“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, నవంబర్ 2009, ఆదివారం

సత్యసాయి బాబా గారి దర్శనం

నిన్న అనుకోకుండా ఇద్దరు VIP లతో కలిసి పుట్టపర్తి ప్రశాంతి నిలయం దర్శించే అవకాశం కలిగింది. ఉదయం 8 కల్లాప్రశాంతి నిలయం చేరాము. మొదటగా వారి క్యాంటీన్లో ఉపాహారం స్వీకరించి అప్పటి నుంచి 10 వరకూ దర్శనం కోసంభక్తులతో కలిసి వరుసలో కూర్చొని బాబా గారికోసం ఎదురుచూచాము. ఒక బృందం మైకుల వద్ద రుద్రం, పురుష సూక్తంపారాయణ చేస్తున్నారు. తరువాత భజన గీతాలు పాడారు. కాని ఉదయం పూట బాబాగారు బయటకు రాలేదు. దర్శనం లేదు. ఆరోగ్యం బాగాలేదేమో అని కొందరు అన్నారు.

నాతొ వచ్చిన VIP గారికి ఎలాగైనా దర్శనం చేసుకోవాలని అనిపించింది గామోసు, మళ్ళీ సాయంత్రం వద్దాం అన్నారు. సరే మళ్ళీ సాయంత్రం 4.30 కి వచ్చి ముందు వరుసలలో కూచున్నాము. కార్తీక మాసం కావటం చేతనేమో మళ్ళీసాయంత్రం కూడా రుద్రం పారాయణం చేస్తున్నారు. 5 గంటలకు బాబాగారిని చక్రాల కుర్చీలో తీసుకు వచ్చారు. మావరుస ముందు నుంచి పొతున్నపుడు చాలా దగ్గరగా చూడటం తటస్థించింది. మా ముందు నుంచి పొతున్నపుడుబాబాగారు తలతిప్పి ఒక రెండు మూడు సెకన్లు నా కళ్ళలోకి చూచారు.

బాబాగారు బాగా చిక్కినట్లుగా ఉన్నారు. భక్తులు ఇస్తున్న ఉత్తరాలు తీసుకునే ఓపిక కూడా లేనట్లుగా నీరసంగాఉన్నారని తోచింది. చెయ్యెత్తి వెనక ఉన్నవారికి ఉత్తరాలు అందించలేక పోతున్నారు. ఒక బొమ్మను కుర్చీలోకూర్చోపెట్టి తీసుకొస్తున్నారా అనిపించింది. నా కళ్ళలోకి చూచినపుడు, ఒక రకమైన నిస్సహాయతో లేక నిర్లిప్తతోతెలియని vacant look ఆయన కళ్ళలో నాకు కనిపించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని మాత్రం అర్థంఅయింది. ఆయనకు ప్రస్తుతం 84 సంవత్సరాలు అని చెప్పారు.

దర్శనం పూర్తి చేసుకొని తిరిగి ధర్మవరం చేరి రాత్రికి ఎవరి ఊళ్లకు వారు చేరుకున్నాము. దారిలో వేడి వేడి చర్చలుమామూలే కదా. మాతో వచ్చిన వారు ఎవరి అభిప్రాయాలు వారు వెలిబుచ్చారు. ఆయన దేవుడని కొందరు, కాదు ఒకమహానుభావుడు మాత్రమె అని కొందరు, అదీ కాదు ఆయన ప్రస్తుత ట్రస్టు సభ్యుల చేతిలో బందీ అని, ముమ్మిడివరంబాలయోగి కూడా ఇలాగే అయ్యాడు అని ఒకరు-- ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చర్చలు జరిగాయి.

90 ఏళ్ళ వాళ్లు కూడా ఇంకా ఆరోగ్యం గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బాబా గారు అతీత శక్తులు కలిగీ అలాఉన్నారేమిటి అని ఒకాయనకు సందేహం. దానికి ఇంకొకాయన జవాబు చెప్పాడు. బాబాగారు లక్షలాది భక్తుల చెడుకర్మను ఆయన శరీరం మీదకు ఆహ్వానించి మోస్తున్నారు. అందుకే ఆయన ఆరోగ్యం అలా తయారయ్యింది. ఈయనేకాదు ఏ ఇతర మహానుభావుడైనా ఇంతే. ఇలాగే జరుగుతుంది. మీరు చెప్పిన ఆ 90 ఏళ్ళ వ్యక్తి(ఒక సినిమా నటుడులెండి) తన సుఖం తన స్వార్థం చూచుకుంటూ మంచి ఆహారం తింటూ, రెండేళ్లకొకసారి రక్తం మొత్తం మార్పించుకుంటూఉంటాడు.
అందుకే ఆ వయసులోనూ దుక్కలా ఉన్నాడు.అటువంటి వాళ్ళను బాబాగారితో పోలుస్తారా అని గొడవచేసాడు. నేను అందరి మాటలూ వింటూ ఉన్నాను. నన్నూ నా అభిప్రాయం చెప్ప మన్నారు.

ఆయనెవరో ఆయన నిజ స్వరూపమేమిటో నాకు తెలియదు. తెలీనప్పుడు నేను చెప్పలేను. అలా తెలుసుకోవాలనీనాకు లేదు. మనల్ని మనమే పూర్తిగా అర్థం చేసుకోలేము. ఇక ఇతరులను,  ఎలాఅంచనా వెయ్యగలం? మనం దాదాపు ఒక నూరు మందివిదేశీయులను చూచాము. ఆడవారు అయితే చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని మనవారి కన్నా పద్దతిగా పారాయణాలుధ్యానం చేస్తూ కనిపించారు. మొగవారు లాల్చీ పైజామా ధరించి తిలకం లేదా బొట్టు పెట్టుకొని మౌనం గా కూర్చొనిజపమో ధ్యానమో వారికి ఇష్టమైనది చేసుకుంటున్నాను. ఒక విదేశీయుడు అయితే మైకులోనుంచి వినవస్తున్ననమక చమకాలకు అనుగుణంగా పెదవులు కదుపుతూ తానూ వారితో కలిపి పారాయణ చెయ్యటం చూచాను.

ఏ రాజశేఖర రెడ్డినో, జగన్నో ఇదే పెద్దగొంతుతో ఇలాగే విమర్శించే ధైర్యం మీకుందా? ఎందుకని? మొదటి వారిని ఎవరు ఎలా తిట్టినా ఏమీ జరుగదు. మహా అయితే వారి భక్తులు కొందరు వింటే కొంత వాదనజరుగవచ్చు. కాని రెండవ వారి అనుచరులో ఇంకెవరో వింటే మీకు ఏమి జరుగుతుందో మీకు తెలుసు. అలాంటప్పుడుమీది తప్పే కదా.
ఎదుటి వారు మనల్ని ఏమీ చెయ్యలేరు అని తెలిసినపుడు ఏమైనా అంటాము. అదే ఎదుటివాడు మాకు హాని చెయ్య గలడు. అని తెలిసినపుడు లేని మర్యాద నటిస్తాము. ఇది మానవ ప్రవర్తన. అలాదూషించకుండా తార్కికం గా అక్కడ జరుగుతున్న అవకతవకలను నిష్పాక్షికంగా విశ్లేషణ చెయ్యండి. దానికి బాధ్యులుఎవరై ఉండవచ్చో, దానిని ఇంకా ఎలా సరిదిద్దవచ్చో, ఎలా ఇంకా బాగా నడప వచ్చో చెప్పండి. వారికి సలహాల రూపంలోవ్రాయండి. వింటే వింటారు లేకపోతె వారిష్టం. ఇలా నా ధోరణిలో నేనూ చెప్పాను. వారెవరూ సమాధానం చెప్పలేదు.

ఇక పొతే అక్కడ మేము చూచిన ఇతర విషయాల గురించి కొంత చెప్పక తప్పదు. అక్కడి కార్యకర్తల తెచ్చిపెట్టుకున్న మర్యాదా, సంస్కార నటనా, పైకి సాయిరాం అంటూనే చేత్తో దురుసుగా తోసినట్టు చెయ్యటం, ఇవన్నీ షరా మామూలే. పాపం ఒక విదేశీయుడు కనిపించాడు. అతనికి కుడి చెయ్యి కుడి కాలు లేవు. కాలికి మాత్రం తుంటి దగ్గరనుంచి ఏదోస్టీల్ కడ్డీతో కూడిన జైపూర్ ఫుట్ లాటిది బిగించి ఉంది. అతనూ మా ముందు వరసలో కూచొని ఉన్నాడు. మంచికాలును మామూలుగానే మడిచి పెట్టుకున్నాడు. కృత్రిమ కాలు, స్టీల్ కడ్డీ మాత్రం పక్కకు చాపుకున్నాడు. అది చూచిఒక కార్యకర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కృత్రిమ కాలును కూడా సరిగ్గా వరుసలో పెట్టమని ఆదేశించాడు. అతను ఏమీమాట్లాడకుండా ఆ కాలును తన ముందు వరుసలో వారి మధ్యగా ఉంచాడు. వికలాంగుని మీద కూడా బలవంతపుడిసిప్లిన్ రుద్దటం చూచి నాకు ఏమనాలో తోచలేదు.

ఒక పెద్దాయన( కార్యకర్తల నాయకుడిలాగా ఉన్నాడు) నాకు ఒక చోట కూచోమని చోటు చూపించాడు. ఇంతలొఇంకొకాయన హడావుడిగా వచ్చి అదే చోటులో కూర్చోవటంతో నేను ఆయన పక్కన కూర్చున్నాను. దానికి ఆపెద్దాయనకు కోపం వచ్చింది. చెప్పిన చోట కూచోకుండా మీ ఇష్టం వచ్చినట్టు కూచుంటారే? అని మెల్లిగా అయినాకరుకుగా చెప్పాడు. అలా విసుక్కోటానికి కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఒక అడుగు పక్కకు జరిగితే అంతకరుకుగా మాట్లాడవలసిన అవసరం లేదు. తరువాత మా మిత్రుడు ఒకాయన చెప్పాడు. "నువ్వు కలర్ షర్టులోఉన్నావు. నీ పక్కాయన తెల్ల షర్టు పాంటులో వచ్చాడు. అది ఇక్కడి యూనిఫారం. నువ్వు అందులో లేవు గనుకనిన్ను విసుక్కున్నాడు. నీకిచ్చిన చోటులో కూచున్న అతన్ని ఏమీ అనలేదు. మర్యాదగా పక్కన కూచున్న నిన్నువిసుక్కున్నాడు." VIP లైన్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుడి గతేమిటో అనిపించింది. ఇక్కడ బోధలకు ఆచరణకుచాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

తర్వాత మాతో వచ్చిన VIP గారికి ప్రశాంతి నిలయం అంతా కారులో తిప్పి చూపించటం కోసం మేమూ ఆయనతోతిరిగాము. వెనుక వైపు గా ఉన్న షెడ్లలో బాగా వృద్ధులైన ఆడవారు చాలామంది కనిపించారు. బహుశా అదివ్రుద్దాశ్రమమో ఏమో అర్థం కాలేదు. కారులో పోతూనే లోపలికి చూస్తె పెద్ద షెడ్డులో తడికలు గుడ్డలతో చిన్న చిన్నకాబిన్ల లాగా ఉన్నాయి. వాటిలో చాపలు పరచుకొని ఉంటున్నారు. ఆ లోపలే బట్టలు ఉతికి ఆరవేసుకున్నారు. షెడ్లలో స్లం ఏరియా వాతావరణం కనిపించింది.

ఇంకో వైపు ఆధునిక కాటేజీలు వసతులతో ఉన్న వరుసలూ కనిపించాయి. మాకు అందులోనే రెండు రూములుఇచ్చారు. కాని మేము అందులో దిగలేదు. దర్శనం దగ్గరే సమయం సరిపోయింది. మా వీ ఐ పీ గారు మళ్ళీ ట్రెయిన్అందుకోవాలి. అందుకని హడావుడిగా బయలుదేరి ధర్మవరం స్టేషన్ చేరుకున్నాం.

ఇటువంటి విభిన్న వాతావరణాలూ మనస్తత్వాలూ గమనిస్తూ, బాబా గారి దర్శనం చేసుకొని తరువాత జరుతున్న
చర్చలు వింటూ రాత్రికి ఇంటికి చేరాను.