ఈయన పూర్తిపేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్. ఈయనపుట్టి ఇప్పటికి నూరేళ్లు దాటింది. అయినా సరే, నేటికీ ఈయన స్వరపరచిన పాటలను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు.
ఈయన తెలుగులో కూడా 'నీరాజనం' అని ఒక సినిమాను చేశారు. అది 1989 లో విడుదలైంది. అందులోని పాటలు కూడా ఆపాతమధురాలే. ఈయన ట్యూన్స్ ను తెలుగులోకి కూడా కాపీ కొట్టారు. ఉదాహరణకు "ఒ లేకే పెహలా పెహలా ప్యార్" అనే పాటరాగాన్ని తెలుగులో "ఓహో బస్తీ దొరసానీ" అనే పాటకు తీసుకున్నారు.
అయితే, పాతతరం హిందీసినిమా దర్శకులలో అత్యధిక మొత్తాన్ని ఫీజుగా తీసుకున్న ఆయన, తన జీవితం రెండవభాగంలో సంగీతంవైపూ, సినీఫీల్డ్ వైపూ తిరిగి చూడకుండా, వాటిని పూర్తిగా వదిలేసి, ఒక హోమియోపతి వైద్యునిగా, ఒక జ్యోతిష్కునిగా మంచిప్రజ్ఞను సంపాదించి, పదేళ్లపైగా బాంబే స్లం ఏరియాలలోని పేదవారికి నిస్వార్థమైన సేవలందించి, చివరకు తన కుటుంబానికి దూరంగా, ఒంటరిగా కన్నుమూశాడు.
తన కుటుంబసభ్యులు కానీ, సినిమాజీవులుకానీ, విలేఖరులుగానీ, టీవీ జనాలు గానీ, ఎవరూ తన అంత్యక్రియలకు రాకూడదని, కనీసం తన శవాన్ని తాకడానికి కూడా వీల్లేదని విల్లు వ్రాసిపెట్టి మరీ కన్నుమూశాడు. తన అంత్యక్రియలు కూడా అతినిరాడంబరంగా జరగాలని, ఆ తరువాత సంస్మరణసభలు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.
ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు. కానీ సంగీతదర్శకుడయ్యాడు. నూరేళ్ళతర్వాత కూడా ప్రపంచం మరచిపోలేని స్వరాలందించాడు. కేవలం 19 ఏళ్ల వయసులో "ప్రీతమ్ ఆన్ మిలో" అనే సూపర్ హిట్ పాటను స్వరపరచాడు. దీనిని ఈయన స్నేహితుడైన Ch. ఆత్మా పాడాడు. 80 ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా ఈ పాట ఆపాతమధురమే.
ఈయన వైద్యశాస్త్రాన్ని చదవలేదు. కానీ, ముంబాయికి చెందిన ప్రముఖ హోమియోవైద్యుడు డా. ఎస్సార్ పాఠక్ దగ్గర హోమియోపతిని నేర్చుకుని, వైద్యుడయ్యాడు. వేలాదిమంది పేదరోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేశాడు. ముంబాయ్, కలకత్తా, హైదరాబాద్ లలో ఉచితహోమియో క్లినిక్స్ నడిపాడు. అలా పేదవారికి సేవను చేయడంలో ఆనందాన్ని పొందాడు.
జ్యోతిషాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కానీ, సొంతంగా దానిని నేర్చుకుని దానిలో మంచిప్రజ్ఞను సంపాదించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఇతరులకు జోస్యాన్ని కరెక్ట్ గా చెప్పాడు. తను పుట్టిననెలలోనే మధుబాల చనిపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చనిపోయింది. చివరకు తన మరణాన్ని కూడా తనే కరెక్టుగా జోస్యం చెప్పుకున్నాడు. అదేవిధంగా చనిపోయాడు.
ఎన్ని చేసినా తన 81 ఏళ్ల సుదీర్ఘజీవితంలో ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జీవితపు ప్రతిమలుపులోనూ తలెత్తుకునే బ్రతికాడు. అత్యంతవిలాసాలనూ, సాధారణజీవితాన్నీ రెండింటినీ చూశాడు. చివరలో ఒక ఋషిలా బ్రతికి, ఒక అనామకుడుగా చనిపోయాడు.
ఈయనలో ఒక కళాతపస్వి, ఒక ప్రేమపిపాసి, ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక క్రమశిక్షణను కలిగిన రూల్ మాస్టర్, ఒక నిస్వార్ధహృదయుడు, ఒక నిరాడంబరజీవి ఉన్నారు.
ఈయన 16-1-1926 న లాహోర్ లో ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. 2007 లో 81 ఏళ్లవయసులో గుండెపోటుతో థానేలో చనిపోయాడు. 1957 లోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. అప్పట్లోనే బాంబే మొత్తమ్మీద 'కాడిలాక్' కార్లున్న ఇద్దరిలో ఈయనొకడు. కానీ విలాసవంతమైన అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బాంబే స్లంలో ఒక చిన్నగదిలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంతో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు.చివరకు అక్కడే కన్నుమూశాడు.
తన కెరీర్ మొత్తంలో 500 పైన పాటలను సృష్టించినా, లతామంగేష్కర్ తో ఒక్కపాటను కూడా పాడించలేదు. వాళ్లిద్దరి మధ్యా గొడవలుండేవి. కానీ 1950-60 మధ్యలో హిందీసినిమా సంగీతాన్ని ఏలాడు. 'రిథమ్ కింగ్' అనే బిరుదును సంపాదించాడు.
1990 లో తనకు డబ్బు ఇబ్బందులున్న రోజులలో కూడా, లతామంగేష్కర్ అవార్డు క్రింద లక్షరూపాయలను తనకు ఇస్తామంటే, ' ఆమెపేరుతో పెట్టిన అవార్డు నాకేంటి? నాన్సెన్స్ !' అని దానిని తిరస్కరించాడు. అలాంటి మొండివాడు. ఆత్మాభిమాని.
అందుకే ఈయనది చాలా విచిత్రమైన జీవితమని అంటాను. ఈయన జాతకాన్ని చూద్దాం !
అంతకుముందుగా, ఈయన స్వరపరచిన 500+ పాటలనుంచి కొన్ని ప్రముఖపాటలు :
1. ప్రీతమ్ ఆన్ మిలో - ప్రయివేట్ ఆల్బమ్ - 1945
2. మాంగ్ కె సాత్ తుమారా - నయా దౌర్ -1957
3. బాబూజీ ధీరే చల్నా - ఆర్ పార్ -1954
4. ఆవో హుజూర్ తుమ్కో - కిస్మత్ -1968
5. పుకార్తా చలా హు మై - మేరే సనమ్ -1965
6. యే దిల్ హై ముషికిల్ జీనా యహా - CID 1956
7. దీవానా హువా బాదల్ - కశ్మీర్ కీ కలీ -1964
8. లేకే పెహలా పెహలా ప్యార్ - CID 1956
9. కజరా మొహబ్బత్ వాలా - కిస్మత్ 1968
10. ఇషారో ఇషారో మె - కశ్మీర్ కీ కలీ -1964
11. జాయియే ఆప్ కహా జాయేంగే - మేరె సనమ్ -1965
12. తారీఫ్ కరూ క్యా ఉస్కీ - కాశ్మీర్ కీ కలీ -1964
13. జానే కహా మేరా జిగర్ గయా జీ - Mr Mrs 55 - 1955
14. ఆయియే మెహర్ బాన్ - హౌరా బ్రిడ్జ్ - 1958
15. జరా హౌలే హౌలే చలో మేరే సాజ్నా - సావన్ కీ ఘటా -1966
16. ఆఖో హి ఆఖో మే ఇషారా హోగయా - CID -1956
17. యూ తో హంనే లాఖ్ హసీ దేఖే హై - తుంసా నహీ దేఖా - 1957
18. తుం జో హుయే మేరే హంసఫర్ - (12 O'Clock) - 1958
19. యే హై రేష్మీ జ్యూల్పోన్ క అంధేరా - మేరె సనమ్ - 1965
20. ఆప్ యూహీ అగర్ హం సే మిల్తే రహే - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962
21. చైన్ సే హంకో కభీ - ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే - 1974
22. ఉడే జబ్ జబ్ జుల్పే తేరీ - నయా దౌర్ -1957
23 మేరా నామ్ చిన్ చిన్ చిన్ - హౌరా బ్రిడ్జ్ -1958
24. ఏక్ పరదేశి మేరా దిల్ లేగయా - ఫాగున్ - 1958
25. కభీ ఆర్ కభీ పార్ - ఆర్ పార్ - 1953
26. సున్ సున్ సున్ జాలిమా - ఆర్ పార్ -1953
27. పియా పియా పియా మేరా జియా పుకారే - బాప్ రే బాప్ -1955
28. సర్ పర్ టోపీ లాల్ దుపట్టా - తుంసా నహి దేఖా -1957
29. తూ ప్యార్ కా సాగర్ హై - సీమా -1955
30. దిల్ కి ఆవాజ్ భి సున్ - హం సాయా -1968
31. రేష్మి సల్వార్ కుర్తా జాలీ కా - నయా దౌర్ - 1957
32. మై ప్యార్ కా రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962
33. లాఖో హై నిగాహ్ మే - ఫిర్ ఓహీ దిల్ లాయా హు. - 1963
