“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, నవంబర్ 2020, శుక్రవారం

'పిచ్చిగోల' వాట్సప్ గ్రూపు - మైకేల్ ఓ నీల్ రిపోర్ట్

ఒళ్లంతా బద్ధకంగా ఉంది. మనసంతా చిరాగ్గా ఉంది. వెదరంతా ముసురుబట్టింది. ఈ అన్నిటికీ కారణాలున్నాయి.

అసలే పౌర్ణమి ఘడియల్లో ఉన్నాం. ఈ టైమ్ లో పిచ్చోళ్ళ కందరికీ పిచ్చి లేస్తుందని పదేళ్ళనుంచీ చెబుతున్నా. అందులో నవంబర్ లో వచ్చే పౌర్ణమి చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే నాకలా ఉందేమో మరి?

అదీగాక రాత్రి నుంచీ టీవీలో చెబుతున్నారు. కొత్త తుపాన్ ట. దానిపేరు నివర్ ట. ఏంటో ఈ పేర్లు? నివ్వర్, సువ్వర్, లవ్వర్, నిరోధ్, విరోధ్ ...  ఛీ ఛీ... చిరాకేసింది. చెత్త న్యూస్.. చెత్త వెదర్.,,చెత్త పేర్లు. పొద్దున్నే లేవాలనిపించక బద్ధకంగా అలా పడుకునుంటే ఫోన్ మోగింది. ఇదొకటి మధ్యలో? అని విసుక్కుంటూ ఫోనెత్తా.

'హలో ! అయాం మైకేల్ ఓనీల్ స్పీకింగ్' అన్నాడు అమెరికా యాసతో.

'వీడెవడు పొద్దున్నే' అనుకుంటూ 'సారీ రాంగ్ నంబర్' అని ఫోన్ పెట్తెయ్యబోతుండగా  '  ఫ్రం ఎఫ్.బీ. ఐ' అన్నాడు.

ఉంకో పౌర్ణమి కేసేమో అనుకుంటూ 'యా టెల్ మీ' అన్నా నేనూ అమెరికా యాసలో.

'మీ గ్రూప్ లోంచి వెళ్ళిపోయిన ఆడంగులందరూ కలసి ఒక కొత్త వాట్సప్ గ్రూప్ పెట్టారని మాకు సమాచారం వచ్చింది' అన్నాడు ఓనీల్.

'ఓ ! నీల్ ! అమెరికానుంచి నాకు ఫోన్ చేసేంత పెద్ద విషయమా అది? అయితే ఏంటి?' అన్నా.

'అదికాదు. దానిపేరు 'పిచ్చిగోల' అని పెట్టుకున్నారు. అది మాకు నచ్చలేదు. అందుకే మీ ఒపీనియన్ కోసం ఫోన్ చేస్తున్నా' అన్నాడు.

'దాందేముంది. పెట్టుకొనీ. వాళ్లకు సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేసింది. వాళ్ళేంటో  వాళ్ళకు తెలిసిపోయింది. నీకేంటి బాధ/' అడిగా.

'అందులో వాళ్ళు మాట్లాడుకుంటున్నవన్నీ మేం ట్రాక్ చేస్తున్నాం. వాళ్ళంతా మీ బాధితులే. ఏం మాట్లాడుకుంటున్నారో కేస్ బై కేస్ మీకు చెప్పాలని ఫోన్ చేశా/ అన్నాడు.

'వీడు ఖచ్చితంగా పిచ్చోడే. వదిలేలా లేడు' అనుకుంటూ  'సరే ఏడువ్' అన్నా

సామాన్యంగా ఆడవాళ్ళలో మెంటల్ పోకడలు ఎక్కువగా ఉంటాయన్నది మెడికల్ పరిశోధనలలో తేలిన వాస్తవం. ఎందుకంటే వారి జీవితమంతా  మెన్సస్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది. అమావాస్యకీ పౌర్ణమికీ వారి మనస్సు బాగా చెదిరిపోతూ ఉంటుంది. దీనికి తోడు ఏవో ఫేమిలీ ప్రాబ్లంస్ ఉండనే ఉంటాయి. ఇవన్నీ కలసి, వాళ్ళు సైకలాజికల్ గా బాగా చెదిరిపోతూ ఉంటారు. వీటికి తోడుగా గుళ్ళూ గోపురాలూ పూజలూ వ్రతాలూ మొదలైన పిచ్చి ఉంటె ఇక చెప్పే పనేలేదు. వారిలో చాలామందికి కావాల్సింది మంచి సైకియాట్రిస్ట్ దగ్గర, మంచి సైకలాజికల్ ట్రీట్మెంట్. అంతేగాని గురువులు సాధనలు కాదు. వీళ్ళంతా మానసికరోగులు. ఇంకా చెప్పాలంటే మెంటల్ పేషంట్లు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి 'సరే ఏం చెబుతాడో విందాం లే' అనుకుంటూ 'చెప్పు ఒనీల్' అన్నా.

'నేనీయన దగ్గర పదేళ్ళనించీ ఉన్నా. ఎంతో చేశా. కొత్తవాళ్ళని ఎక్కువగా దగ్గరకు తీస్తాడు. పాతవాళ్ళని అస్సలు పట్టించుకోడు. అందుకే విసుగేసి బయటకొచ్చా. ఈ గ్రూప్ పెట్టా' అంటోంది గ్రూప్ ఓనర్ ఒకామె - అన్నాడు ఓనీల్.

'కొత్తనీటిని చూస్తే పాతనీటికి పోటు' అనే సామెత ఊరకే రాలేదు మరి. అంత అసూయ ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక గ్రూప్లో ఎలా ఉండగలరు? వదిలేయ్. నెక్స్ట్.' అన్నా  

'ఈయనకు అమ్మాయిలంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతాడు. అబ్బాయిల్ని పట్టించుకోడు. అందుకే కోపమొచ్చి బయటకొచ్చా' అంటోంది ఇంకొకామె అన్నాడు మళ్ళీ.

'ఆమెకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నట్లుంది. తను ఏం చెబుతోందో తనకే అర్ధం అవడం లేదు. అబ్బాయిల్ని పట్టించుకోనని కోపమొచ్చి అమ్మాయి బయటకెళ్ళిపోయిందా? అంటే తను అబ్బాయా అమ్మాయా? లేక మధ్యరకమా? ఈ గోల వింటుంటే, నాకే మెంటల్ వచ్చేలా ఉంది. వదిలేయ్. నెక్స్ట్' అన్నా.

'నేనెంత టైట్ టీ షర్టులూ, జీన్స్ పాంట్లూ వేసుకుని ఎన్నిసార్లు ఈయన దగ్గరకి వచ్చినా నన్ను పట్టించుకోలేదు. కనీసం నావైపు ఓరగా కూడా చూడలేదు. ఇంకెందుకు ఇక్కడుండటం? నామీద నాకే నమ్మకం పోతోంది. నేను హర్టయ్యాను. అందుకే విసుగేసి బయటకొచ్చా' అంటోంది ఒకమ్మాయి - అన్నాడు ఓనీల్.

'ఆంజనేయుడి ముందు కుప్పిగంతులా? అని ఒక సామెత తెలుగులో ఉంది తెలుసా నీకు?' అడిగా.

'తెలీదు' అన్నాడు ఓనీల్.

'దానికదే సమాధానం. తనెళ్ళవలసినది ఫేషన్ పెరేడ్ కి. ఒక గురువు దగ్గరకి కాదు. తను ఇప్పటికైనా బయటకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పు. వీలైతే ఇంకా కురచ బట్టలున్నాయి వాటిని వేసుకుని వేరేవాళ్ళని ట్రై చేయమని చెప్పు.  నెక్స్ట్' అన్నా.

'నేనుకూడా ఆ సంస్థలో నాలుగేళ్ళున్నాను. నా మాటకి అస్సలు విలువే లేదు. నేను చెప్పినట్లు ఆయన వినాలా? ఆయన చెప్పినట్లు నేను వినాలా? పైగా నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదు? ఎంతోమంది మీద ఎన్నో చాడీలు చెప్పాను. వాళ్ళలో వాళ్లకి ఎన్నో పుల్లలు పెట్టాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా జిత్తులకి ఆయనా పడటం లేదు. ఆయన ఇన్నర్ సర్కిల్ వాళ్ళూ పడటం లేదు. ఇంకెందుకు నేనక్కడ? వేస్ట్' అందుకే బయటకొచ్చా. మీ గ్రూప్ లో చేరా' అంటోంది ఇంకొకామె - అన్నాడు ఓనీల్.

'ఈమె మహాజ్ఞాని. ఇంత జ్ఞానితో మనం వేగలేం. ఆమె తనంతట తనే బయటకు పోవడం మాకు చాలా మంచిది. మావైపు తిరిగి చూడొద్దని చెప్పండి. థాంక్యూ చెప్పండి తనకి. నెక్స్ట్' అన్నా.

'నేను చాలా అందంగా ఉంటాను. ఈ మాట నా చిన్నప్పటినుంచీ ఎందరో అన్నారు. ఎక్కడికెళ్ళినా అందరూ నా వెంట పడుతూ ఉంటారు. మొన్నటికి మొన్న రిషీకేష్ యాత్ర కెళితే, అక్కడ షాపింగుకనీ ఒక షాపుకెళ్ళాం, ఏవో కొనుక్కుని బయటకొస్తుంటే ఆ షాపువాడు షట్టర్ దించేసి నా వెనుకే మా హోటల్ దాకా వచ్చాడు. నేనంత అందగత్తెని. కానీ మొగగురువులతో నాకు మొహం మొత్తింది. అందరూ అదోరకంగా చూసేవారే. నాకు ఆడగురువు కావాలి. ఈయన్ని ఆడదానిగా ఆపరేషన్ చేయించుకోమని ఎంతో బతిమిలాడాను. వినడం లేదు. ఛీ ఇలాంటి గురువు నాకెందుకని అర్జెంటుగా ఈ ఊబిలోనుంచి బయటపడ్డాను. మన 'పిచ్చిగోల' గ్రూప్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ నాలాంటివాళ్ళే ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్యూ' అంటోంది ఇంకొకామె'. - అన్నాడు ఓనీల్.

పగలబడి నవ్వాను అతని మాటలకి. 'షాపోడు షట్టర్ వేసుకుని వచ్చాడా? బతికిపోయాడు. వేయకుండా వచ్చుంటే షాపు ఖాళీ అయ్యుండేది. పోన్లే కొంచం సెన్స్ లో ఉన్నాడు. ఇంకా నయం స్వెట్టర్ వేసుకోకుండా వచ్చాడనలేదు. ఆ చలికి గడ్డగట్టి చచ్చుండేవాడు. అయినా,  అంత అందగత్తె ఈ లోకంలో ఎందుకు? స్వర్గానికి వెళ్ళమను. డాన్స్ నేర్పించే అప్సరసల పోస్టులు ఖాళీ ఉన్నాయట, ఫుల్ టైమ్ ఇంద్రుడి ఎదురుగా డాన్స్ చెయ్యొచ్చు.  తోచనప్పుడు అడివిలో ఏదో ఒక రుషి ఎదుట డాన్స్ చేసుకుంటూ శేషజీవితం గడపమని చెప్పండి. మా దగ్గరకు రావద్దని నా మాటగా చెప్పండి. నెక్స్ట్' అన్నా.

'నేనూ ఈ సంస్థలో ఐదేళ్ళ నుంచీ ఉన్నాను. డబ్బులు సంపాదించే సులువులు చెప్పరా మగడా అంటే ఉలకడు పలకడు. వీడేం గురువు? ఎంతసేపూ ఆధ్యాత్మికం అంటాడు. 'నువ్వు మారాలి' అంటాడు. ఏంటి మారేది? డబ్బు లేకపోతే లోకంలో ఎందుకూ పనికిరాము. ఈ ఐదేళ్ళలో బయటైతే కోట్లు సంపాదించేదాన్ని. ఇక్కడ ఏమీ అవకాశాలు లేవు. ఇంకో అయిదేళ్లైనా ఇంతేకదా. అనవసరం అని బయటకొచ్చా' అంటోంది ఇంకొకామె. 

'ఎక్సలెంట్ డెసిషన్ ! సంపాదించుకోమనండి. బోలెడన్ని మార్గాలున్నాయి లోకంలో. బెస్ట్ ఆఫ్ లక్. నేక్ట్' అన్నా.

'ఈలోపల యాస్ట్రల్ వరల్డ్ నించి ఇంకో ఆమె 'ఈయన చెప్పేది సరిగా అర్ధం చేసుకోకుండా, ఆచరించకుండా, పిచ్చిదానిలా తొందరపాటులో సూయిసైడ్ చేసుకుని ఇలా అఘోరిస్తున్నా. వాళ్ళ గ్రూప్ లో ఎలాగూ నన్ను చేర్చుకోరు. అందుకని మీ గ్రూప్ లో కొచ్చా' అంటోంది.  ఇలాంటి కేస్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా జరుగుతోంది' అన్నాడు ఓనీల్.

'ఆమె పాపం నిజంగా పిచ్చిదే. ఆ పిచ్చోళ్ళ గ్రూప్ లో ఆమెను ఉండనివ్వకండి. వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఆత్మలకి కూడా పిచ్చేక్కించగల ఘనులు. ఆమెను తర్వాతి జన్మకు పంపించే పని మొదలైపోయింది. ఎన్నాళ్ళో ఆమె ఆ స్థితిలో ఉండదు. త్వరలోనే అక్కడనుంచి మరో జన్మకు వెళ్ళిపోతుంది. కనుక బాధ పడవద్దని చెప్పండి. ముందా గ్రూప్ నుంచి బయటకు రమ్మని చెప్పండి. నెక్స్ట్' అన్నా.

'నాకు పిచ్చి ఉందని ఈయనకు ముందే చెప్పాను. నాకే కాదు. మా ఆయనకి కూడా కొంచం పిచ్చుంది. నేనూ మా ఆయనా కలసి నెలలో రెండుసార్లు విడాకుల కోసం లాయర్ ని కలుస్తూ ఉంటాం. ఎంతో అరుచుకుని మళ్ళీ కలసిపోతూ ఉంటాం. ఇలా పదేళ్ళనించీ చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు తగ్గలేదు కాని మా లాయర్ కి పిచ్చెక్కింది. ఆమె న భర్తనుంచి విడాకులు తీసుకుంది. కానీ మా విడాకుల సంగతి పట్టించుకోవడం లేదు. ఏదైనా రేమేడీ చెప్తాడని ఈయన గ్రూపులో చేరాను. ఎంతకీ మాకు రేమేడీ చెప్పడం లేదు. పిచ్చివేషాలు తగ్గించుకోమంటాడు. ఎలా తగ్గుతుందండి? నాకు పుట్టినప్పుడే పిచ్చుంది. అదెలా పోతుంది? ఏంటీ గోల? విసుగొచ్చి బయటకొచ్చాను. ఈ గ్రూప్ లో చేరాను. ఇక్కడంతా నాలాంటివాళ్ళే ఉన్నారు. ప్రస్తుతం చాలా హాయిగా ఉంది. ఆయన దగ్గరకెళ్ళకండి. ఆయన దొంగగురువు' అంటోంది ఇంకొకామె' అన్నాడు ఒనీల్.

'ఈమెకు సెల్ఫ్ రియలైజేషన్ చాలా ముదిరిపోయింది. మన లెవల్ కాదు. వేరే ఎవరైనా పెద్దగురువుని, సారీ, పెద్దడాక్టర్ని కలవమని చెప్పండి. నెక్స్ట్' అన్నా.

'నేను బ్రాహ్మిన్ని. ముప్పై ఏళ్లనుంచీ ఆమెరికాలో ఉన్నా. అయినా సరే, రోజూ ఆరుగంటలు పూజ చేస్తా. ఆఫీసుకి పట్టుచీరెలో, ఫుల్ నగలతో వెళతా. ఈయనేదో పెద్దగురువని నమ్మి ఈయన గ్రూపులో చేరా. ఈయన బ్రాహ్మనుడై ఉండి బ్రాహ్మలనే తిడుతున్నాడు. ఇలాంటి అప్రాచ్యుడు నాకెందుకు? నేను అప్రాచ్యదేశంలో, అప్రాచ్యంగా ఎన్నేళ్లయినా ఉండవచ్చు కానీ ప్రాచ్యదేశపు అప్రాచ్యగురువు నాకక్కర్లేదు. అసలు నాకు గురువెందుకు? మా ఏరియాలో నేనే గురువుని. నాకేం తక్కువ? నాకన్నీ తెలుసు. ఈయనకు ఆచారం లేదు. సాంప్రదాయం లేదు. అందుకే బయటకొచ్చా. నేనే గ్రూపు పెట్టా' అంటోంది వకామె - అన్నాడు ఒనీల్.

'బ్రాహ్మలు మ్లేచ్చభాషలో చదువులు చదవచ్చా? ఒకరిక్రింద ఉద్యోగం చేయవచ్చా? సముద్రం దాటి బయటకి పోవచ్చా? అక్కడి గాలి పీలుస్తూ, అక్కడి తిండి తింటూ వాళ్ళతో కలసి ఉండవచ్చా? ఏ ధర్మశాస్త్రంలో ఏముందో ముందు తెలుసుకుని ఆ తర్వాత నాతో మాట్లాడమనండి ఆ మహాపతివ్రతని. నెక్స్ట్' అన్నా.     

'నా కూతురికి పిచ్చుంది. దాని పిచ్చి నాకెక్కిస్తోంది. ఈ గురువేమో వద్దంటాడు. ఏం? నా కూతురి పిచ్చి నేనేక్కించుకుంటే తప్పేంటి? మా అమ్మకి కూడా పిచ్చే, అసలు పిచ్చనేది మా వంశంలోనే ఉంది. ఇప్పుడు మా అమ్మకూడా తన పిచ్చిని నాకెక్కిస్తోంది. తప్పేముంది? ఈయన్ని గురువని నమ్మి దగ్గర చేరితే, 'ఇదంతా వద్దు. ఈ పిచ్చిగోల మానుకో' అంటాడు. ఎలా కుదురుతుంది? అందుకే ఆ గ్రూపు నుంచి బయటకొచ్చాను. 'పిచ్చిగోల' గ్రూప్ ఫౌండర్స్ లో నేనూ ఒకదాన్ని. ఇక చూపిస్తా నా తడాఖా' అని గర్జిస్తోంది ఇంకొకామె - అన్నాడు ఓనీల్.

'బాబోయ్ ! ఆ కుటుంబంలో అమ్మమ్మ - అమ్మ - కూతురు మూడు తరాలలో ముగ్గురికీ పిచ్చి ఉన్నపుడు, ఆ విషయం వాళ్లకు తెలిసికూడా ఉన్నపుడు ఇంక మనమేం చేయగలం ఓనీల్ ? వాళ్ళను మాకు చాలా దూరంగా ఉండమని చెప్పండి. మేం తట్టుకోలేం వాళ్ళని. నెక్స్ట్' అన్నాను.

'ఈయన దగ్గర చేరిన్నాటినుంచీ నాకు హింస అయిపొయింది. వారంవారం రిట్రీట్ అంటూ రమ్మని పిలుస్తాడు. అడ్డమైన చాకిరీ చేయించుకుంటాడు. డబ్బులివ్వడు. కళ్ళు మూసుకుని కోచోమంటాడు. నేను ఫ్రీగా ఉండేది ఆ వీకెండ్ లోనే, అప్పుడే తను ఏదో పని చెప్తాడు. ఏం? నాకేం పనుల్లెవా? నా బాయ్ ఫ్రెండ్స్ తో నేను తిరగక్కర్లేదా? నాకు సరదాలుండకూడదా? ఈ వయసు పోతే మళ్ళీ వస్తుందా? నాకేంటీ హింస? ఆధ్యాత్మికం లేదు తొక్కా లేదు. నాకెందుకు? నాకు డబ్బులు ముఖ్యం. నా టాలెంట్ కి బయటైతే ఎంతో సంపాదించేదాన్ని. అందుకే బయటపడ్డా. ఇప్పుడు హ్యాపీగా ఉంది' అంటోంది ఇంకో అమ్మాయి - అన్నాడు ఓనీల్.

'చాలా మంచిది ఓనీల్. అలాంటి కార్యక్రమాలలోనే ఉండమను. పుణ్యం పురుషార్ధం రెండూ వస్తాయి. నెక్స్ట్' అన్నా.

'యాభైఏళ్ళ క్రితం 'స్వామి కోతేశ్వరానంద కొమ్మచ్చి' గారి దగ్గర దీక్ష తీసుకున్నాను. ఇంతవరకూ ఏమీ ఎదుగుదల లేదు. ఈయనేమైనా ఎదుగుదల ఇస్తాడేమో అని ఈ గ్రూప్ లో చేరాను. ఈయనకే ఏ 'దలా' లేదు ఇక నాకేం ఇస్తాడు 'దల'? అందుకే విసుగుపుట్టి బయటకు వచ్చాను. 'పిచ్చిగోల' గ్రూప్ లో నాకు చాలా హాయిగా ఉంది. మొదటిరోజునే ఇక్కడ ఎంతో ఎదుగుదల కన్పిస్తోంది. ఒకే రోజులో మూడుకేజీలు బరువు పెరిగాను. అయాం హ్యాపీ' అంటోంది ఇంకొకామె - అన్నాడు ఓనీల్. 

నవ్వుతో కొరబోయింది నాకు.

ఆధ్యాత్మిక ఎదుగుదలను కొలవడానికి గిన్నెలు, చెంబులు, డ్రమ్ములు లేవేమో ఈమె దగ్గర? ముందవి ఎక్కువగా కొనుక్కోమనండి. లేకపోతే నెక్లెస్ రోడ్డులో ' స్పిరిట్యువల్ బ్రితలైజర్స్' అమ్ముతున్నారు. అందులో ఊదితే మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో తెలుస్తుందిట. అర్జంటుగా వాటిని కొనేసుకుని దాచుకోమనండి. మళ్ళీ స్టాక్ అయిపోతే కష్టం. ఆ తర్వాత తీరిగ్గా ఊదుకుంటూ కొలుచుకోవచ్చు 'ఎదుగుదల'. నెక్స్ట్' అన్నాను.

'ఇక నేను చెప్పలేను. నా వల్లకాదు. ఈ గ్రూపులో రోజురోజుకీ విపరీతంగా జనం చేరిపోతున్నారు. ఒక్కరోజులోనే లక్షమంది చేరారు వాళ్ళు చెబుతున్నవన్నీ ఒక్క రోజులోనే నేను చదవలేను. మళ్ళీ ఇంకోసారి వస్తా' అన్నాడు ఓనీల్.

'సరే నువ్వు ఎక్కడుండేది అమెరికాలో?' అడిగా.

'అమెరికేందన్న? నేనుండేది తార్నాకల' అన్నాడు ఓనీల్.

మంచం మీద నుంచి ధబ్బున క్రింద పడ్డా.

'వార్నీ. మనూరే ! మరి ఎఫ్. బీ. ఐ అన్నావ్?'

'అంటే, గీ మద్దెనే బెట్టినా. 'ఫేస్ బుక్ ఇనిషియేటివ్' అనీ ఒక సంస్థ. ఆన్లైన్ ల్లున్న వాట్సప్ గ్రూపులన్ని రీసెర్చి జేసి, వాళ్ళకీ వీల్లకీ ఫోన్లు జేసి, టైమ్పాస్ జేస్తుంటా. మళ్ళీ కాసేపట్లో వాల్లోస్తరు గదా పట్కపోడానికి' అన్నాడు.

'వాళ్ళెవరు?' అన్నా అయోమయంగా.

'అదేన్నా. ఎర్రగడ్డ నించి జంపై మకాన్ కొచ్చిన గదా? కనుక్కున్రు. వస్తున్రు. అమ్మో. అదుగో వచ్చిన్రు. ఏయ్ వదులుండ్రి. నేన్రాను. నేన్రాను' అంటూ అరుస్తున్నాడు. ఫోన్ కట్ అయిపొయింది.

'ఇదాసంగతి? ఛీ ఛీ. అసలే చిరాగ్గా ఉంటె, పొద్దున్నే ఈ పిచ్చోడొకడు? ఇలా లాభంలేదు. అర్జెంటుగా నేనుకూడా 'పిచ్చిగోల' వాట్సప్ గ్రూప్ లో చేరిపోయి ఈ పిచ్చోళ్లని ఒక పట్టు పట్టాలి. తప్పదు ' అనుకుంటూ నేలమీద నుంచి మెల్లిగా లేచి బాత్రూం లోకి దారి తీశా.