నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

3, జూన్ 2023, శనివారం

జూన్ 2023 పౌర్ణమి ప్రభావం - ఒరిస్సా రైలు ప్రమాదం

జనవరి 24 న  అమెరికా నుండి వ్రాసిన 'ఈ ఏడాది గందరగోళమే' అనే పోస్ట్ లో 2023 అంతా ఉండబోతున్న గ్రహస్థితిని స్థూలంగా వర్ణిస్తూ  పరిస్థితులు ఏమీ బాగులేవని చెప్పాను. దానికి ఒక ఉదాహరణే నిన్న పౌర్ణమి ఘడియలలో జరిగిన ఒరిస్సా రైలుప్రమాదం. దీనిలో దాదాపు 300 మంది చచ్చారు. 1000 మంది గాయాల పాలయ్యారు. వాస్తవాలు ఇంతకంటే ఎక్కువగా ఉండవచ్చు.

ఏప్రియల్ మే నెలలలో వచ్చే అమావాస్య పౌర్ణములు చాలా బలంగా ఉంటాయన్నది కొన్ని వందల ఏళ్లుగా మళ్ళీ మళ్ళీ రుజువౌతున్న వాస్తవం. ఆ సమయాలలో భయంకరమైన సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ జరిగింది.

ఈ సంఘటన వెనుక గల జ్యోతిష్యపరమైన విశ్లేషణను నేను ఇక్కడ చేయబోవడం లేదు. అది మా పంచవటి సభ్యులతో మాత్రమే, వచ్చే నెలనుండి మా ఆశ్రమంలో జరుగబోయే జ్యోతిష్య రిట్రీట్స్ లో చర్చించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రాక్టికల్ గా మాత్రమే మాట్లాడుకుందాం.

ప్రస్తుతం జనాభాపరంగా భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.  ఈ జనాభా చాలా తగ్గాలి. కాని అలా తగ్గించడానికి ప్రభుత్వపరంగా కఠినమైన చర్యలు తీసుకోడానికి ఇది చైనా కాదు. ఈ మనుషులు చెబితే వినే మనుషులూ కారు.

కనుక ప్రకృతే దానికి పూనుకోవాలి. పూనుకుంటుంది కూడా. గతంలో ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పి ఉన్నాను. కరోనా అలాంటిదే. అప్పుడప్పుడూ జరిగే సామూహిక ప్రమాదాలు కూడా అలాంటివే.

రైల్వేలు ప్రకృతి చేతిలో పావులుగా తమ పాత్రను ఎంతో చక్కగా ఎన్నో ఏళ్ళనుంచీ పోషిస్తున్నాయి. నేనందులోనే నాలుగు దశాబ్దాలు పనిచేశాను గనుక దాని లోతుపాతులు నాకు బాగా తెలుసు. 2005 లో వలిగొండలో జరిగిన డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ యాక్సిడెంట్ ను నేను దగ్గరుండి చూశాను. దాని సాల్వేజ్ ఆపరేషన్స్ లో పాల్గొన్నాను కూడా. నా సుదీర్ఘ రైల్వే సర్వీస్ లో చిన్నా పెద్దా ఎన్నో యాక్సిడెంట్స్ ను నేను చూచాను. ప్రత్యక్షంగా వాటి సహాయక చర్యలలో పాలుపంచుకున్నాను. రాత్రీ పగలూ తెలియకుండా ఎన్నోసార్లు పనిచేశాను. ఆ అనుభవంతో కొన్ని విషయాలు చెప్పగలను.

భారతీయరైల్వేలో సేఫ్టీ విభాగానికి కాగితాలమీద మాత్రం చాలా విలువ ఉంటుంది. కానీ ఆచరణలో అతి తక్కువ విలువనిస్తారు. సేఫ్టీ విభాగపు సూచనలన్నీ  చెత్తబుట్టకు చేరుకుంటాయి. కారణం? పంక్చువాలిటీ కోసం సేఫ్టీ త్యాగం చెయ్యబడుతుంది. గూడ్స్ రవాణాలో కూడా సేఫ్టీ తుంగలో తొక్కబడురుంది.  డైలీ వర్క్ లో, సేఫ్టీ రూల్స్ ని ఒక అడ్డంకిగా భావిస్తారు. కానీ సెమినార్స్ లో, మీటింగ్స్ లో మాటలు మాత్రం వేరేగా చెబుతారు.  

రైల్వేలో 40% లైన్స్ తమ కెపాసిటీ కంటే 100% ఎక్కువగా వాడబడుతున్నాయి. అంటే, బిజీ రూట్లలో రైళ్లు క్రిక్కిరిసి నడుస్తున్నాయి. దానికి తగినట్లు ట్రాక్స్ మరమ్మతులు, మెయింటెనెన్స్ జరగడం లేదు. అంతేకాదు, ఎడాపెడా క్రొత్తక్రొత్త రైళ్లను మొదలుపెడుతున్నారు గాని, దానికి తగినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థను, ఇతర వ్యవస్థలను మెరుగుపరచడం లేదు. పనికిరాని బోగీలతో రైళ్లు నడపడం లాంటి కక్కుర్తి పనులు చాలా జరుగుతున్నాయి. సేఫ్టీకి మాత్రం తిలోదకాలిస్తున్నారు. ఏదైనా జరిగినపుడు, ఎక్స్ గ్రేషియా పడెయ్యడం, నాలుగు రోజులు ఎంక్వైరీ అంటూ గోల చెయ్యడం, దానినుంచి ఏమీ నేర్చుకోకుండా ముందుకెళ్ళి పోవడం, అసలు కారణాలను మరుగున పెట్టి అనామకులను బలిచెయ్యడం, ఆ తరువాత మళ్ళీ మామూలే కావడం - ఇదంతా రైల్వేలో అతి సాధారణంగా జరిగే ప్రక్రియ.

'కవచ్' అనే ఒక సిస్టంను ఆ మధ్యన రైల్వే తయారు చేసి ప్రయోగాత్మకంగా పరీక్షించి కొన్ని రూట్లలో అమలు చేస్తోంది. దీని అసలు పేరు T-CAS (Train Collision Avoidance System). దీనిని రైల్వేలో టికాస్ అని పిలుస్తారు. ఇదొక పెద్ద ఫార్స్. అనేక రూట్లలో డ్రైవర్లు దీనిని ఆఫ్ మోడ్ లో పెట్టి మాన్యువల్ గా ఇంజన్లను నడుపుతున్నారు. ఏమంటే, దానిని ఆన్ మోడ్ లో ఉంచితే, ట్రాక్ మీదున్న కండిషన్స్ ను బట్టి రైలును ఒక్క వంద గజాల దూరం కూడా అది పోనివ్వదు.  అడుగడుక్కీ ఆటోమేటిక్ బ్రేక్స్ పడుతూ ఉంటాయి. ఇక పంక్చువాలిటీ ఎలా వస్తుంది? కనుక కోట్లు వెచ్చించి ఒక రూపానికి తెచ్చిన దీనిని  ప్రాక్టికల్ గా మూలన పడేశారు.

చెప్పుకుంటే ఇలాంటివే చాలా ఉన్నాయి. ప్రెస్ లోను, వేదికలపైనుంచి వీటి గురించి గొప్పగా చెబుతారు. ఆర్భాటంగా  వీటికి ప్రారంభోత్సవాలు చేస్తారు. స్టాటిస్టిక్స్ లో చూపించుకుంటారు. కానీ ఆచరణలో  ఇవన్నీ నత్తనడకలో నడుస్తుంటాయి. ఇది వాస్తవం.

రైల్వేలో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. వెరసి, సేఫ్టీ అనేదానికి రైల్వేలో ప్రాధాన్యత అతి తక్కువ అనే చెప్పాలి. ఊరకే కాగితాల మీద, యాడ్స్ లోను 'సేఫ్టీ ఫస్ట్' అంటారు గాని, వాస్తవానికి 'సేఫ్టీ లాస్ట్' అనే చెప్పాలి. అవినీతి మచ్చలు ఉన్నవాళ్లను, తమకు నచ్చనివాళ్లను, అవినీతికి 'నో' అనేవాళ్ళను, రాజకీయంగా, కులపరంగా అండదండలు లేనివాళ్లను మాత్రమే సేఫ్టీ విభాగంలో పోస్టింగ్ ఇస్తారనేది రైల్వేలో అందరికీ తెలిసిన ఇంకొక నిజం. నీతిగా నిజాయితీగా ఉన్నవాళ్లకు, వాళ్ళు సమర్థులైనా సరే, రైల్వేలో ఎదుగుదల ఉండదు. వాళ్ళను తొక్కేస్తారు. రైల్వేలో పైపై మాటలు వేరుగా ఉంటాయి, వాస్తవాలు వేరుగా ఉంటాయి.

రైల్వేలో సమర్ధత అక్కర్లేదు. తినడం, తినిపించడం, మేనేజ్ చెయ్యడం, మన కులం వాడవ్వడం ముఖ్యమైనవి. ఇవి ఉంటే చాలు. బండి నడుస్తుంది. పైగా రిజర్వేషన్లు ఒకటి. వాటిగురించి చెప్పనే అక్కర్లేదు. పనిచేసేవారు 25 మందైతే కూచుని తమాషా చూసేవాళ్ళు 75 మంది ఉంటారు. ఇటువంటి సెమీస్కిల్డ్ వర్క్ ఫోర్స్ తో, విలువలు లేని వర్క్ కల్చర్ తో, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అతిపెద్ద వ్యవస్థ సమర్ధవంతంగా ఎలా నడుస్తుంది? నడుస్తోంది అంటే అది దేవుడి దయ మాత్రమే.

మన రైల్వేని స్టడీ చెయ్యడానికి 10  ఏళ్ల క్రితం అమరావతికి వచ్చిన జపాన్ రైల్వే బృందం, మన సిస్టమ్స్ అన్నీ చూసి, మాకు దణ్ణం పెట్టి 'మీ రైల్వేని దేవుడే నడుపుతున్నాడు. ఇలాంటి కండిషన్స్ లో మీలాగా రైల్వేని నడపడం మా వల్ల కాదు. మేము 50 ఏళ్ల క్రితం వదిలేసిన టెక్నాలజీని మీరిప్పుడు వాడుతున్నారు' అన్నారు.

ప్రస్తుత ప్రమాదంలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు గుద్దుకున్నాయి. ఇదొక పెద్ద జోక్. నూట యాభై ఏళ్ళక్రితం ఉన్న ప్రిమిటివ్ రైల్వే వ్యవస్థలో కూడా ఇలాంటిది జరిగే ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు ఇండియన్ రైల్వేలో, బిజీ మెయిన్ రూట్లో జరిగింది. దీనిని బట్టి అర్ధం కావడం లేదా? రైల్వే సిస్టమ్స్ ఏ స్థితిలో ఉన్నాయో?

ఆగి ఉన్న రైలును ఇంకో రైలు గుద్దడం అంటే, దానికి కారణాలు రెండు ఉండొచ్చు. 1. హ్యూమన్ ఫెయిల్యూర్ 2. సిగ్నల్ ఫెయిల్యూర్. మొదటిదాన్ని జరుగకుండా చూసే విధంగా రెండవది డిజైన్ చెయ్యబడి ఉండాలి. అంటే హ్యూమన్ ఎర్రర్ కు ఆస్కారం ఇవ్వని విధంగా, ఫుల్ ప్రూఫ్ సిస్టం టెక్నికల్ గా ఉండాలి. ఇవి రైల్వేలో ఈనాటికీ లేవనే చెప్పాలి. ఉంటే ఇలా జరిగే ఆస్కారమే లేదు.

రెండవది - ఒక రైలు బోగీలు ప్రమాద వశాత్తూ రెండవ లైన్లో పడి ఉన్నపుడు ఆ లైన్ మీద ఇంకొక రైలు రాకుండా నిరోధించే సిగ్నలింగ్ వ్యవస్థ ఉండాలి. ఇది స్పేస్ టెక్నాలజీ యుగం. AI యుగం. నేటి టెక్నాలజీలో ఇదేమీ పెద్ద గొప్ప విషయం కాదు.  కానీ మన రైల్వేలు దీనిని కూడా చెయ్యలేకపోతున్నాయి. అంటే  టెక్నాలజీ పరంగా చాలా వెనుకబడి ఉన్నాయి. కారణాలు అనేకం. 

120 కిమీ వేగంతో మెయిన్ లైన్లో పోతున్న రైలు ఉన్నట్టుండి లూప్ లైన్లోకి మారడమే ప్రమాదానికి కారణమని రైల్వే మంత్రివర్యులు భావరహితంగా ముఖం పెట్టి మరీ  సెలవిచ్చారు. ఇంతకంటే జోక్ ఇంకోటి ఉండదు. అలా మారడానికి వీలుంటుందా? లూప్ లైన్ స్పీడ్ 30 కిమీ ఉండాలని రూల్ చెబుతోంది. 120 లో లోకో పైలట్ వస్తున్నాడంటే అది మెయిన్ లైన్ కు సెట్ చెయ్యబడి ఉండాలి. సడెన్ గా లూప్ లైన్లోకి బండి ఎలా తిరుగుతుంది? పాయింట్ దానంతట అదే మారుతుందా? ఒకవేళ SM అలా మార్చాడనుకున్నా, చివరి నిముషంలో అది సాధ్యమేనా? సర్క్యూట్ ఎలా ఒప్పుకుంటుంది? ఒకవేళ అలా జరిగే ప్రమాదం ఉంటే, ఇన్నేళ్లుగా ఈ విషయాన్ని  ఇంతమంది.ఇంజనీర్లు, అధికారులు ఎందుకు గుర్తించలేదు? 300 మంది అమాయక ప్రయాణీకులు చనిపోతే గాని ఈ విషయం అర్ధం కాలేదా? IIT ప్రాడక్ట్+IAS అయిన రైల్వే మంత్రిగారికి బుర్రుందా అలా మాట్లాడటానికి?

రైల్వేలో దురహంకారం, బాసిజం, బ్రిటిష్ కాలంనాటి పెడధోరణులు చాలా ఎక్కువ. పైగా, అర్హులు కానివారికి ఉద్యోగాలు ఇవ్వడం, రాజకీయ అండదండలున్నవారికి ఉన్నత పదవులు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. ఇన్నోవేటివ్ ఐడియాలను తీసుకోవడం ఎక్కడా ఉండదు.  పనితీరు ఢిల్లీ స్థాయి నుండి క్రిందకు నిర్దేశించబడుతుంది గాని, ఫీల్డ్ లెవల్లో ఉన్న సమస్యలను నిజంగా గుర్తించి, వాటిని పరిష్కరించే వ్యవస్థలు ఉండవు. చెప్పినా ఎవరూ వినిపించుకోరు. అడుగడుగునా అనేక అవరోధాలు, పరిమితులు ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితులున్నపుడు, ట్రాక్ ను బలపరచకుండా, సిగ్నలింగ్ వ్యవస్థను, బోగీల వ్యవస్థను బలోపేతం చెయ్యకుండా, రోజుకొక్క క్రొత్త రైలును ప్రవేశపెడుతుంటే, వాటిని తగు అర్హతా ప్రమాణాలు లేని వర్క్ ఫోర్స్ నడుపుతుంటే, ఈ ప్రక్రియ అంతటితో ప్రజల ప్రాణాలు ముడిపడి ఉంటే, ఏం జరుగుతుంది?

ఇప్పుడు జరిగినదే జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకా జరుగుతాయి. జనాభా తగ్గించబడుతుంది.

మౌలికసమస్యలను చిత్తశుద్ధితో గుర్తించి, వాటిని నిజంగా పరిష్కరించి, రైల్వేలను సమూలంగా ప్రక్షాళన చేసినప్పుడే, ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి. లేకపోతే మళ్ళీమళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఇది అందరికీ తెలుసు.

కానీ ఎవరూ ఈ పనిని చెయ్యరు. మిగతా ఎన్నో వింతల లాగే ఇది కూడా ఒక వింత.

It happens only in India ! అంతే.

read more " జూన్ 2023 పౌర్ణమి ప్రభావం - ఒరిస్సా రైలు ప్రమాదం "

14, మే 2023, ఆదివారం

ఏకనిష్ఠా లోపం

హిందువులలో ఏకనిష్టా లోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో నేను ముస్లిములను చాలా మెచ్చుకుంటాను. ఖర్మమో ధర్మమో వాళ్ళు నమ్మినదాన్ని గట్టిగా పట్టుకుంటారు.. రెండోదాన్ని దగ్గరకు రానివ్వరు. అది మూర్ఖత్వం అయినప్పటికీ, వారి ఏకనిష్ఠ మాత్రం మెచ్చుకోదగినది.

ఇకపోతే, హిందువులలో విశాలభావనలు ఎక్కువ. 'పోన్లే పాపం' అని ప్రతిదాన్నీ ఒప్పుకుంటారు. అయితే, వారిలో ఉన్న ఈ అతి విశాలత్వమే వారికి శాపంగా మారి కూచుంది. ఎలాగో చెప్తా వినండి.

మొన్నొకరోజున ఒక దేవాలయ పూజారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన నరసింహాలయ పూజారి. కానీ వాళ్ళ ఇంటి పూజామందిరంలో హిందూ దేవతలతో బాటు షిరిడీ సాయిబాబా ఫోటో  కూడా పూజలందుకుంటోంది.

అది గమనించి మేము ముఖముఖాలు చూసుకున్నాం.

మా శ్రీమతైతే, 'ఏంటండీ మీరు ఈయన్ని పూజిస్తున్నారు? అని అడగనే అడిగింది.

దానికా ఇంటి ఆడవారు, 'ఏమైంది ఆయనకూడా దేవుడేగా?' అని జవాబు చెప్పారు. 

'ఏసుక్రీస్తు కూడా దేవుడని చాలామంది అమాయకులు నమ్ముతారు. ఆయన ఫోటో కూడా పెట్టుకోండి. రేపటినుంచీ చర్చికెళ్లి పార్ధన చెయ్యండి. ఆ తర్వాత మసీదుకు వెళ్లి నమాజ్ కూడా చెయ్యండి' అందామని నోటిదాకా వచ్చింది. 

పరిచయమైన మొదటిరోజునే వీళ్లకు విశ్వరూపసందర్శనం ఇవ్వడం ఎందుకని నవ్వేసి ఊరుకున్నాము 

సామాన్యంగా వైష్ణవ పూజారులు శివలింగాన్ని శివుని ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోరు అలాంటిది వీళ్ళు ఏకంగా సాయిబాబా ఫొటోను పూజామందిరంలో పెట్టేశారు. బ్రాహ్మణ పూజారుల ఇంట్లో సాయిబాబా ఫోటోనా? ఖర్మరా దేవుడా అనిపించింది. వీళ్ళ అమాయకత్వానికి, దిగజారుడుతనానికి చాలా జాలేసింది.

'నరసింహస్వామి ఉపాసనలోని అద్భుతాలు అర్ధమైతే వీళ్ళు ఇలా ఎందుకుంటారు?' అనిపించింది. 

నేటి పూజారులు ఉద్యోగులయ్యారు. వ్యాపారులయ్యారు. దళారులయ్యారు. ఉపాసకులు మాత్రం కాలేకపోతున్నారు. అందుకే ఇలా ఉంది. వాళ్ళు పూజిస్తున్న దేవత వాళ్ళకు ప్రసన్నమై ఉండాలి. పిలిస్తే పలికేలాగా ఉండాలి. అప్పుడు ఇంతమందిని పూజించే పని ఉండదు.

పూజారులే ఇలా ఉంటే, ఇక సామాన్య హిందువులకు వీళ్ళేం చెప్పగలుగుతారు? పూజారులూ చెప్పక, స్వామీజీలూ చెప్పక,  గురువులూ చెప్పక, ఎవరూ చెప్పక, మరోపక్క పరాయి మతాల ప్రలోభాలు ప్రచారాలతో సామాన్య హిందువు ఏమవుతాడు? ఎవడేది చెబితే దానిని నిజమనుకుంటాడు. అందుకే పరిస్థితి ఇలా ఉంది.

నాకేమీ సాయిబాబా అంటే ద్వేషం లేదు  ఈ సంగతి ఇంతకు ముందు కూడా చాలాసార్లు వ్రాశాను. కానీ ఆయన్ని దేవుడిని చేసి కూచోబెట్టి గుడులు కట్టి పూజలు చెయ్యడం తప్పని అంటాను. ఆయనొక ముస్లిం సాధువు. ఇంకా చెప్పాలంటే, 'సాధువు' అనికూడా ఆయనను అనకూడదు.  ఆయనకు చాలా కోపం ఉండేది. కాబట్టి ఆయనొక ఫకీరు. అంతే. అంతవరకే ఆయన్ను గౌరవిద్దాం. దానికి మించి అవసరం లేదని నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయానికి ధార్మిక, చారిత్రక, వాస్తవిక ఆధారాలున్నాయి.

హిందూమతం ఇలాగే రానురాను భ్రష్టు పడుతోంది.

ఇంతకీ సాయిబాబాను నమ్మేవాళ్లు చెప్పే కారణాలేంటి? 'అనుకున్న పనులు అవుతాయి. గురువారం గుడికెళ్తే చాలు అన్నీ బాబానే చూసుకుంటాడు' అంటారు. ఇంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి లేదని నేనంటాను.

పనులు కావడానికి పరాయి మతాల సాధువులను నువ్వు పూజించనక్కరలేదు. అలా ఆలోచిస్తున్నావంటే అసలు  హిందూమతపు మూలసిద్ధాంతాలే నీకర్ధం కాలేదని అర్ధం. పల్లెటూరిలో పోలేరమ్మను నమ్మినవాడికి కూడా పనులు అవుతాయి. ఎన్నో నిదర్శనాలు పల్లెటూర్లలో ఈనాటికీ ఉన్నాయి.  అసలు ఏ దేవుడిని నమ్మని నాస్తికుడికి కూడా పనులు అవుతాయి. తన మీద తన నమ్మకమే వాడికి రక్ష.

దేవుడి విలువ నీ పనులు కావడం మీద ఆధారపడి లేదు. అలా ఉందని భావించే చవకబారు మనుషులే రోజుకొక దేవుడిని మారుస్తుంటారు మతాలు మారుతుంటారు ఎన్ని చేసినా వాళ్ళు చివరకు 'అడుక్కునే వాళ్ళు' గానే ఉండిపోతారు గాని ఆధ్యాత్మికంగా ఎదగలేరు.

అడుక్కునేవాడు అంతేకదా? 'ఆ బజార్లో అడుక్కుంటే బాగా తిండి దొరుకుతుంది, ఈ బజార్లో దొరకదు' అనుకుని పదిబజార్లు తిరుగుతూ చివరకు బేజారై పోతూ ఉంటాడు. వాడు తినే రెండుముద్దల తిండికి ఏ బజారైనా ఒకటే అన్న సంగతి వాడికి అర్ధం కాదు. ఈలోపల వాడి ఆత్మగౌరవం హరీమంటుంది.. ఆఫ్ కోర్స్ ఆడుక్కునేవాడికి ఆత్మగౌరవం ఎక్కడేడుస్తుంది గనుక?

పరమతసహనం పట్లుతప్పి మరీ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. పరమత సహనం మంచిదే. కాదనను. కానీ పరాయిమతాల సాధువులను ఫకీర్లను మన దేవుళ్ళుగా చేసుకోవడం మాత్రం నా దృష్టిలో ఆత్మద్రోహమే కాదు, ధర్మద్రోహం కూడా. వాళ్ళను గౌరవిద్దాం. కానీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుదాం. మన నమ్మకాలను, మన ధర్మాన్ని మనం వదలకుండా ఉందాం. అదీ అసలైన హిందుత్వమంటే !

ఈ సున్నితమైన విభజనరేఖను మర్చిపోతున్నంతవరకూ హిందువులలో ఆధ్యాత్మిక చైతన్యం గాని, ఔన్నత్యం గాని,  ఏనాటికీ రాదనేది నా నమ్మకం.

ఏకనిష్ఠ లేకపోవడమే దీనికంతటికీ గల ప్రధానమైన కారణం.

ఇతర మతస్తులు హిందువులను చూసి నవ్వుతున్నారంటే నవ్వరూ మరి !

నేడొకటి, రేపొకటి, ఎల్లుండి ఇంకొకటి. మీలో ఏకనిష్ఠ ఏదీ?

read more " ఏకనిష్ఠా లోపం "

12, మే 2023, శుక్రవారం

మన ఆశ్రమానికి విజిటర్స్ ని తీసుకురావచ్చా?

ఆశ్రమ నిర్మాణం నిరాడంబరంగా, చురుకుగా ముందుకు సాగుతోంది.

మొన్నీ మధ్యన ఒక శిష్యుడు ఆశ్రమ సందర్శనానికి వచ్చాడు అదీ ఇదీ మాట్లాడి వెళుతూ, 'అప్పుడప్పుడూ తెలిసినవాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చా?' అని అడిగాడు

'అంటే ఎవరు?' అడిగాను

'అంటే, దగ్గర్లో ఉన్న క్షేత్రాలు అవీ చూడటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇటు కూడా తేవచ్చా?' అన్నాడు

తను కారు ఓనర్ కం డ్రైవర్ గా పని చేస్తుంటాడు అందుకని అలా అడిగాడు 

'నువ్వెవరినీ తేవద్దు, అలా తేవడానికి ఇదేమీ  పిక్నిక్ స్పాట్ కాదు. ఇక్కడికి వచ్చే అర్హతా అదృష్టమూ ఉన్నవాళ్లు వాళ్ళే వస్తారు. మనకు మార్కెటింగ్ అవసరం లేదు' అని చెప్పాను

మా ఆశ్రమం సీరియస్ గా సాధనామార్గంలో నడిచేవాళ్ళకోసం  ఉద్దేశించబడింది గాని, కాలక్షేపం కోసం పుణ్యక్షేత్రాలు, పిక్నిక్ స్పాట్లు తిరిగేవాళ్ళ కోసం, ఫేన్సీ దీక్షలు తీసుకుని ఉత్తమాటలు చెప్పేవాళ్ళ కోసం పెట్టబడింది కాదు.

వారం క్రితం ఇంకొకాయన హిమాలయాల నుంచి ఫోన్ చేశాడు

'నేను గణపతిముని గారి సంప్రదాయానికి చెందినవాడిని ఆయన ప్రశిష్యుల దగ్గర దీక్షలు తీసుకున్నాను. పాతంజల యోగశాస్త్రాన్ని బోధిస్తుంటాను.  మీరు రాసిన ఛిన్నమస్తా సీరీస్ చదివాను. చాలా బాగున్నాయి. వేదాన్ని తంత్రాన్ని సమన్వయం చెయ్యడం అపురూపం. అది మీ రాతలలో కనిపిస్తోంది. మీకు నమస్కారాలు చెబుదామని ఫోన్ చేస్తున్నాను' అన్నాడు

'మంచిది. ప్రస్తుతం మీరెక్కడనుంచి మాట్లాడుతున్నారు' అడిగాను

'హిమాచల్ ప్రదేశ్ లో మెక్లియోడ్ గంజ్ కు ఇంకా పైన బాక్స్ నాధ్ అనే ప్రదేశం ఉంది. ప్రతి ఏడాదీ కొన్ని నెలలపాటు నేనిక్కడ ఉంటూ  సాధన చేసుకుంటూ ఉంటాను మీరు అనుమతిస్తే ఆంధ్రాకు వచ్చినపుడు మీ  ఆశ్రమంలో ఉండి కొన్నాళ్లపాటు సాధన చేసుకోవచ్చా?' అడిగాడు

'నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇది సాధనాశ్రమమే, సాధకుల కోసం ఉద్దేశించబడినదే' అని చెప్పాను 

'బ్రాహ్మణులలో మార్షల్ ఆర్ట్స్ తక్కువగా  కనిపిస్తాయి. మీకు అవి కూడా వచ్చని చదివాను. వేలాది ఏళ్ల క్రితం ద్రోణాచార్యుడు మొదలైన గురువులు వాటిని నేర్పించేవారు. కానీ ప్రస్తుతం అలాంటివారు లేరు. మీ గురించి చదివి సంతోషం వేసింది. ఎన్నాళ్ళుగా అభ్యాసం చేస్తున్నారు?' అడిగాడు.

'గత నలభై ఏళ్లుగా' అన్నాను

'మీ మార్గాన్ని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవచ్చా?' అడిగాడు.

'దానికేమి? నా పుస్తకాలలో ఉంది, చదవండి, అర్ధమౌతుంది లేకపోతే, ఇక్కడకు వచ్చి నాతో ముఖాముఖీ మాట్లాడి తెలుసుకోవచ్చు' అన్నాను

'తప్పకుండా త్వరలో వస్తాను' అన్నాడు

'ముందుగా ఫోన్ చేసి రండి, నేను ఎటన్నా వెళ్లి ఉంటే మీరు నిరాశపడతారు' అని చెప్పాను

నిజమైన సాధకులకు మా ఆశ్రమద్వారాలు  ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కుతూహలపరులకు, కాలక్షేపరాయుళ్లకు మాత్రం తెరుచుకోవు.

మాది సాధనాశ్రమమే గాని సరదా ఆశ్రమం కాదు. అదే మాటను వాళ్ళతో చెప్పాను.

read more " మన ఆశ్రమానికి విజిటర్స్ ని తీసుకురావచ్చా? "

1, మే 2023, సోమవారం

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన

నిన్న వైశాఖ శుద్ధ దశమి.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా పిలువబడే బ్రహ్మంగారు సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఈ సంఘటన 1693 CE లో జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ బ్రహ్మంగారి భక్తులు ప్రతి ఏడాదీ ఈ రోజున బ్రహ్మంగారి ఆరాధనను చేస్తారు. 

ఇక్కడ దొడ్డవరం గ్రామంలో బ్రహ్మం గారి భక్తులు చాలామంది ఉన్నారు. బ్రహ్మం గారి గుళ్ళు రెండు మూడున్నాయి. వాటిలో పాత గుడిలో నిన్నంతా ఆరాధనలు జరిగాయి. మొన్న రాత్రి బ్రహ్మంగారి పద్యనాటకం వేశారు. కుల మత భేదం లేకుండా, ఊరి జనాభా మొత్తానికీ రెండుపూటలు అన్నసంతర్పణ చేశారు.

ప్రసుతం మేము అద్దెకుంటున్న ఇంటివాళ్ళ పెద్దబ్బాయి ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ళ నుంచీ జరిపిస్తున్నాడు. ఇది ఎంతో మంచి విషయం. నాకు బాగా నచ్చింది.

ఒక మహాయోగిగా బ్రహ్మంగారిని నా చిన్నప్పటి నుంచీ నేను ఎంతో గౌరవిస్తాను. బ్రహ్మంగారి గురించి నేను మొదటిసారిగా 1976 లో తెలుసుకున్నాను. అప్పటికి ఒక ఏడాది ముందు 1975 లో రాజమండ్రిలో కొన్ని యోగాసనాలను 12 ఏళ్ళ వయసులో నేర్చుకున్నప్పటికీ, మొదటిసారిగా అన్ని ఆసనాలను ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర‘ అనే పుస్తకంలోనే 1976 లో చూశాను. అభ్యాసం మొదలుపెట్టాను. అప్పట్లోనే పల్లెటూర్లలో రాత్రంతా ప్రదర్శించే బ్రహ్మంగారి నాటకాన్ని చూడటం, ఆయన జీవితచరిత్రను చదవడం జరిగింది. యోగసాంప్రదాయంతో నా పరిచయం అలా మొదలైంది. అప్పటికీ ఇప్పటికీ 45 ఏళ్ళు గడిచాయి. నా యోగసాధన అనేక పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది. బ్రహ్మంగారి పైన నా గౌరవం  కాలంతో బాటు పెరుగుతూ వచ్చింది.

నేడు, మా ఆశ్రమం వచ్చిన దొడ్డవరం గ్రామంలో చూస్తే, బ్రహ్మంగారి గుడులు  మూడున్నాయి. ఆయన ఆరాధనను నిష్ఠగా చేసే గ్రామస్తులున్నారు. బ్రహ్మంగారి గుడి ఉన్న బొడ్డురాయి ప్రక్కనుంచే మా ఆశ్రమానికి పోయే దారి ఉంటుంది. ఇదంతా కాకతాళీయం కాదని నేను నమ్ముతున్నాను. 

బ్రహ్మంగారి చరిత్రను పరిశీలిస్తే, ఆయన తన సంచారంలో భాగంగా అద్దంకి, ధేనువకొండలకు వచ్చినట్లు తెలుస్తున్నది. ధేనువకొండ గ్రామం మాకు కేవలం పది నిముషాల దూరం మాత్రమే.

NTR తీసిన బ్రహ్మంగారి చరిత్ర సినిమాను నేను 1984 లో గుంతకల్ లో చూశాను. ఆ సినిమా షూటింగ్ రాయలసీమలోనే జరిగింది. ఆ షూటింగ్ లో నా తోటి ఉద్యోగులు కొంతమంది నటించారు కూడా. షూటింగ్ చూద్దామని వాళ్ళు కందిమల్లాయపల్లి వెళితే, నటులు తక్కువయ్యారని గ్రామస్తులుగా వేషాలు వీళ్ళకే వేయించి వీళ్ళనే  సినిమాలో పెట్టాడు NTR. ఆ సినిమాకు నేను పోయిన రోజున, గుంతకల్ లో ఉండే శ్రీ శంకరానందగిరి స్వాములవారు కూడా సినిమాహాలుకు వచ్చి బాక్స్ లో కూచుని ఆ సినిమాను చూచారు. నేను దర్శించిన బ్రహ్మజ్ఞానులలో ఆయన ఒకరు.

అయితే ఆ సినిమా నన్ను నిరాశపరచింది. NTR కు తోచిన రీతిలో ఆ సినిమా వాస్తవ వక్రీకరణకు గురయింది. అది నాకు నచ్చలేదు. జనాకర్షణ కోసం చరిత్రను మార్చాడాయన. 'అతి'నటన కూడా చేశాడు. అందుకే ఆ సినిమాను రెండవసారి నేను చూడలేదు. ఆ సినిమాను ఇంకా బాగా, వాస్తవాలకు దగ్గరగా తీసి ఉండవచ్చుననేది నా అభిప్రాయం. 

తరువాత నేను గుంటూరు డివిజన్ లో పనిచేసినప్పుడు, నంద్యాల యర్రగుంట్ల లైన్ వేస్తున్న సమయంలో, బనగానపల్లెలో బ్రహ్మంగారి సమాధిని దర్శించాను. వారి వంశస్తులను చూచి నిరాశ చెందాను. కారణం? ఆయన శక్తి వారిలో కనిపించకపోవడం.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమన్వయం చేసి  ఆచరణాత్మకమైన సిద్ధమార్గాన్ని రాయలసీమలోను, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల లోని పల్లెపట్టులలోను బహుళ ప్రచారం చేసిన మహాయోగిగా బ్రహ్మంగారిని నేను అమితంగా గౌరవిస్తాను. హిందూమతం యొక్క ఆచరణాత్మక యోగవిధానాలు గ్రామ్యప్రాంతాలలో ఇంకా బ్రతికి ఉన్నాయంటే అది బ్రహ్మంగారి చలవే. మా మార్గం కూడా అదే కాబట్టి మా ఆశ్రమంలోని ధ్యానమందిరంలో బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచబోతున్నాను. 

బ్రహ్మంగారిని ఆరాధించినంత వరకూ, SC, ST, BC లను క్రైస్తవం తాకలేకపోయింది. ఆయనను మరచిన తర్వాతనే పల్లెల్లో అది ఎక్కువైంది. ఇది వాస్తవం.

బ్రహ్మంగారి తత్త్వాలన్నా, బ్రహ్మంగారి నాటకమన్నా నాకు చాలా ఇష్టం. అందుకే మొన్న రాత్రి తెల్లవారుజాము 4 వరకూ, ఎద్దులబండి వేదికగా  ఇక్కడ సాగిన ఆ పద్యనాటకం నాకు చాలా ఆనందాన్ని కలిగించి, నా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది. తెలుగునాట పల్లెటూర్ల జీవితాన్ని మళ్ళీ ఆస్వాదించే అవకాశం ఇన్నాళ్ళకు మళ్ళీ నాకు ఈ విధంగా లభించింది.

పండితులలాగా ఉత్తమాటలు ఉపన్యాసాలు చెప్పడం కాకుండా, దైవశక్తిని, అమానుష యోగశక్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపి, కుల మతాలకు అతీతమైన వేదాంతతత్త్వాన్ని ఆచరణలో నిరూపించిన మహాయోగి - బ్రహ్మంగారు. అసలైన హిందూమతాన్ని నిలబెట్టినది ఇటువంటి మహనీయులే. సాంఖ్యము, తారక రాజయోగము, అమనస్కము, కుండలినీ యోగములకు ఆయన జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.

అయితే, ఉత్తగా ఏడాదికొకసారి ఆయన ఆరాధనను చేసి ఊరుకోవడమో, లేదా ఆయనను తమ కులానికే పరిమితమైన మహనీయునిగా భావించి ఒక గుడి కట్టి ఒదిలేయడమో నేను హర్షించను. ఆయన చూపిన సమగ్రమైన యోగమార్గంలో నడచి ఆయా సమాధిస్థితులను డైరెక్ట్ గా అందుకోవడము, ఆయా అమానుష యోగశక్తులను సాధించి, అవసరమైతే ప్రదర్శించి చూపగలగడమే ఆయనకు మనం చేయగల అసలైన ఆరాధన అని నేను నమ్ముతాను. దానినే మా ఆశ్రమంలో అనుసరిస్తున్నాము. బోధిస్తున్నాము.  

ఆయన చూపిన యోగమార్గంలో నడుస్తున్న మేము, ఆయన ఆరాధింపబడుతున్న గ్రామానికి, ఆయన సంచరించిన ప్రాంతానికి చేరుకోవడం ఆయన అనుగ్రహం గానే భావిస్తున్నాను.

అందరూ నమ్ముతున్నట్లు వేమనయోగి రెడ్డికులానికి ప్రతీక అని, బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి ప్రతీక అని నేను నమ్మను. వారిది యోగికులం. అది కులమతాలకు అతీతమైన ఋషికులం. నిజమైన మహనీయులందరిదీ అదే కులం.

అందుకనే, ఆచరణాత్మక యోగసాధనకు పెద్దపీటను వేసే మా ఆశ్రమంలో, శ్రీ రామకృష్ణులవారు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లతో బాటు, బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించబోతున్నాము. 

ఇదే మేము చేయబోతున్న బ్రహ్మంగారి ఆరాధన. ఈ ఆరాధన ఏడాది కొకసారి జరిగేది కాదు. అనుక్షణం జరిగేది. ఇదే అసలైన ఆరాధన అనేది మా నమ్మకం.

read more " శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన "

29, ఏప్రిల్ 2023, శనివారం

పరలోకం - నిత్యజీవం

క్రైస్తవ విషబోధలు తలకెక్కితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ ఈ మధ్యనే కెన్యాలో జరిగింది. Good News International Ministries అనే క్రైస్తవ సంస్థను స్థాపించిన పాల్ మెకంజీ తెంగే అనే పాస్టర్ ను ఈ నెల 15 వ తేదీన అరెస్ట్ చేశారు. కారణం? తిండీ నీళ్ళూ మానేసి చనిపోయేదాకా అలాగే ఉపవాసం ఉంటూ క్షీణించి క్షీణించి చనిపోతే, సరాసరి జీసస్ దగ్గరకు వెళతారని నూరి పోసి చాలామందిని ఈ పాస్టర్ చంపేశాడు. ఇతనికి 6౦౦ ఎకరాల చర్చ్ ప్రాపర్టీ ఉంది. అందులో పోలీసులు వెతుకుతుంటే ఎక్కడికక్కడ శవాలను పాతిపెట్టిన దిబ్బలు ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. ఇప్పటికి కనీసం 100 శవాలను తవ్వి తీశారు. వాటిలో ఎక్కువమంది చిన్నపిల్లల శవాలే ఉన్నాయి. వాళ్ళందరూ ఇతని మాటలు నమ్మి, తిండీ నీళ్ళూ మానేసి, క్షీణించి చనిపోయినవారే. 

2003 కు ముందు ఒక కారు డ్రైవరుగా పనిచేసిన ఈ పాల్ మెకంజీ, 2003 లో ఈ మిషనరీ సంస్థను స్థాపించి అతి త్వరలో వేలాదిమందిని ఆకర్షించాడు. ఇతని బోధనలు ముఖ్యంగా Dooms Day చుట్టూ తిరిగేవి. అంటే, త్వరలో భూమి అంతం కాబోతున్నదని, జీసస్ ను నమ్మితే స్వర్గానికి వెళతారని, లేకపోతే నరకమే గతి అని నూరిపోసే బోధలన్నమాట. ఆ విధంగా భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి, జీసస్ ను నమ్మేలాగా చెయ్యడం ఈ ప్లాన్ లో ఒక భాగం. ఇదే పిచ్చి ఇంకా ముదిరితే, చివరకు ఈ రకంగా సూయిసైడ్ చేసుకుని జీసస్ దగ్గరకు చేరుకోవాలని విషబోధలు ఈ క్రమంలో బోధిస్తారు. 

చెప్పగా చెప్పగా అబద్దాలను కూడా నిజాలుగా ఒప్పించవచ్చు. అమాయకులకు బ్రెయిన్ వాష్ చెయ్యవచ్చు. క్రైస్తవ పిడివాదులు గాని, ఇస్లామిక్ టెర్రరిస్టులు గాని తయారయ్యేది ఇలాగే.

ఇంతమంది అమాయకుల చావులకు కారకుడైన పాస్టర్ పాల్ మెకంజీ, అందరినీ ముందుగా పరలోకానికి పొమ్మని, తను మాత్రం చివరలో వస్తానని వాళ్ళకు చెప్పేవాడు. ఎందుకంటే, చివరలో తను స్వర్గం గేట్లు మూయాలట. లేకపోతే పాపులు లోపలికి వచ్చేస్తారట. ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టేవాడు. ఇతని బోధలను నమ్మిన గొర్రెలు తమ ఆస్తులన్నీ అమ్మి ఇతని సంస్థకు డొనేషన్ క్రింద ఇచ్చేసేవారు. ఆ తరువాత పస్తులుండి చనిపోయేవారు. ఈ విధంగా అతను బాగా ఆస్తులను కూడబెట్టి కోట్లకు పడగలెత్తాడ. ఇప్పుడు అరెస్టయ్యాడు.

ఆ వివరాలన్నీ నెట్లో దొరుకుతాయి. ఇతనికి ఒక యుట్యుబ్ చానెల్ కూడా ఉంది. చూడండి. అర్ధమౌతుంది. అయితే, నేను చెప్పాలనుకున్నది అది కాదు. ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పాలనుకున్నాను.

ఒకటి, అమాయకులైన ప్రజలు ఏ విధంగా గొర్రెలుగా మారి ఇలాంటి పాస్టర్ల మాయలో పడుతున్నారు అనే విషయం.

రెండు, అసలు బైబిలు బోధల లోనే ఉన్న అబద్దాలు, లోపాలు ఏమిటన్న విషయం. ఈ రెండు విషయాలు నేను చెప్పబోతున్నాను.

కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో పేదరికం, చదువులేనితనం ఉంటాయి. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో ఇవి ఉన్నాయి. అటువంటి చోట్ల క్రైస్తవ పాస్టర్ల కళ్ళు పడతాయి. డబ్బు ఎరవేసి బైబిల్ అబద్దాలు అమాయకులకు నూరిపోస్తారు. మతాలు మారుస్తారు. సమాజంలో చిచ్చు రేపుతారు. ఇది ఇండియాలో ముమ్మరంగా జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రలో చాలా ఎక్కువగా జరుగుతున్నది. ఇక్కడ ప్రతి పల్లెలోనూ కనీసం రెండు చర్చిలున్నాయి. మైకులు మారు మోగుతున్నాయి. కాకమ్మ కబుర్లను పాస్టర్లు బాగా నూరిపోస్తున్నారు. వెర్రి గొర్రెలు నమ్మేస్తున్నారు.

ఈ పాస్టర్లు చెప్పే ముఖ్యమైన బోధ, పరలోకం, నిత్యజీవం అనేవి. పరలోకం అనేది ఒకటి ఉందని, జీసస్ ను నమ్మితే అక్కడకు పోతారని, అక్కడ నిత్యజీవం ఉంటుందని పచ్చి అబద్దాలను పాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా అమాయకులకు నూరిపోస్తున్నారు. ఇవన్నీ అబద్దాలే. అవే నిజాలైతే, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులేంటి?

1. క్రైస్తవం పుట్టి కేవలం రెండువేల సమత్సరాలు మాత్రమే అయింది. భూమి పుట్టి నేటికి 454 కోట్ల సంవత్సరాలైంది. మరి జీసస్ పుట్టకముందు ఉన్న కోట్లాది మనుషులందరూ నరకానికే పోయారా? ఇది నమ్మదగిన విషయమేనా?

2. నేటికీ ఇజ్రాయెల్ దేశంలో జీసస్ ను నమ్మరు. అక్కడ ఓపన్ గా క్రైస్తవాన్ని బోధిస్తే జైల్లో పెడతారు. మరి ఇజ్రాయెల్ దేశస్తులందరూ నరకానికే పోతారా? అప్పుడు వాళ్ళు నమ్ముతున్న యెహోవా ఏం చేస్తాడు మరి?

3. క్రైస్తవం తెలియనివారు, దానిని అనుసరించని ఇతర మతస్తులు, నాస్తికులు  ఎక్కడికి పోతారు? 

4. క్రైస్తవబోధలు నిజాలైతే, ఇజ్రాయెల్ దేశం ఈనాటికీ జీసస్ ను ఎందుకు నమ్మడం లేదు?

అసలు విషయమేమంటే, క్రైస్తవం చెబుతున్న శాశ్వత పరలోకం అనేది ఎక్కడా లేనేలేదు. అది అబ్రహామిక్ మతాలు సృష్టించిన పచ్చి అబద్దం మాత్రమే.

హిందూమతం ప్రకారం, స్వర్గ నరకాలనేవి తాత్కాలికమైన లోకాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఇవి మరణానంతర స్థితులు మాత్రమే. పుణ్యం చేస్తే స్వర్గం, పాపం చేస్తే నరకం కొంతకాలం పాటు ఉంటాయి. అవి అనుభవించిన తర్వాత మళ్ళీ  కర్మానుసారంగా జన్మ ఉంటుంది. ఈ విధంగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని అందుకునేటంత వరకూ జననమరణ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది మన సనాతన ధర్మం చెబుతున్న సత్యం.  అంతేకాదు, బౌద్దమూ జైనమూ కూడా ఇదే చెబుతాయి. ఇది మాత్రమే సత్యం. అంతేగాని, జీసస్ ని నమ్మితే స్వర్గం, లేకపోతే శాశ్వత నరకం అనేవి బూటకాలు, పచ్చి అబద్దాలు మాత్రమే. కానీ ఈ అబద్దాలను కోట్లాదిమంది నిజాలని నమ్ముతున్నారు. గొర్రెలుగా మారుతున్నారు. దీనికి కారకులు పాల్ మెకంజీ వంటి దొంగ పాస్టర్లు. ఇది వాళ్ళ వ్యాపారం.

ఈ పాల్ మెకంజీకి పెంటకోస్ట్ డినామినేషన్ తో సంబంధాలున్నాయి. ఇది తీవ్రమైన భావాలున్న సంస్థ. వీరిలో చాలామంది రోగమొస్తే మందులు వాడరు. జీసస్ తగ్గిస్తాడని మూర్ఖంగా నమ్ముతారు. 

ముప్పై ఏళ్ళ క్రితం మా దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఇదే విధంగా నమ్ముతూ, తనకు గుండెజబ్బు వచ్చినా మందులు వేసుకోకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా, జీసస్ రక్షిస్తాడని చెబుతూ అర్ధాంతరంగా చనిపోయాడు. పెంటకోస్ట్ మిషన్ గురించి వారి నమ్మకాల గురించి నాకప్పుడే మొదటిసారి తెలిసింది.

పోతే, పాల్ మెకంజీ దృష్టిలో ఇతను చెప్పేదే అసలైన క్రైస్తవమతం. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో ప్రచారంలో ఉన్న క్రైస్తవం అసలైన క్రైస్తవం కాదని ఇతను బోధిస్తాడు. రోగాలు వస్తే మందులు వేసుకోవడం పాపమని, మొబైల్, కంప్యూటర్ వంటి మోడరన్ పరికరాలు వాడకూడదని, అమెరికా వంటి దేశాలు సైతాన్ అనుచరులని ఇతను బోధించేవాడు. సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేది తీసుకోవద్దని, అది Seal of the Beast  అని ఆ గొర్రెలకు ఎక్కించేవాడు. అందుకే, ఓటర్ లిస్టులో నమోదు కూడా చేసుకోకుండా తన బోధలను వినే గొర్రెలకు నూరిపోసేవాడు. చివరకు  తిండీ నీళ్ళు మానేసి ఆత్మహత్యలు చేసుకోమని అదే జీసస్ ను చేరుకునే అసలైన దారి అని వాళ్ళను హిప్నటైజ్ చేశాడు. నమ్మించాడు. వాళ్ళందరూ చచ్చారు. ఇతను మాత్రం హేపీగా ఉన్నాడు.

అసలీ Seal of the Beast అంటే ఏమిటి? ఇది బైబిల్ లోని ప్రకటనల గ్రంధం (Revelations Chapter) లో ఉంటుంది. ఈ చాప్టర్ 66 CE ప్రాంతంలో వ్రాయబడింది. ఇది రాజకీయపరంగా వ్రాయబడిన అబద్దపు వ్రాతలే గాని నిజాలు కావు.

ఎలా అంటే, అప్పట్లో నీరో చక్రవర్తి రోం ను పాలించేవాడు. ఇతని బొమ్మతో నాణేలు చలామణీలో ఉండేవి. పాతకాలంలో రాజులందరూ తమ తమ బొమ్మలతో నాణేలను ముద్రించేవారు. ఇది మామూలే. అయితే, రోమన్ల ఏలుబడిలో ఉన్న యూదులు యెహోవా పిచ్చిలో ఓల్డ్ టెస్టమెంట్ మాయలో పడి, దీనిని వ్యతిరేకించారు. నీరో చక్రవర్తి బొమ్మ ఉన్న నాణేలను Seal of the Beast గా వాళ్ళు వర్ణించారు. అయితే, డైరెక్ట్ గా దీనిని వ్యతిరేకిస్తే రాజు చేతిలో చావు తప్పదు కనుక, మార్మిక భాషలో అర్ధం అయ్యీ కానట్టుగా దీనిని వ్రాసి, 'ప్రకటనల గ్రంధం' అని దీనికి పేరు పెట్టారు. దీనిని నేటి క్రైస్తవులు దైవాదేశంతో వ్రాయబడిన ప్రకరణంగా భావిస్తూ మోసపోతున్నారు.

ఇలాంటి తెలిసీ తెలియని బోధలను చేస్తూ జనాలను చీకటి యుగాలలోకి తీసుకుపోతున్న క్రైస్తవ పాస్టర్లు నేడు ఇండియాలో కూడా లక్షలాది మంది ఉన్నారు. ఇటువంటి పిచ్చి బోధలను నమ్మి పిచ్చోళ్లుగా మారుతున్న అమాయకులు కోట్లల్లో ఉన్నారు 

పాప్ మెకంజీ ఈ బోధలను క్రొత్తగా చెయ్యడం లేదు. 2016 లో కూడా ఇలాగె చేసి కొన్ని వందల మందిని ఇదే విధంగా ఉపవాసాలుండమని ప్రేరేపించి, వాళ్ళ చావులకు కారకుడయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ చేశాడు. ఈ విధంగా జనాభాని తన వంతు కృషితో తగ్గిస్తున్నాడన్న మాట.

ఇటువంటి విషప్రచారాలు చేస్తున్నవారిని చట్టపరంగా నిరోధించవలసిన అవసరం ప్రతి దేశంలోనూ, ముఖ్యంగా ఇండియాలో చాలా ఉన్నది. లేదంటే నిన్న కెన్యాలో జరిగిన ఇటువంటి సంఘటనలే  రేపు ఇండియాలో కూడా జరిగే ప్రమాదం ముందు ముందు ఉన్నదనేది వాస్తవం. 

రూల్ ఆఫ్ లా లేనంతవరకూ ఇలాంటి వెఱ్ఱి పోకడలు తప్పవనేది కూడా వాస్తవమే. 

మతమార్పిడి నిరోధకచట్టం ఇండియాలోని ప్రతి రాష్ట్రంలోనూ కఠినంగా అమలు కావలసిన అవసరం ఉన్నది. అంతేకాదు, సక్రమమైన రీతిలో హిందూమతాన్ని హిందూసంస్థలు అందరికీ ప్రచారం చెయ్యవలసిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే Dooms Day అనేది త్వరగా రావడానికి ఇటువంటి విషబోధనలే కారణాలు అవుతాయి.

read more " పరలోకం - నిత్యజీవం "

25, ఏప్రిల్ 2023, మంగళవారం

దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు

ఈరోజు మంగళవారం.

నేడు దొడ్డవరం ఊరిలో ఉన్న లక్ష్మినరసింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. అర్చకులు నరసింహాచార్యులు గారు, నడివయసు దాటిన మనిషి. మా వివరాలు విని చాలా సంతోషించారు. 'ఈ ఊరికి మేమొచ్చి పది రోజులైందని, ఊరిలో అతి ప్రాచీన ఆలయం ఏమిటి? అని వాకబు చేస్తే నరసింహస్వామి గుడి అని చెప్పారని, అందుకని ఈ ఆలయానికి నేటికి వచ్చి దర్శనం చేసుకోగలిగామ'ని ఆయనతో అన్నాను.

ఆలయంలో ఎవరూ లేరు. ఇతర గ్రామస్తులు సామాన్యంగా ఈ ఆలయానికి రారని తెలిసింది. ఎందుకంటే, ఇక్కడ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారట. ఇది పెద కమ్మవారి అధ్వర్యంలో నడుస్తున్న ఆలయం. విశాలంగా, శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. అంకమ్మతల్లి గుడి అయితే, మొక్కులు, బలులు మొదలైన వాటితో గ్రామ్యపంధాలో ఉంది. దానికి విభిన్నంగా నరసింహస్వామి ఆలయం, వైదిక సాంప్రదాయ విధానంలో శుచిగా ఉన్నట్లుగా అనిపించింది. ఇక్కడి 'ఆరా' కూడా చాలా బాగుంది.

వచ్చే నెల 4. 5 తేదీలలో సరసింహ జయంతి జరుగుతుందని, రోజంతా పూజలు, భజనలు ఉంటాయని, రమ్మని ఆచార్యులు అన్నారు. 'అలాగే వస్తామని' అంటూ, 'జనం వచ్చే పర్వదినాలలో కంటే, రాని మామూలు రోజులే మాకు బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఆలయంలో  ఒక్కడినే కూర్చుని జపధ్యానాలు అనుష్టానము చేసుకోవచ్చా?' అని అడిగాను.

'బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంతకంటే కావలసింది ఏముంది? వచ్చి చేసుకోండి' అని ఆయన అన్నారు.

'ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తన జరుగుతుంది. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకూ ఉంటుంది. ఆడవాళ్ళ సంకీర్తనా బృందం ఉంది. వాళ్ళు చాలా బాగా భజన చేస్తారు. మీరూ వచ్చి పాల్గొనండి' అని ఆహ్వానించారు.  

'మా ఆశ్రమంలో కూడా ప్రతి ఏకాదశికి రామనామ సంకీర్తనం మొదలుపెట్టి చెయ్యబోతున్నాము. అయినా, ఇక్కడకు కూడా వస్తాను' అని  ఆయనతో చెప్పాను.

దొడ్డవరం తెల్లబాడు గ్రామాలలో రామనామ సంకీర్తనం చేసే ఆడవాళ్ళ బృందాలున్నాయి. వీరిది అవధూతేంద్ర సరస్వతీస్వామి వారి పరంపర. వీరికే రఘువరదాసుగారని పేరున్నది. నా చిన్నపుడు గ్రామగ్రామాలలో రామనామ ఏకాహాలు, సప్తాహాలు వీరి అధ్వర్యంలో జరిగేవి. రామనామాన్ని  తెలుగునాట గ్రామగ్రామాలలో ప్రచారం చేసి తరించిన మహనీయుడాయన. పాతతరం వారికి ఆయన సుపరిచితుడే. రామనామం మారుమ్రోగుతున్నంత వరకూ పల్లెటూర్లు ఎంతో బాగున్నాయి. కాలక్రమేణా క్రైస్తవ  విషప్రచారాలతోను, ఇతర వెర్రిపోకడలతోనూ నేటి పల్లెటూర్లు ఎంతగా భ్రష్టు పట్టినప్పటికీ, ఈ నాటికీ రామనామ సంకీర్తనమే పల్లెలను కొద్దో గొప్పో రక్షిస్తున్న శక్తి అనేది నా నమ్మకం.

రామనామ సంకీర్తనను నేను చాలా ఇష్టపడతాను. దాని శక్తి నాకు బాగా తెలుసు. దానితో నా అనుబంధం ఇప్పటిది కాదు. నా చిన్నప్పటిది.

దొడ్డవరం, తెల్లబాడు గ్రామాలు రెండూ కలిసే ఉంటాయి. వీటిలో అసలు ఊరు దొడ్డవరం గ్రామమే. ఇది వెయ్యేళ్ళ క్రితం గడ్డ ఎత్తబడిన ఊరు. అప్పటిలో చోళరాజుల పరిపాలనలో ఉండేది. అద్దంకి రాజధానిగా ఉండేది. కాలక్రమంలో యాదవ రాజులు, రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మొదట్లో ఈ గ్రామం గడ్డను ఎత్తినది బ్రాహ్మణులే. బ్రాహ్మణులు, పెద కమ్మవారు కలసి ఈ గ్రామాన్ని స్థాపించారు. ఈ గ్రామం అసలు పేరు వీరనరసింహపురి అగ్రహారం. అందుకే వెయ్యేళ్ళనాటి నరసింహస్వామి ఆలయం ఈ ఊరిలో ఉన్నది.

ఏభై ఏళ్ళ క్రితం వరకూ ఈ ఊరిలో ముప్పై దాకా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలున్నాయి. అందరూ ఇళ్ళను పొలాలను అమ్ముకుని ఊరు ఒదిలి చదువులు, ఉద్యోగాల కోసం పట్నాలకు వెళ్ళిపోయారు. పెదకమ్మవారి కుటుంబాల పిల్లలు కూడా చాలామంది అమెరికాలో స్థిరపడ్డారు.ఆ కులంలోని పెద్దవాళ్ళు మాత్రం ఊరిలో మిగిలారు. శివాలయం వైపుగా చిన్న కమ్మవారి కుటుంబాలు ఉన్నాయి. వారు వ్యవసాయవృత్తిలో ఉన్నారు. వారిలో వాడే బత్తుల వెంకటసుబ్బయ్య. వృత్తిరీత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ, వేదం మీద ఆసక్తితో ఎంతో పరిశోధన చేసి, 'అతిరుద్రం- షడ్దర్శనాలు' అనే విషయం మీద సంస్కృతభాషలో Ph.D చేశాడు. జ్యోతిష్యశాస్త్రంలో M.A చేశాడు. ఇతని గురించి ఇంతకు ముందు వ్రాశాను. ఈ ఊరి ఆణిముత్యం ఇతడు. బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మవారు గాక, వడ్డెరలు, యాదవులు, మాలలు, మాదిగలు, ఇతర కులస్తులు కొంతమంది ప్రస్తుతం గ్రామంలో ఉన్నారు.

ఈ ఊరు చాలా పేరు గాంచిన ఊరు. సినీనటి భానుమతి పుట్టినది ఇక్కడే. ఇక్కడ రామాలయం వీధిలోనే ఆమె పుట్టిన ఇల్లు ఉన్నది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య బ్రాహ్మణుడు. తల్లి సరస్వతి, కళావంతులని చెప్పారు. మద్రాసులో స్థిరపడి, ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత కూడా, అప్పుడప్పుడు ఆమె తన స్వగ్రామమైన దొడ్డవరానికి వచ్చి పోయేదని ఇక్కడివాళ్ళు చెప్పారు. ఇక్కడి ఆలయ ఉత్సవాలలో ఆమె తల్లి సరస్వతి నాట్యం చేసేదని, తల్లి వెంట చిన్నపిల్ల భానుమతి వస్తూ ఉండేదని అన్నారు. సరస్వతి గారు సంగీత విద్వాంసురాలు. ఆమె దగ్గరే భానుమతి తన మొదటి సంగీత పాఠాలను అభ్యసించి ఉండవచ్చు.

సంగీత విద్వాంసులకు, కళాకారులకు, సాహిత్యప్రియులకు ఈ ఊరు పెట్టింది పేరు.

బుర్రకధకు మన దేశంలోనే పేరు తెచ్చిన మేటి కళాకారుడు జంగం వెంకటస్వామి, ఆయన శిష్యుడు హరిజనుడైన కాకుమాను రాఘవులు ఈ ఊరి వారే. వెంకటస్వామి గాత్రం ఎంత ఖంగుమనేదంటే, దానిని రికార్డు చేయబోతుంటే గ్రామఫోను ప్లేటు చిట్లిపోయిందట. దీనిని ఇప్పటికీ కధగా చెప్పుకుంటారు.

ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు శింగంశెట్టి చంద్రశేఖరం ఈ ఊరివాడే. ఈయన పక్కా కమ్యునిస్టు. కానీ నిరంతరం కృష్ణనామాన్ని జపించేవాడు. భక్తిరసంలో ఓలలాడేవాడు.

ప్రఖ్యాత వీధి భాగవతకళాకారుడు జక్కుల వెంకట రామదాసు ఈ ఊరిలో పుట్టినవాడే.

సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తన నాదస్వర గానంతో మెప్పించిన నాదస్వర ప్రవీణుడు చినబాలాజీ ఈ గ్రామస్తుడే.

(ఈ వివరాలను శ్రీ గొల్లపూడి ప్రకాశరావు రచించిన 'మా జంట గ్రామాలు' అనే పుస్తకం నుంచి గ్రహించాను)

ఇంకా ఎందరెందరో ఎన్నో రంగాలలో ప్రసిద్ధి కెక్కినవారు ఈ గ్రామం నుంచి వచ్చారు. అలాంటిది దొడ్డవరం గ్రామం. కానీ ప్రస్తుతం మాత్రం గతకాలపు సాంస్కృతిక వైభవం అంతా అంతరించింది. జనాల దగ్గర డబ్బు పెరుగుతున్నది గాని సాంస్కృతిక పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.

నాలుగు వేల జనాభా ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్నది. నరసింహస్వామి ఆలయానికి తోడు, ఒక రామాలయం (అసంపూర్తిగా వదలివెయ్యబడింది. చందాలు వసూలు చేసినవారు కొందరు చనిపోగా, మరికొందరు అమెరికాకు వెళ్ళిపోయారట),  మాలపల్లిలోని రామాలయం, పాత శివాలయం, అంకమ్మ తల్లి గుళ్ళు రెండు, బ్రహ్మంగారి గుళ్ళు మూడు, పోలేరమ్మ తల్లి గుడి ఒకటి, శక్తి క్షేత్రం అనే అమ్మవారి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి, ఈ మధ్యనే కట్టబడిన ఒక పెద్ద నల్లరాతి ఆంజనేయస్వామి విగ్రహం, ఈ విధంగా చాలా గుడులున్నాయి. ఇవిగాక మూడు చర్చిలున్నాయి. ఎవరికి వారే, వారి వారి కులగుళ్ళు కట్టుకుంటూ వాళ్ళ ఉనికిని  సామాజికబలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తున్నది గాని, పాతకాలపు ఆలయాల సంస్కృతిని పద్ధతులను నిలబెట్టే క్రమం మాత్రం గోచరించడం లేదు. మైకులు మాత్రం మోగిపోతున్నాయి.

ఈ గ్రామానికి మాకు గల అనుబంధం ఏనాటిదో? ఎప్పటిదో? నేడు మేము ఈ గ్రామానికి చేరుకున్నాము. మా మొదటి ఆశ్రమం ఇక్కడే వస్తున్నది. మొదటి ఆశ్రమం అని ఎందుకన్నానంటే, గోదావరి తీరంలో మా ఇంకొక ఆశ్రమం రావాలన్నది నా సంకల్పం. పేరుకు చంద్రపాడు గ్రామ పరిధిలో ఉన్నప్పటికీ, ఏది కావాలన్నా మేము రావలసింది దొడ్డవరం గ్రామానికే. కనుక ప్రస్తుతానికి మేము దొడ్డవరం గ్రామస్తులమే.

ఈ ఊరుకు ఆనుకుని ఉన్న ఇంకొక గ్రామం ఇలపావులూరు. 1984 ప్రాంతాలలో మాకు బాగా పరిచయస్తుడైన IT Rao గారు ఈ గ్రామపు ఆయనే. ఆయనపేరు ఇలపావులూరి తిరుమలరావు. ఈయన గుంతకల్లు రైల్వే డివిజన్ లో TTE గా పనిచేశారు. అప్పుడప్పుడూ తన స్వగ్రామానికి వచ్చి పోతూ ఉండేవాడు. ఆ ఇలపావులూరు గ్రామం మా ప్రక్కనే ఉంది.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమగ్ర సమన్వయం చేస్తున్న మా ఆశ్రమం ఇక్కడ రావడం ఈ నేల చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. కానీ ఈ గ్రామస్తులకు మా ఆశ్రమ విధానాలు, ఆశయాలు అర్ధమౌతాయా? ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యున్నత ఆధ్యాత్మిక సంపద వాళ్ళ ముంగిటిలోకి వచ్చి నిలుచున్న విషయం వారికి ఎప్పటికైనా  తెలుస్తుందా? దానిని అందుకోగలిగే వాళ్ళు ఒక్కరైనా ఇక్కడ కనిపిస్తారా?

ఏమో? కాలమే నిర్ణయించాలి.

read more " దొడ్డవరం - తెల్లబాడు గ్రామాలు "

23, ఏప్రిల్ 2023, ఆదివారం

మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు??

ఆశ్రమం పనులు మొదలయ్యి చురుకుగా ముందుకు కదులుతున్నాయి.

గ్రామస్తులలో కుతూహలం పెరుగుతోంది. రకరకాలుగా వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొందరైతే మమ్మల్నే అడుగుతున్నారు.

‘యోగాశ్రమం అని పేరు పెట్టారు. డబ్బులు తీసుకొని యోగా నేర్పిస్తారా?’ అడిగింది ఒకామె.

‘మేము డబ్బులూ తీసుకోము, యోగానూ నేర్పించము’ అన్నాను .

‘మరి యోగాశ్రమం అని పేరు పెట్టారు కదా?’ అనుమానం తలెత్తింది ఆమెలో

‘మేము నేర్పే యోగా మీకు అర్ధమయ్యేది కాదు. మీరు చెయ్యగలిగేది కూడా కాదు’ అని ఆమెతో చెప్పాను.

ఇంకొకాయన ఇలా అడిగాడు.

‘చందాలతో ఆశ్రమం కట్టిస్తున్నారా?’

‘మేము చందాలు తీసుకోము’ అని చెప్పాను

అతను నోరెళ్ళబెట్టాడు

‘మేము కూడా చందాలేసుకుని అమ్మవారికి తిరునాళ్ళు చేస్తాము. సంబరాలు చేస్తాము. బ్రహ్మంగారి తిధికి ఊరందరికీ భోజనాలు పెడతాము’ అన్నాడు.

‘మేము అటువంటి పనులు  పొరపాటున కూడా చెయ్యము’ అన్నాను

‘అంటే మీలో మీరే ఉంటారా?’ అడిగాడాయన

‘అంతే. మాలో మేమే ఉంటాము, మా కష్టార్జితాలతో ఆశ్రమం కట్టుకుంటున్నాము.  మా మార్గంలో నడిచేవాళ్ళకే అందులో ప్రవేశం. బయటివాళ్ళకు ప్రవేశం లేదు’ అన్నాను.

'ఇంతమాత్రం దానికి ఆశ్రమం ఎందుకు?' అన్నట్టు చూశాడాయన.

ఇంకొకాయన ఇలా అడిగాడు.

‘ముసలోళ్ళని చేర్చుకుంటారా?’

మాది వృద్ధాశ్రమం అని అతను అనుకుంటున్నాడని నాకర్ధమైంది.

‘అంటే?’ అన్నాను అర్ధం కానట్టు

‘మా ఇంట్లో ముసలోళ్ళున్నారు. ఆశ్రమానికి పంపచ్చా?’ అడిగాడు సిగ్గు లేకుండా.

‘ఎవరు మీ అమ్మా నాన్నానా?’ అడిగాను.

‘అవును. మా అత్తా మామా కూడా ఉన్నారు’ అన్నాడు.

‘చేర్చుకుంటాము. ఒక్కొక్కళ్ళకి నెలకి లక్ష అవుతుంది. పైగా ముసలోళ్ళతో గొడ్డుచాకిరీ చేయిస్తాము. ఊరకే కూచోపెట్టము’ అన్నాను సీరియస్ గా.

‘అంతెందుకవుతుంది?’ అన్నాడు.

‘ఎందుక్కాదు? ఏసీ రూములు, అన్ని సౌకర్యాలు,  ప్రతిరోజూ బిరియానీ, వీకెండ్ లో చికెన్ మటన్, అప్పుడప్పుడు మందు, ఇవన్నీ ఉంటాయి. ఇవిగాక రోజుకి మూడు సినిమాలు చూపిస్తాము, కాదామరి? అయినంత అవుతుంది. మిగతాది మాకు డొనేషన్’ అన్నాను.

మళ్ళీ తిరిగి చూస్తే ఒట్టు.

ఇంకొకామె ఇలా అడిగింది.

‘మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు?’

‘అన్నీ నేర్పిస్తాము. నేర్చుకోగలిగితే’ అన్నాను 

'అంటే ?' అడిగిందామె. 

'అంటే, మీరు పద్ధతిగా ఉంటే మా దగ్గర అన్నీ ఉంటాయి. మీరు తీరుగా లేకపోతే మా దగ్గర మీకేమీ దొరకదు' అన్నాను.

'అసలు మీ మార్గమేంటి”’ అడిగింది ఆమె మళ్ళీ.

‘అది కొద్దిమాటల్లో చెప్పేది కాదు. చెప్పినా మీకు అర్ధం కూడా కాదు’ అన్నాను.

నిన్న ఒకతను ఆటోలో వచ్చాడు.

‘ఆశ్రమంలో వాచ్ మ్యాన్ కావాలా?’ అడిగాడు నడుం మీద చేతులేసుకుని పోజిచ్చి నిలబడి.

ఆటో మీద ‘యెహోవా నా కాపరి’ అని రాసుంది.

‘నీకే ఒక కాపరున్నాడు. నువ్వు మాకేం కాపలా కాస్తావులే, వద్దు’ అన్నాము.

ఇంకొక గొడ్లు కాసుకునే ముసలోడు ' పొలిమేరలో పొలం కొన్నారు. ఈడ రేత్తిరిపూట బూత వైజ్జకాలు సేత్తాంటారు. జాగర్త' అని భయపెట్టబోయాడు.

'బూతాలతో ఆడుకోటం మాకు సరదా. మా ఆశ్రమంలో రేత్తిరైతే శానా బూతాలు తిరుగుతాంటై. నువ్వీ శాయలకి రామాక' అన్నా సీరియస్ గా.

ముసలోడు పరార్.   

‘అవసరమైతే తప్ప పనివాళ్ళని పెట్టుకోరు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఒకళ్ళ జోలికి రారు. వాళ్ళలో వాళ్ళే ఉంటారు’ అని ఒక అభిప్రాయం గ్రామస్తులలో పడిపోయింది.

అయితే, 'ఈ ఆశ్రమంలో ఉంటూ వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు?’ అన్నది మాత్రం  ఎవరికీ అర్ధం కావడం లేదు.

ముందు మాకర్ధమైతే కదా వాళ్ళకి చెప్పడానికి?

read more " మీ ఆశ్రమంలో ఏమి నేర్పిస్తారు?? "

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

పల్లెటూళ్ళు

పల్లెటూళ్ళు

స్వార్ధపు కంపుల పిచ్చుక గూళ్ళు

పల్లెటూళ్ళు

కులగుంపుల కుళ్ళు లోగిళ్ళు

 

పల్లెటూళ్ళు

మతప్రచారాల మంటల బళ్ళు

పల్లెటూళ్ళు

విష ప్రలోభాల కుంటకావళ్ళు

 

పల్లెటూళ్ళు

రగులుతున్న విభేదాల గుళ్ళు

పల్లెటూళ్ళు

పెరుగుతున్న వైషమ్యాల దళ్ళు

 

కావు కావివి ఒకప్పటి పల్లెటూళ్ళు

నేడు లేవెక్కడా సామరస్యపు మళ్ళు

నేటి పల్లెటూళ్ళు చదరంగపు గళ్ళు

దేశపు ఒంటినిండా గుచ్చిన ముళ్ళు

read more " పల్లెటూళ్ళు "

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

అమ్మకు నైటీబాబా సర్టిఫికెట్ అవసరమా?

మొన్న జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు ఒక క్రొత్త విషయం గమనించాను. అదేంటంటే, ప్రచారం పైన పెరిగిన ఫోకస్. నేటి నెట్ సమాజంలో అది అవసరమే. కాదనలేం. కానీ ఆ క్రమంలో సత్యాలను పక్కన పెట్టి అబద్ధాలను ప్రచారం చెయ్యవలసిన అవసరం ఉన్నదా? అనేది నా సందేహం. అలా ఉన్నవీ లేనివీ ప్రచారం చేసే క్రమంలో అమ్మ భావజాలాన్ని, అసలుతత్త్వాన్ని మరుగున పడవెయ్యవచ్చా? అనేది కూడా నా ఇంకొక సందేహం.

ఉదాహరణకు, 'అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారమే' అని  శ్రీశ్రీశ్రీ నైటీబాబా చెప్పినట్టుగా ఒక కొటేషన్ అక్కడ బోర్డుల పైన దర్శనమిచ్చింది. అసలు నైటీబాబానే ఒక పెద్ద ఫ్రాడ్ అనేది ఎప్పుడో ఋజువై పోయింది. టీవీ కెమెరాలు, అశాంతి నిలయంలో జరిగిన అనేక సంఘటనలు ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా ఎప్పుడో  నిరూపించేశాయి. అలాంటి ఫ్రాడ్ బాబా ఇచ్చిన సర్టిఫికెట్ అమ్మకు అవసరమా? ఆ సర్టిఫికెట్ వాడుకోవడం వల్ల అమ్మ ప్రతిష్ఠ కొత్తగా పెరిగేది ఏమైనా ఉందా? అనేది నా సందేహం.

'అమ్మ రాజరాజేశ్వరి అవతారమే" అని నైటీబాబా నిజంగా చెప్పినట్లైటే, మరి అమ్మ దర్శనానికి బాబా ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు? బాబాలు జగన్మాత కంటే గొప్పవాళ్లా? అనేది అసలైన ప్రశ్న.

పోతే, తను రాజరాజేశ్వరి అవతారం కానని అమ్మే స్వయంగా చెప్పింది. అమ్మ జీవితాన్ని చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 'అన్నపూర్ణాదేవి అని, రాజరాజేశ్వరి అని నన్ను అనుకునేవారే గాని, నన్ను నన్నుగా చూసేవాళ్ళు ఏరీ?' అని అమ్మ అన్నది.

అమ్మంటే నా అవగాహన కూడా అమ్మ చెప్పిన పై మాటలనే బలపరుస్తున్నది.

ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చూడలేని వారే, ప్రతిదానికీ శివునితో విష్ణువుతో అమ్మవారితో ముడిపెట్టి చారిత్రక సంఘటనలకు పురాణరంగులు అద్దాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేస్తే గాని వారికి తృప్తి కలగదు. ఈ క్రమంలో కాకమ్మకధలు సృష్టిస్తూ ఉంటారు. తిరుమలలో జరిగిన శ్రీనివాసుని లోకల్ చరిత్రకు మహావిష్ణువుతోను, కేరళలో జరిగిన అయ్యప్ప జానపద చరిత్రకు మోహినీ అవతారంతోను, బుద్ధునికి దశావతారాల తోను లింకులు పెట్టి రకరకాలైన కథలు అల్లినది, ప్రతిదానికీ పురాణ ప్రతిపత్తిని ఆశించే ఈ పిచ్చిపోకడలే.

ఇక బాబాల సంగతి చెప్పనే అక్కర్లేదు. దివ్యత్వం లేనివారికి దివ్యత్వాన్ని, హిందువులే కానివారికి హిందూత్వాన్ని అద్ది, వాళ్ళను దేవుళ్ళను చేసి కూచోపెట్టినది కూడా ఈ పొకడలే. హిందువులలో ఈ దిగజారుడుతనం పోవాలి. అసలైన హిందూమతం పైన వారికి స్పష్టత రావాలి. వారి మతమేంటో వారికి స్పష్టంగా అర్థం కావాలి. నా పుస్తకాల ద్వారా దీనినే నేను చెబుతున్నాను.

అమ్మ చెప్పిన ఇలాంటి అసలైన మాటలను దాచిపెట్టి, అమ్మ భావజాలాన్ని పక్కదారి పట్టించి, ఫ్రాడ్ బాబాలు చెప్పిన ఇలాంటి కల్లబొల్లి కబుర్లను ప్రచారం చెయ్యడం ఎందుకు?

ఇది సత్యాన్ని అనుసరించడమా? లేక అసత్యాన్ని ఆరాధించడమా?

ఆదాయం కోసం ఆదర్శాలకు తిలోదకాలివ్వడం అవసరమా?

సత్యం నిలబడాలంటే కూడా అసత్యాల దన్ను కావాలా?

ఇదేనా కలిమాయ అంటే?

read more " అమ్మకు నైటీబాబా సర్టిఫికెట్ అవసరమా? "

12, ఏప్రిల్ 2023, బుధవారం

మీతో పరిచయం చేసుకోవాలనుంది

మొన్నొకాయన నుంచి ఫోనొచ్చింది.

'నేను మాస్టర్ CVV మార్గం ఫాలో అవుతాను. దుర్గామంత్రం జపిస్తుంటాను. జ్యోతిష్యం పెద్దగా రాదు, కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఈమధ్యన నేను చెప్పేవి నిజమౌతున్నాయి' అన్నాడాయన.

'సరే. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి' అన్నాను

'మీతో పరిచయం చేసుకుందామని అనుకుంటున్నాను' అన్నాడు

'నాతో ఊరకే పరిచయం చేసుకుంటే మీకేంటి ఉపయోగం?' అడిగాను.

'ఊరకనే' అన్నాడు.

'ఊరకే పరిచయం చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. నేను మనుషులతో పరిచయాలు, సంబంధాలు తగ్గించుకునే పనిలో ఉన్నాను. మీరు రాంగ్ టైం లో వచ్చారు' అన్నాను.

'అంటే, జ్యోతిష్యం గురించి మీ దగ్గర కొన్ని నేర్చుకుందామని' అన్నాడు

'మీరు జ్యోతిష్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?' అడిగాను.

'అవును. తీసుకుంటాను. కానీ మానేద్దామని అనుకుంటున్నాను' అన్నాడు.

'సారీ. కమర్షియల్ జ్యోతిష్కులతో నేను మాట్లాడను. డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నంత వరకూ మీకు అసలైన జ్యోతిశ్శాస్రం పట్టుబడదు. నాతో మీకు ఉపయోగమూ ఉండదు. పోతే, మాస్టర్ CVV మార్గం ఫాలో అవుతున్నంతసేపూ కూడా నాతో ఉపయోగం ఉండదు. ఈ రెండూ మీరు మానుకుని నా మార్గంలో నడవాలనుకుంటే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం నాతో మీకు ఉపయోగం సున్నా. ముందు నా పుస్తకాలు కొన్నైనా చదవండి. అప్పుడు నా మార్గమేంటో అర్ధమౌతుంది' అని చెప్పాను.

'సరేనండి ఉంటా' అన్నాడాయన.

'మంచిది' అంటూ ఫోన్ కట్ చేశాను.

శుద్ధంగా నా దారిలో నడిచేవారికే నా ఉపయోగం గాని, కాలక్షేపం కోసమో, కబుర్ల కోసమో, జ్యోతిష్య రహస్యాల కోసమో నాతో పరిచయం చేసుకుందామని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.

కమర్షియల్ జ్యోతిష్కులకు నాతో పనేంటి?

అదే విధంగా, వేరే గురువులను ఫాలో అయ్యేవారికి కూడా నాతో పనేంటి?

ప్రపంచపు గోల ఒద్దనుకునేవాడికి మనుషులతో పనేముంటుంది?

read more " మీతో పరిచయం చేసుకోవాలనుంది "

10, ఏప్రిల్ 2023, సోమవారం

సుదూరంగా
శబ్దకాలుష్యాలకూ

వర్గవైషమ్యాలకూ

దుష్టసాంగత్యాలకూ

భ్రష్టసాహిత్యాలకూ

సుదూరంగా


మెతుకు తెరువులకూ

బ్రతుకు బరువులకూ

వెకిలి మనుషులకూ

మకిలి మనసులకూ

సుదూరంగా


పెట్టుపోతలకూ

ఒట్టి కూతలకూ 

ఓటిమాటలకూ

నీటిమూటలకూ

సుదూరంగా


కుళ్ళుసంఘానికీ

కర్మరంగానికీ 

కురచవేషాలకీ

కుదురు మోసాలకీ

సుదూరంగా


మాయస్నేహాలకూ 

మారుమోహాలకూ

పిచ్చిపాపాలకూ

పిల్లిశాపాలకూ 

సుదూరంగా....

read more " సుదూరంగా "

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఎవరికివారే యమునాతీరే

ఈ మధ్యన ఆశ్రమాలు చాలా చూస్తున్నారు కదా? వాటిపైన మీ అభిప్రాయం ఏమిటి? అని ఒక శిష్యుడు  అడిగాడు.

ఈ కవితను వినిపించాను. 

ఏ ఆశ్రమం చూచినా
ఏమున్నది గర్వకారణం?
ఆధ్యాత్మిక చరిత్ర మొత్తం
అతిచేష్టల అరాచకత్వం

సమాధి స్థితులు పోయాయి
సమాధులు మిగిలాయి 
మహనీయులు మొదలుపెట్టారు
మరమనుషులు నడుపుతున్నారు

పట్టుపురుగులు పోయాయి
చీడపురుగులు చేరాయి
ఆదర్శాలు వల్లె వేస్తున్నారు
ఆచరణలో చెల్లిపోతున్నారు

స్పిరిట్యువల్ జోకర్లు
ఫిలాసఫీ బ్రోకర్లు
కమెడియన్లు బపూన్లు
కస్టోడియన్లుగా తయారై
ఆశ్రమాల నిండా ఉన్నారు
అసహ్యపు గెంతులేస్తున్నారు

ఆరోవిలన్లు
అన్నాదురైలు
జిల్లేడుముళ్ళు
జిలేబి రాయుళ్లు

బొమ్మల కొలువులు
రమ్మని పిలుపులు
కమ్మని వ్యాపారాలు
ఝమ్మని  సాగుతున్నాయి

తంతుల తాళ్ళతో
తమను తాము కట్టేసుకుని
ఆశపోతు గొర్రెలను పోగేస్తున్న
వెఱ్ఱి వెంగళప్పలు

క్రొత్త దేవతలు
పాత ఆరాధనలు
మహిమల ప్రచారాలు
మనుషులకు గేలాలు

స్పిరిట్యువల్  మార్కెటింగు
కమర్షియల్ టార్గెటింగు
అబద్దాల రూఫింగు 
ఆధ్యాత్మిక డూపింగు

ఆలయాలన్నీ అక్రమాల నిలయాలే
ఆశ్రమాలన్నీ అనాధాశ్రమాలే
గురువులందరూ వ్యాపారస్తులే
శిష్యులందరూ వ్యవహారస్తులే

ఎక్కడ చూచినా డ్రామాలే 
ఫాలోయర్స్ కి నామాలే
ఎవరికివారే యమునాతీరే
చివరికి చూస్తే రైతుబజారే
read more " ఎవరికివారే యమునాతీరే "

6, ఏప్రిల్ 2023, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 55 (స్పిరిట్యువల్ డెంటిస్ట్)

జిల్లెళ్ళమూడిలో ఉండగా ఒకరోజున అమ్మ ఆలయానికి వెళ్లే దారిలో శ్రీ కనిపించాడు.

'రండి కూర్చోండి'  అంటూ ఆహ్వానించి కుర్చీలు వేయించాడు.

'సరే, పిలిచినప్పుడు కాదనడం ఎందుకులే?' అని అందరం కూచున్నాం.

అదీ ఇదీ మాట్లాడుకుంటూ ఉండగా, ఇద్దరు వ్యక్తులు అమ్మ ఆలయం నుంచి వెనక్కు వస్తూ కనిపించారు. చూస్తే కొంచం పెద్దవాళ్లలాగే దర్పంగా ఉన్నారు.

వెంటనే 'శ్రీ' హడావుడిగా లేచి  గౌరవంగా వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు అక్కడ ముఖ్యవ్యక్తులని తెలిసిపోతోంది. నేను మాత్రం లేవకుండా అలాగే కూర్చుని వాళ్ళను చూస్తున్నాను.

దానికి వాళ్ళు హర్టయ్యారు. 

నాకు నవ్వొచ్చింది.

లోకంలో ప్రతివాడూ గౌరవాన్ని కోరుకునేవాడే, సమయమూ సందర్భమూ లేకుండా. ఎదుటివాడు ఏంటో తెలుసుకోకుండా.

శ్రీ ఇది గమనించి, వాళ్ళలో ఒకాయనను నాకు పరిచయం చేస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ డెంటిస్ట్. హైదరాబాద్ లో ఉంటారు' అన్నాడు.

ఈసారి నాకు చచ్చే నవ్వొచ్చింది.

'అంటే?' అన్నాను ఆశ్చర్యంగా.

'అంటే, 32 పళ్ళూ కనిపించేటట్లు నోరంతా తెరిచి మనస్ఫూర్తిగా నవ్వడమే అసలైన స్పిరిట్యువాలిటీ అనేది ఈయన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని కనుక్కున్నందుకు, తనను తాను 'స్పిరిట్యువల్ డెంటిస్ట్' అని పిలుచుకుంటాడు. అందరూ అలాగే పిలవాలని పట్టుబడుతూ ఉంటాడు' అన్నాడు.

'ఓహో. తమిళ సినిమాలో హీరో లాగా పళ్ళన్నీ చూపిస్తూ నవ్వడం ఈయన పిలాసపీ అన్నమాట' అన్నాను.

వాళ్ళు మళ్ళీ హర్టయ్యారు.

శ్రీ కూడా హర్టయ్యాడు నా మాటలకి.

ఈ హర్టులేంటో, చాలా చిరాకేసింది.

వీళ్లకు పిచ్చి ముదిరిందని అర్థమైంది.

ఇక ధర్మోపదేశం మొదలుపెట్టక తప్పదనిపించింది.

నా చుట్టూ ఉన్న శిష్యబృందంలో ఒకాయన్ని వాళ్ళకి చూపిస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ టెర్రరిస్ట్. స్వగ్రామం గుంటూరు' అన్నాను.

వాళ్ళు నోరెళ్లబెట్టారు.

'అంటే, నా భావజాలాన్ని అందరికీ ప్రచారం చేస్తూ అందరినీ టెర్రరైజ్ చేస్తూ ఉంటాడు. అందికని ఈ టైటిలొచ్చింది' అన్నాను.

అర్ధం అయ్యీ కానట్టుగా ముఖాలు పెట్టారు వాళ్ళు.

అక్కడే కూచుని ఉన్న ఇంకొక శిష్యుడిని చూపిస్తూ, 'ఈయన స్పిరిట్యువల్ రేపిస్టు. స్వగ్రామం నెల్లూరు' అన్నాను.

రెండడుగులు వెనక్కు వేశారు వాళ్ళు.

'భయపడకండి. ఆయనకూ కొంత టేస్టుంది. రేప్ అంటే తెలుగులో 'బలవంతం చెయ్యడం' కదా. తన ప్రెండ్స్ కి, బంధువులకి, తెలిసిన వాళ్ళందరికీ నా ఫిలాసఫీ బలవంతంగా చెబుతూ వాళ్ళని నా మతంలోకి మారుద్దామని బలవంతపు ప్రయత్నం చేస్తో ఉంటాడు, కాబట్టి ఈ టైటిల్' అన్నాను కూల్ గా.

'మీ మతమంటే?' అడిగాడు శ్రీ.

'రెటమతం' అన్నాను.

వాళ్ళు చాలా ఇబ్బందిగా ముఖాలు పెట్టారు. ఉండాలా అక్కడనుంచి కదలాలా అని తటపటాయిస్తున్నారు.

శ్రీ మాత్రం తెలివిగా, 'మరి మీ టైటిల్ ఏంటి?' అన్నాడు సరదాగా అన్నట్టు.

'స్పిరిట్యువల్ మర్డరిస్టు' అన్నాను స్పాంటేనియస్ గా.

షాకయ్యాడు నా మాటకి.

'అంటే, నన్ను ఫాలో  అయితే, మీ పాత వ్యక్తిత్వాన్ని చంపేసి కొత్త వ్యక్తిత్వాన్ని ఆ ప్లేసులో ఉంచుతానన్నమాట. అందుకే ఆ టైటిలు' అన్నాను.

'నాదొక అనుమానం అన్నయ్యా' అడిగాడు శ్రీ.

'చెప్పండి' అన్నాను నవ్వుతూ.

'ఈ టైటిల్సన్నీ ఎవరు పెట్టారన్నయ్య?' అడిగాడు

'నా శిష్యులకు నేనే పెడతాను. నాకు మాత్రం అమ్మ పెట్టింది' అన్నాను మళ్ళీ సీరియస్ గా.

'మీరు చెప్పేది నిజమేనా అన్నయ్యా?' అడిగాడు శ్రీ అనుమానంగా.

'ఆయన టైటిలు నిజమైతే మావీ నిజాలే' అన్నాను 32 పళ్ళూ కనిపించేలాగా ఇకిలిస్తూ.

ఏమనుకున్నారో ఏమో, 'ఉంటామండీ, పనులున్నాయి' అని గబగబా నడుస్తూ వాళ్లిద్దరూ మాయమైపోయారు.

నేనూ కుర్చీలోంచి లేచి, 'ఉంటాం మరి. మళ్ళీ కలుద్దాం' అని శ్రీ తో చెబుతూ. 'లేవండి పోదాం' అన్నా శిష్యులతో.

అందరం నవ్వుకుంటూ ఇంటికొచ్చేశాం.

ఆ తర్వాత స్పిరిట్యువల్ డెంటిస్ట్ గాని,  శ్రీ గాని మాకు మళ్ళీ కనిపిస్తే ఒట్టు !

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 55 (స్పిరిట్యువల్ డెంటిస్ట్) "