“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఫిబ్రవరి 2010, శనివారం

విధిని మన చేతుల్లోకి తీసుకోగలమా? మళ్ళీ నిజమైన ప్రశ్న శాస్త్రం

సహూద్యోగి రత్నసభాపతి గారి కోడలికి 19 తేదీన సిజేరియన్ చేయించాలని ముహూర్తం పెట్టారు. స్కాన్నింగ్ కూడా చేయించి మొగ బిడ్డ అనికూడా నిర్ధారణ చేసారుట. జాతకం కూడా ముందే వ్రాయించి ఉదయం 6.30 కి ఆపరేషన్ చేద్దామని చెన్నై JJ హాస్పిటల్ లో అంతా ఖాయం చేసారట. హాస్పిటల్ జెమినీ గనేషన్ కూతురిదని చెప్పారు. సభాపతి గారి అబ్బాయి తమిళ్ నాడులో పోలిస్ డిపార్ట్మెంట్ లో SP గా ఉన్నాడు. వాళ్ళు తమిళియన్స్ కావడంతో జాతకాల మీద నమ్మకంతో ముందే జాతకం చూపించి సమయానికి ఆపరేషన్ ముహూర్తం పెట్టారట.

విషయం 18 మధ్యాన్నం 12 గంటల సమయంలో నాతొ చెబుతూ చూసారా మనిషి విధిని తన చేతుల్లోకి తీసుకో గలుగుతున్నాడు,మన జాతకాన్ని మనమే ముందే వ్రాయగలుగుతున్నాం అని గర్వం గా అంటున్నాడు. నాకెందుకో ఆపరేషన్ అదే సమయానికి జరగదేమో అనిపించింది. నా అనుమానం నిజమో కాదో చూద్దామని మనస్సులోనే అప్పటి గ్రహ స్తితి చూచాను. ఆయనేదో మాట్లాడుతున్నాడు. ఊకొడుతూ మనస్సులో చక్రం వేశి చూచాను. వృషభ లగ్నం జరుగుతున్నది. అయిదింట శని ఉండి మూడో దృష్టి తో సప్తమాన్ని చూస్తున్నాడు. సప్తమ దృష్టి తో లాభంలో ఉన్న చంద్రుని చూస్తున్నాడు. చంద్రుడు అవరోహణ స్థితి లో ఉన్నాడు. కనుక ఆయన అనుకుంటున్నట్లుగా జరుగదు. మరేం జరుగుతుంది? ప్రబల దశమ కేంద్రమగు కుంభంలో గురు శుక్రులు చాలా దగ్గరగా ఒక డిగ్రీ తేడాలో ఉన్నారు. వారున్న కుంభం స్థిర రాశి. కనుక పూర్ణ శుభ గ్రహాలుగా వారు త్వరగా ఫలితాన్ని ఇవ్వబోతున్నారు.

కనుక
అయ్యా సభాపతిగారు మీరనుకున్నట్లు జరుగదు. ఇంకొద్ది సేపట్లో డెలివరీ కాబోతున్నది అని చెప్పాను. ఆయన అనుమానం గా చూచాడు. మా కోడలిని చేర్చిన హాస్పిటల్ వరల్డ్ క్లాస్ స్థాయి కలది. డెలివరీ టైం చెప్పిన డాక్టరు చాలా అనుభవం ఉన్న స్పెషలిస్టు. వాళ్ళు చెప్పిన సమయం పొల్లు పోదు అని అన్నాడు. మేమింకా మాట్లాడుకుంటూనే ఉన్నాము. అంతలో చెన్నై నుంచి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసాడు. సభాపతి గారి హావభావాలు చూచి నాకు పరిస్తితి అర్థమైంది.

నొప్పులు అధికం కావటంతో ఇప్పుడే అర్జెంటుగా ఆపరేషన్ చెయ్య వలసి వచ్చింది. ఇప్పుడే అబ్బాయి పుట్టాడు. మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి అని ఫోన్ వచ్చింది. సభాపతి అయోమయం గా చూచాడు. ఇదెలా సాధ్యం సార్? మీరెలా చెప్పగలిగారు? అని ఆశ్చర్యంగా కొంత అనుమానం గా కూడా చూచాడు. అంటే నా దగ్గర ఏదో మంత్ర విద్యలున్నాయని ఆయన అనుమానం. దానికి నేనేమీ జవాబు చెప్పలేదు. సభాపతి వెంటనే మద్రాస్ కు బయలుదేరి వెళ్ళాడు. 19 ఉదయం చెయ్యాల్సిన ఆపరేషన్ 18 మధ్యాన్నమే అయింది. జాతకం పూర్తిగా మారిపోయింది. తానొకటి తలచిన దైవమొకటి తలచును అంటే ఇదేనా? ఈ సృష్టిలో ఒకధూళి కణం అయిన మనిషి అన్నీ తన చేతులోకి తీసుకో గలను అని అహంకరించి సాధించేది ఉందా?

మరొక్క మాట. స్కానింగ్ ఎందుకు తీయించారు? ఒక వేళ ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేసేవారు అని అడిగాను. ఊరకే తెలుసుకుందామని తీయించాము. ఆడపిల్ల అయితే ఇంకా ముద్దుగా పెంచుకుంటాము. అని చెప్పారు. వారు బాగా ధనవంతులు గనుక నమ్మాను. అదే బీదవారయితే ఏం చేస్తారో అందరికీ తెలిసిన ఘోరమేగా? అసలు ఇలాంటి స్కానింగులు చట్ట రీత్యా నేరం అని తెలిసినా ధన పిశాచి పట్టిన డాక్టర్లు ఎలా సహకరిస్తారో?