తన సోదరి లతామంగేష్కర్ లాగానే ఈమెకూడా 92 ఏళ్ళు బ్రతికింది. కనుక, వీరి జీన్స్ గట్టివే. అయితే వీరి తండ్రి దీనానాధ్ మంగేష్కర్ మాత్రం 41 ఏళ్లకే చనిపోయాడు. కనుక తల్లిగారి జీన్స్ బలమైనవి కావచ్చు. తల్లిగారు శేవంతి 90 ఏళ్ళు బ్రతికారు కాబట్టి లెక్క సరిపోతున్నది.
ఈమె 8-9-1933 న సాంగ్లీ లో పుట్టింది. జననసమయం 9. 30 pm అని ఉంది. దీనిని నేను 9. 28 కి సవరించాను. జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు.
2 మరియు 3 భావాలకు అధిపతులుగా ఈమె జీవితంలోని సంగీతవిజయాలకు బుధశుక్రులే కారకులు. వీరు లలితకళలకు కారకులు కూడా. అయితే, ఈమె పడిన కష్టాలకు కూడా వీరే కారకులయ్యారు. రవిబుధులు సింహంలో ఉండటం బుధాదిత్యయోగం. అయితే, బుధుడు అస్తంగతుడయ్యాడు. కనుక కష్టసుఖాలు కలగలసి ఈమె జీవితంలో వచ్చాయి.
4 వ అధిపతియైన చంద్రునికి, 5 వ అధిపతియైన రవికి ఏర్పడిన కోణదృష్టి రాజయోగాన్నిచ్చింది.
విజయాలు
12-12-2001 న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. అప్పుడు గురు రాహు శుక్ర బుధ దశ నడిచింది. గురువు పూర్వపుణ్యాధిపతి. రాహువు కర్మాధిపతి. అయితే, శనికి సూచకుడు. కనుక శపితయోగం ఉంది. బుధశుక్రులు దోషులు, కానీ యోగకారకులయ్యారు.
5-5-2008 న పద్మవిభూషణ్ అవార్డు ఈమెను వరించింది. ఆనాడు శని కేతు చంద్ర శని దశ నడిచింది. శని కర్మస్థానాధిపతిగా పూర్వపుణ్య స్థానంలోకి వస్తున్నాడు. కేతువు బుధాదిత్యయోగంలో ఉన్నాడు. చంద్రుడు సుఖస్థానాధిపతిగా బలంగా ఉన్నాడు.
అయిదుదేశాలలో, ముఖ్యంగా దుబాయ్, కువైట్ లలో Asha's అనే చైన్ రెస్టారెంట్లను పెట్టింది. అవి బాగా నడుస్తున్నాయి. 10 వ భావంలో ఉన్న వక్రశని, ఆయనపైన ఉన్న గురుశుక్ర దృష్టులు ఈ విజయాలకు కారణాలు. శుక్రుడు 2 వ భావాధిపతిగా ఎలైట్ డైనింగ్ ను సూచిస్తాడు.
1949 లో లతామంగేష్కర్ యొక్క సెక్రటరీ అయిన గణపత్ రావ్ భోంస్లేను పెళ్ళిచేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ళు, గణపత్ కు 31 ఏళ్ళు. ఆ సమయంలో అర్ధాష్టమశని నడిచింది. దశగా రవి గురుదశ నడిచింది. పంచమరవి ప్రేమవ్యవహారాలకు, 7వ అధిపతితో కలసి ఉన్న గురువు పెళ్ళికి సూచకులు. నీచశుక్రుడు సాంప్రదాయవ్యతిరేక వివాహాన్ని సూచిస్తున్నాడు.
7 వ అధిపతియైన శుక్రుడు, 9 వ అధిపతి గురువుతో కలసి కర్మస్థానంలో నీచలో ఉండటంతో, తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన గణపత్ రావ్ భోంస్లేను పెళ్లి చేసుకోవలసివచ్చింది. తరువాత తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన R. D. బర్మన్ ను రెండవవివాహం చేసుకుంది. గురువు ధనుస్సు 6 వ డిగ్రీలో ఉండటం చూడవచ్చు. దీనికి తగినట్లుగా, R. D. బర్మన్ ఈమెకంటే 6 ఏళ్ళు చిన్నవాడు.
1960 లో గణపత్ తో విడిపోయింది. అప్పుడు చంద్ర-కేతుదశ నడిచింది. దానికి కారణం సంగీతదర్శకుడు O.P.Nayyar తో ఆమెకున్న ప్రేమసంబంధం కూడా. గణపత్ రావ్ పెడుతున్న హింసను తట్టుకోలేక నయ్యర్ కు దగ్గరైంది. చంద్రకేతుదశ గ్రహణదశ. 7 వ భావం దెబ్బతినడం, దానిపైనున్న శనిగురువుల ప్రభావాలు దీనికి కారణాలు. పంచమకేతువువల్ల ప్రేమవియోగం సూచితమౌతున్నది. అప్పటికి వారికి ముగ్గురుపిల్లలు. పంచమభావంలో మూడు గ్రహాలుండటం చూడవచ్చు.
అప్పటినుండి, తన ముగ్గురు పిల్లలనూ పెంచుకుంటూ, సినిమాలలో పాటలు పాడుతూ కాలం గడిపింది.
1980 లో తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన సంగీతదర్శకుడు R. D. బర్మన్ ను రెండవపెళ్లి చేసుకుంది. అప్పడు రాహు-కేతుదశ నడిచింది. కొన్ని వందలజాతకాలలో రుజువైన ఈ సూత్రం ఇక్కడ మళ్ళీ రుజువైంది.
కష్టాలు
తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 24-4-1942 న తన 41 వ ఏట చనిపోయాడు. అప్పటికి ఆశాకు 8 ఏళ్ళు మాత్రమే. ఆ సమయంలో ఆమెకు శుక్ర శని కుజ దశ నడిచింది. దశమమైన మకరం నుండి, శని 12 వ భావంలోకి పోవడం, శుక్రుడు మరణాన్ని సూచించే 9 వ భావంలో నీచస్థితిలో ఉండటం, కుజుడు బాధకునిగా దశమం నుండి సుఖస్థానాన్ని చూడటం కారణాలు.
8-10-2012 న రెండవ సంతానమైన వర్షా భోంస్లే, తుపాకీతో తలను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కారణమన్నారు. అప్పుడు ఆశాకు శని రవి బుధ దశ నడిచింది. తులనుండి, యోగకారకుడైన శనికి భ్రష్టత్వం కలగడం, రవి కేతుగ్రస్తుడవడం, బుధునికి అస్తంగత్వం పట్టడం కారణాలు. ఆనాడు, తులకు 2/8 ఇరుసులో నీచరాహుకేతువులున్నాయి. రాహువుతో కలసి కుజుడున్నాడు. కనుక, డిప్రెషన్లో, దూకుడునిర్ణయం తీసుకుని కాల్చుకుని చనిపోయింది.
26-9-2015 న మొదటిసంతానమైన హేమంత్ భోంస్లే కేన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పుడీమెకు శని రాహు రాహు దశ నడిచింది. సింహం నుండి, శని రోగాధిపతి అవుతాడు. రాహువు మారకస్థానంలో ఉన్నాడు. శపితదశ నడిచింది. పంచమభావం దెబ్బతిని ఉన్నది. కనుక మొదటికుమారుడు దీర్ఘవ్యాధితో చనిపోయాడు.
ముగింపు
చివరకు 12-4-2026 న 92 వ ఏట తను చనిపోయింది. అప్పుడు బుధ శుక్ర శని దశ నడిచింది. ఈ ముగ్గురూ ఈ లగ్నానికి మారకులే కావడం గమనించవచ్చు.
1937-44 మధ్యలో మొదటిసారి, 1967-74 మధ్య రెండవసారి, 1997-2004 మధ్య మూడవసారి, ఇప్పుడు 2026 లో నాలుగవసారి ఏలినాటిశని వచ్చింది. అవి అనేక కష్టాలనిచ్చినప్పటికీ, 92 ఏళ్ల పూర్ణాయుష్షు నిచ్చాయి. దీనికి కారణం లగ్నాష్టమాధిపతి కుజుడు సప్తమకేంద్రంలో ఉండటం.
ఈ విధంగా, సుఖదుఃఖాలనేవి పడుగుపేకలలాగా ఉండటం ఆశా భోంస్లే జాతకంలో గమనించవచ్చు. ఇది ఈమె జాతకంలోని విలక్షణమైన యోగం.
