“Be firm with yourself but be kind to others" - Budo Saying

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

పయనంఎన్నిసార్లు ఆడావీ నాటకం
ఈ విశాల రంగస్థలంలో
పోషించావు ప్రతి పాత్రనీ
రకరకాల వేషాలలో

నీ కోసమా
వీక్షకుల కోసమా
 అంతులేని నాటకం 
ఆలోచించు ఒకసారి

నాటకం ముగిశాక
ప్రతిసారీ మిగిలేది
నువ్వూ, రంగస్థలం
కాదనగలవా మరి

అన్ని పాత్రలూ నీకు
సుపరిచితాలే కదా
ప్రతి నాటకమూ
విషాదాంతమే. కాదా?

ఆ ప్రేమ మధువు కోసం
తిరిగావెన్నో పానశాలలు
నీ ప్రియ వధువు కోసం 
వెదికావెన్నో సుదూర లోకాలు 

యాచించావెన్నో చోట్ల 
నీవు కోరే అమృతాన్ని 
ఎవ్వరూ నీకివ్వలేదు 
నీవాశించే స్వాగతాన్ని

చూచావా ఎన్నడైనా
యుగాల నీ దాహం
తీర్చే మధురజలం

దొరికిందా ఎక్కడైనా?
రగులుతున్న నీ హృదయం
ఆశించిన చల్లదనం 

చేజారిందిగా నువు కోరే
అద్భుత స్వర్గం 
దొరికిన ప్రతిసారీ 

ఏ మోమున చూచినా 
చీకటి నీడలే గాని
నువు కోరిన దరహాసం 
లేదుకదా ఈ లోకంలో 

ఎక్కడికో నీ పయనం
ఎందుకో  ఆరాటం
పయనిస్తున్న పడవలో
సహచరులు లేరేవ్వరూ

సుదూర తీరం నుంచి
మరల్చు నీ దృష్టిని
నీ లోనికి
నీ ఉనికే నీకు తోడు
కూల్చి వెయ్యి నీ సృష్టిని  
వెరువకు లోకానికి 

ఏకాకిగా నావను నడుపుతూ
మహాసముద్ర మధ్యంలో
ఎక్కడికి నీ ఒంటరి పయనం
ఎక్కడుంది నీ గమ్యం?

ఎన్ని యుగాల అన్వేషణ ఇది?
ఎన్ని జన్మల ఆలోచన ఇది?
నిశీధిలో పాంధుని వలె
గమ్యం లేని ప్రయాణం
చివరికి తప్పని ఆశాభంగం

ప్రతి పానశాలా
నువ్వెళ్ళే సరికి మూతపడింది 
ప్రతి ఇంటి ముందూ నీ భిక్షాపాత్ర
ఖాళీగా మిగిలింది

నీకేం కావాలో
నీకే తెలియదు
అయినా ఆగదు పయనం
ఇదే నీ జీవితచిత్రం

 అవిశ్రాంత ప్రేమికా
నీ ప్రేమను పొందే అర్హత
ఇక్కడ లేదేవ్వరికీ 
తెలుసుకో  నిజం

 నిరంతర అన్వేషకా
దొరకదు నీ గమ్యం
ఎన్నటికీ...నమ్మవా?
శోధించు నీ గతం

చూచుకో నీ చేతులను
ఖాళీగా మిగిలాయి చివరికి
దర్శించు నీ హృదయాన్తరంగం
శూన్య నివాసం కాదా ఎప్పటికీ

నీ మహా సౌధంలో
నీవుంచిన ప్రతి ప్రతిమా
మరుక్షణం భగ్నమైంది
లేదంటావా ?

మధుర శిల్పి చేతి ఉలి
నేలరాలి మట్టిలో కలిసింది
మనసు లేని శూన్య మందిరం
నవ్వుతూ నిను వెక్కిరించింది

ఎవరికి కావాలి?
ఉచితంగా నీవిచ్చే
అనర్ఘ ప్రేమ రత్నం
నమ్ముతారా నిన్ను?

కోరినది వారికి దొరికిన క్షణం
ఈలోకపు సంతలో నీవు
కనుమరుగైన మరుక్షణం 
తలుస్తారా నిన్ను?

నీ ప్రేమమయ రత్నపు
విలువ తెలుస్తుందా?
గులకరాళ్ళ మోజులో
కళ్ళు చెదిరిన వాళ్లకు

నువ్వొక పిచ్చివాడివి
పిచ్చివాళ్ళది కాదీ లోకం
అచ్చమైన దళారులది
ఇక్కడ నీకేం పని?

సాగిపో నీ నిశీధ దారులలో 
చీకటి మహాసౌందర్యవతి 
నడచిపో నీ అగమ్య సీమలలో 
నిరంతర పయనమే నీ గతి

నాకూ చెప్పవా  రహస్యం
నీ గమ్యం చేరిన నాడు
నాకూ చూపవా ఆ దారి
నీ దాహం తీరిన నాడు

అప్పటిదాకా
సాగిస్తా నా పయనం
నీ లాగే....
read more " పయనం "

20, ఫిబ్రవరి 2010, శనివారం

విధిని మన చేతుల్లోకి తీసుకోగలమా? మళ్ళీ నిజమైన ప్రశ్న శాస్త్రం

సహూద్యోగి రత్నసభాపతి గారి కోడలికి 19 తేదీన సిజేరియన్ చేయించాలని ముహూర్తం పెట్టారు. స్కాన్నింగ్ కూడా చేయించి మొగ బిడ్డ అనికూడా నిర్ధారణ చేసారుట. జాతకం కూడా ముందే వ్రాయించి ఉదయం 6.30 కి ఆపరేషన్ చేద్దామని చెన్నై JJ హాస్పిటల్ లో అంతా ఖాయం చేసారట. హాస్పిటల్ జెమినీ గనేషన్ కూతురిదని చెప్పారు. సభాపతి గారి అబ్బాయి తమిళ్ నాడులో పోలిస్ డిపార్ట్మెంట్ లో SP గా ఉన్నాడు. వాళ్ళు తమిళియన్స్ కావడంతో జాతకాల మీద నమ్మకంతో ముందే జాతకం చూపించి సమయానికి ఆపరేషన్ ముహూర్తం పెట్టారట.

విషయం 18 మధ్యాన్నం 12 గంటల సమయంలో నాతొ చెబుతూ చూసారా మనిషి విధిని తన చేతుల్లోకి తీసుకో గలుగుతున్నాడు,మన జాతకాన్ని మనమే ముందే వ్రాయగలుగుతున్నాం అని గర్వం గా అంటున్నాడు. నాకెందుకో ఆపరేషన్ అదే సమయానికి జరగదేమో అనిపించింది. నా అనుమానం నిజమో కాదో చూద్దామని మనస్సులోనే అప్పటి గ్రహ స్తితి చూచాను. ఆయనేదో మాట్లాడుతున్నాడు. ఊకొడుతూ మనస్సులో చక్రం వేశి చూచాను. వృషభ లగ్నం జరుగుతున్నది. అయిదింట శని ఉండి మూడో దృష్టి తో సప్తమాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టి తో లాభంలో ఉన్న చంద్రుని చూస్తున్నాడు. చంద్రుడు అవరోహణ స్థితి లో ఉన్నాడు. కనుక ఆయన అనుకుంటున్నట్లుగా జరుగదు. మరేం జరుగుతుంది? ప్రబల దశమ కేంద్రమగు కుంభంలో గురు శుక్రులు చాలా దగ్గరగా ఒక డిగ్రీ తేడాలో ఉన్నారు. వారున్న కుంభం స్థిర రాశి. కనుక పూర్ణ శుభ గ్రహాలుగా వారు త్వరగా ఫలితాన్ని ఇవ్వబోతున్నారు.

కనుక
అయ్యా సభాపతిగారు మీరనుకున్నట్లు జరుగదు. ఇంకొద్ది సేపట్లో డెలివరీ కాబోతున్నది అని చెప్పాను. ఆయన అనుమానం గా చూచాడు. మా కోడలిని చేర్చిన హాస్పిటల్ వరల్డ్ క్లాస్ స్థాయి కలది. డెలివరీ టైం చెప్పిన డాక్టరు చాలా అనుభవం ఉన్న స్పెషలిస్టు. వాళ్ళు చెప్పిన సమయం పొల్లు పోదు అని అన్నాడు. మేమింకా మాట్లాడుకుంటూనే ఉన్నాము. అంతలో చెన్నై నుంచి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసాడు. సభాపతి గారి హావభావాలు చూచి నాకు పరిస్తితి అర్థమైంది.

నొప్పులు అధికం కావటంతో ఇప్పుడే అర్జెంటుగా ఆపరేషన్ చెయ్య వలసి వచ్చింది. ఇప్పుడే అబ్బాయి పుట్టాడు. మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి అని ఫోన్ వచ్చింది. సభాపతి అయోమయం గా చూచాడు. ఇదెలా సాధ్యం సార్? మీరెలా చెప్పగలిగారు? అని ఆశ్చర్యంగా కొంత అనుమానం గా కూడా చూచాడు. అంటే నా దగ్గర ఏదో మంత్ర విద్యలున్నాయని ఆయన అనుమానం. దానికి నేనేమీ జవాబు చెప్పలేదు. సభాపతి వెంటనే మద్రాస్ కు బయలుదేరి వెళ్ళాడు. 19 ఉదయం చెయ్యాల్సిన ఆపరేషన్ 18 మధ్యాన్నమే అయింది. జాతకం పూర్తిగా మారిపోయింది. తానొకటి తలచిన దైవమొకటి తలచును అంటే ఇదేనా? ఈ సృష్టిలో ఒకధూళి కణం అయిన మనిషి అన్నీ తన చేతులోకి తీసుకో గలను అని అహంకరించి సాధించేది ఉందా?

మరొక్క మాట. స్కానింగ్ ఎందుకు తీయించారు? ఒక వేళ ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేసేవారు అని అడిగాను. ఊరకే తెలుసుకుందామని తీయించాము. ఆడపిల్ల అయితే ఇంకా ముద్దుగా పెంచుకుంటాము. అని చెప్పారు. వారు బాగా ధనవంతులు గనుక నమ్మాను. అదే బీదవారయితే ఏం చేస్తారో అందరికీ తెలిసిన ఘోరమేగా? అసలు ఇలాంటి స్కానింగులు చట్ట రీత్యా నేరం అని తెలిసినా ధన పిశాచి పట్టిన డాక్టర్లు ఎలా సహకరిస్తారో?

read more " విధిని మన చేతుల్లోకి తీసుకోగలమా? మళ్ళీ నిజమైన ప్రశ్న శాస్త్రం "

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

మళ్ళీ రుజువైన అమావాస్య ప్రభావం


ప్రతి అమావాస్యకీ, పౌర్ణమికీ దుర్ఘటనలు, రక్త పాతాలు జరగటం నిజమే. దీనికి మానవ శరీరంలో దాదాపు 70% నీరుఉండటం కారణం. అదికూడా సేలినిటీ ఉన్నది కావటం, సముద్రం మీద లాగే మానవ రక్తం మీద కూడా చంద్ర ప్రభావం ఉండటం కాదనలేని సత్యం.

సముద్రంలో లాగే, మనిషి మీద కూడా ఆటు పోట్లు తప్పక ఉంటాయి. అందుకే, పిచ్చి వాళ్లకు, ప్రేమికులకూ అమావాస్యకీ పౌర్ణమికీ ప్రకోపం వస్తుంది. అలాగే, ఈ రెండూ తిథులకూ ఏక్సిడెంట్ లకూ, క్రైం రేటుకూ అవినాభావ సంబంధం ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధకులు తేల్చి చెప్పిన నిజం.

కొన్ని కొన్ని గ్రహ పరిస్థితులు బలంగా ఉన్నప్పుడు ఈ చంద్ర ప్రభావం మరీ బలీయం గా ఉంటుంది. ఉదాహరణకుప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో నీచలో ఉండి, వక్రించి ఉన్నాడు. అదీ చంద్ర రాశి. చంద్రుడు మకరం లో ఉన్నాడు. ఇద్దరికీ సమ సప్తక దృష్టి ఉన్నది. నిన్న నేడు అమావాస్య. దీని ఫలితం వల్ల ఏమి జరిగింది?

*పూనా లో ఓషో ఆశ్రమం సమీపం లోని జర్మన్ బేకరీలో బాంబు పేలి కనీసం 15 మంది ముక్కలు ముక్కలై పోయారు. ఇది ఉగ్ర వాద కుట్ర అంటున్నారు.
*అమెరికాలో తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ ను సాటి అమెరికన్ లేడీ ప్రొఫెసర్ కాల్చి చంపింది.
*తెలంగాణా ఆందోళన మళ్ళీ తీవ్రం అవుతున్నది. హింసాత్మకం గా మారబోతున్నది.

ఈరోజు ప్రేమికుల రోజు కూడానట. అసలే వాళ్లకు పైత్యం ఎక్కువగా ఉంటుంది. అమావాస్య కూడా బాగా కలిసొచ్చింది. చూద్దాం రేపు న్యూసులో ఎంత మంది ప్రేమికులు ఏమౌతారో?
read more " మళ్ళీ రుజువైన అమావాస్య ప్రభావం "

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

Timelessness


నేను గుంటూరుకు వస్తే తమ్ముళ్ళు వచ్చి కూచుంటారు. నా స్నేహితులకందరికీ నేను అన్నగారినే. పాపం వాళ్ళూ వాళ్ళ ఉద్యోగాలు ఇతర పనులతో బిజీగా ఉండేవాళ్ళు. కాని అభిమానంతో నన్ను చూడాలని మాట్లాడాలని వస్తారు. పోసుకోలు కబుర్లు ఉండవు కనుక నాకూ వాళ్ళతో మాటలు బాగానే ఉంటాయి. కాకుంటే మా శ్రీమతికీ పిల్లలకూ ఇబ్బంది. కుటుంబంతో గడిపే కొద్ది సమయం స్నేహితులు కాజేస్తున్నారని శ్రీమతి బాధ పడుతుంది. ప్రతిసారీ మార్షల్ ఆర్ట్స్ లో కొత్త టెక్నిక్స్ నేర్పుతానని చెప్పటమే గాని నేర్పటం లేదని మా అబ్బాయి బాధ. 

నిన్న తమ్ముడు చరణ్ వచ్చి కలిశాడు. పిల్లలూ, చదువులూ, ఇతర మామూలు మాటలు సాగుతున్నాయి. మాటలమధ్యలో ఉన్నట్టుండి ఒక బాంబులాంటి ప్రశ్న అడిగాడు.

అన్నగారూ.Timelessness గురించి మీకేమన్నా తెలుసా?

తనెప్పుడూ ఇంతే. బయటకు ఒక టాపిక్ మాట్లాడుతున్నా, లోపల ఒక ఆధ్యాత్మిక చానల్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు సర్వ సాధారణంగా అడుగుతుంటాడు.

"ఇంతకీ నీ సందేహం ఏమిటో సరిగ్గా చెప్పు." అన్నాను.

"ఈ timelessness concept ఊహకు అందటం లేదు. కాలం లేని స్థితి ఎలా ఉంటుంది? అసలు అటువంటి స్తితిఉంటుందా? ఉంటె ఆ స్తితిలో ఏమి ఉంటుంది? కాలం లేనప్పుడు ప్రపంచం కూడా ఉండదు కదా .ఆ స్తితి ఎలా ఉంటుంది. " అడిగాడు.

"అది మనసుకు అందుతుందని ఎలా అనుకుంటున్నావ్?" అడిగాను.

"ఎందుకందదు? ప్రతిదీ మనస్సుకు అర్థం కావాలి కదా".

"అట్లాంటి రూలేమీ ఈ సృష్టిలో లేదు. మనస్సుతో అందుకోలేని విశేషాలు చాలా ఉన్నాయి. మనస్సుకు పైన చాలా planes ఉన్నాయి. ఉదాహరణకి కలలు లేని గాఢ నిద్రలో నీకు టైం సెన్స్ ఉందా?" రమణ మహర్షి గారి బ్రహ్మాస్త్రం వదిలాను.

కాసేపు ఆలోచించాడు. "లేదు"

"అదే నీవడిగిన స్తితి. మైండ్ ఉంటే టైం ఉంటుంది. మైండ్ లేకుంటే టైం ఉండదు.So mindlessness is timelessness. ఇక్కడ నీకొక డౌటు రావాలి. అంటే పిచ్చివాల్లకు మైండ్ ఉండదు కనుక వాళ్ళు టైం లెస్ స్టేట్ లో ఉన్నట్లా? అని. వాళ్ళుసామాన్య మనస్సుకు (ordinary mind) కింద స్థాయికి పోతారు. వాళ్ళు కూడా ఒక విధమైన టైం లెస్ స్టేట్ లో ఉన్నట్లే. కాని అది చీకటితో నిండిన అయోమయ స్థితి. యోగులు మనస్సును అధిగమించి, దాటి పైకి పోతారు. They rise above the mind. వాళ్ళు అన్నీ క్లియర్ గా చూడ గలుగుతారు. అది వెలుగు తో నిండిన ప్రపంచం. అక్కడ మన time co-ordinates పని చెయ్యవు. ఆ ప్లేన్ లోకి అడుగుపెడితే నీవడిగిన స్తితి ఏమిటో తెలుస్తుంది." అన్నాను.

"అది ఊహకు అందటం లేదు". అన్నాడు.

"సహజమే కదా. మనసుకు అతీతమైన స్తితి మనసుతో ఎలా ఊహించగలవు? అది సాధ్యం కాదు. నువ్వు దాన్ని అర్థంచేసుకోలేవు. ఊహించలేవు. కాని ఆ స్తితిలో ఉండగలవు. దానిలో లీనం కాగలవు. కాని ఇక్కణ్ణించి ఆ స్తితి ఎలాఉంటుందో ఊహించి తెలుసుకోలేవు.గుంటూర్లో ఉండి హిమాలయాలలో వేల అడుగుల ఎత్తున ఎలా ఉంటుందో ఊహించగలవా?ఇదీ అంతే. అర్థమయింది కదూ." అన్నాను.

"అంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అయిదు సెన్సెస్ కాకుండా ఆరు, ఏడు సెన్సెస్ ఇంకా ఏవైనా కావాలా?" అడిగాడు.

"అలా కాదు. అది సెన్సెస్ కు అతీతమైన స్తితి. ఇంద్రియాతీత స్తితి అని వేదాంతం చెప్పింది ఇదే. దాన్నే తురీయం అన్నారు. దాన్ని ఏ సేన్సూ పట్టుకోలేదు. "యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా" ( ఏ స్తితిని అందుకోలేక వాక్కు మొదలైన ఇంద్రియములన్నీ, మనస్సుతో సహా వెను తిరుగుతున్నాయో) అని కఠోపనిషత్తు చెప్పింది ఈ స్థితి గురించే.

చరణ్ కు ఇంకా సంతృప్తిగా లేదు. ఏదో వెలితిగానే ఉంది. నేను చెపుతున్నది నిజం కాదేమో అని అనుకుంటున్నాడు. అతని ఉద్దేశం సిక్స్త్ సెన్స్ ను డెవెలప్ చేసుకుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చని.అతని సందేహం నాకు అర్థం అయింది.

"సరే ఆ కొత్త సెన్సెస్ డెవెలప్ చేసుకొని చూడు. నీకే తెలుస్తుంది. అప్పుడు చెప్పు నేను చెప్పింది నిజమో అబద్దమో. ఎన్నిసెన్సెస్ వచ్చినా అవన్నీ టైం ఫ్రేం లోపలే ఉంటాయి. టైం లెస్ స్తితి సెన్సెస్ కు మైండ్ కు అతీతమైనది. ఇది నేను చెప్తున్నది కాదు. వేదం, ఉపనిషత్తులూ, యోగ విజ్ఞానమూ అన్నీ ఈ మాటనే చెప్తున్నాయి. మనంచెయ్యల్సింది మనస్సుతో తర్కిస్తూ ఆలోచిస్తూ దాన్ని అందుకోవాలని చూడటం కాదు. మనస్సును అధిగమించే ఉపాయం కనుక్కొని దాన్ని ఆచరించి ఇంద్రియాతీతసీమలో నీవంతట నీవే అడుగుపెట్టి చూడు. అప్పుడు నీకు ప్రత్యక్షానుభూతి ద్వారా అన్ని సందేహాలూ నివృత్తి అవుతాయి. అంత వరకూ ఈ మధనం తప్పదు." అన్నాను.

"అంతేనంటారా" అంటూ చరణ్ సెలవు తీసుకున్నాడు.
read more " Timelessness "

6, ఫిబ్రవరి 2010, శనివారం

ఒంటిమిట్టపై పరిశోధన- రెండో భాగం

"తరువాతెమైంది" ఆసక్తిగా అడిగాను.

గోవింద స్వామి చెప్పటం సాగించాడు.

తరవాతి కథ అందరికీ తెలిసిందేగా నారాయణా. స్వామి మొదట నడిగడ్డ పాలెం లోనూ తరువాత అంగల కుదురులో స్థిరపడటం, ఆశ్రమం స్థాపించటం వగైరాలు జరిగాయి. వారి పరంపర ఇప్పటికీ అక్కడ కొనసాగుతూ ఉన్నది. స్వామి చనిపోవటానికి కొద్ది రోజుల ముందు మళ్ళీ ఒంటిమిట్టకు వచ్చి కోదండ రాముని దర్శనం చేసుకున్నాడు. తరువాత మద్రాసులో చికిత్స తీసుకుంటూ 1936 లో మరణించాడు.

స్వామి ఒంటిమిట్టను వదిలిన తరువాత మళ్ళీ ఆలయం క్షీణ దశకు వచ్చి కార్యక్రమాలు క్షీణించాయి. ఊరి పెద్దలు ఉన్నారే వారేలాంటివారంటే, ఎవరైనా పూనుకొని ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తుంటే వారిని ఎక్కిరించటం, తప్పులు పట్టటం, హేళన చెయ్యటం వగైరా కార్యక్రమాలు జోరుగా చేస్తారు. కాని వారే చెయ్యాల్సి వస్తే ఎవరూ ముందుకు రారు. అదీ సంగతి.

మరి రెడ్డిగారు తరువాత ఏమయ్యాడు? నా ప్రశ్న.

గోవింద స్వామి కొనసాగించాడు.

ఏమౌతారు నాయనా. స్వాములనూ పాములనూ కదిలించ రాదనీ ఊరకే అనలేదు. సద్బ్రాహ్మనుడూ, సాధువూ అయిన ఆంద్ర వాల్మీకికి చేసిన అవమానానికి , పెట్టిన క్షోభకీ రెడ్డిగారి వంశం దుంప నాశనం అయ్యింది నాయనా. పారు లేకుండా మొత్తం వంశం అంతా రెండు తరాల్లో సర్వం నాశనం అయిపొయింది. సత్య స్వరూపుడైన రాముని వాక్కు సత్యం నాయనా. ఆయన అన్నట్టే జరిగింది. అందుకే మహనీయులను పూజించాలి గాని క్షోభకు గురి చెయ్యరాదు. పాప ఫలం దారుణంగా ఉంటుంది నాయనా.

ఇంతలో వింటున్న ముసలమ్మ కలుగ జేసుకుంది. " మధ్యనే స్వామి ఇదే ఒంటిమిట్టలో కనిపించాడు నాయనా."

నాకు ఆశ్చర్యం కలిగింది.

"
అదెలా సాధ్యమవ్వా? ఆయన గతించి దాదాపు 75 ఏళ్లయింది గదా?" అడగ కూడని ప్రశ్న అని తెలిసే అడిగాను.

ఆమె మళ్ళీ నవ్వింది. "వాళ్లకు చావు అడ్డంకి కాదు నాయనా. ఒక అంగీ మార్చి ఇంకొక అంగీ తోడుక్కోటమే. రెండు నెలల కిందట ఇక్కడ రామనామ సప్తాహం జరిగింది నాయనా. వారం రోజులు అఖండ రామనామ భజన చేశారు. సమయంలో ఒకరోజున స్వామి ఒక పండు ముసలి వాని రూపంలో వచ్చి హార్మోనియం వాయించే వాణ్ని పలకరించాడు. కాసేపు హార్మొనీ వాయిస్తాను. ఇవ్వు బాబూ అని అడిగాడు. దానికి అతను " స్వామీ నువ్వెవరో గాని పండు ముసలి వానిగా ఉన్నావు. వణుకుతున్నావు. హార్మొనీ వాయించ గలవా? అని సందేహం వ్యక్తం చేసాడు. దానికా ముసలివాడు నవ్వి " ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసాను నాయనా." అని జవాబు చెప్పి చాలా సేపు భజనకు అనుగుణంగా హార్మొనీ వాయించాడు. తరువాత ఒక భక్తురాలిని అడిగి మంచినీళ్ళు తాగి, భక్తురాలు కొంచం పాలు ఇద్దామని చూసేసరికి ఎక్కడా కనిపించలేదు. అంతమంది మధ్యలో ఎలా మాయం అయ్యాడో తెలియదు. అందరూ వెదికారు. ఎక్కడా ముసలివాని జాడే లేదు నాయనా. దురదృష్ట వంతురాలిని. సమయంలో నేనూ ఇంకొకామె అక్కడ లేము. కొంచం ఏదన్నా తిని మళ్ళీ పోదామని ఇక్కడకు వచ్చాం నాయనా. అదృష్టం నాకు దక్కలేదు. ఎప్పుడూ ఆశ్రమాన్ని కనిపెట్టి ఉండే నాకు కనిపించలేదు స్వామి. అని వాపోయింది.

"
మరి తర్వాత ఎం జరిగిందవ్వా" అని అడిగాను.

ఏముంది నాయనా. స్వామీ నాకు కనిపించవా? అని ఏడుస్తూ ఇక్కడే ఆశ్రమంలో పడుకున్న నాకు స్వామి లీలగా గదిలో కూచొని ఉన్నట్టు కనిపించాడు నాయనా. అని చెప్పింది.

సూర్యాస్తమయం అవుతున్నది. సూర్యుడు ఎర్రగా మారి పెద్ద బింబంగా కనిపిస్తున్నాడు. సరాసరి చూచినా కళ్ళకు శ్రమ కలగటం లేదు. కొండ కిందగా హైవే మీద వాహనాలు పోతున్నాయి. దూరంగా రైల్వే లైన్ మీద రైలేదో పోతూ పెద్ద పాములాగా కనిపిస్తున్నది. సాయం సంజె అలుముకుంటున్నది. అప్పటి దాకా కథను వివరించి చెప్పిన గోవింద స్వామీ, అవ్వా మౌనం వహించారు. గోవింద స్వామి లేచాడు.

"
నేను సామాన్యంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడను నాయనా, నా లోకం లో నేను బతుకుతుంటాను. నా సొంత కొడుకులు వచ్చినా నేను పలకను. కాసేపు చూచి స్వామి పలకడులే అని వాళ్ళే పోతారు. ఎందుకో సమయంలో కొండనెక్కి ఇక్కడికి రావాలని అనిపించింది. నిన్ను చూస్తె కథంతా చెప్పాలని అనిపించింది. చెప్పాను. కొండ దిగి ఆలయానికి పోయి దర్శనం చేసుకోవాలి. వస్తా" అంటూ కొండ దిగటం మొదలు పెట్టాడు. ముసలమ్మ రాత్రి వంటకు ఉపక్రమించింది.

సూర్యునికి అభిముఖంగా కూర్చున్నాను. అంత ఎత్తులో కూర్చుని ఎర్రని సూర్య బింబాన్ని చుట్టూ ప్రకృతినీ చూస్తున్నాను. సూర్యాస్తమయం జరుగుతోంది. తీరని ఆశలూ, కోరికలూ వేధిస్తుండగా నిస్సహాయంగా జీవితం చాలిస్తున్న మనిషిలా సూర్యుడు ఎర్రగా మారి మెల్లిగా ఆస్తమిస్తున్నాడు. ప్రతి మనిషీ జీవితం చివరికి ఇలాగే ముగుస్తుందేమో. ముంచుకొస్తున్న చీకటిలో మునిగి తెలియని లోకాలకు సాగిపోవాల్సిందే. మళ్ళీ కొంత కాలానికి తూర్పునసూర్యుడు ఉదయించినట్లు ఎక్కడో మళ్ళీ ఒక పసి పాపగా పుట్టాల్సిందే. ఎంత విచిత్రం.

ఒక వ్యక్తి నిస్వార్థంగా ఒక మంచి పని చేస్తున్నా దాన్ని వ్యతిరేకించే శక్తులు ఎందుకు ఉంటాయి ? ఒక వేళ అటువంటివారు ఉన్నా కూడా దైవ శక్తి ఎందుకు ఆయన్ని కాపాడలేక పోయింది? ఆయనకు అనుభవించాల్సిన ఖర్మ ఉందా? లేదాఆశ్రమం అంగల కుదురు లోనే పెట్టాలని దైవ సంకల్పమా ? ఇదంతా రకరకాల వ్యక్తుల జన్మ జన్మల పరంపరలలోనికర్మ సంబంధమా ? అసలు వీరిద్దరి మధ్య వైరం ఎలా మొదలైందో? దీనికి మొదలు ఎక్కడో?

జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న అనుభవాల బరువుతోనో అన్నట్లు హృదయం భారంగా మారింది. అప్రయత్నంగా సంధ్యా వందన మంత్రాలు మనస్సులో తిరుగుతున్నాయి. అలాగే కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగాను. ఒక గంట గడిచిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి బాగా చీకటి పడింది. సహచరుడు చంద్ర శేఖర్ ఓపికగా కొంత దూరంలో చెట్టుకింద దెయ్యంలా చీకట్లో కూచొని చూస్తున్నాడు. మెల్లిగా లేచాను. మాట్లాడే మూడ్ లేదు. నిదానంగా చీకట్లోనే కొండ దిగటం మొదలు పెట్టాను. చంద్ర శేఖర్ లేచి మౌనంగా అనుసరించాడు. కొండ దిగే వరకూ ఇద్దరం మాట్లాడుకోలేదు.

మరొక్క సారి ఆలయం చేరి స్వామి దర్శనం చేసుకొని కడపకు బయలు దేరాను. నేను పొద్దున్న చేసిన విన్నపంమన్నించి గోవింద స్వామి ద్వారా నాకు కథంతా చెప్పించి నా ధ్యానానుభావానికి రుజువులు చూపించినందుకు శ్రీరామచంద్ర ప్రభువుకు మనస్సులో నమస్కరించి బయలుదేరాను. ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తె ఒక మంటపంలో ఎవరో మునగ దీసుకొని కూర్చొని కనిపించారు. దగ్గరికి పోయి చూస్తె గోవింద స్వామి. కళ్ళు మూసుకొని ధ్యానం లో మునిగి ఉన్నాడు. నిశ్సబ్దంగా అక్కడ నుంచి బయలుదేరి రాత్రికి కడప చేరాము.

ఏమిటీ వింత? ఎక్కడి గుంటూరు జిల్లా? ఎక్కడి కడప జిల్లాలోని మారుమూల గ్రామాలు? జన్మలోనిదీ అనుబంధం? ఎప్పుడో నూరు సంవత్సరాల క్రితం జరిగిన కథకూ నాకూ ఏమిటి సంబంధం? నా గుండెలో ఎందుకీ స్పందన కలగాలి? ఇలా ఆలోచిస్తున్నాను. ఇంతలో చంద్ర శేఖర్ ప్రశ్నించాడు.

"
మీ తీరు చూస్తుంటే నాకు వింతగా ఉంది సార్. హాయిగా ఏసీ రూం లో కూచొని ఉండక ఇక్కడ కొండలు గుట్టలుపట్టుకొని తిరగటం, అలా నిష్కారణం గా ఏడవటం, అడుక్కునే సాధువులతో చర్చలు, కొండమీద చీకట్లో ధ్యానం- ఏమిటి సార్ ఇదంతా? నాకైతే ఏదో పురాణ కాలంలోకి పోయి వచ్చినట్లుంది. మీరు ఏమీ అనుకోకుంటే ఒక మాట. మీకుకొంచం పిచ్చి ఉందని నా అనుమానం. " అని నవ్వుతున్నాడు.

నాకూ నవ్వొచ్చింది.

నిజమే చంద్ర శేఖర్. ఏసీ రూములు శాశ్వతం కాదు. పదవులు శాశ్వతం కాదు. ప్రక్రుతితో మమేకం అయి బతుకుతున్నసాధువు గోవింద స్వామి, కొండమీద ముసలమ్మా-వారి జీవితాల్లో ఉన్న తృప్తి మనకుందా? వారిలా స్వచ్చమైనబతుకు మనం బతక గలుగుతున్నామా? వాళ్లకు బాంక్ బెలేన్సులు లేవు. రేపు భోజనం ఉంటుందో లేదో తెలియదు. అయినా వారెంత ధైర్యంగా, తృప్తిగా, భగవంతుని మీద నమ్మకంతో ఉన్నారో చూడు. స్వచ్చమైన గాలి పీలుస్తూ, నీళ్ళుతాగుతూ, కలో గంజో తాగుతూ దైవ ధ్యానంలో కాలం గడుపుతున్న వాళ్ళ జీవితాలు సార్థకాలు. పొద్దున్న లేచినదగ్గర్నుంచీ టెన్షన్లు, మోసాలు, కుళ్ళు కుచ్చితాలతో కృత్రిమ బతుకులు బతుకుతున్న మన జీవితాలకూ వాళ్ళ జీవితాలకూ ఎంత తేడా ఉందొ చూడు.

బహుశా ఇటువంటి పరిస్తితిని చూచేనేమో జీసస్ "కాలి బాట పక్కన లిల్లీపూవుకున్న గ్లోరీ మహా రాజుకు కూడా దొరకదన్నాడు". నిశ్చింత అన్నీ ఉన్న మనకు ఎందుకని లేదు? నిజంగాఆలోచించు. ఏదో ఒక రోజు నువ్వు నాది అనుకుంటున్న ప్రతిదీ ఒదిలి ప్రక్రుతి ఒడిలోకి చేరవలసి ఉంటుంది. అప్పుడేంచేస్తావ్?

లోకం లో ప్రతి వాడికీ ఏదో ఒక పిచ్చి ఉంది. ఇది నా టైపు పిచ్చి. కానీ నా పిచ్చి లెవెల్ చాలటం లేదు. పిచ్చి ఇంకా బాగా ముదరాలని కోరుకుంటున్నా. సారి ఒచ్చినపుడు కొండమీద రాత్రంతా ఉందాం. నీకింకా విచిత్రాలుచూపిస్తా." అన్నాను

చంద్రశేఖర్ అర్థం కానట్లు చూచాడు. " సారీ సార్. నేను రాను. మీరు కళ్ళు మూసుకొని కూచుంటారు. నాకు మాట్లాడేదిక్కు లేదు. నాకక్కడ తోచదు. కావాలంటే మిమ్మల్ని అక్కడ దించి మళ్ళీ పొద్దున్నే వస్తాను." అన్నాడు.

సరే అలాగే చేద్దాం. అన్నాను నవ్వుతూ.

(అయిపొయింది)
read more " ఒంటిమిట్టపై పరిశోధన- రెండో భాగం "