“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, మే 2013, శనివారం

పాకిస్తాన్ జాతకం

మన చరిత్ర కారులు ఎప్పుడో చరిత్రకందని రోజులలో జరిగిన సంగతులు వారే చూచినట్లు పుస్తకాలు వ్రాసేస్తారు.వాటిని పాఠ్య పుస్తకాలుగా ప్రభుత్వం ఆమోదిస్తుంది.వక్రీకరించిన చరిత్రను మనం చదువుకుని అపార్ధాలు అపోహలు ఏర్పరచుకుంటాం.వాటిమీద వాదనలు ప్రతివాదనలు విభేదాలు కొనసాగుతూ ఉంటాయి.కాని విచిత్రమేమిటంటే చరిత్రలో పెద్ద విషయాలు కూడా కొన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం.పాకిస్తాన్ దేశం ఎన్ని గంటలకు ఆవిర్భవించింది?అన్న ప్రశ్నకు సూటి జవాబు ఇప్పటిదాకా లేదుమరి. ఇంతా చేస్తే ఇది చరిత్రలో ఈ మధ్యన జరిగిన సంఘటనే.

15-8-1947 రాత్రి పన్నెండు గంటలకు అఖండ భారత్ చీలిపోయి భారత దేశం,పాకిస్తాన్ లుగా అవతరించిందని అందరూ అనుకుంటారు.కాని ఇది వాస్తవమేనా? ఈ అనుమానం ఇప్పుడెందుకోచ్చిందీ అంటే, పాకిస్తాన్ లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. కనుక ఆ దేశ జాతకం చూడబోతే విచిత్రమైన నిజాలు వెల్లడయ్యాయి.

మన దేశ ఆవిర్భావ సమయం విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు.ఎన్ని రకాలైన అవలక్షణాలు ఉండవచ్చో అన్నీఉన్న మంచి కాలసర్పయోగ ముహూర్తం చూచిమరీ మనకు స్వాతంత్రం ఇచ్చిపోయారు బ్రిటిష్ వారు.లెక్క ప్రకారం అయితే అదే పాకిస్తాన్ ఆవిర్భావ సమయం కూడా అవ్వాలి.కాని వాస్తవం అలా లేదు.

కొంతమంది చెప్పే ప్రకారం,పాకిస్తాన్ ఆగస్ట్ 14 నే తమ స్వాతంత్ర దినంగా జరుపుకుంటోంది.ఎందుకంటే లార్డ్ మౌంట్ బాటెన్ రెండు ఫంక్షన్ల లోనూ తాను వ్యక్తిగతంగా పాల్గొనాలని ఆశించాడు గనుక ఒక రోజు ముందే కరాచీ లో ఆదేశ ఆవిర్భావ ఉత్సవం జరిపారనీ అందుకని 14-8-1947 ఉదయం 9.30 అనేది పాకిస్తాన్ పుట్టిన సమయం అనీ కొందరి వాదన.

ఫంక్షన్ ఎప్పుడు జరిపారన్నది ప్రశ్న కాదు.అధికారికంగా ప్రకటన ఎప్పుడు చేశారు అన్నదే పాయింట్ కనుక ఆగస్ట్ పద్నాలుగు/పదిహేను అర్ధరాత్రే రెండు దేశాలూ పుట్టాయి అని కొందరి వాదన.

ఇంకొందరు చెప్పే ప్రకారం, మన కంటే నాలుగు నిముషాలు ముందుగా పాకిస్తాన్ ఆవిర్భావ ప్రకటన అయింది కనుక 14-8-1947 23.56 గంటలకు ఆ దేశం పుట్టినట్లు తీసుకోవాలి.సరిగ్గా అర్ధరాత్రికి మన దేశం పుట్టినట్లు తీసుకోవాలి.

మొదట్లో ఆగస్ట్ పదిహేనునే స్వతంత్ర దినంగా జరుపుకున్న పాకిస్తాన్  కూడా తర్వాత్తర్వాత ఆగస్ట్ పద్నాలుగుగా దానిని మార్చుకుంది.ఎందుకంటే మనకంటే ఒక రోజు ముందుండాలని వారి తాపత్రయం కావచ్చు.

అసలు ఇంత చర్చ అవసరమా? ఎప్పుడు స్వతంత్రం వస్తే ఏమిటి?ఒకరోజు అటూ ఇటూ అయితే ఏమిటి? కొన్ని నిముషాలో గంటలో అటూ ఇటూ అయితే ఎవరి కొంప మునిగింది?అని ప్రశ్నిస్తే జవాబు లేదుగాని,దానివల్ల జ్యోతిష్య పరంగా చాలా తేడాలు వస్తాయి అని మాత్రం చెప్పవచ్చు.జాతకం చూడాలంటే ఖచ్చితమైన జననసమయం అవసరం.దేశజాతకమైనా అంతే. పాకిస్తాన్ విషయంలో పై సమయాలలో ఒక్కొక్క సమయమూ ఒక్కొక్క రకమైన జాతకచక్రాన్ని ఇస్తుంది.వాటిని పాకిస్తాన్ దేశంలో జరిగిపోయిన జరుగుతున్న పరిస్తితులతో పోల్చుకుని ఆయా చక్రాలలో ఏది సరియైనదో నిర్ణయించవచ్చు.తద్వారా అదే పాకిస్తాన్ జనన సమయంగా నిర్ధారించాలి. ఇదొక పెద్ద ప్రాసెస్.

ఒకవేళ ఆగస్ట్ పదిహేను రాత్రే పాకిస్తాన్ జనన సమయం కూడా అనుకుంటే, అప్పుడు కవలల జాతక చక్రాలకు ఉపయోగించే సూత్రాలను ఈ రెండు దేశాల చార్ట్ లకు ఉపయోగించాలి.ఎందుకంటే అధికారిక ప్రకటనల మధ్య నాలుగు నిముషాలే తేడా ఉన్నది.కనుక కవలపిల్లల జాతకాలను చూచినట్లు వీటిని చూడవలసి ఉంటుంది.

ఈ మధ్యనే అందరి కళ్ళముందూ జరిగిన ఇంత చిన్నవిషయం లోనే ఇదీ అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్తితి చరిత్రలో ఉంటె,ఇక వేదకాలం గురించీ, ఆర్య ద్రావిడ యుద్దాల గురించీ,హరప్పా మొహంజొదారోలలో ఉన్నది ఆర్య నాగరికతా ద్రావిడనాగరికతా,రాముడూ కృష్ణుడూ చారిత్రిక పురుషులేనా, జీసస్ కు మేరీమేగ్డలేన్ కూ పెళ్లయిందా వారికి పిల్లలున్నారా వంటి విషయాల మీద చర్చలలో ప్రామాణికత ఎంత ఉంటుంది? అన్నది ఒక అంతుబట్టని ప్రశ్న.

ఆ విషయాలు అలా ఉంచితే, ప్రస్తుత పాకిస్తాన్ ఎలక్షన్ల దృష్ట్యా ఒక్క విషయం చెప్పవచ్చు.ఈ దేశానికి స్వతంత్రం వచ్చినపుడు చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో  ఉన్నాడు. ఇప్పుడు దానికి దశమంలో రవి, కుజ, బుధ,కేతు గ్రహాల కూటమి ఉన్నది.వారిపైన తత్కాల చంద్ర లగ్నాత్ చతుర్ధం నుంచి శని రాహువుల దృష్టి ఉన్నది.కనుక ఎలక్షన్ల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అధికారం లోకి వచ్చినవారు సైన్యం (కుజుడు+ఉచ్ఛరవి) యొక్క బలమైన అధిపతుల కనుసన్నల లోనే పని చెయ్యవలసి ఉంటుంది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.ఇంకో విషయం ఏమిటంటే,చతుర్ధ రాహు శనుల వల్ల,ఎవరు అధికారం లోనికి వచ్చినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు,గొడవలూ హింసా తప్ప అన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

మనకూ పాకిస్తాన్ కూ ఒకేసారి స్వాతంత్రం వచ్చినందుకో ఏమోగాని,చాలా వరకూ స్థూలంగా ఈ రెండు దేశాల పరిస్తితీ ఒకేరకంగా కనిపిస్తుంది.అయితే అక్కడ తీవ్రవాదమూ,సైన్యం యొక్క అజమాయిషీ నడుస్తుంటే,ఇక్కడ రాజకీయ అధికార అవినీతీ,కులపార్టీలూ,క్రమశిక్షణ లేకపోవడమూ  సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.ఏ రాయైతేనేం తల పగలడానికి అన్నట్లు,వెరసి రెండు దేశాలకూ ఉన్న కామన్ అంశం ఏమిటంటే,ఎంతో ఎదగగల అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటికి తగినంత అభివృద్ధిని రెండు దేశాలూ సాధించలేకపోవడం.స్వతంత్రం వచ్చి అరవైఏళ్ళు దాటినా ఇప్పటికీ ఏ అమెరికా వైపో,చైనా వైపో చూస్తూ చెయ్యి చాచే పరిస్తితి ఉండటం విచిత్రం.'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఏదో' అన్నట్లు ఉంది ఈ రెండు దేశాల పరిస్తితి.

ఈ పరిస్తితికి కారణం--ఈ రెండుదేశాల ఆవిర్భావ సమయంలో ఉన్న కాలసర్పదోషం కావచ్చు.అందుకే అభివృద్ధికి ఆటంకాలుగా కాలగతిలో ఎన్నో సర్పాలు ఈ దేశాల ప్రగతిని కబళిస్తూ కనిపిస్తున్నాయి. అదలా ఉంచితే, చరిత్రలో అన్నీ మనకు తెలుసు అనుకున్న విషయాల గురించికూడా నిజానికి మనకు పెద్దగా తెలీదు అని చెప్పడానికి పాకిస్తాన్ జనన సమయాన్ని మించిన ఉదాహరణ అవసరం లేదు.