సోమవారంనాడు శ్రీ కొర్లిమర్ల చంద్రశేఖర్ బాబు గారి ఇంటికెళ్లి వారిని కలసి వచ్చాను. వారిల్లు బనశంకరిలో ఉంది. కానీ నాకు అడ్రసు తెలియదు. ఆమాటకొస్తే బెంగుళూరులో ఎక్కడేముందో కూడా తెలియదు. అందుకని, ముందుగా మెట్రోరైల్లో 'మైసూర్ రోడ్' స్టేషన్లో దిగి 'వాలెంటైన్ పబ్లిక్ స్కూల్' కు వెళ్లి, అక్కడ వారిని కలుసుకున్నాను.
నేను వెళ్లిన సమయానికి వారు స్కూల్లో లేరు. అక్కడ స్టాఫ్ ను అడిగి వారి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ఆయన ఫోనెత్తగానే, 'నేను మీ స్కూలు నుంచి మాట్లాడుతున్నాను' అన్నాను.
ఆయన ఆశ్చర్యపోయారు.
'మీ నంబర్ నావద్ద ఉండేది. ఎలాగో పోయింది. ఎన్నో ప్రయత్నాలు చేశాను. దొరకలేదు. గత ఏడాదినుంచి ఎన్నోసార్లు మిమ్మల్ని అనుకున్నాను. ఉన్నట్టుండి మీరే వచ్చేశారు' అన్నారాయన.
'ఇంతకుముందు నా నంబర్ నా బ్లాగులో ఉండేది. ఎవరుపడితే వాళ్ళు ఫోన్లు చేసి పిచ్చిగోలంతా మాట్లాడుతున్నారని తర్వాత తీసేశాను ' అన్నాను.
2020 లో హైద్రాబాద్ లో ఉన్న రోజులలో యూజీగారి గురించి బ్లాగులో వ్రాశాను. అది చదివి ఆయన నాకు ఫోన్ చేశారు. యూజీగారి మీద ఆయన వ్రాసిన Stopped in our tracks అనే ఆణిముత్యాలవంటి పుస్తకాలను నాకు పంపించారు. నా శ్రీవిద్యారహస్యాన్ని ఆయనకు పంపించాను. ఆ విధంగా మాకు పరిచయం ఏర్పడింది. ఈనాటికి నేనే ఆయనను వెతుక్కుంటూ వెళ్లాను.
కాసేపట్లో స్కూలుకు వచ్చి. వారి కారులో ఇంటికి తీసుకెళ్లారు. వారిని చూడటంతోనే ఎప్పటినుంచో పరిచయం ఉన్న మనిషిలా అనిపించారు.
వారి ఇంటిముందు నిలబడటంతోనే నాకు ధ్యానస్థితి మొదలైపోయింది. యూజీగారు ఎన్నోసార్లు వచ్చిన ఇల్లది. అలాంటి చోట ట్రాన్స్ కలగడం వింతెలా అవుతుంది?
ఇంటిలోకెళ్ళి చూస్తే, ఇల్లంతా యూజీగారి ఫోటోల మయం. అక్కడనుండి మొదటి అంతస్తులో యూజీగారు ఉన్న గదికి నన్ను తీసికెళ్లారు. అది 9x7 అడుగుల చిన్నగది. అద్భుతమైన ఆరా ఆ అంతస్తులోను, ఆ గదిలోనూ అలుముకొని ఉంది. ఇండియాకు వచ్చిన ప్రతిసారి ఇదే గదిలో యూజీగారు ఉండేవారు.
అటువంటి ఆరాను మూడుచోట్ల మాత్రమే నేను చూచాను. ఒకటి, రామకృష్ణులు దేహం చాలించిన కాశీపూర్ మఠం మొదటి అంతస్తులోని గది, రెండు, జిల్లెళ్ళమూడిలో అమ్మగారు నివసించిన గది, ఆ తరువాత బెంగుళూరులో చంద్రశేఖర్ గారి ఇంటిలోని యూజీగారి గది. ఈ మూడుచోట్లా ఒకటే విధమైన తరంగాలున్నాయి. ఇంతటి బలమైన స్వచ్ఛమైన ఆధ్యాత్మికతరంగాలను ఏ పుణ్యక్షేత్రంలోగాని, ప్రసిద్ధఆలయాలలో గాని, మహనీయులని చెప్పబడేవారి స్థలాలలోగాని నేను ఫీల్ కాలేదు.
'మీ ఇల్లు ఒక ఇల్లు కాదండి. ఇదొక మహాపుణ్యక్షేత్రం' అని చంద్రశేఖర్ గారితో అన్నాను.
చంద్రశేఖర్ గారు పూర్తిగా యూజీగారితో నిండిపోయి ఉన్నారు. యూజీగారితో 40 ఏళ్ల అనుబంధం వారిది. తన చివరిరోజులలో మతిస్థిమితం సరిగ్గా లేని వాలెంటైన్ ను చిన్నపిల్లలాగా అయిదేళ్లపాటు చూసుకున్న గొప్పమనసు వారిది. సొంత తల్లిదండ్రులనే ఓల్డేజి హోములకు తోసేస్తున్న ఈ లోకంలో, తమకు సంబంధంలేని ఒక విదేశీయురాలిని చిన్నపిల్లలాగా చూసుకున్న అమృతహృదయాలు వారివి. దానికి ఒకే ఒక్క కారణం, దిక్కులేకుండా యూరప్ లో తిరుగుతున్న యూజీగారికి ఆమె ఆశ్రయం ఇవ్వడమే.
ఒక నిరాడంబరుడైన గృహస్థుగా జీవితం గడుపుతున్న ఒక మహనీయుడిని చంద్రశేఖర్ గారిలో చూచాను. ఆయనకు సరియైన సహచారిణి ఆయన శ్రీమతిగారు. వారింట్లో ఉన్నపుడు, ఏదో ఒక ప్రాచీనకాలపు ఋష్యాశ్రమంలో ఉన్న ఫీలింగ్ నాలో కలిగింది. ఈ కాలంలో కూడా ఇటువంటి పుణ్యదంపతులు ఎక్కడైనా ఉన్నారా? అనిన సందేహం ఈరోజుతో నాకు తీరిపోయింది.
తనకోసం అరుణాచలానికి వచ్చిన జిల్లెళ్ళమూడి అమ్మగారిని చూచి చలించిపోయిన చలంగారు ఇలా అన్నారు, ' ఏడిరా నీ ఈశ్వరుడు? అని ఎవరైనా అడిగితే ఇన్నాళ్లూ చెప్పలేకపోయేవాడిని. కానీ ఇప్పుడు చెప్పగలను'.
అదేవిధంగా, 'మంచిమనసున్న దేవతలవంటి మనుషులు ఎక్కడైనా ఉన్నారా?' అని నన్నెవరైనా అడిగితే నేనుకూడా 'ఉన్నారు. నేను చూచాను' అని ఈరోజున చెప్పగలను.
లోకం దృష్టిలో పెద్దపెద్ద స్వామీజీలనబడే వాళ్ళు నన్ను కలిసినప్పుడు, కనీసం లేచి నిలబడటానికి కూడా ఇష్టపడని నేను, ఈ పుణ్యదంపతుల పాదాలను తాకి ప్రణామం చేశాను.
సోమవారం అలా గడిచింది. నిన్న గురువారం సెలవు కావడంతో శిష్యులందరూ ఖాళీగా ఉంటారు. అందుకని మళ్ళీ నిన్న, బెంగుళూరు శిష్యులందరితో కలసి వారి ఇంటిని దర్శించి, యూజీగారి సమక్షాన్ని వారికి కూడా రుచి చూపించాను.
ఒక్క గంటలో వచ్చేద్దామని వెళ్లిన అందరం, మూడున్నర గంటలపాటు అక్కడే ఉండిపోయాము. యూజీ గురించి ఎన్నెన్నో గతస్మృతులు, ఉన్నతమైన తాత్వికవిషయాలు చంద్రశేఖర్ గారు చెబుతుంటే కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు.
మాటలమధ్యలో యూజీగారిది ఆత్రేయసగోత్రమని తెలిసింది. అంటే దత్తాత్రేయులవారి గోత్రమే. అత్రిమహాముని వంశంలో యూజీవంటి బ్రహ్మజ్ఞాని, అవధూత జన్మించడం విచిత్రమేముంది?
నవీనకాలంలో భారతదేశంలో జన్మించిన అవధూతలలో అగ్రగణ్యునిగా యూజీగారిని నేను భావిస్తాను.
'నన్ను పూజించారంటే మీ తోలు తీస్తా' అని గర్జించడం ఒక అవధూత కాకపోతే ఇంకెవరు చేయగలుగుతారు?
'నిజమైన గురువు తననుంచి కూడా నిన్ను విముక్తుడిని చేస్తాడు' అన్న బంగారుమాటను మహేష్ భట్ తో యూజీగారన్నారు. ఈ ఒక్క మాటచాలు ఆయనేంటో చెప్పడానికి. అదీ అవధూతతత్త్వమంటే !
యూజీగారు కృష్ణాజిల్లా తెలుగువాడు. అటువంటి మనిషి వందలఏళ్లలో ఒక్కరు కూడా ఈ భూమ్మీద పుట్టరు. కానీ ఆయనెవరో తెలుగువారికి చాలామందికి తెలియదు.
అసలూ, తెలుగుప్రజలంత తెలివితక్కువవాళ్ళు ఇంకెక్కడా ఉండరనేది నా నిశ్చితాభిప్రాయం. యూజీలాంటి అసలైన అవధూతలు వాళ్ళమధ్యనే పుట్టినా వారు గుర్తించరు. నకిలీలకు మాత్రం గుళ్ళు కట్టిస్తారు. తండోపతండాలుగా మొక్కుతారు.
పిచ్చి జనం ! పిచ్చి లోకం !
కోహినూర్ వజ్రం ఎక్కడో ఒకచోట మాత్రమే ఉంటుంది. గులకరాళ్లు మాత్రం ఎక్కడపడితే అక్కడే ఉంటాయి. ఇది లోకసహజమే. వింతేముంది?
యూజీగారి అనుచరులైన సత్యనారాయణ, రజనిగార్లను కూడా వారింట్లో కలుసుకున్నాము. వాళ్ళుకూడా చాలా సహృదయులు.
యూజీగారిగురించి సమగ్రమైన సమాచారాన్ని అందించే వీరి వెబ్ సైట్ ను ఇక్కడ చూడండి.


.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
