“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, నవంబర్ 2009, బుధవారం

నిజమైన ప్రశ్న జ్యోతిషం-1

18/11/09 రాత్రి 19.10 గంటలకు గుంతకల్ లో నన్నొకరు ప్రశ్నించారు.

సార్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగవచ్చా?

సామాన్యంగా, అది నిజమైన సమస్య అయితే తప్ప, ఉబుసుపోని ఉత్సుకతతో అడిగే ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వను. కాని అడిగిన వ్యక్తి బాగా తెలిసిన వాడు కావటంతో తప్పలేదు. ముందుగా శకునాలు పరిశీలించి అన్నీ బాగానే ఉండటంతో అడగమన్నాను.

పృచ్చకుడు అడిగాడు: ప్రస్తుతం నేను దేనిగురించి అడుగబోతున్నానో చెప్పండి.

ఇదే చాలామందితో వచ్చే సమస్య. ముందుగా సరే అనిపించుకుంటారు. ఇక అక్కణ్ణించి పరీక్షించటం మొదలు పెడతారు, అదేదో మనం వాళ్లకు లైసెన్సు ఇచ్చినట్లు. నాకు విసుగు అనిపించింది. కాని మాట ఇచ్చాం కదా తప్పదు.

భలే చిక్కొచ్చి పడిందే అనుకుంటూ గురువులను ఆదిత్యాది నవగ్రహాలను స్మరించి ప్రశ్న చక్రం వేసి చూచాను. సమయానికి ఉన్న గ్రహ స్థితి ఇక్కడ చక్రం లో చూడవచ్చు. లగ్నాధిపతి శుక్రుడు షష్ఠ భావం లో ఉండుట చేత షష్ఠ భావ సంబంధ ప్రశ్న అయి ఉండవచ్చు. కాని శుక్రుడు స్వస్థానంలో బలంగా ఉండుటచేత శత్రు రోగ రుణ భయం లేదు. కనుక షష్ఠ మేమి లేదు ఇతర కారకత్వం అయిన వృత్తి సంబంధ ప్రశ్న అయి ఉండవచ్చు.

కనుక వారిని ఇలా అడిగాను " మీరు అడుగుతున్నది వృత్తి సంబంధ ప్రశ్న? అవునా?
పృచ్చకుడు: అవును.

ఇప్పుడు వృత్తిలో దేనికి సంబంధిత ప్రశ్నో తెలుసుకోవాలి. మన కారకుడగు చంద్రుడు సప్తమ భావంలో బలహీనుడుగా నీచలో ఉన్నాడు. లగ్నం స్వస్థానం అనుకుంటే సప్తమం పరాయి ప్రదేశం. స్వస్థానంలో ఉన్నంతవరకూ ఎవరికైనా మనస్సు బాగానే ఉంటుంది. పరాయి స్థానంలో ఉంటేనే బలహీనం గా ఉంటుంది. ఉద్యోగ పరంగా పరాయి స్థానం అంటే బదిలీ కావటమే. కనుక బదిలీ సంబంధిత ప్రశ్న అయి ఉండవచ్చు.

మీరు అడుగుతున్నది ఉద్యోగ సంబంధిత బదిలీ గురించి. అవునా?
పృచ్చకుడు: అవును. మా బాస్ గారికి బదిలీ కావచ్చని అనుకుంటున్నాము. ఎప్పుడు ఆర్డర్స్ రావచ్చు? చెప్పండి.

బాస్ గారికి బదిలీ వస్తే గిస్తే ఈయనకేందుకు? బాస్ కు బాధ లేదు. కాని ఈయనకి ఆత్రుతగా ఉంది.

ఉన్న చోటి నుంచి మారటాన్ని లగ్నానికి వ్యయం అయిన ద్వాదశ భావం చూపిస్తుంది. కనుక ప్రశ్నలో బదిలీ కి కారకుడు మేష లగ్నాధిపతి అయిన కుజుడు. సప్తమానికి కూడా ఆయనే అధిపతి అవటంతో ఇంకా బలం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు. ఇక కుజుడు 19.57 డిగ్రీలలో కర్కాటకంలో ఉన్నాడు. శుక్రుడు 19.14 డిగ్రీలలో తులా రాశిలో ఉన్నాడు. ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ ఉండటంతో బదిలీ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి అని చెప్పాను.

పృచ్చకుడు: నిజమే. మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఉత్తర్వు సంతకాలు అయిపోయాయి అని తెలిసింది. ఆర్డర్స్ ఎప్పుడు బయటకు వస్తాయి?

కుజ శుక్రులకు బేదం 43 నిమిషాలు ఉంది. ఒక డిగ్రీ లో సూర్యుడు ఒక రోజును పూర్తి చేస్తాడు. అరవై నిమిషాలు ఒక డిగ్రీ. ఒక డిగ్రీ లోపే దూరం ఉంది కనుక ఫల సమయం ఒక రోజు లోపే కావచ్చు. కాబట్టి ఇంకొక ఇరవై నాలుగు గంటల లోపే మీకు వార్త అందుతుంది అని చెప్పాను.

పృచ్చకుడు: బదిలీ దగ్గరకు ఉండవచ్చా? దూరంగా ఉండవచ్చా?

రూలింగ్ ప్లానేట్స్ కుజుడు బుధుడు వచ్చాయి. కుజుడు ద్వాదశాదిపతిగా మూడింట ఉండి దగ్గరి ప్రదేశాన్ని సూచిస్తున్నాడు. కర్కాటకంలో ఉండటంతో ఉత్తర దిక్కును సూచిస్తున్నాడు. కనుక " ఉత్తర దిక్కుగా దగ్గర ప్రదేశానికి బదిలీ అవుతుంది" అని చెప్పాను.

మరుసటి రోజు అనగా 19/11/09 రాత్రి 8 గంటల ప్రాంతంలో ( అనగా దాదాపు ఇరవై నాలుగు గంటల లో ) పృచ్చకుడు ఫాక్స్ లో బదిలీ ఉత్తర్వులు అందుకున్నాడు. గుంతకల్ కు ఉత్తర దిక్కుగా ఎక్కువ దూరంలో లేని హైదరాబాద్ కు బదిలీ అయింది.

విధంగా, సరదాగా చూచినా కూడా ఇంకొక ప్రశ్న నిజమైంది.

గమనిక
: ప్రశ్నలో ఉత్సుకత తప్ప ఒక సమస్యకు సంబంధించిన నిజమైన ఆత్రుత ప్రుచ్చకునిలో లేదు.
read more " నిజమైన ప్రశ్న జ్యోతిషం-1 "

21, నవంబర్ 2009, శనివారం

నాలుగు బ్రహ్మ విహారాల ధారణ

దివ్య జనని శారదా మాత ఒక విలువైన మాటను ఎల్లపుడూ చెప్పేవారు. మనిషి అత్యంత జాగ్రత్తగా జీవించాలి. అతని ప్రతి సంకల్పమూ, చర్యా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఈ సంకల్పాలు చర్యలు అనేవాటివల్లె మనిషి మనస్సులో వాసనలు కలుగుతాయి. ఈ వాసనా బలమే తరువాత అతడు మంచి లోకాలలో జన్మిస్తాడా లేక అధమ లోకాలలో జన్మిస్తాడా, మంచి పుట్టుక కలుగుతుందా లేక నీచమైన పుట్టుక కలుగుతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రతి వానికి తానూ మంచి కుటుంబంలో పుట్టాలి తనకు అంతా మంచే జరగాలి అనే ఉంటుంది. కానీ అలా జరగదు. కారణం? తన పూర్వ కర్మలు తన ఆలోచనలు సంకల్పాలు చర్యలు ఇవే కారణం.
అంతిమంగా మన భావనలే మన మిత్రులు అవే మన శత్రువులు. యోగ వేదాంత శాస్త్రముల ప్రకారం మనిషి యొక్క భావనలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది.

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత
ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు ఎల్లరి యందూ చూపించేలా అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్తితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా
మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ:

మోహ
గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసం పరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.

సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తి సాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తానూ కూడా సంతోషం పొందటాన్ని ముదిత అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:

ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్తాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటే ప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వములను సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి
వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్తితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్తితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్తితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్తితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని "
దీర్ఘ నికాయం " లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. " తేవిజ్జ సూత్ర " అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని " విశుద్ది మార్గం " లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.

ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.
read more " నాలుగు బ్రహ్మ విహారాల ధారణ "

17, నవంబర్ 2009, మంగళవారం

హోమియోపతి లో నోసోడ్ల వాడకం

హోమియో వైద్యులకు చాలా సార్లు ఒక విచిత్ర పరిస్తితి ఎదురౌతుంది. సరియైన మందును ఎంచుకొని సరియైనపోటేన్సీలో వాడినా ఫలితం కనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది?

హానెమన్ ఏళ్ళ తరబడి పరిశోధించి దీనికి జవాబు ఇచ్చాడు. సూచింపబడిన మందు (Indicated remedy) పనిచెయ్యక పోవటానికి కారణం శరీరంలో లోతుగా దాగి ఉన్న మయాజం (miasm) మాత్రమె. మయాజం అంటేకల్మషం (pollution)అని అనుకోవచ్చు. ఇది మూడు రకాలుగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజం లు సూచింపబడిన మందు పనిచెయ్యకుండా అడ్డుకుంటాయి. కనుక ఆమయాజంలను ముందు తొలగిస్తే తరువాత పని తేలిక అవుతుంది.

సోరా అనేది గజ్జిని పై పూతలతో అణచివేసినండువలన ప్రాణ స్థాయిలో కలిగే ఒక బలహీన పరిష్తితి. అలాగే సిఫిలిస్సైకోసిస్ అనేవి సిఫిలిస్ ను గనేరియాను ఇంజక్షన్లతో ఏంటి బయోటిక్స్ తో అణచి వేస్తె కలిగే ప్రాణిక బలహీన స్థితులు. ఇవి ప్రాణ స్థాయిలో ఆవరించి మనిషిని బలహీన పరుస్తాయి. ఇవి అడ్డుగా ఉన్నంత వరకు సూచింపబడిన మందు పనిచెయ్యదు. ఎందుకు ఇలా జరుగుతున్నదో అర్థం కాదు. ఈ చిక్కు ముడిని హానిమాన్ విప్పాడు. అంతే కాదు ఈమయాజం ల యొక్క లక్షణాలను క్రోడీకరించి వీటిని ఎలా గుర్తించాలి ఎలా ఎదుర్కోవాలో కూడా ఆయనే చెప్పాడు. అందుకే హానిమాన్ కు ఎన్ని నోబుల్ ప్రైజులు ఇచ్చినా తక్కువే అని అంటారు. కాని వైద్య చరిత్రలో ఒక విస్మృతమేధావిగా మిగిలిపోయాడు.

ఇక విషయానికొస్తే, ఇట్లాంటి పరిస్తితి వచ్చినపుడు ఏమి చెయ్యాలి? కుటుంబ చరిత్ర, రోగి చరిత్ర మరొక సారి క్షుణ్ణం గాపరిశీలించి ఏ మయాజం ఆ కుటుంబంలో ఉందొ గమనించాలి. తరువాత ఆ మయాజం ని కూడా కలిపి, అనగా ఆలక్షణాలను కూడా కలిపి మందును ఇస్తే అప్పుడు పని చేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు ముఖ్యం గా గుర్తించాలి.

మొదటి రకం: కేస్ టేకింగ్ శ్రద్ధగా చెయ్యకపోతే సాధారణంగా ఇటువంటి పరిస్తితి ఎదురౌతుంది. మొదట్లోనే కుటుంబచరిత్ర వగైరా వివరాలు ఓపికగా రాబట్టి రాసుకుంటే ఈ బాధ ఉండదు. అంతర్గతం గా ఉన్న మయాజం మొదట్లోనేకనిపిస్తుంది. దాన్ని బట్టి లోతైన మందులు వాడితే మొదట్లోనే ఈ పరిస్థితి రాదు. అలా కాకుండా ఏదో పై పైన కేస్తీసుకొని మందు ఇస్తే ఇటువంటి పరిస్తితి ఎదురౌతుంది.

అందుకే హానిమాన్ ఒక అమూల్య మైన మాట చెప్పాడు. సరిగా కేస్ టేకింగ్ చేస్తే రోగం సగం తగ్గినట్లే అన్నాడు. అంటేఅంత శ్రద్ధగా రోగ లక్షణాలను రాబట్టే పని చెయ్యాలి. అల్లోపతి డాక్టర్ల లాగా రోగి చెబుతున్న దాన్ని వినకుండా ఏదో పదిమందులు, ఇరవై టెస్టులు రాసేసి ఇవి వాడి మళ్ళీ రండి, ముందు నా ఫీజు ఇచ్చి వెళ్ళండి అని చెప్ప రాదు. అలా చేస్తేఅది హోమియో వైద్యం అనిపించుకోదు. వ్యాపార వైద్యం అనిపించుకుంటుంది.

రెండవ రకం: కేస్ టేకింగ్ సరిగా చేసి సరియైన మందు వాడుతున్నా కూడా కొంతకాలం తరువాత ముఖ్యం గా దీర్ఘ రోగాలలో పురోగతి కొంత కాలం వచ్చి ఆగిపోతుంది. సూచింపబడిన మందు పని చెయ్యటంఆగిపోతుంది. మందు మార్చి ఇవ్వవలసిన ఇతర లక్షణాలు కనిపించవు. అటువంటప్పుడు మయాజం ఏదుందో గమనించి మయాజం నిర్మూలన ఔషధాలు వాడితే అప్పుడు రోగ లక్షణాలు కూడా చక్కగా బయటకు కనిపిస్తాయి. ఆపిన మందు మళ్ళీ పని చెయ్యటం చూడవచ్చు. లేదా ఇంకో మందు సూచింప బడే ఇతర లక్షణాలు కనిపించవచ్చు.

సామాన్యంగా సోరాకు సల్ఫర్, సిఫిలిస్ కు మెర్కురీ, సైకోసిస్ కు తూజా ఔషధాలు వాడవచ్చు. కాని ఇవి కూడాపనిచేయ్యనప్పుడు నోసోడ్ లు అయిన సోరినం, సిఫిలినం, మేడోరైనం అనే ఔషధాలు వాడవలసి రావచ్చు. సోరినంఅనేది గజ్జి పుండు రసి నుంచి, సిఫిలినం అనేది సిఫిలిస్ స్రావం నుంచి, మేడోరైనం అనేది గనేరియా స్రావం నుంచి తీసి పోటేన్సీలోకి మార్చిన మందులు. వీటిని 200 పోటేన్సీ కంటే తక్కువలో వాడరాదు. మాట మాటకి రిపీట్ చెయ్యరాదు. అలా చేస్తే తీవ్రమైన రోగ లక్షణాలు శరీరంలో కలుగుతాయి.

ఈ మధ్య కాలం లో ఎయిడ్సు రోగి రక్తపు చుక్కను పోటేన్సీలోకి మార్చి ఎయిడ్స్ నోసోడ్ ను కూడా తయారు చేసారు. ప్రాణాలకు తెగించి
దాన్ని నోట్లో వేసుకొని మింగి ప్రూవింగ్ చేసి లక్షణాలు రాబట్టిన ధీరులకు నిజంగా మానవ జాతి రుణపడి ఉంది.
read more " హోమియోపతి లో నోసోడ్ల వాడకం "

15, నవంబర్ 2009, ఆదివారం

సత్యసాయి బాబా గారి దర్శనం

నిన్న అనుకోకుండా ఇద్దరు VIP లతో కలిసి పుట్టపర్తి ప్రశాంతి నిలయం దర్శించే అవకాశం కలిగింది. ఉదయం 8 కల్లాప్రశాంతి నిలయం చేరాము. మొదటగా వారి క్యాంటీన్లో ఉపాహారం స్వీకరించి అప్పటి నుంచి 10 వరకూ దర్శనం కోసంభక్తులతో కలిసి వరుసలో కూర్చొని బాబా గారికోసం ఎదురుచూచాము. ఒక బృందం మైకుల వద్ద రుద్రం, పురుష సూక్తంపారాయణ చేస్తున్నారు. తరువాత భజన గీతాలు పాడారు. కాని ఉదయం పూట బాబాగారు బయటకు రాలేదు. దర్శనం లేదు. ఆరోగ్యం బాగాలేదేమో అని కొందరు అన్నారు.

నాతొ వచ్చిన VIP గారికి ఎలాగైనా దర్శనం చేసుకోవాలని అనిపించింది గామోసు, మళ్ళీ సాయంత్రం వద్దాం అన్నారు. సరే మళ్ళీ సాయంత్రం 4.30 కి వచ్చి ముందు వరుసలలో కూచున్నాము. కార్తీక మాసం కావటం చేతనేమో మళ్ళీసాయంత్రం కూడా రుద్రం పారాయణం చేస్తున్నారు. 5 గంటలకు బాబాగారిని చక్రాల కుర్చీలో తీసుకు వచ్చారు. మావరుస ముందు నుంచి పొతున్నపుడు చాలా దగ్గరగా చూడటం తటస్థించింది. మా ముందు నుంచి పొతున్నపుడుబాబాగారు తలతిప్పి ఒక రెండు మూడు సెకన్లు నా కళ్ళలోకి చూచారు.

బాబాగారు బాగా చిక్కినట్లుగా ఉన్నారు. భక్తులు ఇస్తున్న ఉత్తరాలు తీసుకునే ఓపిక కూడా లేనట్లుగా నీరసంగాఉన్నారని తోచింది. చెయ్యెత్తి వెనక ఉన్నవారికి ఉత్తరాలు అందించలేక పోతున్నారు. ఒక బొమ్మను కుర్చీలోకూర్చోపెట్టి తీసుకొస్తున్నారా అనిపించింది. నా కళ్ళలోకి చూచినపుడు, ఒక రకమైన నిస్సహాయతో లేక నిర్లిప్తతోతెలియని vacant look ఆయన కళ్ళలో నాకు కనిపించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని మాత్రం అర్థంఅయింది. ఆయనకు ప్రస్తుతం 84 సంవత్సరాలు అని చెప్పారు.

దర్శనం పూర్తి చేసుకొని తిరిగి ధర్మవరం చేరి రాత్రికి ఎవరి ఊళ్లకు వారు చేరుకున్నాము. దారిలో వేడి వేడి చర్చలుమామూలే కదా. మాతో వచ్చిన వారు ఎవరి అభిప్రాయాలు వారు వెలిబుచ్చారు. ఆయన దేవుడని కొందరు, కాదు ఒకమహానుభావుడు మాత్రమె అని కొందరు, అదీ కాదు ఆయన ప్రస్తుత ట్రస్టు సభ్యుల చేతిలో బందీ అని, ముమ్మిడివరంబాలయోగి కూడా ఇలాగే అయ్యాడు అని ఒకరు-- ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చర్చలు జరిగాయి.

90 ఏళ్ళ వాళ్లు కూడా ఇంకా ఆరోగ్యం గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బాబా గారు అతీత శక్తులు కలిగీ అలాఉన్నారేమిటి అని ఒకాయనకు సందేహం. దానికి ఇంకొకాయన జవాబు చెప్పాడు. బాబాగారు లక్షలాది భక్తుల చెడుకర్మను ఆయన శరీరం మీదకు ఆహ్వానించి మోస్తున్నారు. అందుకే ఆయన ఆరోగ్యం అలా తయారయ్యింది. ఈయనేకాదు ఏ ఇతర మహానుభావుడైనా ఇంతే. ఇలాగే జరుగుతుంది. మీరు చెప్పిన ఆ 90 ఏళ్ళ వ్యక్తి(ఒక సినిమా నటుడులెండి) తన సుఖం తన స్వార్థం చూచుకుంటూ మంచి ఆహారం తింటూ, రెండేళ్లకొకసారి రక్తం మొత్తం మార్పించుకుంటూఉంటాడు.
అందుకే ఆ వయసులోనూ దుక్కలా ఉన్నాడు.అటువంటి వాళ్ళను బాబాగారితో పోలుస్తారా అని గొడవచేసాడు. నేను అందరి మాటలూ వింటూ ఉన్నాను. నన్నూ నా అభిప్రాయం చెప్ప మన్నారు.

ఆయనెవరో ఆయన నిజ స్వరూపమేమిటో నాకు తెలియదు. తెలీనప్పుడు నేను చెప్పలేను. అలా తెలుసుకోవాలనీనాకు లేదు. మనల్ని మనమే పూర్తిగా అర్థం చేసుకోలేము. ఇక ఇతరులను,  ఎలాఅంచనా వెయ్యగలం? మనం దాదాపు ఒక నూరు మందివిదేశీయులను చూచాము. ఆడవారు అయితే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని మనవారి కన్నా పద్దతిగా పారాయణాలుధ్యానం చేస్తూ కనిపించారు. మొగవారు లాల్చీ పైజామా ధరించి తిలకం లేదా బొట్టు పెట్టుకొని మౌనం గా కూర్చొనిజపమో ధ్యానమో వారికి ఇష్టమైనది చేసుకుంటున్నాను. ఒక విదేశీయుడు అయితే మైకులోనుంచి వినవస్తున్ననమక చమకాలకు అనుగుణంగా పెదవులు కదుపుతూ తానూ వారితో కలిపి పారాయణ చెయ్యటం చూచాను.

ఏ రాజశేఖర రెడ్డినో, జగన్నో ఇదే పెద్దగొంతుతో ఇలాగే విమర్శించే ధైర్యం మీకుందా? ఎందుకని? మొదటి వారిని ఎవరు ఎలా తిట్టినా ఏమీ జరుగదు. మహా అయితే వారి భక్తులు కొందరు వింటే కొంత వాదనజరుగవచ్చు. కాని రెండవ వారి అనుచరులో ఇంకెవరో వింటే మీకు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. అలాంటప్పుడుమీది తప్పే కదా.
ఎదుటి వారు మనల్ని ఏమీ చెయ్యలేరు అని తెలిసినపుడు ఏమైనా అంటాము. అదే ఎదుటివాడు మాకు హాని చెయ్య గలడు. అని తెలిసినపుడు లేని మర్యాద నటిస్తాము. ఇది మానవ ప్రవర్తన. అలాదూషించకుండా తార్కికం గా అక్కడ జరుగుతున్న అవకతవకలను నిష్పాక్షికంగా విశ్లేషణ చెయ్యండి. దానికి బాధ్యులుఎవరై ఉండవచ్చో, దానిని ఇంకా ఎలా సరిదిద్దవచ్చో, ఎలా ఇంకా బాగా నడప వచ్చో చెప్పండి. వారికి సలహాల రూపంలోవ్రాయండి. వింటే వింటారు లేకపోతె వారిష్టం. ఇలా నా ధోరణిలో నేనూ చెప్పాను. వారెవరూ సమాధానం చెప్పలేదు.

ఇక పొతే అక్కడ మేము చూచిన ఇతర విషయాల గురించి కొంత చెప్పక తప్పదు. అక్కడి కార్యకర్తల తెచ్చిపెట్టుకున్న మర్యాదా, సంస్కార నటనా, పైకి సాయిరాం అంటూనే చేత్తో దురుసుగా తోసినట్టు చెయ్యటం, ఇవన్నీ షరా మామూలే. పాపం ఒక విదేశీయుడు కనిపించాడు. అతనికి కుడి చెయ్యి కుడి కాలు లేవు. కాలికి మాత్రం తుంటి దగ్గరనుంచి ఏదోస్టీల్ కడ్డీతో కూడిన జైపూర్ ఫుట్ లాటిది బిగించి ఉంది. అతనూ మా ముందు వరసలో కూచొని ఉన్నాడు. మంచికాలును మామూలుగానే మడిచి పెట్టుకున్నాడు. కృత్రిమ కాలు, స్టీల్ కడ్డీ మాత్రం పక్కకు చాపుకున్నాడు. అది చూచిఒక కార్యకర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కృత్రిమ కాలును కూడా సరిగ్గా వరుసలో పెట్టమని ఆదేశించాడు. అతను ఏమీమాట్లాడకుండా ఆ కాలును తన ముందు వరుసలో వారి మధ్యగా ఉంచాడు. వికలాంగుని మీద కూడా బలవంతపుడిసిప్లిన్ రుద్దటం చూచి నాకు ఏమనాలో తోచలేదు.

ఒక పెద్దాయన( కార్యకర్తల నాయకుడిలాగా ఉన్నాడు) నాకు ఒక చోట కూచోమని చోటు చూపించాడు. ఇంతలొఇంకొకాయన హడావుడిగా వచ్చి అదే చోటులో కూర్చోవటంతో నేను ఆయన పక్కన కూర్చున్నాను. దానికి ఆపెద్దాయనకు కోపం వచ్చింది. చెప్పిన చోట కూచోకుండా మీ ఇష్టం వచ్చినట్టు కూచుంటారే? అని మెల్లిగా అయినాకరుకుగా చెప్పాడు. అలా విసుక్కోటానికి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒక అడుగు పక్కకు జరిగితే అంతకరుకుగా మాట్లాడవలసిన అవసరం లేదు. తరువాత మా మిత్రుడు ఒకాయన చెప్పాడు. "నువ్వు కలర్ షర్టులోఉన్నావు. నీ పక్కాయన తెల్ల షర్టు పాంటులో వచ్చాడు. అది ఇక్కడి యూనిఫారం. నువ్వు అందులో లేవు గనుకనిన్ను విసుక్కున్నాడు. నీకిచ్చిన చోటులో కూచున్న అతన్ని ఏమీ అనలేదు. మర్యాదగా పక్కన కూచున్న నిన్నువిసుక్కున్నాడు." VIP లైన్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుడి గతేమిటో అనిపించింది. ఇక్కడ బోధలకు ఆచరణకుచాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

తర్వాత మాతో వచ్చిన VIP గారికి ప్రశాంతి నిలయం అంతా కారులో తిప్పి చూపించటం కోసం మేమూ ఆయనతోతిరిగాము. వెనుక వైపు గా ఉన్న షెడ్లలో బాగా వృద్ధులైన ఆడవారు చాలామంది కనిపించారు. బహుశా అదివ్రుద్దాశ్రమమో ఏమో అర్థం కాలేదు. కారులో పోతూనే లోపలికి చూస్తె పెద్ద షెడ్డులో తడికలు గుడ్డలతో చిన్న చిన్నకాబిన్ల లాగా ఉన్నాయి. వాటిలో చాపలు పరచుకొని ఉంటున్నారు. ఆ లోపలే బట్టలు ఉతికి ఆరవేసుకున్నారు. షెడ్లలో స్లం ఏరియా వాతావరణం కనిపించింది.

ఇంకో వైపు ఆధునిక కాటేజీలు వసతులతో ఉన్న వరుసలూ కనిపించాయి. మాకు అందులోనే రెండు రూములుఇచ్చారు. కాని మేము అందులో దిగలేదు. దర్శనం దగ్గరే సమయం సరిపోయింది. మా వీ ఐ పీ గారు మళ్ళీ ట్రెయిన్అందుకోవాలి. అందుకని హడావుడిగా బయలుదేరి ధర్మవరం స్టేషన్ చేరుకున్నాం.

ఇటువంటి విభిన్న వాతావరణాలూ మనస్తత్వాలూ గమనిస్తూ, బాబా గారి దర్శనం చేసుకొని తరువాత జరుతున్న
చర్చలు వింటూ రాత్రికి ఇంటికి చేరాను.
read more " సత్యసాయి బాబా గారి దర్శనం "

11, నవంబర్ 2009, బుధవారం

వివేకానంద స్వామి మహాసమాధి-జాతక విశ్లేషణ

వివేకానంద స్వామి 4-7-1902 రాత్రి దాదాపు 9 గంటలకు దేహ త్యాగం చేశారు. అప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమె. జాతక పరంగా ఆయనకు అప్పుడు వింశోత్తరీ దశా ప్రకారం గురుదశలో శుక్ర అంతర్దశలో బుధ విదశ జరుగుతున్నది. స్వామి జాతక రీత్యా ఘటనను విశ్లేషిద్దాము.

స్వామిది ధనుర్ లగ్నం. మహర్షి పరాశరుని ప్రకారం ధనుర్ లగ్నానికి శని బుధులు మారకులు.

||
అష్టమం ఆయుష స్థానం అష్టమాదష్టమం తథా
తయోరపి వ్యయ స్థానం మారక స్థాన ముచ్యతే ||

అష్టమ భావం ఆయుష్య స్థానం. భావాత్ భావ సిద్ధాంతం ప్రకారం అష్టమానికి అష్టమం అయిన తృతీయ భావం కూడా ఆయుష్య స్థానమే. వీటికి వ్యయ స్తానములైన సప్తమ, ద్వితీయ స్థానములు మారక స్థానములు. కనుక సప్తమాధిపతి ద్వితీయాధిపతి, ఆయా భావముల యందున్న గ్రహములు వీరితో కలిశి యున్న వారు వీరిచే చూడ బడుతున్న వారు మారకులు.

స్వామి జాతకంలో బుధునికి బలీయమైన మారకత్వం ఉన్నది. కారణమేమనగా, బుధుడు సప్తమాధిపతి మాత్రమె గాదు, ద్విస్వభావ లగ్నమునకు సప్తమాధిపతి గా బాధకుడు కూడా అయి ఉన్నాడు. ఇదీ గాక ఉభయ కేంద్రాదిపత్య దోషం కూడా ఉండటం చేత, ప్రబల దోషి గా మారి ఉన్నాడు. వీటికి తొడుగా ద్వితీయ మారక స్థాన స్థితి వల్ల ఇంకా బలం చేకూరి ఉన్నది.

ఇక పొతే ద్వితీయ స్థానములోని శుక్రుడు కూడా మారక శక్తి ని పొంది ఉన్నాడు. కారణం- రోగ స్థానాధిపతి గా మారక స్థానంలో, ప్రబల మారకుడైన బుదునితో కలసి ఉండటం వల్ల ఇతనికి కూడా ప్రబల మారక శక్తి వచ్చింది. శుక్ర బుధు లిరువురూ అంతర్దశా విదశా స్థాయిలలో అధిపతులుగా ఉండి మారకాన్ని సూచిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నది.

కాని దశా నాధుడైన గురువుకు మారకత్వం ఎలా పట్టింది? గురువు స్వామికి లగ్నాధిపతి మాత్రమె గాక సుఖ స్థానాధిపతి కూడా అయి ఉండి, లాభ స్థానం లో నెలకొని ఉన్నాడు. అటువంటి గురువు తన దశలో మారకాన్ని ఇవ్వటం జరుగదు. లగ్నాధిపతి దశలో అదీ గాక గురుని వంటి శుభ గ్రహ దశలో మారకం జరిగితే అది తన స్వంత ఇచ్చానుసారమే జరగాలి తప్ప వేరే కారణం ఉండటం సాధ్యం కాదు. గురువు కుజుని చిత్తా నక్షత్రం లో స్థితి కలిగి ఉండి కుజునిచేత పంచమ స్థానం అయిన మేషం నుంచి సప్తమ దృష్టితో చూడబడుతూ ఉన్నాడు. మేష రాశి శిరస్సుకూ కుజుడు రక్తానికీ కారకులు అని మనం గుర్తుంచుకుంటే క్రింది విషయాలు తేలికగా అర్థం అవుతాయి.

లగ్నాధిపతి లాభ స్థానంలో మారకం జరిగింది = తన స్వంత ఇచ్చానుసారం జరిగిన సంఘటన.
మేష రాశి= శిరస్సు
కుజుడు= భేదనం, రక్త సంబంధం
గురు కుజుల పరస్పర దృష్టి= తన సొంత ప్రయత్నంతో, మంత్ర స్థాన సంబంధం చేత , యోగ మార్గ రీత్యా బ్రహ్మ రంధ్ర చేదనం ద్వారా
బుధ శుక్రుల ప్రబల మారకత్వం=నరాలు చిట్లటం ద్వారా అంతర్గత రక్త స్రావం ద్వారా మరణం సంభవించింది అని తెలుస్తూంది.

ఇక చంద్ర లగ్న రీత్యా విశ్లేషణ ఎలా ఉందొ చూద్దాము.

చంద్ర లగ్నాత్ పైన ఇచ్చిన వివరణ ప్రకారం గురు శుక్రులు మారకులు. గురువు సప్తమాధిపతి, ఉభయ కేంద్రాదిపత్య దోషి, ద్వితీయ మారక స్థాన స్థితితో ప్రబల మారకుడు అయినాడు. శుక్రుడు ద్వితీయాధిపతి గా మారకుడు. లగ్నాధిపతి అయిన బుదునితో కలసి ఇచ్చా స్థానము మంత్ర స్థానము అగు పంచమ భావము నందు ఉండుటచేత ఏమైనదో చూద్దాము.

లగ్నాధిపతి బుధుని ప్రమేయం = తన స్వంత ఇచ్చ వల్లనే
మారకుడగు శుక్రునితో కలసి ఉండుట వల్ల = మరణాన్ని ఆహ్వానించి
ఇద్దరి పంచమ మంత్ర స్థాన స్థితి = యోగ ప్రక్రియ ద్వారా శరీర త్యాగం చేసాడు. స్వామి మరణం ముందు గా మంత్ర జపం చేయటం గమనించాలి. లగ్నాత్ మరియు చంద్ర లగ్నాత్ కూడా సంఘటనతో పంచమ మంత్ర స్థానం సంబంధం కలిగి ఉన్నది.

అష్టమ కుజుని వీక్షణ= కుండలినీ యోగ రిత్యా ప్రబల యోగ బలంతో
మారక గురుని మీద కుజ దృష్టి= యోగులు పొందే శుభ మరణాన్ని బ్రహ్మ రంధ్ర చేదనం ద్వారా పొందాడు.

చంద్ర లగ్నాత్ గురు బుధ శుక్రుల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మరణ సమయంలో గురుదశ/శుక్ర అంతర్దశ/బుధ విదశ జరగటం గమనించ వచ్చు. రోజు జ్యేష్ట బహుళ చతుర్దశి కొద్దిగా మిగిలి ఉంది. అమావాస్య ఘడియలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఆర్ద్రా నక్షత్రం స్వామికి విపత్తారగా జరుగుతున్నది. వారాధిపతి గా శుక్రుడు హోరాధిపతి గా తిరిగి బుధుడు ఉండటం రాత్రి సమయంలో బుధ హోర జరుగుతూ ఉండటం రెండు గ్రహాలు మళ్ళీ పాత్రలలో ప్రత్యక్షం కావటం ఘటన యాదృచ్చికం అని అనలేని బలమైన రుజువుగా ఉన్నది.

స్వామి జూలై నాలుగు నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఆయనకు తారీకు అంటే ప్రీతి అనటానికి ఒక కారణం ఉన్నది. జూలై నాలుగవ తారీకున అమెరికాకు స్వతంత్రం వచ్చింది. రోజు అమెరికాలో ఉత్సవ వాతావరణం ఉంటుంది. 4-7-1776 బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి అమెరికా కు స్వాతంత్రం వచ్చింది. స్వామి ప్రపంచ చరిత్ర క్షుణ్ణం గా తెలిసిన వాడు. దేశాలు ,జాతులు ,మతాలు ,సంస్కృతులు ,చరిత్ర ,ప్రాచ్య పాశ్చాత్య తత్వ శాస్త్రాలు - వీటిమీద అనర్గళం గా రోజుల తరబడి మాట్లాడగలిగే విజ్ఞానం మరియు ధారణా శక్తి ఆయన కు ఉండేది.

స్వామికి అమెరికా దేశంతో అవినాభావ సంబంధం ఉన్నది. స్వామికి అంతర్జాతీయ గుర్తింపు కూడా అక్కడ నుంచే వచ్చింది. అంతే కాదు భవిష్యత్తులో భారతీయ యోగ వేదాంత శాస్త్రాలను భారతీయుల కన్నా అమెరికనులే ఎక్కువ ఆదరిస్తారని ఆచరిస్తారని స్వామికి తెలుసు. స్వామి ఆలోచనలో జూలై నాలుగు అంటే దాస్యం నుంచి స్వాతంత్రానికి, బానిసత్వం నుంచి విముక్తికీ సాగిన పోరాటంలో విజయం సాధించిన రోజు.

కనుకనే నేమో ఆయన తన మహా సమాధికి కూడా జూలై నాలుగునే ఎంచుకున్నాడు. ఇంద్రియాల పట్టు అనే చెరసాల లో దేహ మనే బంధంలో మగ్గుతూ విశ్వాత్మానుభావం అనే స్వాతంత్రానికి దూరం గా బ్రతకటానికి యోగులు ఇష్టపడరు. ఎదురుగా సముద్రం కనిపిస్తూ ఉంటే చిన్న గ్లాసులో ఇరుకుగా కదలడానికి చోటు లేక అవస్త పడే చేపలా వారి మానసిక స్థితి ఉంటుంది. కనుక దేహ దాస్యం తీరి బంధాలు ఎల్లలు ఆకలి దప్పులు లేని అమృతత్వ స్థితిని తాను పొందుతున్న రోజును ఎంచుకుంటూ స్వామి అమెరికాకు చరిత్రాత్మక మైన స్వతంత్రం వచ్చిన జూలై నాలుగును ఎంచుకున్నాడు. అదీ గాక ఆరోజు ఇంకొక ప్రత్యేకతను కలిగి ఉన్నది. ఆరోజు కృష్ణ చతుర్దశి, అంటే మాస శివ రాత్రి.

స్వామికి తాను జ్ఞాన మూర్తి, లోకానికి ఆది గురువు యగు శివుని అంశావతారం అన్న సంగతి తెలుసు. ఆయన విషయం అనేక సార్లు గురుదేవుని నోటివెంట ఇంకా ఇతర సోదర శిష్యుల నుంచి విని ఉన్నాడు. పిల్లల కోసం పరమ శివుని ఎంతో కాలం ప్రార్థించిన మీదట పుట్టిన ఆయనను వీరేంద్ర శివుని వర ప్రసాదిగా ఆయన తల్లి దండ్రులు భావించేవారు. ఇదే భావనను బలపరిచే అనేక సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి.

యువకునిగా సాధనా దినాలలో ఒక నాడు నరేంద్రుడు(స్వామి), తారక్ (స్వామి శివానంద) ఒకే దోమ తెరలో నిద్రించారు. ఒక రాత్రి నిద్ర లేచిన తారక్ ఆశ్చర్య చకితుడైనాడు. కారణం ఆయన పక్కనే నిద్రిస్తున్న నరేంద్రుడు లేడు. ఆయన స్థానంలో చిన్ని పాపల వంటి శివ మూర్తులు కొందరు నిద్రిస్తూ కనిపించారు. అది భ్రమయేమో అని తారక్ కళ్లు నులునుకొని మరీ మరీ ఎంత చూచినా అదే దృశ్యం కనిపించింది. భయం ఆశ్చర్యం ముప్పిరిగోనగా తారక్ రాత్రంతా నిద్ర పోకుండా శివ మూర్తులకు తన కాళ్ళు తగులుతాయేమో అని ఒక మూలకు జరిగి కూర్చొని గడిపాడు.

తెల్ల వారు జాముకో తారక్ కు మాగన్నుగా తూగు వచ్చింది. తెల్ల వారిన తరువాత చూస్తె నరేంద్రుడు నవ్వుతూ కనిపించాడు. శివుని వేషంలో ఉన్న చిన్న పిల్లలు లేరు. ఇదే విషయాన్ని ఆయన నరెంద్రునితో చెబితే, స్వామి నవ్వుతూ అది తారక్ భ్రమగా కొట్టి పారేశాడు. ఇటువంటి అనేక సంఘటనలు సోదర శిష్యులకు కలిగాయి. ఇవన్నీ స్వామికి తెలుసు. కాని ఆయనకు తన స్వరూప జ్ఞానం తను చెయ్య వలసిన పని పూర్తీ అయ్యాకే అందించబడింది. చివరి రోజులలో ఆయనకు తానెవరో తెలిసింది. అంత వరకు జగన్మాత ఆయనను తన మాయతో కప్పి ఉంచింది.

దేహ బంధం నుంచి పరమ స్వాతంత్రం లభించే మహా సమాధి రోజును, స్వాతంత్రానికి సూచిక అయిన జూలై నాలుగవ తారీకుగా ఆయన ఎంచుకున్నాడు. అదే రోజున మాస శివ రాత్రి కావటం, శివునికి ప్రీతి పాత్రమైన బహుళ చతుర్దశి రోజున అది కూడా శివ పూజకు ప్రీతి పాత్రమైన రాత్రి సమయంలో ఆయన దేహాన్ని వదలి పెట్టటం అత్యంత చక్కగా ఉంది.తానెవరో తనకు తెలిసింది కాబట్టే స్వామి మాస శివ రాత్రి రోజున దేహ త్యాగం చేసాడు. బహుశా ఇంతకంటే మంచి సూచనాత్మకమైన రోజును ఎంచుకోవటం సాధ్యపడక పోవచ్చు.

మార్మిక సిద్దాంత రీత్యా నాలుగవ తేదికి ఇంకొక విశిష్టత కూడా ఉన్నది. నాలుగు అనే అంకె జాగ్రత్ స్వప్న సుషుప్తులకు అతీతమైన తురీయ స్థితికి సూచిక. వేదాంతము తురీయ స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ స్థితి గా చెబుతుంది. కనుక వేదాంత శాస్త్ర రీత్యా నాలుగు అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సూచిక. అదీ గాక రోజు మాస శివరాత్రి కావడం కూడా తోడయ్యింది. కనుక స్వామి మహా సమాధికి ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది.

తరువాతి తరంగంలో మరిన్ని జ్యోతిష్య వివరాలు చూద్దాము.
read more " వివేకానంద స్వామి మహాసమాధి-జాతక విశ్లేషణ "