The secret of spiritual life lies in living it every minute of your life

14, ఆగస్టు 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 4 (జీవిత రహస్యాలు - భవిష్యజ్ఞానం)

నేను సర్వీస్ లో ఉండగా నాకు చాలా పరిమితులుండేవి. బాధ్యతలు కలిగిన ఒక ఉన్నతాధికారిగా వాటి పరిధిలోనే నేను సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకుండేది. కానీ నేనిప్పుడు ఫ్రీబర్ద్ ని. ఆఫ్ కోర్స్, ఇప్పుడు కూడా సోషల్ మీడియా పరిమితులున్నాయి. కానీ అవి అఫీషియల్ పరిమితులకంటే కొంచం విశాలమైనవి. కనుక, ఫ్రీగా అన్ని విషయాలను నా అభిమానులతో శిష్యులతో పంచుకునే అవకాశం నాకు ఇప్పుడొచ్చింది. అందుకే, మునుపటికంటే లోతైన విషయాలను మీతో చెబుతున్నాను.

ఇప్పటిదాకా అయితే, ఇలాంటి విషయాలను నా గ్రూప్ లో మాత్రమే, నా శిష్యులతో మాత్రమే  మాట్లాడేవాడిని. కానీ అమెరికా సీరీస్ వ్రాస్తున్నందువలన ఇలాంటి లోతైన విషయాలను కూడా బ్లాగులో వ్రాస్తున్నాను. అది చదువరుల అదృష్టం. ఇది నామాట కాదు, నా బ్లాగు చదివి ఎన్నో క్రొత్త విషయాలను గ్రహిస్తున్నామని, జీవితాలకు జీవితాలే మంచిదారిలో పడుతున్నాయని నాకు వచ్చే ఎన్నో మెయిల్సే ఈ మాటలు అంటున్నాయి.

భవిష్యత్తును తెలుసుకోవడం అనేది మనిషికి అనాదినుంచీ ఉన్న ఒక ఉత్సుకత. అది సాధ్యమేనని నేనూ అంటాను. అదేమీ గొప్ప విషయం కాదని కూడా నేనంటాను. భవిష్యత్తును ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దానిని మార్చవచ్చు కూడా. ఇది తన విషయంలోనూ, ఇతరుల విషయంలోనూ కూడా చెయ్యవచ్చు. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, యోగదృష్టి, సాధనాబలం. రెండు, జ్యోతిష్యజ్ఞానం. మొదటిది ఉన్నవారికి రెండవది అవసరం లేకపోయినప్పటికీ, ధ్యానశక్తి ఉన్న యోగులు కూడా డబల్ చెక్ కింద జ్యోతిష్యజ్ఞానాన్ని వాడుకోవచ్చు. సాంప్రదాయ యోగులు ఇలా చేస్తూ ఉంటారు. 

ఇదంతా పుస్తకాలనుంచి కాదుగాని, నా అనుభవం నుంచి చెబుతున్నానని గ్రహించండి.

నా బ్లాగులో నా పర్సనల్ విషయాలను కూడా అతి సాధారణంగా వ్రాస్తూ ఉంటానని మీకు తెలుసు.  దానిక్కారణం నా జీవితం ఒక ఓపెన్ బుక్ కావడమే. ఇదే విధంగా నాతో సంబంధం ఉన్న ఇతరుల గురించి కూడా వ్రాస్తూ ఉంటాను. దానికి వాళ్ళు అఫెండ్ అవుతూ ఉంటారు.  అది వాళ్ళ ఖర్మ. కొంతైనా విశాలదృక్పధం లేనిదే నాతో ఎవరూ కలసి నడవలేరు. అది అసంభవం. ప్రతిదాన్నీ అంత  దాచిపెట్టుకుని దొంగలలాగా బ్రతకవలసిన ఖర్మ ఎందుకు మీకు? అని నేనడుగుతూ ఉంటాను.

ప్రస్తుతం విషయంలోకొస్తాను.

ఏడాదిలో సీజన్స్ ఉన్నట్లుగా, మన జీవితాలలో కూడా కొన్ని పాటర్న్స్ ఉంటాయి. లోతుగా పరిశీలించే శక్తి ఉంటే అవి అర్ధమౌతాయి.  యోగదృష్టి ఉన్నపుడు వాటి మూలాలు తెలుస్తాయి. ఆ మూలాలు గతజన్మలలోకి కూడా మనల్ని తీసుకెళతాయి. డబల్ చెక్ గా జ్యోతిష్యజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ధారణగా వాటిని గ్రహించవచ్చు. ఇది నా సాధనామార్గంలో నడిచే నా శిష్యులకు నేను నేర్పించే ఒక సాధన. దీనివల్ల మీ జీవితపు లోతుపాతులు, జరుగుతున్న సంఘటనల మూలాలు, వాటి కారణాలు, అన్నీ మీకర్ధమౌతాయి.

2016 లో నేను మొదటిసారి అమెరికా వచ్చాను. అప్పుడు మా సతీమణి పెదనాన్న ఇండియాలో చనిపోయాడు.  అంటే నాకు మామయ్య వరస అవుతాడు. 2017 లో మళ్ళీ అమెరికా వచ్చాను. అప్పుడు మా మేనమామ ఇండియాలో చనిపోయాడు. ఇప్పుడు అయిదేళ్ల తర్వాత మళ్ళీ అమెరికా వచ్చాము. రాబోయే ముందు మా సతీమణితో ఇలా అన్నాను.

'మనం అమెరికాలో అడుగు పెట్టగానే మా మేనమామ భార్య చనిపోతుంది. ఈ వార్తను మనం అమెరికా గడ్డమీద వింటాము. కానీ ఆమెను చూడటానికి మనం పోలేము'.

గతంలో నేను చెప్పిన ఎన్నో సంఘటనలు జరగడం ప్రత్యక్షంగా చూచిన ఆమె మౌనంగా విని ఊరుకుంది. 

సాయంత్రం 5 గంటలకు మేము డెట్రాయిట్ లో అడుగుపెట్టాము. 6 గంటలకు మెసేజి వచ్చింది. ఆమె చనిపోయిందని. నేనేమీ ఆశ్చర్యపోలేదు. సతీమణి కూడా ఆశ్చర్యపోలేదు. 'ఈ విధంగా అమెరికా వచ్చాము, కార్యక్రమానికి రాలేమ'ని వారికి మెసేజి పెట్టాము. భవిష్యత్ జ్ఞానం వల్ల ఇలాంటి బేలెన్స్ వస్తుంది.

ఇదెలా సాధ్యమౌతుంది.?

అమెరికాలో అడుగుపెడుతున్నపుడే నాకు తెలిసిపోయింది. ఇండియాలో ఆమె మరణవేదన పడుతున్నదని. ఎలా తెలుస్తుంది? అని అడగకండి. అది నేను వివరించినా మీకర్ధం కాదు. ఎక్కడో ఇండియాలో ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజి ఇస్తే అమెరికాలో ఎలా తెలుస్తున్నది? ఇదీ అంతే. దానికి చాలా రహస్యాలుంటాయి. వాటిని ఇంతవరకే చెప్పగలను గాని ఇంతకు మించి చెప్పలేను. నాకు యోగదృష్టితో తెలిసినది నిజమే అని నిర్ధారిస్తూ, కొద్దిసేపటిలోనే మెసేజి వచ్చింది ఆమె పోయిందని.

ఎవరి జాతకంలో అయితే, నవమభావానికి అష్టమభావానికి షష్ఠభావానికి సంబంధాలుంటాయో, వారు దూరదేశాలకు వెళితే, వారి మేనమామ గాని, మేనమామ సంబంధిత బంధువులు గాని  చనిపోతారు. ఇది ఒక జ్యోతిష్యసూత్రం. ఈ యోగం నా జాతకంలో స్పష్టంగా ఉంది. ఈ విషయం నాకు తెలుసు గనుక యోగదృష్టి ద్వారా నాకు తెలిసిన విషయాలను జ్యోతిష్యజ్ఞానంతో డబల్ చెకప్ చేసుకుని నిర్ధారణ చేసుకున్నాను. ఈ జ్ఞానంతోనే మా సతీమణికి  మూడునెలల ముందు చెప్పాను,'మా అత్తయ్యకు రోజులు దగ్గర పడుతున్నాయి.  మనం అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే ఆమె చనిపోతుంది' అని. ఖచ్చితంగా అదే ఇప్పుడు జరిగింది. 

 ఇలాంటి యోగదృష్టి ఎలా వస్తుంది? అని మీకు సందేహం రావచ్చు.

ఎన్నో ఏండ్ల సాధనతో ఇది వస్తుంది. యోగసూత్రాలలోని 'సిద్ధిపాదం' అనే అధ్యాయంలో పతంజలిమహర్షి ఇటువంటి సిద్ధులను ఉదాహరించారు. ఈ సిద్ధిని ఆయన 'కాలగతి జ్ఞానం' అన్నారు. ఇది నిజమే అని నా జీవితంలో ఎన్నో అనుభవాలద్వారా నేను స్పష్టంగా గ్రహించాను.

'అయితే, భవిష్యత్తును తెలుసుకుని ఏం చెయ్యాలి, మార్చలేము కదా?' అని మీకు సందేహం రావచ్చు.  అది కరెక్ట్ కాదు. భవిష్యత్తును మార్చడం కూడా సాధ్యమే. అయితే, అది అందరూ చేసుకోలేరు.  అంతటి అర్హతలు అందరికీ ఉండవు. మేము కూడా అందరికీ దీనిని చెయ్యము. అతి కొద్దిమందికి మాత్రమే ఇటువంటి సహాయాన్ని చేస్తాము. అలా సహాయాన్ని పొందటానికి వారికి ఎన్నో ఉత్తమ అర్హతలుండాలి.  అటువంటి మనుషులకే ఆ సహాయం చేస్తాము గాని ఊరకే పరిచయం ఉన్న అందరికీ చెయ్యము.

నా వ్రాతలలో స్పష్టమైన తేడాను గమనించారా? ఇన్నాళ్లు ఇన్ డైరెక్ట్ గా వ్రాసేవాడిని, ఇప్పుడు బయటపడి, డైరెక్ట్ గా నేనేంటో చెబుతున్నాను.

ఇదే  మరి 'న్యూ లైఫ్' ప్రభావమంటే! మీ అదృష్టం వల్లే మీరు నా వ్రాతలను చదువగలుగుతున్నారు. ఇంత అధికారికంగా ప్రాక్టికల్ గా విషయాలను నిరూపిస్తూ చెప్పేవారు మీకెక్కడ దొరుకుతారు?

ఇది మీ అదృష్టమా కాదా మరి?

read more " మూడవ అమెరికా యాత్ర - 4 (జీవిత రహస్యాలు - భవిష్యజ్ఞానం) "

13, ఆగస్టు 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర -3 (మరో చీకటి శుక్రవారం)

శుక్రవారం నాడు శుక్రాచార్యుని శిష్యులకు పిచ్చి లేస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ సత్యం గతంలో ఎన్నోసార్లు రుజువౌతూ వస్తున్నది. దానికి కారణం, హింసను హత్యలను ప్రబోధించే వారి శాంతి గ్రంధం. అందులో మతపరమైన హత్యలను సమర్ధించడమే గాక, అలాంటి హత్యలు చేసినవాడికి  స్వర్గంలో సీటు కూడా ఫ్రీగా దక్కుతుందన్న ఆశ చూపించబడింది. ప్రతిశుక్రవారమూ శాంతియుత ప్రార్ధనలలో రెచ్చగొట్టబడే రాక్షసులు ఏం  చేస్తున్నారో గతచరిత్రనుండి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. నిన్న కూడా అలాంటి శుక్రవారమే. అయితే ఈసారి జరిగిన ఘోరం ఏదో రాక్షస ఇస్లామిక్ దేశంలో జరగలేదు, చింతనా స్వేచ్ఛకూ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకూ ఆటపట్టైన అమెరికాలో జరిగింది.

న్యూయార్క్ దగ్గరలోని ఒక ఊరిలో సల్మాన్ రష్దీ దాడికి గురయ్యాడు. చటకా అనే ఒక సాహిత్యసంస్థలో ఉపన్యాసం ఇవ్వడానికి రష్దీ వచ్చాడు. ఆయన్ను సభికులకు పరిచయం చేస్తున్న సందర్భంలో హది మాటర్ అనే ఒక 24 ఏళ్ల అమెరికన్ యువకుడు స్టేజీమీదకు దూసుకొచ్చి రష్దీ ని పొడిచేశాడు. అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీదున్నాడు. ప్రాణభయం లేదు గాని, ఒక కన్ను పోతుందని, చెయ్యి పనిచేయకపోవచ్చని అంటున్నారు. హది మాటర్ అనే ఈ హంతక రాక్షసుడి సోషల్ మీడియా పేజీలనుంచి, అతను షియా ఉగ్రవాదాన్ని అనుసరిస్తాడని పోలీసులు గ్రహించారు. కధంతా స్పష్టంగా ఉంది.

మరోప్రక్కన ఇరాన్ లో అతన్ని మెచ్చుకుంటూ పొగడ్తలు వెల్లువెత్తాయి. ఎందుకని? 1988 లో సల్మాన్ రష్దీ satanic verses అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఖురాన్నే ఆ విధంగా అన్నాడని ఆరోపించి, అతనికి మరణశిక్ష విధించాడు ఇరాన్ ప్రెసిడెంట్ ఆయతోల్లా ఖొమైనీ. 33 ఏళ్ల తర్వాత  కూడా ఈ ఫత్వా ఇంకా సజీవంగానే ఉంది. అప్పటికి హదీ మాటర్ పుట్టనేలేదు. ఆ ఫత్వా తర్వాత, 10 ఏళ్లకు అతను కాలిఫోర్నియాలో పుట్టాడు. ఈరోజున ఈ ఘోరాన్ని చేశాడు.

ఇస్లాం అనేది రక్తంతో వ్రాయబడిన మతమని నేనెన్నో సార్లు వ్రాశాను. అందులో శాంతి అనేది, నేతిబీరకాయలో నెయ్యి లాంటిదే. అందరూ హతమయ్యాక స్మశానంలో ఉండే శాంతిలాంటిదే దాని శాంతి.  అంతేగాని, మేధావులైన మనుషులు నివసించే సమాజంలో వెల్లివిరిసే శాంతి కాదు. ఇండియాలో గత వెయ్యేళ్ళుగా ఇస్లాం చేసిన అరాచకాలు చెప్పలేనన్ని ఉన్నాయి. నా దృష్టిలో అదొక మతమే కాదు. ఒక నేరపూరిత మాఫియా గుంపు మాత్రమే.

సల్మాన్ రష్దీ 19-6-1947 న 2.30 కి ముంబాయిలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు. అతనొక మేధావి, ఆలోచనాపరుడు, రచయిత, ఉపన్యాసకుడు. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు పొందాడు.  ఉదారవాద ఆలోచనాపరునిగా ఈయనకు ప్రపంచదేశాలతో మంచి పేరుంది. ప్రస్తుతం ఈయనకు  75 ఏళ్ళు. ఈ సమయంలో, అందులోనూ స్వేచ్చకు పేరెన్నికగన్న అమెరికాలో ఇతను దాడికి గురయ్యాడు. ఇతని జాతకాన్ని గమనిద్దాం.


మేషలగ్నం, మిధునరాశి అయింది. అమావాస్య మరుసటిరోజున ఇతను పుట్టాడు. పౌర్ణమి మర్నాడు అమెరికాలో దాడికి గురయ్యాడు. సూర్యుడు చంద్రుడు 3 వ డిగ్రీమీద కలిసున్నారు. స్పష్టమైన అమావాస్యయోగం. వారితో కలిసి ఉన్న బుధుడు, రచయితనూ, ఉపన్యాసకుడినీ, దానితో వచ్చే గొడవలనూ సూచిస్తున్నాడు. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉంటూ పేరుప్రఖ్యాతులను సక్సెస్ నూ సూచిస్తున్నారు. చతుర్దంలోని శని, లోకనిందనూ, దాక్కోవడాన్నీ, భయంతో కూడిన జీవితాన్ని సూచిస్తున్నాడు. ఆరింట ఉన్న గురువు, మతపరమైన శతృత్వాలను సూచిస్తున్నాడు. లగ్నకుజుడు మొండిధైర్యాన్ని ఇస్తున్నాడు. బుధాదిత్యయోగం ఒక మేధావిని చింతనాపరుడినీ సూచిస్తున్నది. జాతకం స్పష్టంగానే ఉంది.

ప్రస్తుతం ఇతని జాతకంలో కేతు రాహు శుక్ర రాహుదశ నడుస్తున్నది. కేతువు అష్టమంలో ఉంటూ ప్రాణగండాన్ని హానిని సూచిస్తున్నాడు. రాహువు మారకస్థానంలో ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు మారకుడు. దశలు సరిపోయాయి. గోచారరీత్యా, అష్టమశని జరుగుతున్నది. ఇది మంచి సమయం కాదు. 

జననకాల కుజునిపైన గోచార రాహువు, జననకాల రాహువుపైన గోచారకుజుడు ప్రస్తుతం సంచరిస్తున్నారు. జీవకారకుడైన జననకాల గురువుపైన గోచారకేతువు సంచరించాడు. ఇది ఖచ్చితంగా ప్రాణగండం జరిగే సమయమే.

ఈ సంఘటనను ఎక్కడో అమెరికాలో ఎవరి పైననో జరిగిన దాడిగా తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రపంచంలో, ముఖ్యంగా ఇండియాలో అయితే, ఇలాంటి సంఘటనలలో ఏమైనా జరుగవచ్చు. అమెరికాలోనే దిక్కు లేకపోతే, ఇక ఇండియాలాంటి దేశాలలో దిక్కూ దివాణమూ ఎక్కడుంటాయి?

ఈ సంఘటన, ప్రపంచానికి ఇస్లాం వల్ల పొంచిఉన్న ముప్పును సూచిస్తున్నది. అమెరికా వంటి దేశాల్లో కూడా చాపక్రింద నీరులాగా పెరుగుతున్న ఇస్లామిక్ రాక్షసత్వాన్ని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. ఇది అమెరికన్ సమాజానికి మంచిశకునం కాదు. 'ఇస్లాం ను నమ్మనివాడిని, ప్రశ్నించినవాడిని చంపండి' అనే ఖురాన్ బోధన చాలా ఆటవికమైనది, నాగరిక సమాజానికి పనికిరానిది. ఇది రాక్షసబోధయే గాని, మానవత్వం ఉన్న బోధ కాదు. దైవత్వం అసలే కాదు.

షియాలూ, సున్నీలూ, సూఫీలూ అందరూ హింసావాదులే. అసహనపరులే. అశాంతిదూతలే, విధ్వంసకారులే, హంతకులే అన్నది నేడు మళ్ళీమళ్ళీ రుజువౌతున్నది.

ఉన్నాయో లేవో తెలియని స్వర్గనరకాలను ఎరగా చూపించి, 'నేను చెప్పిన దేవుడినే నువ్వు నమ్మాలి లేకపోతే నిన్ను చంపుతాను' అని బెదిరించే ఖురాన్ ను ప్రపంచవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేయాలి. ఇది మానవజాతికి పనికొచ్చే పుస్తకం ఎంతమాత్రం కాదు.

ఈ విధంగా చూస్తే, తస్లీమా నస్రీన్ కూ రక్షణ లేదు, నూపుర్ శర్మకూ రక్షణ లేదు. ఎవరికీ లేదు. సులేమాన్ అనేవాడిని చంపినందుకు ఇరాన్ లీడర్స్ డైరెక్ట్ గా ట్రంప్ నూ, అప్పటి అమెరికా రక్షణమంత్రినీ హెచ్చరిస్తున్నారు. ఎప్పటికైనా పగతీర్చుకుంటామని బెదిరిస్తున్నారు. హదీ మాటర్ అనేవాడిని 'సరిహద్దురహిత ఇస్లామిక్ సైన్యం' లో ఒక సైనికుడిగా పొగుడుతున్నారు. ఇదేం  ఉన్మాదమో మరి?

శాంతియుత సాటానిక్ వర్సెస్ పుస్తకాన్ని శుక్రవారం నాడు చదివితే ఇలాగే తయారౌతారేమో మరి ! ఎంత గొప్ప దైవగ్రంధమో?

ప్రపంచవినాశనం ఇరాన్ నుండి పాకిస్తాన్ వరకూ ఉన్న ఇస్లామిక్ దేశాలనుంచే పొంచి ఉంది. భూగోళం నాశనం కావడానికి ఈ దేశాలే కారణమౌతాయి. భవిష్యత్తులో ఇది నిజం కావడాన్ని ముందుతరాలు చూస్తాయి. ఇది సత్యం.

read more " మూడవ అమెరికా యాత్ర -3 (మరో చీకటి శుక్రవారం) "

12, ఆగస్టు 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర -2 (నిజమైన గురులక్షణం)

పదేళ్లనాడు నాకొక శిష్యురాలుండేది. ఆమె పేరు 'ప'. చాలా చంచల మనస్కురాలు. అన్నీ తనకు తెలుసనుకుంటుంది. దూకుడు నిర్ణయాలు తీసుకుంటుంది. నేటి అనేకమంది లాగా, నెట్ లో నాలుగు సైట్లు చూసేసి అదే ji ఆధ్యాత్మికత అనుకునేవారిలాగా తనుకూడా ఉండేది. తన దూకుడు నిర్ణయాలవల్ల జీవితంలో చాలా నష్టపోతూ ఉంటుంది. కానీ తెలివి తెచ్చుకోదు. ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తూ ఉండేది. ఇవన్నీ కరెక్ట్ కాదని నేను చెప్పేవాడిని. నీ పధ్ధతి మార్చుకోవాలని చెబుతూ ఉండేవాడిని.

ఈమె తల్లిగారు బ్రహ్మకుమారి సంస్థలో చాలా సీనియర్ సభ్యురాలు. అసలు 'ప' ఆధ్యాత్మికజీవితం దారితప్పి ఎటో వెళ్లిపోవడానికి ఈ తల్లే కారణం. ఆధ్యాత్మికజీవితం వేరు, లౌకిక జీవితం వేరు అని నేను ఎప్పుడూ చెప్పను. ఉన్నది ఒకటే జీవితం. కానీ మాటవరసకు ఈ పదాన్ని వాడాను. తన తల్లివల్ల ఈ అమ్మాయి లౌకికజీవితం కూడా నాశనమైపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఇంతే. పిల్లల జీవితాలను వాళ్ళే నాశనం చేస్తారు. ప్రస్తుతం సమాజంలో ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది.

బ్రహ్మకుమారి సంస్థలో చేరి వాళ్ళ బోధలు తలకెక్కితే మనుషులు ఒక విధమైన పిచ్చిలోకి వెళ్ళిపోతారు. చాలా పెడగా తయారౌతారు. ఛాందసపు బ్రాహ్మలలాగా, పిడివాద క్రైస్తవుల లాగా, ఇంకా చెప్పాలంటే చిన్నసైజు తీవ్రవాద ముస్లిములలాగా తయారౌతారు. కూతుర్ని బ్రెయిన్ వాష్ చెయ్యాలని తల్లి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉండేది. 'ప' నా బోధలలో  పడటం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆఫ్ కోర్స్, నా బోధలను 'ప' ఎప్పుడూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. తాను ఎక్కడెక్కడో నేర్చుకున్నవీ, నెట్లో వెదికి పట్టుకున్నవీ, యూట్యూబులో చూసినవీ అన్నీ కలగలిపి ఆచరిస్తూ ఉండేది. ఊరకే నా బోధలు వినేది కానీ ఏదీ తలకెక్కించుకునేది కాదు. ఇది సరైనదారి కాదని నేను చాలా చెప్పేవాడిని. కానీ తను వినేది కాదు. దీనికి కారణం తన జాతకంలో పంచమంలో ఉన్న నీచ శనియోగం. 

పాతకాలంలో ఒక వ్యక్తిని శిష్యునిగా అంగీకరించాలంటే, అసలైన గురువులు అతని జాతకాన్ని తప్పకుండా పరిశీలించేవారు. ఆ జాతకంలో ఉన్న యోగాలను బట్టి, అతను ఆధ్యాత్మిక సాధనామార్గంలో నిలబడగలడా, నడవగలడా, లేదా, వారికి వెంటనే తెలిసిపోయేది. ఆ తరువాతే అతడిని శిష్యునిగా తీసుకునేవారు. జాతకం మంచిది కాకపోతే, అతని గతకర్మ బలీయంగా ఉంటే, అవసరార్ధం ఆ సమయానికి అతడెంత మంచిగా మాట్లాడినప్పటికీ, అతడిని తిరస్కరించేవారు. ప్రాచీన సాంప్రదాయ గురువులలో ఇది ఒక ఆచారంగా ఉంటూ ఉండేది. ఈ నాటికీ ఉంది.

నేనీ అమ్మాయి జాతకాన్ని చూచినప్పటికీ, అందులోని చెడు యోగాలను చూచినప్పటికీ, పోనీలే పాపమని తనను  కొన్నేళ్ళపాటు భరించాను. ప్రతివారికీ ఒక అవకాశం ఇచ్చిచూడటం నా విధానం. మనం కాదంటే వాళ్ళు తప్పుదారిలో పడిపోతారని నాకు బాగా తెలుసు. అందుకని, జాతకం బాగాలేకపోయినా, ఎవరికైనా సరే ఒక అవకాశం ఇద్దామనుకుంటాను. విధికి ఎదురు పోదామని వారికి సాయం చేద్దామని, వారి చెడుకర్మను క్షాళనం చేద్దామని  భావిస్తాను. ఈ అమ్మాయి విషయంలో కూడా అలాగే భావించాను. 

నిజమైన గురులక్షణం ఇదే.

పంచమంలో నీచశని ఉన్న జాతకులు, సంతానం ద్వారా చాలా నష్టపోతారు. వారి జీవితమంతా  సంతానం కోసమే ఖర్చయిపోతుంది. వారి జీవితాన్ని పిల్లలే శాసిస్తారు. ఎంతగా అంటే,  వారికింక పర్సనల్ జీవితం ఏమాత్రమూ ఉండనంతగా ఈ బంధం ఉంటుంది. వీరి జీవితాలకు సంతానమే శాపం అవుతుంది. వీరికి మనసు కూడా  చాలా ఊగిసలాటగా ఉంటుంది. పఞ్చమం బుద్ధిస్థానం గనుక, దాదాపుగా స్కిజోప్రినియా లక్షణాలు వీరిలో ఉంటాయి. అమావాస్యకూ పౌర్ణమికి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు.  ఇవన్నీ ఈమెలో ఉన్నాయి. కానీ ఈమెకు సరియైనదారిని  చూపిద్దామని, తన కర్మను జయింపజేద్దామని నేను భావించాను. కానీ ఈమె గతకర్మ చాలా బలీయంగా ఉంది. 

గత అయిదేళ్లుగా ఈమె నాతో టచ్ లో లేదు. దూరమైంది. సొంతనిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకెళుతోంది.  'మంచిదే' అని నేనూ ఊరుకున్నాను. ప్రస్తుతం అమెరికాలో అడుగుపెట్టాను గనుక, ఒకసారి తనను పలకరిద్దామని భావించాను. అందుకే నిన్న సాయంత్రం ఈమె ఇల్లు వెతుక్కుంటూ మరీ వెళ్ళాము. తాను ఇంట్లో లేదు. లేదా, ఉండికూడా, కావాలనే తలుపు తియ్యలేదో తెలియదు. రెండుసార్లు కాలింగ్ బెల్ కొట్టి చూచాము. పలకలేదు. వెనక్కు వచ్చేశాము.

మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఎవరు గేట్  ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టారో, మనం  ఎక్కడున్నప్పటికీ, మన  ఫోన్ లోనుంచి చూచుకోవచ్చు. అలాంటి టెక్నాలజీ ఇక్కడ ఉంది. ఆ విధంగా ఆమె చూచింది.  కాల్ చేసింది.

'నేను వేరే దారిలో ముందుకెళ్లాను. వేరే గురువుల దగ్గర దీక్షలు తీసుకున్నాను. నా పిల్లలకు, మా కుటుంబసభ్యులకు, నేను మీ మార్గంలో నడవడం ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే నా సంసారం దారినపడుతోంది. నా పిల్లలతో నా సంబంధాలు బాగుపడుతున్నాయి. కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చెయ్యాలని ప్రయత్నించకండి' అనేది ఆమె మాటల సారాంశం.

నవ్వుకున్నాను. తనమీద జాలి కలిగింది. సంసారం వద్దని నేనెప్పుడూ చెప్పలేదు. భర్తతో విడిపోతానని తాను గొడవ చేసిన ప్రతిసారీ ఒద్దని ఎంతో నచ్చచెప్పాను. కానీ ఆమె వినలేదు. చిన్నప్పుడే సన్యాసాన్ని త్యాగం చేసిన నేను, సంసారం చెడగొట్టుకోమని ఇతరులకు ఎందుకు చెబుతాను? సక్రమంగా జీవించమని, ఆధ్యాత్మికం, లౌకికం అంటూ రెండు లేవని, ఉన్నది ఒకటే జీవితమని, అర్ధం చేసుకుని, నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ బ్రతకమని, ధర్మంగా జీవించమనే నేనెప్పుడూ  నా  శిష్యులకు చెబుతాను. 

ఈమె ఇంటినుండి వెనుకకు తిరిగి వచ్చేస్తుంటే, మహాభారతం నుండి ఒక సన్నివేశం గుర్తొచ్చింది.

రాయబారం కోసం శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళినపుడు అందరి ఇళ్లకూ వెళ్ళాడు. దుర్యోధనుడి ఇంటికీ వెళ్ళాడు, విదురుడి ఇంటికీ వెళ్ళాడు, కుంతీదేవి ఇంటికీ వెళ్ళాడు. ఒక్కొక్కచోట ఒక్కొక్క విధమైన మర్యాదలు ఆయనకు జరిగాయి. కొన్నిచోట్ల అవమానాలు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల తలుపులే తెరుచుకోలేదు. సత్కారమైనా, ఛీత్కారమైనా, పరమాన్నమైనా, పరాభవమైనా అన్నింటినీ సమంగా స్వీకరించాడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు. నవ్వుకున్నాడు. వెనక్కు వెళ్ళిపోయాడు. ఆయనకేం తక్కువైంది? వారివారి కర్మ ఇంకా ముదిరింది. వారి జీవితాలను  ఇంకా కడగండ్ల పాలు చేసింది. కానీ ఆయన స్థాయికి ఏమైనా తక్కువైందా?

సాక్షాత్తు భగవంతుడే నీ ఇంటిముందుకొచ్చి నిలబడ్డాడు. తలుపు తీసి లోపలకు అహ్వానించే అదృష్టం నీకు లేదు. ఎంతటి పాపఖర్మం నీ తలపైన కూర్చుని ఉందో? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఆయనను అవమానించారు. అవసరార్ధం ఆయనతో నటించారు. ఫలితాన్ని అనుభవించారు. కానీ, విదురుడు, కుంతి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భక్తితో సేవించారు. ఉత్తమగతులను పొందారు. ధన్యాత్ములయ్యారు.

మనం అర్ధం చేసుకున్నా, అర్ధం చేసుకోకపోయినా, ఆహ్వానించినా, తిరస్కరించినా,  పూజించినా, అవమానించినా, ఏం చేసినా ఆయనకేం తక్కువౌతుంది? మన కర్మను బట్టి మన ఖర్మ తయారౌతుంది. అంతే !

అదే విధంగా, ఈ అమ్మాయి ఇంటిని వెదుక్కుంటూ నేను అమెరికాలో వెళ్ళడానికి వెనుక ఉద్దేశ్యం ఏముంది? ఏమీ లేదు. ఎవరినుంచీ నేనేదీ ఆశించను. అలా, మంది డబ్బుల మీద బ్రతికేవాడినైతే, నలభై ఏళ్ళపాటు ఉద్యోగం చెయ్యను. 1982 లోనే ఒక గురువుగా మారి, డొనేషన్లు దండుకుని,  ఈ పాటికి నేటి గురువులకు అందనంత లౌకికస్థాయిలో ఉండేవాడిని. ఇతరుల సొమ్మును తాకను గనుకనే, నలభైఏళ్ళు ఉద్యోగం చేసినప్పటికీ, కుళ్ళుప్రపంచంలోని కుళ్ళును అంటించుకోకుండా, తామరాకుమీద నీటిబిందువుగా స్వచ్ఛంగా బ్రతికాను.

నలభైఏళ్ళనాడు తనదగ్గర బ్రహ్మచారిగా చేరమని మహాతపస్వి శ్రీమత్ నందానందస్వామి నన్ను కోరినప్పుడు, నేను తిరస్కరించడానికి ఒకే ఒక్క కారణం, 'ఇతరుల డొనేషన్ల మీద ఆధారపడే స్వామీజీగా బ్రతకడం నాకిష్టం లేకపోవడమే'. 

'లౌకికంగా ఉంటూనే ఆధ్యాత్మికమార్గంలో నేను నడుస్తాను. నా సంపాదన మీదే నేను బ్రతుకుతాను. దీనికోసం, మీ ఆజ్ఞను పాటించలేకపోతున్నాను. సన్యాసం స్వీకరించలేను. నన్ను క్షమించండి' అని ఆయన కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాను. ఈ సంఘటన 1982 లో జరిగింది.

వారి హృదయాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి నేను దగ్గరౌతాను గాని ఏదో ఆశించి కాదు. అవి వారిలో లేకపోయినా కూడా, ఎప్పుడో వారు చేసిన ఏదో ఒక చిన్న పనిని, సేవను, నా పట్ల చూపించిన చిన్నపాటి ప్రేమను గుర్తుంచుకుని వారి నూరు తప్పులను క్షమిస్తాను. నేనే వారిని వెదుక్కుంటూ వెళతాను.

ఇదంతా చెయ్యడంలో నాదొక్కటే ఉద్దేశం. అసలైన వెలుగుదారిని వారికి చూపించాలని, వారి జీవితాన్ని ధన్యత్వం లోకి మళ్లించాలని, స్వచ్ఛమైన ప్రేమను పంచాలని, ఆవేశకావేశాలతో, పొంగులు, క్రుంగులతో కునారిల్లుతున్న వారి మానవజీవితాలను దివ్యత్వంలోకి ఉద్దరించుదామన్న ఒకేఒక్క సత్సంకల్పంతో నేను మనుషులకు దగ్గరౌతాను. మరొక్క అవకాశాన్ని వారికి మళ్ళీ మళ్ళీ ఇచ్చి చూస్తాను. ఒక గురువుగా ఇది నా బాధ్యత. ఇది తప్ప, ఈ లౌకికులకు నేను దగ్గరవ్వాల్సిన ఖర్మ నాకేముంది? ఈ లౌకికజీవితాల రొచ్చులోకి దిగవలసిన ఖర్మ నాకేముంది?

శ్రీ రామకృష్ణులు, గురువులను మూడు రకాల వైద్యులతో పోల్చారు.

మొదటి రకం గురువు, సాధారణ వైద్యునివంటి వాడు. మందిచ్చి వెళ్ళిపోతాడు. పట్టించుకోడు. శిష్యుని పురోగతిని గురించి వాకబు చెయ్యడు.రోగి యొక్క రోగం తగ్గిందా లేదా పట్టించుకోడు.

రెండవరకం గురువు, అప్పుడప్పడూ రోగి క్షేమసమాచారాలు కనుక్కుంటూ ఉండే మధ్యరకం వైద్యునివంటి వాడు.  తనకు వీలున్నప్పుడు శిష్యుని ఆధ్యాత్మిక పురోగతిని గురించి పైపైన కనుక్కుంటాడు.

మూడవరకం గురువు,  ఉత్తమ వైద్యుని వంటి వాడు. మందు వేసుకోనని మొండికేస్తున్న రోగిని, నేలపైన పడేసి, అతని ఛాతీమీద తన మోకాలితో అదిమిపట్టి, నోరు పగలదీసి, చేదుమందును బలవంతాన మింగిస్తాడు. అంత బాధ్యతను అతను ఫీలౌతాడు. కారణం? నేటికాలపు సెల్ఫిష్ డాక్టర్లలాగా రోగిని దోపిడీ చేద్దామని కాదు. ఆ రోగం ఎలాగైనా తగ్గించాలన్నదే అతని సంకల్పం గనుక ఈ విధంగా ప్రవర్తిస్తాడు.

ఉత్తమగురువులను ఈ మూడవరకపు వైద్యులతో పోల్చారు శ్రీ రామకృష్ణులవారు. అటువంటి గురువు, తన శిష్యుని ఎన్నటికీ మర్చిపోడు. శిష్యుడు మర్చిపోయినా అతను మర్చిపోడు. కారణం? అలాంటి గురువులో స్వార్ధపరమైన ఆలోచనలేవీ ఉండవు.  కోరికలూ ఉండవు. శిష్యుని ఆధ్యాత్మిక పురోగతి ఒక్కటే అతను కోరుకుంటాడు. అలాంటివాడు ఉత్తమగురువు.

అలాంటి ఉత్తమగురువు, వెదుక్కుంటూ శిష్యుని ఇంటికి వెళ్లి తలుపు దగ్గర నిలబడినప్పుడు, కనీసం తలుపు తియ్యకుండా వెళ్లిపొమ్మని వెళ్లగొట్టడం చేసే శిష్యుడు ఏ తరగతికి చెంది ఉంటాడో, ఏపాటి సంస్కారవంతుడో, నేను చెప్పనవసరం లేదు. మీరే ఊహించుకోండి. శత్రువైనా సరే, ఇంటిముందుకొచ్చినపుడు, లోపలకు పిలిచి కనీస మర్యాద చెయ్యడం మన సాంప్రదాయం కదా !

ఇది సాక్షాత్తు భగవంతుడిని అవమానించడమే. గురువే దైవమని కదా మన భారతీయ సాంప్రదాయం చెప్పేది? నేటి నెట్ లోకపు ఆధ్యాత్మికులకు, నవీనకాలపు శిష్యులకు ఈ ఉన్నతమైన భావన ఎలా అర్ధమౌతుంది?

ఈ అమ్మాయి దురదృష్టానికి చాలా జాలిపడుతున్నాను. తన జీవితం తనిష్టం, దానిని మనం గౌరవిద్దాం. కానీ, కర్మవలయంలో చిక్కి, జన్మపరంపరలలో సొక్కి, తప్పుదారులు తొక్కి, అవే  నిజాలనుకుంటూ ప్రయాణించే జీవి ప్రయాణం ఎటు పోతుందో? ముందుముందు ఏమౌతుందో? తెలిసినా,   నవ్వుకోవడం, జాలిపడటం తప్ప ప్రస్తుతానికి ఏమీ చెయ్యలేను.

'బుద్ధి కర్మానుసారిణి' అని మనవాళ్ళు ఊరకే అనలేదుకదా మరి !

'గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః' అనే శ్లోకాన్ని నీ పిల్లలకు నేర్పించవచ్చు. నేర్పించావో లేదో నాకు తెలియదు. మరి అలాంటి గురువు నీ ఇంటిగుమ్మంలో వచ్చి నిలబడినప్పుడు నీవెలా ప్రవర్తించావో ఆలోచించు. ఎందుకు మీ శ్లోకాలు? జీవితంలో పాటించని ఉత్త నీతులు? ఆలోచించు.

ఈ అమ్మాయి బుద్ధికి పట్టిన చీకటిని వదిలించి, మంచిమార్గంలో దానిని నడిపించమని, తాను చేస్తున్న తప్పును  గ్రహించేలా చెయ్యమని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

ఇవన్నీ బ్లాగులో వ్రాయవలసిన పని లేదు. కానీ జరుగుతున్న సంఘటనలను ఈ సీరీస్ లో రికార్డ్ చెయ్యడం కోసం ఇదంతా వ్రాస్తున్నాను. నా వ్రాతలను పన్నెండేళ్ళనుంచీ ఫాలో అవుతున్న పాఠకులకోసం, ఇండియానుంచి నా బ్లాగుపోస్టులకోసం ఎదురుచూచే అభిమానులకోసం ఇదంతా వ్రాస్తున్నాను.

గతపు పాపఖర్మ వదలనిదే ఎవ్వరూ వెలుగుదారులలో నడవలేరు. ప్రస్తుతం నడుస్తున్న చీకటిదారినే వెలుగుదారిగా భ్రమిస్తూ ఉంటారు. తప్పును చేస్తూ ఒప్పుగా అనుకోవడం, ఒప్పును తప్పుగా భ్రమించి చెయ్యకపోవడం  -- ఇంతేగా సామాన్యుని జీవితం !

read more " మూడవ అమెరికా యాత్ర -2 (నిజమైన గురులక్షణం) "

11, ఆగస్టు 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర -1(డెట్రాయిట్ చేరుకున్నాం)

రిటైర్డ్ స్వేచ్ఛాజీవితంలో మొదటిమెట్టుగా మూడవసారి అమెరికా వచ్చేశాను. 

9 వ తేదీ రాత్రి 8.30 కి హైద్రాబాద్ లో బయల్దేరి రాత్రి పదకొండుకు ఢిల్లీ చేరుకున్నాం. తెల్లవారుఝామున 2 గంటలకు ఢిల్లీలో విమానం ఎక్కి, 14 గంటల ప్రయాణం తర్వాత చికాగో ఒహెర్ ఎయిర్ పోర్టులో దిగాం. అప్పటికక్కడ ఉదయం 7 అయింది. అక్కడకు రెండు గంటల ప్రయాణదూరంలో ఉన్న శ్రీనివాస్ దంపతులు ఇడ్లీలు, పులిహోర, పెరుగన్నాలు తీసుకుని అప్పటికే అక్కడకు చేరుకొని మాకోసం వేచిచూస్తున్నారు. పన్నెండువేల మైళ్ళ దూరంలో, దేశం కాని దేశంలో, మా కోసం పొద్దున్నే లేచి అవన్నీ చేసుకుని రెండుగంటలు డ్రైవింగ్ చేసి చికాగో ఎయిర్ పోర్ట్ కొచ్చి అవన్నీ తినిపిద్దామని మాకోసం వెయిట్  చేస్తున్నారు శ్రీనివాస్ దంపతులు. జగన్మాతను మనస్సులోనే స్మరించి నమస్కరించుకున్నాము 

చికాగో ఎయిర్ పోర్ట్ లో వారి ఆతిధ్యం స్వీకరించి, మధ్యాన్నం 1.40 కి అక్కడ ఇంకో విమానం ఎక్కి సాయంత్రం నాలుగు గంటలకు డెట్రాయిట్ చేరుకున్నాం.

'చికాగో నుంచి డెట్రాయిట్ వెళ్లకుండా మా ఇంటికి రండి. ఒక వారం మాతో ఉండి అప్పుడు డెట్రాయిట్ వెళ్ళవచ్చు, మిమ్మల్ని ఇట్నుంచి ఇటే కిడ్నాప్ చేద్దామనుకుంటున్నాం' అని శ్రీనివాస్ దంపతులు పట్టుబట్టారు. కానీ డెట్రాయిట్ వారు మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు గనుక వారి అభ్యర్ధనను సున్నితంగా కాదని చెప్పాము. 'వచ్చే నెలలో మీ ఊరికి వస్తాను. మిమ్మల్ని కలుసుకుంటాం. అప్పుడు మీ దగ్గర ఒక వారం ఉంటామ'ని చెప్పాను.

ఈసారి లీవు బాధ లేదు. ఉద్యోగపరంగా పరిమితులు, కట్టుబాట్లు లేవు. కొన్ని సబ్జెక్ట్ లే వ్రాయాలి మిగతావి వ్రాయకూడదు అనే గొడవలు లేవు. కాబట్టి అమెరికా ఉండనిచ్చినన్ని రోజులు ఇక్కడ ఉంటాను. పాతమిత్రులను, శిష్యులను కలుసుకుంటాను. నా టైంటేబుల్ ప్రకారం నా జీవితాన్ని గడుపుతాను. నా టైంటేబుల్ ఏంటో తెలుసుకుందామని ఉందా? చాలా సింపుల్ వినండి.

ప్రతిరోజూ యోగాభ్యాసం, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం, జపధ్యానాలు, చాలాకాలంగా వాయిదా వేసిన కొన్ని మంత్ర-తంత్ర సాధనలు, బోధన, పుస్తకాలు వ్రాయడం, శిష్యులకు మార్గదర్శనం, యూట్యూబ్ వీడియో ఛానల్ ప్రారంభం, వీడియోలు చెయ్యడం, షార్ట్ ఫిలిం లు తియ్యడం, పాటలు పాడటం ఇవన్నీ చేస్తూ రోజులు గడుపుతాను.

ఈ జీవితానికి 'న్యూ లైఫ్' అని పేరుపెట్టాను. ఈ పేరును మెహర్ బాబా జీవితం నుంచి తీసుకున్నాను.

న్యూ లైఫ్ ఆల్రెడీ మొదలైపోయింది.


At Ohare International airport Chicago
At Chicago Ohare International Airport

With Srinivas and Family at Chicago airport

In Metro train from International airport to domestic airport in Chicago

At Detroit McNamara Airport

Morning walk in Detroit

Morning walk

Our living place in Troy, Michigan


Relaxing at home today morning

read more " మూడవ అమెరికా యాత్ర -1(డెట్రాయిట్ చేరుకున్నాం) "

7, ఆగస్టు 2022, ఆదివారం

మా క్రొత్త పుస్తకం "డిసెంబర్ 25 న జీసస్ జన్మించాడా?" నేడు విడుదలైంది.


నా కలం నుండి వెలువడుతున్న 50 వ పుస్తకంగా "డిసెంబర్ 25న జీసస్ జన్మించాడా?" అనబడే ఈ జ్యోతిష్యపరిశోధనా గ్రంధం  నేడు విడుదలౌతున్నది.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు చారిత్రకవ్యక్తులు కారని అజ్ఞానపు క్రైస్తవులు ఆరోపిస్తుంటారు. వాళ్ళెంత కొండగొర్రెలో ఆ మాటలే నిరూపిస్తుంటాయి. రామాయణ, భారత, భాగవతాలలో చెప్పబడిన ప్రదేశాలన్నీ భారతదేశంలో ఈనాటికీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయోధ్య మన కనుల ఎదురుగా ఉన్నది. మధుర, బృందావనాలున్నాయి. ద్వారకానగరం అరేబియా సముద్రంలో మునిగిపోయి కనుగొనబడింది. అది ఆ విధంగా మునిగిపోయిందని భాగవతం, భారతం స్పష్టంగా చెబుతున్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశాలన్నీ భారతదేశంలో ఈనాటికీ ఉన్నాయి. ఇంకా రుజువులేం కావాలి?

వారు పుట్టిన తిథి, వార, గ్రహ, నక్షత్రాల స్థితులన్నీ గ్రంధాలలో స్పష్టంగా రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఆయా స్థితులను మోడ్రన్ జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ప్రోగ్రాముల సహాయంతో చూస్తే, BC 3000, 5000, 7000 ప్రాంతాలకు మనలను తీసుకుపోతూ, ఆయా గ్రంధాలలో వ్రాయబడినవి సత్యాలేనని నిరూపిస్తున్నాయి. కార్బన్ డేటింగ్ పరీక్షలు కూడా ఈ సంవత్సరాలను నిజాలని నిరూపిస్తున్నాయి.

మరి ఏ క్రైస్తవులైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో, వారు నమ్మే క్రీస్తు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలీదు. పాశ్చాత్యదేశాలలో కూడా ఎక్కడా రుజువులు ఆధారాలు లేవు. ఆఫ్ కోర్స్ మనవాళ్ళు రికార్డ్ చేసినట్లుగా జీసస్ జననతేదీని రికార్డు చేసి పెట్టడానికి అప్పటి యూదుసమాజం ఖగోళ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న నాగరికసమాజం కాదు. గొఱ్ఱలను మేపుకుంటూ జీవించే కొండసమాజం మాత్రమే. కనుక జీసస్ జననతేదీని రికార్డు చేసి పెట్టేంత గొప్పపనిని వారు చేయలేకపోయారు.

ఆ పనిని భారతీయ జ్యోతిష్యజ్ఞాన సహాయంతో చేసి వారికి సాయం చేద్దామని నేననుకున్నాను. అయితే, జీసస్ జాతకాన్ని విశ్లేషించే ఈ క్రమంలో కొన్ని అనుకోని నిజాలు బయటపడ్డాయి. 

జీసస్ జాతకచక్రాన్ని గనుక గమనిస్తే, దానినుండి - జీసస్ తండ్రి ఎవరు?, మేరీ నిజంగా కన్యయేనా? జీసస్ కు లోకం నమ్ముతున్నంత దైవత్వం ఉందా?, జీసస్ శిలువమీద నిజంగా చనిపోయాడా? మొదలైన సందేహాలకు స్పష్టమైన జవాబులు లభించాయి. ఈ పాయింట్స్ మీద లోకం ఇప్పటిదాకా నమ్ముతున్నవన్నీ అబద్దాలేనని, క్రైస్తవమనే భవనం అబద్దాల పునాదులపైన కట్టబడిందని, జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా ఈ విధంగా మళ్ళీ రుజువైంది.

సంచలనాత్మక నిజాలను జ్యోతిష్యపరంగా ఆవిష్కరించిన ఈ పరిశోధనా గ్రంధాన్ని ఉచితపుస్తకంగా విడుదల చేస్తున్నాను. 'సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి, భ్రమలనుండి బయటకురావాలి' అన్న సదుద్దేశ్యమే దీనికి కారణం.

ఈ పుస్తకం తయారు కావడంలో సహపాత్రధారులైన సరళాదేవి, అఖిల, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ ఉచితపుస్తకాన్ని google play books నుండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

చదవండి. సత్యాలను గ్రహించండి. చీకటినుండి వెలుగులోకి రండి.

జైహింద్ ! జై శ్రీరామ్ !

read more " మా క్రొత్త పుస్తకం "డిసెంబర్ 25 న జీసస్ జన్మించాడా?" నేడు విడుదలైంది. "

1, ఆగస్టు 2022, సోమవారం

ఉద్యోగపర్వం ముగిసింది

నిన్నటితో సుదీర్ఘమైన ఉద్యోగపర్వం ముగిసింది.

ఇక ఆశ్రమవాసపర్వం మొదలు కాబోతోంది. 

నేటినుండి ఉద్యోగబాధ్యతలు, దానికి సంబంధించిన పరిమితులు లేవు గనుక,  24x7 సాధన, బోధన ఈ రెండే ఇక నుండి ప్రాముఖ్యతలు.

పూర్తిస్థాయి ఆధ్యాత్మికజీవితం, అర్హులకు మార్గదర్శనం ఇక సూటిగా మొదలవుతాయి.

నా శిష్యులకు, నా వ్రాతలను అభిమానించే పాఠకులకు, అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.

ఈ సుదీర్ఘప్రయాణంలో సరిక్రొత్త అధ్యాయానికి సిద్ధం కండి.

నేడే అది ప్రారంభం !

read more " ఉద్యోగపర్వం ముగిసింది "