Love the country you live in OR Live in the country you love

2, మే 2025, శుక్రవారం

మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల

నేడు వైశాఖ శుక్లపంచమి.  ఆదిశంకరులవారి పవిత్ర జన్మదినం.43 ఏళ్ల క్రితం, మా గురువర్యులైన స్వామి నందానందగారి సమక్షంలో సరిగ్గా  ఈనాడే నాకు ఉపనయనం జరిగింది. ఆ విధంగా, పంచవటి శిష్యులకు ఈ రోజు రెండువిధాలుగా ముఖ్యమైన రోజు అవుతున్నది.

'శంకరశ్శంకరస్సాక్షాత్' (శంకరులు సాక్షాత్తు ఈశ్వరుడే) అనిపించుకున్న మహనీయుడు పుట్టిన పవిత్రమైన రోజు ఇది. వేదములలో దాగి ఉన్న అద్వైతమునకు ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి, లోకానికి బోధించిన ఘనుడాయన. అమానుషములైన ఎన్నో పనులను కేవలం 32 ఏళ్ల చిన్న జీవితంలో సాధించిన మహనీయుడాయన.

తన పొట్ట, తన సుఖం మాత్రమే చూచుకునే అల్పులు, కోట్లాదిమంది పురుగులలాగా ఈ లోకంలో పుట్టి పోతుంటారు. కానీ ఇటువంటి దివ్యాత్ములు ఎప్పుడో ఒకసారి మాత్రమే పుడతారు. భారతజాతికి, సనాతనధర్మానికి ఒక దిశను కల్పించిన మహనీయుడాయన. వేలాది ఏళ్లకు ఒకసారి మాత్రమే అటువంటి మహనీయుల జననం జరుగుతుంది. వారి చరిత్రను నేను వ్రాసిన 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే గ్రంధంలో వివరంగా చర్చించాను.

ఇటువంటి పవిత్రమైన ఈ రోజున, మా 'పంచవటి' నుండి వెలువడుతున్న 71 వ పుస్తకంగా 'గీతా కంద మరందము' అనే గ్రంధాన్ని విడుదల చేస్తున్నాము.

ఇప్పటివరకూ మా సంస్థనుండి వచ్చిన పుస్తకాలకూ దీనికీ భేదం ఉన్నది. ఇప్పటివరకూ వచ్చిన 70 పుస్తకాలు నేను వ్రాసినవి. వాటిలో కొన్నింటిని నా శిష్యులు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదాలు చేశారు. ఈ పుస్తకం మాత్రం నా శిష్యురాలైన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసినది. మార్చి నెలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మికసమ్మేళనం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేడు E-Book గా విడుదల అవుతున్నది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఉత్తమగ్రంధాలను నేను వ్రాయడం కాదు, నా శిష్యులు కూడా వ్రాస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పనికి శ్రీకారం చుట్టింది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. అయితే, నా శిష్యురాలైన తర్వాత ఈమె కవయిత్రి కాలేదు. ముందునుంచీ ఈమెలో రచనాశక్తి, కవిత్వశక్తి ఉన్నాయి. వీరి తాతముత్తాతలు, మేనమామలు అందరూ మంచి కవులే. వెంకటేశ్వరస్వామివారిపైన పద్యములను, శతకములను ఈమె రచించింది. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి (న.ర.సం) ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం ఈ గ్రంధమును రచనచేసి, నాకు అంకితమిచ్చింది. ఇది ఈమె యొక్క నిష్కల్మషమైన మనస్సుకు, గురుభక్తికి నిదర్శనం.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారు మధురంగా ఆలపించిన 108 గీతా శ్లోకములకు మరికొన్ని శ్లోకములను చేర్చి మొత్తము 150 కంద పద్యములలో రచయిత్రి ఈ పుస్తకమును వ్రాశారు. అందుకే 'కంద మరందము' అని పేరు పెట్టారు. మకరందము అనినా, మరందము అనినా, అర్ధం ఒకటే.

అచ్చతెనుగు కందపద్యముల నడకలో ఉన్న అందము, గీతాశ్లోకములలో ఉన్న భావగాంభీర్యతలు కలసి పాయసంలో తేనె కలిపినట్లుగా వీరి రచన వచ్చింది. తెలుగుపద్యముల అభిమానులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఈ గ్రంధము అమృతతుల్యముగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు.

వీరి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామివారి కటాక్షం ఈమెపైన స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

భగవద్గీతకు సమగ్రమైన వ్యాఖ్యానమును వ్రాయడం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి. దీనికి రెండు కారణాలున్నాయి.

ఒకటి - మహనీయులైనవారందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. అప్పుడుగాని వారి రచనావ్యాసంగానికి పరిపూర్ణత రాలేదు. గీతకు సమగ్రమైన వ్యాఖ్యానాన్ని మొట్టమొదటగా వ్రాసినది ఆదిశంకరులు. ఈ పనిని చేయడం ద్వారా, మహాభారతంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన అమృతభాండాన్ని బయటకు తీసి, ఆ అమృతాన్ని లోకానికి పంచిపెట్టాడాయన. ఈ పనిని ఆయన 2500 ఏళ్ల క్రితం చేశారు. 

అయితే,  ఈనాటికీ మన హిందువులలో గీతను పూర్తిగా చదవనివారు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచం నేడు గీతకు ఎంతో ఉన్నతమైన స్థానాన్నిస్తున్నది. విదేశీ విశ్వవిద్యాలయాలలో భగవద్గీతను బోధిస్తున్నారు. అన్ని మతగ్రంధాల కంటే దీనిలో అత్యంత ఉత్తమమైన భావాలున్నాయని ప్రపంచ మేధావులే ఒప్పుకుంటున్నారు. అయితే మనకు మాత్రం గీతలో ఏముందో తెలియదు. కనీసం ఒకటి రెండు శ్లోకాలు కూడా మనకు రావు. వచ్చినా అర్ధాలు తెలియవు. తెలిసినా ఆచరణలోకి రావు. ఇది మన హిందువులకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి. దీనిని పోగొట్టాలంటే, గీతకు సమగ్రమైన నిస్పాక్షికమైన వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలి.

రెండు - వేదముల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. కనుక, గీతకు సరియైన వ్యాఖ్యానాన్ని చేయగల్గితే అది వేదోపనిషత్తులను వ్యాఖ్యానించినట్లే అవుతుంది. ఇంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంటుంది?

ఈ రెండు కారణాల వల్ల ఈ ఉత్తమలక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను.

ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యానకర్తలందరూ, వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కోణాలలో మాత్రమే గీతను వ్యాఖ్యానించారు గాని, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్లుగా గీతార్ధములను వ్రాయలేదు. కొద్దోగొప్పో చలంగారు ఆ పనిని చేశారు. కానీ ఆయనకు శాస్త్రపాండిత్యం లేదు. వేదాంత-యోగపరమైన సాధనలలో లోతుపాతులూ ఆయనకు తెలియవు.

బహుశా నా సంకల్పం 2026 లో సాకారం కావచ్చు. ఈలోపల నా శిష్యురాలు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఒక చిన్నపాటి గీతను పూర్తి చేసింది. త్వరలో రాబోతున్న నా గీతావ్యాఖ్యానానికి పల్లవి (prologue) లాంటిదిగా  ఈ పుస్తకమును అనుకోవచ్చు.

కలకండను బస్తాడు తిననక్కరలేదు. ఒక చిన్నముక్కను తినినా తీపిగానే ఉంటుంది. అదేవిధంగా, అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, మన జన్మలు ధన్యం కావడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా చాలు. సంక్షిప్తగీత కూడా విక్షేపాలను అంతం చేసే నిక్షేపంలాంటి దైవమార్గంలోనే నడిపిస్తుంది, సరిగా అర్ధం చేసుకోగలిగితే.

యధావిధిగా, ఈ పుస్తకం కవర్ పేజీని అద్భుతంగా తయారుచేసిన ప్రవీణ్ కు, టైప్ సెట్టింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ పనులను చూచుకున్న అఖిలకు, పబ్లిషింగ్ ని చూచుకున్న శ్రీనివాస్ చావలికి ఆశీస్సులు. వీరంతా మా పంచవటి పబ్లికేషన్ టీమ్ రధసారధులు.

కవితారసికులు, గీతాశాస్త్రాధ్యయన తత్పరులు అయిన తెలుగుపాఠకులు ఈ గ్రంధమును ఇతోధికంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.