చంద్రశేఖర్ గారు యూజీగారి స్మృతులను వ్రాస్తూ 'బ్రహ్మణస్పతి యోగం' అనే ఒక జ్యోతిషయోగాన్ని ఉటంకించారు.
జ్ఞానచక్రవర్తి బిరుదాంకితులైన సత్యనారాయణగారనే జ్యోతిష-వేదపండితుడొకాయన యూజీగారి జాతకాన్ని చూచి, ఆ సమయంలో (ఒకానొక సమయంలో యూజీగారు బెంగుళూరు మైసూరులను సందర్శించినప్పుడు) ఆయన జాతకంలో ఆ యోగం నడుస్తున్నదని అన్నాడు. దీనివల్ల ఈయన యొక్క సాధన ఇంకా లోతులను అందుకుంటుందని, బహుముఖతా విస్తరిస్తుందని, లోకప్రఖ్యాతి కలుగుతుందని ఆయన జోస్యం చెప్పాడట. అలాగే జరిగిందని చంద్రశేఖర్ గారు వ్రాశారు.
జ్యోతిశ్శాస్త్రంలో నాకున్న స్వల్ప అనుభవంలో అటువంటి యోగమెక్కడా నాకు గోచరించలేదు. కాకపోతే, శాస్త్రం అనంతం గనుక, పాండిత్యం కూడా ఆనంతమే గనుక, సత్యనారాయణ గారు దానినెక్కడ చూచారో మనకు తెలియదు గనుక, సందేహలాభాన్ని (benefit of doubt) ఆయనకు ఇచ్చివేసి మనం ముందుకెళదాం.
రాహుకేతువులకు కుండలినీశక్తికి ఉన్న సంబంధాన్ని ఇప్పుడు గమనిద్దాం.
జ్యోతిషశాస్త్రంలో రాహుకేతువులను ఒక మహాసర్పంగా భావిస్తాము. దానికే కాలసర్పమని పేరు. అంటే, కాలానికే మరొక పేరు రాహుకేతువులు. కాలానికి అతీతుడైన మనిషి ఈ భూమ్మీద లేడు గనుక, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అందరూ రాహుకేతువుల అదుపులో ఉన్నవారేనని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కాలసర్పం నోటిలో చిక్కుకుని ఉన్నవారమే అందరమూ.
సర్పానికి తలా తోకా ఉంటాయి. భూమికున్న ఉత్తరదక్షిణ ధ్రువాలే అవి. భూమియొక్క ఉత్తర అయస్కాంతధృవం రాహువైతే, దక్షిణం కేతువౌతుంది. మనం "కాలము" అంటున్నప్పుడు, అది భూమిపైన మనకు అనుభవంలోకి వస్తున్న కాలంగానే మనం చూడవలసి ఉంటుంది. ఇతర గ్రహాలలో ఇతర లోకాలలో ఉన్న కాలప్రమాణాలు మనకు అవసరం లేదు. మనవరకే మనం చూడాలి. అలాంటప్పుడు, భూమిని చుట్టుకుని ఉన్న ఒక మహాసర్పంగా రాహుకేతువులను మనం భావించవచ్చు. నిజానికి అవి రెండూ భూ-అయస్కాంత శక్తులే.
కుండలినీజాగృతి జరగాలంటే జాతకంలో రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో గాని, నీచస్థితిలో గాని ఉండాలని ఇంతకుముందు వ్రాశాను. అయితే, రాహువు వృషభంలో ఉండటానికీ, మిథునంలో ఉండటానికీ తేడా ఉంటుంది. అదే విధంగా నీచలో ఉన్నపుడు వృశ్చికంలో ఉండటానికీ, ధనుస్సులో ఉండటానికీ చాలా తేడా ఉంటుంది. కేతువుక్కూడా ఇంతే అవుతుంది. వాటిని బట్టి ఆయా జాతకుల సాధనావిధానాలు, వారికి కలిగే ఫలితాలు రకరకాలుగా ఉంటాయి.
సాధారణంగా చెప్పాలంటే, ఉచ్ఛజాతకులకు భక్తిమార్గం బాగా యోగిస్తే, నీచజాతకులకు జ్ఞానమార్గం యోగిస్తుంది. భక్తిలోనైనా, జ్ఞానంలోనైనా కుండలినీజాగృతి లేకుండా సాధన ముందుకు కదలదు. అయితే వారి దృష్టి భక్తిమీదనో జ్ఞానసిద్ధిమీదనో ఉంటుంది గాని, కుండలినిని వారు పట్టించుకోరు. ఒక్క యోగమార్గంలో మాత్రమే దానికి విలువనివ్వడం, సూటిగా దానితో డీల్ చెయ్యడం ఉంటుంది. మిగతావారు దీనిని పట్టించుకోరు.
రాహువేమో అనుభవాలను సూచిస్తే, కేతువు వాటికి అతీతమైన స్థితిని సూచిస్తాడు. రాహువు సహస్రారచక్రాన్ని, కేతువు మూలాధారాన్ని సూచిస్తారు. వీరు ఉచ్ఛస్థితిలో ఉంటే జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత కుండలినీజాగృతి కలుగుతుంది. నీచస్థితిలో ఉంటే, జీవితం మొదట్లోనే అనేక ఎదురుదెబ్బలు, గందరగోళాలు జరిగి, జీవితంపైనా మనుషులపైనా విసుగుపుట్టి వైరాగ్యంవైపు మరలుతారు. ఆ ఫలితంగా కుండలినీజాగృతి కలుగుతుంది. ఈ విధమైన తేడాలు జాతకాలలో ఉంటాయి.
ఆయా జాతకాలలో ఉన్న మిగతా గ్రహస్థితులను బట్టి, రాహుకేతువులపైన వారి దృష్టులను, ప్రభావాలను బట్టి వారివారి దారులుంటాయి.
యూజీగారి జాతకంలో రాహుకేతువులు వృశ్చిక - వృషభరాశులలో నీచస్థితిలోను, చంద్రుని నుండి రాహువు బుద్ధిస్థానంలో ఉండటంతో ఆయనది జ్ఞానమార్గపు ఛాయ అయింది.
నాకు తెలిసినంతవరకూ యూజీగారి జాతకంలో బ్రహ్మణస్పతి యోగం కంటే, తపస్వీయోగం బలంగా ఉన్నది. ఈ యోగాన్ని గురించి జైమినీమహర్షి యొక్క జ్యోతిషసూత్రములలో మనకు కనిపిస్తుంది.
సూ || శనిదృష్టే తపస్వీ ప్రేష్యో వా || (జైమిని సూత్రములు 1:2:36)
కారకాంశకు జైమినిమహర్షి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. కారకాంశలో ఉన్న కేతువును శని చూస్తూ ఉన్నట్లయితే ఆ జాతకుడు తపస్విగాని, సేవకుడు గాని అవుతాడని ఆయనన్నాడు. ప్రతి ఉద్యోగీ ఒకవిధంగా సేవకుడేగాని, ఇక్కడ సేవకుడంటే చిన్న ఉద్యోగని అర్ధం చేసుకోవాలి.
శనికేతుయోగం దరిద్రాన్నిస్తుంది. అది కర్మఫలితంగా వచ్చేది కావచ్చు, లేదా ఖర్మకాలి తను ఆహ్వానించేది కావచ్చు. తపస్సుకు కేతువు, సేవకత్వానికి శనీ కారకులు. కనుక మహర్షి ఈ విధమైన సూత్రాన్ని మనకు ఇచ్చారు.
గతకర్మవల్ల ఈ యోగం ఏర్పడితే, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఒకరిక్రింద ఊడిగం చేసుకుంటూ, డబ్బుకోసం ఇబ్బంది పడుతూ, దరిద్రంలో బ్రతికే పరిస్థితి వస్తుంది. ఖర్మకాలి వచ్చే పనైతే, అన్నీ ఉన్నప్పటికీ, నిరాడంబరంగా బ్రతకడం, తినగలిగి ఉన్నా ఉపవాసాలుంటూ మాడటం, లంకంత కొంప ఉన్నా, ఒక చిన్నరూములో చాప వేసుకుని పడుకోవడం, లేదా ఆస్తులన్నీ వదులుకుని ఒక ఆశ్రమంలో ఉండటం, ఒంటిపూట తినడం మొదలైనవి జరుగుతాయి. అది ఆరోగ్యం కోసం కావచ్చు, సాధనగా కావచ్చు. ఎలాగైతేనేమి, చివరకు ఇలాగే జరుగుతుంది.
గ్రహాలమధ్యన ఉన్న పఞ్చవిధసంబంధాల వల్ల యోగాలేర్పడతాయి. భారతీయ జ్యోతిషశాస్త్రమంతా గ్రహయోగాలపైననే ఆధారపడి ఉంటుంది. జాతకంలోని యోగాలను సరిగ్గా గుర్తించడం వస్తే, జ్యోతిషంలో పట్టు చిక్కినట్లే అవుతుంది. ఈ విషయాన్ని పాతపోస్టులలో వివరించాను. కనుక, శనికేతువుల మధ్యనున్న ఐదువిధాలైన సంబంధాలవల్ల తపస్వీయోగం ఏర్పడుతుందని స్థూలంగా అర్ధం చేసుకోవచ్చు.
యూజీగారి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
యూజీగారి జాతకంలో లగ్నం, శనికేతువుల అర్గళంలో ఉన్నది. కేతువు 12 వ భావంలో నీచస్థితిలో ఉంటూ శుక్రుడినే సూచిస్తున్నాడు. శుక్రునితో కలసి ఉన్నాడు. ఈ విధంగా వీరి జాతకంలో తపస్వీయోగం ఏర్పడింది.
అందుకనే, 1961 లో శుక్రదశ మొదలు కావడంతోనే ఆయన "సంపాదన" అనే మాటను తన జీవితంలోనుంచి తీసివేశాడు. ఆయన దగ్గర డబ్బులు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కానీ సంపాదన పైన ఆసక్తి పోయింది. ఎలా బ్రతకాలి? ఏమో? దానికి జవాబు లేదు. కానీ సంపాదన పైన ఇచ్ఛ లేదు. ఇచ్ఛలేనపుడు చెయ్యడం ఎలా సాధ్యమౌతుంది? కాదు. అందుకని ఆయన డబ్బు సంపాదించే ప్రయత్నాలేమీ చేయలేదు. అప్పటికాయనకు కేవలం 43 ఏళ్లే. ఇది తపస్వీయోగ ప్రభావం.
ఆ తరువాత ఆయన 46 ఏళ్ళు బ్రతికాడు. కాణీ సంపాదన లేదు. కానీ, సాధారణ జీవనానికి ఎక్కడా లోటురాలేదు. ఆ విధంగా ఆయనను చూచుకునేవారిని జగన్మాత ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది.
అంతేకాదు, 1963 మే నెలలోనే గోచారంలో కూడా ఇదేయోగం మొదలైంది. ఆ సమయంలో కేతువు ధనుస్సులోకి వచ్చి ఉచ్ఛస్థితిని అందుకున్నాడు. మకరంలో ఉన్న శని తన వక్రత్వం వల్ల ధనుస్సులోకి వచ్చి కేతువును కలసినట్లే అవుతుంది. జూలై నెల వచ్చేసరికి, మిధునం నుండి వీరిని శుక్రుడు చూస్తున్నాడు. కనుక సంసారం దూరం కావడం, కుండలినీజాగృతి, అమనస్కస్థితి మొదలైనవన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఇవన్నీ తపస్వీయోగ ప్రభావాలే.
గోచారగురువు కూడా దీనికి ఆసరాగా ఉంటూ, నవమభావంలో స్వస్థానంలోకి వచ్చి, జననకాలచంద్రుడిని, అక్కడున్న బుధశనులను చూస్తున్నాడు. ఇది తీవ్రవైరాగ్యాన్ని, అంతర్ముఖత్వాన్ని ఇచ్చింది.
ఈ విధంగా యూజీగారి జాతకంలో, మిగిలిన యోగాలకంటే తపస్వీయోగప్రభావం చాలా ఎక్కువగా పనిచేసిందని చెప్పాలి.
ఆయనకు అమనస్కస్థితి సిద్ధించిన 9-7-1967 న కూడా ఇదేయోగం ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడు గమనిద్దాం.
(ఇంకా ఉంది)

