“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, నవంబర్ 2020, సోమవారం

పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు 'ఈ - బుక్' విడుదలైంది

మన ప్రాచీన జ్ఞానసంపదను సులభమైన భాషలో అందరికీ అందుబాటులోకి తేవాలన్న సంకల్పయాత్రలో భాగంగా ప్రాచీన ప్రామాణిక గ్రంధములను మా 'పంచవటి' నుండి ప్రచురిస్తూ వస్తున్నాం. ఈ యాత్రలో భాగంగా ఈరోజున 2400 సంవత్సరముల నాటి 'పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు' ఈ - బుక్ ను విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.

ఆధ్యాత్మికప్రపంచంలో మనకున్న వారసత్వ జ్ఞానసంపద ఏ ఇతరదేశానికీ ఏ ఇతరజాతికీ లేదు. కానీ మన దురదృష్టమేమంటే, మన ప్రాచీన గ్రంధాలలో ఏముందో మనకే తెలియదు. దీనికి కారణాలు అనేకం. సంస్కృతం పరాయిభాష అయిపోవడం ఒకటి, మన మతంపైన మనకే నమ్మకం లేకపోవడం మరొకటి, ఒకవేళ నమ్మకం ఉన్నప్పటికీ, అందులో ఎంతెంత విజ్ఞానసంపద ఉన్నదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోవడం మరొకటి, ఉన్నదానిని ఉన్నట్లుగా శుద్ధంగా చెప్పే గురువులు లేకపోవడం ఇంకొకటి, పరాయిమతాల దుష్టప్రచారం ఇంకొకటి - ఇలా కారణాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరేది చెబితే దానిని గుడ్డిగా నమ్ముతూ దొంగగురువుల వలలో పడుతున్న అభాగ్యులు వేలూ లక్షలలో ఉన్నారు. పరాయిమతాల ప్రచారాలు నమ్ముతూ మతం మారుతున్న వారు కూడా అలాగే ఉన్నారు. నా దృష్టిలో వీరందరూ దురదృష్టవంతులు. మనకున్న జ్ఞానసంపద ఏమిటో అర్ధమైతే ఈ దురవస్థ ఉండదు. అలాంటి సంపదలో ఈ గ్రంధం తలమానికమైనట్టిది.

వ్యాసమహర్షి, శంకరులు, వివేకానందస్వామి, ఇంకా ఎందరో మహనీయులు, పండితులు, ఈ ప్రాచీన గ్రంధమునకు వ్యాఖ్యానం చేసి ఉన్నారు. నా గురువుల అనుగ్రహమును బట్టి , సాధనామార్గంలో నా అనుభవములను బట్టి, దీనికి నేను వ్యాఖ్యానం వ్రాశాను. అతి గహనమైన ఈ గ్రంధమునకు ఇంత సరళమైన, సమగ్రమైన వ్యాఖ్యానం ప్రపంచ చరిత్రలోనే  ఇంతవరకూ  రాలేదని సవినయంగా చెబుతున్నాను. జగజ్జనని కాళి అనుగ్రహమే ఈ అదృష్టానికి కారణం.

నాకు 13 ఏళ్ల వయసులో, వివేకానందస్వాముల వారి రాజయోగోపన్యాసముల ద్వారా, మొదటిసారిగా పతంజలి యోగసూత్రములను నేను చదివాను. ఆ తరువాత ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. నా గురువులలో ఒకరైన నందానందస్వాములవారు నాకిచ్చిన బహుమతి వివేకానందస్వాముల వారి రాజయోగోపన్యాసములున్న పుస్తకమే.

యోగసూత్రములు చాలా చిక్కటి సంస్కృతభాషలో ఉంటాయి. వీటిలో ఎన్నో యోగరహస్యములున్నాయి. సామాన్యులకు అవి అంత సులభంగా అర్ధం కావు. ఎప్పటికైనా వీటి సరియైన అర్ధములను, నా అవగాహనను, అనుభవాలను రంగరించి, సరళమైన భాషలో లోకానికి తెలిసేలా చెప్పాలన్న సంకల్పం నాకు చిన్నప్పుడే కలిగింది. ఆ సంకల్పం నేటికి నెరవేరినది.

ఆయా సూత్రములను వివరించే చోట్లలో, సందర్భానుసారంగా, ఉపనిషత్తుల నుండి, భగవద్గీత నుండి, ఇతర గ్రంధముల నుండి శ్లోకములను ఉటంకించి నా వ్యాఖ్యానమునకు ఒక పరిపూర్ణతను తెచ్చాను. నేటి దొంగగురువులందరూ ఈ పుస్తకమును చదివి, కనీసం ఇప్పటికైనా మంచిబుద్ధి తెచ్చుకుంటారని, అసలైన హిందూమతం ఏమిటో గ్రహిస్తారని, వారి దొంగవ్యాపారములను మానుకుని సరియైన ఆధ్యాత్మికమార్గంలోకి వస్తారని ఆశిస్తున్నాను. అమాయకహిందువులు అసలైన హిందూత్వమంటే ఏమిటో, అసలైన ఆధ్యాత్మికమార్గం ఎలా ఉంటుందో, తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

దేశవిదేశాలలో ఉన్న నా అభిమానుల కోసం, త్వరలోనే ఈ పుస్తకం ఇంగ్లీష్ 'ఈ బుక్' గా వస్తుంది. ఇంగ్లీష్ అనువాదపు పని మొదలైపోయింది. ఆ తర్వాత త్వరలోనే  తెలుగు ఇంగ్లీషు భాషలలొ ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

యోగశాస్త్రమును సక్రమంగా అర్ధం చేసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవారికి ఈ పుస్తకం ఎడారిలో సెలయేరు లాంటిదని వేరే చెప్పనవసరం లేదు.

ఈ పుస్తకం వ్రాయడంలో నా శ్రీమతి సహకారం అమూల్యం. నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితల పాత్ర చిరస్మరణీయం. కవర్ పేజీ డిజైన్ చేయడంలో నా శిష్యుడు ప్రవీణ్ తోడ్పాటు శ్లాఘనీయం. 'పంచవటి ఫౌండేషన్' సెక్రటరీ రాజు సహాయం ప్రశంసనీయం. నిరంతరం సాగుతున్న ఈ మహాయజ్ఞంలో తెరవెనుక పాత్రధారులైన అదృష్టవంతులు వీరే.

యధావిధిగా ఈ పుస్తకం కూడా pustakam.org నుంచి లభిస్తుంది. చదవండి. భారతీయులుగా పుట్టినందుకు, ఇంతటి జ్ఞానసంపదకు వారసులైనందుకు గర్వించండి. యోగమార్గంలో నడిచే ప్రయత్నం చెయ్యండి. మానవజన్మను సార్ధకం చేసుకోండి.