మొన్న పూనాలో, నిన్న బెంగుళూరులో జరిగిన సంఘటనలు, మన సంతానమే మన శత్రువులని ఋజువు చేస్తున్నాయి.
అందరూ అలాగే ఉంటారా? అంటే, ఉండకపోవచ్చు. కానీ, మెజారిటీని బట్టి అలా అనవలసి వస్తున్నది. నేటికాలంలో, సంతానం చేతుల్లో బాధలుపడకుండా, 'మా పిల్లలతో మేము హాయిగా సుఖంగా ఉన్నాము' అని ఏ తల్లిదండ్రులైనా చెప్పగలరా? గుండెమీద చేయివేసుకుని, నిజాయితీగా అలా చెప్పగలిగిన వాళ్లకు లక్షరూపాయలు బహుమతిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఖర్మకాలితే తనవారే తనకు శత్రువులౌతారు. దీనిని వివరించే ఆణిముత్యంలాంటి సంస్కృతసుభాషితం ఒకటున్నది.
అప్పులు మిగిల్చిపోయిన తండ్రి, వ్యభిచారిణియైన తల్లి, అందమైన భార్య, పండితుడు కాని కుమారుడు - ఈ నలుగురూ తన శత్రువులని ఈ సుభాషితం అంటుంది.
పై శ్లోకంలో కూతుళ్ళ గురించి లేదు. ఎందుకంటే, అప్పట్లో వారికి స్వతంత్రం లేదు. కనుక వారితో సమస్య లేదు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. బయట ఊళ్లలో, హాస్టళ్లలో ఉంటున్నారు. ఎల్కేజీ నుంచే స్నేహాలెక్కువయ్యాయి. అదేంటని అడిగితే, అడిగినవారిని అడవిమనుషుల్లాగా చూస్తున్నారు. సమాజంలో అంతటా అతిస్వాతంత్య్రం వెల్లివిరుస్తోంది. సహజీవనాన్ని, సహకారజీవనాన్ని కోర్టులు కూడా సమర్ధిస్తున్నాయి. ఒక్కసారి మేజర్ అయ్యాక, "ఎవడైతే నాకేంటి?" అనే ధోరణి ఎక్కువైపోయింది.
ఒకప్పుడు తండ్రి, భర్త లేదా అన్నల సంరక్షణలో ఆడపిల్లలు ఉండేవారు. కానీ, ఇప్పటివారికి ఏ సంరక్షణా అవసరం లేదు. ఒకప్పుడు మగాడి దౌర్జన్యానికి ఆడది బలైపోతూ ఉండేది. నేడు ఆడది రోడ్డెక్కి అల్లరిచేస్తుంటే మగాడు ఇంట్లోదూరి తలువులేసుకుని దాక్కోవాల్సి వస్తోంది.
చదువులు, ఆర్థికస్వాతంత్య్రం, పదవులు, హోదాలు, బయట పరిచయాలు అన్నీ మంచివే. కానీ ఎంతవరకు? సంస్కారం లేని చదువులెందుకు? హద్దులు తెలియని స్నేహాలెందుకు? అవసరాలు తప్ప ఆప్యాయతలు లేని బంధుత్వాలెందుకు? కనీస మానవత్వం కూడా లేని ఈ బ్రతుకులెందుకు?
పూనా కేసులోగాని, బెంగుళూరు కేసులో గాని నేరస్తులు, డ్రామస్తులు, కూతుళ్లే. బాధితులేమో తల్లిదండ్రులు.
మొదటికేసులో, కాబోయే భర్తను మాత్రమే ఆ అమ్మాయి చంపేసింది. అదికూడా అంత క్రూరంగా లోయలోకి తోసేసి మరీ ! రెండవకేసులో తల్లిని, తండ్రిని, చెల్లెలిని ముగ్గురినీ స్పాట్లో పొడిచి పారేసింది. ఎవరికోసం? నిన్నగాక మొన్న పరిచయమైన ఒక క్రైస్తవ అపరిచితుడికోసం.
డబ్బు, స్వార్ధం, విలాసాలు, సరదాలు, పైశాచికత్వం తప్ప చాలామంది నేటి ఆడపిల్లలలో ఇంకేమీ కనిపించడం లేదు. స్త్రీసహజాలైన నెమ్మది, ప్రేమతత్త్వం, జాలిగుండె ఇవేవీ ఎవరిలోనూ కనిపించడం లేదు. కనీసం విశ్వాసం కూడా ఉండటం లేదు.
ఒకరకంగా చూస్తే, ఈ ట్రెండ్ మంచిదే. వినాశనం త్వరగా వస్తుంది. అంతా అయిపోయాక గానీ మనకు బుద్ధిరాదు కదా ! నిజానికి ఏ ట్రెండునూ వెనుకకు మరలించలేం. అందరం ముందుకే పోవాలి, అదెక్కడికి తీసుకుపోయినా సరే !
మరొక్క పాతికేళ్లలో పెళ్లిళ్లు, పిల్లలు మొదలైనవేవీ ఉండకపోవచ్చు. కేవలం, సహజీవనాలు, సహకార జీవనాలు, వస్తుమార్పిళ్ళలాగా వ్యక్తిమార్పిళ్లు మాత్రమే ఉంటాయేమో?
చూద్దాం, అప్పటిదాకా మనం బ్రతికుంటే !