“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మే 2013, శుక్రవారం

సముద్ర ఘోష

నింగీ నేలా కొండా కోనా చెట్టూ పిట్టా నదీ కడలీ నా నేస్తాలు.అవి నాతో మాట్లాడతాయి.తమ భావాలను నాతో చెప్పుకుంటాయి.మేం ఒకళ్ళ ఊసులను ఒకళ్ళతో చెప్పుకుంటాం.బాధలను కలబోసుకుంటాం.కలసి పయనం సాగిస్తాం.మా స్నేహం మచ్చలేనిది.మాయామర్మం ఎరుగనిది.కల్మషపు చేదును తెలియనిది.విశ్వాసం లేని మనుషులకంటే ప్రకృతి ఎంతో మంచి స్నేహితురాలు.

మొన్నొక రోజున ఏకాంతవాసంలో భాగంగా కడలి ఒడ్డున కొన్ని గంటలు మౌనంగా గడిపాను.తను నాతో ఎన్నో ఊసులు చెప్పింది.మనసు విప్పి మాట్లాడింది.తన వేదనను నాతో పంచుకుంది.ఆ భావాలు మీరూ వినండి.

కెరటాల ఘోష విని 
బెదరు వారేగాని 
నే జెప్పు ఊసులను 
వినెడు వారేరి?

కాళ్ళు తడిసిన క్షణమే 
కలవరమ్మే గాని 
నాలోని లోతులు 
తెలియువారేరి?

స్నానమాడగ దలచు 
సందేహులే గాని 
నాలోకి నడువగల
సాహసులు ఏరి?

వట్టి మాటలు జెప్పు 
వదరుబోతులె గాని 
వరుణ నగరము జేరు 
విబుధులేరి?

ఒడ్డునే కూచుండి 
ఒగిమాటలే గాని 
ఓర్పుతో లోతులను 
చేరువారేరి?

నావైపు చూచుచు 
నిలుచువారేగాని 
నాలోన చేరంగ 
వచ్చువారేరి?

నను తాకి కాసేపు 
మరలి పోవుటె గాని 
నిత్యమూ నాదరిని
నిలచువారేరి?

వారి భాషలలోన 
వాదమ్ములేగాని
నా నిత్యఘోషను 
ఎన్నువారేరి?

కౌతుకమ్ముగ నన్ను 
కాలదన్నుటే గాని 
కనరాని లోతులను 
కలియువారేరి?

కల్లోల కడలి యని 
కటువు మాటలె గాని 
నా కనుల లోతులను 
కాంచువారేరి?

ఉప్పు నీరనుచు నను 
తప్పులెన్నుటే గాని
ఒక్కటే రుచి యన్న 
వేత్తలేరి?

రంగులేదని నాకు
రచ్చ చేయుటే గాని
అంబరపు నీలాల 
అరయువారేరి?

పగలంతయును ఒట్టి 
పలకరింపులే గాని 
రాత్రిళ్ళు నాతోడు 
నిలచువారేరి?

ఎగసి పడు కెరటాల 
నెత్తి చూపుటయే గాని 
చెలువంపు కట్టను
తలచువారేరి?

ఒడ్డునే కూర్చుండి 
వెడలి పోవుటయేగాని
నా ఒడిని ననుజేరి 
నవ్వువారేరి?

గుడ్డిగవ్వల చూచి 
గంతులాటే గాని 
నాలోని రత్నాల 
వెదుకువారేరి?

ఇసుకలో కూచుండి 
ఇచ్చకాలేగాని 
సత్యమౌ సంపదల  
సాధకులు ఏరి?

నను గాంచి నిట్టూర్చి 
తేరిచూచుట యేగాని  
నా హృదయవేదనను
తెలియువారేరి?

మౌన ఘోష యటంచు 
మాటలనుటే గాని 
నా మనసు నాలించు 
నా మిత్రులేరి?

ఒకరి కన్నులలోకి 
ఒకరు చూచుటె గాని 
నా కనుల నీలాలు 
తుడుచువారేరి?

డొల్ల ప్రేమల చూపు 
లొల్లి మాటలె గాని 
నా ప్రేమ నగరాన 
నడచువారేరి?

పైపైన ననుజూచి 
పరవశించుట యేగాని 
నా ఆత్మ లోనన్ను 
పొందువారేరి?
read more " సముద్ర ఘోష "

29, మే 2013, బుధవారం

గురుగ్రహ రాశిమార్పు -- ఫలితాలు

చాలామంది వారి వారి జీవితాలలో ఇంతకు ముందు కంటే కొన్ని మార్పులను గత కొద్దిరోజులుగా గమనించే ఉంటారు. ఒకవేళ గమనించకపోతే ఇప్పుడు చూచుకొండి.గత ఏడాదిగా మీ జీవితం నడుస్తున్న తీరుకీ ఇప్పటితీరుకీ మీకు తేడాలు ఖచ్చితంగా కనిపిస్తాయి.దానికి కారణం గురుగోచారంలోని మార్పు.

31-5-2013 న ఇప్పటివరకూ తానున్న వృషభరాశినుంచి మారి గురుగ్రహం మిధునరాశిలోకి ప్రవేశించ బోతున్నది. అక్కడ ఏడాది పాటు ఉంటుంది.ఆ సమయంలో మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రాల మీద సంచరిస్తుంది. పన్నెండు రాశులవారికి ఈ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

మేషరాశి:
లోకంతో సంబంధాలు విస్తృతం అవుతాయి.సమాజంలో పరిధి పెరుగుతుంది. కమ్యూనికేషన్ ఎక్కువౌతుంది.ప్రయాణాలు ఉంటాయి.ధైర్యం పెరుగుతుంది. గేమ్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటారు.రచయితలకు మంచి కాలం మొదలౌతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.కొత్త రచనలు చేస్తారు.

Focus:మీ ఎకౌంట్లో ఉన్న కర్మఫలం మిమ్మల్ని ఇప్పుడు ముందుకు నడిపిస్తుంది.జీవితంలో మార్పులు తీసుకొస్తుంది.

వృషభరాశి:
వాదవివాదాలలో చిక్కుకుంటారు.ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారు.కుటుంబ విషయాలు ఫోకస్ లోకి వస్తాయి.డబ్బు సంపాదన ఎక్కువౌతుంది.దానితోబాటే ఖర్చూ ఎక్కువౌతుంది.

Focus:పూర్వీకుల కర్మ,వంశ కర్మ మిమ్మల్ని ఇప్పుడు నడిపిస్తాయి. జరిగే సంఘటనలు దానికి అనుగుణంగానే జరుగుతాయి.

మిధునరాశి:
నూతనోత్సాహం వస్తుంది.అనుకున్న పనులు జరుగుతాయి. వాయిదా వేస్తున్న పనులు మొదలుపెడతారు.అవివాహితులకు వివాహం జరుగు తుంది.ప్రేమలో జయం సొంతం అవుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.ఇప్పటికే ఉద్యోగులైనవారికి బాధ్యతలు పెరుగుతాయి.

Focus:వివాహజీవితం,సమాజంతో సంబంధాలూ ఇప్పుడు ప్రముఖపాత్ర వహిస్తాయి.

కటకరాశి:
అనుకోని ఖర్చులు తలెత్తుతాయి.పుణ్యక్షేత్రాలు తిరుగుతారు.మంచి పనులకు భారీ ఖర్చులు చేస్తారు.జీర్ణకోశ వ్యాధులు తలెత్తుతాయి.ఇంటిలోని పెద్దలకు ఆరోగ్య భంగం ఉంటుంది.కొందరికి పెద్దలు గతించవచ్చు.ఉద్యోగంలో చికాకులూ గొడవలుంటాయి.స్థానచలనం కూడా సాధ్యమే.ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.

Focus:ప్రత్యర్దులూ,నష్టాలూ మీ జీవితంలో ప్రస్తుతం ప్రముఖ పాత్ర పోషిస్తాయి.నరదృష్టి నరఘోష ఎక్కువౌతుంది.దానిని కాచుకోవడం తోనే మీకు రాబోయే ఏడాది సరిపోతుంది.

సింహరాశి:
మంచిరోజులు వస్తాయి.లాభాలు కనిపిస్తాయి.కోర్టు కేసులలో గెలుస్తారు.చిక్కులు విడిపోతాయి.సోదరులకు మంచి జరుగుతుంది.ఆస్తి కలసి వస్తుంది.

Focus:అదృష్టమూ లాభాలూ మీ రాబోయే ఏడాదిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

కన్యారాశి:
ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తుంది.నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.వ్యాపారం కలిసొస్తుంది.వృత్తిరీత్యా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి.

Focus:చదువూ ఉద్యోగమూ,ఇల్లూ,ఆఫీసూ మీ సమయాన్ని ఆక్రమిస్తాయి.

తులా రాశి:
ఇప్పటివరకూ పడుతున్న బాధలనుంచి విముక్తి వస్తుంది.ఊరట కలుగుతుంది.కాకపోతే పూర్తిగా మార్పురాదు.పరిహారాలు ఫలించడం మొదలౌతుంది.నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది.నిరాశ మాయమై కొంత వెలుగు కనిపిస్తుంది.

Focus:గత కాలపు మంచి కర్మ బేలెన్స్ నుంచి మీకు చెల్లింపు మొదలౌతుంది.

వృశ్చికరాశి:
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మార్మిక ధోరణి ఎక్కువౌతుంది.లౌకిక జీవితంలో నష్టాలు ఎదుర్కొంటారు.సంతానానికి అనారోగ్యం ఎక్కువౌతుంది.మానసిక చింత పీడిస్తుంది.కుటుంబం లోని పెద్దలు గతిస్తారు.

Focus: కుటుంబమూ,నష్టాలూ,చింతా మిమ్మల్ని నడిపిస్తాయి.

ధనూరాశి:
దూరప్రయాణాలు చేస్తారు.దూరదేశాలు పర్యటిస్తారు.వివాహం జరుగుతుంది. తద్వారా స్థానచలనం ఉంటుంది.చదువుకోసం దూరప్రాంతాలకు వెళతారు.సంఘంలో పరిచయాలూ పరిధీ పెరుగుతాయి.దీర్ఘవ్యాదులతో బాధపడుతున్న వృద్దులకు శాశ్వత విముక్తి లభిస్తుంది.

Focus:దూరప్రాంతాలు,సమాజ సంబంధాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

మకరరాశి:
వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.శత్రువులు బలహీనపడతారు. సోదరులకు అనారోగ్యం కలుగుతుంది.అయితే అదే సమయంలో వారికి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది.రోగాలకు డబ్బును ఖర్చు చెయ్యవలసి వస్తుంది.

Focus:బాధ్యతలు,శత్రువులు,నష్టాలు వెలుగులోకి వస్తాయి.

కుంభ రాశి:
చతురత,లౌక్యం ఎక్కువౌతాయి.షేర్ మార్కేట్లోకి దృష్టి సారిస్తారు.రచయితలు కళాకారులకు నూతన ఉత్సాహమూ అవకాశాలూ లభిస్తాయి.నూతన రచనలు చేస్తారు.ప్రేమవ్యవహారాలు మొదలౌతాయి.గృహస్తులకు సంతానం మీద ఫోకస్ ఎక్కువౌతుంది.సోదరులకు లాభిస్తుంది.

Focus:మానసిక చైతన్యమూ,ఆశా మిమ్మల్ని నడిపిస్తాయి.

మీనరాశి:
ఇంటివిషయాల మీద దృష్టి ఎక్కువగా సారించవలసి వస్తుంది.జీవితం సుఖంగా గడుస్తుంది.వృత్తిఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది.అనుకోని నష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది.విద్యారీత్యా గాని,ఉద్యోగరీత్యాగాని,నివాసస్థలం మారుతుంది.

Focus:ఇల్లు,వృత్తి,ఉద్యోగం మీ సమయాన్ని ఆక్రమిస్తాయి.

ఇవి స్థూలఫలితాలు మాత్రమె.సూక్ష్మవివరాలకు వారివారి వ్యక్తిగత జాతకాలు చూచుకొని ఆఫలితాలతో పైనచెప్పిన గోచార ఫలితాలను సమన్వయించు కోవలసి ఉంటుంది.
read more " గురుగ్రహ రాశిమార్పు -- ఫలితాలు "

25, మే 2013, శనివారం

బుద్ధమతం అదృశ్యానికి కారణం

ప్రతి సంవత్సరమూ నేను అతి పవిత్రమైన రోజులుగా పరిగణించే కొన్ని రోజులలో బుద్ధపూర్ణిమ ఒకటి. ఈరోజుకోసం నేను నిజానికి ఎదురు చూస్తాను.కారణం ఏమంటే,బుద్ధుని నేను ఎంతో ఆరాధిస్తాను అభిమానిస్తాను.బుద్ధునివంటి మహానుభావుడు కొన్నివేల సంవత్సరాలకు గాని జన్మించడం జరగదు అనేది సత్యం.

బౌద్ధం మనదేశం నుంచి అదృశ్యం కావడానికి శంకరులు కారణం అని కొందరు దురుద్దేశ్య పూర్వకంగా బురద చల్లారు.అది పూర్తి నిజం కాదు.ఒక్క వ్యక్తివల్ల ఒకమతం నాశనం కావడం ఎన్నటికీ జరగదు.శంకరులు బౌద్ధులను వాదంలో జయించినంత మాత్రాన దేశం మొత్తం దానిని ఒప్పుకొని అప్పటివరకూ తాము ఆచరిస్తున్న బౌద్ధాన్ని తోసిపారేసింది అనడం సత్యదూరం అవుతుంది.మరి మన దేశంలో బౌద్ధం కనుమరుగు కావడానికి కారణాలేమిటి?

ప్రాధమికంగా బౌద్ధం ఒక సాధనామార్గం. అది ఒక ఫిలాసఫీ కాదు. దానిలో ఎంతో ఫిలాసఫీ ఉండవచ్చు.కాని మౌలికంగా అది ఒక దారి. సిద్ధార్ధ గౌతముడు ఆ దారిన నడిచి బుద్ధత్వాన్ని పొందాడు. ఆ దారి ఏమిటో దానిలో ఎలా నడవాలో ఆయన స్పష్టంగా చెప్పాడు.ఆయన తరువాత ఎందఱో ఆ దారిన నడిచి బుద్ధులయ్యారు. ఈ నాటికీ నడవగలిగిన వారు బుద్ధత్వాన్ని పొందుతున్నారు.

అయితే అలా ఆ దారిలో నడవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ పని అందరూ చెయ్యలేరు.దానికి ఎంతో పరిపక్వత ఉండాలి.ఎంతో చింతన ఉండాలి.ఎంతో తపన కావాలి.జీవితంలో మౌలిక సమస్యల గురించి ఎంతో సంఘర్షణ ఉండాలి. లోక వ్యామోహాలు,ఇంద్రియ వ్యామోహాలు దాటి ఎంతో ఎత్తుకు ఎదగాలి. అలాంటి మనుషులు మాత్రమె ఆ దారిలో నడవగలుగుతారు.మిగిలిన వారికి ఆ దారి అందేది కాదు.స్వయానా గౌతమ సిద్ధార్ధుడు ఎంతో అంతరిక సంఘర్షణ తర్వాతే బుద్ధత్వాన్ని పొందగలిగాడు.

ఏ దేశంలోనైనా సరే సామాన్యజనానికి ఉన్నతమైన భావాలు అవసరం ఉండదు. వారి బ్రతుకులు నేలబారుగా సాగుతూ ఉంటాయి.రొచ్చులో దొర్లే పందుల్లాగా వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి.మేఘాలలోకి రమ్మంటే అవి  రాలేవు.కారణాలేమంటే,ఆకాశంలోకి ఎలా ఎగరాలో వాటికి తెలీదు.వాటికి రెక్కలు కూడా లేవు.పైగా,రొచ్చు హాయిగా ఉన్నప్పుడు అందులోనుంచి బయటకు ఎందుకు రావాలి? కనుక, ఉన్నతమైన భావాలను అర్ధం చేసుకునే మనుషులు ఏకాలంలోనైనా తక్కువమందే ఉంటారు.ఇక వాటిని నిత్యజీవితంలో ఆచరించే ధైర్యం ఉన్నవారు ఇంకా తక్కువమంది ఉంటారు. కనుక అత్యున్నతమైన సత్యాలను ఉపదేశించే మతాలు సామాన్య జనంలో మనుగడ సాగించలేవు.బౌద్ధం మనదేశంలో కనుమరుగు కావడానికి ప్రధానకారణం ఇదే.

బుద్ధమతం ఎంతో సంయమనంతో కూడిన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మనిషిలో మౌలికమైన ఒక విప్లవాన్ని అది కోరుతుంది.అది ఆచరించవలసిన మతం.దానిని జీవితంలో ఆచరించాలంటే మనిషి ఇప్పటివరకూ తాను అంటి పెట్టుకుని ఉన్న ఎన్నింటినో తనంతట తాను త్యాగం చెయ్యవలసి ఉంటుంది.ఆ రిస్క్ తీసుకోడానికి ఎవరూ ఇష్టపడరు.అందుకే బుద్ధమతం మన దేశంలో నుంచి అదృశ్యమై పోయింది.

ఇప్పుడు మనం ఎంతో అభివృద్ధి సాధించాం అని విర్రవీగుతున్నాం.లౌకిక సుఖాల విషయంలోనూ,సౌకర్యాల విషయంలోనూ అది నిజమే కావచ్చు. కాని అంతరికంగా చూస్తే, ప్రాచీనులకంటే మనం చాలా దిగజారాం అనే చెప్పాలి. ప్రాచీనుల మనోబలం మనకు లేదు.వారికున్న నైతిక బలమూ మనకు లేదు.సత్యాన్ని ధైర్యంగా అనుసరిచే సత్తాలో ప్రాచీనులకంటే మనం చాలా వెనుకబడిపోయాం అనే చెప్పాలి.బుద్ధుని కాలంలో ఆయన మార్గంలో నడిచిన వారు వేలల్లో ఉన్నారు.కాని తర్వాత కొన్ని శతాబ్దాలకు అదే దేశంలో వెతికి చూద్దామన్నా ఒక్కరూ కనిపించక మాయమయ్యారు.కారణం ఏమంటే- మనుషులలో ఎక్కువైన దిగజారుడుతనం అనే చెప్పాలి.ఇక్కడ వినేవారు కరువయ్యారు గనుకనే, బోధిధర్మ వంటి వారు చైనాకు పోయి జెన్ బౌద్ధాన్ని ప్రచారం చేసుకోవలసిన గతి పట్టింది.

అత్యున్నతమైన సత్యాలను బోధించే ఏ మతానికైనా ఇదే గతి పడుతుంది.ఉదాహరణకి శంకరుల అద్వైతం సంగతి చూస్తె, దానికీ ఇదే గతి పట్టిందని కనిపిస్తుంది.నేడు అద్వైతులమని చెప్పుకునేవారిలో ఎక్కడా అద్వైత ఆచరణలు లేవు.ప్రపంచం మొత్తంమీద ఎక్కడ చూచినా,మనిషి నేలబారున బ్రతకడానికే ఇష్టపడతాడు. కాని 'అన్నింటినీ వదలి నాతో రా' అంటే ఎవ్వడూ ముందుకు రాడు. సాక్షాత్తూ దేవుడే ప్రత్యక్షమై ఆమాట చెప్పినా కూడా ఆయన్ను ఎవడూ అనుసరించడు. ఎందుకంటే, ఉందొ లేదో వస్తుందో రాదో తెలియని ఏదో గమ్యంకోసం ఇప్పటి సుఖాలను వదులుకోవడం ఎవడికీ ఇష్టం ఉండదు.

ఇదే సత్యాన్ని తిరగదిప్పి చూస్తె ఇంకో విషయం బోధపడుతుంది.ప్రపంచంలో అతి ఎక్కువ ఆదరణ పొందిన మతాలన్నీ అత్యున్నతమైన సత్యాలను చెప్పేవి కావు. మన జీవన విధానానికి దగ్గరగా ఉండే భావాలే మనకు నచ్చుతాయి.మనం బురదగుంటలో బతుకుతున్నాం గనుక అందులోనుంచి బయటకు రాకుండా ఇంకా ఎక్కువ బురదను ఒంటికి ఎలా పూసుకోవాలో చెప్పేవారు మనకు బాగా నచ్చుతారు. అంతేగాని ఆ మురికి గుంతను వీడి బయటకు రమ్మని చెప్పేవారు ససేమిరా నచ్చరు.మనవి కుహనా బతుకులు గనుక అలాంటి మాటలు చెప్పే మతాలే మనకు నచ్చుతాయి. పాపులర్ క్రైస్తవాన్నీ,ఇస్లాంనూ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధంలోనూ అద్వైతంలోనూ ఉన్నంత అత్యున్నతమైన ఫిలాసఫీ వాటిలో ఎక్కడా కనిపించదు,అంతేగాక బౌద్ధం చెప్పినట్లు మనిషిని మౌలికంగా మారమని,అంతరికంగా ఎత్తులకు ఎదగమని అవి చెప్పవు.కనుక సామాన్య జనానికి అవే నచ్చుతాయి.లోకంలో అవే ఎక్కువగా చెలామణీలో ఉంటాయి.

పాపులర్ హిందూమతం కూడా అలాంటిదే.ఇందులో కూడా గుళ్ళూ గోపురాలూ మొక్కులూ పూజలూ ఉంటాయి. కాని మౌలికంగా మనిషిలో మార్పును తీసుకొచ్చే విధానాలు ఎక్కడా బయటకు కనిపించవు. అంటే నా ఉద్దేశ్యం అలాంటి విధానాలు హిందూమతంలో అసలు లేవని కాదు. ఉన్నాయి.కాని నిగూడంగా ఉన్నాయి.అవి అందరికీ లభించవు. కనుక గొర్రెల మందల్లాగా జనం పోలోమంటూ మామూలు నేలబారు ఆచరణలలోనే పడి దొర్లుతూ ఉంటారు.

పండుగరోజుల్లో ఏవో పూజలు చేస్తే చాలు, ఏడాదికి ఒకసారో రెండుసార్లో ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తే చాలు అని సామాన్య హిందువులు అనుకుంటారు.అలాగే,వారానికొకసారి చర్చికెళ్ళి కన్ఫెషన్ చేసివస్తే చాలు ఇక ఆతర్వాత మనం ఏంచేసినా పరవాలేదు అని క్రైస్తవులు అనుకుంటారు. రోజుకు అయిదుసార్లు నమాజ్ చదివి జన్మలో ఒకసారి మక్కా పోయి వస్తే చాలు, మనం ఎంతమంది కాఫిర్లను చంపినా పరవాలేదు అని సాధారణ ముస్లిం అనుకుంటాడు.

కాని బౌద్ధం ఇలాంటి చవకబారు ఆచరణలను బోధించలేదు.ఎక్కడో మరణం తర్వాత దొరికే స్వర్గాన్ని అది ఆశ చూపించలేదు.ఇక్కడే ఇప్పుడే నీవు సత్యాన్ని అందుకోవచ్చనీ, దానికి దారి ఒకటుందనీ బుద్ధుడు చెప్పాడు. ఆయన ఆ దారిలో నడిచాడు.అంతేగాక నీవు నడవగలిగితే నీవూ ఆ స్తితిని ఇప్పుడే ఇక్కడే అందుకోవచ్చు అనీ చెప్పాడు. అయితే ఆ పని చెయ్యాలంటే, పైన చెప్పినట్లుగా, మనిషికి ఎంతో పరిపక్వతా త్యాగమూ అవసరం అవుతాయి. అవి ఎవ్వరూ కోరుకోరు కనుక ఆదారిన ఎవ్వరూ నడిచే సాహసం చెయ్యలేరు.ఆడుతూ పాడుతూ గుళ్ళూ గోపురాలూ సరదాగా పిక్నిక్ లాగా తిరిగి హుండీలో డబ్బులు పారేసి స్నేహితులతో పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని తిరిగిరావడం చాలా తేలికపని కనుక అందరూ అదే పని చేస్తారు.గడ్డాలు పెంచడమూ,గుండు చేయించుకోవడమూ,టోపీ ధరించడమూ,బొట్లు పెట్టుకోవడమూ,ప్రత్యేకడ్రస్సులు ధరించడమూ  మొదలైన వేషాలు వెయ్యడం చాలాతేలిక గనుక అందరూ వాటిని అనుసరిస్తారు. దీనికి భిన్నంగా,అంతరికంగా మార్పు తెచ్చుకోవడం చాలాకష్టం గనుక అది ఎవరికీ అవసరం లేదు.ఆ మార్గం అందరికీ అందను కూడా అందదు.

బౌద్ధంవంటి సాధనామార్గ మతం మన దేశం నుంచి అదృశ్యం కావడానికి ప్రధాన కారణం దానిని ఆచరించే సత్తా జనులలో లేకపోవడమే.కొందరు చెప్పేటట్లు,తాంత్రిక అభ్యాసాలు అందులో ప్రవేశించి పతనానికి దారి తియ్యడమూ,శంకరుల వంటి మహనీయులు దానిని వ్యతిరేకించడమూ అసలైన కారణాలు కాదు. అవి దోహదకారణాలు అయి ఉండవచ్చు.కాని మౌలికకారణం మాత్రం జనుల చవకబారు మనస్తత్వమే.అత్యున్నత సత్యాలను అందుకునే స్థాయి జనసామాన్యంలో లోపించడమే దీనికి ప్రధాన కారణం.
read more " బుద్ధమతం అదృశ్యానికి కారణం "

24, మే 2013, శుక్రవారం

ఒకరికొకరు దొందూ దొందే

'మంచివాళ్లకి మంచివాళ్ళే దొరుకుతారు. ఏలినవారికి నేను దొరికాను' - అందిట ఒకామె అనవసరంగా తనను తిడుతున్న భర్తతో.

మన ప్రభుత్వాలను ప్రజలనూ చూస్తె నాకు పై సామెతే గుర్తుకొస్తుంది.అన్ని వనరులూ ఉన్న అన్నపూర్ణలాంటి దేశాన్ని ఎంత అధ్వాన్నంగా పరిపాలించవచ్చో, ఎన్ని రకాలుగా దాన్ని భ్రష్టు పట్టించవచ్చో నిరూపిస్తున్నారు నేటి పాలకులు.

ఇక ప్రజలు మాత్రం తీసిపోయారా? పాలకులను మించిన దొంగల్లాగా వీళ్ళూ తయారయ్యారు.ఎవడికీ కామన్ సెన్స్ ఉండదు.కనీసం సివిక్ సెన్స్ కూడా ఉండదు.ఆరోజు పబ్బం ఆరోజుకి గడవటమే మన ప్రజల లక్ష్యం.ఆ క్షణానికి పక్కవాణ్ని వెనక్కి నెట్టేసి తాను ముందుకు పోవడమే గొప్ప అని ప్రతివాడూ అనుకుంటాడు.కనుకనే ప్రజలూ పాలకులూ దోపిడీలో ఒకరికొకరు సరిపోయారు.

'వడదెబ్బ తగిలి వందమంది మృతి.రోడ్డు ప్రమాదంలో ఇరవై మంది హరీ.అగ్నిప్రమాదంలో అరవై మంది మృతి.కట్టడం కూలి వందల్లో చచ్చిన జనం.' పొద్దున్న లేస్తే ఎక్కడ చూచినా ఇవే వార్తలు.

మనకు ప్రతి ఎండాకాలమూ వడదెబ్బ తగిలి వందల్లో వేలల్లో జనం పిట్టల్లా పిచ్చుకల్లా చస్తూనే ఉంటారు. పొరపాటు. పిచ్చుకలను ఎప్పుడో నిర్మూలనం చేసేశాం కదా.కనుక వాటిని ఇప్పుడు మన మాటల్లోకి తేకూడదు.అలా జనం ప్రతి ఏడాదీ చస్తున్నా సరే, మనకు ముందు చూపు అనేది మాత్రం ఉండదు.వచ్చే ఏడాది గురించి ప్లానింగ్ అసలే ఉండదు.పోనీలే జనాభా తగ్గుతుంది అనుకుంటారో ఏమిటో అర్ధం కాదు.

చెట్లు పెంచితే చల్లదనం ఉంటుంది అని కొన్ని వందల ఏళ్ళ నించీ ఎంతోమంది మొత్తుకుంటూనే ఉన్నారు.కాని ఆ పని ఎవరూ చేస్తున్నట్లు కనిపించదు. ఎక్కడికక్కడ చెట్లను నరికేయ్యడమే మనకు నిత్యమూ కనిపించే సత్యం. 

ప్రకాశం జిల్లాలో మొన్నొక ఊరు చూచాను. ఊరిమొత్తం మీద ఒక్కటంటే ఒక్క చెట్టు లేదు. చాలా విచిత్రం అనిపించింది. ఊరంతా భయంకరమైన వేడితో కాలిపోతున్నట్లు ఉన్నది. అయినా సరే,జనం అలాగే బతికేస్తున్నారు గాని చెట్లు పెంచుకుందాం అని ఒక్కరికీ తోచదు. మళ్ళీ రాత్రయ్యే సరికి అరుగులమీద చేరి ఎవడిని కదిలించినా డిల్లీ రాజకీయాలకు తక్కువ కాకుండా మాట్లాడతారు.సోనియా మనసులో ఏముందో చెబుతారు.మోడీ ప్రధానమంత్రి అవుతాడా కాడా చెప్పేస్తారు. కానీ ఎదురుగా తమను వేధిస్తున్న సమస్యమీద దృష్టి ఉండదు.ఆ బాధ్యత తమది కాదనీ,అది ఎవరో వచ్చి చెయ్యాల్సిన పని అనీ అనుకుంటారు.

వేసవిలో నీళ్ళు లేక అల్లాడటం అనేది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర. ఈ సమస్యను కూడా ఎలా పరిష్కరించాలో ఎవ్వరికీ పట్టదు. ఈనాటికీ వేసవిలో మైళ్ళకు మైళ్ళు నడిచిపోయి నీళ్ళ బిందెలు మోసుకోచ్చుకునే ఊళ్లు ఎన్నో ఉన్నాయి.ఇంకుడు గుంటలు అనేవి ఏర్పాటు చేసుకుంటే వర్షాకాలంలో పడిన వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు సమృద్ధిగా ఉంటాయి.దీనివల్ల వేసవిలో నీటి ఎద్దడి ఉండదు. దానికి తోడు నేలవేడి కూడా తగ్గుతుంది.అని ఎందఱో చెప్పారు. కాని ప్రజలు ఎవరూ వినరు.ఆ పని ఎవ్వరూ చెయ్యరు.

బౌద్ధంలో మైత్రీధ్యానం అని ఒకటుంది. అది చేసేవారికి శత్రువులంటే కూడా సౌమ్యభావం ఏర్పడుతుంది. కాని నేటి సమాజాన్ని చూస్తుంటే అలాంటి వారికి కూడా పిచ్చికోపం వస్తున్నది. ఒక వారం క్రితం నాకు తెలిసిన ఒకామె కనిపించింది.ఆమె కొడుకు అతివేగంగా ఆటో నడుపుతూ ఎదురుగా వస్తున్న ఒక లారీని గుద్దేసి తనతో పాటు తన ఆటోలో ప్రయాణిస్తున్న అందరినీ పరలోకానికి తీసుకుపొయాడు. చిన్న వయసులోనే కొడుకు పోయాడని చెప్పి ఆమె బాధపడింది.నాకేమీ బాధ కలగలేదు.

సరికదా ఆమెకు ఇలా చెప్పాను.

'ఏడిచి ఉపయోగం ఏముంది.నువ్వు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపో'.

'అదేంటి సార్ అలాగంటావు?'

'అంతే మరి.అలాంటి కొడుకుని కన్నందుకు నీకు నీవు వేసుకోవలసిన శిక్ష అదే. తనతో బాటు కొంతమంది ప్రయాణీకుల ప్రాణాలకు తాను బాధ్యుణ్ణి అన్న విషయం మర్చిపోయిన అలాంటి మృగాన్ని కన్నందుకు, వాడిని అలా పెంచినందుకు నీకూ శిక్ష పడాలి.' అని చెప్పాను.

'దానికి నేనెందుకు చావాలి? అడిగింది ఆమె.

'మరి ఆ చనిపోయిన ప్రయాణీకుల బంధువులు ఎంత ఏడుస్తున్నారో నీకెందుకు తట్టలేదు?వాళ్ళవి ప్రాణాలు కావా? నీ కొడుకోక్కడిదే ప్రాణమా?' అడిగాను.

జవాబు లేదు.

మనుషులలో మానవత్వం అనేది మాయమై రాక్షసత్వమూ పైశాచికత్వమూ వెర్రి తలలు వేస్తున్నాయి అనడానికి నిత్యజీవితం నుంచి ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వగలను.

మొన్నొక రోజున ఒక ఆస్పత్రికి పనుండి వెళ్లాను.

ఒక పేషంట్ ని వీల్ చైర్లో తీసుకొచ్చారు ఆస్పత్రిలో చేర్చడానికి.అతను పేషంట్ కి ఎక్కువా శవానికి తక్కువలాగా ఉన్నాడు.ఇప్పుడో ఇంకాసేపట్లోనో అన్నట్టు ఉంది వాడి వాలకం.పక్కనే వాడిని నెట్టుకొచ్చిన ఇంకోడు ఉన్నాడు.ఎందుకనో వాళ్ళు అక్కడ కాసేపు వెయిట్ చేస్తున్నారు.నేనూ అక్కడే నిలబడి ఉన్నాను.ఇంతలో ఆ అటెండెంట్ అనబడేవాడు శవం లాంటి పేషంట్ తో అన్న మాటవిని నేను నిర్ఘాంతపోయాను.

అటుగా పోతున్న ఒకమ్మాయిని చూపిస్తూ 'ఒరేయ్ చూడు చూడు కత్తిలా ఉంది కదూ' అంటున్నాడు వీల్ చెయిర్లో శవపేషంట్ ని తోసుకోచ్చిన వ్యక్తి.ఆ పేషంట్ కూడా ఆ అమ్మాయి వైపు గుడ్లప్పగించి చూస్తున్నాడు. వాళ్ళక్కడికి ఎందుకొచ్చారో అన్న జ్ఞానం కూడా వాళ్లకు ఉన్నట్లు కనిపించలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతె తెల్లవారి లేచిన దగ్గరనుంచీ ఉదాహరణలు వందలూ వేలల్లో ఇవ్వవచ్చు.ఒకటి మాత్రం స్పష్టం.

ప్రజల్లో బాధ్యతారాహిత్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఎక్కడ చూచినా అవినీతీ, అహంకారమూ, పొగరూ, నిర్లక్ష్యధోరణీ, అవకాశవాదమూ, స్వార్ధమూ బాగు చెయ్యలేనంతగా ఎక్కువయ్యాయి.కనుక ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ మధ్యన నాకు జాలి అనేది కలగడం లేదు.

ఇక రోడ్డు మీద ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎవడిష్టం వచ్చినట్లు వాడు రయ్యిమంటూ పోతూ ఉండటం చూస్తె,ఒకవేళ ఏదన్నా జరిగినా కూడా 'అయ్యో పాపం' అనిపించడం లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళవల్ల పక్కన తప్పుకొని పోతున్న అమాయకులు బలౌతున్నారు. వాళ్ళని చూస్తె మాత్రం బాధనిపిస్తుంది.

చట్టాన్నీ న్యాయాన్నీ పూర్తిగా ఉల్లంఘిస్తున్న నేటి ప్రజలనూ ప్రభుత్వాలనూ, అలా ప్రవర్తించే పౌరులను తయారుచేస్తున్న తల్లిదండ్రులనూ  చూస్తుంటే 'దొందూ దొందే' అన్న సామెతే గుర్తుకొస్తుంది.కనుకనే ప్రకృతి విలయాలు కూడా యధేచ్చగా పెరిగిపోతున్నాయి.సమాజన్యాయాన్ని, ప్రకృతి న్యాయాన్ని,మానవతా న్యాయాన్ని తుంగలో తొక్కుతున్న ప్రస్తుత సమాజాన్ని ఎవరూ బాగుచేయ్యలేరు.ఆ దేవుడొక్కడే దీనిని రక్షించాలి (ఆయనకు రక్షించాలి అనిపిస్తే).
read more " ఒకరికొకరు దొందూ దొందే "

23, మే 2013, గురువారం

తిక్కస్వామి తరగతిలో....

తనలో తానుండు వరకు 
తనకున్నతి రాబోదోయ్ 
తనను తాను దాటినపుడె 
తత్వమొంట బట్టేనోయ్ 
వేషధారులందరికి 
వెంబడించి చెబుతున్నా   
తత్వమెరుగ వలెనంటే
తనను తాను దాటిపోయి 
తటిల్లతల లోకంలో 
తళతళమని మెరవాలోయ్
  
వీధులలో తిరుగువాడు 
ఇంటిలోకి చేరలేడు 
ఇంటిలోనె యుండువాడు 
వీధి సొగసు కానలేడు 
దాగియున్న గుట్టునంత
విప్పి చెప్పబోతున్నా  
ఇంటా బయటా నెగ్గిన 
ఇష్టగురుని దీక్షబూని 
ఇతరములన్నియు వద్దని 
ఇలను చెలగి రావలెనోయ్ 

గిరుల దాటి మీరకుంటె
వివరమెట్లు తెలిసేనోయ్
గిరులలోనె గింజుకుంటె
నరుల బ్రతుకు కల్లేనోయ్ 
సత్యమైన మాటనొకటి 
సవ్యముగా చెబుతున్నా 
కట్లు తెంచుకోకపోతె
గుట్లు తెలియు విధమేదోయ్ 
కట్టుబాట్ల దాటకుంటె
కష్టమెపుడు తీరేనోయ్     

పర్వతాగ్ర సీమలందు 
పసిడివెలుగు లున్నాయోయ్ 
లోయలోని చీకటిలో 
లోకమంత నిలిచిందోయ్ 
ఒళ్ళు మరచి వినవలసిన 
మాటనొకటి చెబుతున్నా  
లోయలలో వెలుగు నింపి 
కొమ్మున చీకట్ల జేర్చి
రేయింబవళ్ళ రెంటిని 
నిలిచి నిగిడి చూడాలోయ్ 

సర్వమెరుగు దొరలమంచు 
వెర్రివారు వదరేరోయ్ 
వివరమెరుగు వేత్తలెపుడు
వింతగానె మసలేరోయ్ 
లోకులకందని వెలుగును 
లోన నింపబోతున్నా 
తిక్కస్వామి తరగతిలో
తిరుగులేని చదువు చదివి 
వింతలోక వీధులలో
వెర్రినాట్యమాడాలోయ్    

పిచ్చివారి పెళ్ళివోలె 
లోకమెల్ల నడచేనోయ్ 
మాయదారి మసకలతో  
మదిని మబ్బు నిండేనోయ్
నీ దారిని వదలకుండ 
నడవమంటు చెబుతున్నా 
లోకుల మాటలవింటే 
లోతుల పడిపోతావోయ్ 
వేకువ జామున వెలిగెడి 
వెలుగుల దిశ నడవాలోయ్  

వెర్రి గొర్రె మందలతో

లోకమంత నిండిందోయ్ 
గుడ్డివాళ్ళ గొడవలతో 
చిక్కుముళ్ళు పెరిగేనోయ్ 
కళ్ళను తెరిపింపచేయు 
నిజమునొకటి చెబుతున్నా 
మొక్కుబళ్ళు తీర్చకుంటె
మోక్షమెట్లు దొరకేనోయ్ 
కుళ్ళును కడిగేయకుంటె
దీక్షలెట్లు గెలిచేవోయ్ 

ఆధ్యాత్మిక సీమలందు 

ఆవులన్ని పులులేనోయ్ 
ఆత్రముగా నిన్నుబట్టి 
అప్పడమును చేస్తాయోయ్ 
నిజమగు దారిని చూపెడి
నిక్కు నొకటి చెబుతున్నా 
లోబయలుల చూపులన్ని 
లోతుల మళ్లించాలోయ్
గుహలో చేతులనుంచుచు 
గుట్టును సాధించాలోయ్

మెరమెచ్చుల నాటకాల 

మరబొమ్మల నమ్మకోయ్ 
అరువిచ్చిన అంగళ్ళను 
అప్పుబేర మెందుకోయ్
నిన్ను నీవు అంగడిలో 
అమ్ముకొనగ వలదన్నా 
బేరసార వ్యాపారపు 
భ్రమలు వీడి మెలగాలోయ్ 
సారమైన గురునిబోధ
తెరలు తీసి తెలియాలోయ్

సంపదలను కోరుకుంటు

సంద్రాలను దాటినపుడు 
సంప్రదాయ వాకిళ్ళను 
నీవు దాటగలగాలోయ్ 
సత్యమొకటి చూపించగ  
నీ ముంగిట నిలిచున్నా 
నీలోపలి సంపదలను 
నీవెప్పుడు వెదకాలోయ్ 
నీచేతిని నీవుబట్టి 
నీలోనికి నడవాలోయ్ 

అందరు నావారనుచు 

అరచి సొమ్మసిల్లేవోయ్
నీవారెవరూ లేరను 
నిజమునెపుడు కంటావోయ్ 
వెర్రిభ్రమల వీడమంచు 
వెయ్యిసార్లు చెబుతున్నా
నీ కాళ్ళను నీవు నరికి 
నింగిలోని కెగరాలోయ్
నీ తలనే నీవు తరిగి 
నిశ్చలముగ నిలవాలోయ్

నీవొచ్చిన పనిని మరచి 

నిక్కు నీలుగెందులకోయ్ 
నీ ఇంటిని నీవు విడచి 
టక్కుల మునకెందులకోయ్  
కళ్ళు తెరచి నీ ఇంటికి 
నిన్ను చేరమంటున్నా 
నిన్ను నీవు ప్రేమించుచు 
నీలోపలి కేగాలోయ్ 
నిన్ను దాటి నిన్ను చేరి 
నిత్యుడగుచు నిలవాలోయ్
read more " తిక్కస్వామి తరగతిలో.... "

19, మే 2013, ఆదివారం

ఎండా చలీ లేని చోటు

వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి ఆహ్వానించడానికి చరణ్ పొద్దున్నే వచ్చాడు.

మాటామంతీ అయ్యాక 'అబ్బ ఒకటే ఉక్కగా ఉన్నది అన్నగారు చెమటలు కారిపోతున్నాయి. నలభై అయిదు డిగ్రీలు దాటినట్లుంది.' అన్నాడు.

'రోహిణీ కార్తె దగ్గరకు వస్తుంటే గుంటూరులో చెమటలు కారక ఇంకేం కారతాయి' అన్నాను నవ్వి.

'హైదరాబాద్ లో అయితే చల్లగా ఉంటుందేమో కాస్త' అన్నాడు.

'లేదు నాయనా పేపర్ చూచావా? అక్కడ కూడా వాతావరణం బాగా చెడిపోయిందిట.మొన్న బెంగుళూర్ నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్ చెప్పాడు.అక్కడ కూడా మునుపటిలా చల్లదనం లేదట.మనమే ప్రకృతిని పాడుచేసుకుంటున్నాం.మళ్ళీ మనమే మొత్తుకుంటున్నాం.' అన్నాను.

'అవునన్నగారు.ఇంతకుముందు ఎప్పుడైనా ఒకరోజు హైదరాబాద్ వెళితే ఎప్పుడేపుడు అక్కణ్ణించి బయటపడి మనూరికి పారిపోదామా అనిపించేది.ఈ మధ్య గుంటూరులో కూడా టూ వీలర్ మీద వెళుతుంటే కళ్ళు మండుతున్నాయి.అంటే ఇక్కడకూడా పొల్యూషన్ బాగా పెరుగుతున్నదన్నమాట.' అన్నాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

'సరేగాని అన్నగారు.కరెంటు పోయి ఇంత దారుణంగా ఉంటె మీకేం బాధగా లేదా? కనీసం ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు కదా?' అడిగాడు.

'శరీరానికి మరీ అంత సుఖం అలవాటు చెయ్యకూడదు.అలా చేస్తే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది.'అన్నాను.

'అవును. నాకైతే ఏసీ బాగా అలవాటయ్యి ఇప్పుడు గదిలోనుంచి బయటకి రావాలంటే ప్రాణం పోతున్నట్లు ఉంది.' అన్నాడు.

'చరణ్.ఒకమాట చెప్పనా.పాతరోజుల్లో కరెంట్ లేనప్పుడు మానవ సంబంధాలు బాగుండేవి. అందరూ ఒకచోట కూచుని చక్కగా ఏవో మాటలు చెప్పుకుంటూ ఉండేవారు.ఇప్పుడో?  కరెంట్ ఉన్నంతవరకూ ఎవరూ ఎవరితోనూ పలకరు. కరెంట్ పోయినప్పుడు మాత్రమే అందరూ వాళ్ళవాళ్ళ రూముల్లోంచి లాప్టాప్ లు వదలి హాల్లోకొచ్చి కూచుని ఏమీతోచక మాటామాటా అనుకోని గొడవలయ్యి మళ్ళీ కరెంట్ రాగానే వాళ్ళవాళ్ళ కంప్యూటర్ల దగ్గరికి రయ్యిమని పారిపోతున్నారు.గమనించావా?' విసనకర్రతో విసురుతూ అడిగాను.

'నిజమే అన్నగారు.గాడ్జెట్స్ అనేవి మానవ సంబంధాలను బాగా చెడగొడు తున్నాయి.ప్రపంచంతో కమ్యూనికేషన్ బాగా పెరిగింది.కాని పక్కనే ఉన్న మనుషుల మధ్యన దూరాలు కూడా బాగా పెరిగాయి.ఇంటర్ నెట్ కు జనం బాగా అతుక్కుపోతున్నారు.మనిషి యంత్రాలమీద బాగా ఆధారపడుతూ చివరికి తానె ఒక యంత్రంలా మారిపోతున్నాడు.'అన్నాడు.

'నిజమే.కాని మనిషి ఇంటర్ నెట్ వల్ల సాలెగూటిలో చిక్కుకుంటున్నాడు.దీనికి ఎవరు పేరుపెట్టారో గాని వెబ్ అని బాగా చక్కగా పేరు పెట్టారు.ఈ సాలెగూటిలో చిక్కుకుంటే ఇక బయటపడటం అసాధ్యం.బోలెడంత సమయం వృధా కావడం తప్ప ఇక్కడ నిజంగా ఒరిగే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.అందుకే మనిషికి నిజంగా కావలసింది ఇంటర్ నెట్ కాదు.సూపర్ నెట్ కావాలి.అంటే ఈ రొచ్చుకి అతీతమైన దానితో అనుసంధానం కావాలి.అది లేనంతవరకూ నువ్వెంతమందితో చాటింగ్ చేసినా ఈ సాలెగూట్లో చిక్కుకుని చివరికి చావక తప్పదు.ఎందుకంటే ఇక్కడ కూడా నీ స్థాయి మనుషులే నీ చుట్టూ చేరతారు.కనుక జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు ఉంటుంది'అన్నాను.

పరిస్తితి దారితప్పుతోందని అనుకున్నాడో ఏమో చరణ్ మాట మార్చి 'ఈ మధ్యన ఏం సినిమాలు చూచారు అన్నగారు?' అడిగాడు.

నేను నవ్వి ఊరుకున్నాను.

'తడాఖా' చూచారా? అడిగాడు.

'తమ్ముడూ.తెలుగు సినిమాలగురించి నన్ను అడిగావంటే నా తడాఖా చూపాల్సి వస్తుంది.వాటి పేర్లు వింటేనే కంపరం ఎత్తుతోంది.సంస్కారహీనులు మాత్రమే నేటి తెలుగుసినిమాలు చూస్తారని నా అభిప్రాయం.దయచేసి ఇటువంటి చెత్త కబుర్లు నాదగ్గర తేవద్దు.' చెప్పాను.

'మరి మీకు శనివారం ఆదివారాలలో ఎలా తోస్తుంది?' అడిగాడు.

'తోచడం తోచకపోవడం అనే పదాలకు అర్దాలు నాకు తెలీదు' చెప్పాను.

'సరే ఉంటాను అన్నగారు'.అని సెలవు తీసుకుంటూ 'ఏదైనా ఒక మంచిమాట చెప్పండి.' అడిగాడు.

ఆ మాట వింటూనే ఒక జెన్ కథ గుర్తుకొచ్చింది.

'వేడీ చల్లదనమూ బాధించని చోటికి వెళ్లి చూడు' చెప్పాను.

'అలాంటి ప్లేస్ ఎక్కడుంది' అడిగాడు. 

'ఉంది.వెతుకు దొరుకుతుంది.' అన్నాను.

'మీకీమధ్యన మార్మికభాష బాగా ఎక్కువైంది అన్నగారు' అన్నాడు.

'గుంటూరులో ఎండలు చాలినంతగా లేవు తమ్ముడూ.' అన్నాను నవ్వుతూ.

'ఉంటాను అన్నగారు.ఇంకా ఎక్కువ మీతో మాట్లాడితే నా మతిపోయేటట్లున్నది' అంటూ సెలవు తీసుకున్నాడు.

'ఆ శుభ ఘడియ కోసం ఎదురుచూస్తుంటా' అంటూ నేనూ బై చెప్పాను.
read more " ఎండా చలీ లేని చోటు "

18, మే 2013, శనివారం

శూన్యసముద్రం దిశగా...

నేలకట్లు తెంచుకోని 
నీలిమబ్బు అలలు దాటి
శూన్యసముద్రం దిశగా 
మనసు ఎగసిపోయింది  

కుళ్ళు కంపు కొట్టుచున్న 
మానవ బంధాలు విడచి  
శుద్ధజలపు గంగోత్రిని 
జలకమాడ సాగింది

మమతలన్ని మాయలనెడి
మహాసత్యమును దెలిసి 
మాయాతీతపు స్వేచ్చను 
మనసు వెదకి చూచింది 

నానామోహ భ్రమలను 
నగుబాట్లను నిలువరించు 
సత్యాయుధ ఖడ్గమొకటి   
మనసుకంది వచ్చింది 

తనను పట్టి బంధించిన 
మురికినంత శుద్ధి చేయు 
తన్మయ సరోవరాన 
మనసు మునకలేసింది 

అంతులేని శూన్యసీమ 
నిర్నిమేష మహాంబుధిని 
నిర్భీతిని మనసు మునిగి 
నిష్కళగా నిలిచింది

వాదములన్నియు వదలుచు  
నాదాశ్వము నధివసించి
నాదబిందు కళల దాటి 
నభోముద్ర నంటింది 

అంతయు నాదనుట నుండి 
దంతయు నేననుట వరకు 
అన్ని భూమికల తాకుచు 
అణువు తరచి చూచింది 

అతిశైత్యపు హిమసీమల 
విజనాత్మక వీధులందు 
ఆశలన్నిటిని వదలిన 
అగ్ని ఒకటి వెదికింది 

వెలుగులయందలి చీకటి 
చీకటి యందలి వెలుగుల 
వివరము నెరిగిన వెలుగున 
వింతనవ్వు విరిసింది 

క్షుద్రజగతి కందనట్టి
తేజోరాశుల పంచన  
కట్టుబాట్ల నధిగమించి 
కన్నెమనసు మురిసింది 

నిత్యరోదనల మధ్యన 
నిశ్చింతగ నిలిచి వెలిగి 
చిరునవ్వులు చిందించెడి 
చైత్యమొకటి వెలసింది....
read more " శూన్యసముద్రం దిశగా... "

15, మే 2013, బుధవారం

సెక్స్ స్కాండల్స్ - రాహు కుజ శుక్రుల పాత్ర

భారత నేవీలో భార్యలను మార్చుకునే తతంగం (వైఫ్ స్వాపింగ్) నడుస్తోంది రక్షించమంటూ నేవీ అధికారుల భార్యలు న్యాయం కోసం పోరాడటం బయటకి వింతగా కనిపించినా,ఇలాంటివి హైసొసైటీ సర్కిళ్లలో కొన్నిచోట్ల సర్వ సాధారణమని చాలా ఏళ్ళనుంచీ వార్తలున్నాయి.కొన్నికొన్ని హై సర్కిళ్లలో జాకెట్ల పండుగలు జరుగుతాయని నేను ఇరవైఏళ్ళ క్రితమే చాలా నికార్సైన సమాచారాన్ని,అందులో పాల్గొన్న వ్యక్తి నుంచే విన్నాను.

తన సహచర అధికారులతోనూ ఉన్నత అధికారులతోనూ గడపమంటూ తన భర్తే తనను హింసిస్తున్నాడని ఒక యువతి మొరపెట్టుకోవడంతో ఈ ఉదంతాలన్నీ ఒకటొకటీ బయటకొస్తున్నాయి.వైశాఖపాడ్యమి గురించి నేను వ్రాసిన పోస్ట్ లో మహిళల పైన ఇలాంటి దురాగతాలు ఇంకా జరుగుతాయని వ్రాశాను.అవి ప్రతిరోజూ నిజం అవుతూ ఉండటం చూడవచ్చు.

భారతసమాజం బయటకి కనిపించేటంత మంచిదేమీ కాదు.ఇదొక కుళ్ళి పోయిన మేడిపండు.ఇక్కడ ఆడవారినీ మంచివాళ్ళని చెప్పలేం.మగవారినీ మంచివాళ్ళని చెప్పలేం.అలాగని చెడ్డవారనీ చెప్పలేం.కాకపోతే నీతులు చెప్పేవారందరూ నీతులు ఆచరించరన్నది నగ్నసత్యం.నీతులు చెప్పనివారిలో చాలామంది వాటిని ఆచరించేవారు ఉంటారన్నదీ నిజమే. బయటకు చాలా పద్దతిగా కనిపించే వారిలోకూడా చాలా లొసుగులు ముఖ్యంగా సెక్స్ విషయంలో ఉంటాయన్నది కూడా సత్యమే.అంత మాత్రం చేత వారందరినీ పూర్తిగా చెడ్డవారుగా ముద్రవెయ్యడం కూడా శుద్ధతప్పు అన్నదీ మళ్ళీ నిజమే.మన సమాజంలో ఇదమిద్ధంగా దేన్నీ ఖచ్చితంగా నిర్ధారించి 'ఇదీ' అంటూ చెప్పలేం.అందుకేనేమో వైవిధ్యాన్ని చూడాలంటే ఇండియా రండి అంటూ విదేశీ విద్యార్ధులను ఒక మంత్రిగారు ఆహ్వానిస్తున్నారు.

మన సమాజం ఒక 'సెక్సువల్లీ రిప్రేస్ద్ సొసైటీ' అని సైకాలజిష్టులూ సామాజిక శాస్త్రవేత్తలూ ఎప్పుడో తేల్చి పడేశారు. మన దేశంలో టూరిజం కోసం వచ్చిన విదేశీ టూరిస్టులకు ఆయా దేశాలు ఎలాంటి జాగ్రత్తలు చెబుతాయో మనం తెలుసుకుంటే సిగ్గుతో చచ్చిపోతాం.ప్రపంచదేశాల దృష్టిలో మన ఇమేజి ఇంత బాగుందా అని.

నేనొక సారి ఒక రైల్లో ప్రయాణిస్తున్నాను. నా ఎదురుగా ఒక విదేశీ జంట కూచుని ఉన్నారు.అందులో అమ్మాయి ఒక నిక్కరు వేసుకుని ఉన్నది.కాని కాళ్ళు కనిపించకుండా దుప్పటి ఒకటి కప్పుకుని కూచుని ఉన్నది. ఏసీ  కోచ్ అయినా పెద్దచలిగా ఏమీ లేదు.చాలాసేపటి ప్రయాణంలో మేం స్నేహితులమయ్యాం.ఆ చనువుతో ఆమెను ఒక ప్రశ్న అడిగాను. 

'మీరేం అనుకోకపోతే ఒక మాట అడుగుతాను? మీరెందుకు అలా దుప్పటి కప్పుకున్నారు? మీరు మామూలుగా అలా చెయ్యరు కదా?'

దానికి ఆ అమ్మాయి నవ్వి ఇలా చెప్పింది.

'నిజమే.ఇలా చెయ్యడం మా అలవాటు కాదు.కాని ఏం చెయ్యను?మీ ఇండియన్స్ అసహ్యంగా 'స్టేరింగ్' చేస్తారు. ప్రతివాడూ జన్మలో ఎప్పుడూ  కాళ్ళను చూడనట్లు గుడ్లప్పగించి అలా నావైపు చూస్తూనే ఉన్నాడు.మేం కేరళ నుంచి డిల్లీ వెళుతున్నాం.ఎన్ని గంటలు ప్రయాణం చెయ్యాలో చూడండి? ఈ హింస భరించలేక ఇలా దుప్పటి కప్పుకుని కూచున్నాను'

ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఆ కోచ్ లో చాలామంది పనున్నా లేకున్నా అటూఇటూ మా పైనుంచి ఊరకే తిరగడమూ,మాటిమాటికీ అటూఇటూ పోతూ ఆ అమ్మాయిని గుడ్లప్పగించి చూడటమూ నేనూ గమనించాను. తను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లయితే ఆమె గతి ఏమయ్యేదో అని నాకనిపించింది.

'ఆడది అర్ధరాత్రి పూట ఒంటరిగా ధైర్యంగా నడవగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు' అని గాంధీ భావించారు. నడవడం వరకూ బాగానే ఉంది.కాని ఆ తర్వాత ఏమి జరుగుతుందన్నదే ప్రశ్న. ఆ అమ్మాయి అదృష్టం బాగుంటే ఆమె శవం బంధువులకు దొరుకుతుంది.లేకుంటే అదీ దొరకదు. ఈ మధ్య ఒక కొ-ఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ కొందరు అమ్మాయిల తల్లిదండ్రులతో ఇలా అన్నాడు. 'మీ అమ్మాయిలను డిల్లీలో జరుగుతున్న ఫలానా సెమినార్ కు పంపారంటే వాళ్ళు కన్యలుగా తిరిగి వస్తారని నేను గ్యారంటీ ఇవ్వలేను.తర్వాత మీ ఇష్టం.' ఇది విన్న తర్వాత కూడా కొందరు అమ్మాయిలు పట్టుబట్టి ఆ టూర్ కు వెళ్లి వచ్చారు.తల్లి దండ్రులూ ఒప్పుకుని పంపించారు. నేను నిజాలే వ్రాస్తున్నాను.ఏమీ ఎగ్జాగరేట్ చెయ్యడం లేదు.

అమ్మాయిలను సప్లై చేసి కాంట్రాక్టులు సాధించుకున్న కాంట్రాక్టర్లు కొందరు నాకు తెలుసు. తన భార్యను ఇతరులతో గడపమని ప్రోత్సహించే భర్తలు కూడా కొందరు నాకు తెలుసు.తమ భార్యలను తీసికెళ్ళి ఇతరులకు అప్పగించే భర్తలు కూడా నాకు తెలుసు.ఆ భార్యలు కూడా ఆ విషయాన్ని అదేదో పెద్ద తప్పుగా ఏమీ భావించరు. వాళ్ళ ఆలోచనా విధానాలు వేరు.మళ్ళీ వాళ్ళను 'పతిత' అనో 'తిరుగుబోతు' అనో అంటే అదొక పెద్ద పొరపాటు అవుతుంది. మామూలు మనుషులకంటే చాలాసార్లు వాళ్ళలో ఎంతో మంచితనం ఉంటుంది.అలాంటి వారిలో ఇతరమైన ఉన్నత వ్యక్తిత్వవిలువలు ఉండటం నేను చాలాసార్లు గమనించాను.

భర్తకు ఇతర ఆడవాళ్ళతో సంబంధాలున్నాయని తెలిసినా నోరుమూసుకుని ఉండే భార్యలు చాలామంది పాతకాలంలో ఉండేవారు. ఇప్పుడు తమ భార్యలకు ఇతర సంబంధాలున్నాయని తెల్సినా కిమ్మనకుండా ఊరుకుంటున్న భర్తలుకూడా చాలామంది ఉండటాన్ని చూస్తున్నాం. 'పెళ్ళికాకముందు తను ఎలా ఉందో నాకనవసరం.ఇప్పుడు సరిగ్గా ఉంటె చాలు' అని నేటి తరం యువకులు చాలామంది భావిస్తున్నారు.కొన్ని చోట్ల ఇంకొక అడుగు ముందుకేసి,ఇద్దరికీ ఇతర సంబంధాలున్నా కలిసిమెలిసి సంసారం చేస్తున్న మోడరన్ జంటలనూ నేడు మనం చూస్తున్నాం. ఇవన్నీ,దిగజారుతున్న విలువలనుకోవాలా,లేక మారుతున్న ఆలోచనా ధోరణులనుకోవాలా,లేక విశాలహృదయాలనుకోవాలా,లేక బీటలు వారుతున్న సమాజపు గోడలనుకోవాలా మనకు తెలియదు. 

ఇరవై అయిదేళ్ళ ఏళ్ళ క్రితం నాకొక స్నేహితుడు ఉండేవాడు.అతనొకరోజున పూటుగా తాగి వాంతి చేసుకుని అందులోనే పడి దొర్లి స్పృహ తెలీని స్తితిలో ఉన్నాడు. అతని భార్య ముక్కు మూసుకుని బయటకు వచ్చి బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయింది.ఆ ఇంటి పక్కనే ఒక యువతి ఉండేది. ఆమె అప్పట్లోనే బాంబే వెళ్లి నెలా రెన్నెళ్ళు ఉండి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది.ఆమె అక్కడ ఏమి చేసేదో అందరూ చెప్పుకుని చెవులు కొరుక్కునేవారు.ఆమెకు సమాజంలో మంచి పేరేమీ లేదు.మర్యాదస్తులు ఆమెను తమ ఇళ్ళకు పిలిచేవారు కారు.ఆమె మా ఫ్రెండ్ పక్క పోర్షన్లో ఉండేది. ఆరోజున, కట్టుకున్న భార్య ముక్కుమూసుకుని బయటకు వెళ్ళిపోతే, ఈమె ముందుకొచ్చి బక్కేట్లతో నీళ్ళు తెచ్చి ఇతన్ని కడగటమే కాక, తన చేతులతో ఆ నేలమీద ఉన్న వాంతినంతా కడిగి శుభ్రం చేసింది. మర్నాడు పొద్దున్న ఇతని భార్య ఏమీ జరగనట్లు తిరిగి వచ్చింది. ఈమెకూ ఇతనికీ ఎదో ఉందనీ అందుకే ఆమె ఆ చండాలం అంతా కడిగి శుభ్రం చేసిందనీ అందరూ గుసగుసలు అనుకున్నారు.వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదన్న నిజం నాకు తెలుసు. స్వచ్చమైన మానవతా దృక్పథంతో మాత్రమె ఆమె అలా చేసింది.

దీనికి భిన్నంగా ఇంకొక ఉదాహరణ చెప్తాను.ఇదీ నిజంగా జరిగిన సంఘటనే. ఒక స్త్రీ ప్రాణం పోయిన తన పిల్లవాణ్ణి ఒళ్ళో పెట్టుకుని నిస్సహాయ స్తితిలో ఉన్నది.భర్త ఊరిలో లేడు.వాళ్ళు ఒక అద్దె ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటి యజమానీ అతని భార్యా గొప్ప భక్తులుగా సంఘంలో చలామణీ అవుతూ ఉంటారు.ఎప్పుడూ బొట్లు పెట్టుకుని శుభ్రమైన వస్త్రాలు వేసుకుని శుచిగా ఉండి నీతులు చెబుతూ ఉంటారు.వాళ్ళు ఒక గుడి కూడా కట్టించారు. శవం ఇంట్లో ఉంటె ఇల్లు మైల పడుతుందంటూ ఆరోజున అలాంటి నిస్సహాయ స్తితిలో ఉన్న ఆమెను  వెంటనే ఖాళీ చెయ్యమని గోలగోల చేసారు. కనీసం భర్త వచ్చేవరకూ ఆగమన్నా వారు వినిపించుకోలేదు.

ఈ దంపతులకూ, పైన చెప్పిన బాంబే వేశ్యకూ మార్కులు వెయ్యమంటే నేను వేశ్యకే నూటికి నూరు మార్కులు వేస్తాను. నా దృష్టిలో ఆ వేశ్యే ఉత్తమురాలు. ఆమె వ్యక్తిగత జీవితం మనకు అనవసరం.ఏ పరిస్తితుల్లో ఆమె ఆపని చేస్తున్నదో అది వేరే కథ.తన తల్లినీ చెల్లెళ్ళనూ పోషించడానికి ఆమె అలా చేసేది. అది తప్పా రైటా అనేది వేరే విషయం. ఆమెకు చెయ్యడానికి ఇంకే పనీ దొరకలేదా అనేది చర్చకు మాత్రమె పనికొచ్చే విషయం.మానవతాదృక్పథం వరకూ ఆలోచిస్తే బైటికి పరమభక్తులుగా నటించిన ఆ ఇంటి యజమానుల కంటే ఈమె మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఉత్తమురాలు అని నేను భావిస్తాను.ఈ ఒక్క కోణాన్ని బట్టి మనిషిని పూర్తిగా అంచనా వెయ్యడం తప్పు అనేదే నా భావన.

సంఘం పతితులుగా భావించిన వారిలో అనేక ఉత్తమ వ్యకిత్వ కోణాలు నేను చూచాను.సంఘం చాలా మంచివాళ్ళుగా సర్టిఫికేట్ ఇచ్చిన వారిలో పరమ ఛండాలపు కోణాలూ చూచాను.ఇవన్నీ చూచిన మీదట నేను ఒక అభిప్రాయానికి వచ్చాను.అసలు సమాజానికి ఒక మనిషిని అంచనా వెయ్యడం ఎప్పుడూ తెలీదు.దాని రీడింగ్ ఎప్పుడూ తప్పే. ద్వంద్వనీతిని పక్కన బెట్టి ఒక మనిషిని మనిషిగా చూడటం సమాజానికి ఎప్పటికీ చేతకాదు.కనుక సమాజానికి భయపడటం అనవసరం.పిరికివాళ్ళు మాత్రమే  సమాజానికి విలువిస్తారు.ఆత్మవిశ్వాసం లేనివారు మాత్రమె ఇతరులు ఏమనుకుంటారో అని ప్రతిదానికీ భయపడతారు.వెరసి,మంచి వ్యక్తులే అక్కడక్కడా ఉంటారు కాని మంచి సమాజం అంటూ ఎక్కడా ఉండదు.

ఇదంతా పక్కన ఉంచి,సెక్స్ స్కాండల్స్ కూ గ్రహాలకూ సంబంధాన్ని కొంచం గమనిద్దాం. గత మూడు రోజులుగా నవాంశలో శుక్రుడూ రాహువూ కుజుని రాశి అయిన మేషంలో కలిసి ఉన్నారు.అంటే నక్షత్ర పాదస్థాయిలో వారికి సమ్మేళనం కలిగింది. ఈ సమయంలోనే అనేక సెక్స్ సంబంధిత సంఘటనలు జరగడం జ్యోతిష సూత్రాలను మళ్ళీ ఒక్కసారి రుజువు చేస్తున్నది. అంతేకాదు సెక్స్ సంబంధ స్కాండల్స్ బయట పడిన ప్రతిసారీ ఖగోళంలో రాహు-కుజ-శుక్రుల పాత్ర స్పష్టంగా ఉండటం ఒక విచిత్రం.

నేవీలో బయటపడిన వైఫ్ స్వాపింగ్ కూడా ఇలాటిదే.ఇది ఈరోజున బయట పడవచ్చు.బయటపడని ఎన్నో ఇలాంటివి మన సమాజంలో నిత్యమూ జరుగుతూనే ఉన్నాయి.ప్రపంచం ముందు మనమేదో పెద్ద పవిత్రులలాగా పోజు కొట్టడం పరమ దండగ.ప్రపంచం దృష్టిలో భారత్ ఒక 'సెక్సువల్లీ రిప్రేస్డ్ సొసైటీ' అనేది నగ్నసత్యం. అదే సమయంలో మన సమాజపు విలువలు అతి వేగంగా మారిపోతున్నాయన్నదీ సత్యమే.పాత కాలంలో ఊహించను కూడా ఊహించలేని మానవసంబంధాలు మన మధ్యన ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయన్నది కూడా సత్యమే.
read more " సెక్స్ స్కాండల్స్ - రాహు కుజ శుక్రుల పాత్ర "

13, మే 2013, సోమవారం

దిష్టిమేకలు

ఈ మధ్య ఒక మంత్రివర్యులు తమ మీదకు ముంచుకొచ్చిన ఒక ఆపదను తప్పుకోడానికి దిష్టిమేకను బలిచ్చారని విన్నాం.ఈ సంఘటన నిజమో కాదో మనకు తెలియదు.కాని చాలామంది ఉన్నతాధికారులకు, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఇలాంటి మూఢ నమ్మకాలుంటాయన్నది మాత్రం నిజం.కాకపోతే వారిలో చాలామంది కుహనా స్వాముల,కుహనా జ్యోతిష్కుల మాటలనే నమ్ముతారు.దానికి కారణం వారి స్వార్ధం.అసలైన రేమేడీలు చెప్పేవారు వీరికి నచ్చరు.

పరిహారాల ద్వారా చెడుకర్మను పోగొట్టుకోవచ్చు అన్నది నిజమే.దీనికి శాస్త్ర ప్రమాణం ఉన్నది.కర్మ ఉన్నప్పుడు దానికి ప్రతికర్మ కూడా ఉంటుంది.న్యూటన్ సిద్ధాంతం అదే.కాని ఈ విషయం చాలామందికి సరిగ్గా అర్ధం కాదు.అర్ధం చేసుకుంటే వారివారి వ్యాపారాలు సాగవు కనుక అర్ధం కానట్లు నటిస్తారు.లేదా వారికి తగిన మాయమాటలు చెప్పేవారినే నమ్ముతారు.ఎందుకంటే పద్దతి మార్చుకోమని చెప్పేవారు మనకు నచ్చరు.మన తీరులో మనం కొనసాగుతూ ఉండాలి.మన పనులు చేసిపెట్టే స్వామీజీనో,జ్యోతిష్కుడో మాత్రం మనకు దొరకాలి.ఇదీ మనుషుల వరస. అందుకే లోకం ఇంత దరిద్రంగా ఉన్నది.

పరిహారక్రియలనేవి చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని కడుక్కోవాలని ప్రయత్నించే వారికోసం గాని, అదే తప్పును మళ్ళీమళ్ళీ చేస్తూ ఆ పాపఫలం నుంచి మాత్రం తప్పుకోవాలని చూచేవారికోసం కాదు. అలాంటి వారికి ఆ పాపం వదలకపోగా,పరిహార క్రియలు చెప్పిన  జ్యోతిష్కుడికి కూడా అంటుకుంటుంది.కనుక పరిహారాలనేవి తెలీని మనుషులకు చెప్పరాదు.

నీ పధ్ధతి బాగాలేదు.దానిని ముందు మార్చుకొని సక్రమమైన దారిలో నడవమని ఏ జ్యోతిష్కుడైనా చెబితే అతన్ని చేతగానివాడిగా చూచే లోకం ఇది.అసలు అలా చెప్పే జ్యోతిష్కులు కూడా ప్రస్తుతం మైనారిటీ వర్గంగా ఉన్నారు.ఎవడు ఏ వెధవపని చేసినా ఆ పని సక్సెస్ అయ్యే మార్గం వరకూ చెప్పేవాడే ప్రస్తుతం కరెక్ట్. అంతేగాని ఆ పనిని విమర్శించేవాడూ దానిని సరిదిద్దేవాడూ ప్రస్తుతం ఎవరికీ అవసరం లేదు.ఇదంతా కర్మప్రభావం. అనుభవకాలం ముందున్నపుడు మంచి మాటలు ఎక్కవని పెద్దలు ఊరకే అనలేదు కదా మరి.

మనం చేసిన కర్మ తీరడానికి ఏదో ఒక మూగజీవిని బలివ్వడం అనేది ఒక తప్పుడు విధానం.అవి నిస్సహాయ స్తితిలో ఉన్నాయి గనుక మనం వాటిని పట్టుకొని చంపి బలిస్తున్నాం.అదే అవి మనల్ని పట్టుకుంటే అప్పుడు వాటి అవసరాలకు మనల్ని కూడా అలాగే బలిస్తాయేమో? 

నరమాంస భక్షకులను ఆటవికులుగా రాక్షసులుగా మనం భావిస్తాం.జంతుమాంస భక్షకులను జంతువులు ఎలా భావిస్తాయో ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మాంసం విషయంలో జంతువుకూ మనిషికీ ఏమిటి తేడా? 

అసలు ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరిని బలిచేయడం అనేది స్వార్ధానికి పరాకాష్టగా చెప్పాలి.అలాంటి స్వార్ధపరులకు సలహాలిచ్చే జ్యోతిష్కులు తాంత్రికులకు కూడా భయంకరమైన చెడుకర్మ చుట్టుకుంటుంది.దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు.వారి జీవితంలో ఏదో ఒక రోజున మాత్రం అది ఖచ్చితంగా కనిపిస్తుంది.అందుకనే ఇటువంటి సలహాలిచ్చి, అటువంటి రేమేడీలు చేయించే జ్యోతిష్కుల తాంత్రికుల కుటుంబాలలో (వారికి కుటుంబం అంటూ ఉంటే) ఏదో ఒక దారుణమైన శాపం పట్టి తరతరాలుగా పీడిస్తూ ఉంటుంది.

యజ్ఞయాగాలలో జంతుబలి ఉంటుందని వాటిని అనేకమంది విమర్శిస్తారు.కాని మాంసం తినడం కోసం అదే జంతువులను దారుణంగా చంపడాన్ని మాత్రం వారు ఏమీ అనరు.ఇది ద్వంద్వ నీతి కాకపోతే మరేమిటి?

జిహ్వ చాపల్యానికి ఒక జంతువును చంపి దాని మాంసం తినేవ్యక్తికీ పిశాచానికీ తేడా ఏముంది? దెయ్యాలూ పిశాచాలూ కూడా ఇలాగే మనుషులను పీక్కు తింటాయి.మనుషులు జంతువులను పీక్కు తింటున్నారు.పిశాచాలకూ మనుషులకూ ఇక తేడా ఏముంది?

ఒకరేమో తమ పనులు అవడం కోసమో,తాము చేసిన తప్పు నుండి తప్పుకోవడం కోసమో జంతువులను బలిస్తున్నారు.ఇంకొకరేమో దాని మాంసం తినడం కోసం జంతువులను చంపుతున్నారు.ఎలా అయినా బలి అవుతున్నది మాత్రం మూగజీవాలే.వాటికీ సంఘాలూ,యూనియన్లూ ఉంటే,వాటికి భావవ్యక్తీకరణ ఉంటే మనుషుల్ని ఎంత దరిద్రమైన భాషలో తిట్టేవో?

మొన్నొక రోజున మార్కాపురం అనే ఊరిలో పోతూ ఉండగా యధాలాపంగా ఒక హోటల్ బోర్డు వైపు చూచాను.మామూలుగా కనిపించే చికెన్ ఫ్రై,మటన్ ఫ్రై మొదలైన వాటితో బాటు 'తలకాయ ఫ్రై', 'నెత్తురు ఫ్రై' అంటూ కొన్ని రాక్షసపదాలు ఆబోర్డ్ మీద కనిపించాయి. అదేంటి? అని పక్కనున్న వారిని అడిగాను.దానికి వారిచ్చిన జవాబు నన్ను నిశ్చేష్టున్ని చేసింది. జంతువును చంపినపుడు కారిన రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి దానిని బాండీలో పోసి ఉడకబెడతారట.అప్పుడా రక్తం గట్టిపడి హల్వాలాగా అవుతుందట. దానిని స్పూన్ తో తింటారట.ఇదంతా వింటుంటే అప్పుడే టిఫిన్ చేసి వస్తున్నామేమో కడుపులో తిప్పి భళ్ళున వాంతి అయినంత పనైంది. అసలు 'మనిషి' అన్న పదంతో పిలిపించుకోడానికి  మనుషులకు అర్హత ఉందా అని నాకు అనుమానం కలిగింది.

జంతుమాసం తినాలన్న కోరికను చంపుకోలేక దానికి 'బలి' అనీ 'పరిహారం' అనీ ఏవేవో పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటాడు స్వార్ధపరుడైన మానవుడు. తను తిన్నది చాలక దేవుడికి కూడా బలి అంటే ఇష్టం అని అబద్దాలు చెప్పి దేవుళ్ళకూ మూగజీవాలను బలిస్తుంటారు మూర్ఖులైన మనుషులు.మనిషి స్వార్ధానికి అంతు లేదేమో అని అనిపిస్తుంది.

ఒక జీవిని మనం చంపినపుడు దాని చేతిలో మనం ఎప్పుడో ఒకప్పుడు బలి కాక తప్పదు.ఇది సృష్టి ధర్మం. దీనిని గ్రహించినవారు జిహ్వ చాపల్యం కోసం ఇంకొక జీవిని చంపరు.దాని మాంసం తినరు.కొంతమంది అతితెలివి ఉన్నవారు ఇంకోలా వాదించవచ్చు.'ఏమో? ఇంతకు ముందు జన్మలో ఈ జంతువులన్నీ నన్ను చంపి ఉంటాయి.అందుకే ఇప్పుడు నా చేతిలో చస్తున్నాయి'. అది నిజం అయితే బాగానే ఉంటుంది.కాని ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు నువ్వు చేస్తున్నదే కొత్త కర్మ అయితే మాత్రం వచ్చే ఎన్నో జన్మలలో నీవు ఆయా జంతువుల చేతిలో చావక తప్పదు.ఒకవేళ అదే నిజం అయితే అదెంత భయంకరంగా ఉంటుంది? కోళ్ళను తినేవారు వచ్చే ఎన్నో జన్మల్లో మట్టిలో పాకే పురుగులుగా పుట్టి ఆ కోళ్ళ చేత తినబడతారన్న విషయం వారికి తెలుసో లేదో మరి? ఎందుకంటే ప్రకృతి దృష్టిలో ప్రాణం ఒకటే.అది మనిషి ప్రాణమైనా జంతువు ప్రాణం అయినా ప్రకృతి దృష్టిలో భేదం లేదు.క్రియకు ప్రతిక్రియ చూపడమే ప్రకృతికి తెలిసిన ధర్మం.

ఇంకొంతమంది ఇలా అనుకుంటారు.'కర్మసిద్ధాంతం అంతా మిధ్య.ముందేం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు? ప్రస్తుతం ఏదో ఒకటి చేసి హాయిగా ఉందాం. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు'.ప్రస్తుతానికి అలాగే అనిపిస్తుంది.కాని బాధలు పడేటప్పుడు అలా ఉండదు.కాలం కలిసిరాక బాధలు పడేటప్పుడు ఎవరూ ఇదే లాజిక్ ఉపయోగించరు.అప్పుడు కూడా-'ప్రస్తుతానికి హాయిగా బాధలు పడదాం.ముందేం జరుగుతుందో ఎవరు చూడొచ్చారు? ప్రస్తుతానికి ఎంచక్కా బాధలు అనుభవిద్దాం'.-అని మాత్రం ఎవరూ అనుకోరు.అదే విచిత్రం. 

ఏదేమైనా మనుషులు ఒకరు చెబితే వినరు అన్నది నిజం.వారంతట వారికి అనుభవం అయితే తప్ప ఎవరికీ ఏ విషయమూ అర్ధంకాదు.కాని అప్పటికే చాలాసార్లు సమయం మించిపోయి ఉంటుంది.అదే సృష్టి విచిత్రాలలో ఒకటి.ఎవరి ఖర్మను వారు అనుభవించక తప్పదు అన్నది సత్యం.అందుకే ఒకరి సంతోషంలోగాని ఒకరి బాధలోగాని మనం కల్పించుకోవడం అనవసరం అనేది విజ్ఞుల అభిప్రాయం.

'తెలివైనవాడు ఎదుటివాడి బాధలు చూచి తాను ముందే జాగ్రత్త పడతాడు. మధ్యరకం మనిషి ఒకసారి బొక్కబోర్లా పడ్డాక రెండోసారి జాగ్రత్త పడతాడు.మూర్ఖుడు మాత్రం ఎన్నిసార్లు గుణపాఠం జరిగినా ఎన్నటికీ బుద్ధి తెచ్చుకోడు' -అంటాడు కన్ఫ్యూషియస్.
read more " దిష్టిమేకలు "

11, మే 2013, శనివారం

పాకిస్తాన్ జాతకం

మన చరిత్ర కారులు ఎప్పుడో చరిత్రకందని రోజులలో జరిగిన సంగతులు వారే చూచినట్లు పుస్తకాలు వ్రాసేస్తారు.వాటిని పాఠ్య పుస్తకాలుగా ప్రభుత్వం ఆమోదిస్తుంది.వక్రీకరించిన చరిత్రను మనం చదువుకుని అపార్ధాలు అపోహలు ఏర్పరచుకుంటాం.వాటిమీద వాదనలు ప్రతివాదనలు విభేదాలు కొనసాగుతూ ఉంటాయి.కాని విచిత్రమేమిటంటే చరిత్రలో పెద్ద విషయాలు కూడా కొన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం.పాకిస్తాన్ దేశం ఎన్ని గంటలకు ఆవిర్భవించింది?అన్న ప్రశ్నకు సూటి జవాబు ఇప్పటిదాకా లేదుమరి. ఇంతా చేస్తే ఇది చరిత్రలో ఈ మధ్యన జరిగిన సంఘటనే.

15-8-1947 రాత్రి పన్నెండు గంటలకు అఖండ భారత్ చీలిపోయి భారత దేశం,పాకిస్తాన్ లుగా అవతరించిందని అందరూ అనుకుంటారు.కాని ఇది వాస్తవమేనా? ఈ అనుమానం ఇప్పుడెందుకోచ్చిందీ అంటే, పాకిస్తాన్ లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఆ దేశ జాతకం చూడబోతే విచిత్రమైన నిజాలు వెల్లడయ్యాయి.

మన దేశ ఆవిర్భావ సమయం విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు.ఎన్ని రకాలైన అవలక్షణాలు ఉండవచ్చో అన్నీఉన్న మంచి కాలసర్పయోగ ముహూర్తం చూచిమరీ మనకు స్వాతంత్రం ఇచ్చిపోయారు బ్రిటిష్ వారు.లెక్క ప్రకారం అయితే అదే పాకిస్తాన్ ఆవిర్భావ సమయం కూడా అవ్వాలి.కాని వాస్తవం అలా లేదు.

కొంతమంది చెప్పే ప్రకారం,పాకిస్తాన్ ఆగస్ట్ 14 నే తమ స్వాతంత్ర దినంగా జరుపుకుంటోంది.ఎందుకంటే లార్డ్ మౌంట్ బాటెన్ రెండు ఫంక్షన్ల లోనూ తాను వ్యక్తిగతంగా పాల్గొనాలని ఆశించాడు గనుక ఒక రోజు ముందే కరాచీ లో ఆదేశ ఆవిర్భావ ఉత్సవం జరిపారనీ అందుకని 14-8-1947 ఉదయం 9.30 అనేది పాకిస్తాన్ పుట్టిన సమయం అనీ కొందరి వాదన.

ఫంక్షన్ ఎప్పుడు జరిపారన్నది ప్రశ్న కాదు.అధికారికంగా ప్రకటన ఎప్పుడు చేశారు అన్నదే పాయింట్ కనుక ఆగస్ట్ పద్నాలుగు/పదిహేను అర్ధరాత్రే రెండు దేశాలూ పుట్టాయి అని కొందరి వాదన.

ఇంకొందరు చెప్పే ప్రకారం, మన కంటే నాలుగు నిముషాలు ముందుగా పాకిస్తాన్ ఆవిర్భావ ప్రకటన అయింది కనుక 14-8-1947 23.56 గంటలకు ఆ దేశం పుట్టినట్లు తీసుకోవాలి.సరిగ్గా అర్ధరాత్రికి మన దేశం పుట్టినట్లు తీసుకోవాలి.

మొదట్లో ఆగస్ట్ పదిహేనునే స్వతంత్ర దినంగా జరుపుకున్న పాకిస్తాన్  కూడా తర్వాత్తర్వాత ఆగస్ట్ పద్నాలుగుగా దానిని మార్చుకుంది.ఎందుకంటే మనకంటే ఒక రోజు ముందుండాలని వారి తాపత్రయం కావచ్చు.

అసలు ఇంత చర్చ అవసరమా? ఎప్పుడు స్వతంత్రం వస్తే ఏమిటి?ఒకరోజు అటూ ఇటూ అయితే ఏమిటి? కొన్ని నిముషాలో గంటలో అటూ ఇటూ అయితే ఎవరి కొంప మునిగింది?అని ప్రశ్నిస్తే జవాబు లేదుగాని,దానివల్ల జ్యోతిష్య పరంగా చాలా తేడాలు వస్తాయి అని మాత్రం చెప్పవచ్చు.జాతకం చూడాలంటే ఖచ్చితమైన జననసమయం అవసరం.దేశజాతకమైనా అంతే. పాకిస్తాన్ విషయంలో పై సమయాలలో ఒక్కొక్క సమయమూ ఒక్కొక్క రకమైన జాతకచక్రాన్ని ఇస్తుంది.వాటిని పాకిస్తాన్ దేశంలో జరిగిపోయిన జరుగుతున్న పరిస్తితులతో పోల్చుకుని ఆయా చక్రాలలో ఏది సరియైనదో నిర్ణయించవచ్చు.తద్వారా అదే పాకిస్తాన్ జనన సమయంగా నిర్ధారించాలి. ఇదొక పెద్ద ప్రాసెస్.

ఒకవేళ ఆగస్ట్ పదిహేను రాత్రే పాకిస్తాన్ జనన సమయం కూడా అనుకుంటే, అప్పుడు కవలల జాతక చక్రాలకు ఉపయోగించే సూత్రాలను ఈ రెండు దేశాల చార్ట్ లకు ఉపయోగించాలి.ఎందుకంటే అధికారిక ప్రకటనల మధ్య నాలుగు నిముషాలే తేడా ఉన్నది.కనుక కవలపిల్లల జాతకాలను చూచినట్లు వీటిని చూడవలసి ఉంటుంది.

ఈ మధ్యనే అందరి కళ్ళముందూ జరిగిన ఇంత చిన్నవిషయం లోనే ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి చరిత్రలో ఉంటె,ఇక వేదకాలం గురించీ, ఆర్య ద్రావిడ యుద్దాల గురించీ,హరప్పా మొహంజొదారోలలో ఉన్నది ఆర్య నాగరికతా ద్రావిడనాగరికతా,రాముడూ కృష్ణుడూ చారిత్రిక పురుషులేనా, జీసస్ కు మేరీమేగ్డలేన్ కూ పెళ్లయిందా వారికి పిల్లలున్నారా వంటి విషయాల మీద చర్చలలో ప్రామాణికత ఎంత ఉంటుంది? అన్నది ఒక అంతుబట్టని ప్రశ్న.

ఆ విషయాలు అలా ఉంచితే, ప్రస్తుత పాకిస్తాన్ ఎలక్షన్ల దృష్ట్యా ఒక్క విషయం చెప్పవచ్చు.ఈ దేశానికి స్వతంత్రం వచ్చినపుడు చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో  ఉన్నాడు. ఇప్పుడు దానికి దశమంలో రవి, కుజ, బుధ,కేతు గ్రహాల కూటమి ఉన్నది.వారిపైన తత్కాల చంద్ర లగ్నాత్ చతుర్ధం నుంచి శని రాహువుల దృష్టి ఉన్నది.కనుక ఎలక్షన్ల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అధికారం లోకి వచ్చినవారు సైన్యం (కుజుడు+ఉచ్ఛరవి) యొక్క బలమైన అధిపతుల కనుసన్నల లోనే పని చెయ్యవలసి ఉంటుంది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.ఇంకో విషయం ఏమిటంటే,చతుర్ధ రాహు శనుల వల్ల,ఎవరు అధికారం లోనికి వచ్చినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు,గొడవలూ హింసా తప్ప అన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

మనకూ పాకిస్తాన్ కూ ఒకేసారి స్వాతంత్రం వచ్చినందుకో ఏమోగాని,చాలా వరకూ స్థూలంగా ఈ రెండు దేశాల పరిస్తితీ ఒకేరకంగా కనిపిస్తుంది.అయితే అక్కడ తీవ్రవాదమూ,సైన్యం యొక్క అజమాయిషీ నడుస్తుంటే,ఇక్కడ రాజకీయ అధికార అవినీతీ,కులపార్టీలూ,క్రమశిక్షణ లేకపోవడమూ  సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.ఏ రాయైతేనేం తల పగలడానికి అన్నట్లు,వెరసి రెండు దేశాలకూ ఉన్న కామన్ అంశం ఏమిటంటే,ఎంతో ఎదగగల అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటికి తగినంత అభివృద్ధిని రెండు దేశాలూ సాధించలేకపోవడం.స్వతంత్రం వచ్చి అరవైఏళ్ళు దాటినా ఇప్పటికీ ఏ అమెరికా వైపో,చైనా వైపో చూస్తూ చెయ్యి చాచే పరిస్తితి ఉండటం విచిత్రం.'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఏదో' అన్నట్లు ఉంది ఈ రెండు దేశాల పరిస్తితి.

ఈ పరిస్తితికి కారణం--ఈ రెండుదేశాల ఆవిర్భావ సమయంలో ఉన్న కాలసర్పదోషం కావచ్చు.అందుకే అభివృద్ధికి ఆటంకాలుగా కాలగతిలో ఎన్నో సర్పాలు ఈ దేశాల ప్రగతిని కబళిస్తూ కనిపిస్తున్నాయి. అదలా ఉంచితే, చరిత్రలో అన్నీ మనకు తెలుసు అనుకున్న విషయాల గురించికూడా నిజానికి మనకు పెద్దగా తెలీదు అని చెప్పడానికి పాకిస్తాన్ జనన సమయాన్ని మించిన ఉదాహరణ అవసరం లేదు.
read more " పాకిస్తాన్ జాతకం "