3, అక్టోబర్ 2026, శనివారం

లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం

నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం. అక్టోబర్ 2 న గాంధీగారు,  శాస్త్రిగారు, ఇద్దరూ పుట్టారు. కానీ, పిచ్చిజనం గాంధీగారిని గుర్తుచేసుకున్నంతగా ఈయనను చేసుకోరు. మన వ్యక్తిత్వస్థాయినిబట్టే మనకు నచ్చే మనుషులుగాని, నాయకులుగాని ఉంటారు మరి !

ఈ సందర్భంగా ఆయన జాతకంలోని ముఖ్యమైన విషయం ఒకదానిని, అదే, మరణరహస్యాన్ని జ్యోతిషపరంగా పరిశీలిద్దాం. దానికంటే ముందుగా ఆయనయొక్క నీతీనిజాయితీలకు నిదర్శనాలుగా చెప్పుకునే రెండు సంఘటనలను గుర్తుచేసుకోవాలి.

ఒకటి - నెహ్రూగారి మంత్రిమండలిలో శాస్త్రిగారు రైల్వేమంత్రిగా పనిచేశారు. ఒకానొక రైలు ప్రమాదం జరిగిందని, దానికి బాధ్యత వహిస్తూ, రైల్వేమంత్రి పదవికి శాస్త్రిగారు రాజీనామా చేశారు. నెహ్రూగారు ఒప్పుకోకపోయినా తన రాజీనామాను వెనక్కు తీసుకోలేదు. చివరకు నెహ్రూయే తగ్గక తప్పలేదు.

రెండు - శాస్త్రిగారు అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత ఆయనకు మిగిలిన ఆస్తి ఒక ఫియట్ కారు లోను మాత్రమే. అప్పట్లో దాని ఖరీదు 12 వేల రూపాయలు. దానిని కొనడానికి ఆయన సేవింగ్స్ లో 7 వేలుమాత్రమే ఉన్నాయి. అందుకని మిగతా డబ్బుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి లోను తీసుకున్నారాయన. ఆ  అప్పును మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ, శాస్త్రిగారి సతీమణి లలితాశాస్త్రిగారు తిరస్కరించారు. తనకొచ్చే పెన్షన్ నుండి ఆ అప్పును విడతలవారీగా తీర్చారు. 

ఆ మనుషులు వేరు, ఆ విలువలు వేరు ! ఇదే తరహాకు చెందిన మరొక నాయకుడు P.V. నరసింహారావుగారు. ఆయనకూడా ప్రధానమంత్రిగా చేసినప్పటికీ, తనకోసమంటూ సంపాదించుకున్న అవినీతిసొమ్ము ఏమీ లేదు.

నేటికాలంలో వార్డుకౌన్సిలర్లు తేలికగా కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చెయ్యాలంటే 100 కోట్ల పైనే ఖర్చుపెట్టాలని బాహాటంగా చెబుతున్నారు. అదీ శాస్త్రిగారికీ, నేటి రాజకీయులకూ తేడా !

అటువంటి వ్యక్తిని స్మరించకుండా, దేశాన్ని సమస్యల వలయంలోకి నెట్టిపోయిన గాంధీగారిని స్మరిస్తూ, సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు జనం ! అవున్నిజమే ! శాస్త్రిగారిని గుర్తుంచుకుంటే దేశం బాగుపడిపోదూ మరి !

'శాస్త్రి' అనే పేరుందని ఆయన బ్రాహ్మణుడని అందుకనే నేనాయనను సపోర్ట్ చేస్తున్నానని అనుకోకండి. ఆయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. వాళ్ళు కాయస్థులు. అంటే, క్షత్రియులలో ఒక తెగకు చెందినవారు. వివేకానందస్వామి, అరవింద్రఘోష్ లు కూడా కాయస్థులే. కాశీవిద్యాపీఠం నుండి 'శాస్త్రి' పరీక్ష పాసై, పట్టా పొందినందుకు ఆయన శాస్త్రి అయ్యారు. నేటితరంలో  చాలామందికి ఇదికూడా తెలియదు.

చాలా నిజాయితీపరుడూ, నిరాడంబరుడూ అయిన ఆయన, ధైర్యానికి మాత్రం పెట్టింది పేరు. 1965 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో, అంతర్జాతీయ సరిహద్దులను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఎటాక్ చెయ్యడానికి మన సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయనే. ఈ చర్యతో ప్రపంచం బిత్తరపోయింది. ఈ మధ్యన మనం చేసిన సర్జికల్ స్ట్రైక్ కు ఇది మాతృకగా చెప్పుకోవచ్చు. ఆ ఆదేశంతో ఇండియన్ ఆర్మ్ లాహోర్ వరకూ దూసుకుపోయింది.

తాష్కెంట్ ఒప్పందం జరిగినది 10-1-1966 న. శాస్త్రిగారు చనిపోయినది మర్నాడు 11-1-1966 న. ఒప్పందం సంతకం పెట్టిన కొన్ని గంటలలోనే ఆయన  హార్ట్ ఎటాక్ తో తాష్కెంట్ లోనే చనిపోయారు. సుభాష్ చంద్రబోసు మరణంలాగే ఇదికూడా వీడని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కోణాన్ని జ్యోతిష పరంగా ఇప్పుడు పరిశీలిద్దాం.

(ఇంకా ఉంది)