“Be firm with yourself but be kind to others" - Budo Saying

24, నవంబర్ 2017, శుక్రవారం

"శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక" పుస్తకావిష్కరణ కార్యక్రమం


నా శిష్యులూ, పంచవటి సభ్యులూ, నా బ్లాగు పాఠకులూ, ఇంకా చాలామంది ఎదురుచూస్తున్న కార్యక్రమం అతి దగ్గరలోకి వచ్చేసింది. అదే నేను రచించిన - శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక - బుక్ రిలీజ్ ఫంక్షన్. ఈ పుస్తకం మా పంచవటి పబ్లికేషన్స్ నుంచి వెలువడుతున్న మూడవ ప్రింట్ పుస్తకం. E - Book గా కూడా అదే రోజున వెలువడుతుంది. 

ఈ కార్యక్రమాన్ని 10-12-2017 ఆదివారం రోజున హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించాము. ఉదయంపూట బుక్ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. మధ్యాన్నం నుంచీ Astro Workshop - 5 నిర్వహించబడుతుంది. ఈ వర్క్ షాపులో - జాతకచక్రాన్ని నేను విశ్లేషణ చేసే పద్ధతిలో కొన్ని సూత్రాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో, ఉదాహరణలతో సహా నేర్పించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి రావాలనుకునేవారు, మిగతా వివరాలకోసం, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (ఇండియా) సెక్రటరీ అయిన 'శ్రీ రాజు సైకం' ను 9966007557 అనే మొబైల్ నంబర్ లో సంప్రదించవచ్చును.
read more " "శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక" పుస్తకావిష్కరణ కార్యక్రమం "

23, నవంబర్ 2017, గురువారం

కలబురిగి కబుర్లు - 2

లండన్ పార్లమెంట్ దగ్గర
బసవన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మోడీ --
కలబుర్గి అంటే రాతిబురుజు అని అర్ధం. ఆ ఊళ్ళో బహమనీ సుల్తానుల కోట ఉంది. అందుకని ఆ పేరు వచ్చిందో ఏమో తెలీదు. ఇదంతా ఒకప్పుడు సుల్తానుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. చాలాకాలం పాటు ఇది హైదరాబాద్ నిజాం అధీనంలో కూడా ఉంది. అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళున్నారు. ఇది హైద్రాబాద్ కు బాగా దగ్గర కావడంతో చదువుకోడానికి చాలామంది తెలుగువాళ్ళు ఇక్కడికి వస్తుంటారు.

ఇక్కడకు వచ్చిన రెండో రోజే లోకల్ న్యూస్ చూద్దామని పేపర్ తీస్తే ఒక విచిత్రమైన వార్త కనిపించింది. అదేమంటే - మేం హిందువులం కాము. మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. విషయం కోర్టు దాకా వెళ్ళింది. ఇది నాకు భలే విచిత్రం అనిపించింది. శివుడిని పూజించే లింగాయతులు హిందువులు కాకుండా ఎలా పోతారు?

అసలు లింగాయత మతం, అనేది ( అసలంటూ అదొక ప్రత్యెక మతం అయితే?) మొదలైనదే బసవేశ్వరుడినుంచి. బసవన్నది చాలా విషాద గాధ.

మనం సమాజంలో కులవ్యవస్థను లేకుండా చెయ్యాలని ప్రయత్నించిన వాళ్ళు ప్రాచీనకాలం నుంచీ కొందరున్నారు. వారిలో మొదటి వాడు బుద్ధుడు. ఆ తర్వాతివాడు బసవన్న. బుద్ధుడు క్షత్రియుడు. బసవన్న బ్రాహ్మణుడు. వీరిద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారే. వీరి తర్వాత అంబేద్కర్ ప్రయత్నించాడు. బుద్ధునికీ బసవన్నకూ 1700 సంవత్సరాల కాలవ్యవధి ఉంది. బసవన్నకూ అంబేద్కర్ కూ 800 సంవత్సరాల తేడా ఉంది.

అయితే వీళ్ళలో తేడాలున్నాయి. బుద్ధుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మార్గంలో నడిస్తే మనిషి కులానికి అతీతుడౌతాడని అన్నాడు. అది నిజమే. ఆ మార్గంలో నడిచి జ్ఞానులైనవాళ్ళు ఎందఱో ఉన్నారు. బసవన్నేమో శివభక్తికి ప్రాధాన్యతనిచ్చాడు. లింగాన్ని మెడలో ధరించి కొన్ని నియమాలు పాటిస్తూ, శివజ్ఞానాన్ని పొంది జీవితాన్ని గడిపితే కులానికి అతీతంగా పోవచ్చని ఆయనన్నాడు. ఇదీ నిజమే. ఇది భక్తిమార్గం. క్రమేణా వీరందరూ లింగాయతులు (లింగధారులు) అని ఒక ప్రత్యెకమైన జాతిగా తయారయ్యారు. కానీ వీరు మతప్రాతిపదికన కులాన్ని దాటాలని ప్రయత్నించారు. అంబేద్కరేమో, మతంతో సంబంధం లేకుండా, సమాజంలోనుంచి కులమనేది అదృశ్యం కావాలని భావించాడు.

విచిత్రమేమంటే వీరిలో ఎవరి స్వప్నమూ నిజం కాలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం - ఎప్పటికీ కాబోదు కూడా. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగి కులానికి అతీతుడు కావచ్చు. మనిషి దైవత్వాన్ని అందుకుంటే కులమతాలకు అతను అతీతుడౌతాడు. కానీ సామాజికంగా కులం అదృశ్యం కావడం అనేది జరగదు. అది ఆచరణాత్మకం కూడా కాదు.

వ్యక్తిగతంగా మనిషి కులానికి అతీతుడు కావచ్చు. కానీ సమాజం మొత్తం ఒకేసారి అలా కావడం జరగదు. ముఖ్యంగా మన భారతీయ సమాజంలోనుంచి కులం అదృశ్యం కావడం ఎన్నటికీ జరగని పని.అసలు బర్త్ సర్టిఫికేట్ లోనే కులం అన్న కాలమ్ ఉన్నప్పుడు కులం ఎలా పోతుంది? ఎక్కడికి పోతుంది? ఒకవేళ ఆ సర్టిఫికేట్ లోనుంచి దాన్ని తీసేసినా మనుషుల మనసులలోనుంచి ఎలా పోతుంది?  పైగా, కులం వల్ల ఇప్పుడు అనేక లాభాలు ఒనగూడుతున్నప్పుడు అదెలా పోతుంది? అది జరిగే పని కాదు.

కులం లేని విదేశాలలో కూడా రంగు ఉంది. రేసిజం అనేది రంగును బట్టే ఉంటుంది. పోనీ ఒకే రంగు ఉన్న జాతులలో కూడా మళ్ళీ వారిలో వారికే అనేక విభేదాలున్నాయి. ఫిజికల్ ఫీచర్స్ లో తేడాలనేవి మనుషులలో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కనుక విభేదాలనేవి ఎప్పటికీ మానవజాతినుంచి అదృశ్యం కావు. కులం కాకపోతే రంగు, రంగు కాకపోతే జాతి, జాతి కాకపోతే దేశం, అది కాకపోతే ఇంకోటి - ఈ రకంగా అవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మానవసమాజంలో గ్రూపులనేవి ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటాయి. ఇది ప్రకృతి నియమం.

ఆ విషయాన్ని అలా ఉంచి, బసవన్న గురించి కొంత ఆలోచిద్దాం.

ఈ బసవన్న 12 శతాబ్దంలో వాడు. కన్నడ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఈయన నందీశ్వరుని వరప్రసాది అని భావిస్తారు. అలాంటి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా, చిన్నప్పటి నుంచీ కులవ్యవస్థ అంటే ఈయనకు రుచించేది కాదు. ఉపనయన సమయంలో జంధ్యాన్ని తెంచేసి, ఇంట్లోనుంచి పారిపోయి, ఒక పాశుపతశాఖకు చెందిన శైవగురువు దగ్గర శిష్యునిగా చేరిపోయాడు.

పాశుపత మతానికి మూలాలు వేదాలలోనే ఉన్నాయి. మనుషులందరూ కామం, క్రోధం, భయం, గర్వం మొదలైన పాశాలతో బంధింపబడి ఉన్నారు గనుక వీరందరూ పశువులనీ, దేవుడు వీటికి అతీతుడు గనుక ఆయన పశుపతి అనీ ఆయనే శివుడనీ వీళ్ళు భావిస్తారు. పన్నెండేళ్ళు అదే ఆశ్రమంలో ఉండి ఆ ఫిలాసఫీ బాగా చదివి జీర్ణించుకున్నాడు. ఆ తర్వాత బిజ్జలుడనే ఆ దేశపు రాజు దగ్గర గణకుడిగా   (ఎకౌంటెంట్) ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత తన మేనమామ అయిన మంత్రి చనిపోతే, ఆ స్థానంలో మంత్రి అయ్యాడు. మంత్రిపదవి ఆయనకు రావడానికి వెనుక ఉన్న కధను ఇప్పటికీ కన్నడదేశంలో చెప్పుకుంటారు.

బిజ్జలుడు పశ్చిమ చాళుక్యరాజులకు ఒక సామంతరాజు. వీరిని కల్యాణి చాళుక్యులని కూడా అనేవారు. తన ప్రభువైన విక్రమాదిత్యుడు చనిపోయాక స్వతంత్రం ప్రకటించుకుని కొన్ని కోటలను జయించాడు. ఆ కోటల్లో ఒకచోట ఒక రాగిరేకు దొరికింది. ఆ రాగి రేకుమీద ఏదో అర్ధంకాని కోడ్ భాషలో ఏదో వ్రాసి ఉంది. దాన్ని ఎవరూ డీకోడ్ చెయ్యలేకపోగా, బసవన్న దాన్ని చదివి వివరించి చెప్పాడు. అది ఒక నిధికి మ్యాప్. దానిలో ఉన్న గుర్తుల ప్రకారం కోటలో త్రవ్వించగా కోట్లాది బంగారు నాణాలతో కూడిన పెద్దనిధి ఒకటి దొరికింది. దాన్ని డీకోడ్ చేసినందుకు కృతజ్ఞతగా బసవన్నను తన మంత్రిగా పెట్టుకున్నాడు బిజ్జలుడు. అంతేగాక తన చెల్లెల్నిచ్చి పెళ్లి కూడా చేశాడు.

అంతకు ముందే తన మేనమామ అయిన మంత్రి కూతుర్ని (తన మరదల్ని) చేసుకుని ఉన్నాడు బసవన్న. రాజు చెల్లెలూ మంత్రి కూతురూ చిన్నప్పటి నుంచీ స్నేహితులుగా పెరిగారు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరూ ఒకరినే పెళ్లి చేసుకుందామని ఒప్పందం కూడా చేసుకుని ఉన్నారు. కనుక ఇద్దరినీ బసవన్నే పెళ్లి చేసుకున్నాడు.

మంత్రి అయిన తర్వాత బసవన్న తన కులరహిత సమాజ ఎజెండాను ప్రచారం చెయ్యడం మొదలుపెట్టాడు. 'అనుభవ మంటపం' అని ఒక పార్లమెంట్ లాంటిదాన్ని కట్టించి, అందులో సాధువులనూ సిద్దులనూ పోగేసి చర్చలు చెయ్యడం సాగించాడు. కులవ్యవస్థను ధిక్కరించడం మొదలుపెట్టాడు. మంత్రిగారే అలా ఉంటె ఇక సమాజం ఎలా ఉంటుంది? నిమ్నకులాల వారికి ఆయన ఒక దేవునిలా కనిపించాడు. వారందరూ ఆయన చుట్టూ చేరి ఒక ప్రవక్తగా ఆయన్ను కొలవడం ప్రారంభించారు. అతి త్వరలో ఆయన పాపులారిటీ రాజును మించిపోయింది.

ఈయన అనుచరుల్లో నిమ్న కులాలకు చెందినవారు ఎందఱో ఉన్నారు. వారందరూ లింగధారులుగా మారారు. వారికి కులం లేదు. లింగాయతమే వారి కులం, అదే వారి మతం. వారు దేవాలయాలకు వెళ్ళరు. పూజలు చెయ్యరు. ఆచారాలు పాటించరు. శివభక్తి ఒక్కటే వారి మతం. ఇష్టలింగం అనే ఒక లింగాన్ని రుద్రాక్ష దండలో వేసి మెడలో ధరిస్తారు. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. వారికి పూజారులు, పురోహితులు అవసరం లేదు. తంతులు పాటించరు. శివుడిని డైరెక్ట్ గా ధ్యానిస్తారు. ఉపాసన, ధ్యానం, జ్ఞానం, శివైక్యం - ఇదే వారి దారి.

అనుభవ మంటపంలో గురువు అల్లమప్రభు. ఈయన మహా శివభక్తుడు. ఈయన దేవాలయంలో డోలు వాయించే వృత్తికి (బహుశా మంగలి కావచ్చు) చెందినవాడు. ఒక నర్తకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె చనిపోగా ఈయన వైరాగ్యపూరితుడై కొండల్లో కోనల్లో తిరుగుతూ ఒక గుహలో ఒక సిద్ధయోగిని కలిసి ఆయన శిష్యుడై సాధన గావించి జ్ఞానాన్ని పొందాడు. అనుభవ మంటపంలోనే అక్కమహాదేవి కూడా ఉండేది. మాలకక్కయ్య, మాదిగ హరలయ్య, మడివాల మచ్చయ్య (జాలరి), హడపాద అప్పన్న (మంగలి), మాదర చెన్నయ్య (మాదిగ), నూళియ చందయ్య (పద్మసాలి), అంబిగర చౌడయ్య (పడవ నడిపే కులం)  మొదలైన శివభక్తులు కూడా అందులోనే మహామంత్రి అయిన బసవన్నతో సమానంగా ఆసీనులయ్యేవారు. బసవన్న స్వయంగా అల్లమప్రభు పాదాలవద్ద కూచునేవాడు. ఆ మంటపంలో అసలైన, నిజమైన, ఆధ్యాత్మిక చర్చలు జోరుగా సాగేవి. ఉత్త చర్చలతో కాలం గడపడం కాకుండా వారందరూ ఉన్నతమైన ఆశయాలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాలను గడిపేవారు. కలసి మెలసి కులాలకు అతీతంగా ఉండేవారు.

ఈ విధంగా అనుభవ మంటపంలో కులాన్ని రూపుమాపాడు బసవన్న. ఈయన అనేక చిన్న చిన్న పద్యాలలో తన భావాలను చెప్పాడు. వాటిని 'వచనాలు' అంటారు. ఆయనే గాక అల్లమప్రభు, అక్కమహాదేవి వంటి మిగతా శివభక్తులు కూడా 'వచనాలు' చెప్పారు. అవి అర్ధగాంభీర్యంలో గాని, సత్యప్రకటనలో గాని చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ ఆధ్యాత్మికంగా సత్యాలే. అయితే, వాటన్నిటినీ ఒకేసారిగా సమాజం మొత్తానికీ అప్లై చేసి సమాజం మొత్తాన్నీ ఏకమూలంగా మార్చి పారేయ్యలన్న వీరి ప్రయత్నమే బెడిసికొట్టింది. 

ఇదిలా ఉండగా, శీలవంతుడనే పేరుగల మాదిగ హరలయ్య కొడుకుతో, తన శిష్యుడైన మధువరసు అనే బ్రాహ్మణుని కూతురైన కళావతికి దగ్గరుండి వివాహం చేయించాడు బసవన్న. వెయ్యి సంవత్సరాల క్రితం సమాజంలో ఇదెంత సాహసోపేతమైన చర్యో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంఘటన అగ్రవర్ణాలకు చాలా కోపాన్ని తెప్పించింది. వారంతా కలసి మూకుమ్మడిగా బిజ్జలుడికి ఫిర్యాదు చేశారు. సమాజం పూర్తిగా భ్రష్టు పట్టిందనీ, కులవ్యవస్థ బీటలు వారిందనీ, దీనికంతా మంత్రిగారే కారకుడనీ, అందువల్ల రాజు వెంటనే జోక్యం చేసుకోకపోతే రాజ్యం అల్లకల్లోలం అవ్వబోతున్నదనీ, విప్లవం రాబోతున్నదనీ రాజుకు బాగా ఎక్కించారు. రాజును దించేసి బసవన్నే రాజయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆయనకు బాగా నూరిపోశారు. 

అప్పటికే బసవన్న చేస్తున్న పనులను రాజు వేగులద్వారా చాలాసార్లు విని ఉన్నాడు. కానీ బసవన్న తన బావమరిది గనుక, చెల్లెలి ముఖం చూచి వెంటనే చర్య తీసుకోలేక, ఊరుకునేవాడు. కానీ బసవన్న ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. సమాజమే కుప్పకూలే పరిస్థితి వచ్చేస్తున్నది. ఇలాంటి కుట్ర జరుగుతుంటే ఏ రాజు చూస్తూ ఊరుకుంటాడు? కోపోద్రిక్తుడైన రాజు, మంత్రి బసవన్నను పిలిచి మంత్రిపదవికి వెంటనే రాజీనామా ఇవ్వమని ఆదేశించాడు. బసవన్న అలాగే చేశాడు. తన కిరీటాన్ని తీసి రాజు పాదాల వద్ద ఉంచి ఒక సామాన్యునిగా సమాజంలోకి వెళ్ళిపోయాడు.

బిజ్జలుడు అంతటితో ఊరుకోలేదు. ఆ తర్వాత, తమ పిల్లలకు అలాంటి పెళ్లి చేసినందుకు హరలయ్యకూ, మధువరసుకూ కళ్ళు పీకించి వారిని మదపుటేనుగు కాళ్ళకు గొలుసులతో కట్టించి ఆ ఏనుగును కల్యాణి నగరపు వీధుల్లో పరిగెత్తించాడు. ఒళ్లంతా రక్తగాయాలై తలలు పగిలి వారిద్దరూ చనిపోయారు. ఎదురు తిరిగిన లింగాయతులను క్రూరంగా అణచి వెయ్యమని సైన్యాన్ని ఆదేశించాడు రాజు.

రాజ్యంలో విప్లవం రేగింది. ప్రజలు సైన్యానికి ఎదురు తిరిగారు. లింగాయతులలో కొంతమంది యుద్ధవిద్యా నిపుణులున్నారు. వారంతా కలసి సమయం కోసం వేచి చూచి, ఒకరోజున గెరిల్లా పద్ధతిలో రాజును ఎటాక్ చేసి చంపేశారు. ఆ విధంగా హరలయ్య మధువరసుల హత్యలకు వారు ప్రతీకారం తీర్చుకున్నారు. బిజ్జలుని కథ అలా విషాదంగా ముగిసింది.

ఇదంతా చూచి బసవన్నకు మహా విరక్తి కలిగింది. "తను ఆశించినదేమిటి? జరిగినదేమిటి? కులానికి అతీతంగా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయాలతో కూడిన సమాజాన్ని నిర్మిద్దామని తను ఊహిస్తే, అది ఒక విప్లవంగా మారి రాజ్యాన్నే అల్లకల్లోలం చేసింది. రాజు హత్యకు కారణమైంది. రాజు తన బావగారు కూడా. రాజు భార్యకూ, తన భార్యకూ తనేం సమాధానం చెప్పాలి? తన అనుచరులైన హరలయ్యకూ, మధువరసుకూ కూడా భయంకరమైన మరణం ప్రాప్తించింది. వారి కుటుంబమూ తన కుటుంబమూ మొత్తం చిన్నాభిన్నం అయిపోయాయి. ఇంకా ఎందఱో తన శిష్యులు సైన్యంతో జరిగిన గొడవల్లో చనిపోయారు. బహుశా తన ఊహ తప్పేమో? తను చాలా తొందరపడ్డాడేమో? అలాంటి ఉన్నతమైన సమాజవ్యవస్థను అప్పుడే ఊహించడం తన తప్పేమో? ఇలాంటి సమాజం రావడానికి ఇంకా కొన్నివేల ఏళ్ళు పట్టవచ్చేమో? ఏదేమైనా ఇందరి చావులకు తనే కారణం అయ్యాడు కదా?" అన్న పశ్చాత్తాపం ఆయనలో తీవ్రంగా తలెత్తింది. 

ఆ మనోవ్యధతో కూడలసంగమ క్షేత్రంలో ఉన్న తన గురువు ఆశ్రమానికి వెళ్లి తిండి మాసేసి, కఠోర ఉపవాసదీక్షలో ఉంటూ ఒక ఏడాది తర్వాత అక్కడే చనిపోయాడు. అప్పటికి అతనికి 35 ఏళ్ళు మాత్రమే. అక్కడ కృష్ణానదిలోకి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు. కాదు, హత్య చెయ్యబడ్డాడని కొందరు అంటారు. నిజానిజాలు ఎవరికీ తెలీదు. ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలూ చనిపోయారు. ఏదేమైనా బసవన్న కధ ఆ విధంగా విషాదాంతం అయింది. ఇదంతా క్రీ.శ.1100 ప్రాంతంలో జరిగింది.

కానీ, ఆయన ఆశించిన కులరహిత సమాజం మాత్రం ఇంతవరకూ మన దేశంలో రాలేదు. ఇకముందు వస్తుందని కూడా భరోసా లేదు.

ఇదిలా ఉంటే, కాలక్రమేణా, ఆయన అనుచరులైన లింగాయతులు కన్నడదేశంలో తామరతంపరలుగా వృద్ధి చెందారు. ఇప్పుడు కర్ణాటకలో వారొక బలమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. అక్కడి ముఖ్యమంత్రులలో చాలామంది లింగాయతులే. ఇప్పుడు వాళ్ళందరూ కలసి ఒక కొత్త పాట మొదలు పెట్టారు. అదేమంటే - మేం హిందువులం కాము. మాది హిందూమతం కాదు. కనుక మాకు ప్రత్యేక మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి - అని.

పేపర్లో వీళ్ళ గోల చదువుతుంటే నాకు నవ్వాలో ఏడవాలో ఇంకేదైనా చెయ్యాలో ఏమీ అర్ధం కాలేదు. హిందూ సమాజంలో వీరిది ఒక సంస్కరణోద్యమం. అంతే. అంత మాత్రం చేత వీరు హిందువులు కాకుండా ఎలా పోతారు? గతంలో సిక్కులు కూడా ఇలాగే మాది హిందూమతం కాదన్నారు. శిక్కు అనే పదానికే శిష్యుడు అని అర్ధం. వారి ఫిలాసఫీ అంతా హిందూత్వమే. కొన్నికొన్ని ఇస్లాం నుంచి కూడా వారు స్వీకరించి ఉండవచ్చుగాక. కానీ ఆ ఇస్లాం కూడా హిందూమతంలోని ఒక శాఖ మాత్రమే. ఏకేశ్వర వాదం హిందూమతంలో కూడా ఉంది. హిందూమతంలో లేనిది ఏ మతంలోనూ ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అన్ని మతాలూ హిందూమతపు విభిన్న శాఖలే.

లింగాయతులు, మాది ప్రత్యెక కులం అంటున్నారు. కానీ కులవ్యవస్థకు వారి మూలపురుషుడైన బసవన్న వ్యతిరేకం అన్నమాటను వారు మర్చిపోతున్నారు. ఈ ఉద్యమంలోనే ఆయన కుటుంబం మొత్తం వెయ్యేళ్ళ క్రితమే సర్వనాశనం అయింది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇదెలా ఉందంటే - భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టిన కమ్యూనిజం అధికారంలోకి వచ్చాక అదొక నయా భూస్వామి వ్యవస్థగా రూపుదిద్దుకున్నట్లుగా ఉంది. 

కులానికి వ్యతిరేకంగా పుట్టిన ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తలు తామే ఒక ప్రత్యేక కులంగా మారడం చూస్తుంటే ఏమనిపిస్తోంది? మన దేశంలో కులం అనేది మాయం కావడం అసంభవం అన్న నా మాట నిజం అనిపించడం లేదూ?

బసవన్న మీద కన్నడంలో వచ్చిన రెండు సినిమాలను ఇక్కడ యూట్యూబులో చూడండి.

Jagajyothi Basaveshwara 1959 Movie

https://www.youtube.com/watch?v=B6wHMFAKe8k

Kranti Yogi Basavanna Movie

https://www.youtube.com/watch?v=nIr0RRgxvi4


read more " కలబురిగి కబుర్లు - 2 "

22, నవంబర్ 2017, బుధవారం

Sata Sata Ke Hame - Mehdi Hassan


Shahansha-E-Ghazal మెహదీ హసన్ తన అమరస్వరంలో అద్భుతంగా ఆలపించిన ఈ ఘజల్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే గీతం. ఇది వఫా రూమాని వ్రాయగా నజర్ హుసేన్ సంగీతాన్నిచ్చిన గీతం.

కృష్ణుని ఎడబాటును భరించలేక రాధ ఆలపించిన గీతంగా దీనిని భావించవచ్చు. నా స్వరంలో కూడా ఈ అమరగీతాన్ని వినండి మరి.

Genre:-- Non Filmi Ghazal
Lyrics:--Wafaa Roomani
Music:-- Nazar Husen
Singer:-- Mehdi Hasan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------
Sataa sataa ke hame Ashkbaar karti hai
sataa sataa ke hame Ashkbaar karti hai
tumhaari yaad bahut beqaraar karti hai
sataa sataa ke hame

wo din jo saath - guzaare the pyaar me hamne
wo din jo saath - guzaare the pyaar me hamane
talaash unko nazar baar baar karti hai
tumhaari yaad bahut beqaraar karati hai
sataa sataa ke hame

gilaa nahi jo - nasibo ne - kar diyaa hai judaa
gilaa nahi jo - nasibo ne - kar diyaa hai judaa
teri judaai bhi ab - hamko pyaar karati hai
tumhaari yaad bahut beqaraar karti hai
sataa sataa ke hame

kanaare baith ke jiske kiye the kaul-o-qaraar
kanaare baith ke - jisake kiye the kaul-o-qaraar
nadi wo ab bhi teraa - intzaar karti hai
tumhaari yaad bahut beqaraar karti hai

sataa sataa ke hame ashkbaar karati hai
tumhaari yaad bahut beqaraar karati hai
sataa sataa ke hame

Meaning

Your memory is making me desperate
It is torturing me
and making me tearful

That day
When we roamed together in love
my mind is searching for that memory again and again
Your memory is making me desperate
It is torturing me

This is not a complaint
But fate has separated us badly
Now, your absence is the only thing
that is loving me
Your memory is making me desperate
It is torturing me

Sitting on the banks
to whom we made promises of love
that river is still waiting for you

Your memory is making me desperate
It is torturing me
and making me tearful

తెలుగు స్వేచ్చానువాదం

నీ జ్ఞాపకం నన్ను సతాయిస్తోంది
అది నాకు కన్నీరు రప్పిస్తోంది
నన్ను నిరాశలో ముంచేస్తోంది

ఆరోజు....మనం ప్రేమలో కలసి విహరించిన రోజు
ఆ రోజును నా మనసు మర్చిపోలేకుండా ఉంది
పదే పదే ఆ రోజును అది నెమరు వేస్తోంది
నీ జ్ఞాపకం నన్ను సతాయిస్తోంది

ఇది ఫిర్యాదు కాదు
కానీ విధి మనల్ని క్రూరంగా విడదీసింది
ఇప్పుడు నీ ఎడబాటే నన్ను ప్రేమిస్తోంది

ఏ ఒడ్డున కూర్చొని
మనం ప్రశాంత ప్రేమైక వాగ్దానాలు చేసుకున్నామో
ఆ నది ఇంకా నీకోసం వేచి చూస్తూనే ఉంది

నీ జ్ఞాపకం నన్ను సతాయిస్తోంది
అది నాకు కన్నీరు రప్పిస్తోంది
నన్ను నిరాశలో ముంచేస్తోంది
నీ జ్ఞాపకం....
read more " Sata Sata Ke Hame - Mehdi Hassan "

20, నవంబర్ 2017, సోమవారం

పంచరు - రిపేరు

ఈ రోజుల్లో యోగసాధన అనేది ఒక ఫేషన్ అయిపోయింది. నేను చెబుతున్నది మామూలు యోగాసనాల గురించి కాదు. ప్రాణాయామ, ధ్యాన, ధారణాది క్రియలతో కూడిన హయ్యర్ యోగా గురించే నేను చెబుతున్నాను.

హయ్యర్ యోగాను ఎవరు బడితే వారు చెయ్యకూడదు. ఎందుకంటే దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. దానివల్ల మానసికంగా ప్రాణికంగా చాలా మార్పులు మనిషిలో కలుగుతాయి. వాటిని ఆ గురువు సరిచెయ్యలేకపోతే ఆ సాధకుని పరిస్థితి చాలా దారుణంగా తయారౌతుంది.

యోగాసనాలను కొంచం అటూ ఇటూగా తప్పుగా చేసినా పెద్ద హాని ఏమీ జరగదు. ఎందుకంటే అవి శరీర పరిధిని దాటి పైకి పోవు. కానీ హయ్యర్ యోగిక్ క్రియలతో ఆటలాడితే మనిషికి మెంటల్ వస్తుంది. ఎందుకంటే అవి సూటిగా సెంట్రల్ నెర్వస్ సిస్టం మీదా, మెదడు మీదా ప్రభావం చూపిస్తాయి.కనుక వాటిని సరియైన గురువు పర్యవేక్షణలో ఎంతో నిష్టగా చెయ్యవలసి ఉంటుంది. అలా కుదరనప్పుడు వాటి జోలికంటూ అస్సలు పోకుండా మామూలు యోగాసనాలను ఒక వ్యాయామంలాగా చేసుకోవడమే మంచిది. కనీసం హెల్త్ అయినా బాగుంటుంది.

ఈ విషయం నేను ఎప్పటినుంచో నేనెరిగిన వారికి చెబుతూనే ఉన్నాను. కొంతమంది నమ్మారు. చాలామంది నమ్మలేదు. కానీ ఈ మధ్యన నాకెదురౌతున్న కేసులు చూస్తుంటే నేను చెబుతున్నది నిజమే అని అందరూ నమ్ముతున్నారు.

ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.

మొన్నీ మధ్యన కోయంబత్తూర్ నుంచి ఒక ఫోనొచ్చింది. దాని సారాంశం ఏమంటే - ఒక 26 ఏళ్ళ అమ్మాయి, ఇంకా పెళ్లి కాలేదు, గత రెండేళ్ళ నుంచీ సద్గురు జగ్గి వాసుదేవ్ గారి దగ్గర శాంభవీ మహాముద్ర, శక్తి సంచాలన క్రియలు దీక్ష తీసుకుని పట్టుగా సాధన చేస్తోంది. తత్ఫలితంగా ఆ అమ్మాయి శరీరంలో చాలా మార్పులు వచ్చేశాయి.

తను బాగా చదువుకున్నది. గూగుల్ లో ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఈ మార్పుల వల్ల ఉద్యోగం మానెయ్యవలసిన పరిస్థితి వచ్చేసింది. మానేసింది. తన సాధనా ఫలితంగా ఈ మార్పులు తనలో కలిగాయని ఇంకా కలుగుతున్నాయని నాకు చెప్పింది.

ఆ మార్పులేంటో వినండి మరి !!

> తన ఒంట్లో ఎడమ వైపు అంతా తనకు స్పర్శ పోయింది. అసలు తన శరీరం ఎడమ భాగం ఉందో లేదో కూడా తనకిప్పుడు స్పృహ లేదు. కుడివైపు మాత్రమే ఫీల్ ఉన్నది.

> టైం సెన్స్ అనేది ఈ అమ్మాయికి పూర్తిగా పోయింది. ఇప్పుడు టైమెంత? అని అడిగితే ఎండను చూచో రాత్రిని చూచో ఇది ఉదయం అనో, మధ్యాన్నం అనో, లేదా సాయంకాలం అనో మనం చెప్పగలం. కానీ ఈ అమ్మాయి ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది.

> శరీరం అంతా కరెంట్ పాసవుతున్నట్లుగా ఫీలింగ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ షాకులు కొడుతున్నట్లుగా ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది.

>ఆకలి నశించింది. ఏదీ తినాలని అనిపించదు. బలవంతాన టైముకు తినడమే.

> నిద్ర తగ్గిపోయింది. రాత్రిలో మూడు గంటలు నిద్రపోతే సరిపోతుంది. తెల్లవారుజామున మూడు నాలుగుకు అదే మెలకువ వచ్చేస్తుంది. ఇక నిద్ర పట్టదు.

> ఏ పనీ చెయ్యాలనిపించదు. నీరసంగా నిస్సత్తువగా ఉంటుంది. ఎప్పుడూ పడుకొని ఉండాలనిపిస్తుంది.

ఈ లక్షణాలు చెప్పి తనిలా అడిగింది.

'మీ ఇంగ్లీష్ బ్లాగ్ నేను చూచాను. అందులో ఒకచోట మీరు 'ఒక మనిషిని చూస్తేనే అతని ఆధ్యాత్మిక స్థాయి ఎంతటిదో నాకు తెలిసిపోతుంది' అని వ్రాశారు. అది చదివి మీకు ఫోన్ చేస్తున్నాను. నా పరిస్థితి ఇలా ఉంది.మీరు నాకేమైనా సాయం చెయ్యగలరా?'

నేనామెను ఇలా అడిగాను.

'చూడమ్మా. నీకు దీక్షనిచ్చిన గురువు బ్రతికే ఉన్నాడు. మీ ఊళ్లోనే ఉంటాడు కదా. ఆయన్ను వెళ్లి కలువు. నీ పరిస్థితి చెప్పు. సరిచెయ్యమని అడుగు. అదే సరియైన పద్ధతి. అంతేగాని దీక్ష ఒకరి దగ్గరా, కరెక్షన్ ఇంకొకరి దగ్గరా పనికిరాదు.' అన్నాను.

'మీరు నాకు సాయం చెయ్యలేరా?' అడిగింది నీరసంగా.

పాపం ఒక ఆడపిల్ల అలా అడుగుతుంటే బాధనిపించింది. సామాన్యంగా ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. అది ఆధ్యాత్మిక లోకపు నియమాలకు విరుద్ధం అవుతుంది. ఆయన బ్రతికి లేకుంటే అది వేరే విషయం. కానీ ఆయన జీవించే ఉన్నప్పుడు మనం కల్పించుకోకూడదు. ఎక్కడ పంచర్ పడిందో అక్కడే రిపేరు జరగాలి. అంతేగాని ఒకచోట పంచరూ ఇంకోచోట రిపేరూ పనికిరావు. కానీ ఈ అమ్మాయి దీనంగా అడుగుతుంటే మనసొప్పక ఇలా చెప్పాను.

'సరేనమ్మా చేస్తాను. నీవు గుంటూరుకు వచ్చి మా కుటుంబంతో కలసి మా ఇంట్లో మూడు రోజులుండు. నీ పరిస్థితి బాగు చేస్తాను. నీకు పెళ్లి కాలేదని అంటున్నావు. నా దగ్గరకు వస్తున్నానని మీ అమ్మానాన్నలతో  చెప్పి, వారి పర్మిషన్ తీసుకుని రా. చెప్పకుండా రావద్దు. నేనూ నా భార్యా స్టేషన్ కు వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాము. మళ్ళీ భద్రంగా మూడ్రోజుల తర్వాత రైలెక్కిస్తాము.' అన్నాను.

'చెబితే మా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో?' అంది ఆ అమ్మాయి.

'చెప్పకుండా నువ్వు రావద్దు. అది మంచి పద్ధతి కాదు. చెప్పి, వాళ్ళు ఒప్పుకుంటేనే రా. లేకుంటే రావద్దు.' అని ఖండితంగా చెప్పాను.

'మూడ్రోజులలో మీరు నా పరిస్థితి బాగు చెయ్యగలరా అసలు?' అడిగింది ఆ అమ్మాయి అనుమానంగా.

ఈ అమ్మాయికి నిజాయితీ లేదనీ, శ్రద్ధ లేదనీ నాకు అర్ధమై పోయింది. ఊరకే నెట్లో చూసి నాలుగు రాళ్ళు విసురుతోంది. అంతే.

'చూడమ్మా. బాగు చేస్తానని నేను గ్యారంటీ ఇవ్వలేను. ప్రయత్నం చేస్తాను. కానీ ఒక షరతు. నువ్వు నా మార్గాన్ని అనుసరించాలి. నేనేమీ మాయమంత్రాలు ఉపయోగించను. నీ ప్రస్తుత పరిస్థితి ఎందుకొచ్చిందంటే, మీ గురువు గారు నేర్పిన అభ్యాసాలను నువ్వు చెయ్యడం వల్ల వచ్చింది. అవి ఆయన ఎలా నేర్పారో, నువ్వు సరిగా చేస్తున్నావో లేదో నాకు తెలీదు. అదంతా నాకనవసరం.

నీకు నా హెల్ప్ కావాలంటే, ముందు నువ్వు సద్గురు దగ్గర నేర్చుకున్న అభ్యాసాలు వెంటనే మానుకోవాలి. నేను చెప్పిన అభ్యాసాలు చెయ్యాలి. అంటే నువ్వు నా మార్గంలోకి వచ్చి నా శిష్యురాలిగా మారాలి. నేను చెప్పినట్లు వినాలి. అప్పుడు నీ బాధలు నయం చెయ్యగలను. అంతేగాని ఏదో మంత్రం వేసి నీ బాధలను నేను మాయం చెయ్యలేను. నీకిష్టమైతే రా.' అన్నాను.

ఆ అమ్మాయి కాసేపు ఆలోచించింది.

'మీదే మార్గం?' అడిగింది.

'నాదీ యోగమార్గమే. అయితే నా మార్గం ప్రస్తుతం నువ్వు అనుసరిస్తున్న దానికంటే విభిన్నంగా ఉంటుంది. అదంతా ఎలా ఉంటుందో నీకు వివరించి చెప్పడం ఫోన్లో సాధ్యం కాదు. నా బ్లాగు పూర్తిగా చదువు. నీకు కొంత ఐడియా వస్తుంది.' అని చెప్పాను.

'నేను మా గురువుకు అన్యాయం చెయ్యలేను. ఆయన్ను విడిచి పెట్టలేను.' అంది.

'సంతోషం అమ్మా. నీ గురుభక్తి బాగుంది. ఆయన్ను విడిచి పెట్టమని నేనూ చెప్పడం లేదు. ఆయన్నే అనుసరించు. ఆయన్నే కలిసి నీ సమస్యలు వివరించు.అదే మంచి పని. అదొక్కటే నీకున్న మార్గం.ఎందుకంటే - ఆయన నీకేం నేర్పించారో నాకు తెలీదు. వాటిని నువ్వెలా చేస్తున్నావో అసలే తెలీదు. ఆయన చెప్పినది నీకు సూటవక పోయినా ఇలా జరిగే అవకాశం ఉంది. లేదా ఆయన చెప్పిన దాన్ని నువ్వు సరిగ్గా చెయ్యకపోయినా కూడా ఇలా జరగొచ్చు. సరిగ్గా చేస్తున్నా కూడా జరగోచ్చు. ఏది ఏదైనా దీనిని సరి చెయ్యవలసింది నీకు దీక్షనిచ్చిన గురువే. కనుక ఆయన్నే కలువు.' అని చెప్పాను.

'కానీ ఆయనిప్పుడు మాకందే స్థాయిలో లేరు. మామూలు మనుషులకు ఆయన ఇంటర్వ్యూ ఇప్పుడు దొరకదు. ఆయన శిష్యులో, ఆ శిష్యుల శిష్యులో మాకు చెబుతారు. వారినే మేం కలవాలి.' అంది.

'పోనీ వారినే కలువు. ఎవరైనా సరే, ఆయన చెప్పిన అభ్యాసాలే కదా మీకు నేర్పించేది?' అన్నాను.

'అలా కాదు. మా గురువు ఇప్పటికే కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరకు వెళ్లి, మీరు చెప్పినవి చేసినందువల్ల మాకిలా అవుతోంది అని చెబితే, అది పబ్లిసిటీ అయితే, ఆయనకింకా చెడ్డపేరు వస్తుంది. అది నాకిష్టం లేదు.' అంది.

ఈ అమ్మాయి లాజిక్ ఏంటో నాకర్ధం కాలేదు.

'నీ జనన వివరాలు నీకు తెలిస్తే చెప్పమ్మా?' అడిగాను.

' తెలుసు' అని జనన తేదీ, సమయం, పుట్టిన ఊరు చెప్పింది.

వెంటనే పక్కనే ఉన్న లాప్ టాప్ లో జాతక చక్రం ఓపన్ చేశాను. చూస్తూనే విషయం మొత్తం అర్ధమైంది. ఈ అమ్మాయి జాతకంలో ఆధ్యాత్మిక యోగాలున్న మాట వాస్తవమే. అయితే పురోగతికి ప్రతిబంధకాలు కూడా గట్టిగానే ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే గాని ఈ అమ్మాయి ఆధ్యాత్మికంగా ఎదగలేదు.

'చూడమ్మా. ముందుగా నీకు కావలసింది ఏమిటి? నీ ఆరోగ్యం బాగు పడటమా? లేక మీ గురువుకు మంచి పేరు రావడమా? అది తేల్చుకో ముందు' అన్నాను.

'రెండూ కావాలి' అంది ఆ అమ్మాయి మొండిగా.

ఇది జరిగేపని కాదని నాకర్ధమైపోయింది. 'సరేనమ్మా. ఈ విషయంలో నీకు సాయం చేద్దామని ముందుగా అనుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను. నేను నీకేమీ సాయం చెయ్యలేను. సారీ! నీకు తోచిన ప్రయత్నాలు చేసుకో. ఎందుకంటే, ఎక్కడ పంచర్ అయిందో అక్కడే రిపేర్ కూడా జరగాలి. కానీ ఒక్క మాట విను. ఇవే అభ్యాసాలు ఇంకొన్ని నెలలు గనుక ఇలాగే చేశావంటే నువ్వు మెంటల్ హాస్పిటల్లో తేలతావు. అసలే చిన్నపిల్లవి. ముందు ముందు పెళ్లి కావాలి. జీవితం బోలెడంత ఉంది. బాగా ఆలోచించుకొని ఏ అడుగైనా వెయ్యి' అన్నాను.

'ఓకె. థాంక్స్' అని కరుకుగా అని ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి.

ఇలాంటివాళ్ళు ఈ మధ్యన చాలామంది కనిపిస్తున్నారు. జస్ట్ ఫోన్ కాల్ తో వీళ్ళకన్నీ అయిపోవాలి.బస్సు టికెట్లూ, రైలు టికెట్లూ, సినిమా టికెట్లూ. బ్యాంకు పనులూ వగైరాలన్నీ ఇప్పుడలాగే ఫోన్ మీదే అవుతున్నాయి కదా. అలాగే ఆధ్యాత్మికం కూడా ఫోన్లోనే అయిపోవాలి. ఊరకే ఫోన్ చెయ్యగానే వీళ్ళ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి. ఈ విధంగా ఆశిస్తున్నారు. ఇదొక సామూహిక గ్రహప్రభావం. వేలాది లక్షలాది మందిని ప్రభావితం చేసే ఇలాంటివన్నీ ఔటర్ ప్లానెట్స్ అయిన యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ల ప్రభావం వలన జరుగుతూ ఉంటాయి. 

హయ్యర్ యోగక్రియలను అభ్యాసం చెయ్యాలంటే ముందుగా మన దేహాన్ని మన మనస్సును దానికి తగినట్లుగా తయారు చేసుకోవాలి. ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి, వ్యవహారంలో మార్పులు తెచ్చుకోవాలి. జీవన విధానంలో మార్పులు రావాలి. మాటలో చేతలో అన్నిట్లో మార్పులు రావాలి. ఆ విధంగా భూమిని సిద్ధం చేసిన తర్వాత హయ్యర్ యోగ క్రియలనే విత్తనాలు నాటితే అవి చక్కగా ఫలించి మంచి పండ్లను కాస్తాయి. అలా కాకుండా రెండునెలలు మూడునెలల కోర్సులలో ఫాన్సీగా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని అభ్యాసాలు చేస్తూ, ఆహార విహారాలలో మనిష్టం వచ్చినట్లు ఉంటూ ఉంటే, ఇలాంటి బాధలే కలుగుతాయి.

ముందే చెప్పినట్లు, ఈ క్రియలు మన నాడీ వ్యవస్థ మీద అమితమైన ప్రభావం చూపిస్తాయి. ఆ మార్పులు హటాత్తుగా వస్తే శరీరం ఆ ఇంపాక్ట్ ను తట్టుకోలేదు. అలా తట్టుకోవాలంటే, శరీరాన్ని ముందుగా తయారు చెయ్యాలి. దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. అది ఒక్కరోజులో ఒక్క నెలలో జరిగే పని కాదు. కొన్నేళ్ళు పడుతుంది. అదంతా చెయ్యకుండా డైరెక్ట్ గా ఈ క్రియలు చేస్తే, ఎలా ఉంటుందంటే, అదాటున కరెంట్ ప్లగ్గులో వేలు పెట్టినట్లు ఉంటుంది. లేదా, మొదటి రోజునే ఫుల్ బాటిల్ ఎత్తి గడగడా త్రాగినట్లు ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ను శరీరం తట్టుకోలేదు. దేన్నైనా శరీరానికి నిదానంగా అలవాటు చెయ్యాలి. యోగాభ్యాసమైనా అంతే. అందుకే, దానిని చిన్న వయసులోనే మొదలుపెట్టాలి అంటారు. అదికూడా సమర్ధుడైన గురువు పర్యవేక్షణలోనే ఇదంతా చెయ్యవలసి ఉంటుంది. ఏదో దీక్ష ఇచ్చేసి ఆ తర్వాత గురువు జంప్ అయి పోతే ఆ శిష్యుల గతి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి !!

ఇవన్నీ తెలీకుండా నేడు చాలామంది హయ్యర్ యోగాతో ఆటలాడుతున్నారు. దాని ఫలితాలు ఇలా ఉంటున్నాయి. ఆయా గురువులకూ ఆయా శిష్యులకూ ఉన్న కార్యకారణ సంబంధాలను బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శిష్యుల ఖర్మ బాగుంటే బయట పడతారు. లేదంటే ఒళ్ళు గుల్ల చేసుకుని ఏ పిచ్చాసుపత్రిలోనో తేలతారు.

శారదామాత జీవించి ఉన్నపుడు ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఒకాయన ఇలాగే ఎక్కడో ప్రాణాయామాలు నేర్చుకుని ఊపిరి బిగబట్టి కుంభకం చేస్తూ ఉండేవాడు. దాని ఫలితంగా ఆయనకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎప్పుడూ తలలో 'ఝుం' అంటూ హమ్మింగ్ సౌండ్ వినిపిస్తూ ఉండేది. దాని ఫలితంగా నిద్రకూడా పట్టేది కాదు. పిచ్చేక్కే స్టేజిలో ఉన్నపుడు ఎవరో అమ్మ గురించి చెబితే వెళ్లి అమ్మను ప్రార్ధించాడు.

'అవన్నీ ఎందుకు నాయనా? ఆపెయ్యి. మూడ్రోజులు ఇక్కడే నా దగ్గర జయరాంబాటిలో ఉండు.అన్నీ సర్దుకుంటాయి.' అని శారదామాత అన్నారు. అలాగే మూడ్రోజుల్లో ఏమీ చెయ్యకుండానే అతనికి తలనెప్పీ ఆ ధ్వనీ అన్నీ మాయమై పోయాయి.

జిల్లెళ్ళమూడి అమ్మగారి జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇలాగే పిచ్చిపిచ్చి ప్రాణాయామాలూ, యోగసాధనలూ చేసి ఇలాంటి సమస్యలు తెచ్చుకున్న కొందరు అమ్మను సహాయంకోసం అర్ధిస్తే - 'జిళ్లెల్లమూడిలో కొన్ని రోజులుండండి. అదే తగ్గుతుంది.' అని అమ్మ చెప్పేవారు. వారలాగే, సాధనలన్నీ ఆపేసి, హాయిగా వేళకు తింటూ, అమ్మ సమక్షంలో ఉన్నంతమాత్రాన అవన్నీ సర్దుకునేవి. ఇలా ఎంతోమందికి జరిగింది.

యోగశక్తిని మించిన దైవశక్తితో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అందుకే సరియైన గురువు పర్యవేక్షణ లేకుండా హయ్యర్ యోగా ను ఎవరూ అభ్యాసం చెయ్యకూడదని, అలా చేస్తే పిచ్చెక్కే ప్రమాదం ఉందనీ మనవాళ్ళు అంటారు. అందులో చాలా నిజం ఉంది.

1970 వ దశకంలో చాలామంది మన ఇండియన్ గురువులు యూరప్ లోనూ అమెరికాలోనూ అడుగుపెట్టి ఇలాంటి హయ్యర్ యోగ క్రియలను అక్కడ తెల్లవాళ్ళకు నేర్పించారు. వారేమో వారి ఆహారపు అలవాట్లు మానుకోరు. విచ్చలవిడిగా మాంసం తినడం, త్రాగడం, సెక్సూ మానుకోరు. అదే సమయంలో ఈ హయ్యర్ యోగక్రియలను అభ్యాసం చేసారు. అలా చేసి చాలామంది మెంటల్ గా డిరేంజ్ అయ్యి పిచ్చాసుపత్రిలో చేరి అక్కడే చనిపోయారు. ఇలా జరిగినవాళ్ళు వందల సంఖ్యలో ఆయా దేశాలలో ఉన్నారు. ఓషో శిష్యులలో కూడా అనేకమంది ఇలాగే యోగక్రియలతో ఆటలాడి దెబ్బతిన్న వాళ్ళున్నారు. 

యమనియమాలు అభ్యాసం చెయ్యకుండా, నియమిత జీవనం గడపకుండా, కుంభక సహిత ప్రాణాయామమూ, ధారణా, ధ్యానాది హయ్యర్ యోగ క్రియలను అభ్యాసం చెయ్యడం ప్రమాదకరం. అది మన నెర్వస్ సిస్టం ను మనమే ధ్వంసం చేసుకున్నట్లు అవుతుంది. కానీ ఇదంతా ఎవరు వింటారు? ఖర్మ బలంగా ఉన్నప్పుడు ఎవరూ వినరు. అప్పుడిలాగే ఉంటుంది మరి !!

కుండలినిని పాముతో ఎందుకు పోల్చారో తెలుసా? కుండలినీ యోగం త్రాచుపాముతో చెలగాటం లాంటిది. సరిగ్గా ఆడించడం తెలియకపోతే దాని కాటు తినక తప్పదు.

'చెప్పలేదండనక పొయ్యేరు. జనులార మీరు తప్పుదారిన బట్టి పొయ్యేరు.' అని బ్రహ్మంగారు ఊరకే పాడలేదుగా !! కలియుగంలో జరిగే అనేక మాయలలో ఇదొక ఆధ్యాత్మికమాయ గామోసు. మనమేం చెయ్యగలం?
read more " పంచరు - రిపేరు "

19, నవంబర్ 2017, ఆదివారం

నీకు చుక్క కనిపిస్తుందా??

లలితా సహస్రనామాల మీద ఈ మధ్యనే నేను వ్రాసిన పుస్తకం అచ్చు పనుల కోసం రామారావును కలుద్దామని మొన్నీ మధ్య విజయవాడలోని డీటీపీ సెంటర్ కు వెళ్ళాను. ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ ఒక పెద్దాయన కూచుని రామారావుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయం పూట అయితే ఎవరూ వచ్చి డిస్టర్బ్ చెయ్యరని మా ఉద్దేశ్యం. అందుకని పొద్దున్నే మా పని పెట్టుకుంటూ ఉంటాం. కానీ షాపు తెరిచి కనిపిస్తే చాలు ఎవరో ఒకరు వచ్చి కాలక్షేపం కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో రిటైరైన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరికి శ్రోతలు కావాలి. పాపం ఎవరూ వాళ్ళను పట్టించుకోరు. అందుకని ఎవరు బకరాలు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు.

కాసేపు షాపు బయట వెయిట్ చేశాను ఆయన లేచి పోతాడేమో అని. కానీ ఆయన కదిలే రకంలాగా కనిపించలేదు. ఇక ఇలా కాదని నేనూ లోపలకు వెళ్లాను.

నన్ను చూస్తూనే - 'ఈయన కూడా సాధకుడే మీలాగా' అంటూ రామారావు నన్ను పరిచయం చేశాడు ఆయనకు.

ఆయన వయస్సు డబ్బై ఎనభై మధ్యలో ఉంటుంది. వయసుతో పాటు వచ్చిన చెవుడు కూడా ఆయనకు ఉన్నట్టుంది నా వైపు ఎగాదిగా చూశాడు.

చెప్పిందే ఇంకొంచం గట్టిగా చెప్పాడు రామారావు.

చెవుడు ఉన్నవాళ్ళకు రెండోసారి చెబితే చాలా కోపం వస్తుంది. అలాగే ఆయనకూ వచ్చింది. అర్ధమైందిలే అన్నట్టు విసుక్కుంటూ - 'ఏం సాధన చేస్తావు నువ్వు?' అన్నాడు నన్ను తేలికగా.

నేనేం మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాను.

ఆయన చేతిలో ఉన్న కాయితాలు గట్రా చూస్తే ఎవరికో ఏవేవో ఉత్తరాలు వ్రాసినట్లుగా ఉన్నాయి. నా చూపును గమనించి - 'ఇవన్నీ ఆయన తన అనుభవాలను ఎవరెవరో స్వామీజీలకు వ్రాసిన ఉత్తరాలు.అవి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు.' అని అన్నాడు రామారావు.

అలా అంటూ - 'ఈయనక్కూడా మంచి మంచి అనుభవాలున్నాయి' అన్నాడు నన్ను చూపిస్తూ.

'ఏం అనుభవాలయ్యాయి నీకు?' అన్నాడు ముసలాయన నన్ను చూస్తూ.

'ఏం అనుభవాలు చెప్పాలో ఈయనకు?' అన్న చిలిపి ఆలోచన నా ముఖంలో నవ్వును రప్పించింది. ఆయన ప్రశ్నకు అసలు జవాబే ఇవ్వలేదు నేను. నిరామయంగా ఆయన ముఖంలోకి చూస్తున్నాను.

'చుక్క కనిపిస్తుందా?' అడిగాడు పెద్దాయన.

'రోజూ కనిపిస్తూనే ఉంటాయి. చీకటి పడ్డాక' అన్నాను నేను భక్తిగా.

'ఆ చుక్కలు కాదు. ధ్యానంలో కళ్ళు మూసుకుంటే చుక్క కనిపిస్తుందా లేదా?' అన్నాడాయన స్వరం రెట్టించి.

'లేదు' అన్నట్లుగా తల అడ్డంగా ఆడించాను.

'నువ్వు వేస్ట్' అన్నట్లుగా నావైపు చూశాడాయన.

'చుక్క కన్పించాలి. పైకీ కిందికీ ఆడుతూ ముందుగా రెండు చుక్కలు కన్పిస్తాయి. ఆ తర్వాత రెండూ ఒకటే చుక్కగా మారిపోతాయి. అసలు చుక్క కనిపిస్తేనే నువ్వు యోగంలో మొదటి మెట్టు ఎక్కినట్లు లెక్క' అన్నాడాయన.

నేను అయోమయంగా ముఖం పెట్టాను.

'ప్రాణాయామం చేస్తావా నువ్వు?' అడిగాడాయన మళ్ళీ నావైపు నిర్లక్ష్య ధోరణిలో చూస్తూ.

'లేదు' అన్నాను.

'మరింక నీకేం పురోగతి ఉంటుంది? ప్రాణాయామం చెయ్యాలి. నేను నాలుగు సంవత్సరాల పది నెలల పాటు రెగ్యులర్ గా ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రాణాయామం చేశాను - నాలుగు సంవత్సరాల పది నెలలు.' అన్నాడాయన రెండోసారి రెట్టిస్తూ.

'అలాగా' అన్నట్లు జాలిగా ఆయనవైపు చూశాను.

నా చూపు ఆయనకు నచ్చలేదు.

'చూడండి నా అనుభవాలు !! ఇవన్నీ పెద్ద పెద్ద స్వామీజీలకు ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాను.' అన్నాడు తన చేతిలోని ఉత్తరాల కట్ట చూపిస్తూ.

'మన అనుభవాలు మనలోనే ఉంచుకోవాలి గాని ఇతరులకు చెప్పకూడదు.' అని గొణిగా నేను 'అనుభవాలు' అన్న పదాన్ని నొక్కుతూ.

ఆయనకు వినిపించలేదుగాని నేనేదో కామెంట్ చేసానని అర్ధమైంది.

మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో - 'పొద్దున్నే లేచి ప్రాణాయామం చెయ్యి. సూర్యుడు వచ్చాక చేసే సాధనకు ఫలితం ఉండదు. సూర్యోదయం ముందే మన సాధన అయిపోవాలి. అప్పుడు రోజంతా ఫ్రెష్ గా ఉంటుంది.' అన్నాడు.

'అవును. అప్పుడు బోలెడు సమయం ఉంటుంది గనుక పొద్దున్నే లేచి రోడ్లంబడి తిరుగుతూ ఉండచ్చు.' అన్నా నేను చిన్నగా.

ఆయనకు నా మాట అర్ధం కాలేదు.

'సాధన బాగా చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. చూడండి. నిన్ననే వీళ్ళ క్లాస్ కు వెళ్లి వచ్చాను.' అన్నాడు నాకొక పాంప్లెట్ చూపిస్తూ.

'అదేంటా?' అని ఆ కాయితం వైపు చూచాను. 'బాబాజీ భోగర్ మాతాజీ క్రియాయోగా' అంటూ ఏదేదో వ్రాసి ఉంది దానిమీద. అదాటున చూచి ' బాబాజీ బోగస్ మాతాజీ' అన్నట్లు కనిపించి చచ్చే నవ్వొచ్చింది.

నా నవ్వును చూచి ఆయనకు కోపం ఇంకా పెరిగిపోయింది. నా వైపు కోపంగా చూచాడు.

నేనేదో తప్పు చేసినవాడిలా ఫోజిచ్చి ఆయనవైపు దీనంగా చూచాను.

ఇదంతా ఆయనకే బోరు కొట్టినట్లు ఉంది. లేచి - 'సరే నే వస్తా' అని మాతో చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు.

'పద రామారావు టీ త్రాగి వద్దాం.' అన్నా నేనూ లేస్తూ.

'పదండి' అని తనూ లేచాడు.

దారిలో నడుస్తూ ఉండగా - 'అదేంటి సార్. ఆయన గొప్ప సాధకుడినని చెప్పుకుంటూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తూనే గుర్తు పడతాడని నేను అనుకున్నాను. అందుకే కొద్దిగా పరిచయం చేశాను. అలా మాట్లాడాడెంటి మీతో?' అన్నాడు.

'ఏమో నాకేం తెలుసు. ఆయన్నే అడగక పోయావా?' అన్నా నవ్వుతూ.

'ఇంకేం అడుగుతాం. ఆయన ధోరణి అలా ఉంటే' అన్నాడు.

'చెప్తా విను. ఆయన క్రియాయోగ సాధన చేస్తున్నాడు. ఆ సాధనా ప్రారంభంలో భ్రూమధ్యంలో వెలుగు చుక్క కన్పించడం సహజమే. అదేమీ పెద్ద అనుభవం కాదు. చాలా ప్రాధమికమైన అనుభవం అది. ఈయనకేమో డబ్భై దాటాయి. ముసలోడికి దసరా పండగ అన్నట్లు ఇదేదో పెద్ద గొప్ప అనుభవం అని అందరికీ ఉత్తరాలు వ్రాస్తున్నాడు. ఎవడి పిచ్చి వాడికానందం. అయిదేళ్ళ క్రితం సాధన మొదలు పెట్టానని చెబుతున్నాడు. అంటే - ఆయనకు ఏ అరవై ఐదో ఉన్నప్పుడు మొదలు పెట్టాడు. అప్పటికి శరీరంలో ఏం శక్తి ఉంటుంది? అంతా ఉడిగిపోయి ఉంటుంది. పైగా బ్రహ్మచారి కూడా కాదు, సంసారిలాగే ఉన్నాడు. కనుక ఇప్పుడెంత కొట్టుకున్నా ఆయనకు చుక్క తప్ప ఇంకేమీ కన్పించదు.' అన్నా.

'అంతేనంటారా?' అన్నాడు రామారావు.

'ఒక మార్గముంది' అన్నా సీరియస్ గా.

'ఏంటది' అడిగాడు.

'ఈ వయసులో ఆయన త్వరగా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఒకటే మార్గం ఉంది. అదేంటంటే - రోజూ చీకటి పడగానే చుక్కేసుకోని తొంగోవడమే..' అన్నా నవ్వుతూ.

'అవునా? మీరు దేన్నైనా జోకులెయ్యకుండా ఉండరు' అన్నాడు రామారావు నవ్వుతూ.

'హాస్యమే జీవితంలో ఖర్చులేని ఔషధం రామారావ్! అది సరేగాని, క్రియాయోగం అనేది వయసులో ఉన్నపుడు చెయ్యాలి. అప్పుడు శరీరంలో రీ ప్రొడక్టివ్ జ్యూసెస్ ఉంటాయి. అవి ఉన్నప్పుడే యోగసాధన ఫలిస్తుంది. అవి పోయాక ఏ సాధనా ఏ ఫలితాన్నీ ఇవ్వదు. మహా అయితే గంటలు గంటలు ప్రాణాయామం చేస్తే ఒక చుక్క కన్పించవచ్చేమో? ముందే చెప్పాకదా..అదేమీ పెద్ద గొప్ప ఫలితం కాదు.' అన్నా నేను.

'కానీ ఆయన మిమ్మల్ని గుర్తించలేకపోవడమే విచిత్రంగా ఉంది.' అన్నాడు.

'ఆయనకు చెవుడుతో బాటు చూపు కూడా మందగించినట్లుంది పాపం ! పోనీలే. రోడ్డుమీద పోతున్న ఏ చక్కని చుక్కనో చూచి తన పెళ్ళాం అనుకోకుంటే అంతే చాలు పాపం పెద్దాయనకు. ఈ ఫీల్డే అంత రామారావ్ ! ఇక్కడ ఒక నలభై రోజులు నల్లడ్రస్సు వేసుకుని గడ్డం పెంచుకున్న ప్రతివాడు కూడా పెద్ద లెవల్లో ఫీలై పోతూ ఉంటాడు.అదంతే. దీన్నే స్పిరిచ్యువల్ ఈగోయిజం అంటారు. ఈయన్నే చూడు. ఈపాటికి సాధన అయిపోయి ఒక ముప్పైఏళ్ళు గతించి ఉండాలి. కానీ ఈయనిప్పుడు క్లాసులని తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని చూచి మనం జాలిపడాలి అంతే!!

ఇంకో విషయం చెప్పనా? ఇలాంటి వాళ్ళు మనల్ని గుర్తించకపోవడమే మనకు పెద్ద వరం. గుర్తించారంటే ఇక మన వెంటపడి అది చెప్పు ఇది చెప్పు అని పీడిస్తారు. ఆ గోల మనం భరించలేం.' అన్నా నవ్వుతూ.

మాటల్లోనే 'స్టార్' టీ స్టాల్ వచ్చేసింది.

ఇద్దరం టీ సేవించడం మొదలు పెట్టాం !!
read more " నీకు చుక్క కనిపిస్తుందా?? "

Kabhi Khud Pe - Mohammad Rafi


Kabhi Khud Pe Kabhi Haalaat Pe Rona Aaya 

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1961 లో వచ్చిన Hum Dono అనే సినిమాలోది. ఇది ఏనాటికీ మరపురాని మధురగీతాలలో ఒకటి. ఈ పాటను రఫీ ఎంత సున్నితంగా ఎంత మంద్రంగా ఎంత హృద్యంగా ఆలపించాడో వింటేనే అర్ధమౌతుంది. ఈ పాటలో దేవానంద్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆ సన్నివేశం కూడా చూడవలసిందే.

ఈ గీతాన్ని సంగీత దర్శకుడు జయదేవ్ 'గారా' అనే శాస్త్రీయ రాగంలో స్వరపరచారు.

ఈ మధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Hum Dono (1961)
Lyrics:-- Sahir Ludhianvi
Music:-- Jayadev
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------
Kabhi khud pe
Kabhi khud pe kabhi haalaat pe rona aaya
Kabhi khud pe
Baat niklee tho harik baat pe rona aaya
Baat niklee tho harik baat pe ronaa…

Hum to samjhe the ke hum bhool gaye hain unko
Hum to samjhe the
Hum to samjhe the ke hum bhool gaye hain unko
Kya hua aaj yeh kis baat pe rona aaya
Kya hua aaaj - yeh kis baat pe rona aaya
Kabhi khud pe kabhi haalat pe rona


Kisliye jeete hain hum
Kisliye jeete hain - hum kiske liye jeete hain
Baarha aise sawalat pe rOnaa aaya
Baarha aise sawalat pe rona aaya
Kabhi khud pe

Kaun rota hai kisi aur ki khatir aye dost
Kaun rota hai kisi aur ki khatir aye dost
Sabko apni - hi kisi baat pe rona aaya
Sabko apni hi - kisi baat pe rona aaya
Kabhi khud pe

Kabhi khud pe kabhi haalat pe rona aaya
Baat nikli to har ik baat pe rona aaya
Kabhi khud pe


Meaning

Sometimes just like that
Sometimes just like that
Sometimes due to my predicament
Tears just roll down

I thought I forgot her completely
But what happened today?
that I started crying suddenly?

Why do we live?
For whom do we live?
When I ask myself,
tears just start rolling down

Who cries for another, in this world, my friend?
In this world, everybody is so busy
crying over their own problems

Sometimes just like that
Sometimes due to my predicament
Tears just roll down

తెలుగు స్వేచ్చానువాదం

ఎందుకో తెలీదు
ఒక్కొక్కసారి వాటంతట అవే
కన్నీళ్ళు ఉబికి వస్తాయి
ఒక్కోసారి నా పరిస్థితిని తలచుకొని...

నేను తనను పూర్తిగా మర్చిపోయాననే అనుకున్నాను
కానీ ఎందుకో ఇవాళ ఈ కన్నీళ్లు?

నేనెందుకు బ్రతుకుతున్నాను?
ఎవరికోసం బ్రతుకుతున్నాను?
ఈ ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా
నాకు తెలీకుండానే కన్నీరు ఉబుకుతోంది

ఓ నేస్తమా చెప్పవూ?
ఈ లోకంలో ఇతరుల బాధలు చూచి ఏడ్చేవారు ఎవరున్నారు?
అందరూ తమ తమ బాధలతో ఏడ్చేవారే గాని?

ఎందుకో తెలీదు
ఒక్కొక్కసారి వాటంతట అవే
కన్నీళ్ళు ఉబికి వస్తాయి
ఒక్కోసారి నా పరిస్థితిని తలచుకొని...
read more " Kabhi Khud Pe - Mohammad Rafi "

12, నవంబర్ 2017, ఆదివారం

అప్సరసలను చూడాలని ఉంది

మంత్ర తంత్రాలంటే జనాలలో ఎంతటి మూఢనమ్మకాలూ, అవాస్తవిక భావాలూ ప్రచారంలో ఉన్నాయో అనడానికి నాకు మొన్నొచ్చిన ఫోనే ఉదాహరణ.

మొన్న మధ్యాన్నం ఒక అరగంట రెస్టు తీసుకుందాం అని మంచి నిద్రలో ఉండగా ఫోన్ మ్రోగి నిద్రలేపింది.

'హలో' అన్నా బద్ధకంగా.

'ఫలానా గారేనా?' అంది అవతలనుంచి ఒక మగస్వరం.

'ఆ. ఫలానానే. మీరెవరు?' అన్నాను.

'అమ్మయ్య ! మీ ఫోన్ నంబర్ అతికష్టం మీద దొరకింది.' అంది స్వరం.

'అంత కష్టం ఏముందబ్బా ! నా బ్లాగులో ఈజీగానే కనిపిస్తుంది కదా?' అని నాకు సందేహం వచ్చింది.

అంతలోకే ఆ స్వరం - 'మాది విశాఖపట్నం. నాకు మంత్రం తంత్రం అంటే చాలా ఇంటరెస్టు' అంది గోదావరి యాసలో.

'అలాగా' అన్నా ఆవులిస్తూ.

'ఏదైనా త్వరగా సిద్ధించే మంత్రం కావాలి. మీరు సాయం చెయ్యగలరా?' అంది స్వరం.

'నాకు పాస్ పోర్ట్ త్వరగా కావాలి. ఇప్పిస్తారా?' అన్నట్లు నాకు వినిపించి - ' అది నాపని కాదు. మీ ఊళ్ళో చాలామంది ఆ పని చేసిపెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళను కలవండి.' అన్నా.

స్వరం మన మాట వినిపించుకోకుండా 'చాలామంది మామూలు మంత్రగాళ్ళు దొరికారు. వాళ్ళ దగ్గర ఏవేవో మామూలు మంత్రాలు తీసుకున్నాను. అంటే కర్ణ యక్షిణి లాంటివి. ఇప్పుడు నాకు ఒక మంచి మంత్రం కావాలి. ఒక వారంలోనో రెండు వారాలలోనో సిద్ధించాలి. అలాంటి మంత్రం మీరు ఇవ్వగలరా?' అంది డిమాండ్ చేస్తున్నట్లుగా.

'మంత్రం సిద్ధిస్తే ఏం చేస్తావు నాయనా?' అడిగాను.

'అంటే - దేవత కనిపిస్తుందట కదా?' అంది స్వరం.

'కనిపిస్తే ఏం చేస్తావు?' అడిగాను నవ్వాపుకుంటూ.

'అబ్బే అలాంటి చెడు ఉద్దేశాలు నాకస్సలు లేవు. ఆమె ఎంత అందంగా ఉన్నా సరే, ఆమెను తల్లిగానే చూస్తాను. వేరే దృష్టితో అస్సలు చూడను' అంది స్వరం.

'అవునా?' అన్నాను.

'అవును. నాలో కామం అస్సలు లేదు. ఒకవేళ ఎప్పుడైనా అనిపించినా దాన్ని దారి మళ్ళిస్తాను.నాకు ప్రస్తుతం 28 ఏళ్ళు. ఇంకా పెళ్ళికాలేదు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను.' అంది స్వరం.

'కామం ఏంటి నాయనా? నేను ఆ విషయం అడగలేదు కదా నిన్ను?' అన్నాను.

'అలా కాదండి. కొంతమంది చెబుతారు కదా. అప్సరసలు సిద్ధిస్తే ముందు భార్యని చంపేస్తారు అని. నాకెలాగూ పెళ్లి కాలేదు. భార్య లేదు. కనుక ఆ ప్రాబ్లం లేదు. కానీ ఆ అప్సరసని నేను తల్లిగానే చూస్తాను.' అంది స్వరం.

'అలా చూస్తే ఆమెకు నచ్చలేదనుకో. అప్పుడేం చేస్తావు. అసలే అప్సరస. నువ్వు తల్లిగా చూస్తే ఎలా తట్టుకోగలదు? కుదరదేమో. ఒకసారి ఆలోచించు' అన్నా.

'ఒకవేళ కుదరక పోతే అప్పుడాలోచిస్తాను. ముందు నాకామె కనిపించాలి. అలాంటి మంత్రం ఇవ్వండి.' అంది స్వరం.

'మరి ఉపదేశం కావాలంటే నువ్వు గుంటూరుకు రావాల్సి ఉంటుంది' అన్నాను.

'నాకు వీలుకాదు. సెలవలు దొరకవు. మా బాస్ చాలా స్ట్రిక్ట్. సెలవలు అస్సలు ఇవ్వడు. అందుకని నేను రాలేను. ఫోన్లో చెప్పలేరా మంత్రాన్ని?' అడిగింది స్వరం, 'ఈ మాత్రం కూడా చెయ్యలేవా?' అని ధ్వనించేలా.

'వీడెవడ్రా బాబూ ! అమావాస్య ఇంకా ఆర్రోజులుంది కదా అప్పుడే మొదలైంది ఇతనికి?' అనుకుని మనసులోనే అప్పటి లగ్నాన్ని గమనించాను. రోజువారీ గ్రహస్థితులు మనకు తెలుసు గనుక వెంటనే ఆ వ్యక్తి ఎలాంటివాడు? ఎందుకు ఇదంతా అడుగుతున్నాడు? మొదలైన విషయాలన్నీ అర్ధమయ్యాయి.

'సరే చూద్దాం. ఎలాంటి అప్సరసా మంత్రం కావాలి నీకు?' అంటూ అడిగాను.

'మీరు వ్రాశారు కదా ఒక పోస్ట్ లో పుష్పదేహ అప్సరస చాలా బాగుంటుంది అని. ఆమె మంత్రం ఇవ్వండి.' అంది స్వరం.

'ఆమె చాలా కన్నింగ్. నువ్వు తట్టుకోగలవా ఆమెను?' అడిగాను.

'ఏం పరవాలేదు మేనేజ్ చేస్తాను. కానీ ఆమె నిరంతరం నాతోనే ఉండాలి. నేను నిద్రపోయినా కూడా నా పక్కనే కూచుని ఉండాలి. అనుక్షణం నన్ను వదలకుండా ఉంటూ నాకు సలహాలివ్వాలి. ఆ సలహాలు నేను తూచా తప్పకుండా పాటిస్తాను.' అన్నాడతను.

వ్యవహారం శృతి మించుతోందనిపించి, ' చూడు బాబూ ! నాకు అలాంటివి ఏవీ రావు.' అన్నాను డైరెక్ట్ గా.

అవతలనుంచి ఒక నవ్వు వినిపించింది.

'తెలుసు సార్. మీబోటి వాళ్ళు అంత ఈజీగా చిక్కరని. పోనీ నా మీద మీకు అనుమానం ఉంటే, నేనెలాంటి వాడినో తెలుసుకోవడానికి మీ దగ్గర ఉంటారు కదా కర్ణపిశాచి, కర్ణయక్షిణి వంటి వాళ్ళు. వాళ్ళని అడిగి చూడండి నా బయోడేటా చెబుతారు.' అన్నాడు.

'వాళ్ళెవరు?' అన్నాను.

కాసేపు నిశ్శబ్దం.

'మీరే కదా వ్రాస్తుంటారు కర్ణ పిశాచి గట్రా అని.' అన్నాడు.

'చూడు బాబూ. నిజం చెప్తాను విను. నాకలాంటివి ఏవీ రావు.' అన్నాను.

'మరి పాత పోస్టులలో చాలా వ్రాశారు కదా?' అన్నాడు స్వరం పెంచి.

'విను. నా అమెరికా శిష్యులు అప్పుడప్పుడూ వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మంచి ఫారిన్ సరుకు తెచ్చి ఇస్తూ ఉంటారు. అది పుచ్చుకున్నప్పుడల్లా తిక్క పుట్టి ఏవేవో గాలికబుర్లు కల్పించి ఉన్నవీ లేనివీ వ్రాస్తూ ఉంటాను. అవి చదివి నీలాంటివాళ్ళు నిజాలని భ్రమిస్తూ ఉంటారు. అలాంటివి నాకు నిజంగా తెలియవు.' అన్నాను.

'అవునా?' ఆశ్చర్య పోయింది స్వరం. 

'నీ మీదొట్టు. ఇంకో సంగతి విను. నాకూ అప్సరసలను చూడాలని వాళ్ళతో ఆడుకోవాలని ఉంది. నీకు ఎవడైనా మంచి గురువు దొరికితే నాకూ ఆ అడ్రస్ చెప్పు. నేనూ వచ్చి ఉపదేశం తీసుకుంటా. నువ్వు రెండు వారాలు అడిగావు. నేను అంతకాలం కూడా ఆగలేను. జస్ట్ ఒకటి రెండు రోజుల్లో అప్సరస కనిపించాలి. ఆ తర్వాత పొమ్మన్నా పోకుండా నాతోనే ఉండాలి. అలాంటి కేస్ ఏదైనా దొరికితే చూడు.' అన్నా సీరియస్ గా.

'చూడండి సార్. మీ జిత్తులు నా దగ్గర కాదు. మీకవన్నీ తెలుసని నాకు తెలుసు. మీరు నన్ను పరీక్షిస్తున్నారు. నాలాంటి శిష్యుడు మీకు దొరకడు. గ్యారంటీ. నాకు అర్జంటుగా మంత్రం కావాలి. ఇంకో సంగతి. పిచ్చిపిచ్చి మంత్రాలిస్తే నేనూరుకోను. అది సిద్ధించాలి. అలాంటి మంత్రం మీరివ్వాలి. ఎందుకంటే నేనిప్పటికే చాలాసార్లు మోసపోయాను. కొంతమంది ఏవేవో మంత్రాలిస్తారు. ఎన్నేళ్ళు చేసినా అవి సిద్ధించవు. ఈ విషయంలో నాకు బాగా అనుభవం ఉంది.' అంది స్వరం కరుకుగా.

ఇక ఇలా లాభం లేదని, గొంతు తగ్గించి రహస్యంగా ఇలా చెప్పాను.

'చూడమ్మా. నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నీ మొహం నాకు తెలీదు. నాది నీకు తెలీదు. ఇప్పుడే నన్ను దబాయిస్తున్నావు. ముందు ముందు ఇంకేం చేస్తావో నేనూహించగలను. నాకు కరెక్ట్ గా నీలాంటి శిష్యుడే కావాలి. నీకు అప్సరసలే కదా కనిపించాల్సింది. ఈరోజే ఫలించే ఒక ఉపాయం చెప్తా. చేస్తావా? ఈరోజు సాయంత్రానికే నీకు ఒక్క అప్సరస కాదు బోల్డుమంది కనిపిస్తారు.' అన్నా ఊరిస్తూ.

'అవునా. త్వరగా చెప్పండి' అన్నాడు ఆత్రంగా.

'మీది విశాఖపట్నం అన్నావు కదా. ఒక పని చెయ్యి. సాయంత్రం నీ పని ముగించుకుని జగదాంబ సెంటర్ కు వెళ్ళు. అక్కడ ఒక పక్కగా నిల్చుని నేను చెప్పే మంత్రం జపించు. రోడ్డుమీద ఎంతోమంది అప్సరసలు హడావుడిగా నడుస్తూ, షాపింగ్ చేస్తూ, స్కూటర్ల మీదా, కార్లలోనూ పోతూ కనిపిస్తారు.' అన్నాను.

'అవునా. సరే సార్. ఆ తర్వాత నేనేం చెయ్యాలి?' అన్నాడు.

'ఏం లేదు. వెరీ సింపుల్. వాళ్ళలో నీకు నచ్చిన అప్సరస దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకో.' అన్నా.

'అప్పుడేమౌతుంది? ఆ అప్సరస నాతో వచ్చేస్తుందా?' అన్నాడు.

'ఆమె వచ్చినా రాకపోయినా, ఆమె అరిచే అరుపులకు చుట్టూ ఉన్న రాక్షసులు వచ్చి నీమీద కలబడి నీకు దేహశుద్ధి చెయ్యబోతారు. కానీ నువ్వేం తగ్గకు. నన్ను తలచుకుని వాళ్ళ మీద కలబడు. కానీ అప్సరస చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకు.' అన్నాను.

'అప్పుడేమౌతుంది?' అన్నాడు స్వరం అనుమానంగా.

'ఏమీ కాదు. నీకు స్పృహ తప్పుతుంది. కళ్ళు తెరిచే సరికి ఒక బెడ్ మీద నువ్వుంటావు. కంగారు పడకు. అదే స్వర్గం. అయితే దాని పేరు 'మెంటల్ హాస్పిటల్ విశాఖపట్నం' అని నీకు కన్పిస్తుంది. అది కూడా అప్సరస పెట్టే పరీక్షే. భయపడకు.' అన్నాను.

'ఒకే సార్ అలాగే. అప్పుడు నేనేం చెయ్యాలి.' అంది స్వరం. 

'ఒకసారి అక్కడకు చేరాక నువ్వేం చెయ్యనక్కరలేదు. అంతా వాళ్ళే చూసుకుంటారు. అసలు నువ్వేం చెయ్యలేవు కూడా. ఎందుకంటే నీకు ఒళ్లంతా పచ్చి పుండులా ఉంటుంది. ఇంతలో ఒక అప్సరస తెల్లడ్రస్ లో, చేతిలో ఇంజక్షన్ తో వచ్చి నీ ముందు నిలబడుతుంది. నువ్వేమీ జంకకుండా గట్టిగా ఆమె చెయ్యి పట్టుకొని నేను చెప్పబోయే మంత్రం చదువు.' అన్నాను.

'ఆ తర్వాత ఏమౌతుంది?' అన్నాడు.

'ఏం కాదు. ఆమె మళ్ళీ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. అప్పుడు అదే తెల్ల డ్రస్ లో ఉన్న కొందరు యమభటులు వచ్చి నిన్ను గట్టిగా అదిమిపట్టి తీసుకెళ్ళి ఒక కుర్చీలో కూచోబెడతారు. ఆ కుర్చీకి చాలా వైర్లు కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు వాటిల్లో ఒక వైరును ప్లగ్గులో పెట్టి స్విచ్ వేస్తారు. వెంటనే నీకు సమాధి స్థితి సిద్ధిస్తుంది. ఆ క్షణం నుంచీ ఆ తెల్ల డ్రస్ అప్సరస నిన్ను వదలి ఎక్కడికీ పోదు. అనుక్షణం నీకు కాపలాగా ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ పక్కనే స్టూల్ మీద కూచుని ఉంటుంది. నువ్వు కళ్ళు తెరవగానే నీకు కావలసిన సపర్యలు చేస్తుంది. నువ్వు కోరుకున్నట్లుగానే ప్రతిదాంట్లో నీకు సలహాలు ఇస్తుంది. ఒకవేళ ఆమె డ్యూటీ మారినా అదే డ్రస్ లో ఉన్న ఇంకొక అప్సరస వచ్చి ఆమె ప్లేస్ లో కూచుంటుంది. ఈ విధంగా ఎప్పుడూ ఎవరో ఒక అప్సరస నీకు తోడుగా ఉంటూనే ఉంటుంది. ఎలా ఉంది నా ఉపదేశం?' అడిగాను సీరియస్ గా.

'ఏంటి సార్ ! నేను మీకు పిచ్చోడిలా కనిపిస్తున్నానా?' అన్నాడు స్వరం తీవ్రంగా.

'అబ్బే లేదు నాయనా. నీకేం పిచ్చి లేదు. పిచ్చి నాకే. బ్లాగులో ఫోన్ నంబర్ ఇచ్చి నీలాంటి పిచ్చోళ్ళతో మాట్లాడుతున్నానే. అదీ నా పిచ్చి. సరేగాని నువ్వు అన్నది నా డైలాగు, నువ్వు చెప్తున్నావ్ అంతే.

లేకపోతే ఏంటి? నీకు ఫోన్లో మంత్రం చెప్పాలా? అది ఒక వారంలో సిద్ధించాలా? అప్సరస వచ్చి నీ ఒళ్లో కూచోవాలా? లేకపోతే నా సంగతి చూస్తావా? నేను నీకు పిచ్చోడిలా కన్పిస్తున్నానా ఏంటి? ఇంతసేపు నీలాంటి పిచ్చోడితో ఫోన్ మాట్లాడిందే ఎక్కువ. ఇంకోసారి ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావంటే లెక్కల్లో తేడా వస్తుంది జాగ్రత్త.

బుద్ధిగా నీ ఉద్యోగం నువ్వు చేసుకో. కానీ పెళ్లి మాత్రం చేసుకోకు. చేసుకుని ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యకు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే నీ పిచ్చి తగ్గటానికి ముందుగా మంచి ట్రీట్మెంట్ తీసుకో. బై.' అని కటువుగా చెప్పి ఫోన్ కట్ చేశాను.

కధ కంచికి ! మనం ఇంటికి !! అదన్నమాట సంగతి !!!
read more " అప్సరసలను చూడాలని ఉంది "

11, నవంబర్ 2017, శనివారం

కలబురిగి కబుర్లు - 1

మా అమ్మాయిని M.D (Homoeo) లో చేర్చడానికి ఈ మధ్యన కలబురిగి (గుల్బర్గా) లో రెండు దఫాలుగా పదిరోజులున్నాను. వీళ్ళ బ్యాచ్ ఏభై మందిలో ఆరుగురు మాత్రమే సబ్జెక్టులు ఏవీ మిగుల్చుకోకుండా సింగిల్ అటెంప్ట్ లో B.H.M.S పాసయ్యారు. మళ్ళీ ఈ ఆరుగురిలో తను మాత్రమే వీళ్ళ బ్యాచ్ నుంచి M.D లో జాయినైంది.

ఈ ఊరికి ఇప్పుడు కలబురిగి అని పేరు మార్చారు. గుల్బర్గా విశ్వవిద్యాలయంలోనే నేను న్యాయశాస్త్రం చదివాను. మళ్ళీ ఇప్పుడక్కడే మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. కనుక ఈ ఊరికీ మాకూ ఏవో కర్మసంబంధాలున్నాయన్న మాట !!

ఈ ఊరు చాలా ప్రాచీనమైనదని దీని చరిత్ర చెబుతోంది. దాదాపు 3000 ఏళ్ళ క్రితమే ఈ ఊరు ఉన్నది. ఈ జన్మలో నాకీ ఊరు గత పాతికేళ్ళ నుంచీ తెలుసు. (గత జన్మల గురించి అడక్కండి. అడిగినా నేను చెప్పను). అప్పటికీ ఇప్పటికీ ఊరు చాలా మారింది. సేడం రోడ్ (హైదరాబాద్ హైవే) పక్కగా ఊరు బాగా పెరిగిపోయింది. కార్లో అయితే హైదరాబాద్ కు మూడు గంటల్లో చేరుకోవచ్చు.

ఈ ఊరిలో ముస్లిం జనాభా ఎక్కువ. దాదాపు 49% వాళ్ళే ఉన్నారు. 48% దాకా హిందువులున్నారు. మిగిలినదాంట్లో మిగతా జనాభా ఉన్నారు. ముస్లిమ్స్ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ గొడవలు లేవు. అందరూ కలిసే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలలో శివభక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే వీరిలో చాలామంది లింగాయతులున్నారు.

తన నానో తాళాలు నాచేతిలో పెట్టి - 'ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఈ కారు నీదే' అన్నారు శ్రీకంఠయ్యగారు. ఈయన దగ్గరే 1995 లో నేను జ్యోతిష్యశాస్త్రంలో ఓనమాలు నేర్చుకున్నాను. ఒక అరగంటలో ఆ ఊరంతా నాకు దారులతో సహా తెలిసిపోయింది. సునాయాసంగా ఆ రోడ్లన్నీ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూచున్న వాళ్ళు ఆశ్చర్యపోయి - 'ఈ ఊరు మీకు ముందే తెలుసా?' అని అడిగారు. 'తెలీదు. ఎప్పుడో ఇరవైఏళ్ళ క్రితం ఒకసారి వచ్చాను. అంతే' అని చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు.

శ్రీకంఠయ్యగారు ఆ ఊరిలో ప్రఖ్యాత జ్యోతిష్కుడు. టెలికాం డిపార్ట్ మెంట్ లో ఇంజనీరుగా పన్నెండేళ్ళ క్రితం ఆయన రిటైరయ్యాడు. సర్వీసులో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఆయన బిజీగా ఉంటున్నాడు. తెంపులేకుండా జ్యోతిష్యం కోసం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకూ జనాలు వస్తూనే ఉంటారు.ఈయనకు జ్యోతిష్యవిద్య వారి పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. వీరి పూర్వీకులు మైసూరు దగ్గర చామరాజనగర్ లోని శ్రీకంఠేశ్వర ఆలయంలో గత 300 ఏళ్ళ నుంచీ అర్చకులుగా ఉన్నారు. మంత్రోపాసనా, జ్యోతిష్యవిద్యా వీరి వంశంలో తరతరాలుగా వస్తున్నాయి. వీరి తాతగారూ నాన్నగారూ ఎంత గొప్ప జ్యోతిష్కులంటే మనిషి ముఖం చూచి అతని చరిత్ర చెప్పేవారు. వారి నోటినుంచి మాట వస్తే అది జరిగి తీరేది. నిష్ఠాపరులైన మంచి వేదపండితులు వాళ్ళు.

ఈయన స్నేహితులలో సయ్యద్ మసూద్ అనే ముస్లిం ఒకాయన ఉన్నాడు. ఈయన గుల్బర్గా స్టేషన్ దగ్గర ఉన్న సహారా లాడ్జి ఓనరు. ఈయన ఉండేది హైదరాబాదులో. నెలకు రెండు మూడుసార్లు ఇక్కడకు వచ్చి ఉంటూ ఉంటాడు. ఇరానియన్ ఫీచర్స్ తో ఉన్నాడు. ఒకప్పుడు సుల్తానుల కాలంలో గుల్బర్గాలో సగం ప్రాపర్టీ వీళ్ళదేట. ప్రస్తుతం అంతా పోయి కొంత ప్రాపర్టీ మాత్రం మిగిలింది. ఈయన ఇస్లామిక్ పరిహారాలు చెయ్యడంలో దిట్ట అని మామగారు అన్నారు. ఈయనకు వచ్చే కేసుల్లో కొన్ని కేసులను తనకూ ఇవ్వమని మామగారి దగ్గరకు వస్తూ ఉంటాడు. రాత్రంతా తమదైన ఉపాసనలో కాలం గడిపి పొద్దున్న ఆరునుంచి పదకొండు వరకూ నిద్రపోవడం ఈయన అలవాటుట. అందుకే ఈయన చేసే పరిహార క్రియలు బాగా పనిచేస్తాయని విన్నాను. కానీ, తను చేసే క్రియలకు భారీగా చార్జి చేస్తాడని చెప్పారు.

బిజినెస్ మాన్ అయి ఉండి ఈ తాంత్రిక క్రియలు ఏమిటి? అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయనకు డబ్బు ఇబ్బంది లేదు. ప్రవృత్తేమో ఇది. కనుక తీరికగా రాత్రంతా కూచుని ఈ సాధనలు చేస్తూ ఉంటాడన్నమాట. 

వైదిక విధానంలో తనూ, ఇస్లామిక్ విధానంలో సయ్యదూ తమ దగ్గరకు వచ్చిన వారి సమస్యలకు పరిహార క్రియలు చేస్తూ ఉంటారు. ఇద్దరూ స్నేహితులే. ఇది విచిత్రంగా అనిపించింది.

'ఇస్లాంలో మంత్రాలున్నాయా? బీజాక్షరాలు లేకుండా అవి ఎలా పని చేస్తాయి?' అని ఇదంతా గమనిస్తున్న మా అమ్మాయి అడిగింది.

'ఉన్నాయి. శుద్ధ అరబిక్ వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. ఏ భాష అయినా ఏభై అక్షరాల సమాహారమే కదా. కనుక బీజాక్షరాలు అన్నింటిలోనూ ఉంటాయి. అవి కూడా పనిచేస్తాయి. పైగా అక్షరాలతో బాటు వాటి వెనుక ఉన్న 'భావన' అనేది అసలైన శక్తిగా పనిచేస్తుంది.' అని చెప్పాను.

అన్ని మతాలలో ఉన్నట్లే ఇస్లాంలో కూడా తాంత్రిక క్రియలు ఉన్నాయి. ఈ బ్రాంచ్ ని 'సిహ్ర్' అని అంటారు. ఈ మ్యాజిక్ చేసేవారిని 'సాహిర్' అంటారు. బ్లాక్ మేజిక్ తో బ్లాక్ మేజిక్ ను డీల్ చెయ్యడాన్ని 'నష్రా' అంటారని, అలాకాకుండా షరియా ప్రకారం ఖురాన్ లోని సూక్తులను వాడి కూడా వాటిని నయం చెయ్యవచ్చని, బహుశా ఈ మసూద్ అనే ఆయన అదే చేస్తూ ఉండవచ్చనీ మా అమ్మాయికి చెప్పాను.

ఈ ఊరిలో రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. ఒకటి శరణ బసవేశ్వర యూనివర్సిటీ. ఇది ఈమధ్యనే అయింది. రెండోది గుల్బర్గా యూనివర్సిటీ. లింగాయత సాంప్రదాయానికి చెందినదే శరణ బసవేశ్వర ఆలయం ఒకటి ఊరి మధ్యలో చాలా విశాలమైన ప్రాంగణంలో ఉన్నది.

(ఇంకా ఉంది)
read more " కలబురిగి కబుర్లు - 1 "