The secret of spiritual life lies in living it every minute of your life

15, ఆగస్టు 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 5 (కోవిడ్ తో ఆడుకున్నాం)

ఏంటి టైటిల్ తప్పు పెట్టినట్టున్నారు? 

'ప్రస్తుతం గురువుగారు అమెరికాలో ఉన్నారు కదా. కాబట్టి డేవిడ్ తో ఆడుకున్నాం అనాలి కదా?' అన్న అనుమానం వచ్చిందా? డేవిడ్ కాదు కోవిడే. సాక్షాత్తు కోవిడ్ తోనే సరదా ఆటను ఆడుకున్నాం.

ఆ కథను వినండి.

నా రిటైర్మెంట్ చాలా విచిత్రంగా జరిగింది. జూలై నెలలో 30, 31 శని ఆదివారాలయ్యాయి గనుక 29 నాకు లాస్ట్ వర్కింగ్ డే అయింది. అందుకని 27 న రైల్ నిలయంలోని మా ఆఫీసులో లంచ్ పార్టీ ఇచ్చాను. ఆ సమయంలోనే నాకు కోవిడ్ ఎటాక్ అయింది. ఎటాక్ అయింది అనడం కంటే దానిని నా మీదకు ఆహ్వానించాను అనడం సబబుగా ఉంటుంది. 

ఇదెలా జరుగుతుంది? అసలిది సాధ్యమా? మీరు చెబుతున్నవి నిజంగా జరిగాయా? అని మళ్ళీ గుక్కపెట్టకండి. మీరు ఊహించలేని ఎన్నో విచిత్రాలు సృష్టిలో ఉన్నాయి. ఈ జన్మవరకూ, నా సాధన 45 ఏళ్ల క్రితం మొదలైందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే, మీరు అద్భుతాలుగా భావించే ఇలాంటి పనులు చెయ్యడం  నాకు పిల్లాటలని మీరు గ్రహిస్తారు.

గత నాలుగు నెలలక్రితం వరకూ నేను కోవిడ్ వాక్సిన్ వేసుకోలేదు. కానీ గత రెండేళ్లుగా వందలాదిమందితో కలసి తిరుగుతూ పని చేసుకుంటూనే ఉన్నాను. నా చుట్టుప్రక్కల ఎంతోమంది కోవిడ్ తో చనిపోయారు.  కానీ గత రెండేళ్లుగా నాకు కోవిడ్ ఎటాక్ కాలేదు. మా ఆఫీసు మొత్తానికీ నేనొక్కడినే వాక్సిన్ వేసుకోనివాడిని.  నాకవసరం లేదని వారికి చెప్పేవాడిని. వాక్సిన్ వేసుకోని వారి లిస్ట్ GM గారికి ప్రతినెలా వెళుతూ ఉండేది. అందులో  నా పేరు మాటిమాటికీ కనిపిస్తూ ఉండేది. ప్రతివారూ అడుగుతూ ఉండేవారు, 'ఏంటి సార్ మీరింకా వాక్సిన్ వేసుకోలేదా? ఫ్రీనే. మన కార్లో వెళ్లి లాలాగూడ హాస్పటల్లో వేయించుకుని రండి' అని పోరు పెట్టేవారు. అదీగాక, నాలుగు నెలలలో అమెరికా వెళ్ళాలి.  వాక్సిన్ సర్టిఫికెట్ లేనిదే విమానం ఎక్కనివ్వరు గనుక నాలుగు నెలలక్రితం, నాకవసరం లేదని తెలిసినా, చచ్చినట్టు వాక్సిన్ వేయించుకున్నాను. ఆ తర్వాత పదిరోజుల క్రితం నాకు కోవిడ్ సోకింది. నాకేకాదు, నా నుంచి నా కుటుంబం అందరికీ సోకింది.

రెండేళ్లుగా కోవిడ్ విలయతాండవంలో కూడా నన్ను సోకని కోవిడ్ ఇప్పుడెందుకు సోకింది" అన్న అనుమానం మీకు రావాలి. సత్యమేంటో ఇప్పుడు చెబుతాను వినండి.

నన్నెంతగానో నమ్మి అనుసరిస్తున్న ఒక కుటుంబం ఉన్నది. వాళ్ళు నాకోసం అమెరికా వదలిపెట్టి ఇండియా వచ్చేశారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఉంటున్నారు. అందులో ఇద్దరు పెద్దవాళ్లకు ఇద్దరు చిన్నపిల్లలకు కోవిడ్ సోకింది.  ప్రమాదం అంచుకు వారు పోబోతున్నారు.  ప్రాణగండం పొంచి ఉంది. విషయం నాకర్ధమైంది. కోవిడ్ ను నాపైకి ఆహ్వానించాను.  జూలై 27 న కోవిడ్ లక్షణాలతో పడిపోయాను.

ఇదెలా చేస్తారు? అని మళ్ళీ గుక్క పెట్టకండి. సాధనామార్గంలో ఎదిగి శిఖరాలను అందుకుంటే ఇవన్నీ పిల్లాటల్లాగా చెయ్యవచ్చు. ఇంతకంటే చెప్పడం మాత్రం వీలుకాదు.

సడన్ గా చలి, ఒళ్ళు నొప్పులు, నడుం నొప్పి, జ్వరం, దగ్గు మొదలయ్యాయి. కోవిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది.  తీవ్రమైన నడుం నొప్పితో ప్రక్కమీద పడుకుని ఉండి, జస్ట్ పక్కకు దొర్లడం కూడా నరకం లాగా ఉండేది.  లేచి కూర్చోవడం అంటే ఇక గగనమే. టాయిలెట్ కు వెళ్లాలంటే నరకం కనిపించేది. ఈ విధంగా రెండు రోజులు బాధపడ్డాను. నా శిష్యుల కర్మ తీరిందని అర్ధమయ్యాక హోమియో మందులు వేసుకోవడం మొదలుపెట్టాను. ఈ లోపల శిష్యుని కుటుంబం కోవిడ్ నుంచి కోలుకోవడం మొదలుపెట్టింది. వాళ్లకు నెగటివ్ వచ్చేసింది.

'ఎవరో చుట్టాన్ని ఆహ్వానించినట్టు ఒంటిమీదికి కోవిడ్ ను ఆహ్వానించినవారు, అదేవిధంగా పోగొట్టుకోవచ్చు కదా? మళ్ళీ హోమియో మందులు వాడటమెందుకు?' అని మళ్ళీ గుక్క పెట్టకండి. నేను చెబుతున్న ఈ లోతైన విషయాలలో మీకు నిముషనిముషానికి గుక్క వస్తుందని నాకు తెలుసు. వినండి.

నాకొక తెలిసినాయనున్నాడు. పేరు ఒక రెడ్డిగారు. రాజకీయనాయకుడు. ఎన్నో కంపెనీలున్నాయి.  ఎన్ని వేల కోట్లున్నాయో ఆయనకే లెక్క తెలీదు. అలాంటి మనిషి హైద్రాబాద్ లో  సరదాగా సిటీబస్సులో తిరుగుతాడు. సామాన్యునిలాగా పేవుమెంట్ మీద నడుచుకుంటూ పోతుంటాడు. 

ఒకసారి ఆయన్నిలా అడిగాను.

'మీకెన్ని కార్లున్నాయో మీకే తెలీదు కదా? మీ దగ్గర పనిచేసే పనివాళ్లకే గిఫ్ట్ గా లేటెస్ట్ కారును మీరివ్వగలరు.  మీరేంటి సిటీబస్సులో పాస్ కొనుక్కుని తిరుగుతున్నారు?'

దానికాయన నవ్వుతూ ఇలా అన్నాడు.

'జీవితంలో అన్ని లగ్జరీలూ చూశాను శర్మగారు. నేను అనుభవించని విలాసాలు లేవు. పొందని సరదాలు లేవు. ఇప్పుడు వాటిమీద మొహం మొత్తింది. విరక్తి పుట్టింది. సామాన్యునిలా బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలని అలా  సిటీ బస్సులో పోతుంటాను. సామాన్యుడు ఎంత కష్టపడుతూ బ్రతుకుతున్నాడో ప్రత్యక్షంగా చూడాలని అలా చేస్తుంటాను. ఇది తప్ప ఇంకేమీ లేదు' అన్నాడు.

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా? 2009 లో జరిగింది. ఆఫ్ కోర్స్ అప్పుడాయన ఒక ఇండస్ట్రీల అధినేత, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నాయకుడు. పేరు అడక్కండి. చెప్పను.

డబ్బున్నంతమాత్రాన కార్లోనే తిరగాలని సిటీబస్సులో తిరక్కూడదని రూలేమీ లేదు. అదే విధంగా,ఆధ్యాత్మికశక్తి ఉన్నంతమాత్రాన దానినే వాడాలని, మందులు వేసుకోకూడదని రూలు కూడా లేదు. అంతరికజీవితం అనేక ప్రయోగాల నిలయం. అంతరిక ప్రపంచంలో అనేక ప్రయోగాలను మేము చేస్తుంటాం. ఈ క్రమంలో, మనుషులతో మనసులతో జీవితాలతో సరదా ఆటలను ఆడుకుంటూ ఉంటాం. 

జీవితాన్ని ఒక సరదా ఆటలాగా ఆడుకోవడమే అసలైన ఆధ్యాత్మికమనేది నా సరిక్రొత్త నిర్వచనం.

వ్రాసి పెట్టుకోండి.

సరే, కోవిడ్ మీద హోమియో ఎలా పనిచేస్తుందో నా బాడీలోనే సరదాగా చూద్దామని అనుకున్నాను.  లక్షణాలు గమనించాను. మందులు ఇండికేట్ అయ్యాయి. ఈలోపల మా అమ్మాయికి, మా శ్రీమతికి కూడా నానుంచి కోవిడ్ సోకింది. వాళ్ళూ జ్వరంతో, ఒళ్లునొప్పులతో, ఇతరలక్షణాలతో అడ్డం పడ్డారు. అందరికీ మందులేసుకుంటూ, నాలుగు రోజుల్లో కోవిడ్ ను తరిమికొట్టాము.

బ్రయోనియా, జెల్సిమియం, నేట్రంమూర్ ఇవే మేము వాడిన మందులు. కోవిడ్ పారిపోయింది. ఏ ఆస్పత్రికీ మేము వెళ్ళలేదు. ఏ ఇంగ్లీషు మందులూ మింగలేదు. కోవిడ్ తో ఆడుకున్నాం. జయించాం.

సందర్భం వచ్చింది కాబట్టి మీకింకొక విషయాన్ని చెబుతాను వినండి. వినబోయేముందు ఏదైనా కుర్చీని గట్టిగా పట్టుకోండి.  లేకపోతే కళ్ళు తిరిగి క్రింద పడతారు.

గత 35 ఏళ్లుగా నేను ఒక్క ఇంగ్లిష్ టాబ్లెట్ కూడా మ్రింగలేదు. ఒక్క ఇంజెక్షన్ కూడా చేయించుకోలేదు.  ఒక్క విటమిన్ టాబ్లెట్ వేసుకోలేదు. కానీ ఈ నాటికీ నాకు బీపీ లేదు, షుగర్ లేదు, కీళ్లనొప్పులు లేవు, థైరాయిడ్ కంప్లెయింట్ లేదు, హార్ట్ ట్రబుల్ లేదు. ఏ రోగమూ లేదు. నాకిప్పుడు 60 ఏళ్ళు.  ఇదెలా సాధ్యమైందని నోరెళ్లబెట్టకండి. సాధ్యమౌతుంది. నేనే దానికి సజీవసాక్ష్యాన్ని. నా సాధనామార్గంలో నడిస్తే అది సాధ్యమౌతుంది. దానినే నా శిష్యులకిప్పుడు నేర్పిస్తున్నాను.  వారిని నా దారిలో నడిపిస్తున్నాను.

ఇప్పుడు కుర్చీని వదిలేసి, ఏ గోడనో గొబ్బెనో గట్టిగా వాటేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది వింటే  ఇంకా ఎక్కువగా కళ్ళు గిర్రున తిరుగుతాయి మీకు.

మేము ముగ్గురమూ కోవిడ్ తో అడ్డం పడి వారం రోజులున్నాము. అదే ఇంట్లో మాకు సేవలు చేస్తూ ఇంకో ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళు మూర్తి, సంధ్య. వాళ్ళు కూడా నాలాగే వాక్సిన్ వేయించుకోలేదు. నేనంటే అమెరికా వెళ్ళాలి కాబట్టి కొద్దినెలలక్రిత్రం వాక్సిన్ వేయించుకున్నాను. కానీ వాళ్ళు ఈనాటికీ వాక్సిన్ వేయించుకోలేదు.  కోవిడ్ విలయతాండవం చేసిన గుంటూరు దగ్గర ఒక ఊరిలో వారుంటారు. వాళ్ళ ఇంటి చుట్టు]పక్కల ఎంతోమంది కోవిడ్ తో గత రెండేళ్లతో చనిపోయారు. కానీ కోవిడ్ వాళ్ళను ఈనాటికీ తాకలేదు. అదికాదు అసలు సంగతి. 

వాళ్ళు మాతోనే మా ఇంట్లోనే నెలరోజులున్నారు. కోవిడ్ తో అడ్డం పడిన మాకు సేవలు చేశారు. అందరం ఒకే హాల్లో నిద్రించేవాళ్ళం.  ఇంటికి పెద్దగా వెంటిలేషన్ లేదు. అవే బాత్రూములు, ఆదే కిచెన్, అదే వస్తువులు వాళ్ళూ వాడారు, ముగ్గురు కోవిడ్ పేషంట్లతో ఒకే ఇంట్లో రెండువారాలున్నారు. కానీ వాళ్లకు కోవిడ్ సోకలేదు. మాకు కోవిడ్ వచ్చింది, తగ్గింది. వాళ్లకు మాత్రం సోకలేదు. కళ్ళు తిరుగుతున్నాయా? పట్టుకోండి గోడని,

'ఇదెలా సాధ్యం?' అని మీరు మళ్ళీ గుక్కపెట్టకముందే సమాధానం చెబుతున్నా వినండి.

మూర్తి నాతో ఇలా అన్నాడు.

'గురువుగారు. మీకు సేవ చేస్తూ ఇక్కడ ఉండటం మాకానందం. ఆ క్రమంలో మాకు కోవిడ్ సోకితే సోకనివ్వండి.  ఇంకేదైనా కూడా కానివ్వండి. పరవాలేదు. కానీ ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదలిపెట్టి గుంటూరు పోలేం. అసలు మీ సమక్షంలో ఉన్నపుడు మాకు కోవిడ్ రాదు. రావటానికి వీల్లేదు. మేము మీతోనే ఉంటాం. ఎక్కడికీ వెళ్ళం' అని దృఢంగా చెప్పాడు.

పైగా అదే సమయంలో వాళ్ళ దగ్గరి బంధువులతో ఇద్దరు చనిపోయారని ఫోన్లు వచ్చాయి.  కానీ అక్కడకు కూడా వెళ్లకుండా మాతోనే ఉండి, మాకు సేవలు చేసి, మాకు కోవిడ్ తగ్గి మేము అమెరికా వచ్చాక ఆ దంపతులు గుంటూరు వెళ్లారు. ఇలా చేసినందుకు వాళ్ళ బంధువులనుండి తీవ్రమైన మాటలు, ప్రతిఘటనలను ఎదుర్కొన్నారు. కానీ నాపైన వాళ్ళ విశ్వాసం ఏమాత్రమూ చలించలేదు.

నమ్మగలరా మీరు?

శ్రీరామచంద్రునితో సమానంగా ఆంజనేయుని ఎందుకు మనం పూజిస్తామో తెలుసా మీకు? శ్రీరాముడు చెయ్యని పనిని ఆంజనేయుడు చేశాడు గనుక.  శ్రీరాముడు సముద్రాన్ని దాటలేదు.  రామనామాన్ని జపిస్తూ ఆంజనేయుడు సముద్రాన్ని ఒక్క అంగలో దాటాడు. అందుకే ఆంజనేయుడు ఈనాటికీ గ్రామగ్రామాలలో శ్రీరామునితో సమానంగా  పూజింపబడుతున్నాడు. అచంచలమైన భక్తి  ఉంటే, చెదరని విశ్వాసం ఉంటే, కొండలే కదులుతాయి. బోడి వైరసెంత?

ఈ విషయాన్ని మీ అందరి కళ్ళ ఎదురుగా నిరూపించారు మూర్తి సంధ్య దంపతులు. అందుకే అంటాను వారు కారణజన్ములని.  ఎవరిని బడితే వారిని నేను దగ్గరకు రానివ్వను. వారిలో ఎంతో పుణ్యబలం ఉంటేగాని, స్వచ్ఛమైన మనస్సు ఉంటేగాని, అచంచలమైన విశ్వాసం ఉంటేగాని వారిని దగ్గరకు తీసుకోను.  వెయ్యిమంది చెత్త మనుషులకంటే ఒకే ఒక్క ఉత్తమమైన మనిషి నాకు ఇష్టమౌతాడు. అందుకే వీరింతగా నాకు దగ్గరయ్యారు. వారిలో ఎంతటి పవిత్రత ఉందో ఈ సంఘటనతో అర్థమైందా మీకు?నేటి స్వార్ధపూరిత ప్రపంచంలో కూడా ఇలాంటి మనుషులున్నారా? ఉంటారా? ఊహించగలరా మీరు? వీళ్ళను మనుషులనాలా దేవతలనాలా?

అచంచలమైన గురుభక్తితో కోవిడ్ ను దరిదాపులక్కూడా రాకుండా తరిమికొట్టారు మూర్తి సంధ్య దంపతులు.  ఈ సంఘటన ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో జరగలేదు. కేవలం పదిరోజులక్రితమే హైద్రాబాద్  KPHB కాలనీలో జరిగింది.

అద్భుతాలు జరగడం లేదని అనగలరా మీరు? 

ఏవో సాయిబాబా పుస్తకాలలో మహిమలను చదివి భజనలు చెయ్యడం కాదు, అద్భుతాలు మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి.

చూచే చూపుంటే చూడండి.