“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, జనవరి 2019, మంగళవారం

జ్ఞాపకం

ఒకనాడొక చర్చలో 'జీవితం అంటే ఏమిటి?' అన్న విషయం మొదలైంది.

అక్కడున్న వాళ్ళందరూ రకరకాలుగా వారికి తోచిన విధంగా చెప్పారు.

నేనన్నాను - 'జీవితం ఒక జ్ఞాపకం. అంతే' అని.

అదేంటన్నారు.

ఇలా చెప్పాను.

'జీవితంలో చివరికి మిగిలేవి జ్ఞాపకాలే. ఇక్కడ ఏదీ నీతో రాదు. నీతో వచ్చేది నీ జ్ఞాపకాలే. జీవిత చరమాంకంలో వెనక్కు తిరిగి చూచుకున్నప్పుడే ఈ విషయం అర్ధమౌతుంది. అంతకు ముందు అర్ధం కాదు. ఇంకా చెప్పాలంటే, జీవితం మొదట్లోనే జీవిత చరమాంకాన్ని రుచి చూచినవాడికే ఇది బాగా అర్ధమౌతుంది.

జీవితంలో నువ్వు పొందిన సంతోషాలూ, బాధలూ, ఆశలూ, నిరాశలూ, పొంగిపోవడాలూ క్రుంగిపోవడాలూ - అవన్నీ ఇప్పుడేవి? ఎక్కడున్నాయి?

నీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయి. అంతే !

జీవితమంటే వర్తమానమే అని, వర్తమానంలో జీవించమని కొందరు తాత్వికులంటారు. నేను వాళ్ళను చూచి నవ్వుతాను. జీవితం వర్తమానం కాదు. అదొక జ్ఞాపకం. వర్తమానం కూడా జ్ఞాపకం అయినప్పుడే నీకు గుర్తుంటుంది. లేకుంటే దాన్ని నువ్వు గుర్తించలేవు.

నీ జీవితంలో నువ్వు ప్రేమించినవాళ్ళూ, నిన్ను ప్రేమించినవాళ్ళూ, నువ్వు ద్వేషించినవాళ్ళూ, నిన్ను ద్వేషించినవాళ్ళూ, నువ్వు కావాలనుకున్న వాళ్ళూ, నిన్ను కావాలనుకున్నవాళ్ళూ - వాళ్ళంతా ఏరి? ఇప్పుడెక్కడున్నారు?

నీ జ్ఞాపకాలలో ఉన్నారు. నీ జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నారు.

నీ జీవితం మొత్తం ఇంతే. అది ఒక జ్ఞాపకం ! ఒక జ్ఞాపకంగానే అది చివరకు మిగులుతుంది.

గత జన్మలైనా అంతే. అవి జ్ఞాపకాలుగా నీ సుప్తచేతన అడుగున ఉన్నాయి. ఆ లోతులకు వెళ్లి చూడగలిగితే నీకు కనిపిస్తాయి. అప్పుడు నీ గత జన్మలలో నువ్వేంటో అర్ధమౌతుంది. ఈ జన్మలో నువ్వేంటో, అసలు నువ్వెంతో అర్ధమౌతుంది.  నువ్వెవరో అర్ధమౌతుంది.

'ఏమంటారు?' అన్నాను.

వాళ్ళందరూ ఏమీ అనలేదు. మౌనంగా ఉన్నారు.

ఏదైనా అనడానికి వాళ్ళంటూ అసలుంటే కదా? వాళ్ళంతా నేనే. వాళ్ళు నావాళ్ళే. నాలోని వాళ్ళే. నా జ్ఞాపకాలే.

జీవితమంటే ఒక జ్ఞాపకమే.

కాదా?