“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, డిసెంబర్ 2020, మంగళవారం

అంతములేని ఈ భువనమంత .....

'అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల..' అనే పద్యాన్ని వ్రాసింది దువ్వూరి రామిరెడ్డిగారు కదూ. పానశాలనుంచి నేను కంఠస్ఠం పట్టిన పద్యాలలో అదీ ఒకటి ! ఉమర్ ఖయాం వ్రాసిన రుబాయత్ కి అది తెలుగు. లోకమంతా ఒక పెద్దసత్రం లాగా కన్పించింది ఉమర్ ఖయాం కళ్ళకి. కానీ నాకు మాత్రం లోకమంతా ఒక పెద్ద పిచ్చాసుపత్రిలాగా కనిపిస్తోంది.

పిచ్చాసుపత్రి వార్దుల్లో ఉన్న పిచ్చోళ్ళు నా కళ్ళకి పిచ్చోళ్ళలాగా ఆనడం లేదు. మూమూలు మనుషుల లాగే కన్పిస్తునారు. ఎందుకంటే, లోకంలో ఉన్న జనాల్లో పిచ్చి లేనిదెవరికి? మరి వాళ్లనేమో లోకంలో వదిలేసి, వీళ్ళని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. పిచ్చోళ్ళు హాయిగా సొసైటీ అంతా ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లమీద తిరుగుతున్నారు. వాళ్ళచేత పిచ్చోళ్ళుగా ముద్ర వెయ్యబదిన కొందరు పిచ్చోళ్ళు మాత్రం పిచ్చాసుపత్రిలో ఇన్ పేషంట్లుగా చేర్చబడ్డారు. పిచ్చి జనమూ పిచ్చి లోకమూనూ !

నా దృష్టిలో లోకంలోని జనమందరూ పిచ్చోళ్ళే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన పిచ్చి. కొందరికి మొదట్లో ఉంటే, మరికొందరికి కొద్దిగా ముదిరితే, ఇంకొందరికి పూర్తిగా ముదిరింది. అంతే ! 

కొందరికి డబ్బుపిచ్చి. వారి బ్రతుకంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.వారికి మానవసంబంధాలు ఏమాత్రం పట్టవు. డబ్బు సంపాదించడం ఒక్కటే జీవితంలో సక్సెస్ కి కొలబద్ద అనుకుంటారు. ప్రతిదానినీ డబ్బుతోనే కొలుస్తారు. ఆ డబ్బును సంపాదించడంలో ఎంతో పాపఖర్మను మూట గట్టుకుంటారు.'డబ్బు డబ్బు' అని కలవరిస్తూనే వాళ్ళు కన్నుమూస్తారు. కానీ ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది. వాళ్లు మాత్రం పోతారు. వాళ్ళ ఖర్మ మాత్రం వాళ్ళతో వెంటనంటి ఉంటుంది.

మరికొందరికి దురహంకారపు పిచ్చి. 'అంతా మాకే తెలుసు, అన్నీ మాకే తెలుసు, ఎదుటివారికి ఏమీ తెలియద'ని అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదానికీ ఎదుటివారికి పాఠాలు నేర్పబోతారు. 'అదలా చెయ్యాలి, ఇదిలా చెయ్యాలి. దాన్నలా చెయ్యకూడదు. దీన్నిలా చెయ్యకూడదు. అని నోరు తెరిస్తే చాలు అనవసరమైన పెద్దరికం తీసుకుని అందరికీ లెక్చర్లు ఇస్తూ ఉంటారు. వీరి అదృష్టం బాగుంటే తమకేమీ తెలియదని, అన్నీ తెలుసని అనుకుంటూ ఏమీ తెలియకుండా బ్రతికామని వారికి చివరిఘడియలలో తెలుస్తుంది. అంతదృష్టం లేకపోతే అదీ తెలియదు. ఈ లోపల జీవితమంతా వాళ్ళు చేసిన గోలతో పక్కవాళ్ళు నలిగిపోతారు.

మరికొందరికి ఐడెంటిటీ క్రైసిస్ పిచ్చి. నోరు తెరిస్తే బడాయిలు తప్ప ఇంకేమీ ఉండవు వీళ్దదగ్గర. ఇక ప్రతిదానికీ - 'మాకింత ఉంది. నేనింత చేశాను. ఇంత సంపాదించాను. ఇంతమందికి ఇంత చేశాను. నేనంత నేనింత' అని చెప్పుకుంటూ ఒక భ్రమపూరిత లోకంలో బ్రతుకుతూ ఉంటారు.

మరికొంతమందికి రెలిజియస్ పిచ్చి. నోరు తెరిస్తే రెలిజియస్ బడాయిలు. 'నేను గొప్ప భక్తుడిని, నేను పుట్టినప్పటినుంచీ అసలు తిండే తినలేదు. ఉపవాసాలే ఉంటున్నాను. నా జీవితమంతా పూజగదిలోనే గడిపాను. నేను జోలపాడకపోతే దేవుళ్ళు నిద్రే పోరు' ఇలాంటి బడాయిలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు పుట్టకముందు కూడా దేవుడున్నాడనీ, తర్వాతా కూడా ఉంటాడనీ మర్చిపోతారు. వీళ్ళది కూడా ఐడెంటిటీ క్రైసిస్సే. అందులో ఇదొక షేడ్. అంతే.

మరికొంతమంది పూజలని, పునస్కారాలని నాలుగు మాయమాటలు, మంత్రాలు,  వచ్చీరాని జ్యోతిష్యాలు నేర్చుకుని జనాన్ని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళ మాయరంగులు రెండు మూడు రోజులలోనే బయటపడుతూ ఉంటాయి.

కదిలిస్తే డిల్లీ రాజకీయాల నుంచి, పల్లెటూరి పంచాయితీల వరకూ అన్నీ మాకే తెలుసనీ ఇంకొందరు. వీళ్ళ బ్రతుకంతా 'మేము మేము' అని అరవడం లోను, 'వాళ్ళు అలాగ, వీళ్ళు ఇలాగ' అని తీర్పులు తీర్చడంలోనూ అయిపోతుంది. చివరికా దురహంకారపు మాయలో పడి జీవితాన్ని ఎంత కోల్పోయామో తెలియని స్థితిలో చనిపోతారు వీళ్ళు.

ఇంకొందరికి అభద్రతాభావం పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక భయంతో పీక్కుంటూ ఉంటారు. ఎవరో ఒకరు వీరికి ఆసరాగా అండగా ఉండాలి. కానీ వారిమీద మళ్ళీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. వాళ్ళని తొక్కి పెడతారు. మళ్ళీ వాళ్ళు లేకపోతే క్షణం కూడా శాంతిగా సుఖంగా బ్రతకలేరు. వీళ్ళ జీవితం కూడా  ఈ మాయలోనే గడిచిపోతుంది. వీరిది ద్వంద్వమనస్తత్వం.

దీనిలో ఇంకొక షేడ్ ఏంటంటే, ఒక మనిషి మన చేతిలోనుంచి జారిపోతున్నాడని లేదా జారిపోతోందని భయపడి తమ గుప్పిట్లోనే పెట్టుకోవాలని నానా రకాల ప్లాన్స్ వేయడం. ఈ క్రమంలో గోలగోల  చేయడం. ఎంత విచిత్రం? అంతిమంగా చూస్తే ఈ లోకంలో ఎవరికెవరు? ఇక్కడ మనమే శాశ్వతం కాదు. మళ్ళీ ఇంకొకరు మన గుప్పిట్లో లేరని మనం భయపడటం! ఫన్నీ గా లేదూ?  

మరికొందరికి అతితెలివిపిచ్చి. ఎత్తులతో జిత్తులతో అందరినీ బోల్తా కొట్టించగలమని అనుకుంటారు. వాళ్ళ ప్లాన్లకు ఎవరైనా పడిపోతారని అనుకుంటారు. అవసరం ఉన్నంతవరకూ నక్కవినయాలు నటిస్తారు. అవసరం తీరాక అసలు స్వరూపాలు బయటపెడతారు. ఈ క్రమంలో ఎదుటివారిని భలే మేనేజ్ చేసామని అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. కానీ చివరకు వాళ్ళే బొక్కబోర్లా పడ్డామన్న విషయాన్ని గ్రహిస్తారు. అదికూడా వాళ్ళ అదృష్టం బాగుంటే. లేకపోతే అదీ తెలియదు. అలాగే నక్కజిత్తులు వేసుకుంటూ, అదే పెద్ద తెలివి అనుకుంటూ బ్రతికి, చివరకు అలాగే పోతారు.

వెరసి వీళ్ళందరికీ స్వార్ధం పిచ్చి. 'ముందు నేను నాది. ఆ తర్వాతే ఇంకెవరైనా, చివరికి దేవుడైనా సరే' - అనే సిద్ధాంతం అందరిదీనూ. కానీ అది చాలా నీచమైన మనస్తత్వమన్న సంగతి వాళ్లకు చావుమంచం మీద కూడా తెలియదు.

ఈ విధంగా అహంకారం (సుపీరియారిటీ కాంప్లెక్స్), భయం (ఇంఫీరియారిటీ కాంప్లెక్స్), అభద్రతాభావం (ఫియర్ కాంప్లెక్స్), అతితెలివి (ఇంటలెక్చువల్  కాంప్లెక్స్), అతిస్వార్ధం (సెల్ఫిష్ కాంప్లెక్స్), మతపిచ్చి (రెలిజియస్ మానియా) - వీటి ఊబిలోనే మనిషి జీవితమంతా మునిగిపోతూ ఉంటుంది. ఇవే సర్వస్వమనీ ఇదే అంతా అనీ భావిస్తూ కోట్లాదిమంది బ్రతికేస్తూ ఉంటారు. చనిపోతూ ఉంటారు. కానీ ఎలా బ్రతకాలో ఎవరికీ ఏమాత్రమూ తెలియదు. వీళ్ళంతా జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ తెలుసుకోలేరు. మనిషి జీవితం ఎంత విలువైనదో దానిని ఎలా బ్రతకాలో వీళ్ళలో ఎవరికీ తెలియదు.

ఇవేవీ లేకుండా కూడా చక్కగా బ్రతకవచ్చు. ఆ బ్రతుకు చాలా హాయిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అలా ఉంటే కోల్పోయేది ఏమీ ఉండదు. పోగొట్టుకునేదీ ఏమీ ఉండదు. హీనంగా బ్రతికేదీ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించి ఈ భూమ్మీద పడేశాడో, ఖచ్చితంగా దానికి అనుగుణంగా బ్రతకవచ్చు. అదే అసలైన జీవితం. కానీ ఎవరూ అలా బ్రతకరు.

ప్రతివాళ్ళూ 'దేవుడు దేవుడు' అంటారు. ఏ మతం దేవుడు ఆ మతానికి ఉంటాడు. అందరూ దేవుడిని కొలుస్తారు. కానీ ఆ దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా మాత్రం బ్రతకరు. ఎలా వద్దని చెప్పాడో అలాగే ఉంటారు. మళ్ళీ అదే దేవుడిని కొలుస్తూ ఉంటారు. దేవుడు వద్దన్నదానిని చేస్తూ, మళ్ళీ ఆయన సహాయం కోసం ప్రార్ధిస్తారు. ప్రతి మతంలోనూ ఇదే తంతు !

నిజమైన గురువులు 'నువ్వెలా బ్రతకాలి?' అనేదే నేర్పిస్తారు. అది తప్ప మిగతా సోది చెప్పేవాడు నిజమైన గురువు కానేకాడు. పై కాంప్లెక్స్ లు ఏవీ లేకుండా బ్రతకడమే అసలైన జీవితం. కానీ వాళ్ళమాటలు ఎవరు వింటారు? ఎవరు అనుసరిస్తారు? ఎవరు ఆచరిస్తారు? ఎవరూ ఉండరు. చెప్పినా ఎవరూ వినరు.

చెత్త మనుషులు ! చెత్త లోకం !

ఈ ప్రపంచం ఇంతే ! ఈ మనుషులింతే ! ఎవరి కాంప్లెక్స్ లు వారివి. ఎవరి పిచ్చి వారిది. ఇవి నయమయ్యే పిచ్చులు కావు.  

ఏంటీ వింత? ఇంత వింతలోకం ఇంకెక్కడా ఉండదేమో?

అంతములేని ఈ భువనమంత ఒక పురాతన పిచ్చాస్పత్రి....