“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

21, నవంబర్ 2009, శనివారం

నాలుగు బ్రహ్మ విహారాల ధారణ

దివ్య జనని శారదా మాత ఒక విలువైన మాటను ఎల్లపుడూ చెప్పేవారు. మనిషి అత్యంత జాగ్రత్తగా జీవించాలి. అతని ప్రతి సంకల్పమూ, చర్యా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఈ సంకల్పాలు చర్యలు అనేవాటివల్లె మనిషి మనస్సులో వాసనలు కలుగుతాయి. ఈ వాసనా బలమే తరువాత అతడు మంచి లోకాలలో జన్మిస్తాడా లేక అధమ లోకాలలో జన్మిస్తాడా, మంచి పుట్టుక కలుగుతుందా లేక నీచమైన పుట్టుక కలుగుతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రతి వానికి తానూ మంచి కుటుంబంలో పుట్టాలి తనకు అంతా మంచే జరగాలి అనే ఉంటుంది. కానీ అలా జరగదు. కారణం? తన పూర్వ కర్మలు తన ఆలోచనలు సంకల్పాలు చర్యలు ఇవే కారణం.
అంతిమంగా మన భావనలే మన మిత్రులు అవే మన శత్రువులు. యోగ వేదాంత శాస్త్రముల ప్రకారం మనిషి యొక్క భావనలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది.

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత
ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు ఎల్లరి యందూ చూపించేలా అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్తితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా
మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషి ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ:

మోహ
గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసం పరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.

సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తి సాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తానూ కూడా సంతోషం పొందటాన్ని ముదిత అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:

ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్తాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటే ప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వములను సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి
వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్తితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్తితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్తితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్తితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని "
దీర్ఘ నికాయం " లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. " తేవిజ్జ సూత్ర " అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని " విశుద్ది మార్గం " లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.

ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.