18, ఏప్రిల్ 2026, శనివారం

రాజశ్యామల - బగళాముఖి

కొంతమంది బంధుమిత్రులను కలిసే పనిమీద రెండ్రోజులపాటు హైద్రాబాద్ లో ఉండి ఆశ్రమానికి తిరిగి వచ్చాము. మొదటిసారి హైద్రాబాద్ నరకంలాగా అనిపించింది.

1980 లో నేను హైదరాబాద్ లో మొదటిసారి అడుగుపెట్టాను. బెంగుళూరుకూడా అప్పుడే చూశాను. ఆ రోజులలో ఆ సిటీలు రెండూ స్వర్గాలు. నేడు నరకాలయ్యాయి.

1980 డిసెంబర్ లో చీకటిపడ్డాక దిల్సుఖ్ నగర్ రోడ్డుమీద నడుస్తుంటే, చలి అలవాటు లేనివాళ్లకు స్వెటర్ వేసుకోవలసిన అవసరం అయ్యేది. బడుగువర్గాలు కంబళ్ళు కప్పుకుని చిన్నచిన్న చలిమంటలేసుకుంటూ ఉండేవారు.

నేడు పొద్దున్న పదిగంటలకి రోడ్డుమీద నడుస్తుంటే గాడ్పు కొడుతోంది. వడదెబ్బ తగిలేటట్టుంది. ఒక గంట పనిమీద బయటకెళ్ళి వస్తే, షవర్ క్రింద స్నానం చేసి, ఏసీలో కూర్చోవలసి వస్తోంది. హైద్రాబాద్ వాతావరణం అంతగా పాడైపోయింది. ఇక బెంగుళూరు మాటైతే చెప్పాల్సిన పనే లేదు. జీవితం పైన విరక్తి పుట్టేట్టుగా ఉన్నది.

ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్. నేల, మట్టి, లేవు. చెట్లు లేవు. వెహికిల్ పొగ, పెరిగిపోయిన జనాభా, ఏసీల నుండి వస్తున్న వేడి,  అన్నీ కలసి చల్లటి హైద్రాబాద్ ని నిప్పులకుంపటిగా మార్చేశాయి. నేను విజయవాడలో ఉన్నానా? లేక హైద్రాబాద్ లో ఉన్నానా? అర్ధం కాలేదు. రెండూ ఒకే విధంగా అనిపించాయి.

హైద్రాబాద్  తో పోలిస్తే మా ఆశ్రమం స్వర్గంలాగా ఉంది.

ఈలోపల ప్రక్కనున్న ఒక శిష్యురాలు, 'రాజశ్యామలంటే ఎవరు?' అని అడిగింది ఒక వాల్ పోస్టర్ను చూస్తూ.

అటు చూశాను. విషయం అర్ధమైంది.

'రాజుగారి ఇంట్లో ఉండే శ్యామల' అన్నాను.

'జోకులాపి విషయం చెప్పండి' అన్నది.

'రాజశ్యామలంటూ ఎవరూ లేరు. అదొక మాయ. దశమహావిద్యలలో ఆమె పేరు మాతంగి. ఆమె ఉపాసన  మంచి కవిత్వశక్తినిస్తుంది. మంచిమేధస్సునిస్తుంది. లలితకళలలో మంచి ప్రజ్ఞనిస్తుంది. తారాదేవికే మరొకపేరు శ్యామల. మామూలుభాషలో సరస్వతీదేవి, తాంత్రికప్రపంచంలో మాతంగి అయింది. మన 'తారాస్తోత్రం' చదివావు కదా. అదేంటి? మాతంగి అన్నా, శ్యామల అన్నా ఆమెనే. తెలుగురాని నేను ఇప్పటికి పదివేలపైగా పద్యాలు వ్రాశానంటే అదెలా కుదిరిందంటావు? ఆలోచించు' అన్నాను.

'మరి రాజశ్యామల ఎవరు?' అడిగింది.

'శ్రీవిద్యలో, లలితాపరమేశ్వరిని ఒక రాణిగా అనుకుంటే, ఆమెకొక మంత్రి, ఒక సేనాపతి ఉంటారు. ఆ మంత్రిణీదేవత పేరే మాతంగి. రాజపరివారంలో ఉంటుంది గనుక, రాజ్యాధికారాన్ని నడిపిస్తుంది గనుక రాజశ్యామల అని పేరు మార్చారు. ఈమెకు హోమం చేస్తే రాజ్యాధికారం వస్తుందని మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ రాదు. దశమహావిద్యలు తెలుగువారి చేతులలో భ్రష్టు పడుతున్నాయి. అంతే. 

మహావిద్యలు అవినీతిని సపోర్ట్ చెయ్యవు. అవి మన గొంతెమ్మకోరికలను తీర్చుకునే మంత్రవిద్యలు కావు. పాతాళభైరవి, బాలనాగమ్మ సినిమాలు చూస్తే ఇలాంటి పైత్యాలు పుడతాయి. అవి ఆత్మసాధనా విద్యలు మరియు మోక్షవిద్యలేగాని, మోసవిద్యలు కావు.

నువ్వు చేసే మినప్పప్పు, కందిపప్పు, మిరపకాయల హోమాలతో జగన్మాత కరుణిస్తుందని, నీ గొంతెమ్మ అవినీతికోరికలను తీరుస్తుందని అనుకుంటే అంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి ఉండదు. దురదృష్టవశాత్తూ, గత పాతికేళ్లుగా ఇటువంటి ట్రెండ్ లను కొంతమంది సోకాల్డ్ స్వాములు పెంచి పోషిస్తున్నారు. వీళ్లకు రాజకీయులు వంతపాడుతున్నారు. నేడు దీనినొక వ్యాపారంగా మార్చారు. వెరసి మహావిద్యోపాసనను క్షుద్రవిద్యల స్థాయికి దిగజార్చారు.

దశమహావిద్యలనేవి ఇనుమును బంగారంగా మారుస్తాయి. కానీ మనం వాటినుపయోగించి బంగారాన్ని మట్టిగా మార్చుకుంటున్నాం. రామకృష్ణులు చెప్పలేదా, రాజు దగ్గరకెళ్ళి పుచ్చువంకాయలు కోరతారని? అంతే' అన్నాను.

'మరి తెలిసినవాళ్ళు చెప్పచ్చు కదా?' అన్నది.

'ఎవరు వింటారు? స్వార్ధపుకోరికలతో కుళ్లిపోతున్న ప్రపంచానికి నిజాలెందుకు? మాయలే కావాలి. ఉన్నతమైన భావజాలం ఎవరికుంది? కోరికలు తీరడం, అప్పనంగా కోట్లు వచ్చి పడటం, పవర్ చేతిలోకి రావడం, దానితో మళ్ళీ అవినీతి చేసి వేలకోట్లు వెనకెయ్యడం ఇదేకదా నేటి ట్రెండ్? సమాజంలోగాని, మనుషులలోగాని నీతి ఎక్కడుంది? అసలైన ఆధ్యాత్మికత ఎవడికి కావాలి ఈరోజుల్లో? అన్నీ నకిలీబ్రతుకులేగా?' అన్నాను.

'దశమహావిద్యలలో అన్నీ అంతేనా?'అడిగింది.

'అంతే. ఉదాహరణకు బగళాముఖిని చూడు. మొన్నొకామె 'నేనుకూడా బగళాముఖి చేస్తున్నా' అన్నది. 'రాత్రికి ఉప్మా చేస్తున్నా' అన్నట్టు. 

ఎందుకమ్మా అంటే, 'శత్రుస్తంభన' అన్నది.

'అదేంటంటే, 'శత్రువులు నాశనమైపోతారు' అన్నది.

'ఎవరిదగ్గర ఉపదేశం పొందావు?' అంటే, 'ఉపదేశం ఎందుకు? యూట్యూబ్ లో చూసి మంత్రం జపిస్తున్నా' అన్నది. 

'నువ్వేమైనా దావూద్ ఇబ్రహీంవా? లేక ఏవైనా చీకటివ్యాపారాలు చేస్తున్నావా? అంతమంది శత్రువులు నీకెందుకున్నారు?' అని నేనడిగాను.

'అదికాదు. మన మాట చెల్లుబాటు కావడానికి' అంది.

'నువ్వు ధర్మంగా జీవించడం ముఖ్యంగాని, నువ్వు వాగేది ఏదైనా సరే చెల్లుబాటు కావాలని అసలెందుకు కొరుకుంటున్నావు? శత్రువులైనా ఇంకొకరైనా నాశనం కావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది తప్పుకాదా? పైగా దీనికి బగళాముఖి సపోర్టా? పైగా యూట్యూబ్ లో చూసి జపిస్తున్నావా?' అని అడిగాను.

జవాబు లేకపోగా, 'నీకింతేనా తెలిసింది?' అన్నట్టు చూసింది' అన్నాను.

శిష్యురాలు ఆలోచనలో పడింది.

'అసలీ దేవతలందరూ ఉన్నారా? మనం చేసే అన్నిపనులలో మనకు సపోర్ట్ చేస్తారా?' అడిగింది.

'ఉన్నది ఒకటే శక్తి. దానిని నీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని ఆరాధిస్తున్నావు. అదికాదు ముఖ్యం. నీ జీవితంలో నువ్వెంత శుద్ధంగా బ్రతుకుతున్నావనేది ముఖ్యం. నీ  మంత్రాలకు, హోమాలకు, నైవేద్యాలకు పడిపోవడానికి దేవుడు ఒక వెర్రివెంగళప్ప కాదనే విషయం నువ్వు ముందుగా అర్ధం చేసుకోవాలి.

బగళాముఖి అంటే శత్రుస్తంభన నిజమే. కానీ, వాళ్ళు బయటి శత్రువులు కారు. నీలోపల ఉన్న శత్రువులు. షడ్వర్గాలు స్తంభించడమే శత్రుస్తంభన. మూతపడాల్సింది ఎదుటివ్యక్తి నోరు కాదు, నీ నోరు. విచక్షణాశక్తి నీలో కళ్ళు తెరిస్తే అది జరుగుతుంది. అది అసలైన బగళాముఖి. 

అలాంటిదే రాజశ్యామల కూడా. రాజ్యాధికారం అంటే ఆత్మజ్ఞానం. అది కలగడమే రాజశ్యామల అనుగ్రహం. అంతేగాని, అవినీతిపనులు చేసి కుర్చీ ఎక్కడం కాదు. ఎక్కి, ఇంకా అవినీతి చెయ్యడమూ కాదు. నీ లౌకికవిజయాలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. అది అసలైన మహావిద్యోపాసన' అన్నాను.

'మనం అడిగేది ఏదైనా సరే దేవుడు ఇవ్వడా?' అడిగింది.

'నీ పిల్లలు ఒక గొంతెమ్మకోరిక కోరారనుకో. నువ్విస్తావా?' అడిగాను.

'ఇవ్వను'  అంది

'మరి దేవుడికి నీకంటే తెలివి ఎక్కువుందా? తక్కువుందా?' అడిగాను.  

'మరి ఈ విషయాన్ని ఎవరూ చెప్పడం లేదేంటి?' అడిగింది.

'వాళ్ళూ వాళ్ళూ వ్యాపారభాగస్వాములేగా. నిజాలను ఎందుకు చెప్తారు? చెప్పినా వినేదెవరు? అందరూ అదే అవినీతిగుంటలో ఉన్నవారేగా?' అన్నాను.

'మరి ఈ గోలతో హిందూధర్మం నాశనం కావడం లేదా?'అడిగింది.

'నాశనమయ్యేది ధర్మమెలా అవుతుంది?  ధర్మం నాశనం కాదు. మనం అవుతాం. సమాజంలో వెర్రిపోకడలు పెరుగుతున్నాయి. అంతే. అందుకే రాజశ్యామల, వారాహి, ఛిన్నమస్త, ప్రత్యంగిర, ఉగ్రభైరవి మొదలైన దేవతల ఆరాధన పెరుగుతున్నది. మనుషులలో పెరుగుతున్న పిచ్చికోరికలకు, దౌర్జన్యపూరిత ధోరణులకు ఇది సంకేతం. 

గీతలో కృష్ణభగవానుడు చెప్పలేదా, ఎవరెవరి సంస్కారాలను బట్టి వారువారు ఆయా దేవతలను కొలుస్తారని? సాత్వికం, రాజసికం, తామసికం అంతే. సత్త్వం తగ్గిపోతున్నది. తక్కిన రెండూ పెరుగుతున్నాయి. దానికి తగినట్టే దేవతారాధన కూడా ఉంటోంది. మన కర్మకూడా దానికి తగినట్టే ఉంటుంది. కర్మకు తగినట్టే ఫలితం ఉంటుంది. నీ కర్మను ఏ దేవతా తగ్గించదు. నువ్వే తగ్గించుకోవాలి. వీళ్ళు ఇంకా ఇంకా పెంచుకుంటున్నారు. తెలుసుకునేనాటికి సమయం చేజారిపోతుంది. అంతే' అన్నాను.

'అలాగా' అంది శిష్యురాలు సాలోచనగా.

మాటల్లోనే ఇల్లొచ్చేసింది. కారు దిగి ఇంట్లోకి దారితీశాను.