The secret of spiritual life lies in living it every minute of your life

1, డిసెంబర్ 2020, మంగళవారం

అఘటితఘటనా పటీయసీ మాయా ..

ఆదిశంకరాచార్యులవారు రచించిన 'మాయా పంచకం'
---------------------------------------------------------------------------

శ్లో ||  నిరుపమ నిత్య నిరంశకేఽప్యఖండే
మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
త్వఘటితఘటనా పటీయసీ మాయా ||

నిరుపమము, నిత్యము, నిరంశకము, అఖండము, సర్వవికల్పనాదిశూన్యము అయిన నా చైతన్యములో, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అనే భేదములను సృష్టిస్తున్నది మాయ. ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !    

అద్వైతవేదాంత తత్త్వరీత్యా ఆత్మకు ఈ లక్షణములున్నాయి.

నిరుపమము - పోలిక లేనిది.
నిత్యము - ఎల్లప్పుడూ ఉండేది.
నిరంశకము - తనకు అంశలు లేనిది. 
అఖండము - తనలో ముక్కలు లేనిది
సర్వవికల్పనాదిశూన్యము - ఎటువంటి మార్పులకు లోనుకానిది.

ఇటువంటి ఆత్మలో కూడా ఈశ్వర - జీవ - జగత్తులనే త్రిభేదములను మాయ కల్పించి, అవి నిజములని మనల్ని భ్రమింపజేస్తున్నది. ఇక ఈ మాయ చేయలేని పని ఇంకేముంటుంది? విశ్వస్థాయిలోనే ఇంతటి ఘనకార్యం చేయగలిగిన మాయ, వ్యక్తిస్థాయిలో ఏం చేయలేదు? ఏమైనా చేయగలుగుతుంది. 

శ్లో ||  శ్రుతి శతనిగమాంత శోధకాన
ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నా
నఘటితఘటనా పటీయసీ మాయా ||

ఆహా ! వేదములను నూరు నిగమాంతములను శోధించగలిగే సమర్ధులను కూడా, ధనము మొదలైన ఆశలు చూపించి, కలుషములతో నింపి, పశువులతో సమానులుగా మారుస్తున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !    

వేదములు నాలుగు, ఉపనిషత్తులు 108 దాకా ఉన్నాయి. వీటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి గొప్ప ఉపన్యాసములు చెప్పే మహాపండితులున్నారు. కానీ అంతటివారిని కూడా ధనాశతో నింపి, ఇంకా ఎన్నెన్నో ఆశలకు వారిని లోను చేసి, లొంగదీసుకుని, వారి మనస్సులను పాడుచేసి, వారిని పశువులతో సమానమైనవారుగా మార్చి పారేస్తుంది మాయ ! ఇక స్వతహాగానే పశువుల వంటి మామూలు మనుష్యులను ఇది ఇంకేం చేయలేదు? ఏమైనా చేయగలదు. 

శ్లో ||  సుఖ చిదఖండ విబోధమద్వితీయం
వియదనలాది వినిర్మితే నియోజ్య
భ్రమయతి భవసాగరే నితాంతం
త్వఘటితఘటనా పటీయసీ మాయా ||

సుఖస్వరూపము, చిద్రూపము, అఖండము, అద్వితీయము అయిన ఆత్మను ఆకాశము, వాయువు మొదలుగాగల పంచభూతముల వలలో పడవేసి, భవసాగరంలో త్రిప్పుతున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు !

తనలో ఎటువంటి విభాగములు లేని, ఏకస్వరూపమై, సృష్టికి అతీతమై, సచ్చిదానందస్వరూపమైన ఆత్మను కూడా, సృష్టిలో పడవేసి, పంచభూతముల ఊబిలో దించి, ఈ లోకవ్యామోహమనే సముద్రంలో ముంచి తేలుస్తున్నది మాయ !

మాయ ముందు దివ్యాత్మకే దిక్కు లేకపోతే, ఇక మామూలు మనుషులెంత? దానిముందు వారెక్కడ నిలబడగలుగుతారు?  

శ్లో ||  అపగత గుణ వర్ణ జాతిభేదే
సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ
స్ఫుటయతి సుతదార గేహమోహం
త్వఘటితఘటనా పటీయసీ మాయా ||

గుణము, వర్ణము, జాతి మొదలైన భేదములు లేని సుఖస్వరూపము, చిద్రూపము అయిన ఆత్మలో 'నేను బ్రాహ్మణుడను' మొదలైన  అహంస్ఫురణలను కల్పించి, ఇంకా దానిలో భార్య, పుత్రులు, ఇల్లు మొదలైన మోహములను సృష్టిస్తున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !    

సత్ - చిత్ - ఆనందస్వరూపమైన ఆత్మకు గుణములు లేవు. అది త్రిగుణాతీతము. దానికి రంగు లేదు. అది వర్ణాతీతము. దానికి పుట్టుకే లేదు. కనుక అది జాతికి అతీతము. కాని మాయాప్రభావమునకు లోనై, 'నేను ఫలానా' అని అది భావిస్తున్నది. పైగా, భార్యాబిడ్డలు, ఇళ్ళూవాకిళ్ళు మొదలైన మాయామోహములకు లోనైపోతున్నది. ఇంత చేయగలిగే మాయ, ఒక మామూలు మనిషిని ఇంకెంత ఊపగలదు? ఎక్కడికి తీసుకుపోగలదు? ఎంత పతనంలోకి నెట్టగలదు?
 
శ్లో ||  విధిహరిహర విభేదమప్యఖండే
బత విరచయ్య బుధానపి ప్రకామం
భ్రమయతి హరిహరభేదభావా
నఘటితఘటనా పటీయసీ మాయా ||

బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనే భేదములు లేని అఖండాత్మలో హరి హరుడు మొదలైన భేదభావములను కల్పించి పండితులను కూడా భ్రమింపజేస్తున్నది కదా మాయ ! ఈ మాయ అసంభవములను కూడా సంభవములుగా మార్చగలదు కదా !

ఆత్మలో త్రిమూర్తిభేదం లేదు. వాటికి అతీతమైనదే ఆత్మ. కానీ అలాంటి ఆత్మలో కూడా విష్ణువని, శివుడని, ఇంకో దేవుడని నానారకములైన భ్రమలు కల్పింపజేసి, ఎన్నో గ్రంధములు చదివి పెద్ద పండితులమని విర్రవీగేవారిని కూడా బహుదేవతారాధనలోకి మళ్ళిస్తున్నది కదా మాయ ! ఇలాంటి మాయ చేయలేని పని ఈలోకంలో ఏముంటుంది?

ఈ అయిదుశ్లోకాలలో మాయకున్న అయిదుముఖాలను వివరించారు శంకరులు.

1. అఖండచైతన్యంలో ఈశ్వర, జీవ, జగత్తులనే త్రిపుటిని సృష్టించడం. ఇది మాయ చేసే ప్రాధమికమైన పని. అంటే మొదటి మెట్టు.
2. వేదవేదాంగములు చదువుకుని జ్ఞానులమని భావించే పండితులను కూడా పశువులుగా మార్చగలదు మాయ. ఇక మామూలు మనుషుల పని చెప్పనే అక్కర్లేదు. ఇది రెండో మెట్టు.
3. సృష్టికి అతీతమైన ఆత్మను సృష్టిలో భాగములైన పంచభూతములలో పడవేసి గిరగిరా త్రిప్పుతున్నది మాయ. ఇక సృష్టిలో భాగమైన మనుషులను ఇంకెలా ఆడిస్తుంది? ఇది మూడో మెట్టు.
4. మనిషికి జాతి, కులము, గుణము, ధనము, అందము, పదవి మొదలైన గర్వములను కల్పించి, కళ్ళు కనపడకుండా చేసి, భార్య, భర్త, పిల్లలు, నావాళ్ళు అనే భ్రమల్లో ముంచి ఆడించి పిచ్చివాడిని చేస్తున్నది మాయ. ఇది నాలుగో మెట్టు.
5. అన్నీ తానే అయిన బ్రహ్మములో నానా దేవతాభేదములను కల్పించి మనుషులకు పిచ్చిపుట్టిస్తున్నది మాయ. ఇది ఐదో మెట్టు.

మాయ తలచుకుంటే మనిషి ఎంత? వాడి బ్రతుకెంత?
ఈ రోజు వేటిని చూచుకుని విర్రవీగుతున్నాడో రేపు అవన్నీ ఉంటాయా?
ఉంటే, ఎన్నాళ్ళు ఉంటాయి?
అవి ఊడినపుడు మనిషికెవరు దిక్కు?
ఈనాడు ఉండి రేపు పోయేవాటిని చూసుకుని, ఎల్లప్పుడూ నీతో ఉండేదాన్ని వదులుకోవడం ఏం పని?
కానీ, చెబితే ఎవరు వింటారు?
శంకరులు ఈ మాట చెప్పి వెయ్యేళ్ళు దాటింది.
ఆయనకంటే ముందు, ఎన్నో వేల ఏళ్ళ నుంచీ ఇంకెందరో మహనీయులు చెబుతూనే ఉన్నారు.
కానీ ఎవరూ వినరు. వినలేరు. ఆచరించలేరు.
అలా జరిగితే ఇక మాయ ఎందుకు???

అఘటితఘటనా పటీయసీ మాయా ....