జీవితం

ఎందుకు బ్రతుకుతున్నామో
తెలియకుండా బ్రతకడం
జీవితం

జీవితాన్ని అనుక్షణం
చేజార్చుకుంటూ జీవించడం
జీవితం
read more " జీవితం "

9, జనవరి 2019, బుధవారం

రాకుమారి - ఛీకుమారి

ఛీకుమారికి చిర్రెక్కింది
రాకుమారికి వెర్రెక్కించబోయింది
గురువుగారికి గుర్రుగా ఉంది
వీరిద్దరినీ చూస్తే నవ్వుగా ఉంది

రాకుమారి తప్పుదారిన పోతోందని
ఛీకుమారి అనుమానం
ఛీకుమారికి మతిభ్రమించిందని
రాకుమారి దృఢవిశ్వాసం

రాకుమారి అమాయకురాలని

ఈజీగా బుట్టలో పడుతుందని
ఛీకుమారి అనుకుంటుంది

ఛీకుమారికి తెగపొగరని

అన్నీ తనకే తెలుసన్న భ్రమలో ఉంటుందని
రాకుమారి నవ్వుకుంటుంది

ఛీకుమారి ప్రతిదాన్నీ జడ్జ్ చెయ్యబోతుంది
అందరికీ నీతులు చెప్పబోతుంది
అహంకారంతో విర్రవీగుతూ ఉంటుంది
గురివింద గింజ సంగతి మర్చిపోతుంది

గురువుగారు మోసగాడని
ఛీకుమారి విశ్వాసం
టీవీలూ యూట్యూబులూ
ఈ విశ్వాసానికి ఆధారం

మంచిని మోసమనుకునే ఛీకుమారి

మోసాన్ని మంచని భ్రమిస్తుంది
రాకుమారికి జాగ్రత్తలు చెప్పే ఛీకుమారి
తనే ఈజీగా బుట్టలో పడుతుంది

ఇతరులకు నీతులు చెప్పే ఛీకుమారి
తన గత ఎపిసోడ్లను తనే మర్చిపోతోంది
జీవితాలు చక్కదిద్దే ఛీకుమారి
తన భవిష్యత్తును తనే చూడలేకపోతోంది

అవునూ ఆ ఎపిసోడ్లన్నీ గురువుగారికెలా తెలిశాయో?

ఆయన పిలిస్తే కర్ణపిశాచి పలుకుతుంది కదూ?
ఛీ ! నా మతిమరుపు తగలెయ్య !
అసలు విషయమే నా మొద్దుబుర్రకు తట్టలా !

డామిట్ !

కర్ణపిశాచి నిజమేనన్నమాట !
అమ్మ బాబోయ్ !
ఈ గురువుకు దూరంగా ఉండటమే మంచిది !
read more " రాకుమారి - ఛీకుమారి "

8, జనవరి 2019, మంగళవారం

2018 లో పంచవటిలో ఏం జరిగింది?

2018 లో పంచవటిలో ఈ క్రింది సంఘటనలు జరిగాయి

1. 'శ్రీవిద్యా రహస్యం' రెండవ ఎడిషన్ ఈ బుక్ విడుదలైంది. మొదటి ఎడిషన్  లో కంటే దీనిలో అదనంగా 'నాలుగు ఆచారములు' అన్న ఒక అధ్యాయం చేర్చబడింది. కొన్ని పద్యములు అధికంగా చేర్చబడ్డాయి. మొదటి ముద్రణలో దొర్లిన కొన్ని తప్పులు సవరించబడ్డాయి.

2. 'Hidden meanings of Lalita Sahasra Nama' ఈ బుక్  విడుదలైంది.  ఇది 'లలితా సహస్ర నామ రహస్యార్ధ ప్రదీపిక' కు ఇంగ్లీష్ అనువాదం.

3. 'Secret of Sri Vidya' 2nd Edition E Book విడుదలైంది. ఇది    'శ్రీవిద్యా రహస్యం' గ్రంధానికి ఇంగ్లీష్ అనువాదం.

4. నా సాధనానుభవాలను జోడించి వ్రాసిన 'విజ్ఞాన భైరవ  తంత్రము' తెలుగు ఈ బుక్, ప్రింట్ పుస్తకం విడుదలయ్యాయి.

5. 'Vijnana Bhairava Tantra' English E book and Print book విడుదలయ్యాయి.

6. 'దత్తాత్రేయ యోగశాస్త్రం', 'జాబాల దర్శనోపనిషత్' తెలుగు ఈ  బుక్స్, ప్రింట్ బుక్స్ విడుదలయ్యాయి.

7. The science of Yoga according to Lord Dattatreya, Jabala Darshana Upanishad ఇంగ్లీష్ ఈ బుక్స్, ప్రింట్ బుక్స్ విడుదలయ్యాయి.

8. గురుపూర్ణిమ సాధనా సమ్మేళనం గుంటూరులో జరిగింది.

9. జిల్లెళ్ళమూడిలో మాకొక సాధనాకుటీరం ఏర్పడింది. ఆ సందర్భంగా అక్కడ సాధనా సమ్మేళనం జరిగింది.

9. 'మహాసౌరమ్' తెలుగు ఈ బుక్ విడుదలైంది.

10. వరంగల్ సాధనా సమ్మేళనం జరిగింది.

11. పంచవటి సభ్యులతో, జయరాంబాటి, కామార్పుకూర్, దక్షిణేశ్వర్, బేలూర్ మఠ్ ల సందర్శనం జరిగింది. అక్కడ, దివ్యజనని శారదామాత పాదపద్మాల వద్ద 'మహా సౌరమ్' తెలుగు ప్రింట్ బుక్ విడుదల అయింది. 

యధావిధిగా కొంతమంది పంచవటి సభ్యులు ఈ ప్రయాణంలో నాతో నడవలేక బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది క్రొత్త సభ్యులు వచ్చి చేరారు. వెళ్ళినవారి దురదృష్టానికి జాలిపడుతున్నాను. వచ్చినవారిని ఈ లైఫ్ టైం అవకాశాన్ని నిలబెట్టుకొమ్మని కోరుతున్నాను.

ఇంతకు ముందు నామీద రకరకాల అనుమానాలతో దూరదూరంగా ఉన్న చాలామంది ఈ ఏడాది దగ్గరయ్యారు. తమను తాము ఇంకా బాగా తెలుసుకోడానికీ, నిజమైన ఆధ్యాత్మికమార్గంలో ఎదగడానికీ ఇది వారికెంతో దోహదం చేసింది. అంతేగాక పంచవటిలో ఒక ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడింది. ఒక సభ్యుడు చెప్పినట్లు 'కర్మబంధాలు ఎంత తగ్గుతాయో ఆత్మబంధం అంతగా బలపడుతోంది'.

ఇది వారి జీవితాలకు కొత్త డైరెక్షన్ ఇచ్చింది. వారికిప్పటిదాకా తెలీని కొత్త డైమెన్షన్స్ చూపిస్తోంది. ఈ విధంగా 2018, పంచవటి సభ్యులందరికీ ఆధ్యాత్మికంగా ఎంతో  సంతృప్తిని మిగిల్చింది.

మా ప్రయాణం ముందుకే సాగుతోంది !
read more " 2018 లో పంచవటిలో ఏం జరిగింది? "

7, జనవరి 2019, సోమవారం

ఎవరు నేను?

కొందరు నన్ను మంచి మిత్రుడినన్నారు
నిజమే
చక్కగా నాతో స్నేహం చేసేవారికి
మంచి మిత్రుడినే నేను

కొందరు నన్ను మోసగాడన్నారు
నిజమే
ఏవేవో కోరికలతో నాదగ్గరకు వస్తే
పెద్ద మోసగాడినే నేను

కొందరు నన్ను పిచ్చివాడన్నారు
నిజమే
ఈలోకమంతా ఉన్న  పిచ్చివాళ్ళకు అర్ధంకాని
కొత్తరకం పిచ్చివాడినే నేను

కొందరు నన్ను అమాయకుడన్నారు
నిజమే
ఈ ప్రపంచపు మాయలు తెలియని
అసలైన అమాయకుడినే నేను

కొందరు నన్ను స్వాప్నికుడనన్నారు
నిజమే
ఎప్పుడూ ఏవేవో కలల్లో ఉండే
స్వాప్నికుడినే నేను

కొందరు నన్ను పొగరుబోతునన్నారు
నిజమే
పొగరుగా నాకెదురు వచ్చేవారికి
అంతకంటే పెద్ద పొగరుబోతునే నేను

కొందరు నన్ను సరదా మనిషినన్నారు
నిజమే
మామూలు సరదాలకు దూరమైన
సరదా మనిషినే నేను

కొందరు నన్ను అనాచారినన్నారు
నిజమే
కొంతమందికే తెలిసిన ఆచారాన్ని పాటించే
అసలు సిసలు అనాచారినే నేను

కొందరు నన్ను నాస్తికుడనన్నారు
నిజమే
ఆస్తిపాస్తులమీద పెద్దగా నమ్మకం లేని
నికార్సైన నాస్తికుడనే నేను

కొందరు నన్ను సంసారాలు కూల్చేవాడినన్నారు
నిజమే
సంసారాన్నే కూల్చేద్దామని
ఎప్పుడూ ప్రయత్నించేవాడినే నేను

కొందరు నన్నొక దొంగనన్నారు
నిజమే
మీ ఆస్తులన్నీ దోచుకుని మిమ్మల్ని నాస్తిగా చేసే
గజదొంగనే నేను

కొందరు నన్నొక ప్రేమికుడనన్నారు
నిజమే
మనుషుల్లో నిద్రాణంగా ఉన్న ప్రేమను తట్టిలేపే
ప్రేమికుడినే నేను

కొందరు నన్నొక కాముకుడినన్నారు
నిజమే
దేన్ని కామించాలో ఎలా కామించాలో తెలిసిన
కాముకుడినే నేను

కొందరు నన్నొక రచయితనన్నారు
నిజమే
ఏం వ్రాస్తానో ఎలా వ్రాస్తానో నాకే తెలియని
రచయితనే నేను

కొందరు నన్నొక ఉపన్యాసకుడినన్నారు
నిజమే
నేను మాట్లాడేది నేను కూడా వినే
ఉపన్యాసకుడినే నేను

కొందరు నన్నొక గాయకుడి నన్నారు
నిజమే
పాతగాయాల్ని పాటలతో మర్చిపోదామని ప్రయత్నించే
గాయకుడినే నేను

కొందరు నన్నొక జులాయినన్నారు
నిజమే
ఏ కట్టుబాట్లకూ లొంగకుండా సంచరించే
జులాయినే నేను

కొందరు నన్నొక సాధకుడినన్నారు
నిజమే
సాధారణంగా ఉండటానికి ఇష్టపడే
సాధకుడినే నేను

కొందరు నన్నొక గురువునన్నారు
నిజమే
గురువుల గ్రుడ్డితనాన్ని చూచి నవ్వుకునే
గురువునే నేను

కొందరేమో నువ్వు అర్ధం కావన్నారు
నిజమే
నాకే నేనర్ధం కాను
ఇక మీకెలా అవుతానన్నాను

ఇంతకీ ఎవరు నేను?

అందరికీ తలూపుతూ
అన్నిటికీ ఔనంటూ
అన్నీచూచి నవ్వుకుంటూ
అవన్నీ నేనౌతూ
ఆ అన్నిటికీ అతీతంగా
నన్నే నేను నిరంతరం దాటిపోతూ
నాలోనే నేనుండే
అసలైన నేనును నేను
read more " ఎవరు నేను? "

6, జనవరి 2019, ఆదివారం

టాయిలెట్ ధ్యానం

ఒకడు
టాయిలెట్లో భార్య ఎక్కువసేపుందని
తలుపులు బాదుతున్నాడు
తన పూజకు లేటౌతోందని
తను స్నానం చెయ్యాలని
త్వరగా మడి కట్టుకోవాలని
మెట్టేషన్ చేసుకోవాలని
బాత్రూం బయట కోతిలా ఎగురుతున్నాడు

చివరకు భార్య బయటకొచ్చింది
ఇతని స్నానం అయింది, పూజ అయింది
పూజ సమయంలో టీవీ సౌండ్ తగ్గించలేదని
భార్యను తిడుతున్నాడు
టిఫిన్ సరిగా చెయ్యలేదని
నీవల్లే ఆఫీసుకు లేటైందని
చిర్రుబుర్రులాడుతున్నాడు

భర్త భరతనాట్యం చేస్తున్నాడు
భార్య మౌనయోగినిలా ఉంది
భర్త అసహనంగా ఉన్నాడు
భార్య అమాయకంగా ఉంది

ఆ భార్య
టాయిలెట్లో ఉన్నంతసేపూ
ట్యాప్ లోంచి మగ్గులో పడుతున్న
నీటి చుక్కల శబ్దం వింటూ
దానిలో లీనమై
ప్రపంచాన్ని మరచింది
తనెక్కడుందో మరచింది
ఆమె మనసు ఆగిపోయింది
శూన్యమై పోయింది
అందుకే అక్కడ అంతసేపుంది

మడికట్టుకుని గంటసేపు
పూజా ధ్యానం చేసిన భర్త మనసు
చేపల మార్కెట్లా ఉంది
పావుగంటసేపు టాయిలెట్లో ఉన్న భార్య మనసు
మానససరోవరంలా ఉంది
ఎవరిది ధ్యానం?
ఎవరిది మౌనం?

పూజగది టాయిలెట్ అయింది
టాయిలెట్ పూజగది అయింది
భలే ఉంది కదూ
టాయిలెట్ ధ్యానం !
read more " టాయిలెట్ ధ్యానం "

మందబుద్ధి రాకుమారి - మందుబుడ్డి గురువుగారు

మన లోతైన ఆధ్యాత్మిక పోస్టులు చదివి మనమంటే ఏదో ఎక్కువగా కొంతమంది ఊహించుకునే ప్రమాదం ఉంది గనుక, ఆ ఇమేజిని వెంటనే డ్యామేజి చెయ్యాలంటే ఇలాంటి పోస్టు ఒకటి వ్రాయక తప్పదు. చదవండి మరి !
-------------------------------------------

అనగనగా ఒక రాకుమారి
ఆమెకు కాస్త మందబుద్ధి
అనగనగా ఒక గురువుగారు
ఆయన చేతిలో మందుబుడ్డి

రాకుమారికి మందబుద్దేంటో
గురువుగారికి మందుబుడ్డేంటో
వాళ్ళనలా సృష్టించిన
ఆ పిచ్చి దేవుడికే తెలియాలి

రాకుమారికి మందబుద్ధి
చిన్నప్పటినుంచీ ఉంది
గురువుగారికి మందుబుడ్డి
ఈ మధ్యనే అలవాటైంది

రాకుమారికి మందం ఎక్కువైతే
మత్తుగా పడుకుంటుంది
గురువుగారికి మందెక్కువైతే
చెత్తగా పోస్టులు రాస్తుంటాడు

పాటలు వింటూ పరవశించడం
రాకుమారికిష్టం
పాటలు పాడుతూ జనాన్ని హింసించడం
గురువుగారికిష్టం

రాకుమారిగా పుట్టాలంటే
అదృష్టం ఉండాలి
గురువుగారిగా అవ్వాలంటే
అర్హతలుండాలి

ఆమెకేమో అదృష్టం దండిగా ఉంది
ఈయనకేమో అర్హతలంటూ అస్సల్లేవు
కానీ రాకుమారి గురువుగారి శిష్యురాలైంది
గురువుగారికేమో మందు మరీ ఎక్కువైంది

ప్రతి అమావాస్యకీ
రాకుమారి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది
ప్రతి పౌర్ణమికీ
గురువుగారు పిచ్చి పిచ్చిగా ఆలపిస్తాడు

రాకుమారికి మందబుద్దీ తగ్గదు
గురువుగారికి మందుబుడ్డీ వదలదు
పిచ్చిగురువుని నమ్మడం రాకుమారి మానదు
పిచ్చిపాటలు పాడటం గురువుగారు ఆపడు

ఇదంతా చూచి చిన్నరాకుమారికి
వెర్రిగా చిర్రెత్తుకొచ్చింది
ఆమెకు చిన్నప్పటినుంచీ ఉన్న
వేపకాయంత వెర్రి
గుమ్మడికాయంత అయికూచుంది
చిన్నరాకుమారి కాస్తా ఛీకుమారిగా మారింది

తనను తానే తిట్టుకునే పిచ్చిగురువు
ఇతరులు తిడితే నవ్వుకోడా?
తనను తానే తక్కువ చేసుకునే గురువు
ఇతరులు విమర్శిస్తే తగ్గుతాడా?

గాలిలోకి రాళ్ళేస్తే గాలికేం నష్టం?
ఆకాశాన్ని కాలితో తంతే దానికేం కష్టం?
కానీ అలాంటివారిని కూడా
ఆదరించడమే వాటికిష్టం !

నిజానికి రాకుమారీ లేదు
గురువుగారూ లేడు
ఇద్దరికీ లోపలుంది ఆకాశమే
ఇద్దరివీ బయటచూస్తే గాలిచేష్టలే

ప్రకృతి నిజంగా పిచ్చిదే
కాకుంటే ఈ పిచ్చి జనాన్ని
ఇంత పిచ్చిగా ప్రేమించి
ఇంతలా ఆదరిస్తుందా?

బహుశా దానిక్కూడా
మందు అలవాటుందేమో?
లేదా అదికూడా
పెద్ద మందబుద్దేమో? 

సర్లే ఏదో ఒకటి !
అసలేంటీ పిచ్చిగోల?
అర్ధంకాని చచ్చు పోస్టు?
ఓహో అమావాస్య ఎఫెక్ట్ కదా?

ఇమేజి పెంచుకునేదీ తనే
డ్యామేజి చేసుకునేదీ తనే
హోమేజి ఇచ్చుకునేదీ తనే
ఏంటో ఈ పిచ్చిగురువు?

డామిట్ !
గురువుగారికి పూర్తిగా పిచ్చెక్కింది !
లేదా మందెక్కువైందా?
పాపం రాకుమారీ, ఛీకుమారీ
ఎలా ఉన్నారో మరి?
read more " మందబుద్ధి రాకుమారి - మందుబుడ్డి గురువుగారు "