'గురువుగారు ! మీ అవతార ప్రయోజనం ఏమిటి?' అని ఒక శిష్యపరమాణువు ఇప్పుడే ఫోన్లో అడిగాడు.
తడుముకోకుండా, 'చిక్కుముడులు విప్పడం, చిక్కుల్లో పడెయ్యడం' అని చెప్పాను.
'అవతలనించి మౌనం !
'ఏం ! అర్ధం కాలేదా ?' అడిగాను.
'లేదు. ఈ మాటే పెద్ద చిక్కుముడిలాగా ఉంది' అన్నాడు.
'మనసులో మాట బయటికి రానీయ్' అన్నాను.
'ఎప్పుడో 30 ఏళ్ళక్రితం తప్పిపోయిన రాజ్ కిరణ్ జాతకం ఇప్పుడెందుకు గురూగారు?' అన్నాడు చనువుగా.
'రహస్యం చెప్పనా?' గొంతు తగ్గించి గుసగుసగా అడిగాను.
రహస్యమనేసరికి మనవాడికి ఉత్సాహం ఎక్కువైపోయింది.
'చెప్పండి చెప్పండి' అన్నాడు.
'నిన్న రాజ్ కిరణ్ కనిపించి, తన జాతకం రాయమన్నాడు. సోమీ అలీ లాంటి కొందరు తనకోసం ఇంకా వెదుకుతున్నారని, బాలీవుడ్ కూడా తనకోసం వెదుకుతోందని చెప్పాడు. ఈ సందిగ్దతకు ఆఖరుచుక్క పెట్టమన్నాడు. అందుకే రాశా' అన్నాను.
'పోయినోళ్ళ జాతకాలెందుకు గురూగారు? బ్రతికున్న మావి చెప్పచ్చు కదా !' అడిగాడు.
'నాకు బ్రతికున్నవాళ్ళు ఇష్టం ఉండరు' అన్నాను.
'మాకు చెబితే కాస్త ఉపయోగంగా ఉంటుంది కదా?' అడిగాడు.
'మీకు ఉపయోగపడాల్సిన పని నాకు లేదు. ఎవరికి నిజంగా అవసరమో నాకు తెలుసు. వారికే పడతాను. ఇదే నా అవతార ప్రయోజనం' అన్నాను సీరియస్ గా.
'మీ ఆవతారప్రయోజనాన్ని మాకోసం కొంచెం మార్చుకోలేరా?' దీనంగా అడిగాడు.
'లేను. పెట్టెయ్ ఫోను' అన్నాను.
ఫోన్ కట్ అయిపోయింది.