'విశ్వాత్మ గారికి టిబెటన్ మాంక్స్ తో థాట్ వేవ్స్ ద్వారా సంబంధాలుండేవి' అన్నాడు శ్రీనివాస్.
'ఆయన సత్యసాయిని నమ్ముతాడని నువ్వు చెప్పినప్పుడే ఆయన గ్రాఫు దిగిపోయింది. ఇటువంటి భ్రమలు ఆయనకుండటం వింతేముంది?' అన్నాను.
'అలా అనకండి. ఆయన వాళ్ళతో రాత్రుళ్ళు మాట్లాడుతూ ఉండేవాడు' అన్నాడు.
'టిబెట్ చైనాలో ఉంది కదా. అక్కడకు ఫోన్ కనెక్షన్ ఉందా? చైనా ప్రభుత్వం అనుమతిస్తుందా?' అడిగాను.
'అబ్బా. థాట్ వేవ్స్ తో నండి' అన్నాడు శ్రీనివాస్ విసుగ్గా.
'అర్ధమైందిలే. కొద్దిగా జోకులెయ్యనీయ్. లేదంటే డిస్కషన్ సీరియస్ గా మారే ప్రమాదం ఉంది' అన్నాను.
'ఆయన రేపు చనిపోతాడనగా, ఇవాళ రాత్రంతా నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు' అన్నాడు.
'అవధూతలంటే అంతే. రాత్రుళ్ళు నిద్రపోకుండా అందరినీ కదిలిస్తూ ఉంటారు. లేదా, రేపు పోతానని ముందే తెలిసిందేమో. తను దాచిపెట్టిన నిధి ఎక్కడుందో నీకు చెప్పి పోదామనుకుని ఉంటాడు. నిధెక్కడుందో చెప్పాడా మరి?' అన్నాను.
'జోకులాపండి ప్లీజ్' అన్నాడు.
'సరే చెప్పు' అన్నాను.
'అదేమీ లేదు. అప్పుడప్పుడూ నాతో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అప్పుడప్పుడూ ఒక మాటనేవాడు. 'మనకెప్పుడైనా బాగా సంతోషం కలిగినపుడు, 'నాకు ఇవాళ భలే సంతోషంగా ఉంది. అయామ్ వెరీ హేపీ' లాంటి మాటలు అనకూడదు. అన్నామంటే, వెంటనే ఒక పెద్దసమస్య తలెత్తుతుంది. నీ సంతోషమంతా ఆవిరైపోతుంది. ఇదొక సైకలాజికల్ రూల్' అనేవాడు. కానీ ఆరోజు రాత్రి నాతో మాట్లాడుతూ, 'జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంది నాకివాళ' అన్నాడు. ఆ రాత్రి చాలాసార్లు ఆ మాటన్నాడు. మర్నాడు యాక్సిడెంటయింది. నడిరోడ్డుమీద చనిపోయాడు' అన్నాడు.
'ప్రకాశం బ్యారేజి మీదనో, సీతానగరం సెంటర్లోనో కదూ ఆయనకు యాక్సిడెంటయింది?' అడిగాను.
'అవును. కొన్ని గంటలపాటు ఆయన శవం రోడ్డుమీదనే పడిఉంది. ఎవరూ పట్టించుకోలేదు' అన్నాడు.
'పోనీలే 'అవధూత' టైటిల్ అలా నిజమైంది. అప్పుడు నేను గుంటూరులో పనిచేస్తున్నాను. దానిపైన ఒక పోస్టు కూడా రాశాను' అన్నాను.
'ఆరోజు ఉదయం విద్యాసాగర్ గారు ఫోన్ చేసి నాతో అన్నారు, 'విశ్వాత్మ గారు ఇక లేరు' అని . అదేంటి రాత్రంతా నాతో మాట్లాడుతూనే ఉన్నాడుగా' అని నేననుకున్నాను'
'ఏం రాత్రంతా నీతో మాట్లాడినంత మాత్రాన, పొద్దున్నే ఏమీ కాకూడదా ఏంటి? నువ్వూ అవధూతవైపోయావా కొంపదీసి? అదిసర్లేగాని, విద్యాసాగర్ అంటే ఎవరు? బందరాయనా? ' అడిగాను.
'అవును. మాది చల్లపల్లి' అన్నాడు.
'అప్పట్లో రాధిక అని ఒక మహాయోగిని మా గ్రూపులో కొన్నాళ్ళుంది. ఆమెది కూడా మీ ఊరే. నీకు తెలుసా?'అడిగాను.
' తెలీదు' అన్నాడు.
'సరే ఆ టాపిక్ వదిలేయ్. అయినా. నువ్వుకూడా థాట్ వేవ్స్ నేర్చుకుని ఉన్నట్లయితే, ఫోన్ ఖర్చు తప్పేది కదా? రాత్రంతా ఫోన్ మాట్లాడితే ఎంత బిల్లయ్యిందో నీకు? టిబెటన్ మాంక్స్ తో థాట్ వేవ్స్ లో మాట్లాడేవాడు, నీతో మాట్లాడలేడా? ఫోనెందుకు? ' అడిగాను సీరియస్ గా.
'ఇక జోకులు ఆపండి సార్ అన్నగారు' అన్నాడు.
'అన్నగారు అన్నాడు కదా అని నేనుకూడా మెత్తబడి, 'సరే ఒక మాట చెప్పు. భరద్వాజగారికి జిల్లెళ్ళమూడి అమ్మగారు, షిరిడీసాయి లాగా దర్శనమిచ్చారని పొద్దున్న 'వ' అన్నది. నువ్వు అమ్మసాహిత్యం లోతుగా చదివావు కదా. అలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా?' అడిగాను.
'నేను చదివినంతవరకూ ఎక్కడా అలాంటి సంఘటన లేదు. సాయిబాబా కూర్చునే భంగిమలో అమ్మ కూచుని ఉంటే, ఆయన అలా అనుకోని ఉండవచ్చు' అన్నాడు.
'అదేంటమ్మా ఇలా కనిపించావు?' అని భరద్వాజగారు అమ్మను అడిగితే, 'నీకాయనంటే ఇష్టం కదా నాన్నా. అందుకే అలా కనిపించాను' అన్నదట అమ్మ. ఈ మాటకూడా 'వ' నే చెప్పింది' అన్నాను.
'ఏమో నేను వినలేదు' అన్నాడు.
'చాలా సందర్భాలలో నువ్వూనేనూ కూడా కాలుమీద కాలేసుకుని బాబాలాగానే కూచుంటాము. అంతమాత్రం చేత మనం ఆయనైపోతామా? అమ్మ ఊరికే బాబాలాగా కూర్చుని ఉన్నంతమాత్రాన 'బాబాయే అమ్మ' అని భరద్వాజగారు అనుకుని ఉన్నట్లైయితే అది ఆయన భ్రమమాత్రమే కదా? అది నిజమెలా అవుతుంది?' అన్నాను.
తను వింటున్నాడు.
'ఒకవేళ ఆ దర్శనం నిజమే అయితే, అమ్మలో బాబాను చూచిన తర్వాత మళ్ళీ షిరిడీకి వెళ్ళవలసిన పనేముంది? వేరే సంస్థను పెట్టవలసిన పనేముంది? అంత దర్శనం కలిగాక, అసలు అమ్మను వదిలి వేరేచోటకు పోగలడా? పైగా, అలాంటి దర్శనం కలిగినపుడు దానిని ఆస్వాదించి, దానిలో మునిగిపోవాలిగాని, 'ఇదేంటమ్మా? బాబాలాగా కనిపిస్తున్నావు? అని అడగవలసిన పనేముంది?' ఆలోచించు' అన్నాను.
'అంతేననిపిస్తోంది' అన్నాడు.
'ఉన్నదాన్ని ఉన్నట్లు చూడకుండా, మనం మనసులో ఏవేవో ఊహించుకుంటుంటే ఇలాగే అవుతుంది. భరద్వాజగారికి మహత్యాలపిచ్చి ఎక్కువ. ఆయనకే కాదు, ఈ సాయిబాబా బ్యాచ్ అందరికీ ఇదే గోల. అప్పనంగా జరిగే మహత్యాలు వాళ్లకు కావాలి. అవి జరుగుతాయో లేవోగాని, వాటికోసం మన దేవుళ్ళందరినీ వదిలేసి ఇస్లామిక్ జిహాద్ మాయలో పడిపోతున్నారు. క్రమంగా హిందూమతాన్ని సంకరం చేస్తున్నారు' అన్నాను.
'అమ్మ చెప్పలేదా? దృష్టిని బట్టి సృష్టి ఉంటుందని. సైకాలజీకూడా దీనినే చెబుతుంది. నువ్వు చూచేదృష్టిని బట్టి ఎదుటివిషయం నీకు కనిపిస్తుంది. నీ మనసులో ప్రేమ ఉంటే, అనాకారికూడా దేవతలా కనిపిస్తుంది. అదిలేనపుడు దేవతకూడా దెయ్యంలాగా కనిపిస్తుంది. ఇది నీక్కూడా తెలుసుకదా ! సహజంగా జరిగేవాటిని కూడా నువ్వు 'మిరకిల్స్' అనుకుంటే అలాగే అనిపిస్తాయి. కానీ అవి మిరకిల్స్ కావు. నీ భ్రమలు మాత్రమే. సెన్సిటివ్ మనస్సు ఉన్నవాళ్లు సాధారణంగా ఇలా తప్పుదారిన పడతారు. అలాగే, నిజంగా మిరకిల్స్ జరిగినా నువ్వు వాటిని పట్టించుకోకపోతే మామూలు సంఘటనల మాదిరిగానే ఉంటాయి. అలాంటివి ప్రతిరోజూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి' అన్నాను.
వింటున్నాడు.
'ఇంకొక సంఘటన చెబుతా విను. అమ్మ సాహిత్యంలోనే ఈ విషయం ఉంది. ఒకరోజున భరద్వాజగారు అమ్మను ఇలా అడిగాడు.
'అమ్మా. పంచదార డబ్బాలోకి నేను పొయ్యకుండానే పంచదార వచ్చింది. ఇలాంటి మిరకిల్స్ ఎలా జరుగుతాయి?'
దానికి అమ్మ ఇలా అన్నారు.
'ఎందుకు నాన్నా అవన్నీ?' అంటూ తన కాళ్ళపైన ఉన్న మందారపువ్వును తీసి చూపిస్తూ, 'ఈ మందారపువ్వును చూడు నాన్నా. దీని రంగులూ, ఈనెలూ, పుప్పొడీ ఇవన్నీ ఎంత మనోహరంగా ఉన్నాయో చూడు. ఇది అద్భుతం కాదా? డబ్బాలోకి పంచదార వస్తేనే అద్భుతమా?' అన్నది.
ఈ మాటచెప్పి ఇలా అన్నాను.
'సృష్టిని మించిన పెద్ద మిరకిల్ ఎక్కడుంది శ్రీనివాస్? చీప్ మిరకిల్స్ ఎందుకసలు? దానికోసం మన దేవుళ్ళని మార్చేసి, అసలు దేవుడే కానివాడిని దేవుడంటూ పూజలు చెయ్యడం ఎంత వెర్రితనం? పంచదార డబ్బా ఖాళీగా ఉందని చూసిన ఆయన స్టూడెంట్లో, లేక అక్కడి స్త్రీ భక్తులలో ఎవరో ఒకరు, చెప్పకుండా దానిలో పంచదార నింపి ఉంటారు. లేదా అమ్మే అలా నింపించి ఉంటుంది. చెప్తే ఆయన ఒప్పుకోడని అలా చేసి ఉండవచ్చు ! దాన్నేమో ఆయన 'బాబా లీల' అనుకున్నాడు. బాబాని ఒక మహనీయుడిగా ప్రచారం చేశాడు. ఆయన చెప్పే స్థానంలో ఉన్నాడు. వినే స్థానంలో ఉన్న వేలాదిమంది నమ్మేశారు. మాయ అనేది ఇలాగే మనుషులను ఆక్రమిస్తుంది. అందుకే నేనంటాను, 'చెప్పేస్థానంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే, వినేవాళ్ళు తేలికగా దారితప్పే ప్రమాదం ఉంది. ఆ కర్మంతా వీళ్లకు పట్టుకుంటుంది' అంటాను.
'మరి ఆయనకైన షిరిడీఅనుభవం కూడా అలాంటిదేనా. ఇందాక అడిగాను. మీరేమీ చెప్పలేదు' అన్నాడు.
పోనీలే అడుగుతున్నాడని ఆ రహస్యాన్ని వివరించాను.
'సరే విను. నువ్వు ఇంతగా అడుగుతున్నావని చెబుతున్నాను. ఆయనకా అనుభవం 9-2-1963 న షిరిడీలో జరిగింది. ఆ రోజేంటో తెలుసా?'
'తెలీదు' అన్నాడు.
'మాఘబహుళ పాడ్యమి. అంటే, పౌర్ణమి మరుసటిరోజు. అంటే, పౌర్ణమిఛాయలో ఆయనున్నాడు. గత పదేళ్లలో నేను వ్రాసిన పోస్టులు చూడు, కొన్ని వందల సంఘటనలను నిరూపించాను. పౌర్ణమి, అమావాస్య షాడోలలో ఇటువంటి సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. వీటియొక్క ఇంకా రహస్యాలను నా శిష్యులతో మీటింగులలో వివరిస్తూనే ఉన్నాను. అలాంటిదే ఆ అనుభవం కూడా.
ఆయన స్వతహాగా చాలా సెన్సిటివ్ మనిషి. సహృదయుడు. పైగా 1955 లో తన కజిన్ అకస్మాత్తుగా చనిపోవడంతో షాక్ లో ఉన్నాడు. ఆధ్యాత్మికమైన వెతుకులాటలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో అలాగే అవుతుంది. మునిగిపోతున్న మనిషి గడ్డిపోచను కూడా పట్టుకుంటాడు. మానసికంగా గందరగోళ పరిస్థితిలో ఉన్నపుడు అలాంటి సంఘటనలు చాలా కదిలిస్తాయి. అమాయకులు, మంచివాళ్ళు అందరూ ఇలాగే మోసపోతూ ఉంటారు. మతమార్పిడులు జరిగేది ఇలాగే.
అది షిరిడీలోనే కానక్కరలేదు.ఆ సమయానికి ఎక్కడున్నా అలాగే జరుగుతుంది. అదే అనుభవం వస్తుంది. దానికి కారణం ఆనాటి గ్రహాలు. ఆ సమయానికి అక్కడున్నాడు కాబట్టి 'బాబా మహిమ' అనుకున్నాడు. ఇందాక చెప్పలా? డబ్బాలో ఎవరో పంచదార నింపితే, ఈయన చూడలేదు కాబట్టి, బాబా అంటే విపరీతమైన భక్తి ఉంది కాబట్టి, 'బాబాయే పంచదార తెచ్చి డబ్బాలో పోశాడు' అనుకున్నాడు. అలాగే ఇదీ అనుకున్నాడు. It is his attribution, not a truth' అన్నాను.
'అంతేనా?' నిరాశగా అన్నాడు.
'చూశావా మరి? 'ఇంతేనా' అనుకుంటే నిరాశ పుడుతుంది. అలాకాకుండా, 'దేవుడే వచ్చి నాకోసం ఈ మిరకిల్ చేశాడు, డబ్బాలో పంచదార పోశాడు' అనుకుంటే నీ ఈగో చాలా తృప్తి పడుతుంది. 'నాకోసం దేవుడే దిగివచ్చాడా? నేనెంత గొప్పవాణ్ణి? అనిపిస్తుంది. లేదా, 'నా మొర వినడానికి ఒక దేవుడున్నాడు. ఆ దేవుడు కూడా ఈ రూపంలోనే ఉన్నాడు. మిగతా దేవుళ్లందరూ అబద్దాలు. ఎవరూ నా మొర ఆలకించలేదు. ఈయనొక్కడే విన్నాడు. నన్ను కరుణించాడు' అనిపిస్తుంది. నీ ఈగో బలపడటం, ఆ దేవుడిపైన నమ్మకం, ఇతర దేవుళ్లపైన ద్వేషం మొదలౌతాయి. ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. ప్రతిమనిషికీ అంతిమంగా కావలసింది తన ఈగో తృప్తిపడటమే. అందుకనే, అక్కడేమీ లేకపోయినా 'మిరకిల్' అనుకుంటారు. ఈగోలో మునిగిపోతారు.
'నీకు భరద్వాజగారి జాతకచక్రం తెలుసా?'అడిగాను.
'తెలీదు. నాకసలు జ్యోతిష్యమే రాదు' అన్నాడు.
'మరీ మంచిది. దానిజోలికి పోకు. చేతులు కాల్తాయి. విను. ఆయన జాతకంలో శాపగ్రస్త గజకేసరీయోగం ఉంది. మకరరాశిలో ఉంది. నిజానికి, మకరంలో ఏర్పడేదాన్ని గజకేసరీయోగం అనకూడదు. కానీ, గురుచంద్రసంయోగం కనుక కాసేపు అనుకుందాం. నీచగురువుతో ఏర్పడినందువలన దానికి నీచత్వం పట్టింది. 9-2-1963 న ఆయన తన సోదరుడైన వేదవ్యాసతో కలసి షిరిడీ వెళ్ళాడు. ఆరోజున మకరంలో రవి, బుధ, శని, కేతువులున్నారు. కర్కాటకంలో చంద్ర, రాహు, వక్రనీచకుజులున్నారు. మకరానికి గురుశుక్రుల అర్గళం ఉంది. అంటే మొత్తం తొమ్మిదిగ్రహాలు మకరాన్ని, అక్కడున్న గురుచంద్రులను ప్రభావితం చేస్తున్నాయి. మరి ఆరోజున అలా జరగక ఇంకేమౌతుంది?' అన్నాను.
'అవునా?' అంటూ నోరెళ్లబెట్టాడు.
'ఇంకో రహస్యం కూడా చెబుతా విను. అంతకు ముందురోజు కూడా వేదవ్యాసతో కలసి ఆయన బాబాసమాధి దగ్గరికి వెళ్ళాడు. అంటే, పౌర్ణమినాడన్నమాట. బహుశా సోదరులిద్దరూ 'పౌర్ణమినాడు అక్కడుందాం' అనుకొని వెళ్లి ఉండవచ్చు. కానీ ఆరోజున ఆయనకేమీ అనిపించలేదు. పైగా, ఒక విధమైన వ్యతిరేకభావనతో ఉన్నాడు. మర్నాడు అంటే, పాడ్యమినాడు మాత్రం ఆయనంటున్న ఆ అనుభవం కలిగింది. ఎందుకు?' అడిగాను.
'ఏమో మరి, మీరే చెప్పండి' అన్నాడు.
నిన్నటిదాకా ధనుస్సులో ఉన్న బుధుడు రాశిమారి అదేరోజున మకరంలోకి వచ్చి రవి, శని, కేతువులతో కలిశాడు. పైగా సున్నాడిగ్రీలలో ఉన్నాడు. అంటే, బుద్ధి స్తంభించింది. లాజిక్ అడుగంటింది. దాని స్థానాన్ని నమ్మకం ఆక్రమించింది. అందుకే, ముందురోజు జరగని అనుభవం ఆనాడాయనకు కలిగింది. ఇందులో బాబా మహిమ ఏమీ లేదు. ఒకవేళ ఉంటే, ముందురోజు కూడా ఆయన బాబా సమాధిని దర్శించాడుగా. మరి అప్పుడెందుకు జరగలేదు? మర్నాడు బుధుడు రాశిమారగానే ఎందుకు జరిగింది? నువ్వే ఆలోచించు. అది ఖచ్చితంగా గ్రహప్రభావమే. బాబా మహిమేమీ కాదు' అన్నాను.
బిత్తరపోయాడు. పట్టించుకోకుండా, కొనసాగించాను.
అదేరోజున ఆయన ఒక నదీతీరంలోనో, ఒక కొండపైననో, ఒక చర్చిలోనో లేదా ఇంకొక చోట ఎక్కడున్నా అదే అనుభవం కలిగేది. అప్పుడా నదికి, ఆ కొండకు, ఆ కోనకు, ఆ చర్చికి, ఆ మసీదుకు భక్తుడయ్యేవాడు. షిరిడీలో ఉన్నాడు గనుక బాబా భక్తుడయ్యాడు. ఆయనవడమే గాక, ఆయనంటే నమ్మకం ఉన్న వేలాదిమంది ఈనాడు అదే దారిలోకి పోయారు. చివరకు హిందూమతంలోనే ఒక చీలికవర్గం ఏర్పడే పరిస్థితి వచ్చేసింది. చాపక్రింద నీరులాగా జిహాద్ జరుగుతున్నది. చిన్నవిషయం అర్ధం కాకపోవడంతో, ఎంత నష్టం జరిగిందో చూడు.
గురుదోషమంటే ఇదే. దానిప్రభావాలు మనం ఊహించలేనన్ని రకాలుగా ఉంటాయి.
అసలు సత్యం ఒకటి ఉంటుంది. మనం చూసేది ఇంకొకటుంటుంది. అర్ధం చేసుకునేది మూడోది ఉంటుంది. మాట్లాడేది నాలుగోది అవుతుంది. ఇక మనం ఏమౌతామో ఆలోచించు. ఆధ్యాత్మికమంటే నాలుగుపుస్తకాలు చదివి పిచ్చినమ్మకాలు పెంచుకొని, నలుగురికి నాలుగుమాటలు చెప్పడం కాదు. అసలైన ఆధ్యాత్మికమంటే సత్యాన్వేషణ. నువ్వు చిల్లరమహత్యాలను నమ్ముతున్నంతవరకూ నీకు సత్యమెలా అర్ధమౌతుంది?' అన్నాను.
'అంతేనంటారా?' అన్నాడు.
'చూశావా ఇంత చెప్పినా నీకు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే, ఇప్పటిదాకా నువ్వు నమ్ముతున్నది నీకు చాలా హాయిగా చాలా బాగున్నట్లుగా ఉంది. నేను చెబుతున్నది దానికి విరుద్ధంగా ఉండేసరికి, ఇది సత్యమైనా సరే, నీకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. నీకు అనుభవించే కర్మ ఉన్నంతవరకూ నువ్వు సత్యాన్ని అందుకోలేవు. ఇది ఫైనల్' అన్నాను.
'మీరూ భరద్వాజగారూ కలుసుకున్నట్లైతే ఎంత బాగుండేదో?' అన్నాడు.
'ఇప్పుడు నువ్వు కలిశావుగా? నీకేం ఒరిగిందో చెప్పు. నీ సంగతి మాట్లాడకుండా, ఆయన సంగతెందుకు నీకు? తప్పించుకుందామని చూస్తున్నావా?' అడిగాను.
'మీతో చాలా కష్టం అన్నగారు' అన్నాడు.
'ఇప్పటికి ఈ మాటని వందలమంది అన్నారు, నేను విన్నాను' అన్నాను
'వాళ్ళన్నారు కాబట్టి మీరు నమ్ముతున్నారా?' నా లాజిక్ నాకే ప్రయోగించాడు.
'కాదు. వాళ్ళనకముందే 'నాతో చాలా కష్టమని' నాకు బాగా తెలుసు కాబట్టి నమ్ముతున్నాను. కనుక ఇది నా భ్రమ కాదు. సత్యానుభవమే' అన్నాను నవ్వుతూ.
(ఇంకా ఉంది)