17, ఏప్రిల్ 2026, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 60 (పునర్జన్మలు)

మర్నాడు ఉదయం 'వ' దగ్గర కాసేపు కూర్చుని వద్దామని వెళ్ళాము.

మాటల సందర్భంలో,  'ఈ ఏడాది జనవరిలో ఇక్కడివారు,  వేరేచోట్ల ఉన్న అమ్మ భక్తులు, చాలామంది పోయారు' అని 'వ' అన్నది.

'అవును. అమ్మను చూచినవారు, మాట్లాడినవారు, సన్నిహితంగా మెలిగినవారు అందరూ  వెళ్లిపోతున్నారు. ఒక స్వర్ణయుగం గతిస్తున్నది'  అన్నాను.

ఆమేం మాట్లాడలేదు.

'అమ్మ పునర్జన్మ లేదన్నది కదా ! మరి వీళ్ళందరూ ఏమౌతారు? ఎక్కడకు పోతారు?' అడిగాను.

'వ' ఇలా అన్నది.

'పునర్జన్మ లేదని అమ్మ ఖరాఖండిగా చెప్పలేదు. ఏదైనా ఒక సందర్భంలో అలా అని ఉండవచ్చు. విన్నవాళ్ళు దానిని ఒక సిద్ధాంతంగా మార్చారు. అమ్మ అలా అనలేదు. 'సముద్రంలో అలలవంటివి జన్మలు. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కానీ ఏ రెండు అలలూ ఒక్కటి కావు' అన్నది. దానిని వీళ్ళు అలా అర్ధం చేసుకున్నారు'.

'ఒకకోణంలో పునర్జన్మ ఉన్నది. మరొక కోణంలో లేదు. క్రొత్త అల వస్తుంది. పాత అలగా మాత్రం మళ్ళీ రాదు.  నిజమే. ఇది చాలా లోతైన భావన' అన్నాను.

'అవును. అమ్మ చెప్పేవన్నీ ఇలాగే ఉండేవి. ఆమె దేనినీ వివరించి చెప్పదు, క్లుప్తంగా, సూక్ష్మంగా చెబుతుంది. వినేవారు ఎవరికి అర్ధమైనట్లుగా వారు అన్వయించుకొని అర్ధం చేసుకున్నారు' అన్నది 'వ'.

'పునర్జన్మ ఉండటం నిజమే. రికార్డ్ అయిన కేసులే చాలా ఉన్నాయి. కానీ అదే జన్మ  మళ్ళీ రాదనేది కూడా నిజమే. అదే మనుషులుండరుకదా మళ్ళీ అలాగే పుట్టడానికి? ఆత్మ లేదన్న బుద్ధుడే తను గతంలో 500 జన్మలెత్తానని అన్నాడు. అబ్రహామిక్ మతాలకు ఉన్నతమైన తాత్వికచింతన లేదు గనుక, వాటి స్వర్గాలు నరకాలు వాటికున్నాయి. వాళ్లకు బంధమోక్షాల గురించిన చింతన లేదు. పైగా అవి శాశ్వతస్వర్గం, శాశ్వతనరకం. అది చాలా మోటుభావన.

క్రైస్తవస్వర్గంలో ఎప్పుడూ సండే చర్చి జరుగుతూ ఉంటుంది. కాయర్ పాడుతూ, దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. అక్కడ ప్రతిరోజూ ఆదివారమే. నాలుగురోజులు పోయాక అదే పెద్ద నరకమనిపిస్తుంది. ఇక ఇస్లామిక్ స్వర్గంలో పచ్చికబయళ్ళు, పారే సారాయి సెలయేర్లు, ఒక్కొక్కరికి 72 మంది అమ్మాయిలు, ఒక లాస్ వెగాస్ లాగా ఉంటుంది. అదీ మూన్నాళ్ళ ముచ్చటేగా. కొన్నాళ్ళకు అదీ బోరు కొడుతోంది. లేదా అమ్మాయిలకోసం అక్కడకూడా కొట్టుకుని చస్తారు. స్వర్గంలో ఛస్తే ఇంకెక్కడికి పోతారో ఏమో? ఇలా ఉంటుందా అసలన్న బుర్ర కూడా వాళ్లకు లేదు. ఆ మతాల తెలివి అంతవరకే. 

మన మతంలో చెప్పబడిన పునర్జన్మ అనేదే సత్యమైన సైన్టిఫిక్ భావన. అది వాస్తవం కూడా. అమ్మ ఏదో ఒకరితో మాట్లాడుతున్న సందర్భంలో 'ఆ వ్యక్తికి ఇక పునర్జన్మ లేదు' అని ఉండవచ్చు. దానిని జెనరలైజ్ చెయ్యడం తప్పు. శాంతిదేవి కేసు నుండి నేటివరకూ రికార్డు కాబడిన రుజువులు చాలా ఉన్నాయి. కనుక పునర్జన్మ వాస్తవమే' అన్నాను

'ఈ తాత్వికచర్చలు నాకు రుచించవు. అమ్మ ఉన్నపుడు అమ్మ చెప్పినట్లు చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. నాకు తెలిసినది ఇంతవరకే' అన్నది 'వ'.

'మీకు అవసరం లేకపోవచ్చు. మీకు కేవలం విశ్వాసమే సరిపోవచ్చు కూడా. కానీ అందరికీ మీ దారి నచ్చకపోవచ్చు కదా ! తాత్వికచింతన ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకది అవసరమే. నన్నడిగితే, అమ్మ బలమంతా అమ్మయొక్క తాత్వికచింతనే అంటాను. అది వేదాంతమే. అది చాలా అవసరం. లేదంటే చివరకు ఇదంతా వ్యక్తిపూజగా మారే ప్రమాదం ఉన్నది. కోరికలు, మొక్కులు, అమ్మని ఒక దేవతగా మార్చి పూజలకు పరిమితం చెయ్యడం. ఇదే చేస్తారు చివరకు ఈ భక్తులు. మహనీయులందరినీ ఇలాగే మార్చారు చివరకు' అన్నాను.

'వ' మౌనం వహించింది.

నేను లేచి సెలవు తీసుకుని బయటకు వచ్చేశాను.