“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, అక్టోబర్ 2011, శనివారం

స్టీవ్ జాబ్స్ జాతకంలో ధనయోగాలు

స్టీవ్ జాబ్స్ జాతకంలోని ధనయోగాలను, ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఈ పోస్ట్ లో చూద్దాం.

శ్లో || ధనాదిపో ధనే కేంద్రే త్రికోణే వా యదా స్తితః 
ధనధాన్య యుతో జాతో జాయతే నాత్ర సంశయః 

( పరాశర హోర ద్వితీయ భావ ఫలాధ్యాయం)

అంటూ మహర్షి పరాశరులు ఇచ్చిన శ్లోకం ఇతని జాతకంలో చక్కగా సరిపోతుంది. ఎలాగో చూద్దాం. 

ధనాదిపతీ లాభాదిపతీ అయిన బుధుడు పంచమకోణ  స్థానంలో ఉన్నాడు. దశమాదిపతి(వృత్తి), తృతీయాధిపతి(కమ్యునికేషన్) తనకు మిత్రుడూ అయిన శుక్రునితో కలిసి ఉన్నాడు. కనుక ఇతనిది ఆ రంగంలో  మంచి resourceful brain అని తెలుస్తుంది. దానికి తోడు రాహువు యొక్క కలయిక వల్ల నానారకాలైన అయిడియాలు ఇతని బుద్ధిని ఎప్పుడూ ఊపేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. రాహువు ఇక్కడ గురువుకు సూచకుడు. కనుక ఇతనికి కొంత ధార్మికఆలోచనలు కూడా ఉంటాయనీ సూచన ఉంది. కాని రాహువు ప్రభావంవల్ల ఇతను విదేశీమతాలవైపు ఆకర్షింపబడతాడని తెలుసుకోవచ్చు. అలాగే ఇతని మీద హిందూ,బౌద్ధ మతాల ప్రభావం బాగా ఉంది.

ఈ మూడు గ్రహాలనూ ఉచ్ఛశని తృతీయం నుంచి చూస్తున్నాడు.కనుక communication రంగంలో ఇతను ఉచ్ఛ స్తితికి చేరాడు. శనికి వచ్చిన 6 /7 ఆధిపత్యాల వల్ల కృషీ, పార్ట్నర్షిప్ బిజినెస్సూ సూచింపబడుతున్నాయి. ఇదే ఉచ్ఛ శని, భాగ్యాధిపతి అయి భాగ్యస్థానంలో ఉన్న కుజుని వీక్షించడం చూడవచ్చు. కనుక ఇతనికి అమిత బాగ్యవృద్ధి కలిగింది. 

ఇక చంద్ర లగ్నాత్ జాతకాన్ని చూద్దాం. ఇక్కడ కూడా దాదాపు ఇవే యోగాలు కనిపిస్తూ ఇతనిది మహర్జాతకం అని రుజువు చేస్తున్నాయి. మనం ఇంతకు ముందు గమనించిన మూడుగ్రహాల కలయిక ఇతని దశమ స్థానంలో జరిగింది. కనుక వృత్తిపరంగా ఉన్నతశిఖరాలు అధిరోహించాడు. ఇక్కన్నించి శనికి లాభాదిపత్యం వచ్చింది. ఉచ్ఛస్తితిలో ఉన్న  లాభాదిపతిగా ఆయన వీక్షణ దశమస్థానం మీద ఉంది. కనుక వృత్తిపరంగా  అమిత లాభాలు ఆర్జించాడు.

అలాగే ధనాధిపతి అయిన కుజుడు ధనస్థానంలోనే ఉన్నాడు. లాభాధిపతి అయిన ఉచ్ఛశనితో చూడబడుతూ ఉన్నాడు. కుజునికి భాగ్యాదిపత్యం కూడా పట్టింది. అంతేగాక దశమకేంద్రం నుంచి మూడుగ్రహాల దృష్టి రాహువుద్వారా కుజుని మీద ఉంది. కనుక ఇక్కడ కూడా  వృత్తిపరంగా సంపదనూ, ప్రఖ్యాతినీ ఆర్జించే యోగం దర్శనమిస్తుంది.

ఇతని శ్రీలగ్నం కర్కాటకం అయింది. శ్రీలగ్నాధిపతి చంద్రుడు భాగ్యస్థానంలో ఉంటూ ఉచ్ఛశని యొక్క నక్షత్రంలో స్థితుడై ఉన్నాడు. అందువల్ల అమితభాగ్యయోగం పట్టింది. కాని అదే చంద్రుడు నవాంశలో నీచలో ఉన్నందువల్ల ఇతనికి తన సంపదని పూర్తిగా అనుభవించే యోగం తొలగిపోయింది. ధనవిషయాలలో ఇందులగ్నం ప్రముఖపాత్ర వహిస్తుంది. కాళిదాసు తన "ఉత్తరకాలామృతం" లో ఇందులగ్నాన్ని ప్రముఖంగా  పేర్కొన్నాడు. ఇందులగ్నం కుంభం అయింది. ఆ లగ్నాధిపతి శని భాగ్య స్థానంలో ఉచ్ఛ స్తితిలో ఉండటం చూడవచ్చు. 

ఇన్ని ధనయోగాలు స్టీవ్ జాబ్స్ జాతకంలో ఉన్నాయి, అందువల్లే అతను లౌకికంగా అంత ఎత్తుకు ఎదగగలిగాడు. కృషి వల్ల సమస్తమూ సాధ్యమే అని కొందరంటారు. అది సగం సత్యం మాత్రమే. కృషి చేసినంత మాత్రాన అన్నీ సాధ్యపడవు అన్నది చేదునిజం. మనిషి జాతకంలో మంచి యోగాలు లేనిదే మన కృషి ఎందుకూ పనికిరాదు. ఎంత కృషి చేసినా ఎదుగూబొదుగూ లేని జీవితాలు లక్షలాదిమందికి ఉంటాయి. దానికి కారణం, వారి జాతకాలలో మంచియోగాలు లేకపోవడమే. మంచి పూర్వ పుణ్యబలం ఉన్నప్పుడు జాతకంలో మంచియోగాలు ప్రతిఫలిస్తాయి. లేకుంటే ఉండవు. 

కనుక, పూర్వపుణ్య బలం కలిగిన జీవులు ఆయా గ్రహస్తితులు ఆకాశంలో ఉన్నట్టి సమయంలోనే జన్మ తీసుకుంటారు. అలాగే పాపఖర్మ ఉన్న జీవులు కూడా దరిద్రయోగాలు ఉన్నట్టి సమయంలో పుడతారు. వారు అలా కావాలని అనుకోని పుట్టరు. అంత స్వాతంత్ర్యమూ, వెసులుబాటూ, సామాన్యజీవులకు ఉండదు. వారి కర్మానుసారం, ఆయా సమయాలకు, ఆయా దేశాల్లో, ఆయా కుటుంబాల్లో జన్మలకు వారు ఈడ్వబడతారు. అంతా కర్మానుసారం జరుగుతుంది. వీరికేమీ చాయిస్ ఉండదు. కనుక పూర్వపుణ్యబలం బాగా ఉన్నవారు కొద్ది శ్రమతో అమితంగా ఎదుగుతారు. అది లేనివారు ఈ జన్మలో అనేక కష్టాలు పడుతూ కొత్తగా పుణ్యబలాన్ని ఆర్జించుకోవలసి ఉంటుంది. ఈ లోపల మళ్ళీ కొత్తగా చెడుకర్మ పోగేసుకుంటే వచ్చే జన్మ ఇంకా అధోగతికి పోతుంది. ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక. 

అంటే, స్వయంకృషిని ఆపి కర్మను నమ్ముతూ ఖాళీగా కూచోమని నేను చెప్పడం లేదు. మన పని మనం చెయ్యాల్సిందే. ఖాళీగా కూచుందామన్నా అదీ మన చేతుల్లో లేదు. మన సంస్కారాలు అలా చెయ్యనివ్వవు. నిజానికి, ఏ పనీ చెయ్యకుండా ఖాళీగా కూచోవడం చాలా కష్టమైన పని.

ఏదో రకంగా డబ్బు సంపాదిద్దాం. ఎలాగైతేనేం? సంపాదన ముఖ్యం. దానివల్ల ఎవడేమై పోయినా మనకనవసరం. ముందు ఏమి జరుగుతుందో ఎవడు చూడొచ్చాడు? అని నేడు చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడలాగే అనిపిస్తుంది. కాని భవిష్యత్తులో నేటి చెడుకర్మ యొక్క ఫలితాలు అనుభవించేటప్పుడు ఆ బాధలెలా ఉంటాయో తెలుస్తుంది. సమాజంలో నేడు ప్రబలుతున్న ఈ ధోరణి ఎంత ప్రమాదకరమో జ్యోతిష్యజ్ఞానం వేలెత్తి చూపుతూ హెచ్చరిస్తూనే ఉంటుంది. స్వీకరించటం లేదా పట్టించుకోకపోవడం మన ఇష్టం.
read more " స్టీవ్ జాబ్స్ జాతకంలో ధనయోగాలు "