16-17 శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీ పరమశివేంద్ర సరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు 58 వ ఆచార్యునిగా ఉన్నారు.
సదాశివయోగీంద్రులు వెలనాటి నియోగి బ్రాహ్మణకుటుంబంలో శ్రీవత్సస గోత్రంలో జన్మించారు. నేను కూడా అదే కావడం నా అదృష్టం. కనుక స్వామివారు మా పూర్వీకులేనని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. వెలనాడు అంటే కృష్ణా పెన్నా నదుల మధ్యప్రాంతం. ముఖ్యంగా గుంటూరు, రేపల్లె, నెల్లూరు ప్రాంతాలను ఆ కాలంలో వెలనాడు అనేవారు.
ముస్లిముల రాక్షసదండయాత్రలనుండి, వారు పెట్టిన హింసలు, అరాచకాలనుండి తప్పించుకోవడానికి, తమ ఆడవారిని తమ కుటుంబాలను కాపాడుకోవడానికి, ఆ కాలంలో అనేక తెలుగుకుటుంబాలు వారివారి ఆస్తిపాస్తులను వదలిపెట్టి, కట్టుబట్టలతో తమిళనాడులోని కుంభకోణం కోయంబత్తూరు మొదలైన ప్రాంతాలకు పారిపోయి అక్కడ క్రొత్తజీవితాన్ని మొదలుపెట్టాయి. అటువంటి కుటుంబాలలో వీరిది కూడా ఒకటి.
వీరి పూర్వనామధేయం శివరామకృష్ణశర్మ. పరమశివేంద్రులవారి వద్ద ఉపదేశమును పొంది, అనేక ఏళ్లపాటు కావేరీతీరంలో తపస్సు చేసిన తరువాత ఈయన బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందారు. శాస్త్రాలలో ఎంతో ఉన్నతంగా కొనియాడబడిన అవధూతస్థితిని అందుకున్న అతికొద్దిమంది నవీనులలో ఈయనొకరు. వీరి సజీవసమాధి తమిళనాడులోని కరూర్ జిల్లాలో గల నేరూరు గ్రామంలో ఉన్నది.
సదాశివయోగీన్డ్రుల గురించిన అనేక మహిమలు మరియు గాధలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరమహంస యోగానందగారు తన పుస్తకం Autobiography of a yogi లో పొందుపరచారు. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను సదాశివ బ్రహ్మేంద్రస్వామి రచించారు. వాటిలో బ్రహ్మసూత్రములకు, యోగసూత్రములకు వ్రాసిన వ్యాఖ్యానములు పేరెన్నిక గన్నవి.
వీరి గ్రంధములలో ఒకటి - మంత్ర, లయ, హఠ, రాజ, భక్తి, జ్ఞానయోగముల మేలుకలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో యోగసాధనల సంకలనా సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.
ఇటువంటి మహనీయుడు వ్రాసిన ఈ అద్భుతగ్రంధమును నా వ్యాఖ్యానంతో ఆయనయొక్క మాతృభాష అయిన తెలుగులోకి తేగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ పుస్తకమును వ్రాయడంలో నాకు అనుక్షణం చేదోడువాదోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి, శిష్యులు అఖిల. లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతం ఈ పుస్తకం E-Book గా అందుబాటులోకి వస్తున్నది. యధావిధిగా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
మా ఇతర గ్రంధములను ఆదరించినట్లే అద్భుతమైన ఈ గ్రంధాన్ని కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.