వారం రోజులనుండీ బెంగుళూరులో మకాం.
ఇవాళ మహాలయ అమావాస్య.
మహాలయ అమావాస్య అంటే ఏమిటి? ఈ రోజున మనమేం చెయ్యాలి? మొదలైనవన్నీ వివరించే కుతూహలం నాకు లేదు.
అమావాస్యా, పౌర్ణమీ ఛాయలలో నన్ను కదిలించకుండా కొంతమంది ఉండలేరు. అలా జరిగిన సంఘటనలను వ్రాయకుండా నేనూ ఉండలేను.
నిన్నొక కుండ దగ్గరనుంచి ఫోనొచ్చింది. కుండంటే ఏమీ లేదు. ఈ మధ్య కుండలిని ఫ్యాషన్ అయిపోయింది కదా. కుండలినీ సాధన చేయాలనీ, చేస్తున్నామనీ చెప్పుకునే అర్భకులను అలా పిలవడం నాకలవాటు.
'నేనొక గురువుగారి దగ్గర కుండలినీ సాధన చేశాను. కుండలిని కొద్దిగా లేచింది. మళ్ళీ పడుకుంది. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుందామని అనుకుంటున్నాను. గైడ్ చేయగలరా?' అనేది దాని సారాంశం.
ఇలాంటివాళ్లకు ఎలా సమాధానం చెబుతానో మీకు గతంలో చాలాసార్లు తెలిసినా, మళ్ళీ వినక మీకు తప్పదు. ఏమంటే, జీవితం నిత్యనూతనం కదా ! కొత్త కొత్త మనుషులు తగులుతూనే ఉంటారు. సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.
'నిద్రపోయేవారిని లేపడం మంచిది కాదు. నాకిష్టం ఉండదు. నువ్వూ ఆ పనిని చేయకు' అని జవాబిచ్చాను.
కుండకు అహం దెబ్బతింది.
'మీరు యోగామీద చాలా పుస్తకాలు వ్రాశారని మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను. మీరేమో ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీకసలు కుండలిని తెలుసా?' అడిగింది కుండ.
'చిన్నప్పుడు తెలుసు' అన్నాను.
'అంటే?' అడిగింది కుండ.
'ఏభై ఏళ్ల క్రితం' అన్నాను.
'ఎవరి దగ్గర మీరు నేర్చుకున్నారు?' అడిగింది.
'వాళ్ళెవరూ మీకు తెలియదు. వాళ్లిప్పుడు లేరుకూడా. నేటి కార్పొరేట్ జోకర్ గురువులు కారు వాళ్ళు' అన్నాను.
కాసేపు మౌనంగా ఉంది కుండ.
'మరి మాకు నేర్పిస్తారా?'అడిగింది చివరకు.
'నేర్పిస్తాను. కానీ అందరికీ నేర్పించను' చెప్పాను.
'అంటే?' మళ్ళీ సందేహం వచ్చింది కుండకి.
'నాకు నచ్చినవాళ్లకు, నా పరీక్షలు పాసయినవాళ్లకు మాత్రమే నేర్పిస్తాను' అన్నాను.
'మీ దగ్గర నేర్చుకుంటే ఏమౌతుంది?' అడిగింది.
'కుండ పగులుతుంది' అన్నాను.
మళ్ళీ మౌనం.
'గురువుగారు ! నేను సీరియస్ గా సిన్సియర్ గా అడుగుతున్నాను' అన్నది కుండ.
'నువ్వు సీరియసో కాదో నీకు తెలియాలి. సిన్సియరో కాదో నేను నిర్ణయిస్తాను' అన్నాను.
'ఇంతకీ నా సమస్యకు పరిష్కారం?' అడిగింది.
'నేర్పించిన మీ గురువుగారున్నారు కదా. ఆయన్నెందుకు అడగవు?' అన్నాను.
'ఆయనకు బ్రెయిన్ ఆపరేషనైంది. అప్పటినుంచీ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనంటే నమ్మకం పోయింది' అన్నది కుండ.
'లోపల ఖాళీగా ఉందని మళ్ళీ కుట్లేశారా?' అడిగాను నవ్వుతూ.
'అవును. ఆయనకూడా అదే అన్నాడు' అంది కుండ తనుకూడా నవ్వుతూ.
'పోన్లే. ఒకటన్నా నిజం చెప్పాడు. పాతకాలంలో 'పిచ్చి తలకెక్కింది' అనేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్నీ, మీ గురువుల్నీ చూస్తుంటే, 'కుండలిని తలకెక్కింది' అనవలసి వస్తోంది. అంటే, కుండలిని తలకెక్కితే బ్రెయిన్ ఆపరేషన్ చేయిస్తారా మీ గురువుగారి ఆశ్రమంలో?'అడిగాను.
'ఏమో మరి ! ఆయనంటే డబ్బులున్నాయి గనుక చేయించుకున్నాడు. అందరికీ ఎందుకు చేయిస్తారు?' అంది కుండ.
'మరి మీకు తలకెక్కితే మీ గతేంటి?' అడిగాను.
'తెలీదు' అంది.
'సరే ! నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి ఒక విషయం చెప్పు. మీ గురువుకైనా, నీకైనా, లేచింది ఏ కుండలిని?' అడిగాను.
కుండకు అర్ధం కాలేదు.
'అదేంటి? మీరు మాట్లాడేది నాకర్ధం కావడం లేదు' అన్నది.
'కుండలినిలో ఎన్నిరకాలున్నాయో మీ గురువుగారు నీకు చెప్పలేదా?'అడిగాను.
'అదేంటి? దానిలో రకాలున్నాయా? మాకలా చెప్పలేదే?' అంది.
'మరి ఏం చెప్పారు? కపాలభాతి నేర్పించి కొట్టుకోమన్నారా?' అడిగాను నవ్వుతూ.
'గురువుగారు ! మాకవన్నీ తెలియదు. పోనీ మీరు చెప్పచ్చుగా' అడిగింది కుండ.
'మీరు ట్రై చేస్తున్నది ప్రాణకుండలిని. ఇదిగాక చిత్ కుండలిని, పరా కుండలిని అని ఇంకా రెండున్నాయి' అన్నాను.
కుండ మౌనం వహించింది.
జాలేసింది.
'ఇంకావిను. ప్రాణకుండలినిలోనే, సుప్త, అర్ధ, జాగృత, కుల, ఊర్ధ్వ, అధోకుండలినులని ఆరు విభాగాలున్నాయి, ముందు వీటిని తెలుసుకో. మిగిలిన రెండూ తర్వాత తెలుసుకుందువుగాని' అన్నాను.
'మీరు చెప్పేవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. నేనెప్పుడూ వినలేదు' అన్నది కుండ.
'నువ్వు విననంత మాత్రాన ఉండకుండా పోవు' అన్నాను.
ఇంత మాట్లాడిన తర్వాత కుండకు అర్ధమైంది, ఇది ఆన్లైన్ షాపింగ్ లాంటి ఈజీ వ్యవహారం కాదని. ఫోన్ పే చేస్తే చాలు కుండలిని లేవదని.
'మీ దగ్గర నేర్చుకోవాలంటే నేనేం చెయ్యాలి?' అడిగింది చివరకు.
'ఇప్పుడు నువ్వు సరైన మాటను మాట్లాడుతున్నావు. విను చెప్తా. ముందుగా, కుండలినీ సాధన ఎందుకు చేయాలనుకుంటున్నావో నీకు స్పష్టత ఉండాలి. ఇది ఒకళ్ళను చూసి ఇంకొక్కళ్ళు వాతలు పెట్టుకోవడం కాదు. ముందుగా నువ్వూ నీ వ్యక్తిత్వమూ నాకు నచ్చాలి. తరువాత, నువ్వు మా ఆశ్రమంలో కనీసం రెండువారాలు ఉండి సాధనలు నేర్చుకోవాలి. ఇంటికెళ్లి దీక్షగా సాధన చెయ్యాలి. ఆ తరువాత నీ జీవనవిధానాన్ని మార్చుకోడానికి సిద్ధపడాలి. అంటే, నీ తిండీ, నీ స్నేహాలూ, వ్యాపకాలూ, హాబీలూ, లైఫ్ స్టయిలూ అంతా మార్చుకోవాలి. అప్పుడప్పుడూ వచ్చి, నీ సాధనను నాకు చూపించి, దిద్దుకుంటూ, క్రొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉంటుంది ఈ సాధన. నీ కిష్టమైతే, తట్టుకోగలిగితే, రా నేర్పిస్తాను' అన్నాను.
'ఎన్నాళ్ళు పడుతుంది?' అన్నది కుండ.
'ఒక జీవితకాలం పడుతుంది, ఇంకా చెప్పాలంటే అదీ చాలదు.' అన్నాను.
'ఎంత ఛార్జి చేస్తారు?' అడిగింది కుండ.
ఈ ప్రశ్నను చాలామంది నుండి వినీవినీ నాకు విసుగెత్తింది.
'నీ కెపాసిటీని బట్టి నువ్వు ఛార్జ్ కావచ్చు' అన్నాను.
'అది కాదు. నేనడిగేది కోర్సు ఫీజు గురించి' అంది.
'ఫీజూ లేదు, గ్రీజూ లేదు. నీకు ఫ్యూజు ఎగిరిపోవడమే నా ఫీజు. సాధనలో నీ ప్రోగ్రెస్ నచ్చితే నేనే నీకు ఎదురు డబ్బులిస్తాను' అన్నాను.
ఆలోచనలో పడింది కుండ.
'సీరియస్ గా సిన్సియర్ గా డౌట్ లో పడ్డావా?' అడిగాను నవ్వుతూ.
'అంటే, ఇంత చెయ్యడం కుదరదేమో అని ఆలోచిస్తున్నాను' అన్నది.
'అదే నేను చెప్పింది. ఎంతమందిని ఇప్పటికి చూసి ఉంటానంటావు నీవంటివాళ్ళని?' అడిగాను.
కుండ మౌనంగా ఉండిపోయింది.
'పోనీ ఒక పనిచెయ్యి. తేలికమార్గం చెప్తాను' అన్నాను.
'చెప్పండి' అంది.
'కుండలో నీళ్లు తాగి, ఒళ్ళు కదలకుండా ఇంట్లో పడుకొని, యూటూబు చూసుకుంటూ ఉండు. ఈసారి కుండలిని ఇంకా బాగా లేస్తుంది' అన్నాను.
ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ వస్తుందేమో అని కాసేపు చూశాను. రాలేదు.
అర్ధమైంది. నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టాను.
అమావాస్య పిచ్చోళ్ళకి కుండలిని కావాలట ! అదేదో రోడ్డుపక్కన కుండలో కుల్ఫీ అనుకుంటున్నారేమో కొనుక్కుని తినడానికి !
ఏదేమైనా, ఒక అమాయకుడిని మోసం చెయ్యకుండా, నిష్టూరంగా ఉన్నప్పటికీ నిజాన్ని మాత్రమే చెప్పి పంపినందుకు నాపైన నాకే తృప్తి కలిగింది.
ఫోన్ పెట్టేసి, కనీసం నేనైనా కుండలో మంచినీళ్లు త్రాగుదామని కిచెన్లోకి దారితీశాను.