“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, అక్టోబర్ 2011, మంగళవారం

మాయాపురం (లక్నో) విశేషాలు

ఒక వారంరోజులు మాయావతి పాలిస్తున్న లక్నోలో నివాసం. లక్నో వెళ్ళేటప్పుడు 27 గంటలనుకున్న ప్రయాణం తెలంగాణా ఆందోళన, రైల్ రోకోల వల్ల 57 గంటలు పట్టింది. శనివారం సాయంత్రం మూడు గంటలకు విజయవాడలో బయలుదేరిన రైలు ఓడిశా, బెంగాల్, చత్తీస్ ఘర్ రాష్ట్రాలను దాటుకుంటూ మధ్యప్రదేశ్లో ప్రవేశించి అక్కణ్ణించి యూపీలోని లక్నో చేరటానికి సోమవారం సాయంత్రం 5 అయింది. దారిలో సమోసాలు, టీ తప్ప ఈ మూడురోజులూ తినడానికి ఏమీ దొరకలేదు. చాలామంది ప్రయాణీకులు ఆ దెబ్బకు సిక్ అయిపోయారు. 

రైల్లో దూరప్రయాణం అంటే ఇంత ఘోరంగా ఉంటుందని ఇన్నేళ్ళ రైల్వే సర్వీసులో నాకు ఎప్పుడూ తెలీలేదు.  దానికి తోడు బోగీలో పిల్లల గోల. వాళ్ళు కొంత ప్రయాణం తర్వాత, అసహనానికి లోనవుతారు. ఇక ఏడుపులు, లేదా గోల, మొదలు పెడతారు. వాళ్ళని భరించటం పక్కవాళ్ళకూ కష్టమే. పాపం వాళ్ళ తల్లి దండ్రులూ ఏమీ చెయ్యలేరు.

అయోధ్య యాత్రకు వస్తున్న కొందరు ఆంధ్రా భక్తులు కూడా ఇదే బండ్లో ఉన్నారు.మొత్తం మీద, సోమవారం సాయంత్రానికి దాదాపు 20 గంటల లేటుతో లక్నో చేరాము. పాపం అయోధ్య బృందానికి కనెక్టింగ్ రైళ్ళు అన్నీ మిస్ అయ్యాయి. లక్నో స్టేషన్లో వాళ్లకు సరిగ్గా జవాబు చెప్పిన నాధుడే లేడు. మొత్తం మీద దారి పొడుగూతా అందరూ కేసీఆర్ ని నానా తిట్లూ తిట్టారు.

ఈలోపల కాలేజీ మినీ బస్ వచ్చింది. అదెక్కి మా కాలేజీకి చేరాను. కాలేజీ ఊరిచివరగా ఉంది. ఆవరణ చాలా పెద్దది. ఆవరణ అంతా చెట్లు బాగా పెంచారు. దాంతో ఒక  చక్కని వ్యవస్థీకృత అరణ్యంలాగా కనిపిస్తుంది. నేను ఒకరోజు  లేటుగా చేరడంవల్ల అప్పటికే హాస్టల్లో రూములన్నీ నిండిపోయాయి. కనుక దూరంగా విసిరేసినట్టున్న ఒక త్రీ బెడ్ రూం క్వార్టర్లో  నాకు బస ఇచ్చారు. ఆ క్వార్టర్ చుట్టూ పెద్ద ఆవరణ, లాన్, చెట్లూ వెరసి వాతావరణం చాలా బాగుంది. అయితే చీకటి పడితే, ఒంటరిగా చెట్లమధ్యలో విసిరేసినట్లుగా ఉన్న ఆ క్వార్టర్లో రాత్రంతా ఉండాలి. అదొక్కటే ఇబ్బంది ( చాలామంది దృష్టిలో).

ఈ కార్యక్రమం జరుగుతుండగా బాంబే నుంచి వచ్చిన ఇంకొక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. "ఎక్కడో దూరంగా ఆ క్వార్టర్లో ఒంటరిగా ఎందుకు? ఉండండి ఇక్కడే హాస్టల్లో ఏదన్నా రూం ఉందేమో నేను మాట్లాడతాను" అన్నాడు. నేను ఒద్దని సున్నితంగా చెప్పాను. నేను ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతాననీ, చెట్లమధ్యలో, పెద్దఆవరణలో రాత్రులు  ఒక్కన్నే ఉండటం నాకిష్టమనీ చెప్పాను. అతను వింతగా నావేపు చూసాడు.

కాలేజిలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. మంచి మెస్సూ, స్విమ్మింగ్ పూలూ, నెట్ లైబ్రరీ, పుస్తకాల లైబ్రరీ, జిమ్, మంచి క్లాస్ రూములూ, మంచి కాన్ఫరెన్స్ హాలూ అన్ని వసతులూ ఉన్నాయి.

సాయంత్రం కాలేజి బస్సులో లక్నో ఊళ్లోకి బయలుదేరాం. లక్నో అంతా పాతకాలపు ఇళ్ళతో ఒక ఓల్డ్ సిటీ లా కనిపిస్తుంది. ఊళ్ళో అంతా దుమ్ము ధూళీ ఎక్కువ. ఇక్కడ రెండు వస్తువులు ఫేమస్. ఒకటి చికెన్ కబాబ్ లు. ఇంకొకటి చికాన్ బట్టలు. సహచరులు అందరూ ఎగబడి "టూన్డే  కబాబ్" బాగా లాగించారు. చికాన్ గుడ్డలూ బాగానే కొన్నారు. నేను రెంటి జోలికీ పోలేదు. ఈ ఊళ్ళో నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏమంటే పాత కాలపు చెట్లను కొట్టి వేయకుండా అలాగే ఉంచారు. కొత్తచెట్లను కూడా బాగా పెంచారు. ఊరంతా ఎన్నోచెట్లు దారి పొడుగునా కనిపిస్తాయి. "సత్యజిత్ రే" కూడా లక్నోలో ఇదే విషయాన్ని ఇష్టపడేవాడని, అందుకే లక్నో ఆయనకు ఇష్టమైన ఊరనీ  బెంగాల్ నుంచి వచ్చిన ఒక సహచరుడు అన్నాడు.

నేనక్కడున్న సమయంలోనే 700 కోట్లతో కట్టిన పార్క్ ను ముఖ్యమంత్రి  మాయావతి ప్రారంభించింది. ఆ పార్క్ నగరం నడిబోడ్డులో ఉంది. అంత ప్రైం ఏరియాలో అంత స్థలాన్ని ఎలా సేకరించారో తెలీలేదు. ఎంత దూరం పోతున్నా ఆ పార్క్ గోడ అలా వస్తూనే ఉంది. ఆ పార్క్ లో బుద్ధుడు, అంబేద్కర్, కాన్షీరాం,మాయావతి ల విగ్రహాలు ఉన్నాయి. నగరం మధ్యలో మాత్రమే రోడ్లు పార్కులు కనిపించాయి. శివార్లలో మళ్ళీ స్లం ఏరియాలూ, బహిరంగ మలవిసర్జనా, చెత్తా చెదారమూ అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అనేక ఇతరనగరాలలో కరెంటు రోజుకు ఆరు గంటలే వస్తుందిట. ఇక పల్లెల విషయం చెప్పనక్కర్లేదు. రోడ్లూ, తాగునీరూ పరిస్తితి అద్వాన్నం అని సహచరులు కొందరు చెప్పారు. ఒకప్పుడు మన హైదరాబాద్ లో ఇలాగే సంపద అంతా పోగుపడింది. ప్రతిరాష్ట్రంలోనూ ఇదే పరిస్తితి ఉన్నదేమో అనిపించింది. ఒకటి రెండు నగరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. కాని ఇతర చాలా ఊళ్లు ఏడుస్తూ ఉంటున్నాయి. సమాన అభివృద్ధి జరగడం లేదన్నది వాస్తవం.

అయిదురోజులపాటు -- ఉదయమేలేచి మామూలుగా యోగాభ్యాసం, జపం-ధ్యానం, తరువాత రోజంతా క్లాసులు. సాయంత్రం ఊళ్ళో విహారం. రాత్రి తొమ్మిదినుంచీ  పన్నెండువరకూ, లైబ్రరీలో తీసుకున్న పుస్తకాల అధ్యయనం, మళ్ళీ అర్ధరాత్రి ధ్యానం -- ఇలా నడిచింది. అయిదు రోజులలో అయిదు పుస్తకాలు చదివి తిరిగి ఇచ్చేశాను. లైబ్రేరియన్ వింతగా చూసాడు. నేను ఒక స్పీడ్ రీడర్ని అనీ, చిన్నప్పటి నుంచీ పుస్తకాలు బాగా చదివే అలవాటువల్ల అది సాధ్యమైందనీ చెప్పాను. లైబ్రరీలో చాలా మంచి పుస్తకాలున్నా, ఎవరూ వాటిని చదివిన దాఖలాలు కనిపించలేదు. కార్డులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ పుస్తకాలు మాత్రం నేను చదివాను.

1. Wisdom of India -- By Lin Yutang.
2. Jesus lived in India -- By Holger Kersten.
3. Buddha- His life, his philosophy and his order-- By Dr Hermann Hendenberg.
4. The Tao of Physics -- By Fritjoff Capra.
5. The heart of the Soul -- By Gary Zukov.


వచ్చే పోస్ట్ లో --మరిన్ని లక్నో విశేషాలు.