18, అక్టోబర్ 2026, ఆదివారం

వాయిదా పడిన మైసూరు ట్రిప్పు

నవరాత్రుల చివరిరోజులు.

బెంగుళూరుకు మైసూరు దగ్గరే కదా, మైసూరెళ్లి చాముండేశ్వరీ అమ్మవారి దర్శనం చేసుకొద్దామని మా బృందంలోని కొందరన్నారు.

'ఇప్పుడొద్దు. కావాలంటే నవరాత్రులయిపోయాక వెళ్ళొద్దాం. అయినా అక్కడకెళ్ళేది దేవుడికోసమా? లేక కొండనీ, గుడినీ, అక్కడి హడావుడినీ, జనాన్నీ చూడటం కోసమా?

మొదటిదానికైతే ఎక్కడికీ పోనక్కరలేదు. రెండోదానికోసమైతే అంతదూరం పోవడం వృధాపని. ఒకవేళ సైట్ సీయింగ్ కోసమే అనుకుంటే, పండుగరోజులలో దానిని కూడా ఆస్వాదించలేం. కనుక ఎలా చూచినప్పటికీ, ఇప్పుడు మైసూరు వెళ్లడం తెలివిలేనిపనే అవుతుంది. అమ్మవారెక్కడికీ పోదు. మైసూరు కూడా ఎక్కడికీ పోదు. నాలుగురోజులాగండి." అన్నాను.

ఏ పుణ్యక్షేత్రానికైనా సరే, పండుగరోజులలో వెళ్లడం మా విధానం కాదు. జనం తక్కువగా ఉన్నపుడు మాత్రమే అలాంటి చోట్లకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అక్కడి ఆరాను మనం అందుకోగలుగుతాం.

పండుగ రోజులలో వెళితే ఏముంటుంది, చవకబారు గోల తప్ప?

నేలబారు మనుషులూ, వాళ్ళ అసహ్యకరమైన పోకడలూ, తొక్కిసలాటలూ, లంచాలూ, రికమెండేషన్లతో దర్శనాలు చేసుకోవడమూ, ఏదో పుణ్యం సంపాదించేశామని భ్రమపడుతూ, పొంగిపోతూ వెనక్కు రావడమూ, మళ్ళీ మన నకిలీబ్రతుకులు బ్రతకడమూ తప్ప ఎక్కడికెళ్లొచ్చినా వేరే ఏముంటుంది?

మనకు నచ్చనివే ఇవి !

పండుగలను మామూలు మనుషులు జరుపుకునే విధానం ఒకలాగా ఉంటుంది. నిజంగా ఆధ్యాత్మికమార్గంలో నడుస్తున్నవాళ్ళు జరుపుకునే విధానం ఇంకోలా ఉంటుంది. 

మొదటిది అందరికీ తెలిసినదే. అందరి ఎదురుగా కనిపించేదే. రెండోది బజార్లో దొరకదు. బయటకు కనిపించదు. చాలామందికైతే అదొకటుందని తెలియదు కూడా ! 

"మాకు తెలుసు" అనుకునేవాళ్లకు కూడా తెలియదని నేనంటాను.

పాపులర్ మతంగాని, దాని ఆచరణలుగాని, అన్నీ బూటకాలే. ఇవన్నీ "నేను సరిగానే ఉన్నాను" అన్న భ్రమలో మనిషిని ఉంచుతున్నాయంతే.

అన్నీ సరిగానే ఉంటే, మనుషుల జీవితాలెందుకు ఇలా ఉన్నాయి మరి? అన్న ప్రశ్నకు జవాబు ఎక్కడా లేదు.

ఎక్కడైనా సరే, మతాచరణలూ తంతుల భ్రమలనుండి కొద్దిమంది మాత్రమే నిజంగా బయటపడతారు. మిగతావాళ్లంతా, ఆ ఊబిలో ఉంటూ, అదే సత్యమని భ్రమిస్తూ ఉండవలసిందే. వేరే మార్గం లేదు.

"ఈరోజున ఇక్కడికెళ్ళండి. ఇలా మొక్కండి. అలా చెయ్యండి. ఇక మీకు ఎదురుండదు. మీ పాపాలన్నీ పోతాయి. మీరు పట్టిందల్లా బంగారమౌతుంది." మొదలైన అబద్ధాలతో కొందరు జనాన్ని నమ్మిస్తున్నారు. పిచ్చిజనం నమ్మి   మోసపోతున్నారు.

ఇంతా చేస్తే, ఇదంతా బంగారం కోసమా?

ఇవన్నీ రెలిజియస్ టూరిజంను పెంచుకునే బిజినెస్ ట్రిక్స్ తప్ప ఇంకేమీ కావు. ఇదంతా టీవీ ఛానెల్స్, యూట్యూబు చానల్స్ చేస్తున్న మాయ.

అలా ఎప్పటికీ జరగదు. ఊర్లు తిరిగినంత మాత్రాన పాపాలూ పోవు. బ్రతుకులూ మారవు. ఆ మార్గాలు వేరే ఉంటాయి.

ఇవాళా రేపూ పండుగల అంతరార్ధాలన్నీ మరుగునపడ్డాయి. కేవలం సరదాలుగా, వినోదాలుగా, పైపై నాటకాలుగా అవి మారిపోయాయి. వినాయకచవితైనా, దీపావళైనా, దసరా అయినా, శ్రీరామనవమైనా, కృష్ణాష్టమి అయినా, శివరాత్రి అయినా, ఇంకొకటైనా అన్నింటినీ అలా మార్చేశాం  మనం.

హిందూమతానికి ఎంత దురవస్థ పట్టింది ? అవున్లే, అందరూ సత్యాన్వేషకులూ, సత్యద్రష్టలూ అయిపోతే, సృష్టి ఆగిపోదూ మరి ! 

ఈ ప్రపంచం ఇలా ఉండటమే కరెక్టు !

ఏదేమైనా, ప్రస్తుతానికి మా మైసూరు ట్రిప్  మాత్రం కొంతకాలంపాటు వాయిదా పడింది.