9-7-1963 నుండి 9-7-1967 వరకూ జరిగిన నాలుగేళ్ళ కాలంలో యూజీగారి జీవితం గొప్ప మలుపులు తిరిగింది.
ఆ సమయంలో ఆయన జాతకంలో శుక్ర శుక్ర బుధ దశనుండి శుక్ర కుజ శని దశ వరకూ నడిచింది.
1963 సెప్టెంబర్ లో లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన పారిస్ చేరుకున్నాడు. ఒక గమ్యమంటూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఇండియాకు ఉన్న తన తిరుగుప్రయాణపు టికెట్టును అమ్మివేయగా 350 డాలర్లు వచ్చాయి. ఘనానందస్వామి ఇచ్చిన 50 డాలర్లు ఉన్నాయి. ఆ డబ్బుతో పారిస్ లోని ఒక చిన్న హోటల్ రూములో ఉంటూ, డిసెంబర్ వరకూ కాలక్షేపం చేశాడు. రోజుకొక్క ఛీజుముక్కను మాత్రం తినేవాడు. అదే ఆయన ఆహారం.
అప్పట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడైన చార్లెస్ డి గాల్ "360 రకాల ఛీజులను చేసే దేశాన్ని పాలించడం చాలా కష్టం' అనేవాడు. ఈ మాటను వినిన యూజీగారు ఫ్రాన్స్ లో అన్ని రకాల ఛీజులుంటాయా? అనిన సందేహంతో రోజుకొక కొత్తరకం ఛీజును తింటూ ఉండేవాడు. నిజంగానే రోజుకొక కొత్తరకం ఛీజు చొప్పున ఏడాదికి 365 రకాల ఛీజులను అక్కడ తయారు చేస్తారు. ఆ విధంగా ఆ మూడునెలలు గడిచాయి.
ఆ సమయంలో ఆయనకు శుక్ర శుక్ర శని నుండి శుక్ర శుక్ర బుధ దశ వరకు నడిచింది. శుక్రుడంటే కేతువని, శుక్ర - శని అంటే శుక్ర - కేతువులేనని ముందే చెప్పి ఉన్నాను. వాళ్ళేం చేస్తారో కూడా గత పోస్టులో చెప్పాను. ఇక, బుధుడు బుద్ధికారకునిగా ఈయన యొక్క బుద్ధిని సూచిస్తున్నాడు. 12-3 భావాల అధిపతిగా అంతచ్చేతనను, భావవ్యక్తీకరణను సూచిస్తాడు. కనుక శుక్ర శుక్ర బుధ దశలో భావవ్యక్తీకరణ తగ్గిపోయింది. దానికసలు అవకాశమే లేదు.
లండన్ వీధులలో తిరిగినట్లే పారిస్ వీధులలో కూడా గమ్యరహితంగా తిరుగుతూ ఉండేవాడాయన. ఆ తిరగడానికి ఒక అర్ధమేమీ ఉండేది కాదు. కాసేపిక్కడ, కాసేపక్కడ, ఈ విధంగా అన్నిచోట్లకూ గాలికి ఎగురుతున్న ఎండుటాకులా ఆయన పరిస్థితి ఉండేది.
కుండలిని ఒక మనిషిలో నిద్రలేచిందంటే ఊరకే కూచోదు. ఆ మనిషి మెదడు, సెంట్రల్ నెర్వస్ సిస్టం, హార్మోన్ సిస్టం, ఎండోక్రిన్ గ్రంధులు అన్నీ సమూలమైన మార్పులకు లోనౌతాయి. ఈ రోజున్నట్లుగా రేపు ఆ మనిషి ఉండడు. రోజురోజుకూ మారిపోతూ ఉంటాడు. అతని మనసుకూడా అతని అదుపులో ఉండదు. అతని భావజాలమంతా సమూలమైన మార్పులకు లోనౌతుంది. చివరకు మనసే లేకుండా పోతుంది. అలాంటి మార్పులను తెస్తుంది కుండలిని. ఒక్కొక్కసారి ఈ ప్రక్రియలో గుండె ఆగిపోయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది.
అందుకే కుండలిని అంటే ఆటలు, మాటలు కాదు. కుండలిని నిజంగా నిద్రలేస్తే ఇక నీ ఒళ్ళు నీ అదుపులో ఉండదు. ప్రతిరోజూ ఎన్నో మార్పులు నీ దేహంలో జరిగిపోతూ ఉంటాయి. అవి సుఖంగా ఏమీ ఉండవు. వాటిని నువ్వు ఆపలేవు. కేవలం ప్రేక్షకపాత్రగా చూస్తూ ఉండటం తప్ప, ఆ నరకం అనుభవించడం తప్ప, నువ్వు ఏమీ చేయలేవు. అవధూతస్థితికి ముందు స్థితి అలా ఉంటుంది.
చాలామందికి ఈ విషయాలన్నీ తెలీక, కుండలిని అంటే ఏదో పిల్లచేష్టలనుకుంటూ ఉంటారు. రోజూకాసేపు ముక్కు మూసుకుని అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలు కుండలిని నిద్రలేస్తుంది, వెంటనే మన ఇష్టదేవత మన ఎదురుగా ప్రత్యక్షమై వరాలిచ్చేస్తుంది. లేదా మోక్షం వచ్చి ఒళ్ళో కూచుంటుంది. అనుకుంటారు. అలా ఏమీ జరగదు. జరుగుతుందని ఎవరైనా చెబితే అది పక్కా మోసమే.
సరే, చేతిలో ఉన్న 400 డాలర్లు ఆ విధంగా అయిపోయాక, మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న ఎదురైంది. చెయ్యటానికేమీ లేదు. చెయ్యాలని మనసూ లేదు. చివరికా స్థితిలో, జెనీవాలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు వెళ్లి, తన పరిస్థితిని వివరించి, తనను ఇండియా పంపించెయ్యమని వారిని అడిగాడాయన. వాళ్ళు కుదరదన్నారు.
ఈ సంభాషణనంతా అక్కడున్న వాలెంటైన్ డి కెర్విన్ అనే ఒక స్టాఫ్ మెంబర్ వింటూ ఉన్నది. నిజానికి ఎంబసీలో ఆమె ఒక భాషా అనువాదకురాలుగా పనిచేస్తున్నది. ఆ రోజున ఫ్రంట్ డెస్కులో ఉండవలసిన స్టాఫ్ సెలవు పెడితే, ఆ స్థానంలో ఆమె పనిచేస్తున్నది. యూజీగారు ఎంబసీవారితో మాట్లాడుతూ ఉండటమంతా ఆమె విన్నది. యూజీగారి నిజాయితీ ఆమెకు నచ్చింది. ఆయనపైన ఆమె జాలిపడింది. వెంటనే ముందుకొచ్చి, ఈ సమస్య తేలేవరకూ తనతో బాటు తన ఇంట్లో ఉండవచ్చని యూజీగారిని ఆహ్వానించింది.
వాలెంటైన్ గారి జాతకాన్ని ఆమె జీవితాన్ని ఇంకొక సీరీస్ లో పరికిద్దాం. ప్రస్తుతానికి ఒక చిన్నమాటను మాత్రం చెప్తాను. వాలెంటైన్ ఒక మామూలు వనిత కాదు. ఆమె ఒక కారణజన్మురాలు. అమ్మవారి అంశ ఆమెలో ఉంది. కనుకనే ముక్కూ ముఖం తెలియకపోయినా, నమ్మి యూజీగారికి ఆమె ఆశ్రయాన్ని కల్పించింది. అంతేకాదు, ఒకసారి ఆయనేమిటో అర్ధమయ్యాక, తనకు తండ్రినుండి సంక్రమించిన ఆస్తిని, తన పెన్షన్ ను, అంతటినీ కలిపి ఒక ట్రస్ట్ ను ఏర్పరచి, తనున్నా లేకపోయినా, యూజీగారికి నెలఖర్చులకు జీవితాంతం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆమె ఏర్పాటు చేసింది. ఆ విధంగా 1967 లో మొదలైన వారి విచిత్రబంధం 1991 లో తన 90 వ ఏట ఆమె బెంగుళూరులో చనిపోయేవరకూ నిరాఘాటంగా కొనసాగింది.
ఆమె చనిపోయాక, ఆమె డైరీలను వెతుకుతుంటే, అందులో యూజీగారిని గురించి ఆమె వ్రాసుకున్నది బయటపడింది. యూజీగారిని ఆమె ఎలా అర్ధం చేసుకున్నదో ఆమె మాటలలోనే చూద్దాం. ఆమె ఫ్రెంచి భాషలో వ్రాసుకున్న మాటలకు ఇంగ్లీషు అనువాదం ఇది.
"Where can I find a man like him? I have at last met a man, a man the like of whom can be met very rarely"
ఇది తెలుగు అనువాదం.
"ఇటువంటి మనిషి ఎక్కడ దొరుకుతాడసలు? చిట్టచివరకు నేనొక నిజమైన మనిషిని కలుసుకున్నాను. ఇటువంటి మనుషులను చాలా అరుదుగా మాత్రమే మనం కలుస్తాం".
ఇంకొక సందర్భంలో, యూజీగారి గురించి హిందీనటి పర్వీన్ బాబీతో మాట్లాడుతూ వాలెంటైన్ ఇలా అన్నారు, "I have known a lot of men in my life; he is the kindest man I have known in my life." (నా జీవితంలో ఎంతోమందిని నేను చూచాను. నా జీవితంలో నేనెరిగిన అందరిలోకీ ఈయన అత్యంత దయాహృదయుడు).
యూజీగారిని ప్రపంచానికి అందించే నాటకంలో ఒక ముఖ్యపాత్ర వాలెంటైన్ కు ఇవ్వబడింది. అది ఆమె అదృష్టం. జగజ్జనని ఆ పాత్రకు ఆమెను ఎన్నుకుంది.
ఎలాగైతే, 1893 సంవత్సరంలో, చేతిలోని పత్రాలు పోగొట్టుకుని, దిక్కులేని పరిస్థితిలో శోషవచ్చి చికాగోలో రోడ్డుపైన పడిపోయే స్థితిలో ఉన్న వివేకానందస్వామిని మేరీ హేల్ అనే అమెరికన్ వనిత రక్షించి, తన ఇంటిలోనికి తీసుకెళ్లి మంచినీళ్ళిచ్చి ఆదుకున్నదో, అదేవిధంగా 1963 డిసెంబర్లో యూజీగారికి కూడా వాలెంటైన్ అనే యూరోపియన్ వనిత ఆసరాగా నిలబడి ఆదుకుని సంరక్షించింది.
70 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘటన పునరావృతమైంది. ప్రాంతాలు వేరు కావచ్చు, వ్యక్తులు వేరు కావచ్చు, కానీ స్పందించిన ఇద్దరూ స్త్రీమూర్తులే కావడం, అందులోనూ నిస్వార్ధప్రేమమూర్తులు కావడం వింతలలో వింత ! కాళికామాత లీలలంటే ఇలాగే ఉంటాయి మరి !
చొక్కాలో దాచిపెట్టిన బూడిదను గాల్లోంచి తీసినట్టు నటిస్తూ బయటకు తియ్యడం, రాళ్లముక్కలను మింగి, తెముల్చుకుని, లింగాలంటూ వాటిని కక్కడం, ఇలాంటి పిచ్చిచేష్టలు అసలైన అద్భుతాలు కావు.
పిచ్చిజనాల్లారా ! అసలైన అద్భుతాలంటే ఇవి ! కాస్త కళ్ళు తెరిచి చూడటం నేర్చుకోండి ! మీరూ మీ దురాశాపూరిత జీవితాలూ !
ఇక మనకధలో ముందుకెళదాం !
ఆ విధంగా వాలెంటైన్ సంరక్షణలోకి యూజీగారు వచ్చారు. ఒక వారం తర్వాత, "మేము మా ఖర్చులతో మిమ్మల్ని ఇండియాకు పంపించలేము. అది సాధ్యం కాదు" అని ఎంబసీ వాళ్ళు చెప్పేశారు. ఇక ఆయన వాలెంటైన్ తోనే ఉండిపోయాడు. మిగిలిన కథ అంతా చంద్రశేఖర్ బాబు, మహేష్ భట్, ముకుందరావు, మొదలైనవారు వ్రాసిన యూజీగారి జీవితం గురించిన పుస్తకాలలో చూడండి. వాళ్ళు ఆయనను బాగా ఎరిగినవాళ్లు, ఆయనతో ఎన్నో ఏళ్ళు జీవించినవాళ్లు. అదంతా వివరించి చాలా బాగా వ్రాశారు.
ఇకపోతే, నిద్రలేచిన కుండలినీశక్తి, ఆయన దేహంలో తనపనిని తాను చేసుకుంటూ పోతోంది.
కుండలిని ముఖ్యంగా పెద్దమెదడు, చిన్నమెదడు, కేంద్రనరాల వ్యవస్థ, గ్రంధుల వ్యవస్థలపైన పనిచేసి వాటి పనితీరులలో సమూలమైన మార్పులు తెస్తుంది. మన దేహంలో పిట్యూటరీ, పినియల్, హైపోతాలమస్ అనే గ్రంధులు మెదడులో ఉంటాయి. ఇవి సహస్రార ఆజ్ఞాచక్రాలకు స్విచ్చుల వంటివి. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధులు గొంతుభాగంలో ఉంటాయి. ఇవి విశుద్ధచక్రానికి సంబంధించబడినవి. థైమస్ గ్రంధి ఛాతీమధ్యలో గొంతుభాగం క్రిందుగా ఉంటుంది. ఇది అనాహతచక్రానికి సంబంధపడి ఉంటుంది. పాంక్రియాస్ గ్రంధి మణిపురచక్రంతో ముడిపడి ఉంటుంది. గోనాడ్ గ్రంధులు స్వాధిష్టానచక్రంతో ముడిపడి ఉంటాయి. ఎడ్రినల్ గ్రంధులు మూలాధారచక్రానికి చెందినవి.
జాగృతకుండలిని వల్ల యూజీగారి దేహంలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉండేవి. ఆయా గ్రంధులు ఉబ్బి ఆయన చర్మంపైన రకరకాల రంగులలో కనిపించేవి. అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన దేహంలోని ఎడమభాగం స్త్రీలాగాను, కుడిభాగం పురుషునిలాగాను మారిపోయింది. ఆయన ఛాతీ కూడా ఎడమవైపు స్త్రీ కున్నట్లు, కుడివైపున పురుషుని లాగాను ఉండేదట. రెండుకళ్ళల్లో కూడా కుడికన్ను ఒక విధంగా, ఎడమకన్ను మరొక విధంగా ఉండేదట. ఈ విధంగా యోగగ్రంధాలలో చెప్పబడిన మార్పులన్నీ ఆయన దేహంలో స్పష్టంగా బయటకే కనిపిస్తూ ఉండేవి. అమావాస్య పౌర్ణమి రోజులలో ఆయన దేహం అతలాకుతలమై పోతూ ఉండేది. ఇతరులకూ తనకూ భేదం ఆయనకు తెలిసేది కాదు. అసలు తను బ్రతికున్నానా, చనిపోయానా కూడా తెలిసేది కాదు. ఈ మార్పులన్నీ ఈ నాలుగేళ్ళ కాలంలో అంచెలంచెలుగా ఆయన దేహంలో వచ్చేశాయి.
ఆయన దేహమంతా విద్యుత్తు ప్రవహించడం మొదలైంది. ఆయన తన రెండు అరచేతులను రుద్దుకుంటే చక్కుమని మెరుపులు వెలిగేవి. నిద్రలో పక్కమీద దొర్లితే ఆ గదిలో మెరుపులు మెరిసేవి. తన పక్కమీద ఉన్న సిల్కు బట్టవల్ల అలా స్టాటిక్ విద్యుత్తు ఏర్పడుతున్నదేమో అనిన అనుమానంతో పక్కగుడ్డలను మార్చేసి, కాటన్ దుప్పట్లను వేసినప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉండేది. కాళ్లలోనుంచి విద్యుత్తు ఎర్త్ అవుతుంటే, దానిని ఆపడానికి ఆయన ఇంట్లో కూడా చెప్పులేసుకుని నడిచేవాడు. స్నానం చేద్దామని షవర్ కింద నిలబడితే, నీళ్ళు తగలడంతోనే ఒళ్ళంతా కరెంట్ షాకు కొట్టేది.
ఇదంతా ఆయన యొక్క యూరోపియన్ స్నేహితులు, సన్నిహితులు చూచారు. ఎందరో డాక్టర్లు, శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించారు. వారికేమీ అర్ధం కాలేదు.
ఈయనలోని ఈ మార్పులను గమనించిన నవీనకాలపు యోగపితామహుడు తిరుమలై కృష్ణమాచార్య, 'ప్రస్తుతం జీవించి ఉన్న అత్యున్నతుడైన యోగి' గా యూజీగారిని గురించి చెప్పేవారు.
"మీలో జరుగుతున్న మార్పులు నా ఊహకు అనుభవానికి మించి ఉన్నాయని" కృష్ణమాచార్యగారి తనయుడు మరియు హఠయోగంలో పండిపోయిన ఆచార్యుడు దేశికాచారి గారు అనేవారు.
యూజీగారిలో జరిగిన మార్పులను గురించి వినిన కంచి పరమాచార్యులవారు "ఇది జీవన్ముక్త స్థితి" అని అన్నారు.
కనుక, తెలిసినవారికి మాత్రమే తెలుస్తుంది. మనబోటి వారికి అటువంటి స్థితులు ఎలా అర్ధమౌతాయి?
ఇప్పుడు కొద్దిగా జ్యోతిషశాస్త్రం వైపు దృష్టి సారిద్దాం.
సాధనాపరంగా చూచినపుడు గ్రహాలను గురువర్గం శుక్రవర్గం అని రెండువర్గాలుగా విభజించవచ్చు. ఒకటేమో దేవతావర్గం, రెండవది దానవవర్గం. శుక్రాచార్యుడు దానవగురువు. ఆయనకు మృతసంజీవినీవిద్య తెలుసు. దేవగురువుకు కూడా అది తెలియదు. మృతసంజీవని అంటే కుండలినీవిద్యనే. అజ్ఞానంలో పడిఉన్నవాళ్ళు చచ్చినవాళ్ళకిందే లెక్క. జ్ఞానులైనవాళ్లు బ్రతికినవాళ్లు. అజ్ఞానిని జ్ఞానిగా మార్చేది కుండలిని. అంటే, చనిపోయినవాడిని బ్రతికిస్తుంది.
అందుకే, యూజీగారి జాతకంలో కూడా శుక్రదశలోనే కుండలినీజాగృతి జరిగింది. కుండలినీశక్తిని సూచించే రాహుకేతువులు కూడా, మన పురాణాల ప్రకారం రాక్షసులేనని మనం గుర్తుంచుకోవాలి.
ఈ విధంగా నాలుగేళ్లు గడిచాయి. 1967 సంవత్సరం వచ్చేసింది. జూలై నెల 9 వ తేదీ యూజీగారి పుట్టినరోజు. ఆరోజున సానెన్ లో తన ఇంటిని ముందున్న ఒక చెస్ట్ నట్ చెట్టుక్రింద ఒక బెంచీమీద ఆయన కూచుని ఊరకే శూన్యంలోకి చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద విస్ఫోటనం ఆయన దేహంలో జరిగింది. అది ఒక ఆటంబాంబు పేలుడు లాంటిది. ఆ రోజునుంచీ ఏడురోజులపాటు ఆయనలో అనేక మార్పులు చకచకా జరుగుతూ వచ్చాయి. ఏడవనాటికి అవి పూర్తయ్యాయి. అప్పటివరకూ ఆయనకున్న మనస్సు నాశనమైపోయింది. ఆలోచన పూర్తిగా అంతరించింది.
బుద్ధునికి రావిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. రావిచెట్టు బ్రహ్మ-విష్ణు-శివుల సమ్మిళిత స్వరూపం. యూజీగారికి చెస్ట్ నట్ వృక్షం క్రింద అమనస్కస్థితి సిద్ధించింది. మహనీయులకు అటువంటి స్థితులను అందించిన వృక్షాలకు కూడా చాలా ప్రాముఖ్యతలుంటాయి. అయితే అవి అందరికీ అర్ధం కావు.
ఈ చెట్టును సంస్కృతంలో నాగకేసర వృక్షమంటారు. నాగాహ్వ, అహిపుష్ప అనికూడా అంటారు. నాగకేసరమనే మాట కుండలినీశక్తికి, వికసించిన యోగచక్రాలకు సూచిక. ఆ చెట్టు క్రిందనే యూజీగారికి అటువంటి స్థితి కలగడం కాకతాళీయం ఏమాత్రం కాదు. అది ప్రకృతి చేసిన ఒక మార్మిక ఏర్పాటు మాత్రమే.
ఇక్కడ మరొక్క విషయాన్ని చెప్తాను. రామకృష్ణులు నాగకేసరపుష్పాలను చాలా ఇష్టపడేవారు. ఇంతకంటే ఎక్కువగా వివరించను.
అప్పటివరకూ యూజీగారిని ఆయన మనస్సు నడుపుతూ వచ్చింది. ఆ క్షణంనుంచి అది నశించిపోయింది. విశ్వమంతా నిండి ఉన్న ఏదో ఒకశక్తి దానిని తన అదుపులోకి తీసుకొని, సూటిగా దానిని నడపడం మొదలుపెట్టింది. దాని పనిముట్లు దేహంలోని ఎండోక్రిన్ గ్రంధులు. ఆయనలోని పినియల్, పిట్యూటరీ గ్రంధులు పూర్తిగా ఉత్తేజితాలై, విశ్వశక్తికి ప్రతిస్పందిస్తూ, ఆయన దేహాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకుని నడపడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్లూ ఆ పనిని మనసు చేస్తూ ఉండేది. ఇప్పుడు విశ్వశక్తి, గ్రంధుల వ్యవస్థ దానిని తమ చెప్పుచేతలలోకి తీసుకున్నాయి.
యోగపరిభాషలో ఈ రెండుగ్రంథులను 'ఆజ్ఞాచక్రం' అంటారు. అందుకే, ఆ చక్రానికి రెండు దళాలున్నాయని యోగశాస్త్రం అంటుంది. ఆ దళాలే ఈ రెండుగ్రంధులు. ఇవి మాస్టర్ గ్లాండ్స్. అంటే దేహంలోని ప్రతిభాగాన్నీ ఇవి కంట్రోల్ చేయగలవు. ఆజ్ఞాపించి నడిపించగలవు. అందుకే వీటిని "ఆజ్ఞాచక్రం" అన్నారు.
ఆజ్ఞాచక్రం జాగృతమైతే దేహంలో ఇదంతా జరగాలి. కానీ, క్రియాయోగులమని, కుండలినిని సాధించామని, లోకలోకాలు సూక్ష్మశరీరంతో తిరుగుతామని గప్పాలు కొట్టుకునే నేటి జోకర్లలో ఎవడిలోనూ ఈ మార్పులు కనిపించవు. అందుకే ప్రతివాడూ, "నాకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయింది, కుండలిని లేచింది" అని చెబుతుంటే నాకు చచ్చే నవ్వొస్తూ ఉంటుంది. "మీ కర్మ ! అనుభవించండి" అనుకుంటూ ఉంటాను.
మన కధలోకొద్దాం.
దేనికోసమైతే దాదాపు 40 ఏళ్లుగా తాను వెదుకుతున్నాడో ఆ జ్ఞానోదయం అనేదేమీ అసలు లేనేలేదని యూజీగారికి అర్ధమైపోయింది. తన మనసే తనకు అడ్డు అని అర్ధమైంది. ఆ మనసే మాయమైంది. లేకుండాపోయింది. ఆ క్షణంలోనే ఆయన యొక్క వెదుకులాట అంతమైపోయింది. అమనస్కస్థితి ఆయనకు సిద్ధించింది.
చాలామంది "రాజయోగం" అనేమాటను తెలిసీ తెలియకుండా వాడేస్తూ ఉంటారు. సాంఖ్య, తారక, అమనస్కయోగాల కలయికకే రాజయోగమని పేరు. వీటిల్లో ఒకదానికంటే మరొకటి పైమెట్లలో ఉంటాయి. అమనస్కయోగాన్ని సాధించినవాడే రాజయోగి అనిన పదానికి అర్హుడు.
కనుక, యూజీగారు ఒక రాజయోగి అని చెప్పాలి. అందుకే ఆయన ఒక రాజులాగానే బ్రతికాడు. రాజులు సంపాదించరు. సేవకులు మాత్రమే సంపాదిస్తారు. రాజులకు సంపాదనతో అవసరం ఉండదు. కానీ, దేనికీ వారికి లోటుండదు. యూజీగారి జీవితమే దీనికి సజీవతార్కాణం.
ఇకపోతే, జ్ఞానోదయమైనవాడికి అది జ్ఞానోదయమని తెలియదు. ఆత్మజ్ఞానికి తాను ఆత్మజ్ఞానినని తెలియదు. అదే ఆ స్థితియొక్క విచిత్రం. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు తరచూ "నాది తెలిసీ తెలియని స్థితి" అంటూ ఉండేవారు.
స్థూలంగా చెప్పాలంటే, మనల్ని నడిపించేది మన మనస్సు. మనస్సంటే ఏమిటి? జ్ఞాపకాల గుట్ట. జ్ఞాపకాన్ని నియంత్రించే మెదడు భాగం ఏమిటి? ఒకటి కాదు. చాలా ఉంటాయి. అవన్నీ కలసి జ్ఞాపకాలను దాచిపెడతాయి, మళ్ళీ గుర్తు చేస్తాయి, అదే దారిలో మనల్ని నడిపిస్తాయి. ఆ భాగాలేంటి? Hyppocampus, Amygdala, PFC, Cerebellum లు ఈ పనిని చేస్తాయి. వాటికి కావలసిన స్రావాలను పినియల్, పిట్యూటరీ గ్రంధులు విడుదల చేస్తాయి. అప్పుడు జ్ఞాపకాల పరంపర మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దీనికే మనసు అని పేరు.
అయితే, ఈ వ్యవస్థ అంతా మన జీన్ కోడ్ ను బట్టి నడుస్తుంది. దానికే సంస్కారాలని పేరు. గతజన్మలలో మనం చేసిన పనులు, ఆలోచించిన ఆలోచనలే జీన్ కోడ్ రూపంలో ఉంటాయి. వాటికి తగిన తల్లిదండ్రులకే మనం పుట్టడం జరుగుతుంది. ఈ విధంగా, కోటానుకోట్ల జీవులకు పొల్లుపోకుండా జన్మజన్మాంతరాలలో జరుగుతూ ఉంటుంది. దీనినంతా కొంచెంకూడా పొల్లుపోకుండా కోట్ల ఏళ్లనుంచీ నడిపిస్తున్న మహాశక్తినే జగన్మాత, జగజ్జనని, ఆదిశక్తి అని మనం పిలుస్తున్నాము.
మామూలు మనుషులకైతే ఇలా జరుగుతూ ఉంటుంది. కుండలినీశక్తి నిజంగా జాగృతమైన యోగులలో అయితే, ఈ వ్యవస్థ అంతా తారుమారౌతుంది. మెదడులోని అన్ని భాగాలు, కేంద్రాలు, గ్రంధులు అన్నీ పూర్తిగా నిద్రలేచి పనిచేయడం మొదలుపెడతాయి. ఒక క్రొత్త వ్యవస్థ వారి దేహాన్ని తన చెప్పుచేతలలోకి తీసుకుంటుంది. ఇక, వారి దేహంపైన వారికి నియంత్రణ ఉండదు. వారి మనస్సు ఆగిపోతుంది గనుక, విశ్వశక్తి వారిదేహాన్ని నడిపించడం మొదలుపెడుతుంది.
మనస్సు లేదు గనుక, లోకాన్ని వారు చూచేతీరు మారిపోతుంది. వారి ఇంద్రియానుభూతులు మారిపోతాయి. వారి జీవనవిధానం అంతా ఒక క్రొత్త పంథాను అనుసరిస్తుంది. వారి గతం అంతరిస్తుంది. ప్రతిక్షణం వారికి క్రొత్తగానే ఉంటుంది. ఒక అప్పుడే పుట్టినపిల్లవాడు చూచినట్లు లోకాన్ని వారు చూస్తుంటారు. కుండలినీ జాగృతి మనిషిలో ఇన్ని మార్పులను తీసుకొస్తుంది.
ఆ రోజున యూజీగారికి ఇదే జరిగింది. ఇప్పుడు దీనివెనుక ఉన్న జ్యోతిష్యకోణాలను పరికిద్దాం.
9-7-1963 న యూజీగారి జాతకంలో శుక్ర కుజ శని బుధ శని దశ నడిచింది. చతుర్ధాధిపతిగా శుక్రుడు మనస్సును సూచిస్తాడు. కేతువుతో కలసినందువల్ల మనస్సు ధ్వంసమైపోయింది. కుజుడు పంచమాధిపతి. అంటే బుద్ధిని సూచిస్తాడు. అక్కడున్న నీచరాహువు వల్ల బుద్ధి నాశనమైపోయింది. శని సప్తమ, అష్టమాధిపతి. మనస్సును బుద్ధిని సూచించే చంద్రబుధులతో కలసి నీచరాహువుచేత చూడబడుతున్నాడు. రాహువంటే కుండలినీశక్తి గనుక దాని జాగృతివల్ల అవి రెండూ మాయమయ్యాయి. అంటే, పైన చెప్పిన మెదడులోని భాగాలన్నీ ఆజ్ఞాచక్రం (పినియల్/ పిట్యూటరీ గ్రంధుల) కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి. ఇక బుధుడేమో బుద్ధికారకుడు, పైగా 12-3 భావాల అధిపతిగా భావవ్యక్తీకరణ లోపించడాన్ని సూచిస్తున్నాడు. తనలో ఏమి జరుగుతున్నదో దానిని ఏ యోగీ బయటకు చెప్పలేడు. చెప్పినా, అది వాళ్ళ అనుభవంలో లేదు గనుక, వినేవాళ్లకు అది అర్ధం కాదు.
కనుక, ఆనాటి దశ యూజీగారిలో జరిగిన కుండలినీజాగృతిని, తత్ఫలితంగా ఆయనకు సిద్ధించిన అమనస్కస్థితిని స్పష్టాతిస్పష్టంగా సూచిస్తున్నది.
ఆనాటి (9-7-1967) గోచారగ్రహాలను పరికిద్దాం.
చతుర్ధమైన తుల రాహుకేతువులచేత కొట్టబడుతూ, మనోనాశాన్ని సూచిస్తున్నది. జననచంద్రునిపైన ఉచ్ఛగురువు సంచరిస్తూ ఉత్తమగజకేసరీయోగాన్నిస్తున్నాడు. జాతకంలో ఉచ్ఛగురువు ఉండటం ఒక అదృష్టయోగం. ప్రస్తుతం కూడా గోచారగురువు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. రవిబుధులు 12 వ భావంలో పడి, బుద్ధినాశనాన్ని సూచిస్తున్నారు. 9 వ భావమైన మోక్షరాశిలో శని ఉంటూ, సిద్ధిని సూచిస్తున్నాడు. యూజీగారి జాతకంలో సర్వాష్టకవర్గులో మీనమేషాలకు అత్యధికంగా 37 మరియు 40 బిందువులొచ్చాయి. అక్కడే గోచార శనిరాహువులున్నారు.
పై విశ్లేషణను బట్టి, ఆనాడు యూజీగారికి అమనస్కసిద్ధి కలిగిందని స్పష్టంగా గోచరిస్తున్నది. అందుకే ఆయన చెప్పినదంతా కుదించి కొద్దిమాటలలో చెప్పాలంటే, ఆయన మాటలలోనే Mind is a myth అని చెప్పవలసి వస్తుంది.
అయితే ఆయనలాంటి మనుషులు ఆమాటను చెబితే ఒక అర్ధముంటుంది. మనలాంటి వాళ్లూ, 24 గంటలూ మనసులో పడి కొట్టుకుంటున్నవాళ్లూ ఆ మాటను అంటే బాగోదు. హాస్యాస్పదంగా ఉంటుంది.
అందుకే ఆయన మనకు అర్ధం కాడు. మనస్సు పరిధిలో మాత్రమే బ్రతకడానికి అలవాటు పడినవాళ్లకు, మనస్సును దాటిన భూమికలో నిరంతరం ఉండేవాళ్ళు ఎలా అర్ధమౌతారు?
అసలు మనం ఆయనను అర్ధం చేసుకోవలసిన అవసరమేముంది? మనం అర్ధం చేసుకోకపోతే ఆయనకొచ్చిన నష్టం మాత్రం ఏముంటుంది?
అటువంటి మనుషులకు, ఒకళ్ళు వారిని అర్ధం చేసుకుంటే ఎంత? అర్ధం చేసుకోకపోతే ఎంత? ఎవడెట్లా పోతే వాళ్లకేంటసలు?
