ఈరోజుల్లో సూడో తాంత్రిక్ సర్కిల్స్ లో ఎక్కువగా వినబడుతున్న దేవత పేరు ఛిన్నమస్తాదేవి. ఈమె పేరు మీద నేడు చాలా మోసం జరుగుతున్నది. కొంతమంది దొంగస్వాములు తాము ఈ దేవి ఉపాసకులమని చెప్పుకుంటూ యధేచ్చగా పిచ్చిజనాలని మోసం చేస్తున్నారు. అందుకని ఈ దేవత ఉపాసన వెనుక గల నిజానిజాలను వ్రాయాలని అనుకున్నాను.
అసలు తంత్ర ప్రపంచమే పెద్ద మోసం. అసలైన తంత్రం ఏమిటో చాలామంది సోకాల్డ్ తాంత్రిక గురువులకు ఏమాత్రం తెలియదు. పనులు కావడం కోసం హోమాలు చెయ్యడమే తంత్రమని వీరి ఉద్దేశ్యం. కాషాయాలు ధరించి తిరిగే ఇలాంటి దొంగస్వాములను చూస్తుంటే నాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తూ ఉంటుంది. వీళ్ళ అజ్ఞానానికి జాలీ కలుగుతూ ఉంటుంది. ఒకపక్కన సర్వసంగ పరిత్యాగులమనీ పరమహంసలమనీ చెప్పుకుంటూ ప్రచారాలు చేయించుకుంటూ ఉంటారు, మళ్ళీనేమో - 'ఫలానా పని తేలికగా కావాలంటే ఫలానా హోమం చెయ్యండి. దానికి ఇంత ఖర్చౌతుంది' అని బేరాలు నడుపుతూ ఉంటారు. ఇదేరకం సన్యాసమో నాకైతే ఎంతకీ అర్ధం కాదు.
అలాంటి దొంగస్వాములను వారి ఖర్మకు వారిని వదిలేసి మనం విషయం లోకి వద్దాం. ఛిన్నమస్తాదేవి ఉపాసనలో నిజానిజాలు తెలియాలంటే మనం చరిత్రలోకి కొంచం తొంగి చూడాలి.
చరిత్ర పరిశోధకుల ప్రకారం హిందూ తంత్రమూ బౌద్ధ తంత్రమూ కవలల్లాగా పక్కపక్కనే పుట్టినప్పటికీ, వీటిలో బౌద్ధ తంత్రమే ప్రాచీనమైనది మరియు నిజాయితీ కలిగినట్టిది. హిందూతంత్రం చాలా త్వరగా భ్రష్టు పట్టింది. కానీ బౌద్ధ తంత్రం ఇప్పటికీ నిజాయితీగా బ్రతికే ఉన్నది. అయితే మనం బౌద్ధాన్ని మన దేశం నుంచి వెళ్ళగోట్టేశాం గనుక ప్రస్తుతం అది టిబెటన్స్ లో మాత్రమె జీవించి ఉన్నది. దాన్ని వాళ్ళు వజ్రయానం అని పిలుస్తారు.
ఛిన్నమస్తాదేవికీ బౌద్ధతంత్రానికీ ఏమిటి సంబంధం? అని మీరు నన్ను అడుగవచ్చు. సంబంధం ఉన్నది. దశమహావిద్యలని మనం నేడు పిలుస్తున్న దేవతలందరూ నిజానికి బౌద్ధతంత్రం నుంచి మనకు దిగుమతి అయిన వారే. వీరెవరూ హిందూ దేవతలు కారు. ఎందుకంటే వేదాలలో వీరి ప్రసక్తి లేదు. ఒకవేళ అక్కడక్కడా 'లక్ష్మి' వంటి దేవతలు వేదాలలో ఉన్నప్పటికీ వాళ్ళ ప్రస్తావన సూటిగా లేకుండా ఒక చిన్నపాటి ప్రస్తావనగా మాత్రమె ఉన్నది. అంతేగాక ఈ తాంత్రిక దేవతలే ఆ వేదాలలో ఉన్న దేవతలు, వాళ్ళూ వీళ్ళూ ఒకటే అని ఖచ్చితంగా చెప్పడానికి కూడా అస్సలు వీలు కాదు. ఎందుకంటే మనం పురాణకాలంలో సృష్టించుకున్న దేవతలను వేదాలలో ఉన్న దేవతల పేర్లతోనూ, వేదసూక్తాలలో ఉన్న దేవతల పేర్లతోనూ అతుకులు పెట్టి రకరకాల బొంతలు కుట్టాం. ఆ బొంతలే నేటి పాపులర్ హిందూ మతమూ దానిలోని దేవతలూను. అంతే తప్ప నేటి దేవతలలో ఎవరూ వేదాలలో లేరు.
అసలు మన హిందూ మతం అనేది పెద్ద కలగూర గంప లాంటిది. ఇందులో తోటకూర, బచ్చలికూరా, కరివేపాకూ, కొత్తిమీరా వంటి ఆకుకూరలేగాక దోసకాయలూ, బెండకాయలూ, దొండకాయలూ వంటి రకరకాల కూరగాయలే గాక చేపలూ, కోళ్ళూ, కొక్కిరాయిలూ మొదలైన మాంసాహారాలు కూడా చక్కగా లభిస్తాయి. ఇవిగాక ఎప్పటికప్పుడు కొత్త కొత్త పంటలు పండించి కొత్తకొత్త కూరగాయలు సృష్టించి మరీ మనం వండుకుని తింటూ ఉంటాం. హిందూమతంలో ఎవరికిష్టమైన తిండి వారు తినవచ్చు. మిగతా మతాలలో అలా కాదు. వాటిల్లో ఒక్క కూరే తినాలి. అదికూడా అమ్మేవాడు అమ్మినదే కొనుక్కోవాలి. దానినే తినాలి. తినేవాడికి చాయిస్ ఉండదు.
'నీకిష్టం వచ్చిన తిండి నువ్వు తినరా బాబూ ఏది తిన్నా నీ ఆకలి తీరుతుంది' - అని మన మతం చెబుతుంది. మిగతా మతాలేమో - 'అలాకాదు. మేము చెప్పిన తిండి తింటేనే నీ ఆకలి తీరుతుంది. నీ ఇష్టం వచ్చిన తిండి నువ్వు తినకూడదు' అని ఆంక్షలు పెడతాయి. ఒకవేళ నువ్వు అలా తినకపోతే ' నువ్వు సైతాన్ అనుచరుడివి' అని ముద్రవేసి నిన్ను చంపి పారేస్తాయి. అదీ వారికీ మనకూ తేడా.
'నీకిష్టం వచ్చిన తిండి నువ్వు తినరా బాబూ ఏది తిన్నా నీ ఆకలి తీరుతుంది' - అని మన మతం చెబుతుంది. మిగతా మతాలేమో - 'అలాకాదు. మేము చెప్పిన తిండి తింటేనే నీ ఆకలి తీరుతుంది. నీ ఇష్టం వచ్చిన తిండి నువ్వు తినకూడదు' అని ఆంక్షలు పెడతాయి. ఒకవేళ నువ్వు అలా తినకపోతే ' నువ్వు సైతాన్ అనుచరుడివి' అని ముద్రవేసి నిన్ను చంపి పారేస్తాయి. అదీ వారికీ మనకూ తేడా.
ప్రస్తుతం మనం కొలుస్తున్న వెంకటేశ్వరస్వామి, వినాయకుడు, రకరకాల అమ్మవార్లు,రాముడు, కృష్ణుడు, ఆంజనేయస్వామి, అయ్యప్పస్వామి మొదలైన దేవతలలో ఎవరికీ వేదప్రామాణికత లేదు. అసలు నేటి పాపులర్ దేవతలెవరూ వేదాలలో లేనేలేరు.వీరందరూ పురాణకాలంలో పుట్టుకొచ్చారు. రకరకాల కట్టుకధలూ పిట్టకధలూ అల్లడం ద్వారా వారికి వేదాలతో లింకును తర్వాత తీసుకొచ్చుకున్నాం మనం. నిజం చెప్పాలంటే మన దేవతలలో చాలామంది మనం కల్పించుకున్నవారే. నిజం చెప్పాలంటే, వీరిలో చాలామందికి వెనుక లోకల్ ట్రెడిషన్స్ మాత్రమే ఆధారంగా ఉంటాయి. ఆ ట్రెడిషన్స్ నుంచీ, చారిత్రిక కధలనుంచీ, నమ్మకాల నుంచీ పుట్టి, ఆ తర్వాత వేదప్రామాణికత అద్దబడి, ఒక గుడీ పూజా పునస్కారమూ మొదలైన తంతులు తయారై నేటి స్థితికి ఎదిగివచ్చిన దేవతలే వీరందరూ. అంతేగాని వేదాలలో వీరి పేర్లు కూడా లేవని నేను చెబితే మీకు ఆశ్చర్యం కలుగవచ్చు.
అయినా నా పిచ్చిగాని, దయానంద సరస్వతి వంటి మహాపండితుడు పచ్చినిజాలను చెబితేనే ఈ పిచ్చి జనం నమ్మలేదు. ఇక నేను చెబితే ఎవడు నమ్ముతాడు గనుక !!
అయినా నా పిచ్చిగాని, దయానంద సరస్వతి వంటి మహాపండితుడు పచ్చినిజాలను చెబితేనే ఈ పిచ్చి జనం నమ్మలేదు. ఇక నేను చెబితే ఎవడు నమ్ముతాడు గనుక !!
సరే, ఏది ఏమైనప్పటికీ, వజ్రయానంలో ఛిన్నమస్తాదేవిని ఏ పేరుతో పిలుస్తారో చెబితే సూడో తాంత్రికులకు ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ ఆమెను 'ఛిన్నముండ' అని పిలుస్తారు. కంగారు పడకండి. ముండ అనే మాటకు అసలైన అర్ధం తల, పుర్రె అని. భర్త చనిపోయిన బాలవితంతువులకు గుండు చేసి కూచోబెట్టె దురాచారం పాతకాలంలో మన సమాజంలో ఉండేది. అలా గుండు చేసి ఆమెకు 'ముండ' అని పేరు పెట్టేవారు. అది 'ముండమోసింది', 'ముండమోపి' అనేవారు. ఆ పదం క్రమేణా ఒక తిట్టుగా రూపాంతరం చెందింది గాని అసలైన అర్ధంలో అది తిట్టు కాదు. చండాసురుడు, ముండాసురుడు అని రాక్షసులు ఉండేవారని వారిని అమ్మవారు సంహరించింది గనుక ఆమెకు 'చండముండాసుర నిషూదిని' అని పేరు వచ్చిందని దేవీ పురాణాలు చెబుతాయి. కాళికా దేవి మెడలో ఉండే పుర్రెల దండకు 'ముండమాల' అని పేరు. ఆమెకు 'ముండమాలా విభూషిణి' అని పేరుంది. కనుక 'ముండ' అనే పదం తిట్టు కాదు. 'ఛిన్నముండ' అనే పేరు విని గుడ్లు తేలెయ్యనవసరం లేదు. దాని అర్ధం 'తెగిన తల' అని మాత్రమే. 'మస్తిక', 'మస్త' అంటే ఏమిటో 'ముండ' అంటే కూడా అదే అర్ధం.
బహుశా 'ఛిన్నముండ' అని పిలిస్తే బాగుండదన్న ఉద్దేశ్యంతోనేమో ఈ దేవతను బౌద్ధం నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు 'ఛిన్నమస్త' 'ఛిన్నమస్తిక' అని మార్చారు మనవాళ్ళు.
(ఇంకా ఉంది)