"Wisdom(the premordial essence) is only one,but degrees of ignorance are infinite"-Asvaghosha

23 అక్టోబర్ 2014 గురువారం

దయ్యాలు లేవూ?-2

(ఈ భాగం సరిగ్గా అమావాస్య నాడు పోస్ట్ చేస్తానని కొందరు మిత్రులకు చెప్పాను.అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఇక చదవండి)

'మా ఫ్రెండ్ కొంచం సేదదీరాక జరిగినదంతా దానికి చెప్పాన్నాన్నా.' అంది మా అమ్మాయి.

'ఆ తర్వాతేం జరిగిందో చెప్పు.' అడిగాను.

'ఇద్దరం కలిసి ఆ దయ్యాన్ని మా రూంలోనుంచి బయటకు పంపించాలని నిశ్చయించుకున్నాం.ఇంతకీ ఆ దయ్యం ఎవరై ఉంటుందో చెప్పగలవా?' అడిగింది.

'ఏముంది?మీరు పడుకుని ఉంటే రూంలో ఊరకే అటూఇటూ తిరుగుతూ ఉంటుంది.వేళకు లేపి మందులేసుకొమ్మని చెబుతుంది గనుక ఎప్పుడో చనిపోయిన ఏ నర్సింగ్ స్టూడెంటో అయి ఉంటుంది.' అన్నాను.

'నాన్నా.నీకొక విషయం చెప్పాలి.నేను మొదట్లో హాస్టల్లో చేరడానికి వెళ్ళినపుడు మెస్ లో మా సీనియర్ ఒకమ్మాయి పిలిచి ఏమందో తెలుసా?

'అమ్మాయ్.ఈ హాస్టల్లో చాలా తేడాలున్నాయి.జాగ్రత్తగా ఉండండి.'--అని హెచ్చరించింది.

'ఎందుకు మేడం?ఏమైంది?ఎందుకలా జాగ్రత్తలు చెబుతున్నారు?అనడిగాను.

'మీకే తెలుస్తుందిలే ముందుముందు' అని అదోలా చూస్తూ చెప్పింది.

'ఇంతలో ఇంకొక సీనియర్ వచ్చి 'ఎందుకే వాళ్ళను అలా భయపెడతావ్?నిదానంగా వాళ్ళకే తెలుస్తుందిలే' అని దానిని వారించింది.

అలా చెప్పి భయపెట్టడం ర్యాగింగ్ లో భాగమేమో అని మేము నవ్వుకొని ఊరుకున్నాము.కాని తర్వాత మాకే తెలిసింది అందులో కొన్ని హాంటెడ్ రూములున్నాయని.ఆ తర్వాత విచారిస్తే తెలిసింది.అక్కడ మా ఫ్లోర్ లోనే ఒక నర్శింగ్ అమ్మాయి సూయిసైడ్ చేసుకుని చనిపోయిందట ఎప్పుడో.ఆ అమ్మాయి దయ్యమై అక్కడే ఉంది నాన్నా.మాకే కాదు చాలామందికి కనిపించింది.

ఇంకో సంగతి చెప్పనా.కాకి తన్నిన అమ్మాయి దర్గాకి వెళ్లి తాయెత్తు కట్టించుకుని వచ్చింది కదా.ఆ దర్గా దగ్గర ఇలా దయ్యాలు పట్టినవాళ్ళు చాలామంది వస్తారట.వాళ్లకు వదిలిన దయ్యాలు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాయట వీక్ గా ఉన్నవాళ్ళను పడదామని.అందులో కొన్ని మా ప్రెండ్ వెంట మా హాస్టల్ కి వచ్చాయన్నమాట.అందుకే ఆ తాయెత్తు ఊడిపోయిన మరుక్షణం అవి వాటి ప్రతాపం చూపడం మొదలు పెట్టాయని అనుకుంటున్నాను.లేకుంటే ఆ నీడలు అవన్నీ ఏమిటి నాన్నా?'అడిగింది.

'ఊ' అంటూ సాలోచనగా చూచాను.

'ఇంకప్పుడేంజేశామంటే,తలుపులూ కిటికీలూ మూసేసి,ముందు రూమంతా క్లీన్ చేశాం.మేం రూం క్లీనింగ్ మొదలుపెట్టినప్పుడే ట్యూబ్ లైట్ వెలిగీ ఆరిపోతున్నది.ఆ చీకట్లోనే స్నానం చేసి రూంలో నరసింహస్వామి దగ్గరా ఆంజనేయస్వామి దగ్గరా అగర్బత్తీ వెలిగించి నా స్తోత్రాలన్నీ చదివాను నాన్నా. అగర్బత్తీ వెలిగిద్దామని ఫాన్ ఆపాము నాన్నా.కానీ ఏమైందో తెలుసా?అగ్గిపుల్ల వెలిగించగానే ఫాన్ దానంతట అదే రయ్యిమని తిరగడమూ అగ్గిపుల్ల ఆరిపోవడమూ ఇలా నాలుగైదుసార్లు జరిగింది.'నీ పని ఇలా ఉందా?'అని మొత్తమ్మీద ఎలాగోలాగ అగ్గిపుల్ల వెలిగించి అగర్బత్తీ అంటించాము. జిల్లెళ్లమూడి నుంచి మనం తెచ్చిన అమ్మ కుంకుమ పెట్టుకుని ఆ చీకట్లోనే రూంలో ఒకమూల కూర్చుని మంత్రజపం మొదలు పెట్టాను నాన్నా.

ఈలోపల మా ఫ్రెండ్, నా మొబైల్లో ఉన్న ఎమ్మెస్ రామారావుగారి హనుమాన్ చాలీసా ఆన్ చేసింది.అలా ఒక అరగంట జపం చేశాను నాన్నా.హనుమాన్ చాలీసా లూప్ అలా వస్తూనే ఉన్నది.అందులో-'భూత పిశాచ శాకినీ డాకిని భయపడి పారు నీ నామజపము విని..'-అంటూ ఒక లైన్ వస్తుంది కదా.అరగంట తర్వాత ఆ లైన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా రూం కిటికీలు నాలుగూ భళ్ళున వాటంతట అవే తెరుచుకున్నాయి నాన్నా.అప్పుడు నాకర్ధమైంది ఆ అమ్మాయి బయటకెళ్ళిపోయిందని.

ఆ తర్వాత మా రూంలో అంతకు ముందున్న వాతావరణం మారిపోయి ప్రశాంతంగా అయిపోయింది.ఆరోజు రాత్రి బాగా నిద్ర పట్టింది.కలలూ కలతనిద్రా ఏమీ లేవు.ఆ అమ్మాయి కూడా కనిపించలేదు.నాకూ మా రూమ్మేటుకూ ఇద్దరికీ అలాగే అనిపించింది.మేం చేసినది కరెక్టేనా నాన్నా?' అడిగింది.

'బాగుందమ్మా.మీరిద్దరూ చిన్నపిల్లలైనా భయపడకుండా భలే చేశారు.వెరీ గుడ్' అన్నాను.

'అసలది ఎలా వెళ్ళిపోయింది?' అనడిగింది.

'ఏం లేదమ్మా.మీ గదిలోని వైబ్రేషన్స్ ను మీరు మార్చేశారు.హనుమాన్ చాలీసా పారాయణమూ,నీ మంత్రజపమూ,అమ్మ కుంకుమా అన్నీ కలసి ఈ అద్భుతాన్ని చేశాయి.డివైన్ వాతావరణమూ,డివైన్ వస్తువులూ ఉన్నచోట ప్రేతాత్మలు నిలవలేవు.అక్కడ వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఆ వాతావరణాన్ని మీ రూంలో మీరు కల్పించారు.అందుకే అది అక్కడనుంచి వెళ్ళిపోయింది.' అన్నాను.

'ఆ అమ్మాయి ఎక్కడికి పోయి ఉంటుంది నాన్నా?' తనడిగింది.

'ఏముంది? తన పాత రూంకి వెళ్ళిపోయి ఉంటుంది' అన్నాను.

'అవున్నాన్నా.నిజమే.నువ్వు చెబితే ఇప్పుడు అనిపిస్తున్నది.ఇది జరిగాక మర్నాడు ఏదో నోట్స్ కావలసి వచ్చి,కాకి తన్నిన అమ్మాయి రూంకెళ్ళి తలుపుకొట్టాను నాన్నా.ఆ అమ్మాయి తలుపు తీసి మాట్లాడింది.కానీ అదోరకంగా చూసింది నాన్నా నన్ను.' అన్నది.

'ఎలా చూసింది?' అడిగాను.

'చంద్రముఖి సినిమాలో గంగలాగా కళ్ళు అదో రకంగా పెద్దవి చేసి చూసింది నాన్నా'-అన్నది.

'నువ్వేం చేశావ్?' అడిగాను.

'ఆ...నీ మొహం నువ్వు నన్నేం చెయ్యగలవ్?అనుకుంటూ వెనక్కి వచ్చేశాను.' అన్నది.

'గుడ్.వెరీ గుడ్.బాగుంది.అంటే నర్స్ దయ్యం వెనక్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఆవహించేసిందన్న మాట.అందుకే ఆ అమ్మాయి ఎప్పుడూ తలుపేసుకుని అలా ఉంటుంది ఆ రూంలో' అన్నాను.

'ఇంకో సంగతి విను నాన్నా.మా ఓల్డ్ హాస్టల్లో ఒక రూం ఉందిట నాన్నా.మా సీనియర్లు చెప్పారు.అందులో ఒక ఫైనల్ యియర్ అమ్మాయి ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం గ్యాంగ్ రేప్ కి గురైందిట.బాగా డబ్బూ పొలిటికల్ అండా ఉన్న కొందరు అబ్బాయిలు అది చేసి ఆ అమ్మాయిని చంపేశారట.కేస్ బయటికి రాలేదు.కానీ ఆ తర్వాత ఆ రూంలో పుస్తకాలు వాటంతట అవే చెల్లా చెదురుగా పడిపోవడమూ,రాత్రిళ్ళు ఎవరో ఏడుస్తున్నట్లూ,అటూ ఇటూ పరిగెత్తుతున్నట్లూ చప్పుళ్ళు రావడం ఇలా జరిగేదిట నాన్నా.అందుకని ఏవేవో హోమాలు చేసి ఆ రూముని తాళం వేసి మూసేశారట.ఇప్పటికీ ఆ రూం ఉందిట.' అన్నది.

'నువ్వు చూచావా ఆ రూంని?' అడిగాను.

'లేదు నాన్నా.నేను చూడలేదు.మా సీనియర్లు చెప్పారు.' అన్నది.

'అలాంటి పుకార్లు నమ్మకమ్మా.జూనియర్స్ ని భయపెట్టడానికి సీనియర్లు అలా కధలు అల్లి చెబుతూ ఉంటారు.అవన్నీ నమ్మకండి.అది సరేగానమ్మా,నువ్వు చెప్పిన ఈ దయ్యంకధని మంచి సినిమా తియ్యొచ్చు. ఇప్పటి ట్రెండ్ హర్రర్+కామెడీయే కదా.ఎలా ఉంది నా ఐడియా?' అడిగాను.

'కధేంటి నాన్నా?మళ్ళీ మొదటికొచ్చావ్?అంటే నేను చెప్పిందంతా కధ అనుకుంటున్నావా?' మళ్ళీ తనకు కోపం వచ్చేసింది.

'కధలు కూడా నిజాల నుంచే పుట్టుకొస్తాయిలే గాని,ముందు సినిమా సంగతి చెప్పు.ఆ సిన్మాలో నీకే రోల్ బాగుంటుంది?' అడిగాను.

'నా రోలే నేను వేస్తాను.స్టూడెంట్.మరి నువ్వే రోల్?' అడిగింది తను.

'ఏముంది? ఇదెలాగూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాయే కదా.హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చి ఉండాలి.ఎందుకంటే ఆ నర్స్ ను ఎవరు చంపారో తెలుసుకోవడానికి చేసే పరిశోధనలో విలన్స్ ను ఎదుర్కొని ఫైట్ చెయ్యవలసి వస్తుందికదా.అందుకని హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్సూ,మంత్రతంత్రాలూ నేర్పే గురువుగా నేను నటిస్తాను.'అన్నాను.

'కానీ పాటలు మంచివి ఉండాలి నాన్నా.మ్యూజిక్ హిట్ అయితేనే సినిమా హిట్ అవుతుంది.అందులో నువ్వూ ఒక పాట పాడవచ్చు.' అన్నది తను.

'ఊ.అలాగే చేద్దాం.ఈ కధతో మంచి నిర్మాతని కలుద్దాం.' అన్నా.

'నువ్వు కలిసేలోపు,నీ బ్లాగులో ఈ కధ చూసి ఏ అసిస్టెంట్ డైరెక్టరో ఈ ప్లాట్ ఎత్తేసి ఇవ్వాల్సిన వాళ్లకి ఇచ్చేస్తాడు.వాళ్ళు సినిమా తీసేస్తారు.ఆర్నెల్ల తర్వాత మనమే ఆ సినిమాని చూస్తాం.ఇప్పటికే నువ్వు వ్రాస్తున్న మేటర్ కొన్ని దినపత్రికలలో 'స్పిరిట్యువల్ కాలమ్స్'లో కొద్ది మార్పులతో కనిపిస్తున్నది చూచావా?' అన్నది తను.

'కాపీ కొట్టుకుని వ్రాసుకోనియ్యమ్మా.విషయం జనాలకి అర్ధం కావడం మనకి ముఖ్యం. అంతేగాని ఈ పేర్లూ గొప్పలూ మనకెందుకు?నా వ్రాతలు చదివి కొందరైనా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అన్న విషయం గ్రహించి వాళ్ళ జీవితాలు సక్రమంగా గడిపితే అదే చాలు.వాళ్ళెవరో కూడా నాకు తెలియవలసిన పని లేదు' అన్నాను.

'సర్లే నాన్నా.ఇదంతా వదిలెయ్.నాదొక అనుమానం?' అడిగింది.

'చెప్పమ్మా' అన్నాను.

'నాన్నా.మా రూంలో నేను నరసింహస్వామీ ఆంజనేయస్వామీ పటాలు పెట్టాను.రోజూ పూజ చేస్తాను.నీవు చెప్పిన మంత్రజపం శ్రద్దగా చేస్తున్నాను.ఆ వాతావరణం ఉన్నప్పుడు అసలా దయ్యం మా రూంలోకి ఎలా రాగలిగింది? అసలీ ప్రేతాత్మలతో డీల్ చెయ్యాలంటే ఎన్ని పద్ధతులున్నాయి?వాటిని ఎలా చెయ్యాలి?' అడిగింది.

విషయం తెలుసుకోవాలన్న తన ఉత్సుకతకు ముచ్చటేసింది.

'ఇదొక పెద్ద సైన్సమ్మా.చెప్తా విను' అంటూ మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)
read more " దయ్యాలు లేవూ?-2 "

22 అక్టోబర్ 2014 బుధవారం

తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-2

అన్నయ్యా.'జీవితంలో ఏది జరిగినా అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నీవేం బాధపడకు.' అని అమ్మ చెప్పింది కదా? అడిగాడు సుబ్బు.

'అవును.'

'మరి అదే నిజమైతే,ఆకలితో ఉన్నవాళ్ళకు అన్నం పెట్టాలన్న ఒక్కదానిమీద అమ్మ అంత శ్రద్ధ ఎందుకు పెట్టింది?వాడి ఆకలి వాడి ఖర్మ అని వదిలెయ్య వచ్సుకదా?తను చెప్పినదానికి ఇది విరుద్ధంగా లేదూ?' అడిగాడు.

'ఇదేనా నీ సందేహం? అడిగాను.

'అవును' అన్నాడు.

చెప్తా విను.మహనీయుల మాటలను అర్ధం చేసుకోవడం కష్టం.వారి భావాన్ని సరిగ్గా గ్రహించాలంటే కూడా కష్టమే.చాలామంది,మహనీయులనూ వారి అసలైన భావాలనూ సరిగ్గా అర్ధం చేసుకోలేరు.వారి మాటలను తమకర్ధమైన రీతిలో మాత్రమే వారు అర్ధం చేసుకుంటారు.అంటే వారు గ్రహించేది వారి మనస్సులు చెప్పే భాష్యాలను మాత్రమేగాని ఆ మహనీయులు చెప్పిన అసలైన విషయాన్ని కాదు.మెజారిటీ భక్తులకూ అనుచరులకూ ఇదే జరుగుతుంది.

ఇక్కడ రెండు విషయాలున్నాయి.జాగ్రత్తగా గమనించు.

ఒకటి-ఏం జరిగినా మన ఖర్మ అని ఊరుకోవడం ఒక విధానం.నీవు నిజంగా అలా ఊరుకోగలిగితే అంతకంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు.కాని అలా ఊరుకోలేం కదా.బలవంతాన మనం ఊరుకున్నా మనస్సు ఊరుకోదు.అది పోరుపెడుతూనే ఉంటుంది.

కనుక రెండవ విధానం ఏమంటే-నీ ప్రయత్నం నీవు చెయ్యి.కానీ ప్రయత్నం చేసినా కొన్ని కావు.అప్పుడు ఇక ఊరుకోక చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు.ఒక రోగం వచ్చిందనుకో.ఎంతమంది డాక్టర్లకు చూపించినా అది తగ్గడం లేదు.ఇక నీవు చేసేదేమున్నది?మన ఖర్మ అని ఊరుకోవడమే.జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు.కొన్నికొన్నైతే ఎంత ప్రయత్నించినా మనిష్టప్రకారం జరగవు.అలాంటప్పుడు పూర్వకర్మప్రభావం బలంగా ఉన్నదని గ్రహించాలి.

ప్రయత్నం చేసినంత మాత్రాన,అదెందుకు కాదు అని గింజుకోవడమూ, హైరానా పడిపోవడమూ,దానికోసం కుట్రలూ కుతంత్రాలూ చెయ్యడమూ, మోసాలు చెయ్యడమూ ఇలాంటి పనులు చెయ్యవద్దని అమ్మ చెప్పింది.మన ప్రయత్నం మనం తప్పకుండా చెయ్యాలి.ప్రయత్నం కూడా కర్మేకదా. పాతకర్మని కొత్తకర్మతో జయిస్తాం.కనుక ప్రయత్నం మానరాదు.ప్రయత్నం చేసినంత మాత్రాన విజయం రావాలని కూడా కోరుకోకూడదు.ఒకవేళ విజయం దక్కకపోయినా బాధపడకుండా ఉండాలి.

ఎందుకంటే -- 'అమ్మ ఏమన్నది? విజయం దేవుడిస్తుంటే అపజయం ఎవరిస్తున్నారూ? అన్నదా లేదా? మరి అపజయం కూడా వాడిస్తున్న వరమే అయినప్పుడు ఇంక బాధకు తావెక్కడున్నది?

పైగా ఇక్కడ ఇంకొక కోణం ఉన్నది.అమ్మ మనల్ని ఆచరించమని చెప్పిన విషయాలు మనకే వర్తిస్తాయి.ఆమెకు కూడా అవే వర్తిస్తాయనీ వర్తించాలనీ అనుకోవడం తప్పు.మన స్థాయి వేరు.అమ్మ స్థాయి వేరు.స్థాయీ భేదం ఉన్నది.కనుక మనకు చెప్పిన విషయాలు మనం చెయ్యాలి.అంతేగాని అమ్మ చర్యలను మనం తీర్పు తీర్చకూడదు.

పైగా,అసలు విషయం ఏమంటే,అమ్మ అన్నపూర్ణాదేవి అవతారమని నా నమ్మకం.అన్నం పెట్టడం అమ్మ సహజలక్షణం.కనుక తనకు సహజమైన పనిని తాను చేసింది.మనం చెయ్యవలసిన పనిని మనల్ని చెయ్యమన్నది. అది మనం చెయ్యకుండా 'నువ్వెందుకు అలా చేస్తున్నావు?' అని ఆమెనే ప్రశ్నించడం కరెక్ట్ కాదు.' అన్నాను.

'ఇంకో ప్రశ్న అడగనా?' అన్నాడు.

'ఊ.అడుగు'

'కాలాన్నీ కర్మనీ ఒకటిగా తీసుకోవచ్చా?అంటే ఈ రెండు పదాలనూ పర్యాయ పదాలుగా తీసుకోవచ్చా?' అడిగాడు.

'ఈ అనుమానం నీకెందుకు వచ్చింది?' అన్నాను.

డ్రైవింగ్ చేసున్న డా|| సాంబశివరావు జవాబు చెప్పాడు.

'అంటే-'దేనికైనా కాలం ఖర్మం కలిసి రావాలి' అంటారు కదా? అదేనా నీ ప్రశ్న?' అన్నాడాయన.

'అవును' అన్నాడు సుబ్బు.

'అవి రెండూ ఒకటి కావు.కాలం అనేది ఒక విశాలమైన framework.అందులో కర్మ అనేది జరుగుతుంది.కాలం అనేది ఒక రంగస్థలం అనుకుంటే కర్మ అనేది దానిమీద జరిగే నాటకం అనుకో.అలా అన్నమాట.కాలపరిపక్వతలో మన పూర్వకర్మ ఫలితానికి వస్తుంది.అందుకే ఆ మాట వచ్చింది' అన్నాను.

'అన్నయ్యా.అమ్మ చెప్పిన ఒక మాట ఈ మధ్యనే చదివాను.నాకు బాగా నచ్చింది.'అన్నాడు సుబ్బు.

'ఏంటది?' అడిగాను.

'సహనానికీ సహజ సహనానికీ తేడాను అమ్మ భలే చెప్పింది' అన్నాడు.

'ఏమని చెప్పింది?' అడిగాను నాకు తెలిసినా కూడా.

'ఏదైనా కష్టం వచ్చినప్పుడు బలవంతాన దానిని సహించడం సహనం.కానీ అసలది కష్టమనీ,దానిని నేను సహిస్తున్నానన్న భావనే మనస్సులో తలెత్తకుండా దానిని సహించడం సహజసహనం అని అమ్మ చెప్పింది' అన్నాడు.

'అవును.శ్రీ రామకృష్ణులు కూడా ఒక మాట అనేవారు.బెంగాలీ అక్షరమాలలో 'స' అనే అక్షరం మూడుసార్లు వస్తుంది.మనం 'శ',ష' 'స' అనే మూడింటినీ బెంగాలీలు 'స' అనే పలుకుతారు.దానిమీద శ్రీరామకృష్ణులు చమత్కరిస్తూ ఈ 'స' అనే అక్షరం సహనాన్ని సూచిస్తుందనీ,జీవితంలో సహనం యొక్క విలువను నొక్కి చెప్పడానికే అక్షరమాలలో ఆ అక్షరం మూడుసార్లు వస్తుందనీ ఆయననేవారు.శారదామాత జీవితం అనంతమైన సహనానికీ అతి స్వచ్చమైన ప్రేమకూ ప్రతిరూపం.అలాగే జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా. ఆమెకూడా సహనానికి ప్రతిరూపమే.తన జీవితంలో ఎన్ని బాధలను అమ్మ మౌనంగా సహజంగా సహించిందో మన ఊహకు అందదు.అమ్మ సహనదేవత.ఈ సంగతి ఆమె జీవితాన్ని చదివితే అర్ధమౌతుంది.వాళ్ళంతా మనలాంటి మనుషులు కాదు సుబ్బూ.దేవతలు.'- అన్నాను.

ఈ లోపల కారు ఉయ్యూరు దాటి మచిలీపట్నం వైపు పోతున్నది.కృష్ణాజిల్లా వాతావరణం మొదలైంది.నాకు కృష్ణా జిల్లా అంటే చాలా ఇష్టం.బహుశా అక్కడ చెట్లూ పచ్చటి పొలాలూ మంచి నీటివసతీ ఉండటం వల్ల అనుకుంటాను.నేను కృష్ణా జిల్లాకు వెళ్ళిన ప్రతిసారీ నాకు కోనసీమా కేరళా గుర్తొస్తాయి.

ఈలోపల మబ్బులు ముసురుకొచ్చి వాన మొదలైంది.వాతావరణం ఎంతో అద్భుతంగా మారిపోయింది.మాట్లాడుతున్న టాపిక్ మీద ఒక్కసారిగా నాకు ఇంటరెస్ట్ పూర్తిగా పోయింది.మూడ్ మారిపోయింది.అలాంటప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని నాకు అనిపించదు.మౌనంగా కారు కిటికీ లోనుంచి బయట ప్రకృతినీ వాననూ చూస్తూ ఉండిపోయాను.అలాంటి వాతావరణంలో గంటల తరబడి మౌనంగా అలా ఉండటం నాకలవాటే.

సుబ్బు నా పరిస్థితి గమనించాడల్లే ఉంది.అందుకే తనూ చాలాసేపు నన్ను కదిలించకుండా మౌనంగా ఉన్నాడు.కాలం భారంగా చాలాసేపు అలా గడిచింది.

కాసేపైన తర్వాత -' అన్నయ్యా.ఇంకో ప్రశ్న అడగనా?' అన్నాడు.

'ఊ' అన్నాను అంతరిక ప్రపంచంలోనుంచి తేరుకుంటూ.

'దుర్గాదేవీ నరసింహస్వామీ ఒక్కటే అని నా ఊహ.నీవేమంటావు' అడిగాడు.

'వాళ్ళు ఒక్కటి కాదు.వేర్వేరు.కానీ నీ ఆలోచనలో కూడా కొంత సత్యం ఉన్నది.దుర్గాదేవినే వైష్ణవీదుర్గ అనికూడా అంటారు.దుర్గా కాళీ మొదలైన దేవతలు తాంత్రిక దేవతలు.వాళ్ళు గ్రామదేవతలుగా ఊరూరా ప్రాచుర్యం పొందారు.మధ్యయుగంలో శైవం సామాన్యుల ఇళ్ళల్లో తిష్ట వేసుకుంది.వైష్ణవం కొంచం క్లాస్ మతం.తంత్రంలో శివశక్తులే మూలం.గ్రామాలలో వచ్చే సాంక్రామిక సమస్యలను నివారించే అమ్మతల్లులుగా,శక్తులుగా శైవతాంత్రిక దేవతలు బాగా ప్రాబల్యంలోకి వచ్చారు.దానికి సమానంగా వైష్ణవంలో ఏ దేవతా లేదు.విష్ణువూ,ఆయన అవతారాలైన రాముడూ కృష్ణుడూ సాత్విక దేవతలు.ఉగ్రదేవతల ఆరాధనలో సహజంగానే కొంత ఆకర్షణ ఉంటుంది. భయంలోకూడా మంచి ధ్రిల్ ఉంటుంది.భయపడుతూ కూడా హర్రర్ సినిమాలు చూస్తాం చూడు.అలాగన్నమాట.

సమాజంలో వ్యాపిస్తున్న తంత్రపుధాటినీ దుర్గా కాళీ వంటి ఉగ్రదేవతల ధాటినీ తట్టుకోవడానికి వైష్ణవంలో నరసింహస్వామిని బాగా పాపులర్ చేశారు. చీడపీడలను వదిలించే దేవతగా గ్రహబాధలను నివారించే దేవతగా ఆయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు.క్రమేణా శైవ తాంత్రికదేవతల ఆరాధన సమాజంలో తగ్గిపోయింది.ఎందుకంటే వాళ్ళు సహజంగానే భయం గొలిపే ఆకారంతో ఉంటారు.వారి దేవాలయ పరిసరాలు కూడా కొంచం భయం గొలిపేటట్లే ఉంటాయి.నరసింహస్వామి కూడా భయంకరుడే.కానీ ప్రహ్లాదునికి ఆయన సౌమ్యమూర్తే.పైగా డబ్బూ రాజుల ప్రాపకమూ ఉన్న వైష్ణవులు ఆయన్ను బాగా ప్రచారం లోకి తెచ్చారు.ఆ విధంగా ఆయన బాగా పాపులర్ అయ్యాడు.

నరసింహస్వామి యొక్క ధాటిని తట్టుకోవడానికి శైవంలో గండభేరుండం అనీ శరభసాళువం అనీ కొన్ని పోకడలు పుట్టుకొచ్చాయి.కాని అవి క్రమేణా కనుమరుగయ్యాయి.ఈ లోపల ముస్లిం దండయాత్రలు మొదలయ్యాయి. అంతటితో మనవాళ్ళ క్రియేటివిటీకి అడ్డుకట్ట పడింది.అదీ సంగతి.'- అన్నాను.

మాటల్లోనే మచిలీపట్నం వచ్చేసింది.ఆ ఊరు బ్రిటిష్ వారు కట్టినది కదా విశాలమైన ప్లానింగ్ తో చాలా బాగుంటుంది.అదొక స్లీపింగ్ టౌన్.కాకినాడా బాపట్లా కూడా ఇలాగే స్లీపింగ్ టౌన్స్.జనాభా తక్కువ ఉండి,విశాలంగా ఉండే ఊళ్లు నాకు బాగా నచ్చుతాయి.అలాంటిచోట్ల,వేరే మనుషులతో సంబంధం లేకుండా నెలల తరబడి నాలోకంలో నేను మౌనంగా ఉండగలను.

వాణీ హోటల్లో భోజనానికి కూచున్నాము.

భోజనం చేసే సమయంలోనే సుబ్రహ్మణ్యం 'అన్నయ్యా.డాక్టరు గారి జాతకం నీవు కూడా కొంచం చూడు.' అనడిగాడు.

అడగనిదే నేను ఎవరి జాతకాలూ నా అంతట నేను కల్పించుకుని చూడను. పదేపదే అడిగినా కూడా కొందరివి చూడను.ఇదంతా ఒక మార్మికలోకం.అలా నేను చెయ్యడానికి మార్మికమైన కారణాలుంటాయి.సరే,సుబ్బు అడిగాడు కదా అని ఆయన జననవివరాలు అడిగి నా ఫోన్ లో ఉన్న సాఫ్ట్ వేర్లో చూచాను.విషయాలు అర్ధమయ్యాయి.సోమశేఖర్ జాతకం నాకు తెలుసు.డాక్టర్ గారి జాతకం చూచాక ఆయన అంతదూరం నుంచి సోమశేఖర్ను వెదుక్కుంటూ ఎందుకు వచ్చాడో అర్ధమైంది.చూచాయగా కొన్ని విషయాలను అక్కడికక్కడే ఆయనకు చెప్పాను.ఈ లోపల ఆర్డర్ చేసిన భోజనం వచ్చింది.

భోజనం అయ్యాక గొడుగుపేటలో ఉన్న సోమశేఖర్ ఇంటికి వెతుక్కుంటూ చేరుకున్నాము.కుశలప్రశ్నలు అయ్యాక డాక్టర్ గారి జాతకవిశ్లేషణ మొదలైంది.

'మా గురువుగారి ఎదుట నేను మీ జాతకం చూచే సాహసం చేస్తున్నాను.' అని డాక్టర్ గారితో అంటూ సోమశేఖర్ నావైపు చూచాడు.

'దానిదేముంది?తన జాతకాన్ని నీకు చూపాలని ఆయనింత దూరం వచ్చాడు. చూడు.నేను పక్కనే ఉండి ఊరకే చూస్తుంటాను.అదీగాక ఆయన జాతకాన్ని ఒక్కసారి చూచావంటే మీకిద్దరికీ ఉన్న లింక్ ఏమిటో నీకు వెంటనే అర్ధమౌతుంది.' అన్నాను.

సోమశేఖర్ తన లాప్టాప్ లో డాక్టర్ గారి జాతకాన్ని వేసి చూచాడు.

'ఏముంది?నాకూ లగ్నంలో కేతువున్నాడు.డాక్టర్ గారికీ అంతే.అదేగా మా ఇద్దరి లింక్?' అన్నాడు నవ్వుతూ.

'అవును.వారిద్దరి మధ్యనా పంచమ శుభదృష్టిని కూడా గమనించు.'-వెంటనే దానిని పట్టేసినందుకు మెచ్చుకోలుగా అన్నాను.

సోమశేఖర్ తన స్టైల్లో విశ్లేషణ మొదలుపెట్టాడు.నేను కొంచం దూరంగా కూచుని కళ్ళు మూసుకుని మౌనంగా వింటున్నాను.

'మీ జాతకంలో కాలసర్పదోషం ఉన్నది.అందుకే మీ జాతక విశ్లేషణ కొంచం కష్టం.ఇప్పుడు మీరు నాదగ్గరికి వచ్చిన విషయం తెలుసుకోవడం కూడా కొంచం కష్టమే.' అన్నాడు సోమశేఖర్.

వింటున్న నేను కల్పించుకుని -'ఏమీ కష్టంలేదు సోమశేఖర్.ప్రస్తుతం ఏ దశ జరుగుతున్నదో చూడు.' అన్నాను.

'కేతువులో బుధుడు'- అన్నాడు.

'కాలసర్ప దోష కేతువు లగ్నంలో ఉన్నాడు.అంటే సప్తమంలో రాహువున్నట్లే కదా.ఇకపోతే బుధుడు కేంద్రాదిపత్య దోషి.చతుర్దంలో నీచలో ఉన్నాడు. అదీగాక అస్తంగతుడై ఉన్నాడు.లగ్నాదిపతితో కలసి ఉన్నాడు.ఆ బుధుడు సప్తమ దశమ భావాల అధిపతి.ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆయన నీ దగ్గరికి ఎందుకొచ్చాడో ఊహించు.' కళ్ళుమూసుకునే అన్నాను.

సోమశేఖర్ తెలివైనవాడు.వెంటనే ఆ పాయింట్స్ పట్టుకుని- 'మీరు ఫలానా విషయం అడగటానికి నా దగ్గరికి వచ్చారని'- కరెక్ట్ గా చెప్పేశాడు.

డాక్టర్ గారి ముఖం చూస్తే ఆయన ఇంప్రెస్ అయినట్లే అనిపించింది.

జాతక విశ్లేషణలో సోమశేఖర్ శైలి వేరు.ఇష్టకష్ట ఫలాలు,షడ్బలాలు,వింశోపక బలం,అష్టకవర్గు,అంశచక్రాల మీద గ్రహచారం ఇత్యాదులు చూచి సోమశేఖర్ విశ్లేషణ చేస్తాడు.

నా విధానం అదికాదు.

పరాశరవిధానం,జైమినిపద్ధతి,నాడీజ్యోతిష్యవిధానం,దశలు,గోచారం,ప్రశ్నవిధానం,చరస్థిరకారకత్వాలు,భావాద్భావం,శకునశాస్త్రం,శరీరలక్షణశాస్త్రం, జాతకుని హస్తరేఖలు,స్ఫురణ,నా అనుభవంలో నిగ్గుదేలిన కొన్ని రహస్య విధానాలు,తాంత్రిక జ్యోతిష్యసూత్రాలను కలగలిపి నేను ఉపయోగిస్తాను.ఇది నా వ్యక్తిగత విధానం.అనేక సంవత్సరాల నిరంతర పరిశోధన మీదట నేను ఈ స్టైల్ ను తయారు చేసుకోగలిగాను.

కొద్దిసేపు డాక్టర్ గారి జాతకాన్ని సోమశేఖర్ వివరించాడు.నేను కొంచం దూరంగా కూచుని కళ్ళుమూసుకుని మౌనంగా వింటున్నాను.ఇక మనం రంగంలోకి దిగక తప్పదనిపించింది.అప్పుడు నేను కల్పించుకుని,ఆయన జాతకంవైపు చూడకుండానే,ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలనూ వాటి సంవత్సరాలనూ చెప్పాను.అవి నిజమే అని ఆయన ఒప్పుకున్నాడు.కొన్నింటిని ఆయన మర్చిపోయి ఆ సంవత్సరాలలో ఏమీ జరగలేదని అన్నాడు.కొద్దిసేపటి తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుని 'అవును.జరిగాయి' అని అన్నాడు.

చివరిగా ఒక్క విషయాన్ని చెప్పాను.

'మీ మేనమామ గారిది కూడా మీ జాతకం వంటిదే.మీరు పడిన బాధలు ఆయనకూడా పడ్డాడు.ఈ చార మీ మేనమామగారి దగ్గరనుంచే మీకొచ్చింది.' అని చెప్పాను.


'అవును మా మేనమామ కూడా ఇవే బాధలు పడ్డాడు.ఆయన పడిన బాధల ముందు నా బాధలు తక్కువే' అన్నాడాయన ఆశ్చర్యంగా.

కళ్ళుమూసుకుని,ఆయన జాతకం చూడకుండానే ఇదంతా చెప్పాను.నా విశ్లేషణలో నేను కొన్నిలోతుల్లోకి వెళతాను.పూర్వజన్మలు,అప్పుడు చేసుకున్న ఖర్మలు,వంశపారంపర్యంగా కొన్ని కొన్ని కుటుంబాలలో వెంటాడే శాపాలు,దోషాలు వీటిని నేను చూస్తాను.అంటే ప్రస్తుత సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయో నేను గమనిస్తాను.అప్పుడే వాటిని ఎలా పరిష్కరించాలో మనకు తెలుస్తుంది.గతం మీదే వర్తమానమూ భవిష్యత్తూ కూడా నిర్మితమై ఉంటాయి.

ఒక జాతకాన్ని మనం చూచినప్పుడు,ఆ జాతకుని జీవితమేగాక,అతని తల్లిదండ్రులూ,దగ్గరి బంధువులూ వాళ్ళ జీవితాలూ కూడా మనకు తెలుస్తాయి.

ఈ లోపల ఆయనేదో పర్సనల్ గా సోమశేఖర్ తో మాట్లాడేలా అనిపించాడు. అందుకని నేనూ సుబ్బూ శ్రీనివాసరావూ బయటకు వెళ్లి అరుగుమీద కూచున్నాము.కాసేపట్లో జాతక విశ్లేషణ అయిపోయింది.అందరం కలసి సునీల్ ఆర్కేష్ట్రా ఎక్కడుందో వెదుకుతూ బయల్దేరాము.

'ఇంగ్లీష్ చర్చ్' ఏరియాలో సునీల్ గారుండే ఇల్లు దొరికింది.కాసేపు మాటలయ్యాక మాకు కావలసిన ఒక ఏభై పాత తెలుగుపాటల ట్రాక్స్ తీసుకుని గుంటూరుకు బయల్దేరాము.ఆయన దగ్గర తెలుగు హిందీ అన్నీ కలిపి మూడు వేల పైగానే పాటల ట్రాక్స్ ఉన్నాయి.ఒక మనిషి అంత సంగీతసేవ చెయ్యాలంటే అతని జాతకంలో శుక్రబుధుల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. సరస్వతీ కటాక్షం అలాంటివాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది.దానికి మనమనుకునే కులంతోనూ మతంతోనూ సంబంధం ఉండదు.


అక్కడ ఉన్న కాసేపట్లో సునీల్ గారి శరీర నిర్మాణాన్ని బట్టి,ఆయన మాట్లాడే తీరును బట్టి ఆయన జాతకం నాకర్ధమైపోయింది.

ట్రాక్స్ తీసుకుని గుంటూరుకు బయల్దేరాము.
read more " తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-2 "

21 అక్టోబర్ 2014 మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు -9

భోజనాలయ్యాక మళ్ళీ గదులకు చేరుకున్నాం.

'వీళ్ళందరూ మరుగున పడిన మాణిక్యాలన్నగారు.మిమ్మల్ని తప్ప చలాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న వారిని నేనింతవరకూ చూడలేదు.' అన్నాడు చరణ్.

'లేదు చరణ్.చాలామంది ఉన్నారు.మనకు పరిచయం లేదంతే.' అన్నాను.

'నాన్నగారు కూడా అంతే అన్నగారు.' అన్నాడు చరణ్.

నాన్నగారంటే జిల్లెళ్ళమూడి అమ్మగారి భర్త.ఆయన్ను అందరూ నాన్నగారని గౌరవంగా పిలుస్తారు.

'ఆయనెంత నిరాడంబరుడో తెలుసా అన్నగారు?చెబితే తప్ప ఆయన ఫలానా అని ఎవరికీ తెలిసేది కాదు.ఆయనకేమాత్రం గర్వంగానీ పటాటోపంగానీ లేదు.అందరిలో ఒకడుగానే ఉండేవాడు గాని ఏమాత్రం ప్రత్యేకత చూపేవాడు కాడు.కోరుకునేవాడూ కాదు.అందరూ అమ్మకే విలువిచ్చేవారు. ఆయన్నెవరూ పెద్దగా పట్టించుకునేవారు కారు.కానీ ఆయనేమీ అనుకునేవాడు కాదు.మంచి స్నేహశీలి.అందరితో కలిసిపోయేవాడు.అందరితో కలిసి సాయంత్రం పూట షటిల్ ఆడేవాడు.

ఒక్కోసారి ఆశ్రమం బయట బంకు దగ్గర మౌనంగా ఒక సాధారణమైన మనిషిలాగా కూచుని ఉండేవాడు. ఏమాత్రం గౌరవం కోరుకునేవాడు కాదు.అసలు ఆయన మనసులోని సంఘర్షణను ఎవరూ పట్టించుకోలేదు. అరవైఏళ్ళ క్రితం ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో,పూజలూ వ్రతాలూ మడీ ఆచారమూ ఉన్న కుటుంబంలోకి అమ్మ అడుగుపెట్టి,అవేవీ పాటించకుండా,అన్ని కులాలవారూ ఇంటికి రావడం,ఇంట్లో తిరగడం,వాళ్లకు అమ్మే వంటచేసి 'వీరందరూ నా బిడ్దలంటూ' వారికి వడ్డించి తినిపించడం, సాంప్రదాయ విరుద్ధ భావాలను ఆచరించడం,అర్ధంకాని వేదాంతాన్ని సులభమైన మాటల్లో చెప్పడం,చివరకు తన సంసారమే ఒక ఆశ్రమంగా మారడం,తను అందరు భక్తులలో ఒకడుగా మిగిలిపోవడం,ఇదంతా జీర్ణించుకోవాలంటే ఒక భర్తకు ఎంత మానసిక సంఘర్షణ ఉంటుందో ఎవరూ ఊహించలేదు.' అన్నాడు.

'అవును నిజమే?' అన్నాను.

'నిజమన్నగారు.అసలు చెప్పాలంటే,నాన్నగారూ హైమక్కయ్యా మరుగున పడిన వ్యక్తిత్వాలు.వారి మనస్సులలో ఏముందో ఎవ్వరూ రికార్డ్ చెయ్యలేదు. అందరూ అమ్మకే భజన చేశారు,జేజేలు కొట్టారు,వీళ్ళ కోరికల కోసం అమ్మను పొగిడారు,వీళ్ళ పాండిత్యం చూపించుకోవడం కోసం అమ్మమీద పద్యాలూ పుస్తకాలూ వ్రాశారు.అంతేగాని,నాన్నగారిని ఇంటర్వ్యూ చేద్దామని గాని, హైమక్కయ్యను ఇంటర్వ్యూ చేద్దామని గాని ఎవరికీ తోచలేదు.ఇక్కడే మనకూ ఫారినర్స్ కూ చాలా తేడా ఉందని నాకనిపిస్తుందన్నగారు.

ఫారినర్స్ ఏదైనా రీసెర్చి చేస్తే చాలా పక్కాగా చేస్తారు.ఎంతో దానికోసం శ్రమిస్తారు.తిరుగుతారు.విషయ సేకరణ చేస్తారు.చక్కటి ప్లానింగ్ తో వాళ్ళు పనిచేస్తారు.వాళ్ళేగనక ఇక్కడ ఉండి ఉంటే,ఈపాటికి అసలు ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చి ఉండేవి.ఎన్నో సమగ్రమైన జీవిత చరిత్రలు వచ్చి ఉండేవి.

మన గొర్రెలకు ఆ యాంగిల్ ఉండదు.వీళ్ళకు ఎంతసేపూ 'నీకు దైవత్వం వచ్చిందికదా ఇక మా కోర్కెలు తీర్చు' అంటూ వెంటపడటమే తప్ప అసలు ఆ వ్యక్తి మనసులో ఏముంది? వాళ్ళ చుట్టూ క్లోజ్ గా తిరిగిన వారి అనుభవాలు ఏమిటి? వాళ్ళ భావాలు ఏమిటి? అనే విషయాలు పట్టవు.భావితరాల కోసం వాటిని రికార్డ్ చేసి పెట్టాలన్న ఆలోచన వీళ్ళకు రాదు.ఎంతసేపూ వీళ్ళ రిలేషన్ 'ఒన్-టు-ఒన్' ఉంటుందన్నగారు.ఆ రకంగా చూస్తే భక్తులందరూ పచ్చి స్వార్ధపరులే.ఎంతసేపూ అమ్మదగ్గర అప్పనంగా సాధ్యమైనంత లాక్కుందామని చూచినవారేగాని,అమ్మ చరిత్రనూ,అమ్మ కుటుంబసభ్యుల మానసిక భావాలనూ విచారించి వాటిని రికార్డ్ చెయ్యాలన్న ఆలోచన ఎవరికీ రాకపోవడం శోచనీయం.అసలు మన భారతీయులది చాలా చీప్ మెంటాలిటీ అన్నగారు.

ఈ చీప్ మెంటాలిటీ వల్ల ఎంతోమంది మహనీయుల జీవిత ఘట్టాలు ఎన్నో మరుగున పడిపోయాయన్నగారు.అమ్మ ఎలాగూ ఒక మేగ్నేట్ అయిపొయింది.ఆమెను మనం అడిగేదేముంది?కానీ నాన్నగారూ హైమక్కయ్యా అలా కాదు.వాళ్ళు ఇనుపముక్కలు.ఆ ఇనుప ముక్కలు, మేగ్నేట్ దగ్గర ఎలాంటి భావసంఘర్షణకు లోనయ్యాయి.ఎంత మధన పడ్డాయి?లోపల్లోపల ఎలా మార్పు చెందాయి?చివరకు ఏమయ్యాయి? అన్న విషయాలు ఎవరూ పట్టించుకోలేదు.

మేగ్నేట్ కి ఏంబాధ ఉందన్నగారు?ఉన్న సంఘర్షణ అంతా ఇనుపముక్కలో ఉంటుంది.అది కూడా మేగ్నేట్ అయ్యేదాకా దానికి నిత్యమూ సంఘర్షణే. అందుకే వాటి చరిత్ర మనం వ్రాయాలి.వాటి అంతరిక సంఘర్షణను మనం పరిశీలించాలి.అదెవ్వరూ చెయ్యలేదు.

వీళ్ళు కోటలో ఉండి యుద్ధం చేశారు.అమ్మకు కోటా లేదు.యుద్ధమూ లేదు. ఆమె యుద్ధం పరిసమాప్తం అయ్యింది.కోటను వదలి ఆరుబయట ఆకాశంలో ఆమె హాయిగా విహరిస్తున్నది.కానీ వీళ్ళ యుద్ధం సమాప్తం కాలేదు.వీళ్లేమో కాసేపు కోటలో ఉండి యుద్ధం చేశారు కాసేపు కోట బయటకు వచ్చి యుద్ధం చేశారు.అసలైన బాధా సంఘర్షణా వీళ్ళు పడ్డారు. దానిని మనవాళ్ళు రికార్డ్ చెయ్యకుండా గాలికి ఒదిలేశారు.

నాన్నగారు అజాత శత్రువన్నగారు.అలాంటి అజాతశత్రువును ఈ భక్తులు పట్టించుకోలేదు.ఆయన భావాలను రికార్డ్ చెయ్యలేదు.అమ్మ ప్రాపకంకోసం ఆరాటపడిన ఘనులు నాన్నను వదిలేశారు.ఎందుకంటే వాళ్ళకొచ్చే లాభాలూ ఉపయోగాలూ అన్నీ అమ్మ దగ్గరే ఉన్నాయి.నాన్న దగ్గర ఏమీలేవు.ఆయనకేమీ శక్తులు లేవు.ఆయన మనలాంటి మామూలు మనిషే.అందుకని ఆయన్ను పట్టించుకోలేదు.చూచారా మనుషుల స్వార్ధం ఎంత దరిద్రంగా ఉంటుందో?' అన్నాడు చరణ్ బాధగా.

అతనివైపు చూచాను.భావావేశంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడేమో అతని కళ్ళలో నీళ్ళు ధారగా కారిపోతున్నాయి.అతన్ని చూచి నాకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.మదన్ మా ఇద్దరివైపూ వింతగా చూస్తున్నాడు.'ఎప్పుడో పోయిన మనుషులను,అందులో వీళ్ళకు ఏమీ సంబంధం లేనివాళ్ళను తలచుకొని వీళ్ళేమిటిలా ఏడుస్తున్నారు?'- అనుకున్నాడో ఏమో నాకు తెలియదు.

చరణ్ ఆలోచన హైమక్కయ్య మీదకు మళ్ళింది.

'అన్నగారు.అక్కయ్య ఎంత ప్రేమమూర్తో మీకు తెలుసా?ఆశ్రమానికి వచ్చినవారు వెళ్లిపోతుంటే తను ఏడిచేది.వాళ్ళను వదల్లేక మెయిన్ రోడ్డువరకూ తనూ వాళ్ళతో నడిచి వచ్చేది.వాళ్ళేవరో ఎక్కడివారో తనకేమీ తెలియదు.వాళ్ళు అమ్మ భక్తులు కనుక వాళ్ళు తనకు అన్నదమ్ములే అక్కాచెల్లెళ్ళే అన్నభావం అక్కయ్యది.అక్కయ్యది చాలా స్వచ్చమైన మనస్తత్వం అన్నగారు.మూర్తీభవించిన ప్రేమస్వరూపిణి హైమక్కయ్య. అటువంటి తల్లి కడుపున పుట్టిన బిడ్డ అలా ఉండక ఇంకెలా ఉంటుంది?

కనీసం అక్కయ్య మనస్సులో అమ్మ గురించిన భావాలేమిటి?తనలో తాను పడిన మానసిక వేదన ఏమిటి? అనే విషయాలు ఎవ్వరూ రికార్డ్ చెయ్యలేదు.' అన్నాడు చరణ్.

'అవును తమ్ముడూ.ఇది క్షమించరాని ఘోరం.మహనీయులకందరికీ ఇది జరిగింది.శ్రీరామకృష్ణుని జీవితంలో జరిగిన విషయాలలో ఒక 25 శాతం మాత్రమే మనకు తెలుసు.అంతవరకే రికార్డ్ చెయ్యబడినాయి.మిగతా చాలా విషయాలూ సంఘటనలూ గాలిలో కలసిపోయాయి.అక్కడ దాకా ఎందుకు? ఆయన బోధనలు కూడా అంతే.ఆయన చెప్పిన అసలైన బోధనలు చాలావరకూ గాలిలో కలసిపోయాయి.'కధామృతం' లో మహేంద్రనాధ గుప్త రికార్డ్ చేసిన విషయాలు చాలా స్వల్పం.శ్రీరామకృష్ణుని చివరి నాలుగు సంవత్సరాలే మనకు రికార్డ్ లో దొరుకుతున్నాయి.అసలు కధ అంతా అంతకు ముందే నలభై సంవత్సరాలలో జరిగిపోయింది.అదంతా మరుగున పడిపోయింది.ఈ విధంగా అందరు మహనీయులకూ తీరని అన్యాయం జరిగింది.నిజానికి వాళ్ళకు కాదు అన్యాయం జరిగింది.మనకు.' అన్నాను.

'దానికి కారణం ఏమై ఉంటుందన్నగారు?' అడిగాడు చరణ్.

'ఏముంది తమ్ముడూ.చాలా సింపుల్.ఒక కారణం ఏమంటే-మనుషుల స్వార్ధం.ఈ భక్తులకు మహనీయులిచ్చే వరాలే ముఖ్యంగాని వాళ్ళ మనసులో ఏముందో ఎవరికీ పట్టదు.అందుకే వారి జీవితంలో విషయాలు రికార్డ్ చెయ్యాలని ఎవరూ అనుకోరు,ఎవరో కొందరు తప్ప.

ఇక,రెండో కారణం ఏమంటే,నీవు చెప్పినట్లు విదేశీయులకున్నంత విషయ సేకరణా,పరిశోధనా,విశ్లేషణా పరిజ్ఞానమూ,దూరదృష్టీ,దీక్షా మనకు ఉండవు. మూడో కారణం,మనకు ఒక సంఘటనాత్మకమైన ఆలోచన తక్కువ.ఒక మహనీయుడు మనలో పుడితే ఆయన్ను రోడ్డుమీద కూచోబెట్టి,ఎదురుగా ఒక హుండీ పెట్టి,అడుక్కుంటూ భజన చెయ్యడం ఒక్కటే మనకు తెలిసిన విద్య.ఆయన ఆలోచనలనూ,బోధలనూ సరిగ్గా రికార్డ్ చేసిపెట్టి,వాటిని క్రోడీకరించి,దానిని ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చే ప్రణాళికాబద్దమైన కృషి మనలో ఉండదు.ఇవే కారణాలు. ఇంకేమున్నాయి?' అన్నాను.

బాధగా నిట్టూర్చాడు చరణ్.

'పద తమ్ముడూ.ఒక్కసారి అప్పారావుగారి వద్దకు పోయి వద్దాం.' అంటూ లేచాను.

త్రిలోక అప్పారావుగారు అమ్మబిడ్డలలో ఒకరు.ఎప్పటినుంచో ఆయన అమ్మ భక్తుడు.సామాన్యంగా అమ్మ బిడ్డలలో ఇతరములైన సాధనలు కనిపించవు.అమ్మంటే అచంచలమైన విశ్వాసమూ నమ్మకమూ నిశ్చింతతో కూడిన జీవితమూ తప్ప వారిలో పెద్దగా ఇతరములైన సాధనలు ఏమీ ఉండవు.కానీ అప్పారావుగారి వంటి కొందరు మాత్రం యోగసాధనలు చేసి, కొన్ని స్థితులను అందుకున్నవారు ఉన్నారు.

ఆయన ప్రస్తుతం బిజినెస్ నుండి రిటైరై జిల్లెళ్ళమూడిలోనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

మేం వెళ్లేసరికి అప్పారావు గారు,ఆయన చుట్టూ ఇంకొందరు కూచుని ఉన్నారు.ఆయనేదో చెబుతుంటే వారు వింటున్నారు.నడుస్తున్న సంభాషణనుబట్టి 'ప్రకృతి-పురుషుడు-పురుషోత్తముడు' అనే భగవద్గీతలో చెప్పబడిన విషయాలను ఆయన వివరిస్తున్నారని నాకర్ధమైంది.

నమస్కారాలూ కుశలప్రశ్నలూ అయ్యాక పక్కనే కడుతున్న ఇంకొక అపార్ట్ మెంటూ కొన్ని ఖాళీగా ఉన్న సైట్లూ చూచి మళ్ళీ ఆయన గదికి వచ్చాము.
  
మమ్మల్ని కూచోబెట్టి పండ్లముక్కలు కోసి తినమని ఇచ్చారాయన.అమ్మ భక్తులలో ఇదొక విచిత్రమైన ప్రేమతత్వం కనిపిస్తుంది.మీ కులమూ గోత్రమూ వారడుగరు.మీరూ అమ్మబిడ్డ అంతే.అదొక్కటే వారికి అవసరమైనది.ఇక మీమీద అమితమైన ప్రేమను కురిపిస్తారు.దానికి కారణం అంటూ ఉండదు. మిమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా ట్రీట్ చేస్తారు.అంతే.

అమ్మ అరుణాచలం వెళ్ళిన సంఘటన గురించి అప్పారావు గారు ఆయనకు తెలిసిన విషయాలు చెప్పారు.

"డాక్టర్ బేర్ అని ఒక యూరోపియన్ డాక్టర్ ఉండేవారు.అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆయనకు అమ్మంటే చాలా ప్రీతి ఉండేది.ఆయన అరుణాచలంలో ఒక ఆస్పత్రి కట్టిస్తూ ఆరేళ్ళ వయస్సున్న అమ్మను అక్కడకు తీసుకెళ్ళాడు. అప్పుడు అమ్మ రమణాశ్రమానికి మొదటిసారిగా వెళ్ళింది.చాలా ఏళ్ళ తర్వాత చలంగారి కోసం రెండోసారి వెళ్ళింది.

మొదటిసారి అమ్మ అక్కడకు వెళ్ళినపుడు అమ్మకు ఆరేళ్ళు.అక్కడ ఒక బండమీద అమ్మ కూచుని ఉన్నది.అపుడు రమణమహర్షి కొండ దిగి ఆశ్రమంలోకి వస్తున్నారు.అమ్మను చూచిన ఆయన గబగబా ముందుకు వచ్చి సంభ్రమంగా-'మాతృశ్రీ వచ్చావామ్మా?'అన్నారు.అమ్మను మొదటిసారిగా 'మాతృశ్రీ' అని పిలిచినది రమణమహర్షియే." అన్నారు అప్పారావుగారు.

ఈ లోపల చరణ్ ఏం చేస్తున్నాడా? అని చూచాను.

అప్పారావుగారి పుస్తకాల కప్ బోర్డ్ లోనుంచి ఏవేవో పుస్తకాలు తీసి చూస్తున్నాడు చరణ్.అలా చూస్తూ ఒక పుస్తకాన్ని చేత్తో పట్టుకుని-"అన్నగారు ఈ పుస్తకం చూడండి"- అంటూ ఒక పాతకాలపు బ్రౌన్ రంగు పుస్తకాన్ని నాకిచ్చాడు.అదేమిటా అని చూచాను.

'భగవద్గీత' by చలం- అని ఉన్నది.

చరణ్ వైపు చూచాను.అతని ముఖం వెలిగిపోతున్నది.

'చూచారా అన్నగారు.పొద్దున్నే మనం చలంగారు వ్రాసిన భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం కదా.ఇప్పుడా పుస్తకం ప్రింట్ కూడా లేదుకదా అదెక్కడ దొరుకుతుందా?అని అనుకున్నాను.సాయంత్రానికి ఈ మారుమూల పల్లెటూళ్ళో ఇక్కడే మనకు దొరికింది.చూడండి.అమ్మ చేసే పనులు ఇలాగే ఉంటాయి.' అన్నాడు.

అప్పారావుగారు మమ్మల్ని గమనిస్తూ ఒకే మాట అన్నాడు.

'Chalam is a realized soul అండి.నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అరుణాచలంలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు అక్కడకు వెళ్లాను.ఆయన్ను కలిశాను.'

'అవునా?' చరణూ నేనూ ఒకేసారి అన్నాం.

'అవును.చలంగారితో నా పరిచయం ఈనాటిది కాదు.నేను అరుణాచలం వెళ్ళిన ప్రతిసారీ చలంగారిని కలవకుండా వచ్చేవాడిని కాను.నాకు సౌరిస్ గారు కూడా బాగా తెలుసు.Chalam is a realized soul అందులో ఏమీ అనుమానం లేదు.

చలంగారు పోయిన కొత్తలో ఒకసారి నేను అరుణాచలం వెళ్లాను.ఆరోజున చలంగారి మాసికం.భోజనం చేసి వెళ్ళమని సౌరిస్ గారు అన్నారు.అక్కడే ఆరోజున భోజనం చేశాను.

మీకొక విషయం చెబుతాను వినండి.ఆరేళ్ళ పిల్లగా అమ్మ ఏ బండరాయి మీద అయితే కూచున్నదో అదేచోట రమణమహర్షి తన తల్లిని సమాధి చేసి 'మాతృభూతేశ్వరాలయం' కట్టించారు.' అన్నారు అప్పారావుగారు.

ఈ మాటవిని మేమంతా ఆశ్చర్యపోయాం.దీనిని బట్టి రమణమహర్షి అమ్మను ఎంతగా గౌరవించారో మనం అర్ధం చేసుకోవచ్చు.తన సొంతతల్లితో సమానమైన స్థానాన్ని ఆయన జిల్లెళ్ళమూడి అమ్మగారికిచ్చారు.

అప్పారావుగారు కొనసాగించారు.

నేనొక రోజున అమ్మను ఇలా అడిగాను."అమ్మా! 'అంతా అదే' అని నీవెప్పుడూ అంటావుకదా.అలా అని మనం అనుకోవడమా లేక అలా అనిపించడమా? ఏది కరెక్టమ్మా?'

ఆయన ఈ విషయం చెబుతూ ఉండగానే నాకు జవాబు లోలోపల స్ఫురించింది.

మనం అనుకోవడం సాధనదశ.అదే అనిపించడం పరిపక్వదశ.మనం అనుకోవడం ముఖ్యం కాదు.అది కృత్రిమం.దానంతట అదే అనిపించాలి.అది సిద్ధదశ.మనం అనుకుంటున్నామంటే అక్కడ ఘర్షణ ఉన్నది.అదే అనిపిస్తుంటే ఘర్షణ లేదు.సహజానుభవమే అక్కడ ఉన్నది.

ఆలోచనలో ఉన్న నాకు అప్పారావుగారి స్వరం వినిపించి ఈలోకంలోకి తెచ్చింది.

'అప్పుడు అమ్మ ఏమన్నదో తెలుసా? 'ముందు అనుకో నాన్నా తర్వాత అనిపిస్తుంది' అని ఒక చిన్న మాటలో తేల్చేసింది.

ఆ మాట వింటూనే మా గుండెలు ఉప్పొంగిపోయాయి.అబ్బా ఎంత బాగా చెప్పింది అమ్మ అని చాలా ఆనందం కలిగింది.

అప్పారావుగారి కోసం వారి మిత్రులు ముందుగదిలో ఎదురుచూస్తున్నారు. మేమొచ్చేసరికి అక్కడ చర్చ జరుగుతున్నది.అది మధ్యలో ఆగిపోయింది.ఇంకా ఎక్కువ సేపు ఉండి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని,వారివద్ద సెలవు తీసుకుని,అమ్మకు నమస్కారం చేసుకుని బయలుదేరాము.

అప్పటికే చీకటి పడిపోయింది.ఆ చీకట్లో కారు జిల్లెల్లమూడిని వదలి రోడ్డెక్కి పెదనందిపాడు వైపు పోతున్నది.రోడ్డుకిరువైపులా చెట్లు మౌనధ్యానంలో ఉన్న యోగులలా నిలబడి ఉన్నాయి.వాతావరణం చడీచప్పుడూ లేకుండా ప్రశాంతంగా ఉంది.

'ఎంత విచిత్రమో చూడండి అన్నగారు! చలంగారి భగవద్గీత గురించి మీరు చెప్పడమూ,కొన్ని గంటలు కూడా గడవకముందే ఆ పుస్తకం ఆ మారుమూల పల్లెలో మన చేతికి రావడమూ?' అన్నాడు చరణ్ డ్రైవ్ చేస్తూ.

'అంతే కాదు తమ్ముడూ.చలంగారిని బూతు రచయితగా కాకుండా సక్రమంగా అర్ధం చేసుకున్న ఇంకొక వ్యక్తికూడా అక్కడే కనిపించారు చూడు.' అన్నాను.

'అవునన్నగారు.అమ్మ చేసే పనులు ఇలాగే ఉంటాయి.ఇవే అసలైన అద్భుతాలన్నగారు.ఇంతకంటే అద్భుతాలు ఇంకెక్కడుంటాయి?అమ్మ చేసే అద్భుతాలు జీవితంలో చాలా సహజంగా జరిగినట్లు జరుగుతాయి.అవి అద్భుతాలని మనకనిపించదు.అంత సహజంగా అవి జరుగుతాయి.' అన్నాడు చరణ్.

'సరేగాని చరణ్.పొద్దున్న మనకు కనిపించిన ఆ పండితునికీ అప్పారావుగారికీ తేడా గమనించావా?ఆయనేమో మనల్ని గుర్తించికూడా గుర్తించనట్లు ముఖం తిప్పుకున్నాడు.ఈయనేమో మనమెవరో ఆయనకు తెలీకపోయినా తన బెడ్రూమ్ లో కూచోబెట్టి పండ్లూఫలాలూ పెట్టి ఆప్యాయత కురిపించాడు.ఆ తేడా గమనించావా?' అడిగాను.

'గమనించానన్నగారు.అదే ఉత్త పండితులకూ సాధకులకూ ఉన్న తేడా అని నాకూ అనిపించింది.పండితుల దగ్గర విషయం ఉండవచ్చు.కాని వారి గుండెలలో ప్రేమ ఉండదు.అదే తేడా.'అన్నాడు చరణ్.

అమ్మతత్వాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే 'ఎల్లలెరుగని ప్రేమ' అని చెప్పచ్చు తమ్ముడూ.' అన్నాను.

చరణ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

'అవునన్నగారు.ఇలాంటి పుస్తకపండితులకు అమ్మతత్త్వం ఎలా అర్ధమౌతుందన్నగారు?వారికి తెలిసింది గణవిభజన మాత్రమే.కానీ ప్రేమసాధనలో కణవిభజన జరుగుతుంది.మన శరీరాలలోని కణాలే మారిపోతాయి.గణవిభజనకూ కణవిభజనకూ ఎంత భేదం ఉన్నదన్నగారు?గ్రామర్ పట్టుకుని వేళ్ళాడే పండితులకూ సాధకులకూ అంత తేడా ఉన్నది.' అన్నాడు చరణ్.

నాకు భలే ఆనందం అనిపించింది.చరణ్ నోటివెంట ఒక్కొక్కసారి ఇలాంటి భలేమాటలు పలుకుతాయి.

'చరణ్.నాదొక సందేహం.చెబుతావా?' అడిగాను.

'చెప్పండన్నగారు.'

'అమ్మభక్తులలో ప్రేమ కనిపించేమాట నిజమే.కానీ మనం కూడా అమ్మ భక్తులమే అని తెలిస్తే మాత్రమె ఆ ప్రేమను మనమీద కురిపిస్తారు. ఒక కరుడుగట్టిన ముస్లిం తీవ్రవాది కూడా సాటి ముస్లింమీద ప్రేమ బాగానే కురిపిస్తాడు.ఒక క్రిష్టియన్ ఇంకొక క్రిష్టియన్ను బాగానే ఆదరిస్తాడు.అదేం పెద్ద గొప్పకాదు.కానీ వారూవీరూ అని తేడా లేకుండా అందరిమీదా ఆ ప్రేమను చూపగలిగినప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుందని నా భావన.అమ్మ భక్తులు అలా ఉండగలుగుతున్నారా?ఎందుకంటే వాళ్ళతో నాకు పెద్దగా పరిచయాలు లేవు.నీకు బాగా తెలుసు కదా.చెప్పు.' అడిగాను.

నవ్వాడు చరణ్.

'ఎలా ఉంటుందన్నగారు?ఎక్కడైనా పరిస్థితి ఒకలాగే ఉంటుంది.కానీ మీరు చెప్పినరకం మనుషులు-అంటే ఎక్కడైనా ఎవరితోనైనా ఒకే రకమైన ప్రేమతో ఉండే మనుషులు- కూడా ఉన్నారు.కానీ వారు మైనారిటీ వర్గం.ఎక్కువమంది మాత్రం ఆ ప్రేమను అంతవరకే చూపిస్తారు.నిత్యజీవితంలో అది కనపడదు.

చాలామంది అమ్మ సాహిత్యం చదివారు.అమ్మ మాటలను చిలకలాగా వల్లిస్తారు.కానీ ఆచరణలో కనపడదన్నగారు.అమ్మను ఆసరాగా చేసుకొని లౌకికంగా ఎదగాలని అలాంటివాళ్ళు చూస్తారు.వాళ్ళు వేస్ట్ మనుషులు. వీరంతా అసలును వదిలేసి వడ్డీని పట్టుకుని వేళ్ళాడే వడ్డీ వ్యాపారస్తులు. వీరికి లౌకికానందం మాత్రమే కావాలి.అలౌకికానందం అక్కర్లేదు.అలౌకికంలో కూడా లౌకికాన్ని వెదికే రకాలు ఈ మనుషులంతా.' అన్నాడు చరణ్ సాలోచనగా.

అతను చెబుతున్నది సత్యమే.కాదని నేనెలా అనగలను?

మనుషుల మనస్తత్వాలు ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ కల్ట్ అయినా ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి.లౌకికానందాన్ని కోరేవారు ఎందఱో అయితే అలౌకికానందాన్ని కోరేవారు ఎక్కడో కొందరు మాత్రమే ఉంటారు.వారు ఊరకే పుస్తకాలు చదివి ఊరుకోరు.వాటిని జీవితంలో ఆచరించాలని తపిస్తారు.ఇతరులకు మాటలు చెప్పి గొప్ప కావాలని వారికుండదు.తాము గ్రహించినదానిని జీవితంలో ఎలా ఆచరించాలా అనే నిరంతరమూ వారు తపిస్తారు.ఆ తర్వాతే ఇతరులకు చెప్పడం.ముందు ఆచరణ.తర్వాత అవసరమైతే బోధన.ఇదే అసలైన సాధకుల మార్గం.

అందరం మౌనంగా ఎవరి ఆలోచనలలో వారున్నాం.

చిక్కటి చీకటిని చీల్చుకుంటూ కారు గుంటూరు వైపు సాగిపోతున్నది.
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు -9 "

20 అక్టోబర్ 2014 సోమవారం

తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-1

తెలుగు,హిందీ పాతపాటల ట్రాక్స్ సేకరించడం,తీరిక సమయాలలో వాటిని పాడటం నాకొక హాబీ.నాదగ్గర మెహదీ హసన్,రఫీ,కిషోర్,మన్నాడే,హేమంత్ కుమార్,తలత్ మెహమూద్,ముఖేష్,మహేంద్ర కపూర్,జేసుదాస్ ల హిందీ ట్రాక్స్ చాలా ఉన్నాయి.అలాగే పంకజ్ ఉదాస్,గులాం అలీ లు పాడిన ఘజల్ ట్రాక్సూ ఉన్నాయి.తీరిక సమయాలలో నేనొక్కడినే వాటిని పాడుకుంటూ ఉంటాను. లేదా స్నేహితులు,సంగీత ప్రేమికుల సమక్షంలో పాడుతూ ఉంటాను.

పాటలు పాడటం చిన్నప్పటి నుంచీ నాకలవాటుంది.అయితే ట్రాక్స్ పాడటం మాత్రం గత కొన్నేళ్ళక్రితమే మొదలైంది.వ్యక్తిగతంగా నేను మహమ్మద్ రఫీ అభిమానిని.

డిసెంబర్ నాలుగో తారీకున గుంటూరులో ఘంటసాల మ్యూజికల్ నైట్ జరుగుతుంది.అందులో నన్ను రెండుమూడు పాటలు పాడమని నిర్వాహకులు అడిగారు.మంచి పాత డ్యూయెట్స్ ఎంచుకోమని అన్నారు. నాకూ అవే ఇష్టం గనుక సరేనన్నాను.'చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి','ఈనాటి ఈహాయీ కలకాదోయి నిజమోయీ'- అనే రెండు పాటలు పాడతానని చెప్పాను.ఫిమేల్ సింగర్స్ ఎలాగూ ప్రొఫెషనల్స్ ఉంటారు గనుక వాళ్ళు ఏ పాటనైనా సులభంగా పాడగలరు. 

మచిలీపట్నంలో సునీల్ అని ఒక ఆర్కెష్ట్రా ఆయన ఉన్నాడు.అతని దగ్గర దాదాపు మూడువేల వరకూ తెలుగు హిందీపాటల ట్రాక్స్ ఉన్నాయని నాకు తెలిసింది.ఒకరోజు మచిలీపట్నం వెళ్లి కొన్ని తెలుగుపాటల ట్రాక్స్ కొనుక్కుందామని అనుకున్నాను.ఆయనతో ఫోన్లో మాట్లాడితే-"ఇంతదూరం రావడం ఎందుకు? మీకు కావలసిన పాటలు చెప్పండి.ఆన్ లైన్ పేమెంట్ చేస్తే ట్రాక్స్ మీకు మెయిల్ చేస్తాను"- అన్నాడు.

నాకు ఫోన్ పరిచయం కంటే వ్యక్తిగత పరిచయం అంటేనే ఇష్టం.ఫోన్లో మన పని కావడం ముఖ్యం కాదు.ఒక వ్యక్తితో పరిచయమూ స్నేహమే నాకు ముఖ్యం. అందుకని,నేనేవచ్చి కలుస్తానని చెప్పాను.మిత్రుడు 'హోరాసర్వం' సోమశేఖర్ కూడా అక్కడే ఉన్నాడు గనుక ఒకసారి తననూ కలసినట్లు ఉంటుంది అనుకున్నాను.

ఇంతలో తమ్ముడు సుబ్రహ్మణ్యం నుంచి ఫోనొచ్చింది.

'అన్నయ్యా.మచిలీపట్నం వెళ్ళాలి.సోమశేఖర్ కి ఫోన్ చేస్తే నువ్వూ వస్తున్నావని చెప్పాడు.కలిసే వెళదాం సరేనా?' అన్నాడు.

'అలాగే' అంటూ-'ఏంటి పని?' అడిగాను.

'మా ఫ్రెండ్ ఒక డాక్టర్ గారున్నారు.డిగ్రీలో నా క్లాస్ మేటే.ఆయన జాతకం సోమశేఖర్ కు చూపించాలి.అందుకని వెళుతున్నాం.' అన్నాడు.

'అలాగే వెళదాం.రండి.మధ్యాన్నం పన్నెండుకు రండి.ఈ లోపల నేను కొన్ని పాటల రికార్డింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను' అని చెప్పాను.

ముందే అనుకున్నట్లుగా ఉదయం పదింటికి స్టూడియోలో మిత్రులం అందరం కలిశాం.

హిందీ పాటల ట్యూన్స్ ని మనవాళ్ళు చాలా కాపీ కొట్టారు.కొన్నింటినేమో చరణాలలో ట్యూన్ సంగ్రహించి దాని చుట్టూ వీళ్ళ ట్యూన్ అల్లారు. కొన్నింటినేమో మొత్తం ట్యూనే ఎత్తేశారు.

ఉదాహరణకి 'షర్మీలీ' సినిమాలో కిషోర్ కుమార్ పాడిన 'ఖిల్తే హై గుల్ యహా..' అనే పాటని తెలుగులో 'ధనమా దైవమా' అనే సినిమాలో సుశీల చేత 'నీ మది చల్లగా స్వామీ నిదురపో..' అని పాడించారు.కానీ హిందీపాట ఒక మధుర విషాద ప్రేమగీతం.తెలుగుదేమో జోలపాట.రెంటివీ సన్నివేశాలు వేర్వేరు.భావమూ వేరేనే.అందుకే తెలుగు లిరిక్స్ నాకు నచ్చలేదు.పైగా రెండో చరణంలో రాముణ్నీ సీతనూ అనవసరంగా తీసుకొచ్చారు.మొత్తం మీద హిందీపాట భావం తెలుగులో ఖూనీ అయింది.

అందుకని ఆపాట లిరిక్స్ ను నాకు నచ్చినట్లుగా నేనే తెలుగులో చక్కగా వ్రాసుకున్నాను.

'పూచెను సుమములే -- వెన్నెల జారగా 
వేచెను హృదయమే -- వలపుల తేలగా...'

అంటూ ఒక మధుర ప్రేమగీతంగా ఆ పాటను వ్రాశాను.బాగా వచ్చింది.స్నేహితులలో కొందరికి పాడి వినిపిస్తే చాలా బాగుందని అన్నారు.

ఆపాటను రికార్డ్ చేసి సీడీగా మార్చే కార్యక్రమం మధ్యాన్నం పన్నెండు వరకూ ఉంటుంది గనుక ఆ తర్వాత బయలుదేరదామని సుబ్బుతో చెప్పాను.

అనుకున్నట్లుగానే పదకొండుకి రికార్డింగ్ అయిపోయింది.ఇంకా కొన్ని పాటలు కూడా పాడమనీ రికార్డింగ్ చెయ్యమని మిత్రులు అడిగితే సరేనని - 'యారానా' సినిమాలో కిషోర్ పాడిన 'ఛూ కర్ మెరె మన్ కో కియా తూనే క్యా ఇషారా..',-'తీస్రీ మంజిల్' సినిమాలో రఫీ పాడిన ' దీవానా ముఝ్ సా నహీ ఇస్ అంబర్ కే నీచే..',కిషోర్ పాడిన హిందీ పాట -'ఖిల్తే హై గుల్ యహా..' ఈ మూడు పాటలూ రికార్డింగ్ చేసేసరికి మధ్యాన్నం పన్నెండయింది.ఇంతలో ఇంటినుంచి ఫోనొచ్చింది.సుబ్బూ వాళ్ళు వచ్చి నాకోసం చూస్తున్నారు రమ్మని ఆ ఫోన్ సారాంశం.

వెంటనే స్టూడియో నుంచి బయల్దేరి ఇంటికొచ్చాను.నేను,సుబ్రమణ్యం,డాక్టర్ సాంబశివరావు,సుబ్బు ఇంకో స్నేహితుడు శ్రీనివాసరావు నలుగురం కార్లో మచిలీపట్నం బయల్దేరాము.భోజనం దారిలో ఎక్కడో ఒకచోట చేద్దాంలే అని ముందు బయల్దేరాము.

కారు గుంటూరు వదలి విజయవాడవైపు పరుగులు తీస్తున్నది.

'అన్నయ్యా.నాదొక ధర్మ సందేహం. అడగమంటావా?' అన్నాడు సుబ్బు.

'ఈ మధ్యన ధర్మసందేహాలకు జవాబులు చెప్పడం మానేశాను.అధర్మ సందేహాలకు మాత్రమే చెబుతున్నాను.' అన్నాను సీరియస్ గా.

అందరూ నవ్వేశారు.

'అది కాదు.సీరియస్ గా అడుగుతున్నా.కొన్ని ఆధ్యాత్మిక సందేహాలున్నాయి' అన్నాడు.

'సరే.అడుగు.కానీ ఒక్క విషయం చెప్పనీ నన్ను.నీవేం అడిగినా అది రేపు బ్లాగులో వచ్చేస్తుంది.దానికి నీకు ఇష్టం అయితేనే అడుగు.ఒక మాట అంటారు చూడు."బ్రతుకు బస్టాండు అయింది" అని.నేను ఇంకోలా అంటాను. "బ్రతుకు బ్లాగై పోయింది" అని.నీకు ఇష్టమైతే అడుగు.మళ్ళీ ఫీలవకూడదు.' అన్నా నవ్వుతూ.

'ఏం పర్లేదులే.వ్రాయి.వ్యక్తిగతమైనవి ఎలాగూ ఎడిట్ చేస్తావుగా.నాకు తెలుసు.ఏం పరవాలేదు.' అన్నాడు సుబ్బు.

'ఓకే.ప్రొసీడ్'- అన్నా.

సుబ్బు తన మొదటి సందేహం అడిగాడు.

(ఇంకా ఉంది)
read more " తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-1 "

18 అక్టోబర్ 2014 శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-8

"మా నాన్నగారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ అమ్మ చలం గురించి అడిగేది. సౌరిస్ గురించి అడిగేది.

'వాడెలా ఉన్నాడురా?' అనేది.

ఎవరి గురించి అడుగుతోందో అమ్మకూ మా నాన్నగారికీ మాత్రమే తెలిసేది. ఇతరులకు అర్ధమయ్యేది కాదు.వాళ్లిద్దరంటే అమ్మకు ప్రత్యేక అభిమానం ఉన్నదన్నగారు." అన్నాడు చరణ్.

వింటున్న నేను సాలోచనగా చూచాను.

'తమ్ముడూ.ఒక మనిషిని లోకం చూచే తీరులో మహనీయులు చూడరు. లోకం అంచనా వేసే తీరులో వారు అంచనా వెయ్యరు.ఒక మనిషిని మహనీయులు అంచనా వేసే తీరు వేరుగా ఉంటుంది.వారి దృష్టికోణం కూడా వేరుగా ఉంటుంది.లోకం ఏ విషయాలను ముఖ్యం కాదు అనుకుంటుందో అవే మహనీయుల దృష్టిలో అసలైన విషయాలు.లోకం అతిముఖ్యం అనుకునే విషయాలు వారి దృష్టిలో గడ్డిపోచలు.ఈ విషయం ఇంతకు ముందుకూడా చాలాసార్లు చెప్పాను కదా.' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చరణ్.

'చలంగారి కళ్ళు చూచావా తమ్ముడూ?ఆయన కళ్ళను చూస్తే ఆయన స్థాయి ఏమిటో తెలుస్తుంది,తెలుసుకోగలిగితే.' అన్నాను.

చరణ్ మదన్ మౌనంగా చూస్తున్నారు.

'తమ్ముడూ ఒక విషయం చెప్పు.అసలు 'చలం' అనే పదం సరియైనదేనా?లేక 'అచలం' అనే పదం సరియైనదా?'

చరణ్ నవ్వాడు.

'అచలమే కరెక్ట్ కదా అన్నగారు?' అన్నాడు.

'అవును.కానీ చలం అనేమాట కూడా తప్పుకాదు తమ్ముడూ.చలం అనేది చలించే జగత్తును సూచిస్తుంది.అచలం అనేది చలించని పరబ్రహ్మతత్త్వాన్ని సూచిస్తుంది.చలం అంటే త్రిగుణాత్మికయైన శక్తి.అచలం అంటే త్రిగుణాతీతుడై నిశ్చలుడైన శివుడు.చలం లేకుండా అచలం ఎలా ఉంటుంది?అచలం లేని చలం ఎలా ఉంటుంది?రెండూ పరస్పర అవినాభావస్థితులే.

ఈ జన్మలో ఆయనకంతా చలనమే సరిపోయింది.ఎప్పుడూ చలిస్తూ,చలించే మనస్సును అదుపులో ఉంచుకోలేక,కోరికలనూ కామాన్నీ అదుపు చెయ్యలేక,కుళ్ళులోకం నచ్చక,నానా సంఘర్షణా నరకమూ అనుభవించాడు చలంగారు.తన మనస్సుతోనూ తనచుట్టూ ఉన్న లోకంతోనూ నిరంతర యుద్ధమే ఆయనకు జన్మంతా సరిపోయింది.వచ్చే జన్మలోనే ఈ చాంచల్యం పోయి అచలత్వాన్ని ఆయన రుచి చూడగలుగుతాడు.ఈ జన్మలో మంచి పునాది పడింది.అది వచ్చే జన్మలో సాఫల్యతను కలిగిస్తుంది.అదే మాలపిచ్చమ్మగారు ఆయనతో చెప్పింది.చలంగారు చాలా ఉత్తముడు తమ్ముడూ.మనం నేడు చూస్తున్న అనేకమంది కంటే ఆయన ఎంతో గొప్పవాడు.' అన్నాను.

చరణూ మదనూ మౌనంగా వింటున్నారు.

'తమ్ముడూ.ఇంకో సంగతి చెప్పనా?చలం సినిమాలకు కూడా మాటలు వ్రాశాడు.' అన్నాను.

'ఏ సినిమాకన్నగారు' అడిగాడు చరణ్.

'1938 లో వచ్చిన 'మాలపిల్ల' సినిమాకి కధా మాటలూ ఆయనే వ్రాశాడు.ఆ సినిమాలో చలం యొక్క సంఘ సంస్కరణా భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సినిమా టైటిల్స్ చూస్తే story and dialogues-Gudipati Venkata Chelam B.A L.T అని పడుతుంది.ఆయన వ్రాసే డైలాగ్స్ ఎంత క్లుప్తంగా ఎంత భావయుక్తంగా ఉంటాయంటే,ఆయన శైలిలోని మాధుర్యం సినిమావాళ్లకి మింగుడు పడలేదు.ఆయనకీ సినిమావాళ్ళ కుళ్ళూ కుట్రలూ నచ్చలేదు.తన వ్యక్తిత్వం చంపుకుని వాళ్ళు చెప్పిన రీతిలో వ్రాయాలంటే తనకు కుదరదనీ తన రీతిలోనే తను వ్రాస్తాననీ మొండిపట్టు పట్టాడు.డబ్బుకి జీవితంలో ఆయనెప్పుడూ విలువనివ్వలేదు. ప్రేమకీ, స్వచ్చతకీ, భావుకతకీ, స్వేచ్చకీ విలువిచ్చాడు.ఊరకే మాటలు చెప్పడం కాదు వాటిని జీవితంలో ఆచరించాడు.అదీ కృత్రిమంగా,ఇష్టం లేకపోయినా,దేనినో బలవంతాన ఆచరిస్తున్నట్లు కాదు.స్వభావపూర్వకంగా సహజంగా ఆచరించాడు.అలాంటి మనిషికి,కుళ్ళిపోయిన సినిమా ఫీల్డ్ ఎలా నచ్చుతుంది?అందుకే ఆయనక్కడ ఇమడలేకపోయాడు.

ఆ సినిమా అంతా చలంగారి శైలి ప్రతిమాటలోనూ మనకు కనిపిస్తుంది.ఆ సినిమాలో ఒక సీన్ చెప్తా విను.

గోవిందరాజుల సుబ్బారావుగారు ఒక పడక్కుర్చీలో కూచుని ఉంటారు. వెంకటసుబ్బయ్య పక్కనే కూర్చుని నాగరాజు మాలపిల్లను తీసుకుని కలకత్తా వెళ్ళిపోయి చేసిన మంచిపని గురించి పొగుడుతూ నిజమైన అస్పృశ్యులు ఎవరో వివరిస్తూ పెద్ద లెక్చరిస్తాడు.అంతా విని గోవిందరాజుల సుబ్బారావుగారు అతని గడ్డం పుణికి 'నువ్వూ నీ ఆలోచనా!!' అని క్లుప్తంగా సమాధానమిస్తాడు.ఎదుటి వ్యక్తి గంటసేపు మాట్లాడితే ఇంకొక పాత్ర నోటినుంచి వచ్చే జవాబు అది!

ఇంకో డైలాగ్ విను.ఆ సినిమాలో హీరో బ్రాహ్మణుడు.హీరోయిన్ మాలపిల్ల.ఇద్దరి మధ్యనా ప్రేమ ఉంటుంది.హీరో ఉద్దేశ్యాన్ని అనుమానించి అతని మనస్సు నొప్పించానని ఒక సీన్లో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. రెండేరెండు ముక్కల్లో గొప్ప భావాన్ని చలం పలికించాడు. 'మం..చివారే!నొ..ప్పించానే!'-అని తన చెల్లెలితో హీరోయిన్ కాంచనమాల దీనంగా అంటుంది.అంతే!!

అదీ చలంగారి శైలి.ఉదాత్తమైన భావుకత లేనిదే చలం అర్ధంకాడు.ఆ సినిమాలో అన్నీ ఆలోచింపచేసే సంభాషణలే.ఆ రకంగా క్లుప్తంగా భావస్ఫోరకంగా డైలాగ్స్ వ్రాయడం ఇప్పటివారికి ఎన్ని జన్మలెత్తినా రాదు.' అన్నాను.

చరణ్ కాసేపు మౌనంగా ఉన్నాడు.

'డెబ్భైతొమ్మిదిలో చలంగారు చనిపోయిన సంగతి రేడియోలో చెప్పారు. అమ్మకు తెలిసి అప్పుడే వచ్చిన మా నాన్నగారిని అడిగింది-'వాడు పోయాడుటరా.' అని.అమ్మకు దూరాన ఏం జరుగుతున్నదో తెలుసు.కానీ తెలీనట్లు మనల్ని అడుగుతుంది.' అన్నాడు.

ఇవి మామూలే గనుక నేనేమీ మాట్లాడలేదు.

'పదండి భోజనం చేసివద్దాం.వదినగారు రండి.' అంటూ చరణ్ లేచాడు.అందరం లేచి కాళ్ళూ చేతులూ కడుక్కుని అన్నపూర్ణాలయానికి బయలుదేరాం.

మెట్లు దిగుతూ ఉండగా మదన్ భార్య ఒక సందేహాన్ని వెలిబుచ్చింది.

'భరద్వాజ మాస్టారు ఇక్కడ చాలా ఏళ్ళు ఉన్నారట కదా అన్నయ్యా?' అన్నది.

'అవునమ్మా.' అన్నాను.

'నేను ఆయన పుస్తకాలు చదువుతానండి' అన్నది.

'మంచిదమ్మా' అన్నాను.

'ఆయన అమ్మ దగ్గరే అన్నేళ్ళు ఉండి మరి ఇంకా ఎవరెవరో మహనీయులంటూ దేశమంతా ఎందుకు తిరిగారో? మీరేమో అమ్మని మించిన వాళ్ళు లేరని అంటున్నారు. నాకిది అర్ధం కావడం లేదు' అన్నది.

ఆమె సాయిబాబా భక్తురాలని నాకు తెలుసు.మదన్ ఒకటి రెండుసార్లు మాతో వచ్చాడు గాని ఆమె ఇక్కడికి రావడం ఇదే మొదలు.ఆ అమ్మాయి పరిస్థితి నాకర్ధమైంది.

ఆమెకు జవాబు చెబుదామని ఆగాను.నాతో బాటు నడుస్తున్న వాళ్ళూ ఆగారు.పక్కనే ఒక దానిమ్మచెట్టు ఉన్నది.దానికున్న పూలు ఎర్రగా చాలా బాగున్నాయి.

ఒక పూవును చూపిస్తూ ఇలా చెప్పాను.

'ఈ పువ్వు చూచావామ్మా.దాని రంగు చూడు.చెయ్యి తిరిగిన చిత్రకారుడు కూడా ఇలాంటి కలర్ మిక్సింగ్ తీసుకురాలేడు.ఇదెంత అద్భుతమో చూడు. ముదురాకుపచ్చని ఆకుల కాంట్రాస్ట్ లో ఆ ఎర్రనిపువ్వు ఎంత అందంగా ఉందో చూడు.ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు అడుగడుక్కూ ఉంటాయి.ఈ అద్భుతాలను చూడలేని మనం ఏవేవో నకిలీ అద్భుతాల కోసం ఎగబడుతూ ఉంటాము.భరద్వాజగారికి జరిగింది కూడా ఇదే.

సహజస్థితి యొక్క మహత్యం అందరూ గ్రహించలేరు.దానిని గ్రహించాలంటే నీవు కూడా అత్యంత సహజస్థితిలో నిర్మలంగా నిష్కల్మషంగా రెండేళ్ళ పసిపిల్లలా ఉండగలగాలి.అప్పుడే నీవు అమ్మలాంటి వారి స్థాయి ఏమిటో చూచాయగా గ్రహించగలుగుతావు.కృత్రిమమైన వాటికోసం వెదుకుతూ ఉన్నంతవరకూ నీవు వారి సహజస్థితిని గ్రహించలేవు.నీవు వారితోనే నివసించవచ్చు.వారి పక్కనే ఏళ్ళ తరబడి అంటిపెట్టుకుని ఉండవచ్చు.కానీ మానసికంగా వారికీ నీకూ మధ్యన ఒక అగాధం ఉంటుంది.ఆ అగాధాన్ని నీవు దాటలేవు.నీ దృష్టి ఎదురుగా కనిపిస్తున్న దానిమీద కాకుండా ఎక్కడో ఉండటమే దానికి కారణం.

ప్రేమమయి,ఆనందమయి అయిన అమ్మను పక్కనే ఉంచుకుని భరద్వాజగారు, 'ఆనందమయీ మా' అనీ 'చీరాల అవధూత' అనీ 'చివటం అమ్మ' అనీ ఇంకా ఎవరెవరో అవధూతలనీ ఎక్కడెక్కడో వెదుకుతూ ఉండేవాడు.ఏం చేస్తాం?దూరపు కొండలు నునుపు అని సామెత ఊరకే రాలేదు.

ఆయనకు అద్భుతాలు కావాలి.అంటే గాల్లోంచి బూడిద తియ్యటం ఇలాంటివన్నమాట.అమ్మేమో 'నీ చుట్టూ ఉన్న సృష్టిని మించిన అద్భుతం ఇంకెక్కడుంది నాన్నా?'అనేది.ఉదయిస్తున్న సూర్యుడిని చూపిస్తూ"చూడు ఎంత అద్భుతమో?' అనేది.ఆమాట నిజమే.అయితే దానిని ఆస్వాదించే పరిపక్వదృష్టి మనకుండాలి.అప్పుడు సృష్టిలో అణువణువునా నీకు అద్భుతాలు గోచరిస్తాయి.ఆ దృష్టి లేకపోతే పిల్లని చంకలో పెట్టుకుని ఊరంతా వెదికినట్లు అవుతుంది.అలాంటప్పుడు గాల్లోంచి వస్తువులు తియ్యడమూ నోట్లోంచి రాళ్ళు ఉయ్యడమే అద్భుతాలౌతాయి.ఆయనకు జరిగింది అదే.'

'ఉదాహరణకు దత్తాత్రేయుని సంగతి చూడు.ఆయన అత్యంత సహజమైన వాడు.త్రిగుణాతీత సహజస్థితే దత్తతత్త్వం.కానీ నేటి ఆయన భక్తులకేమో అసహజమైన అద్భుతాలు కావాలి.అలాంటి చీప్ అద్భుతాలను ఆశించని ఆయన భక్తుణ్ణి ఒక్కడిని నేడు చూపించు.సహజంలోనుంచి అసహజాన్ని ఆశించేవారికి ఏమని చెప్పగలం?

మనకు చేతనైనది ఇంతే.ఎంతో ఉన్నతమైన అతీతమైన దానిని మన రొచ్చులోకి లాగడం ఒక్కటే మనకు తెలుసు.మన మనస్సులో గురువులం కావాలనీ, జనాన్ని చుట్టూ పోగేసుకోవాలనీ కోరికలున్నంతవరకూ ఇలాంటివి తప్పవు.అదీ విషయం.' అన్నాను. 

ఆమెకు నా మాటలు నచ్చలేదని ఆమెవైపు చూస్తే అర్ధమైంది.చాలామంది పరిస్థితి అంతే.వాళ్ళ నమ్మకాలను దెబ్బతీసే సత్యాలను వాళ్ళు అంత సులభంగా ఒప్పుకోలేరు.అహంకారాన్ని పక్కన పెట్టగలిగిన సత్యప్రేమ లేనిదే సత్యాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

మనకు వ్యక్తి ముఖ్యం అయినప్పుడు సత్యం దూరమౌతుంది.మన అహమే మనకు ముఖ్యమైనప్పుడు భగవంతుడు దూరమౌతాడు.

మాటల్లోనే భోజనశాలకు వచ్చేశాము.అప్పటికే ఒక బంతి నడుస్తున్నది. అందుకని మేమంతా కాసేపు వేచి చూచి తర్వాత బంతిలో కూచున్నాము.

ముద్దపప్పు,చింతకాయపచ్చడి,వంకాయకూర మూడూ నాకిష్టమైన వంటకాలే వడ్డించారు.అమ్మను తలచుకుంటూ భోజనం కానిచ్చి మళ్ళీ గదులకు బయలుదేరాము.

(ఇంకా ఉన్నది)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు-8 "

16 అక్టోబర్ 2014 గురువారం

దయ్యాలు లేవూ?-1

కాలేజి సెలవలిచ్చారు.మా అమ్మాయి బ్యాగు సర్దుకొని తుఫాన్ వాతావరణంలోనుంచి అతికష్టం మీద బయటపడి ఇంటికొచ్చింది.

యధావిధిగా సబ్జెక్టు మీద తనని కొన్ని ప్రశ్నలడిగాను.తను చెప్పిన జవాబులు విని సంతోషం కలిగింది.సబ్జెక్టు తనకు బాగా వంటపడుతున్నది. తను మంచి డాక్టరౌతుందన్న నా నమ్మకం రోజురోజుకీ బలపడుతున్నది.

స్నానపానాలు కానిచ్చి తీరికగా కూర్చున్నాక తను సంభాషణ మొదలుపెట్టింది.

'నాన్నా.ఈ మధ్యన హాస్టల్లో ఏమైందో తెలుసా?'

తనేదో సెన్సేషనల్ న్యూస్ గురించే చెప్పబోతున్నదని నాకు తెలుసు కనుక ఉత్సాహం చూపిస్తూ 'చెప్పమ్మా' అన్నాను.

'మా సీనియర్ ఒకమ్మాయికి నెత్తిన కాకి తన్నింది' అన్నది.

నాకు నవ్వొచ్చింది.

'అది వింతేమున్నది తల్లీ? చాలామందికి అది జరుగుతుంది.' అన్నాను.

'అదికాదు నాన్నా.అక్కడే అసలు కధ మొదలైంది.విను.సరేగాని ఇది మంచి సూచనా చెడు సూచనా?' అడిగింది.

తను అప్పుడప్పుడూ నన్ను పరీక్షిస్తూ ఉంటుంది.

'ఖచ్చితంగా చెడు సూచనే.ఆ అమ్మాయికి ఏదో చెడు జరగబోతున్నది. ఎందుకంటే కాకి శనీశ్వరుడి వాహనం కదా.అంటే ఆయన మీడియం అన్నమాట.కనుక ఆ అమ్మాయికి శనిసంబంధ దోషం ఏదో చుట్టుకోబోతున్నది.కాకి తన్నిన చాలామందికి ఆ తర్వాత ఏదో ఒకచెడు తప్పకుండా జరుగుతుంది.ఇది శకునశాస్త్రంలో అందరికీ తెలిసిన విషయమే.' అన్నాను ఇంకొక పదిహేను రోజులలో జరుగబోయే శనీశ్వరుడి ట్రాన్సిట్ తలచుకుంటూ.

మా అమ్మాయి చాలా కూల్ గా-'కదా! ఇప్పుడు నేను చెప్పేది విను.' అన్నది.

'ఊ చెప్పు' అన్నాను.

'కాకి తన్నటంతో ఆ అమ్మాయి కూడా భయపడింది.ఇదేదో మంచి శకునం కాదనుకొని వెంటనే దర్గాకి వెళ్లి తాయెత్తు కట్టించుకొని వచ్చింది.' అన్నది.

'అదేంటి దర్గాకి వెళ్ళిందా?ఏం అక్కడ మన దేవాలయాలు లేవా?' అడిగాను.

'ఉన్నాయి నాన్నా.ఖర్మ నెత్తిన కూచున్నపుడు ఇలాగే జరుగుతుందని నీవేగా చాలాసార్లు అంటావు' అన్నది.

'ఊ.సరే తర్వాతేమైంది' అన్నాను.

'ఆ తాయెత్తు ఒంటిమీద ఉన్నంతసేపూ బాగానే ఉంది నాన్నా.ఆ తర్వాత మొదలైంది అసలు కధ'-అన్నది.

మౌనంగా చూస్తున్నాను.

'కొన్ని రోజులకి ఆ తాయెత్తు ఊడిపోయింది.ఆ రోజునుంచీ ఆ అమ్మాయికి ఏవేవో నీడలు కనిపించడం,ఎవరో తనని వెంటాడుతున్నట్లు అనిపించడం ఇలాంటి భ్రమలు మొదలయ్యాయి నాన్నా.అదీగాక ఆ అమ్మాయి ఉండేది ఒక హాంటెడ్ రూమ్.' అన్నది.

'అదేంటి? అలాంటి రూములు హాస్టల్లో ఉన్నాయా?' అడిగాను అమాయకంగా.

'అంత నటించకు నాన్నా.నీకు తెలీదా?పాతకాలపు బిల్డింగులు హాస్టళ్ళలో అలాంటి రూములు ఉంటాయి' అన్నది తను.

తనచేత అలా ముద్దుగా తిట్టించుకోవాలనే అప్పుడప్పుడు అలా చేస్తుంటాను.

'సర్లేమ్మా.తర్వాతేమైందో చెప్పు.' అన్నాను నవ్వుతూ.

'అది హాంటెడ్ రూమ్ అని హాస్టల్లో చాలామందికి తెలుసు.ఆ తర్వాత ఆ అమ్మాయి రూము తలుపేసుకుని మూడురోజుల పాటు లోపలే ఉండిపోయింది.మీల్స్ కి తప్ప బయటకు వచ్చేదికాదు.' అన్నది.

'ఊ' అన్నాను కొనసాగించమని చూస్తూ.

'ఒక రోజున మా రూమ్మేట్ ఆ అమ్మాయి గదికి వెళ్ళింది.' అంటూ ' మా రూమ్మేట్ గురించి ఇక్కడ నీకు కొంతచెప్పాలి.తనకూ నాలాగే కొన్ని విషయాలు తెలుస్తాయి.ఏదైనా బ్యాడ్ వైబ్రేషన్ చుట్టుపక్కల ఉంటే తనూ ఫీల్ అవగలదు.అయితే అది నెగటివ్ ఎబిలిటీ.అది వాళ్ళ నాన్నగారి నుంచి దీనికి జీన్స్ లో వచ్చింది.వాళ్ళ నాన్నగారేం చేసేవారో తెలుసా?ఆయన ఇలాంటివి అస్సలు నమ్మడు.కొబ్బరి కాయ దిష్టి తీశారు దానిని తాకకూడదంటే ఎందుకు తాకకూడదని దానిని పగలగొట్టి చక్కెర వేసుకుని తినేసేవాడు.రోడ్డుమీద దిష్టి కోడిగుడ్డు అని అందరూ పక్కకు తప్పుకుంటే దానిని తీసుకుని పగలగొట్టి తాగేసేవాడు.ఆ చెట్టుమీద దయ్యం ఉన్నదట అని పల్లెటూళ్ళో అంటే దయ్యమా!ఎక్కడుంది? అని ఆ చెట్టెక్కి చూచేవాడట చిన్నప్పుడు.అలా వాళ్ళ నాన్నగారి దగ్గరనుంచి దీనికి కూడా ఆ ధైర్యం వచ్చింది.' అన్నది.

'నీకెక్కడనుంచి వచ్చింది?' అడిగాను నవ్వుతూ.

'నీ దగ్గర్నించేమీ రాలేదు.నా ఉపాసన వల్ల నాకొచ్చింది.' అంది తనూ నవ్వుతూ.

'అలా వాళ్ళ నాన్నగారిలాగా చెయ్యడం వల్ల మంచిదేనా నాన్నా?' అడిగింది.

'లేదమ్మా.దానివల్ల వాళ్ళకు తెలియని దోషాలు చుట్టుకుంటాయి.దిష్టి తీసి పడేసిన వస్తువులలో ఏమీ లేదని అనుకోకూడదు.వాటిలో బ్యాడ్ వైబ్స్ ఉంటాయి.వాటిని తాకితేనే మంచిది కాదని మనం అంటుంటే,ఇక వాటిని తినేస్తే ఇంకేముంది?సరాసరి మన సిస్టంలోకి వాటిని స్వీకరించినట్లే.దానివల్ల చాలా చెడు జరుగుతుంది.మొండితనం మీద అప్పుడు తెలియకపోవచ్చు. కాని అలాంటివాళ్ళ ఇళ్ళలో చెడు సంఘటనలు తప్పకుండా జరుగుతాయి.' అన్నాను.

'ఊ.ఆ తర్వాతేమైందో తెలుసా?మా రూమ్మేట్ హాంటెడ్ రూమ్ కెళ్ళి అక్కడ దయ్యాన్ని తరిమేసింది' అన్నది.

'ఇంతకీ అక్కడ ఏముంది? ఈ అమ్మాయి దానిని ఎలా తరిమేసింది?' అన్నాను.

'ఏముందా?ఆ రూంలో కాకితన్నిన అమ్మాయి ఉంది కదా.ఆ అమ్మాయి పడుకుంటే కళ్ళు ముయ్యగానే రూంలో ఎవరో తిరుగుతున్నట్లు,మంచం పక్కన ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుందిట.రాత్రంతా ఏవేవో నీడలు రూంలో కనిపిస్తాయట.అది తన భ్రమేమో అని అలాగే నిద్రపోతుంటే వీపుమీద చెళ్ళున కొట్టి 'లే.లేచి మందులేసుకో.' అని ఎవరో చెప్పినట్లు అనిపిస్తుందిట. సరే మా రూమ్మేటు అక్కడకెళ్ళి ఆ రూమంతా శుభ్రం చేసి అక్కడ ఉన్న కొన్ని హాంటెడ్ వస్తువులు పారేసి ధూపం వెలిగించి వచ్చింది.ఆ తర్వాతేమైందో తెలుసా నాన్నా?ఆ దయ్యం మా రూమ్ కి వచ్చేసింది.'

'పగబట్టిన పాంచాలి అని దానికి పేరు పెట్టుకోండి.సరిపోతుంది.'-అన్నాను నవ్వుతూ.

'ఎదుటివాళ్ళు ఏం చెప్పినా నీకు జోక్ గానే ఉంటుంది నాన్నా.నువ్వు చెప్పేది మాత్రం మేం సీరియస్ గా తీసుకోవాలి.' అంది తను నిష్టూరంగా.

'సారీసారీ.అదేం లేదులే.నమ్ముతున్నాగా.మా బంగారుతల్లివిగా.చెప్పుచెప్పు 'అన్నాను బతిమాలుతూ.

'ఆ టైంలో నేను అక్కడ లేను.ఇంటినుంచి హాస్టల్ కి వెళుతూ దారిలో ఉన్నాను.సరే మా రూమ్మేట్ మా రూంకి వచ్చేసాక దీనికి కూడా నీడలు కనపడటం మొదలైంది.ఇది నిద్రపోతుంటే ఎవరో మంచం పక్కన నిలబడినట్లు,రూంలో తిరుగుతున్నట్లు అనిపించి కలత నిద్రగా ఉంది.లైట్ వేసుకుంటే ట్యూబ్ లైట్ దానంతట అదే ఆరిపోవడం అవుతున్నది.పక్క రూముల్లో కరెంట్ బాగానే ఉందిట.ఈ లోపల నేను హాస్టల్ కి చేరాను.రాత్రంతా ప్రయాణం కదా ఆరోజు కాలేజీకి వెళ్ళలేక రూంలోనే నిద్రపోయాను.తను మామూలుగా కాలేజీకి వెళ్ళిపోయింది.ఇక నాకు మొదలైంది నాన్నా.' అన్నది.

'నీ జోలిక్కూడా వచ్చిందా' అన్నాను కుతూహలంగా.

'అవున్నాన్నా.అలసిపోయానేమో స్నానం చేసి పడుకోగానే నాకు బాగా నిద్రపట్టేసింది.ఇంతలో మంచం పక్కనే ఎవరో ఒక అమ్మాయి నిలబడి ఉంది నాన్నా.కొద్దిసేపు రూంలో అటూఇటూ తిరుగుతూ ఉంటుంది.కొద్దిసేపు మంచం పక్కనే నిలబడి నావైపు చూస్తూ ఉంటుంది' అన్నది.

'నిద్రలో ఉన్న నీకెలా తెలిసింది.అనిపించిందా?కనిపించిందా?' అడిగాను.

'రెండూ.ముందు అనిపించింది.తర్వాత కనిపించింది.లేచి చూచాను.అప్పటికి సాయంత్రం ఆరవుతోంది.చీకటి పడిపోయింది.లేచి చూస్తే రూంలో ఒక మూలగా ఒకమ్మాయి గోడవైపు తిరిగి నిలబడి ఉంది నాన్నా.ఆ అమ్మాయికి జుట్టు మోకాళ్ళవరకూ ఉన్నది.'

'ఏదీ మనం చూచే ఇంగ్లీషు హర్రర్ సినిమాల లాగానా?' అడిగాను నవ్వుతూ.తనూ నేనూ కలసి అప్పుడప్పుడూ హాలీవుడ్ హర్రర్ సినిమాలు నెట్లో చూస్తూ ఉంటాం.

'ఉండు నాన్నా నీకు ప్రతిదీ ఎగతాళే.నువ్వు చెప్పేవేమో నిజాలు.మేము చెబితే అబద్దాలా?' అడిగింది ఉక్రోషంగా.

'లేదులేమ్మా ఉడుక్కోకు.సరదాగా అన్నాను.ఆ సినిమాలు చూచీచూచీ అవే దృశ్యాలు నీకు కనిపించాయేమో అని నా అనుమానం.' అన్నాను.

'అబ్బా!అన్నీ నీకొక్కడికే తెలుసనుకోకు.విను.నాకు భలే చిరాకేసింది." అలసిపోయి నిద్రపోతుంటే ఏంటీ దయ్యాల గోల?" అనుకుంటూ కోపంగా లేచి లైటేశాను.వెనక్కు చూస్తే రూంలో ఆ అమ్మాయి లేదు'- అన్నది.

'ఒక్కోసారి మసకచీకటిలో కిటికీలోంచి పడే చెట్లనీడల వల్ల కూడా అలాంటి భ్రమలు కలుగుతాయమ్మా.' అన్నాను నవ్వుతూ.

'ఆహా! నేనూ సైన్స్ స్టూడెంట్ నే అన్న విషయం మర్చిపోకు నాన్నా.సరే నాది భ్రమే అనుకుందాం.ఇంతలో మా రూమ్మేట్ కాలేజీనుంచి వచ్చింది.

"ఏంటో కలత నిద్రగా ఉందే" అని తనకు చెప్పాను.

"ఏం ఆ పొడుగుజుట్టు అమ్మాయి నీకూ కనిపించిందా?"అని తనడిగింది. ఇది భ్రమెలా అవుతుంది నాన్నా?ఇద్దరికీ ఒకే భ్రమ కలుగుతుందా?' -ప్రశ్నించింది.

తనకు సైకిక్ ఎబిలిటీస్ పుట్టుకతోనే ఉన్న సంగతి నాకు తెలుసు.అవి తన జాతకంలో కూడా ప్రతిఫలిస్తూనే ఉంటాయి.కలకత్తా వెళ్ళినప్పుడు దక్షిణేశ్వర కాళీసమక్షంలో తనకు నేను మంత్రోపదేశం చేసినప్పటినుంచీ ఆ శక్తి తనకు ఇంకా ఎక్కువైంది.ఆ సంగతి తను ఎప్పటికప్పుడు నాకు చెబుతున్న అనుభవాల వల్ల నాకు తెలుసు.అయినా సరే తన సైంటిఫిక్ రీజనింగ్ ని వృద్ధి చెయ్యాలని తనతో అలా వాదిస్తూ ఉంటాను.

'విను నాన్నా.మా సీనియర్ని కాకి తన్నిన దగ్గరనుంచీ ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ మా రూమ్మేట్ నాకప్పుడు వివరించింది.నేను అప్పుడు హాస్టల్లో లేనుకదా.' అన్నది.

'అప్పుడు మీరేం చేశారు?'అడిగాను.

'ఏముంది? ఇద్దరం కలసి దాన్ని రూంలోనుంచి తరిమేశాం' అన్నది.

"ఎలా చేశారు?"అడిగాను కుతూహలంగా.

మా అమ్మాయి చెప్పడం కొనసాగించింది.

(ఇంకా ఉన్నది)
read more " దయ్యాలు లేవూ?-1 "

15 అక్టోబర్ 2014 బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-7

ఆరోజున అక్కడేదో సదస్సు జరుగుతున్నది.చాలా కార్లు ఆగి ఉన్నాయి.కార్ పార్కింగ్ కోసం అక్కడా ఇక్కడా తిరిగి చివరకు ఒకచోట ఏదో పార్క్ చేశామనిపించి అమ్మ దేవాలయానికి బయల్దేరాము.అఖండనామం జరిగే చోట అమ్మ నివసించిన గుడిసె ఉన్నది.

చక్కగా పరికిణీ ఓణీలు వేసుకున్న అమ్మాయిలు అక్కడ అఖండపారాయణాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటారు.వాళ్ళను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది.ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారీ "నామపారాయణ ప్రీతా నందివిద్యా నటేశ్వరీ" అన్న నామం నాకు వెంటనే గుర్తొస్తుంది.వాళ్ళను చూస్తే అమ్మ చుట్టూ ఉండే పవిత్ర శక్తిగణంలాగా కనిపిస్తారు.వాళ్లకు మనస్సులోనే నమస్కారం చేస్తూ అక్కడే వాళ్ళను చూస్తూ కాసేపు నిలబడ్డాను.మన మనస్సులో భావం వాళ్లకు తెలియదుకదా.వాళ్ళను తదేకంగా చూస్తుంటే వాళ్ళు కొంచం కంగారుపడ్డారు.సరే వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అమ్మ దేవాలయానికి వచ్చాను.

అమ్మ దేవాలయానికి వచ్చి కొద్దిసేపు అక్కడా కొద్దిసేపు హైమక్కయ్య దేవాలయంలోనూ మౌనంగా కూర్చుని ఆ తర్వాత శివాలయానికి బయల్దేరాము.

శివాలయ ప్రాంగణంలో వేదం నేర్చుకునే చిన్నచిన్నపిల్లలు చక్కగా వేదం వల్లెవేస్తూ కనిపించారు.మరి కొందరేమో మధ్యాహ్న సంధ్యావందనం చేస్తూ కనిపించారు.వాళ్ళను చూస్తే ముచ్చటేసింది.

అక్కడనుంచి వెనక్కువచ్చి అమ్మగదికి వెళ్లి కొద్దిసేపు అక్కడ మౌనంగా కూర్చున్నాము.

అమ్మ గదికి వెళ్ళేదారిలో ఒక పెద్దాయన కనిపించారు.ఆయన నన్నుచూచి గుర్తుపట్టి కూడా గుర్తుపట్టనట్లుగా ముఖంపెట్టాడు.ఇవన్నీ మనకు మామూలే గనుక లోలోపల నవ్వుకుంటూ నేనే ముందుకు వెళ్లి పరిచయం చేసుకున్నాను.అప్పుడే హటాత్తుగా గుర్తొచ్చినట్లు నటిస్తూ -'అవునవును మీరు నాకు తెలుసు ఇంతకు ముందు కలిశాం కదా' అని అన్నాడు.కానీ ఆయన కళ్ళలో మెదిలిన ఒక విధమైన తిరస్కార భావాన్ని నేనూ నాతోబాటు చరణూ గమనించనే గమనించాము.

బహుశా ఈయన నా బ్లాగు చదివి ఉంటాడని నాకనిపించింది.ఎందుకంటే నిర్మొహమాటంగా ఉన్న సత్యాన్ని ఉన్నట్లు వ్రాసే ధోరణివల్ల నాకు ఆధ్యాత్మిక శత్రువర్గం చాలానే ఏర్పడింది.చాలామంది కల్ట్ గురువుల శిష్యులకు నేనంటే చాలా కోపమని కూడా నాకు తెలుసు.నాకు తెలిసినా సరే,వాళ్ళ స్థాయి ఏమిటో చూడటం కోసం వాళ్ళను కదిలించి మాట్లాడుతూ ఉంటాను.అప్పుడు వారిచ్చే రియాక్షన్ బట్టి వాళ్ళు చెబుతున్నది నిజంగా ఆచరిస్తున్నారా లేక ఊరకే మాటలు చెప్పడమేనా అనే విషయం నాకు వెంటనే తెలిసిపోతూ ఉంటుంది.అదీగాక వీరి మెప్పు కోసం నేను సత్యాన్ని త్యాగం చెయ్యలేను.

ఆయన్ని అక్కడే వదిలేసి,కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని గదికి బయలు దేరాము.

చరణ్ కు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.ఏవేవో సంగతులు మాట్లాడటం మొదలు పెట్టాడు.

'అప్పట్లో ఎంతమంది పెద్దపెద్ద వాళ్ళు ఇక్కడకు వచ్చేవారన్నగారు?ఒకరోజు బీ.డీ.జెట్టి వచ్చారు.ఇదిగో ఈచెట్టు దగ్గరే ఫలానా ఆయన ఇసుకలో నేలమీద కూచున్నాడు.ఇక్కడే ఫలానావాళ్ళు రోజూ బ్యాట్మింటన్ ఆడేవాళ్ళు.'- అంటూ ఆరోజులలోకి వెళ్ళిపోయాడు.

అరవిందుల భక్తుడైన 'శ్రీనివాస అయ్యంగార్' ఒకరోజున అమ్మ దర్శనం కోసం వచ్చాడు.హాల్లో ఆయన ధ్యానానికి కూచున్నాడు.ఎంతసేపటికీ లేవడు కళ్ళు తెరవడు.ఆరోజు బూజులు దులపాలని పని పెట్టుకున్నారు.ఈయనేమో ఎంతకీ ధ్యానంలో నుంచి లేవడు.అందుకని ఏం చెయ్యాలంటూ అమ్మను అడిగితే అమ్మ ఒకపెద్ద దుప్పటిలాంటి తెల్లగుడ్డ తెప్పించి ఆయనమీద కప్పించి అప్పుడు బూజులు దులపమన్నది.ఆ దుప్పటి కప్పిన సంగతి కూడా ఆయనకు తెలియదు.అలాగే తదేకంగా ధ్యానంలో ఉన్నాడు.బూజులు దులిపి ఆ దుప్పటి తొలగించిన తర్వాతకూడా శరీరస్పృహ లేకుండా ధ్యానంలోనే ఉన్నాడు.

'మా నాన్నగారు ఇక్కడకు వచ్చిన మొట్టమొదటి భక్తులలో ఒకరన్నగారు. అది దాదాపు 1957 ప్రాంతాలని అనుకుంటాను.అప్పట్లో మా నాన్నగారూ ఇంకా ముగ్గురూ కలసి అమ్మ గురించి విని,నమ్మకం లేక,ఇలాంటి వాళ్ళవల్లే మన మతం పాడైపోతున్నదన్న ఆవేశంలో అమ్మతో వాదించాలని చీరాల నుంచి నడిచి ఇక్కడకు వచ్చారు.అప్పట్లో ఈ ఊరికి దారికూడా లేదు.పొలాల గట్లమీదనుంచి నడుచుకుంటూ రావాలి.మా నాన్నగారు కాళికాదేవి భక్తుడు. అప్పట్లోనే ఇంట్లో కాళికాదేవి పటం ఉంచి నిత్యం పూజ చేసేవాడు.' అన్నాడు చరణ్.

'మీది హరితస గోత్రమనీ మీ పూర్వీకులలో అక్కన్న మాదన్నలూ రామదాసూ ఉన్నారని ఒకసారి నీవే చెప్పినట్లు గుర్తు.మీరు రామభక్తులు కదా?మరి మీ నాన్నగారికి కాళికా ఉపాసన ఎలా వచ్చింది?' నేనడిగాను.

'ఏమో తెలియదన్నగారు? మధ్యలో ఎలా వచ్చిందో నాకూ తెలియదు.కానీ మా నాన్నగారు కాళికాపూజ చెయ్యడం నేను చూచాను.' అన్నాడు చరణ్.

'ఆ తర్వాతేం జరిగింది?'-అడిగాను.

"ఏముంది?ముగ్గురూ అమ్మతో వాదించి అమ్మ బండారం బయట పెట్టాలని వచ్చారు.మా నాన్నగారు అమ్మ పాదాలను తాకిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యి వెనక్కు పడిపోయారు.అలా చాలాసేపు పడి ఉన్నారు.లేచిన తర్వాత ఇంక వాదనా లేదు ఏమీ లేదు.టోటల్ సరెండర్ అయిపోయారు.

'చలంగారూ మా నాన్నగారూ మంచి స్నేహితులు.అమ్మగురించి అరుణాచలం లో ఉన్న చలంగారికి చెప్పింది మా నాన్నగారే.' అన్నాడు చరణ్.

'మీ నాన్నగారికి చలంగారు ఎలా పరిచయం?' అడిగాను.

'మా నాన్నగారు ఏలూరులో ఉండే రోజులలో చలంగారు అక్కడ పని చేసేవారు.అక్కడ లిటరరీ సర్కిల్స్ లో చలంగారూ చింతా దీక్షితులుగారూ మానాన్నగారికి పరిచయం.చలంగారికంటే మా నాన్నగారు చిన్న.అందుకని బాగా చనువుగా ఉండేవారు.అప్పట్లో ఏర్పడిన పరిచయం చలంగారు చనిపోయేవరకూ కొనసాగింది.అన్నగారు మీకోసంగతి తెలుసా?చలంగారు ఎంత రివల్యూషనరీ అంటే ఆయన ఏలూరులో ఉన్నపుడు చీర కట్టుకుని బజార్లో తిరిగేవాడు.' అన్నాడు చరణ్.

'అవునా? అదేంటి?'- అడిగాను ఆశ్చర్యంగా.

'చీరంటే ఆడవారిలా కట్టుకుని కాదు.చీరనే మడిచి లుంగీలాగా కట్టుకుని పైన బనీను ధరించి వీధుల్లోకి వచ్చి తిరిగేవాడు.' అన్నాడు చరణ్.

నవ్వాను.

'అవును.చలంగారిలో అనేక కోణాలున్నాయి.ఆయనలో ఒకవైపున గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉండేది.ఇంకోవైపు మంచి రసికత్వం ఉండేది.ఇంకొక వైపు స్త్రీలంటే గొప్ప సానుభూతి ఉండేది.ఇంకోవైపు సమాజపు కుళ్ళంటే అసహ్యమూ తిరుగుబాటు ధోరణీ ఉండేవి.ఇవన్నీ ఆయన రచలనలో ప్రతిబింబిస్తాయి.'అన్నాను.

'మీరు చలంగారి రచనలు అన్నీ చదివారా?'అడిగాడు.

'చదివాను.పాతికేళ్ళ క్రితం బళ్లారిలో 'లా' చదివే సమయంలో అక్కడి లైబ్రరీలో కూచుని చదివాను.' అన్నాను.

'మైదానం చదివారా?' అడిగాడు.

'చదివాను.అప్పట్లో ఆ పుస్తకం చాలా సంచలనం రేపిందట.మనకూ తెలీదు.మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి విషయం అది.' అన్నాను.

'అవునన్నగారు.ఆరోజుల్లో అదొక సెక్స్ నవలగా భావించి దాన్ని తెగ విమర్శించారట.కానీ అలా విమర్శించిన వారే దిండ్ల క్రింద దాచుకుని మరీ దాన్ని చదివేవారట.అప్పట్లో అంతటి హిపోక్రసీ సమాజంలో ఉండేది.' అన్నాడు చరణ్ నవ్వుతూ.

"అవును మరి.మొగుడు నచ్చకపోతే ఎవడితోబడితే వాడితో లేచిపొమ్మని వ్రాస్తే ఎంత తప్పు? నూటికి నూరుపాళ్ళు నచ్చే మొగుళ్ళు ఎక్కడుంటారు అప్పుడైనా ఇప్పుడైనా?" అన్నాను నవ్వుతూ.

'మరి భర్తల సంగతేమిటి అన్నగారు?వాళ్లకు భార్యలు నచ్చకపోతే తన ఇష్టం వచ్చిన ఆడదానితో లేచిపోవచ్చా? ఆ సంగతి ఎవరూ మాట్లాడరేం?' ప్రశ్నించాడు చరణ్.

'మగవాడికి లేచిపోవలసిన అవసరం ఏముంది చరణ్?వాళ్ళ సెటప్ లు వాళ్లకుంటాయి కదా.అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులు వేరు.అది పురుషాధిక్య సమాజం.అప్పట్లోకూడా ఇప్పుడులాగే చాలామంది మగవాళ్ళకు పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలుండేవి.కొంతమంది బాగా డబ్బున్న మహారాజులు ఏకంగా రెండుమూడు సంసారాలే ఒకేసారి నడిపేవారు.మగవాడి సరదాలు బాగానే తీరేవి.మళ్ళీ అందరూ కదిలిస్తే మహానీతి కబుర్లు చెప్పేవారు.ఏ రకంగా చూచినా ఆడవాళ్లే బాధితులు.వాళ్ళు వంటింటికీ పడకటింటికీ పరిమితమై మొగుడు తిట్టినా కొట్టినా,వాడికి అక్రమసంబంధాలున్నాయని తెలిసినా పరువుకోసమో పిల్లలకోసమో ఏమీ చెయ్యలేక చచ్చినట్లు ఆత్మను చంపుకుని పడి ఉండేవాళ్ళు.ఇది చలానికి నచ్చేది కాదు.

మన సోసైటీలోని హిపోక్రసీని ఆయన తన రచనలలో తూర్పారబట్టి పారేశాడు. మగవాడు చేస్తే రైటూ ఆడది చేస్తే తప్పూనా?ఆడది తప్పుచేస్తే శీలం పోయింది అంటారు.మరి మగవాడికి శీలం ఉండదా?ఉండవలసిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించాడు.అదే అప్పటి దొంగ సమాజానికి నచ్చలేదు.అందుకని ఆయనకు బూతు రచయిత అని ముద్రవేశారు.' అన్నాను.

'చలంగారిది విలక్షణమైన ఉన్నతమైన మనస్తత్వమే అన్నగారు.' అన్నాడు చరణ్.

"అవును చరణ్.లేకుంటే సౌరిస్ లాంటి మహనీయురాలు ఆయనకు ఎలా పుడుతుంది?చలంగారు పరమ స్వేచ్చావాది.ఆయనకు ఏ కట్టుబాట్లూ నచ్చేవి కావు.అది సామాజికం కావచ్చు.ఆధ్యాత్మికం కావచ్చు.రసికత్వం కావచ్చు.మనిషిని సంకెళ్ళలో బంధిస్తే ఆయనకు నచ్చదు.ఆయనకు ప్రతిదానిలోనూ ఫ్రీడం కావాలి.మనిషనేవాడు ఏ కట్టుబాట్లూ లేకుండా ఆకాశంలో పక్షిలాగా స్వేచ్చగా ఎగురుతూ ఉండాలని ఆయన భావించేవాడు.దానికి కారణమేమిటో తెలుసా?' అడిగాను.

'తెలియదు' అన్నట్లు చూచాడు చరణ్.

'ఆయనపైన చిన్నప్పుడు బ్రహ్మసమాజ భావాలుండేవి.రఘపతి వెంకటరత్నం నాయుడుగారి దగ్గర ఈయన చదువుకున్నాడు.కందుకూరి వీరేశలింగంపంతులూ,రఘుపతి వెంకటరత్నం నాయుడూ వీళ్ళిద్దరూ అప్పట్లో రాజా రామ్మోహన్రాయ్ భావాలకు ప్రభావితులై సంఘాన్ని సంస్కరించాలని చాలా ప్రయత్నించారు.చిన్నప్పుడు పడిన బీజాలు ఎప్పటికీ పోవంటారు కదా.అదే ఈయనకూ జరిగింది.అందుకే జీవితాంతమూ అలా సంఘసంస్కర్త గానే ఉండిపోయాడు.సమాజంతో నిత్యం ఘర్షణ పడేవాడు.అంతేకాదు. చలంగారు చిన్నప్పుడు సంధ్యావందనం అదీ శ్రద్ధగా నేర్చుకుని గాయత్రీ జపం చేసేవాడు.ఈ సంగతి తెలుసా నీకు?' అడిగాను.

'తెలీదన్నగారు' అన్నాడు చరణ్.

మాటల్లోనే అందరం రూమ్ కి చేరుకున్నాము.ఆడవాళ్ళు ఒకగదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఇంకొక రూమ్ లో మేము ముగ్గురం కూచుని చర్చను కొనసాగించాం.

'మరి అవన్నీ మధ్యలోనే ఎందుకు వదిలేశాడన్నగారు చలంగారు?- అడిగాడు చరణ్.

'అసలు విషయం చెప్పనా?ఆయన ఒకానొక పూర్వజన్మలో ముస్లింగా ఉన్నాడు చరణ్.ఈ జన్మలో సాంప్రదాయ బ్రాహ్మణవంశంలో పుట్టాడు.అందుకే ఆ రెండురకాల విరుద్ధ భావాల మధ్యన నలిగిపోయాడు.' అన్నాను.

'నిజమా?' వింటున్న చరణూ మదనూ ఆశ్చర్యపోయారు.

'అవును.ఈ విషయం ఆయనకూ తెలుసు.తన చివరి దశలోని రచనలలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించాడు కూడా.' అన్నాను.

'ఈ విషయం ఆయన ఎలా తెలుసుకున్నాడన్నగారు?అంటే సాధనా శక్తితోనా?' అడిగాడు చరణ్.

'లేదు తమ్ముడూ.ఆయనకంత సాధనాశక్తి లేదు.ఈ విషయాన్ని ఆయన సౌరిస్ గారి ద్వారా తెలుసుకున్నాడు.'

'పూర్వజన్మలలో ఆయనెవరో ఎక్కడైనా చెప్పాడా అన్నగారు?' అడిగాడు.

'స్పష్టంగా చెప్పలేదుగాని తన గతజన్మ ఒక ముస్లిం రాయల్ ఫేమిలీలో జరిగింది అని చూచాయగా ఒకచోట వ్రాశాడు.' అన్నాను.

"నిజమా" చరణ్ మళ్ళీ అన్నాడు.

'అవును.నా నమ్మకం చెప్పనా?షాజహాన్ కొడుకైన దారాషికోయే చలంగా పుట్టాడని నా నమ్మకం.నా ఈ నమ్మకానికి వ్యక్తిగత ఆధారాలు నాకున్నాయి. ఎందుకంటే దారాకు మన సాంప్రదాయమన్నా మన గ్రంధాలన్నా చాలా ఇష్టం ఉండేది.కొన్ని ఉపనిషత్తులను ఆయన అరబ్బీలోకీ పార్శీలోకీ అనువాదం కూడా చేశాడు.బలమైన అప్పటి సంస్కారాలు ఆయన్ను వదలలేదు.అందుకే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనకు అన్నీ నవీన భావాలుండేవి.చాదస్తాన్ని ఆయన దూరంగా ఉంచేవాడు.విగ్రహారాధన చేసేవాడు కాదు.కానీ మౌలికమైన ఆధ్యాత్మికత అంటే ఆయనకు ఇష్టం ఉండేది.

దారాషికో అసలైన ఆధ్యాత్మికవాది.ఆయన సర్మదూ,మియాన్ మీర్ల శిష్యుడు. వీరిద్దరూ అప్పటి కాలపు సూఫీ సాధువులు.దారాషికో డిల్లీ సింహాసనాన్ని అధిష్టించకుండా ఔరంగజేబు దానికి అర్హుడు కావడం మన దేశచరిత్రలో ఒక పెద్ద అపశ్రుతి తమ్ముడూ.పటేల్ ప్రధాని కాకుండా నెహ్రూ అయినట్లన్నమాట.

అతని సోదరి జహానారాకు దారా అంటే చాలా ఇష్టం ఉండేది.కానీ ఆమె నిస్సహాయురాలు.రోషనారా కుట్రల ముందు ఆమె ఏమీ చెయ్యలేకపోయింది. చివరకు ఔరంగజేబ్ కుట్ర ఫలితంగా దారాషికోకు శిరచ్చేదం చెయ్యబడుతుంది. ఆరోజున డిల్లీ వీధులలో ఏడవని పౌరుడు లేడని చరిత్రకారులు వ్రాశారు. దారాషికో అంత మంచివాడు.

దారాషికో ముందు ఔరంగజేబు ఎందుకూ పనికిరాడు.దారాషికో ఎంతో విశాలభావాలు కల్గిన నిజమైన ఆధ్యాత్మికుడు.కానీ ఔరంగజేబ్ ఎలాంటి క్రూరుడో మత ఉగ్రవాదో నీకు తెలుసుకదా.దారా గనుక డిల్లీగద్దె పైన కూర్చుని ఉంటే మన దేశచరిత్ర ఇంకోవిధంగా ఉండి ఉండేది.కానీ ఏం చేస్తాం?ఔరంగజేబు అధికార దాహానికి దారా బలైపోయాడు.

జహనారాయే సౌరిస్ గా పుట్టిందని నా నమ్మకం.ఈ విషయాలన్నీ రమణమహర్షికి తెలుసు.ఆయన సౌరిస్ ను ఎప్పుడూ ప్రత్యేకంగానే చూచేవాడు.భారత రాష్ట్రపతి వచ్చినా తలతిప్పని ఆయన సౌరిస్ కనిపిస్తే మాత్రం చిరునవ్వు నవ్వేవాడు.చలం రమణాశ్రమానికి వెళ్ళడానికి కూడా సౌరిస్సే కారణం.పరిణామక్రమంలో సౌరిస్ ఒక ఉన్నత తరగతికి చెందిన ఆత్మ అన్న విషయం మహర్షికి తెలుసు.

"సౌరిస్ గారిని నీవు దర్శించావా?ఆమె ఎప్పుడూ ఒక ముస్లిం వేషంలో ఉండేది.అంటే బురఖా కాదు.ఒక వల్లెవాటు వేసుకుని అదొక విధమైన డ్రస్సులో చూడగానే ముస్లిం అనిపించేటట్లు ఉండేది.ఆమె చుట్టూ కూడా చాలా కుక్కలుండేవి." 

ఇక్కడ ఇంకో లింక్ చెప్పనా?ముస్లిం అయిన వజీర్ ను చలం తన అల్లుడిగా చేసుకున్నాడు.చలం వేషంకూడా ముస్లింలాగే ఉండేది.ఒక లుంగీ ఒక బనీనూ అంతే ఆయన డ్రెస్సు.గడ్డం పెంచుకొని ఉండేవాడు.ఆయన మనస్సు విగ్రహారాధన కంటే కూడా అద్వైత వేదాంతపు నిరాకారోపాసన వైపు ఆయన్ను లాగుతూ ఉండేది.వజీర్ పూర్వజన్మలో అక్బర్ పాదుషా కొడుకైన సలీం అని చలం నమ్మాడు.

ఆయన బ్రాహ్మడై ఉండికూడా మాంసం తినేవాడు.ఆయనకు చాలాకాలం బాధించిన తలనొప్పి (మైగ్రేన్) ఉండేది.బలం రావడం కోసం పావురం మాంసం కూడా తినేవాడు.తనకు వచ్చిన పక్షవాతం తగ్గడానికి పావురం రక్తం ఒంటికి పూసుకునేవాడు.ఒకసారి చింతాదీక్షితులు గారు ఆయన్ను చూడటానికి రమణస్తాన్ కు వెళతాడు.అప్పుడు ఈయన కూచుని మాంసం తింటూ కనిపిస్తాడు.పరమనిష్టాపరుడైన చింతా దీక్షితులుగారు అది చూచి కూడా ఏమీ అనకుండా ఉండేవాడు.'మరువలేని మిత్రుడు' అనే పుస్తకంలో ఆయన గురించి చలం ఎంతో ఇదిగా వ్రాస్తాడు.

ఆయనకు ప్రియురాళ్ళు కూడా అధికంగానే ఉండేవారు.తనకు కామం చాలా ఎక్కువన్న విషయాన్ని ఆయన పాపం దాచుకోవాలని ఎక్కడా చూడలేదు. ఓపెన్ గానే చాలా చోట్ల ఈ విషయాన్ని వ్రాశాడు.అదే ఆయనలోని నిజాయితీ.ఆయనలో హిపోక్రసీ అనేది ఎక్కడా లేదు.అది అత్యుత్తమ లక్షణం.మహనీయులు ఒక మనిషిలోని ఇలాంటి లక్షణాలనే గమనిస్తారు గాని డబ్బునీ హోదానీ చూడరు.

విజయవాడలో ఉన్న రోజులలో చలం పెనమలూరు రోడ్డులో ఉన్న మాలపిచ్చమ్మను చూడటానికి అప్పుడప్పుడూ వెళ్ళేవాడు.ఆమె ఒక అవధూత.నగ్నంగా రోడ్డుమీద దుమ్ములో కూచుని ఉండేది.చలాన్ని ఆమె దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకునేది.నాస్తికుడని లోకం అనుకునే చలం ఆమెలోని దైవత్వాన్ని అప్పట్లోనే గుర్తించాడు.ఇప్పుడంటే ఆమెకు గుడి ఉన్నది.అప్పట్లో ఒక పిచ్చిదాని లాగా ఆమె తిరుగుతూ ఉండేది.నీవు ఆమె ఫోటో చూచావా?' అడిగాను.

'లేదన్నగారు' చెప్పాడు చలం.

'నేను చూచాను.ఆమె పేరుకు మాలపిచ్చమ్మ అయినా ముఖంలో బ్రాహ్మణకళ ఉట్టిపడుతూ ఉంటుంది.ఒకరోజున ఆమె చలాన్ని నుదుటిమీద ముద్దుపెట్టి 'కనుబొమల మధ్యన నీకేమైనా వెలుగు కనిపించిందా?' అని అడిగింది.చలం లేదన్నాడు.ఆమె నిరాశగా చూస్తూ -'ఈ జన్మ ఇంతేరా నీకు. వచ్చే జన్మలోనే నీకు దొరుకుతుంది.ఈ జన్మకు కాదు.' అన్నది.

వింటున్న చరణ్ ఇలా అన్నాడు.

"చలంగారు అవసానదశలో ఉన్నప్పుడు మా నాన్నగారి ద్వారా జిల్లెళ్ళమూడి అమ్మగురించి విని అమ్మను చూడాలని ఉందని ఉత్తరం వ్రాశాడు.అప్పుడు మా నాన్నగారు చలం గురించి అమ్మకు చెప్పాడు. అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదు.కదిలే పరిస్థితి కాదు.అయినా సరే అమ్మ బయల్దేరి అరుణాచలం వెళ్ళింది.అమ్మ వెంట అందరూ ఒక బస్సులో బయల్దేరారు.

అమ్మను చూచిన చలం కదిలిపోయి ఏడ్చాడు."ఇప్పటిదాకా ఎవరైనా, ఏడిరా నీ ఈశ్వరుడు? అనడిగితే నేనేమీ చెప్పలేకపోయేవాడిని.కానీ ఇప్పుడు చెప్పగలను ఇదుగో ఇన్నాళ్ళూ నేనారాధించిన ఈశ్వరుడు-" అని అమ్మను చూపిస్తూ అన్నాడు చలం.

అంతేకాదు."అమ్మా నేను ముసలివాడినై పోయి కదలలేని స్థితిలో ఇక్కడ పడి ఉన్నాను.నా మీద దయతో ఇంతదూరం నీవే వచ్చావా?" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

"అవును తమ్ముడూ.చలం బైటకు ఒక విప్లవవాది లాగా కనిపించేవాడు కానీ లోపల ఒక పసిపిల్లవాడు.అంత నిర్మలమైన మనస్తత్వం అతనిది. అందుకే ఎంత గొప్పవారు తన దర్శనం కోసం వచ్చినా చలించని అమ్మ తనంత తానుగా అతన్ని వెదుక్కుంటూ వెళ్ళింది.మహనీయుల చర్యలు ఇలాగే ఉంటాయి.ఇంకో సంగతి తెలుసా?"

"ఏంటది అన్నగారు?"

"చలం మొదటిసారి రమణమహర్షిని చూచినప్పుడు ఏమైందో తెలుసా?చలం సిగిరెట్టు తాగుతూ స్కందాశ్రమానికి పోయే దారిలో నిలబడి ఉన్నాడు.మహర్షి కొండ దిగి వస్తున్నారు.'మహర్షి వస్తున్నారు.దారివ్వండి' అని అందరూ తప్పుకుంటున్నారు.చలం దారివ్వకపోగా 'ఆయనకు అవసరమైతే ఆయనే తప్పుకొని పోతాడులే.నేనెందుకు దారివ్వాలి?' అన్నట్లు దారిలో అడ్డంగా నిలబడి సిగిరెట్టు తాగుతున్నాడు.

మహర్షే చలాన్ని తప్పుకొని అవతలకు వెళ్లి ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరిగి చలం వంక చూచారు.ఆ చూపులో ఏముందో గాని చలం చేతిలోని సిగిరెట్టు దానంతట అదే కింద పడిపోయింది.

మహర్షిలో ఏం గొప్పతనం ఉందో చలానికి మొదట్లో అర్ధమయ్యేది కాదు.' ఆ గోచీ ఏమిటి? ఆ అవతారం ఏమిటి? కేబరే డాన్సర్ లాగా? అందవికారంగా ఉన్న ఆయనలో ఏముందని మీరంతా అలా ఎగబడుతున్నారు?" అని అందరితోటీ అనేవాడు.

కానీ క్రమేణా చలంలో గొప్ప మార్పు వచ్చింది.అతని మనస్సులో నిరంతరం మహర్షే ఉండేవాడు.ఆయన గురించే మాట్లాడేవాడు.ఆయన్నే ధ్యానించేవాడు. మహర్షి పోయాక ఆశ్రమం ఖాళీ అయిపోయింది.ఎక్కడివారు అక్కడే వెళ్ళిపోయారు.మన జనాలవి ప్రాధమికంగా బానిస మనస్తత్వాలు.మనకు తెలిసింది వ్యక్తిగత ఆరాధన మాత్రమే,విలువల ఆరాధన కాదు.కానీ అందరూ వ్యసనపరుడు అనుకునే చలంమాత్రం ఎక్కడికీ పోలేదు.అక్కడే అంటి పెట్టుకుని ఉండిపోయాడు.చూచావా చలం కమిట్ మెంట్? అదీ అసలైన వ్యక్తిత్వం అంటే.

ఆశ్రమం అంతా ఖాళీ అయిపోతే చలం ఒక్కడే మహర్షి సమాధి దగ్గర దిగులుగా కూచుని ఉండేవాడు.అదీ అతని ప్రేమ.ఆ ప్రేమే అతని జీవితానికి ఔన్నత్యాన్ని ప్రసాదించింది.అతనిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. భగవద్గీతలో ఏముంది అని ఒకప్పుడు విమర్శించిన చలం 1964 లో భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశాడు. నేను ఎందఱో వ్రాసిన గీతావ్యాఖ్యానాలు చదివాను.కాని అన్నిట్లోకీ చలం వ్యాఖ్యానం 'ది బెస్ట్' అని నేనంటాను.

ఊకదంపుడు సోదీ పిట్టకధలూ లేకుండా విషయాన్ని ఉన్నదున్నట్లు సూటిగా స్పష్టంగా సింపుల్ గా చలం వ్రాస్తాడు.అదీ ఆయన శైలిలోని ప్రత్యేకత.ఆయన రచనలు చదువుతుంటే ఆయన మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది.ఆ మాటలు హృదయానికి హత్తుకుంటాయి.ఆత్మలోకి చొచ్చుకుని పోతాయి.చదివేవారిని కదిలిస్తాయి.

కానీ నేడు ఎవరూ చలం వ్రాసిన గీతావ్యాఖ్యానం చదవడం లేదు.అసలు చాలామందికి ఈ విషయమే తెలియదు.మన జనాలకు నకిలీవి నచ్చినట్లు అసలువి నచ్చవుకదా.ఈ నకిలీ లోకంలో ఇది మామూలే." అన్నాను.

(ఇంకా ఉన్నది)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు-7 "