ఈయన తండ్రి L. K. సింఘానియా చాలా ధనవంతుడు మరియు వ్యాపారవేత్త. కనుక 3.01 pm తర్వాత ఇతను పుట్టి ఉండాలి. అప్పుడు మకరలగ్నం మేషనవాంశ అవుతుంది. 4.00 లోపు మేషంనుండి కన్యవరకూ నవాంశలు నడుస్తాయి. వీటిలో మేషనవాంశ అయినప్పుడే జీవిత సంఘటనలు సరిపోతున్నాయి. అందులోనూ 3. 01 pm అయితేనే ఇవన్నీ సరిపోతాయి.
కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం.
1980 - రేమాండ్స్ గ్రూపుకు చైర్మన్ అయ్యాడు. అప్పుడు గురు రాహుదశ నడిచింది. రాహుకేతువులు నవాంశచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని చూడవచ్చు.
2000 - ఈ సంవత్సరంలో రేమాండ్స్ సంస్థ పగ్గాలను మూడవ సంతానమైన గౌతమ్ సింఘానియాకు అప్పగించాడు. బుధ బుధ దశ నడిచింది. 9 వ భావమైన కన్యలో 8 వ భావాధిపతి సూర్యునితో కలసి ఉచ్చ బుధుఁడున్నాడు. కనుక అధికారమూ సంపదా రెండూ తనచేతినుంచి జారిపోయాయి. భావాద్భావ సూత్రాన్ని బట్టి 9 వ స్థానం కూడా సంతానభావమే.
20 మార్చి 2006 - పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ముంబాయి మేయర్ అయ్యాడు. బుధ రవి కేతు దశ నడిచింది. ఉచ్ఛస్థితిలో ఉన్న బుధునితో రవి కలసి నవమస్థానంలో ఉన్నాడు. కేతువు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.
2015 లో రేమాండ్స్ సంస్థలో తన వాటా (37%) ను కూడా కొడుక్కి ఇచ్చేశాడు. అక్కడే లీగల్ గొడవలు మొదలైపోయాయి. అప్పుడు బుధ శని కుజ దశ నడిచింది. ఈ దశలో మానసికచింత, గొడవలు సహజమే.
87 ఏళ్ల వయసులో 28 మార్ఛి 2026 న చనిపోయాడు. ఆ రోజున శుక్ర రవి రాహు గురుదశ నడిచింది. పెద్దవయసులో వచ్చేవి తప్ప చెప్పుకోదగ్గ జబ్బులేమీ లేవు. దశలు సరిపోతున్నాయి. కనుక, ఇదే ఈయన జననసమయంగా అనుకోవచ్చు.
ఈయన జాతకంలో ఉన్న బలమైన గురుదోషం వల్ల కొడుకులతో, వారి పిల్లలతో, గొడవలు, కోర్టుకేసులు, మనోవ్యధ కలిగాయి. తన ఇంటినుండి గెంటివేయబడ్డాడు. ఏ ముంబాయికైతే తను మేయర్ గా పనిచేశాడో, ఎక్కడైతే ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడో, అదే ముంబాయిలో ఒక అద్దెఇంటిలో ఉంటూ చనిపోయాడు. An Incomplete Life అనే ఆత్మకథను పుస్తకంగా వ్రాసి అసంతృప్తితో కన్నుమూశాడు.
12,000 కోట్లు సంపాదించి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కూడా చివరకు అసంతృప్తితో కుటుంబపు గొడవలతో చనిపోయాడంటే, ఇతని జాతకంలో గురుదోషం ఎంత బలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
దీనికంతటికీ కారణం, మూడవకొడుకు గౌతమ్ సింఘానియాతో ఉన్న ఆస్తిగొడవలు. మూడవ కొడుకును సూచించే 9 వ భావంలో ఉచ్చబుధుడు, రవి ఉన్నారు. రాహుకుజులతో శనికేతువులతో ఆర్గళంలో ఉంటూ, చాలా తెలివైన సంతానాన్ని, అదేసమయంలో బలమైన సంతానదోషాన్ని సూచిస్తున్నారు.అందుకే, ఆస్తిని కంపెనీని అన్నింటినీ మూడవకొడుకుకు రాసిచ్చేయగానే ఈయన రోడ్డున పడ్డాడు. పద్మభూషణ్ అవార్డును అందుకుని, అంతర్జాతీయస్థాయిలో ఒక వెలుగు వెలిగిన రేమాండ్స్ దిగ్గజం చివరకు అద్దెఇంటిలో దిక్కులేకుండా చనిపోయాడు.
గురుదోషం అంటే ఇలా ఉంటుంది !
మరి అన్నిదోషాలనూ పిచ్చిపిచ్చి హోమాలతో, పిచ్చిపిచ్చి రెమెడీలతో బాగుచేస్తామని డప్పు కొట్టుకునే జ్యోతిష్కులు పాపం ఈయనకు అందుబాటులో లేరా? ఉన్నా, ఈ గురుదోషాన్ని తొలగించడం వారివల్ల కాలేదా? లేక ఈయన దగ్గరున్న పన్నెండువేలకోట్లు ఆ దోషాన్ని పోగొట్టడానికి సరిపోలేదా?
దీనివల్ల రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా?
ఒకటి - జాతకదోషాలు అంత తేలికగా పోవు. మామూలు జ్యోతిష్కులకు అర్ధంకాని లోతులు దీనివెనుక ఉంటాయి.
రెండు - డబ్బులు పారేసి చేసే రెమెడీలతో అవి అస్సలు లొంగవు. మీ అవినీతిసొమ్ము జ్యోతిష్కుడికి చేరడం తప్ప దీనివల్ల జరిగేది ఇంకేమీ ఉండదు.
జాతకదోషాలను పోగొడతానని, పోగొట్టగలనని, ఏ జ్యోతిష్కుడైనా డప్పు కొట్టుకుంటుంటే, ఆ మాటలు నమ్మారంటే, మీరు మోసపోతున్నట్లే. జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులు అతనికి తెలీకనైనా ఉండాలి. లేదా మిమ్మల్ని అతను మోసం చేస్తూనైనా ఉండాలి. రెండూ కూడా కావచ్చు.
మీరు పెట్టుకునే ఉంగరాలవల్ల, చేసే దొంగపూజలవల్ల, తిరిగే గుళ్ళవల్ల మీ జాతకదోషాలు ఎక్కడికీ పోవు. మీరు దేనినైనా మోసం చేయవచ్చుగాని, మీ కర్మను మోసం చేయలేరు.
ఈ జాతకం చూచాక కూడా అర్ధం కాలేదా?
అయితే మీ కర్మ !
