3-12-1982 న, మరపురాని కథతో, సంగీతంతో, సందేశంతో తీయబడిన 'అర్ద్' సినిమా విడుదల అయింది. మహేష్ భట్ తీసిన చిత్రాలన్నింటిలోకీ ఇది మరపురాని చిత్రంగా ఈనాటికి కూడా నిలిచిపోయింది. ఆ రోజున ఇతని జాతకంలో చంద్ర-శుక్ర-రవి దశ నడిచింది. చతుర్థంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడిని దశమంనుండి ఉచ్చ రవి వీక్షిస్తూ ఉండటం గమనించండి.
కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే. రాశిచక్రంలో చూస్తే, లగ్నాధిపతిగా కుజుడు లాభంలో ఉన్నప్పటికీ, అది శత్రుక్షేత్రం కావడం, సింహంనుండి బాధకుడైన వక్ర శనియొక్క దృష్టికి లోనవ్వడం వల్ల ఆ దశ కలిసిరాలేదు. ఆ సమయంలో క్రమేణా ఇతనికి సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కుటుంబసమస్యలు కూడా ఎక్కువయ్యాయి.
1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. కెరీర్ దెబ్బతినడం, కుటుంబసమస్యలు ఇతన్ని డిప్రెషన్ లో పడేశాయి. మందులు వాడుతూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇతని ఖర్మకాలి సత్యసాయికి భక్తుడయ్యాడు. ఇతని వింశాంశ చక్రాన్ని గమనిస్తే, సరియైన ఆధ్యాత్మిక మార్గం దొరకాలంటే కూడా జాతకంలో పుణ్యబలం ఉండాలని నేను ఎప్పుడూ చెబుతున్న విషయం ఎంత కరెక్టో తెలుస్తుంది.
ఇతని వింశాంశచక్రంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. అక్కడనుండి పంచమమైన కర్కాటకంలో ఐదుగ్రహాలు ఉన్నాయి. కనుక మతిభ్రమించడం, భ్రమలతో కూడిన ధ్యానాలు మొదలైనవి కనిపిస్తున్నాయి. కుజుని ఉచ్ఛత్వం కూడా మొండితనాన్ని, పిచ్చిని సూచిస్తున్నది. ఉఛ్చ కుజునికి, నీచ చంద్రునికి మధ్యలో చిక్కుకుపోయిన గురువు, తన సంస్థకు తానే బందీ అయిపోయిన సత్యసాయిబాబాను స్పష్టంగా సూచిస్తున్నాడు. ఈ కర్మసంబంధం వల్లనే ఇతను సత్యసాయికి భక్తుడయ్యాడు. కానీ ఆయన వల్ల ఇతనికేమీ మేలు జరుగకపోగా, దాడికి గురై, జైల్లో పెట్టబడ్డాడు. పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది.
అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో గురుఛండాలదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?
ఈ సమయంలోనే ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది.
అది 5, జూన్ 1996. ఇతని జాతకంలో రాహు-గురు-రాహుదశ నడుస్తున్నది. ఇది గురుఛండాలదశ. ఆ రోజున ఇతను పుట్టపర్తిలో ఉన్నాడు. అంతకుముందు కొన్ని రోజులనుంచీ అక్కడ ఉంటూ, ధ్యానంలో కాలం గడిపేవాడు. గంటలు గంటలు ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. ఆ రోజున ధ్యానంలో అతనికేం అనిపించిందో తెలియదు.
"సాయిబాబా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, నేనాయనను ఎలాగైనా కలవాలి, ఆయనను కాపాడాలి" అంటూ లోపలికి పోబోయాడు. సెక్యూరిటీవాళ్ళు అడ్డుకున్నారు.
అసలు, ప్రతివాడూ ధ్యానం చెయ్యకూడదు. అందులోనూ, డిప్రెషన్, పిచ్చిధోరణి మొదలైనవి ఉన్నవాళ్ళు దానిజోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే, ధ్యానం వికటిస్తే, మామూలు మనిషికే పిచ్చెక్కుతుంది. ఇక పిచ్చోడికి ఏమౌతుంది? అందుకే, నేటి ఆశ్రమాలలో మామూలు మనుషులకంటే పిచ్చోళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తారు.
మనమేమో వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటాం. వాళ్ళేమో, చూసేవాళ్ళకే పిచ్చని అనుకుంటారు. ఈ పిచ్సిగోలలో, ఎవరికి పిచ్చో, ఎవరికి కాదో ఎవరు తేల్చాలి?
సరే, సాయంత్రం వరకూ ఏదోవిధంగా ఆగిన అతను, చీకటి పడుతున్న సమయంలో ఎవరిదో ట్రాక్టర్ మాట్లాడుకుని, ప్రహారీగోడ పక్కగా దానిని ఉంచి, దానిపైన ఒక నిచ్చెన వేసుకుని గోడ ఎక్కి ప్రశాంతినిలయంలోకి దూకబోయాడు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. సత్యసాయిని చంపడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అందరూ నమ్మేశారు. అతన్ని కొట్టారో లేదో మనకు తెలియదు. అక్కడున్నదంతా పూనకపు మూర్ఖభక్తులే గనుక ఇతనిపైన దాడి చేసే ఉంటారని మనం అనుకోవాలి.
ఇతన్ని అరెస్టు చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తరువాత బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతని తండ్రి బాంబే నుండి వచ్చి, కొడుకును విడిపించుకుని, ఆస్పత్రిలో చేర్చడము, తర్వాత బాంబేకు తీసుకువెళ్లి అక్కడ బైకుల్లా లోని మసీనా ఆస్పత్రిలో చేర్చడము జరిగిపోయాయి.
అదే సమయంలో, అంటే 10 జూన్ 1996 న ఇతనికి రాహు - శనిదశ మొదలైంది. ఇది శపితదశ. ఇక అక్కడినుంచి అసలైన కష్టాలు మొదలయ్యాయి.
ఇతను మసీనా ఆస్పత్రిలో ఉన్నపుడే, విషయం తెలిసిన మహేష్ భట్ వెళ్లి పలకరించి వచ్చాడు. అప్పటికే బాగా పిచ్చిలో ఉన్న రాజ్ కిరణ్ తనతో పెద్దగా మాట్లాడలేదని ఆయనన్నాడు.
గురుఛండాలదశ, శపితదశ, ఏలినాటిశనులు కలసి ఈ విధంగా ఇతని జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి.
మరింత మంచివైద్యం చేయించడం కోసం, అక్కడనుండి, ఇతని అన్నయ్య ఇతనిని అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ న్యూయార్క్ సిటీలో ఉంటూ, పిచ్చికి వైద్యం తీసుకుంటూ ఉండేవాడు. కొన్నినెలల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంటినుండి ఎక్కడికో మాయమైపోయాడు. ఆ సమయంలో రాహు-శని-కేతుదశ నడిచింది. ఆ తరువాత ఇప్పటివరకూ ఇతనెక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు.
సరిగ్గా ఇప్పుడు జ్యోతిశ్శాస్త్రం రంగప్రవేశం చేస్తున్నది !
ఇతని ఆయుష్షును లెక్కించి చూద్దాం.
ఆయుర్దాయవిధానాలు స్థూలంగా మూడున్నాయి. ఒకటి నైసర్గిక ఆయుర్దాయం, రెండు పిండాయుర్దాయం, మూడు అంశాయుర్దాయం. ఇవిగాక, జైమినిపద్ధతిలో మరొక విలక్షణమైన విధానం ఉన్నది. వీటిలో అంశాయువు, జైమినివిధానాలే చాలావరకు సరియైన ఫలితాలనిస్తాయని పండితులంటారు. అనుభవం కూడా ఇదే చెబుతోంది.
జైమినిపద్ధతి ప్రకారం చూడగా,
లగ్నాధిపతి+అష్టమాధిపతి, లగ్నము+చంద్రలగ్నము, లగ్నము+హోరాలగ్నము ఈ మూడు జతలూ చర, స్థిర, ద్విస్వభావరాశులలో ఉండేదాన్ని బట్టి ఆ జాతకుడు పూర్ణాయుష్కుడా (99-66 మధ్య), మధ్యాయుష్కుడా (66-33 మధ్య), అల్పాయుష్కుడా (33-8 మధ్య) అనేది తెలుస్తుంది.
లగ్నాధిపతి, అష్టమాధిపతి ఇద్దరూ కుజుడే అయ్యాడు. ఇతడు స్థిరరాశిలో ఉన్నాడు గనుక పూర్ణాయువైంది. లగ్న, చంద్రులిద్దరూ మేషంలోనే ఉన్నారు, అది చరరాశి గనుక మళ్ళీ పూర్ణాయువైంది. లగ్నమైన మేషం చరరాశి, హోరలగ్నమైన మిధునం ద్విస్వభావరాశి గనుక అల్పాయువైంది. రెండు పూర్ణాయువులు, ఒకటి అల్పాయువు వచ్చింది గనుక సరాసరిగా మధ్యాయువౌతుంది. అంటే 33 - 66 ఏళ్ల మధ్యలో ఇతను మరణిస్తాడు.
అంశాయుర్దాయ విధానాన్ని బట్టి లెక్కించగా ఇతనికి 47 ఏళ్ల ఆయుష్షు వస్తున్నది. ఇతను పుట్టింది 1949 లో గనుక 47 కలిపితే 1996 అవుతుంది. సరిగ్గా ఇదే సంవత్సరంలో పుట్టపర్తి సంఘటన, బెంగుళూరు జైలు, బాంబే పిచ్చాసుపత్రి, అమెరికా వెళ్లడం ఇవన్నీ జరిగాయని ఇతని జీవితం చెబుతోంది. కనుక, అమెరికా వెళ్లిన కొద్దినెలలకు ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏదో ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పవలసి వస్తున్నది.
పోనీ 66 వరకూ ఇతని ఆయుష్షు ఉందేమో అని పరిశీలించగా, మార్చి 1999 తో రాహు-శనిదశ అయిపోయింది. రాహు-బుధదశ 1999-2001 మధ్యలో నడిచింది. బుధుని వక్రత్వం వల్ల, ఆర్గలదోషాలవల్ల ఆ సమయంలో పిచ్చి బాగా ముదిరి ఉండాలి. వెంటనే వచ్చిన రాహు-కేతుదశ 2002-2002 మధ్యలో నడిచింది. అప్పుడుగాని, ఆ తరువాత వచ్చిన రాహు-శుక్ర దశ (2002-2005) లో గాని, ఎక్కువలో ఎక్కువగా ఇతను చనిపోయి ఉండాలి. ఏమంటే, శుక్రుడు ఈ లగ్నానికి మారకుడు.
ఇప్పుడు ప్రశ్నవిధానాన్ని ఉపయోగించి చూద్దాం.
ఈ ప్రశ్నజాతకం నిన్న ఉదయం 9 గంటలకు వేసినది. లగ్నాధిపతి చంద్రుడు 9 వ భావంలో, రాహుకుజులతో ఆర్గళానికి లోనై, మారకుడైన శనితో కలసి ఉంటూ, ఈ జాతకుడు దూరదేశంలో ఒక దుర్ఘటనలో మరణించాడని చెబుతున్నాడు.
ప్రశ్నదశ గురు రాహు బుధదశ వచ్చింది. ఇది గురుదోషంవల్ల మతిభ్రమించడాన్ని సూచిస్తుంది. ఉచ్చగురువు 9 వ అధిపతిగా దూరదేశాన్ని, 6 వ అధిపతిగా తీవ్రమైన గురుదోషాన్ని సూచిస్తున్నాడు. బాధకుడైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఇది భార్యతో గొడవలను సూచిస్తున్నది. కుటుంబస్థానంలోని కేతువు కుటుంబసభ్యులతో వియోగాన్ని సూచిస్తున్నాడు. ప్రశ్నజాతకం కాలగ్రస్తయోగంలో చిక్కుకుని ఉంటూ, తీవ్రమైన గతకర్మను సూచిస్తున్నది.
కనుక, రాహు-బుధ దశలో (1999-2001) ఇతను చనిపోయి ఉండాలి.
కనుక, రిషికపూర్ చెప్పినది, దీప్తి నావల్ చెప్పినది రెండూ కరెక్ట్ కావు. సోమీ అలీ వంటి కొందరు, రాజ్ కిరణ్ కోసం ఈనాటికీ వెదుకుతూ ఉండటం వృధాప్రయాస అని, ఇతను చనిపోయి చాలాకాలమైనదని నేను చెబుతున్నాను.
అమెరికా అన్నికోణాలలోనూ అంతమంచి దేశమేమీ కాదు. మొన్నటికి మొన్న మాయమైన నాన్సీ గుత్రీనే ఇంతవరకూ ఏమైందో అమెరికా పోలీసులే పట్టుకోలేకపోయారు. ఇక దేశంగాని దేశంలో, అదికూడా 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన మనిషిని ఇండియానుండి ఎవరు పట్టుకోగలుగుతారు? అది జరిగే పని కాదు.
అతను మంచివాడే కావచ్చు. వేసిన పాత్రలు కూడా మంచిపాత్రలే కావచ్చు. అతనిని ఎరిగిన మనుషులు అతన్నింకా మర్చిపోలేకపోతూ ఉండవచ్చు కూడా. కానీ కర్మను ఎవరూ తప్పించలేరు. ఇప్పటి మంచితనానికీ, గతకర్మకూ సంబంధం లేదు. అతనిని వెదకడం అనవసరం !
ఇది జ్యోతిషశాస్త్రపు తీర్పు !
డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.
అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.
పెద్దవయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.
వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.
పెద్ద స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?
2017 లో వ్రాసిన ఈ జాతకవిశ్లేషణ మొదటిభాగాన్ని ఇక్కడ చూడండి.