ఈ మధ్యన కొందరు మా ఆశ్రమానికొచ్చారు.
'మా ఫామ్ హౌస్ లో వినాయకుడి గుడి కడుతున్నాం. భోజనాలకు రండి' అని పిలిచారు.
భోజనాలంటూనే పరిగెత్తుకుంటూ పోవడం ఇక్కడ పల్లెల్లో అలవాటు.
' మేమలా భోజనాలకు రాము. ఎవరు పడితే వారు వండినవి మేము తినము' అని వారితో అన్నాము.
వాళ్లకు కాస్త కోపం వచ్చింది.
'అంతా వెజిటేరియనే, మీకేం ఇబ్బంది ఉండదు' అన్నారు వాళ్ళు.
'వెజిటేరియన్ కూడా మాకు ఇబ్బందే. అందుకే మేము రానంటున్నది' అన్నాను
వాళ్ళకర్ధం కాలేదు.
'అదేంటి? బ్రాహ్మలచేతే వండిస్తున్నాము' అన్నారు వాళ్ళు.
'అలా అయితే అసలు రాము' అన్నాము.
వాళ్లకు ఫ్యూజులెగిరిపోయాయి.
'అదేంటి? వినాయకుడి గుడికి రారా?' అన్నారు వాళ్ళు కోపంగా
'వినాయకుడిని చూడటానికి అక్కడకి రావడమెందుకు?' అన్నాను.
'పూజలు భజనలు ఉన్నాయి. రండి' అని బ్లాక్ మెయిల్ చేయబోయారు.
'మీరు పూజలు చేయకపోతే వినాయకుడికేం తక్కువైంది?' అన్నాను.
వాళ్ళదొక రకంగా చూసి వెళ్లిపోయారు.
పిచ్చి జనం, పిచ్చి గోల. ఒక గుడి కట్టడం, పండుగలు పబ్బాలంటూ తంతులు, మైకులతో సౌండ్ పొల్యూషన్, హుండీతో కలెక్షన్. ఇదొక్కటే ఈ పిచ్చిజనానికి తెలిసిన హిందూమతం. ఇలా చెయ్యడమేదో గొప్పని, ఇలా చెయ్యడం ద్వారా హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామని వీళ్లంతా అనుకుంటున్నారు.
అసలైన హిందూమతాన్ని, అసలైన ఆధ్యాత్మికతను అర్ధం చేసుకోవాలంటే వీళ్లంతా ఎన్ని జన్మలెత్తాలో?