30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా బాబా పందిళ్లు, కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమి అంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, వెకిలిమనుషుల గోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.