16, అక్టోబర్ 2026, శుక్రవారం

2032 లో కల్కి రాబోతున్నాడా?

2032 లో కల్కి రాబోతున్నాడని ఒక ప్రసిద్ధ గురువుగారు చెప్పారని సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతున్నది. దీనిమీద మీ అభిప్రాయం ఏమిటని నా శిష్యులలో ఒకరు ప్రశ్నించారు.

హిమాలయాలలోని శంభలా గ్రామంలో కల్కి ఇప్పటికే పుట్టి ఉన్నాడని, ప్రస్తుతం ఆయనకు పది పదిహేను ఏళ్ళని, ఇంకో ఐదేళ్లలో మంచి వయసులో ఉన్న యువకునిగా ఆయన సమాజంలోకి వస్తాడని ఆయన చెబుతున్నాడట.

 అడ్రసు తెలిస్తే చెప్పచ్చు కదా ! 

"అది మాత్రం అడక్కండి" అని ఆయనంటున్నాడట !  ఏమంటే, "అది దేవరహస్యం" అన్నాడట. 

"అది రహస్యమైనపుడు, ఇది మాత్రం చెప్పడమెందుకు? నాటకాలా?" అని నేనన్నాను.   

చాలామంది ఇలాంటివాళ్ళు "శంభలా ఎక్కడుందో మాకు తెలుసు. మేము అక్కడికి పోయొచ్చాము" అని చెబుతున్నారు. వీడియోలు చేస్తున్నారు.

"అన్నీ అబద్దాలే" అని నేనంటున్నాను. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే, చెప్పేవాడు ఏదైనా చెబుతాడు. ఇవన్నీ ఉత్త కాలక్షేపం కబుర్లు మాత్రమే. ఇంకేమీ కాదు.

మరికొంతమంది ఔత్సాహికులు ఇంకొక అడుగు ముందుకేసి, 'శంభలా' అంటే హిమాలయాలలో లేదని, అది ఒరిస్సాలోని 'సంబల్ పూర్' అనే ఊరని చెబుతున్నారు. మరింకేం? ఆ ఊర్లో "విష్ణుయశ్, సుమతి" అనే దంపతులు ఎక్కడున్నారో ఓటర్లలిస్టులో చూసి కనుక్కోండి. కల్కి తల్లిదండ్రుల పేర్లు అవే అని 'కల్కిపురాణం' చెబుతోంది. వాళ్ళ ఇంట్లోనే కల్కి పుట్టి పెరుగుతున్నాడు. సింపుల్ కదా అని నేనన్నాను.

అయినా, అర్ధంపర్థం లేని పిచ్చిపిచ్చి పేర్లు పిల్లలకు పెట్టుకుంటున్న నేటిసమాజంలో అంత మంచిపేర్లు ఎవరు పెట్టుకుంటున్నారో ఆ కల్కికే తెలియాలి !

-----------------------  

ఈ విధంగా కల్కి వస్తున్నాడని ఇప్పటివరకూ చాలామంది చెప్పారు. అలా చెప్పినవాళ్ళందరూ పోయారుగాని కల్కిమాత్రం రాలేదు. 2000 సంవత్సరంలో కలియుగాంతం వస్తున్నదని వేదవ్యాస్ గారు పుస్తకమే వ్రాశారు. కానీ అదేమీ జరగలేదు. ఆయనే పోయారు. ప్రస్తుతం 2026 నడుస్తున్నది. అటువంటిదేమీ మనకు కనిపించడం లేదు. ఒకవేళ కల్కి వచ్చిఉంటే, ఈ సమాజంలోకి రావడానికి భయపడి ఎక్కడైనా దాక్కుని ఉన్నాడేమో నాకైతే తెలీదు.

మొన్నీమధ్యనే కల్కిభగవాన్ కన్నుమూశాడు. ఎవరో మాతో ఈ మాట చెబితే మేము భలే నవ్వుకున్నాం. కలియుగం ఇంకా అయిపోలేదు. అప్పుడే కల్కి రావడం పోవడం కూడా అయిపోయిందా? ఎంత పిచ్చి జనంరా దేవుడా ! అనిపించింది.

కొన్నేళ్ల క్రితం రైల్వేలో 'కల్కి అవతార్' అని ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆ అవతారం చేసిన లీలలన్నీ మాకు బాగా తెలుసు. ఎంత కామెడీనో !

కృష్ణభగవాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సదరువ్యక్తి శ్రీకృష్ణుడెలా అవడో, కల్కిభగవాన్ అని పెట్టుకున్నంతమాత్రాన ఆయనా అవ్వడు. ఆజాద్, భగత్ అని పేర్లు పెట్టుకున్నంతమాత్రాన ఎవరూ ఫ్రీడమ్ ఫైటర్సూ అవరు.

ఉత్తపేర్లతో ఎవరూ ఏదీ అయిపోరు.

అయితే, ఇటువంటి నమ్మకాలు ప్రతితరంలోనూ ఉంటాయి. కాలం నడుస్తూ ఉంటుంది. జనాల నమ్మకాలు ఒకవిధంగా ఉంటే, నిజాలు మాత్రం వేరేగా ఉంటాయి.  ఈ గోల ఎప్పుడూ ఉండేదే.

జీసస్ వస్తున్నాడని రెండువేల ఏళ్ళనుంచీ చెబుతున్నారు. ఇంతవరకూ జాడా జవాబూ లేదు. తాము జీవించి ఉండగానే ఆయన వస్తాడని, ఆయనను చూడకుండా తాము చనిపోమని జీసస్ శిష్యులు నమ్మేవారు. అదేమీ జరగలేదు. ఆయన వస్తున్నాడని ఎదురుచూస్తూనే వారందరూ పోయారుగాని, ఆయనమాత్రం రాలేదు. బహుశా ఎప్పటికీ రాకపోవచ్చు కూడా !

-------------------------

అయితే, 2032 ప్రత్యేకత ఏమిటి? ఏదో ఒకటి ఉండాలి కదా ! అదే సంవత్సరాన్ని ఎందుకు చెబుతున్నారు? అని అనుమానం రావచ్చు.

2032 గ్రహస్థితిని ఒక్కసారి చూద్దాం. అది యురేనస్ రిటర్న్ చార్ట్ అవుతున్నది. అంతేకాదు ప్లూటో అర్ధ రిటర్న్ చార్ట్ కూడా అవుతున్నది.

మనకు 1947 లో స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు యురేనస్ మిధునం 2 వ డిగ్రీపైన ఉన్నాడు. 85 ఏళ్ల తర్వాత 2032 లో మళ్ళీ అదే స్థానానికి రాబోతున్నాడు. దీనిని యురేనస్ రిటర్న్ చార్ట్ అంటారు. ప్రపంచచరిత్రను పరిశీలిస్తే, ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ఆ దేశంలో సమూలమైన మార్పులొస్తాయి. ఉద్యమాలు, విప్లవాలు, తిరుగుబాట్లు వచ్చి దేశవ్యవస్థ అంతా క్రొత్తదారిలో పోవడం మొదలౌతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేశపరిస్థితి రీ-సెట్ అవుతుంది. 

గతంలో అమెరికా విషయంలో ప్లూటో పరంగా ఇది ఋజువైంది.

అమెరికా స్వాతంత్య్రం జూలై 4, 1776 న వచ్చింది. ఆనాడు ప్లూటో మకరం 6 వ డిగ్రీపైన ఉన్నాడు. ప్లూటో సైకిల్ 248 ఏళ్ళు. తిరిగి అదే స్థానానికి 2024 న వచ్చాడు. గత రెండేళ్లలో అమెరికా ఎన్ని మార్పులకు లోనౌతోందో గమనించవచ్చు.

2019 ఎలక్షన్ల సమయంలో తన బిజినెస్ రికార్డులను తారుమారుగా చూపించి ప్రభుత్వాన్ని మోసగించాడన్న నేరంపైన అమెరికా అధ్యక్షుడే నేరస్తుడని 2024 లో అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. దానిపైన ప్రస్తుతం అపీల్ నడుస్తోంది. గతంలో ఏ అధ్యక్షునికీ ఇలా జరుగలేదు.

అప్పటినుంచీ ప్రపంచవేదికలపైన అమెరికా ఒంటరిదై పోతోంది. మునుపటి దర్పం తగ్గిపోతోంది. ఇతరదేశాల కూటములు అనేకం ఏర్పడుతున్నాయి. అమెరికా నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మనదేశమూ, చైనాదేశమూ ప్రపంచరాజకీయాలను శాసించే దిశగా ముందుకు దూసుకొస్తున్నాయి. ఇరాన్ తో పెట్టుకున్న యుద్ధంతో అమెరికా అల్లాడుతోంది. 2024 నుంచీ ఈ మార్పులు చకచకా వస్తున్నాయి. గమనించండి.

మనకు స్వాతంత్య్రం వచ్చినది 1947 లో గనుక మనకు ప్లూటో రిటర్న్ చార్ట్ 2195 లో వస్తుంది. అయితే, అర్ధ రిటర్న్ చార్ట్ మాత్రం 2032 లో వస్తుంది. అంటే, స్వతంత్రం వచ్చినపుడు ప్లూటో కర్కాటకం 20 వ డిగ్రీలో గ్రహయుద్ధంలో ఉన్నాడు. 2032 లో దానికి  సరిగ్గా సప్తమంలోకి అంటే మకరం 20 వ డిగ్రీపైకి వస్తాడు.

మన దేశానికి యురేనస్ రిటర్న్ చార్ట్ 31 మే, 2032 న వస్తున్నది. అంటే, ఆ రోజున యురేనస్ మళ్ళీ మిథునం 2 వ డిగ్రీపైన, అంటే మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి డిగ్రీపైన సంచరిస్తాడు. అదే సమయానికి ప్లూటో మకరం 20 వ డిగ్రీపైన సంచరిస్తున్నాడు. మకరం కూడా మన దేశాన్ని సూచించే రాశియే.

కనుక, యురేనస్, ప్లుటోలు రెండూ 2032 వ సంవత్సరాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. అయితే, ఇది మంచి సూచనైతే మాత్రం కాదు. ఏమంటే, పాతవ్యవస్థ గతించి క్రొత్త వ్యవస్థ మొదలు కావడానికి ప్లూటో సూచకుడైతే, ఉద్యమాలకు, విప్లవాలకు యురేనస్ సూచకుడు. కనుక సంక్షోభం స్పష్టంగా కన్పిస్తున్నది.

----------------

ఆ రోజున గ్రహస్థితిని చూద్దాం.  

మే 31, 2032 న గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. 

గురువు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. శని మిధునంలో ఉన్నాడు. యురేనస్, ప్లుటోల పరిస్థితి పైన వివరించాను.

మన దేశలగ్నమైన వృషభంలో నాలుగు గ్రహాల గ్రహయుద్ధం ఉన్నది. 

వీరిలో సూర్యుడు, శుక్రుడు ఒకే డిగ్రీ (16 వ డిగ్రీ) పైన రోహిణీ నక్షత్రంలో ఉన్నారు. రోహిణి ప్రజానక్షత్రం.

వృషభానికి పాపార్గళం ఉన్నది. కేతువు కుజునికి సూచకుడు. కుజశనుల అర్గళం మనదేశానికి పట్టింది. అంటే యుద్ధం గాని, దానికి సమానమైన సంక్షోభం గాని కనిపిస్తున్నది.

కనుక, ఆ సమయంలో మన దేశవ్యవస్థలో సమూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. బహుశా ఆ సమయానికి మన అతుకులబొంత రాజ్యాంగం సమూలంగా మార్చబడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పుల వల్ల పాతరాజ్యాంగం పనికిరాకుండా పోయి, క్రొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా జరగాలంటే మూడో ప్రపంచయుద్ధం లాంటి మరొక యుద్ధం  జరగాలి. అది జరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి.

ఇటువంటి సంక్షోభపరిస్థితులు ఏర్పడే అవకాశం తప్పకుండా ఉందిగానీ, కల్కి అవతారం వచ్చే సూచన మాత్రం ఎక్కడా లేదు.

-----------------------

ప్రతి పదేళ్లకూ "కల్కిఅవతారం వస్తున్నది" అని కొంతమంది చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.  "కల్కి ఇప్పటికే పుట్టాడు. అడ్రసు కూడా మాకు తెలుసు" అని కొంతమంది కుహనాగురువులు చెప్పుకుంటూ ఉండటం కూడా ఇలాంటిదే.

కల్కి గుర్రం ఎక్కి వస్తాడు. మహమ్మద్ కూడా గుర్రం మీదే తిరిగేవాడు గనుక, మహమ్మదే కల్కి అని 40 ఏళ్ల క్రితమే సాయిబులలో ఒక వర్గం ప్రచారం చేసేది. అయితే దానినెవరూ నమ్మలేదు. ఇలా చాలామంది చాలా కధలు చెబుతూ ఉంటారు.

ఇదంతా పెద్దబూటకం ! కలియుగాంతం జరగడానికీ, కల్కి రావడానికీ ఇంకా చాలా సమయముంది. మనమెవ్వరమూ ఈ జన్మలో దానిని చూడము. చూడలేము.

2032 ప్రాంతంలో మన దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధికవ్యవస్థలలో సమూలమైన మార్పులు వస్తాయి. అంతేగాని, కల్కి అవతారం మాత్రం రాదని నేను చెబుతున్నాను.

నమ్మితే నమ్మండి. నమ్మకపోతే మీ ఇష్టం.

అయినా ఇంకెంత దూరం? 5 ఏళ్ళేగా ! చూద్దాం ఏమి జరుగుతుందో.