“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, అక్టోబర్ 2011, ఆదివారం

బ్రూస్లీ & బ్రాండన్లీ--చరిత్రకందని నిజాలు

జైమినిసూత్రాల యొక్క ప్రధమాధ్యాయంలో ఒక సూత్రంలో మహర్షి ఇలా అంటారు. సూ|| ప్రసిద్ధ కర్మా జీవశ్శనౌ || కారకాంశలగ్నంలో గనక   గురుశనులుంటే -- ఆ జాతకుడు ప్రసిద్ధకర్మ కలిగినవాడగును. అనగా తాను చేసేకర్మ వల్ల నలుగురిలో గొప్పపేరు సంపాదించును -- అని సూచన. బ్రూస్లీ జాతకంలో కారకాంశలగ్నం మేషం అయింది. అక్కడున్న  గురుశనులవల్ల ఇతనికి "ప్రసిద్ధకర్మ" యోగం కలిగింది.

కనుకనే తనను మించిన అనేకమంది ఫైటర్స్, మాస్టర్స్ ఉన్నాకూడా, తనకున్న స్వల్ప కుంగ్ఫూవిద్యా ప్రావీణ్యత వల్ల ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. కాని వారి వక్రతవల్ల ఆ ప్రఖ్యాతిని కొంతకాలమే చూడగలిగాడు. కొంతకాలం తర్వాత అది తిరోహితమైపోయింది.

ఒక మనిషియొక్క మరణం ఎలా సంభవిస్తుంది? అది స్వాభావికమరణమా? లేక అస్వాభావికమరణమా?  అన్నవిషయం తెలుసుకోవడానికి ఎన్నో సూత్రాలను మహర్షులు మనకందించారు. వాటిల్లో జైమినిమహర్షి ఇచ్చిన ఒక సూత్రాన్ని ఇక్కడ చెప్తాను.

జైమినిమహర్షి తనసూత్రాలలో ద్వితీయాధ్యాయం 12 వ సూత్రంలో ఇలా అంటారు. 

సూ || కర్మణి పాప యుత దృష్టే దుష్టమరణం || 

లగ్న, కారకులకు తృతీయం దుష్టగ్రహాలతో కూడినా చూడబడినా దుష్టమరణం కలుగుతుంది అని ఖచ్చితంగా మహర్షి చెప్పారు. ఈసూత్రం బ్రూస్లీ జాతకానికి ఎలా సరిపోతుందో చూద్దాం. బ్రూస్లీ తృతీయభావాన్ని వక్ర నీచశని వీక్షిస్తున్నాడు. ఇది చాలదన్నట్లు ద్వాదశస్థానంనుంచి కుజునిదృష్టీ అక్కడ పడుతోంది. లాభస్థానంనుంచి రాహుదృష్టికూడా తృతీయం మీద ఉంది. రాహువు, కుజుడు, శని -- మూడు గ్రహాల పాపదృష్టి తృతీయంమీద ఉంది. జైమినిమహర్షి ఇచ్చినసూత్రం ఇక్కడ అచ్చుగుద్దినట్లు సరిపోయింది. కనుక బ్రూస్లీది దుష్టమరణమే గాని సహజమరణం కాదు. అని ఖచ్చితంగా తెలుస్తున్నది.

బ్రూస్లీది అసహజమరణం అన్నవిషయం మనకు జ్యోతిశ్శాస్త్రం  చెప్పనక్కరలేదు, ఆ విషయం అందరికీ తెలుసు. మనకు కావలసింది దానివెనుకఉన్న కారణాలు అని చదివేవారికి అనుమానం రావచ్చు. అది నిజమే అయినప్పటికీ, అసలు బ్రూస్లీ జాతకం ఈ విషయమై ఏమి చెబుతోందో చూడటంకోసం ఈ విషయం పరిశీలించడం జరిగింది. రోగం ఉందా లేదా ముందుగా చూచిన తర్వాత, అదేమి రోగమో అప్పుడు డయగ్నైజ్ చెయ్యవచ్చు. రోగం ఉందని తెలిసింది కనుక, ఇక కారణాలు పరిశీలిద్దాం.

1. వీరి వంశంలో, శాపం ఉందా లేదా? అనే విషయం మొదట చూద్దాం. 

***నవమాధిపతి క్షీణచంద్రుడు రాహునక్షత్రంలో ద్వాదశంలోనూ, రాహువు చంద్రనక్షత్రంలో  లాభంలో ఉన్నారు.

*** చంద్రునితో కలిసిఉన్న మిగతా మూడుగ్రహాలను  షష్ఠస్థానం నుంచి  గురుశనులు వీక్షిస్తూ ఉన్నారు.

***రాహుచంద్రులకు నక్షత్రపరివర్తన పిశాచయోగం అనబడుతుంది.

***చతుర్ధాదిపతి శని వక్రించి నీచలో ఉండటం, పితృకారకుడైన రవి శనినక్షత్రంలో లగ్నంలో ఉండటమూ  కూడా దీనికి బలాన్నిస్తున్నది.

***పుత్రస్థానాన్ని కేతువు ఆక్రమించాడు. పుత్ర స్తానాదిపతి అయిన గురువు షష్ఠస్థానంలో నీచ వక్రశనితో కలిసి ఉన్నాడు.

***చతుర్ధాధిపతి అయిన శని నీచస్తితిలో వక్రించి ఉన్నాడు.

***పైకారణాల వల్ల ఇతనివంశంలో శాపంఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. పిశాచయోగంవల్లనే, ఎప్పుడూ తనను ఎవరో ఒకభూతం తరుముతూ ఉందని బ్రూస్లీ భావించేవాడు. ఆ భూతంవంటి వ్యక్తి అప్పుడప్పుడూ అతనికి కనిపించి భయపెట్టేవాడు. ఈ భూతం ఫోర్త్ డైమెన్షన్ నుంచి తనను వెంటాడుతున్న ఒక దుష్ట శక్తి అని బ్రూస్లీ భావించేవాడు.

2. ఇతని మితిమీరిన వ్యాయామాలు కారణాలా? అన్న విషయం చూద్దాం. వీటికి కారకుడైన కుజుడు రాహునక్షత్రంలో ఉండటంవల్ల ఇతను రకరకాలైన పిచ్చిపిచ్చి వ్యాయామాలు చేస్తాడనీ, చివరికి చేటు వాటిల్లుతుందనీ సూచన ఉంది. ఈ లగ్నానికి మారకుడైన శుక్రుడుకూడా రాహునక్షత్రంలో ఉండటం వల్ల, పైగా కుజునితో కలిసి ఉండటం వల్లా మితిమీరిన కామం ఇతనికి ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరిక ఉంది. నవాంశలోనూ దశాంశలో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కనుక అతి వ్యాయామాలు చేశాడు.

3. గర్ల్ ఫ్రెండ్ " బెట్టీ టింగ్ పై " ఇచ్చిన తలనొప్పి మాత్ర వల్ల చావు మూడిన్దా? అనే విషయం చూద్దాం. 20 -7 -1973 న ఇతని జాతకంలో శని/రాహు/శుక్రదశ జరుగుతున్నది. శని రోగస్థానమైన మేషంలో నీచలో ఉంటూ మెదడు రోగాన్ని సూచిస్తున్నాడు. రాహువు అష్టమాధిపతి అయిన ఉచ్చ బుధుడిని సూచిస్తున్నాడు. అంటే, నరాలకు సంబంధించిన రోగమని అర్ధం. శుక్రుడు ఈ లగ్నానికి మారకుడై, ద్వాదశంలో కుజునితో ఉంటూ మేషాన్ని చూస్తున్నాడు. కనుక సెక్స్ తర్వాత వచ్చిన తలనొప్పితో చనిపోయాడు గాని, తలనొప్పి బిళ్ళవల్ల కాదని తెలుస్తున్నది.
  
4 . ఇతని విపరీతసెక్స్ ను తట్టుకోలేని గర్ల్ ఫ్రెండ్ కొట్టిన దెబ్బవల్ల చనిపోయాడా? అన్న విషయం చూద్దాం. లగ్న,సప్తమ,అష్టమాదిపతులైన కుజ, శుక్ర, బుధులు ద్వాదశంలో కలిసి ఉన్నారు. అంటే ఇతనికి వివాహేతర రహస్యలైంగిక సంబంధాలు ఉన్నమాట వాస్తవమే. కాని ఈ గ్రహాలు ఒకరికొకరు శత్రుస్థానాలలో లేరు. అంతా కలిసి ఒకేచోట దగ్గరగానే ఉన్నారు. కనుక ఇతని గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఇతన్ని ఇష్టపడి వచ్చినవారేకాని బలవంతంగా ఒప్పుకున్నవారు కాదు. అదీగాక సౌమ్యులైన  అష్టమాదిపతి బుధుడు, సప్తమాధిపతి శుక్రుడూ, ఉగ్రుడైన లగ్నాధిపతి కుజుణ్ణి బాధించలేరు. కనుక గర్ల్ ఫ్రెండ్ ఇతని కణతమీద కొట్టిన దెబ్బవల్ల చావొచ్చిపడింది అన్నది ఉత్తఅబద్దపు పుకారు అని తెలుస్తుంది. ఇతని విపరీత సెక్స్ సామర్ధ్యం కూడా నిజంకాదనీ ఉత్త పుకారనీ, ఇతనికి అమ్మాయిల పిచ్చి ఉన్నప్పటికీ, జనం అనుకుంటున్నంత లైంగికసామర్ధ్యం ఇతనికి లేదనీ  గ్రహాలు చెప్తున్నాయి. సేలేబ్రిటీలకు విందులు, వినోదాలు, విలాసాలు మామూలు విషయాలే కదా.

5. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కూటమి చేసిన ప్రయోగంవల్ల చనిపోయాడా? అన్నవిషయం చూద్దాం. ఇతనూ అదే మార్షల్ ఆర్ట్స్ కూటమికి చెందినవాడు. కనుక వారు ఇతనికి గౌరవనీయులు, పితృసమానులూ అవుతారు. కనుక నవమస్థానం వారికి సూచకం. నవమాధిపతి అయిన క్షీణచంద్రుడు, బలవంతుడైన లగ్నాధిపతి కుజుణ్ణి బాధించలేడు. కనుక మార్షల్ ఆర్ట్స్ కమ్యూనిటీ చేసిన ప్రయోగం అనేది అసత్యప్రచారం అని తేలుతుంది. కాకుంటే వారికి ఇతని వ్యవహారం నచ్చకపోయి ఉండవచ్చు. అమెరికన్స్ కు కుంగ్ఫూ నేర్పిస్తున్నాడని వారు లోపల్లోపల బాధపడి ఉండవచ్చు.

6. డిం-మాక్ ( మర్మఘాత ప్రయోగం) కారణమా? అన్న విషయం చూద్దాం. శత్రువులకు షష్ఠస్థానం సూచకం. దాని అధిపతి కుజుడే లగ్నాధిపతి కూడా అయ్యాడు. కనుక ఇతరులు ఇతనికి చేసినహాని ఏమీ లేదు. ఇతను తనకుతానే హాని చేసుకున్నాడు అని తెలుస్తుంది. కనుక ఎవరో ఎప్పుడో కొట్టిన "డిం-మాక్" దెబ్బవల్ల అది స్లో పాయిజన్ లాగా పనిచేసి చనిపోయాడు అన్నది అబద్ధం అని తేలింది.

7. అమెరికన్, హాంకాంగ్ మాఫియాలు కారణాలా? అన్న విషయం పరిశీలిద్దాం. పరాయిదేశం అయిన అమెరికాకు కర్కాటకం (నవమస్థానం), మరియు తులా (ద్వాదశస్థానం)  సూచకాలు.  ఆయా అధిపతులైన చంద్రుడూ శుక్రుడూ కుజున్ని ఆకర్షించేవారే కాని శత్రువులు కారు. వారి బలహీనతవల్ల ఇతనికి చెడూ చెయ్యలేరు. కనుక ఈ విషయంలో అమెరికన్ మాఫియాపాత్ర లేదు అని తేలుతుంది. మాతృదేశం అయిన చైనా/హాంకాంగ్ కు శని సూచకుడు. ఈయన దుష్టశాపయోగంలో శత్రుస్థానంలో స్తితుడై ఉండటంవల్ల, హాంకాంగ్ మాఫియాతో ఇతనికి బహిరంగశత్రుత్వం ఉందన్న విషయం తెలుస్తున్నది. ఇతని మరణానికి ఈ శత్రుత్వం డైరెక్ట్ గా కారణం అయింది అనికూడా సూచన ఉంది.

8. ఇతనికున్న అమాయిల పిచ్చీ తిరుగుడూ కారణాలా? అన్న విషయాన్ని పరిశీలిద్దాం. లగ్నాధిపతి కుజుడు ద్వాదశంలో శుక్రస్థానంలో, శుక్రునితో కలిసి, రాహునక్షత్రంలో ఉండటం వల్ల ఇతనికి ఈ పిచ్చి బాగా ఎక్కువే అని చెప్పవచ్చు.

9. ఇక మిగిలిన ఒక్కసందేహం -- ఇతనికి డ్రగ్స్ అలవాటుందా? అన్న సంగతి జైమినిసూత్రాల సహాయంతో పరిశీలిద్దాం. "కుజేన వ్రణశస్త్రాగ్ని దాహాద్యై" అన్న సూత్రాన్నిబట్టి, పుండ్లు, ఆయుధదెబ్బలు, అగ్ని, దాహమూ ఇతని చావుకు కారణాలు అవ్వచ్చు. ఈ లిస్టు లో ఉన్నవాటితో ఇతని కణతమీద ఉన్నదెబ్బ మాత్రమే సరిపోతున్నది. ఇతని కణతమీద దెబ్బతగిలి ఉందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది.

"శనినా వాతరోగాత్" అన్న సూత్రాన్ని  బట్టి వాతరోగం ఇంకొక కారణం అవుతుంది. చనిపోవడానికి కొంతకాలం ముందునుంచీ మితిమీరిన డ్రగ్స్ వాడకం వల్ల బ్రూస్లీ ఫిట్స్ వచ్చి పడిపోయేవాడన్నసంగతి చాలామందికి తెలియదు. ఇది వాతలక్షణమే. "మందమాన్దిభ్యాం విష సర్ప జలోద్బంధనాదిభిహి" అన్న సూత్రాన్ని బట్టి తృతీయంమీద ఉన్న శనిమాందుల ప్రభావంవల్ల ఇతను విషంవల్ల, పాముకాటువల్లా, జలంవల్లా  లేదా ఉద్బంధనం (ఉరి) వల్ల మరణించాలి. వీటిలో పాముకాటూ, ఉరీ జరగలేదు. కాని విషమూ, జలమూ కారణాలు అయ్యాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే, ఇతని జీర్ణాశయంలో "కెన్నబిస్" అనే రసాయనం కనిపించింది. దీన్నే "హషీష్" అని మామూలు భాషలో అంటారు. ఇది మోతాదు ఎక్కువైతే వికటించి విషంగా మారుతుంది. ఇకపోతే ఇతని మరణానికి "బ్రెయిన్ ఎడీమా" అనేది కారణంగా వైద్యులు తేల్చారు. అంటే "మెదడువాచిపోయి నీరుపట్టటం". ఇక్కడ "నీరుపట్టడం" అన్నమాటను జాగ్రత్తగా గమనిస్తే కొన్నివేల ఏళ్లక్రితం జైమినిమహర్షి వాడిన "జలోద్బంధనం" అన్న పదం ఎంత చక్కగా సరిపోయిందో తెలుస్తుంది. "కేన్నబిస్" అనే మాదకద్రవ్యం సరాసరి మెదడుమీదే ప్రభావం చూపిస్తుంది.

పరాశర మహర్షి ఇదే విషయాన్ని ఇంకా వివరంగా చెబుతూ ఇలా అంటారు.

శ్లో || మందాగు యుతదృష్టేవా తృతీయేతు మునే విషాత్
జలాదనలదాహద్వా గర్తే నిపతనాదపి 
బంధనా దుచ్చపాతాద్వా మ్రుతిర్జాతస్య సంభవేత్   
           
జైమిని మహర్షి చెప్పిన కారణాలు కాక పరాశర మహర్షి ఇంకా ఇతర కారణాలైన -- (ఉచ్ఛపాతాత్)  పైనుంచి పడటం, (గర్తే నిపతనాత్) గుంటలో పడటం, (బంధనాత్) బంధనం అనే కారణాల వల్ల కూడా జాతకునికి మృతి సంభవించవచ్చు-- అంటారు. వీటిల్లో గుంటలో పడటమూ, బంధనమూ ఇతనికి జరుగలేదు. కాని పైనుంచి కిందపడి తలకు దెబ్బ తగిలించుకున్నాడు అని తెలుస్తున్నది. పరాశరమహర్షి ఇచ్చిన లిస్టులో - విషాత్ (విషం వల్లా), జలాత్ (జలం వల్లా), ఉచ్ఛపాతాద్వా( పైనుంచి కిందకుపడటంవల్లా) అని చెప్పిన మూడు కారణాలూ కరెక్ట్ గా సరిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

పంచమంలో కేతువు శని నక్షత్రంలో ఉండటమూ ఆ శని వక్ర నీచస్తితిలో ఉండటమూ గమనిస్తే ఇతనికి డ్రగ్స్ అలవాటు ఉందని రూడిగా తెలుస్తుంది. మనఃకారకుడైన చంద్రుడు మూడుగ్రహాల ప్రభావానికి లోనై ద్వాదశంలో పాపార్గళమధ్యలో ఉండటం ఈవిషయానికి ఖచ్చితత్వాన్ని సమకూరుస్తుంది. ఇతను నేపాల్ నుంచి " హషీష్ " అనే మాదకద్రవ్యాన్ని తెప్పించుకొని సేవించేవాడని ఇతని స్నేహితులలో చాలామందికి తెలుసు. ఈ మందు గంజాయి లాంటిది.ఇది ఒకరకమైన ఉల్లాసాన్నీ, శక్తినీ, లైంగికోద్రేకాన్నీ తాత్కాలికంగా ఇస్తుంది. క్రమేనా మనిషి దీనికి అలవాటు పడేకొద్దీ మొదట్లో వేసుకున్న డోస్ సరిపోదు. ఎక్కువ మోతాదులో సేవించడం అలవాటు అవుతుంది. అప్పుడు ఈ మందు విషంగా మారుతుంది. తన దుష్ప్రభావాన్ని మెదడు మీదా నరాల మీదా చూపించడం మొదలు పెడుతుంది. బ్రూస్లీ మరణానికి ఇదే కారణం అయి ఉంటుంది.

ఇతని జాతకంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడే ఒక గ్రహస్తితి ఉన్నది. అదేంటి? ఇలాటి విషయాలు కూడా జాతకంలో కనిపిస్తాయా? అని ఆశ్చర్యపోనక్కరలేదు. సమస్తమూ జాతకంలో కనిపిస్తుంది. చదవగలిగితే ఒకరి పుట్టుపూర్వోత్తరాలతో సహా సమస్తం కళ్ళముందు కనబడుతుంది. అదే జ్యోతిర్విజ్ఞానం యొక్క మహత్యం.

ద్వాదశంలో తులలో ఉన్న లగ్నాధిపతి అయిన కుజుడు 11 డిగ్రీల మీదున్నాడు. నవమంలో జలరాశి అయిన కటకంలో ఉన్న ప్లూటోకూడా ఖచ్చితంగా 11 డిగ్రీలలో ఉంటూ కుజునితో కేంద్రదృష్టిని కలిగి ఉన్నాడు. పంచమం బుద్ధిస్థానం. పంచమాత్ పంచమం అయిన నవమంకూడా బుద్ధిస్థానమే. వ్యసనాలకు బానిసలయ్యే యోగంలో "ప్లూటో-నెప్ట్యూన్ల " పాత్ర తప్పకుండా ఉంటుంది. కుజుడు చరకారక పదవులలో జ్ఞాతికారకుడై శత్రువులను సూచిస్తున్నాడు. కనుక ఇతనికి ఈ వ్యసనం కావడం శత్రువుల కుట్ర అని అర్ధమౌతున్నది. కుజ ప్లూటోల ఈ సంబంధంవల్ల ఇతనికి ఈవ్యసనం మార్షల్ ఆర్ట్స్ కారణంగానే అయి ఉండవచ్చు అని తెలుస్తోంది. కుజుడు వీరవిద్యలకు కారకుడు. ఇతను చేసే విపరీతవ్యాయామాలనుంచి పుట్టే ఒళ్ళునెప్పులనుంచి తట్టుకోడానికి మొదట్లో ఈ డ్రగ్ కు అలవాటుపడి ఉండొచ్చు. క్రమేణా దానికి బానిస అయ్యి ఉండటం సహజం.

మరణసమయానికి ఇతనికి శని/రాహు/శుక్ర దశ నడిచింది. శనిభగవానుడు ఇతని జాతకంలో శాపయోగాన్నిస్తున్నాడు. ఆ శని యమాధిపత్యంలో ఉన్న భరణీ నక్షత్రస్థితుడు. భరణీ నక్షత్రాదిపతి అయిన శుక్రుడు ఈ లగ్నానికి మారకుడు. ఆ శుక్రుడు రాహునక్షత్రంలో ఉండి శనిని వీక్షిస్తున్నాడు. శుక్రుడు కామకారకుడు. రాహువు బుధుడ్ని(మెదడును) సూచిస్తున్నాడు. రాహువుయొక్క  ప్రభావంవల్ల ఇప్పటికీ ఈ విషయం తేలని రహస్యంగానే ఉండిపోయింది. అంతేగాక ఇది అసహజ మరణం అని సూచనా ఉన్నది.     

ఖచ్చితత్వం కొరకు ఇంకొక రెండుమూడు దశలను పరిశీలిద్దాం.

ద్వాదశోత్తరీ దశ ఏమంటోంది?

లగ్నం శుక్రాంశలో పడినప్పుడు ద్వాదశోత్తరీ దశ ఉపయోగిస్తుంది. ఈ దశా ప్రకారం బ్రూస్లీకి 20 -7 -1973 న  శనిరాహు/శనిదశ జరిగింది. ఇది శపిత దశ. కనుక శాపప్రభావమే అర్ధాంతరపు  కారణమని తెలుస్తోంది.

షష్టిహాయినీ దశ ఏమంటోంది?

రవి లగ్నంలో ఉన్నపుడు ఈ దశ ఉపయోగిస్తుంది. ఆ రోజున ఈ దశాప్రకారం రవి/రవి/కుజ జరిగింది. రవి దశమాధిపతిగా లగ్నంలో ఉంటూ ఇతని ఉన్నతికి కారకుడయ్యాడు. కానీ, ఈ ఉన్నతే అతని కొంప ముంచింది. దానికి కారణం -- శాపయోగంలో ఉన్న శని నక్షత్రంలో ఉన్న రవి, లగ్నంలో ఉండటమే. తద్వారా, ద్వాదశంలో ఉన్న 1/6 అధిపతి కుజునివల్ల బలవంతులతో తెచ్చుకున్న రహస్యవిరోధం సూచితం. కుజశుక్రులవల్ల మరణానికి పూర్వరంగం అయిన, గర్ల్ ఫ్రెండ్ తో గడపడం సూచింపబడుతోంది.

యోగినీదశ ఏమంటోంది?

ఈ దశాప్రకారం ఆ రోజున రాహు/శుక్ర/కుజదశ నడిచింది. రాహువూ, శుక్రుడూ, కుజుడూ కలిసి ఆ రోజు ఏం జరిగిందో చక్కగా చెబుతున్నారు. వీరికి శని తోడవటం వల్ల పిక్చర్ కు క్లారిటీ వచ్చింది. ఈ జాతకంలో శనియొక్క ప్రధానమైన పాత్ర ఇంతకు ముందే వివరించాను.

కనుక వీటన్నిటిని బట్టి చూస్తె, ఆరోజున అతను అపార్ట్ మెంట్లో స్నేహితురాలితో గడిపే ముందు తనకు బాగా  అలవాటైన "హషీష్"ను బాగా ఎక్కువ మోతాదులో తీసుకున్నాడనీ, అంతకు ముందే అతనికి ఈ అలవాటుందనీ, కాని అప్పటికే క్షీణిస్తున్న ఇతని ఆరోగ్యస్తితివల్ల, మెదడులో రియాక్షన్ వచ్చి "ఎడీమా" మొదలైందనీ, దానివల్ల వచ్చిన విపరీతమైన తలనొప్పి భరించలేక, బెట్టీ ఇచ్చిన మందుబిళ్ళ వేసుకున్నాడనీ, మామూలు తలనొప్పిబిళ్ళ అయిన "ఎక్వాజేసిక్"  సెరిబ్రల్ ఎడీమా మీద పనిచేయ్యలేదనీ, క్రమేణా "బ్రెయిన్ ఎడీమా" విపరీతస్తితికి చేరి, తద్వారా కోమాలోకి పోయి మరణించాడనీ తెలుస్తున్నది. ఆ క్రమంలో వచ్చిన ఫిట్ వల్ల విసురుగా కింద పడిపోయాడనీ అలా పడటంలో తల దేనినో కొట్టుకుని దెబ్బ తగిలిందనీ అర్ధం చేసుకోవాలి.ఈ హషీష్ అనేది నేపాల్ నుంచి ఇతనికి సరఫరా అయ్యేది. అతను నేపాల్ వచ్చినపుడు దీనికి అలవాటు పడ్డాడు. ఈ నేపాల్ హషీష్ చాలా ముడిసరుకు. శుద్దిచేయ్యని ఈ ముడిపదార్ధంలో అనేకరకాలైన ప్రమాదకర రసాయనాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇతని ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తూ వచ్చింది.వంశపారంపర్యంగా వస్తున్న శాపం "హషీష్" అలవాటుగా పరిణమించి ఇతన్ని బలిగొంది అని చెప్పవచ్చు. "ఎంటర్ ది డ్రాగన్" సినిమాలో చూస్తే బ్రూస్లీ ముఖం ఒక్కొక్క ఫ్రేం లో ఒక్కొక్క విధంగా, కొన్ని చోట్ల ఉబ్బినట్లూ, కొన్ని చోట్ల పీక్కుపోయినట్లూ  ఉంటుంది. ఇదంతా డ్రగ్స్ ప్రభావమే. బహుశా హాంకాంగ్ మాఫియా  ఒక ప్లాన్ ప్రకారం ఇతనికి ఈ అలవాటును చేసి ఉండవచ్చు. 

ఒక మనిషిని కేసులేకుండా మెత్తగా మట్టుపెట్టాలంటే అతనికి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు. క్రమేణా అతనే స్వయంగా చావుకు కొని తెచ్చుకుంటాడు. ఇది మాఫియా సర్కిల్స్ లో మామూలుగా సాగే ఒక ప్లాన్ లో భాగం. ఈ విషయం వారికి కొత్తేం కాదు. చైనీస్ కి ఇలాంటి కుట్రలూ కుతంత్రాలూ సామాన్య విషయాలు.

గోచారం ఏమంటోంది?


20-7-1973 న గోచార స్తితిని పరిశీలిస్తే - గురువు  మకరంలో నీచస్తితిలో కొచ్చి వక్రస్తితిలో ఉంటూ సరిగ్గా 14 డిగ్రీలమీద ఉండి, జననకాల గురువుతో కేంద్రదృష్టిలో ఉన్నాడు. జననకాల గురువుకూడా 14 డిగ్రీలమీదే ఉండటం, అలాగే వక్రించి ఉండటం గమనార్హం. గోచారకేతువుకూడా 14 డిగ్రీలమీదే ఉండి జననకాలద్వాదశస్తిత గ్రహకూటమిని వీక్షిస్తున్నాడు. లగ్నాధిపతి అయిన కుజుడు మీనంలో 24 డిగ్రీలలో ఉండి జననకాల పంచమకేతువుమీద ఉన్నాడు. గురువుయొక్క స్తితిని జననకాలకుండలి లోనూ గోచారంలోనూ జాగ్రత్తగా గమనిస్తే, ఇతనికి గురుదోషం ఉందని, ఇతని శాపానికి కారణం అదేననీ తెలుస్తున్నది. దానికి తగినట్లుగానే ఇతను తనగురువైన " యిప్ మాన్ " నూ, "వింగ్ చున్" విద్యనూ మధ్యలోనే వదిలిపెట్టి, తన సొంతంగా రకరకాల మార్షల్ ఆర్ట్స్ ను అధ్యయనం చేసి కలగూరగంప లాంటి " జీత్ కునే డో " అనే Mixed Martial Art ను మొదలుపెట్టాడు. జాతకంలోని ప్రబలగురుదోష కారణంగా ఇతనికి ఒక స్థిరమైన గురువంటూ ఎవరూ లేకుండాపోయారు. ఇదేవిషయం బ్రాండన్లీ జాతకం చర్చించేటప్పుడు ఇంకా వివరంగా చూడవచ్చు. గురుద్రోహ కారణంగానే వీరి వంశంలో శాపం వెంటాడుతూ ఉందన్నది వాస్తవం. ఈ శాపానికి సూచకుడైన గురువు, గోచారంలో తృతీయ ఆయుష్యస్థానంలో నీచవక్రస్తితిలో సంచరిస్తూ " నాయనా నీ ఆయుష్షు తీరింది. ఇక బయలుదేరు" అని చెబుతున్నట్లుగా ఉంది.  గోచారశని కూడా అష్టమ ఆయుష్యస్థానం అయిన మిధునంలో 5 డిగ్రీలలో  సంచరిస్తూ జననకాల కన్యానెప్ట్యూన్ తో చాలా దగ్గరగా కేంద్రదృష్టిలో ఉన్నాడు. ఈ విధంగా మేజర్ గ్రహాలైన గురువూ శనీ ఆయుష్యస్థానాలకు ఆక్రమించి ఆయుష్షు అయిపోయిందని క్లియర్గా సూచిస్తున్నారు. 

ఆరోజు శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర నడుస్తూ బ్రూస్లీకి విపత్తార అవుతూ విపత్తు వ్రాసిపెట్టిఉంది అని సూచిస్తున్నది. 
 
కనుక కర్ణుడి చావుకున్నన్ని కారణాలు బ్రూస్లీ చావుకు కూడా ఉన్నాయి. వంశంలో ఉన్న శాపమూ, మాఫియాతో వైరమూ, అమ్మాయిల ఆకర్షణా, విపరీత వ్యాయామాలూ, డ్రగ్సూ అన్నీ కలిసి ఇతన్ని అల్పాయుష్కున్ని చేశాయి. ఇవన్నీ పరోక్షకారణాలైనప్పటికీ, ప్రత్యక్షకారణం మాత్రం ఇతనికున్న డ్రగ్స్ అలవాటు మాత్రమే.

శ్లో || తృతీయే శుభయోగేన  శుభదేశే మృతిర్భవేత్ 
పాపేన కీకటే దేశే మిశ్రైర్మిశ్ర స్తలే మృతిహి 

అన్న పరాశరుల సూత్రాన్నిబట్టి, ఇంకా -- "తృతీయగేతు చరభే మృతిస్యాత్ అన్యదేశజా" అన్న సూత్రాన్ని బట్టీ ఇతని మరణం పరులఇంట్లోనూ,  నింద్యమైన పరిసరాల్లోనూ జరిగింది.


వచ్చే పోస్ట్ లో బ్రాండన్ లీ విషయం చూద్దాం.