“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, మే 2013, శనివారం

బుద్ధమతం అదృశ్యానికి కారణం

ప్రతి సంవత్సరమూ నేను అతి పవిత్రమైన రోజులుగా పరిగణించే కొన్ని రోజులలో బుద్ధపూర్ణిమ ఒకటి. ఈరోజుకోసం నేను నిజానికి ఎదురు చూస్తాను.కారణం ఏమంటే,బుద్ధుని నేను ఎంతో ఆరాధిస్తాను అభిమానిస్తాను.బుద్ధునివంటి మహానుభావుడు కొన్నివేల సంవత్సరాలకు గాని జన్మించడం జరగదు అనేది సత్యం.

బౌద్ధం మనదేశం నుంచి అదృశ్యం కావడానికి శంకరులు కారణం అని కొందరు దురుద్దేశ్య పూర్వకంగా బురద చల్లారు.అది పూర్తి నిజం కాదు.ఒక్క వ్యక్తివల్ల ఒకమతం నాశనం కావడం ఎన్నటికీ జరగదు.శంకరులు బౌద్ధులను వాదంలో జయించినంత మాత్రాన దేశం మొత్తం దానిని ఒప్పుకొని అప్పటివరకూ తాము ఆచరిస్తున్న బౌద్ధాన్ని తోసిపారేసింది అనడం సత్యదూరం అవుతుంది.మరి మన దేశంలో బౌద్ధం కనుమరుగు కావడానికి కారణాలేమిటి?

ప్రాధమికంగా బౌద్ధం ఒక సాధనామార్గం. అది ఒక ఫిలాసఫీ కాదు. దానిలో ఎంతో ఫిలాసఫీ ఉండవచ్చు.కాని మౌలికంగా అది ఒక దారి. సిద్ధార్ధ గౌతముడు ఆ దారిన నడిచి బుద్ధత్వాన్ని పొందాడు. ఆ దారి ఏమిటో దానిలో ఎలా నడవాలో ఆయన స్పష్టంగా చెప్పాడు.ఆయన తరువాత ఎందఱో ఆ దారిన నడిచి బుద్ధులయ్యారు. ఈ నాటికీ నడవగలిగిన వారు బుద్ధత్వాన్ని పొందుతున్నారు.

అయితే అలా ఆ దారిలో నడవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ పని అందరూ చెయ్యలేరు.దానికి ఎంతో పరిపక్వత ఉండాలి.ఎంతో చింతన ఉండాలి.ఎంతో తపన కావాలి.జీవితంలో మౌలిక సమస్యల గురించి ఎంతో సంఘర్షణ ఉండాలి. లోక వ్యామోహాలు,ఇంద్రియ వ్యామోహాలు దాటి ఎంతో ఎత్తుకు ఎదగాలి. అలాంటి మనుషులు మాత్రమె ఆ దారిలో నడవగలుగుతారు.మిగిలిన వారికి ఆ దారి అందేది కాదు.స్వయానా గౌతమ సిద్ధార్ధుడు ఎంతో అంతరిక సంఘర్షణ తర్వాతే బుద్ధత్వాన్ని పొందగలిగాడు.

ఏ దేశంలోనైనా సరే సామాన్యజనానికి ఉన్నతమైన భావాలు అవసరం ఉండదు. వారి బ్రతుకులు నేలబారుగా సాగుతూ ఉంటాయి.రొచ్చులో దొర్లే పందుల్లాగా వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉంటాయి.మేఘాలలోకి రమ్మంటే అవి  రాలేవు.కారణాలేమంటే,ఆకాశంలోకి ఎలా ఎగరాలో వాటికి తెలీదు.వాటికి రెక్కలు కూడా లేవు.పైగా,రొచ్చు హాయిగా ఉన్నప్పుడు అందులోనుంచి బయటకు ఎందుకు రావాలి? కనుక, ఉన్నతమైన భావాలను అర్ధం చేసుకునే మనుషులు ఏకాలంలోనైనా తక్కువమందే ఉంటారు.ఇక వాటిని నిత్యజీవితంలో ఆచరించే ధైర్యం ఉన్నవారు ఇంకా తక్కువమంది ఉంటారు. కనుక అత్యున్నతమైన సత్యాలను ఉపదేశించే మతాలు సామాన్య జనంలో మనుగడ సాగించలేవు.బౌద్ధం మనదేశంలో కనుమరుగు కావడానికి ప్రధానకారణం ఇదే.

బుద్ధమతం ఎంతో సంయమనంతో కూడిన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మనిషిలో మౌలికమైన ఒక విప్లవాన్ని అది కోరుతుంది.అది ఆచరించవలసిన మతం.దానిని జీవితంలో ఆచరించాలంటే మనిషి ఇప్పటివరకూ తాను అంటి పెట్టుకుని ఉన్న ఎన్నింటినో తనంతట తాను త్యాగం చెయ్యవలసి ఉంటుంది.ఆ రిస్క్ తీసుకోడానికి ఎవరూ ఇష్టపడరు.అందుకే బుద్ధమతం మన దేశంలో నుంచి అదృశ్యమై పోయింది.

ఇప్పుడు మనం ఎంతో అభివృద్ధి సాధించాం అని విర్రవీగుతున్నాం.లౌకిక సుఖాల విషయంలోనూ,సౌకర్యాల విషయంలోనూ అది నిజమే కావచ్చు. కాని అంతరికంగా చూస్తే, ప్రాచీనులకంటే మనం చాలా దిగజారాం అనే చెప్పాలి. ప్రాచీనుల మనోబలం మనకు లేదు.వారికున్న నైతిక బలమూ మనకు లేదు.సత్యాన్ని ధైర్యంగా అనుసరిచే సత్తాలో ప్రాచీనులకంటే మనం చాలా వెనుకబడిపోయాం అనే చెప్పాలి.బుద్ధుని కాలంలో ఆయన మార్గంలో నడిచిన వారు వేలల్లో ఉన్నారు.కాని తర్వాత కొన్ని శతాబ్దాలకు అదే దేశంలో వెతికి చూద్దామన్నా ఒక్కరూ కనిపించక మాయమయ్యారు.కారణం ఏమంటే- మనుషులలో ఎక్కువైన దిగజారుడుతనం అనే చెప్పాలి.ఇక్కడ వినేవారు కరువయ్యారు గనుకనే, బోధిధర్మ వంటి వారు చైనాకు పోయి జెన్ బౌద్ధాన్ని ప్రచారం చేసుకోవలసిన గతి పట్టింది.

అత్యున్నతమైన సత్యాలను బోధించే ఏ మతానికైనా ఇదే గతి పడుతుంది.ఉదాహరణకి శంకరుల అద్వైతం సంగతి చూస్తె, దానికీ ఇదే గతి పట్టిందని కనిపిస్తుంది.నేడు అద్వైతులమని చెప్పుకునేవారిలో ఎక్కడా అద్వైత ఆచరణలు లేవు.ప్రపంచం మొత్తంమీద ఎక్కడ చూచినా,మనిషి నేలబారున బ్రతకడానికే ఇష్టపడతాడు. కాని 'అన్నింటినీ వదలి నాతో రా' అంటే ఎవ్వడూ ముందుకు రాడు. సాక్షాత్తూ దేవుడే ప్రత్యక్షమై ఆమాట చెప్పినా కూడా ఆయన్ను ఎవడూ అనుసరించడు. ఎందుకంటే, ఉందొ లేదో వస్తుందో రాదో తెలియని ఏదో గమ్యంకోసం ఇప్పటి సుఖాలను వదులుకోవడం ఎవడికీ ఇష్టం ఉండదు.

ఇదే సత్యాన్ని తిరగదిప్పి చూస్తె ఇంకో విషయం బోధపడుతుంది.ప్రపంచంలో అతి ఎక్కువ ఆదరణ పొందిన మతాలన్నీ అత్యున్నతమైన సత్యాలను చెప్పేవి కావు. మన జీవన విధానానికి దగ్గరగా ఉండే భావాలే మనకు నచ్చుతాయి.మనం బురదగుంటలో బతుకుతున్నాం గనుక అందులోనుంచి బయటకు రాకుండా ఇంకా ఎక్కువ బురదను ఒంటికి ఎలా పూసుకోవాలో చెప్పేవారు మనకు బాగా నచ్చుతారు. అంతేగాని ఆ మురికి గుంతను వీడి బయటకు రమ్మని చెప్పేవారు ససేమిరా నచ్చరు.మనవి కుహనా బతుకులు గనుక అలాంటి మాటలు చెప్పే మతాలే మనకు నచ్చుతాయి. పాపులర్ క్రైస్తవాన్నీ,ఇస్లాంనూ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. బౌద్ధంలోనూ అద్వైతంలోనూ ఉన్నంత అత్యున్నతమైన ఫిలాసఫీ వాటిలో ఎక్కడా కనిపించదు,అంతేగాక బౌద్ధం చెప్పినట్లు మనిషిని మౌలికంగా మారమని,అంతరికంగా ఎత్తులకు ఎదగమని అవి చెప్పవు.కనుక సామాన్య జనానికి అవే నచ్చుతాయి.లోకంలో అవే ఎక్కువగా చెలామణీలో ఉంటాయి.

పాపులర్ హిందూమతం కూడా అలాంటిదే.ఇందులో కూడా గుళ్ళూ గోపురాలూ మొక్కులూ పూజలూ ఉంటాయి. కాని మౌలికంగా మనిషిలో మార్పును తీసుకొచ్చే విధానాలు ఎక్కడా బయటకు కనిపించవు. అంటే నా ఉద్దేశ్యం అలాంటి విధానాలు హిందూమతంలో అసలు లేవని కాదు. ఉన్నాయి.కాని నిగూడంగా ఉన్నాయి.అవి అందరికీ లభించవు. కనుక గొర్రెల మందల్లాగా జనం పోలోమంటూ మామూలు నేలబారు ఆచరణలలోనే పడి దొర్లుతూ ఉంటారు.

పండుగరోజుల్లో ఏవో పూజలు చేస్తే చాలు, ఏడాదికి ఒకసారో రెండుసార్లో ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తే చాలు అని సామాన్య హిందువులు అనుకుంటారు.అలాగే,వారానికొకసారి చర్చికెళ్ళి కన్ఫెషన్ చేసివస్తే చాలు ఇక ఆతర్వాత మనం ఏంచేసినా పరవాలేదు అని క్రైస్తవులు అనుకుంటారు. రోజుకు అయిదుసార్లు నమాజ్ చదివి జన్మలో ఒకసారి మక్కా పోయి వస్తే చాలు, మనం ఎంతమంది కాఫిర్లను చంపినా పరవాలేదు అని సాధారణ ముస్లిం అనుకుంటాడు.

కాని బౌద్ధం ఇలాంటి చవకబారు ఆచరణలను బోధించలేదు.ఎక్కడో మరణం తర్వాత దొరికే స్వర్గాన్ని అది ఆశ చూపించలేదు.ఇక్కడే ఇప్పుడే నీవు సత్యాన్ని అందుకోవచ్చనీ, దానికి దారి ఒకటుందనీ బుద్ధుడు చెప్పాడు. ఆయన ఆ దారిలో నడిచాడు.అంతేగాక నీవు నడవగలిగితే నీవూ ఆ స్తితిని ఇప్పుడే ఇక్కడే అందుకోవచ్చు అనీ చెప్పాడు. అయితే ఆ పని చెయ్యాలంటే, పైన చెప్పినట్లుగా, మనిషికి ఎంతో పరిపక్వతా త్యాగమూ అవసరం అవుతాయి. అవి ఎవ్వరూ కోరుకోరు కనుక ఆదారిన ఎవ్వరూ నడిచే సాహసం చెయ్యలేరు.ఆడుతూ పాడుతూ గుళ్ళూ గోపురాలూ సరదాగా పిక్నిక్ లాగా తిరిగి హుండీలో డబ్బులు పారేసి స్నేహితులతో పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని తిరిగిరావడం చాలా తేలికపని కనుక అందరూ అదే పని చేస్తారు.గడ్డాలు పెంచడమూ,గుండు చేయించుకోవడమూ,టోపీ ధరించడమూ,బొట్లు పెట్టుకోవడమూ,ప్రత్యేకడ్రస్సులు ధరించడమూ  మొదలైన వేషాలు వెయ్యడం చాలాతేలిక గనుక అందరూ వాటిని అనుసరిస్తారు. దీనికి భిన్నంగా,అంతరికంగా మార్పు తెచ్చుకోవడం చాలాకష్టం గనుక అది ఎవరికీ అవసరం లేదు.ఆ మార్గం అందరికీ అందను కూడా అందదు.

బౌద్ధంవంటి సాధనామార్గ మతం మన దేశం నుంచి అదృశ్యం కావడానికి ప్రధాన కారణం దానిని ఆచరించే సత్తా జనులలో లేకపోవడమే.కొందరు చెప్పేటట్లు,తాంత్రిక అభ్యాసాలు అందులో ప్రవేశించి పతనానికి దారి తియ్యడమూ,శంకరుల వంటి మహనీయులు దానిని వ్యతిరేకించడమూ అసలైన కారణాలు కాదు. అవి దోహదకారణాలు అయి ఉండవచ్చు.కాని మౌలికకారణం మాత్రం జనుల చవకబారు మనస్తత్వమే.అత్యున్నత సత్యాలను అందుకునే స్థాయి జనసామాన్యంలో లోపించడమే దీనికి ప్రధాన కారణం.