ఈ మధ్య ఒక అపరిచితునినుంచి ఫోనొచ్చింది. సంభాషణ రసవత్తరంగా జరిగింది. మీకందరికీ కూడా తెలియాలని పోస్ట్ చేస్తున్నాను.
'హలో' అనగానే, ఎవరో అపరిచితుడు 'నాకు దీక్ష కావాలి' అన్నాడు సూటిగా.
'ఏం దీక్ష ? ఎందుకు?' అన్నాను.
'చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి' అన్నాడు.
'ఎవరికి?' అడిగాను.
'నాకే' అన్నాడు.
'దీక్షతో ప్రాబ్లమ్స్ పోతాయని ఎవరు చెప్పారు?' అడిగాను.
దానికి సమాధానం చెప్పకుండా 'నేను సన్నాసుల్లో కలుద్దామనుకుంటున్నాను' అన్నాడు.
'కలువ్. దానికి నా పర్మిషనెందుకు?' అన్నాను.
'మీదగ్గర దీక్ష తీసుకుని కలుద్దామని' అన్నాడు.
'దీక్షకూ సన్నాసుల్లో కలవడానికి సంబంధం లేదు' అన్నాను.
దీక్ష అనగానే, 'సరే ఇస్తాం. ఫలానా రోజున వచ్చేయ్, పనీపాటా లేకుండా ఇక్కడే ఉందువుగాని ' అనకపోయేసరికి అతనికి కోపం వచ్చేసింది.
'ఇంతకూ మీదగ్గరేముంది?' అన్నాడు.
'నాదగ్గర చాలా ఉన్నాయ్. అవన్నీ నీకు పనికిరావు. నీకేం కావాలోచెప్పు' అన్నాను.
'చెబుతున్నాగా. ఎన్నిసార్లు చెప్పాలి?' అన్నాడు దురుసుగా.
'అసలు నీ సమస్య ఏంటో చెబితే కదా తెలిసేది?' అన్నాను.
'మా ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయింది' అన్నాడు.
'ఓహో ఇదా సమస్య?' అనుకుని, 'పోతే పోనీ పీడా వదిలింది' అన్నాను.
'అదికాదు. ముగ్గురు పిల్లలున్నారు' అన్నాడు.
'నువ్వు పెంచు. నీ పిల్లలేగా?' అన్నాను.
'మరి తన పిల్లలు కారా?' అడిగాడు కోపంగా.
'ఏమోమరి నాకేం తెలుసు?' అన్నాను.
'వేరేవాడితో లేచిపోయింది' అన్నాడు.
'ఇన్నేళ్ల తర్వాత నీలో ఏం నచ్చలేదో మరి?' అన్నాను.
'వాళ్లిద్దరూ కనిపిస్తే చంపేస్తాను' అన్నాడు.
'అందుకే కనపడకుండా దాక్కున్నారు' అన్నాను.
'ఎంతకాలం దాక్కుంటారు?' అన్నాడు.
'అది నాకెలా తెలుస్తుంది? అయినా, కోర్టు వాళ్లనే సపోర్ట్ చేస్తుంది' అన్నాను.
'ఏమీ చెప్పలేనోడివి నువ్వేంది సన్నాసం ఇచ్చేది?' అన్నాడు.
'నేనిస్తానని ఎప్పుడన్నాను? అయినా, మీ ఇద్దరూ వదిలేస్తే పిల్లల్నెవరు చూస్తారు?' ప్రశ్నించాను.
'దేవుడు చూసుకుంటాడు' అన్నాడు.
'ఏ దేవుడు?' అడిగాను.
'ఎవరో ఒక దేవుడు' అన్నాడు.
'కనేది మీరూనూ, చూసుకునేది దేవుడా?' అడిగాను.
దానికి సమాధానం చెప్పకుండా, 'మరి నువ్వేం చేస్తావు?' అడిగాడు ఏకవచనంలోకి దిగుతూ.
'నేనా? సన్నాసులకు పెళ్లిళ్లు చేస్తాను' అన్నాను.
'అదేంటి?' అన్నాడు.
'నీలాంటి సన్నాసికి అర్ధం కాదులే' చెప్పాను.
'అదేంటి? ఇంకా కాలేదుగా?' అన్నాడు.
'అవ్వక్కర్లేదు. నువ్వు ఆల్రెడీ అదే, నిన్ను నువ్వు గుర్తించుకో. చాలు' అన్నాను.
ఫోన్ కట్ అయిపోయింది.
దీక్షలూ, సన్యాసాలూ పిల్లాటలై పోయాయి. ప్రతివాడూ ఒక కాషాయవస్త్రం కట్టుకుంటూ ఉండటంతో దాని విలువే పోతున్నది. మన హిందూమతంలో ఒక సెంట్రల్ గవర్నింగ్ బాడీ అంటూ లేకపోవడంతో, ఒక కట్టుబాటు, ఒక అదుపు అంటూ లేకపోవడంతో, ఎవడు పడితేవాడు ఏదో ఒకటి చెబుతూ ఉండటంతో, ఇలాంటివాళ్లకు అసలు తమ మతమంటే ఏమిటో తెలీకుండా తయారైంది.
కోరికలు తీరడానికి దీక్షలు, పూజలు, గుళ్ళు, గోపురాలు, మంత్రాలు, తంత్రాలు, ఇవే హిందూమతమని కోట్లాదిమంది భ్రమిస్తున్నారు. అంతేగాని, అదేంటో, అదేమి చెబుతున్నదో, ఎలా బ్రతకమని చెబుతున్నదో ఎవరికీ పట్టడంలేదు. ప్రతివాడూ తన ఇష్టానుసారం అన్నీ చేస్తూ, ఒక బొట్టు పెట్టుకుని, ఒక గుడికెళ్ళి వస్తే చాలు, ఒక పూజ చేస్తే చాలు, అన్నీ అయిపోతాయి, ఇదే హిందూమతం అనుకోవడమే నేడు హిందూమతానికి పట్టిన అతిపెద్ద దరిద్రమని నా ఉద్దేశ్యం.'
'ఎర్రగుడ్డలేసుకుని కూచుంటే చాలు, లైఫు సెటిలైపోతుంది. ఆపైన మనల్ని పోషించాల్సిన పని సమాజానిదే. ఇదే సన్నాసం' అని చాలామంది ఇలాంటివాళ్ళు ఊహిస్తుంటారు. అలాంటివాళ్ళు దేశమంతా తిరుగుతూ అడుక్కుంటూ ఉండే దొంగసాధువులలో కలవాలి.
సన్యాసం అని స్పష్టంగా పలకలేనివాడికి, బాధ్యతలను నెరవేర్చలేనివాడికి , సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనలేనివాడికి, కుటుంబాన్ని దాని ఖర్మకొదిలేసి జల్సాగా గాలికి తిరగాలనుకునేవాడికి సన్యాసమేంటసలు? సన్యాసమనేది ఎంత చీప్ అయిపోయిందో? అసలు, ప్రతివాడికీ సన్యాసార్హత ఉందా? ఉంటుందా?
ఇలాంటి సన్నాసులకు మళ్ళీ సన్నాసమెందుకసలు?