స్వామివారి గురించి ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.
'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి.
రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.
శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.
ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.
అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.
అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !
యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.