నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, మే 2022, సోమవారం

ఈ అమావాస్య గిఫ్ట్ - నేపాల్ విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

ఈరోజు అమావాస్య. నిన్న ఆదివారం ఉదయం 9 55 ప్రాంతంలో నేపాల్ లో 'తారా ఎయిర్ వేస్' అనే ప్రయివేట్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం కూలిపోయింది. పోఖారా అనే టూరిస్ట్ సిటీ నుండి ఇంకొక టూరిస్ట్ ప్రాంతమైన జోమ్సంకు బయలుదేరిన ఈ విమానం 12 నిముషాలలోనే కొండలలోని కోవాంగ్ అనే పల్లెటూరి దగ్గరగా కూలిపోయింది. సాధారణంగా ఈ ప్రయాణం 20 నిముషాలే పడుతుంది. 9.55  AM కి బయలుదేరిన ఈ విమానం 12 నిముషాల తర్వాత 10.07 కి కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. అప్పటినుంచీ విమానం అడ్రస్ లేదు. కొండలు, మంచుల వల్ల విమానం కూలిపోయిన ప్రదేశానికి అధికారులు వెంటనే చేరలేకపోయారు. ప్రస్తుతం చేరుకున్నారు. అందులో ఉన్న 22 మంది ప్రయాణీకుల శరీరాలు గుర్తుపట్టలేనివిధంగా ముక్కలైపోయాయి. 

జ్యోతిష్య పరంగా చూద్దాం.

ప్రస్తుతం కుంభరాశి నుండి వృషభరాశి వరకూ గ్రహాలన్నీ గుమిగూడి ఉన్నాయి. ఏదో దుర్ఘటన జరిగినప్పుడు జనం గుంపులుగా గుమిగూడి చూచినట్టు ఈ దృశ్యం ఉన్నది. గత వారం నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని దుర్ఘటనలకూ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ఈ గ్రహస్థితే కారణం.

కుజుడు, గురువు దాదాపుగా ఒకే డిగ్రీమీద ఉంటూ, శపితయోగంలో బందీలై ఉన్నారు.  వారిమీద శని, ప్లూటో, శుక్ర, బుధుల ప్రభావాలున్నాయి. అందుకనే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు గత వారం నుంచీ జరుగుతున్నాయి. అవన్నీ వివరించడం నా ఉద్దేశ్యం కాదు.

మేషరాశి కొండకోనలను సూచిస్తుంది, అదేవిధంగా నేపాల్ దేశాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంతో ఉన్నది. అందులోనే, చంద్రుడు రాహుగ్రస్తుడై, విమానాలకు సూచకుడైన శుక్రునితో కలసి అర్గళంలో ఉన్నాడు. మరణానికి కారకుడైన యముడు (ప్లూటో) యొక్క కేంద్రదృష్టి వీరిపైన ఉన్నది. నవాంశచక్రంలో, నీచరాహువుతో కూడి ఉన్న చంద్రుడిని వక్రబుధుడు కలుస్తున్నాడు. అంటే, యాంత్రికప్రమాదం సూచింపబడుతున్నది. లెక్క సరిపోయిందనుకుంటాను.

ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులున్నారు. రూట్ నంబర్ 4 అవుతున్నది. 2, 4 అనే అంకెలు రాహుకేతువులకు సూచికలు. వీళ్ళు నవాంశలో నీచస్తితులలో ఉన్నారు. 4 అంకెను సూచించే కేతువు ఒంటరివాడుగా తులలో దూరంగా ఉన్నాడు. అందుకే, ఎక్కడో కొండల్లో విమానం కూలిపోయింది. ప్లూటో (మరణం) యొక్క కేంద్రదృష్టి ఈయనమీద కూడా ఉన్నది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా శవాలు కొండలలో దిక్కులేకుండా పడి ఉన్నాయి. ఇలాంటి చావులకు కేతువే కారకుడు. ఈ గ్రహయోగాలన్నీ కలసి ఈ భయంకర విమానప్రమాదానికి కారణమైనాయి.

సూక్ష్మవిషయాలను స్పష్టంగా చూపించే షష్ట్యంశ (D-60) చక్రాన్ని గమనిద్దాం.

9.55 కి ఆ ప్రాంతపు షష్ట్యంశ చక్రం ఇలా ఉంది. లగ్నాధిపతి గురువు బాధకుడు బుధునితో కలసి అస్తమయయోగంలో ఉన్నాడు. అంటే, చావు మూడబోతున్నదని అర్ధం. విమానానికి కారకుడైన శుక్రుడు నీచకేతువుతో కలసి, విమానం ధ్వంసం అవుతుందని సూచిస్తున్నాడు. కర్మ కారకుడైన శని, నేపాల్ ను సూచించే మారకరాశి మేషంలో నీచస్థితిలో ఉన్నాడు. ఈ విమానం చాలా చెడుఘడియలలో బయలుదేరింది. 

షష్ట్యంశచక్రంలోని లగ్నం ప్రతి రెండు నిముషాలకు మారిపోతూ ఉంటుంది. 9.57AM కి ఇది మేషలగ్నమైంది. అంటే, నీచశని మీదకు వచ్చింది. ప్రమాదం వేగంగా దగ్గరవడం మొదలుపెట్టింది.

9.59AM కి నీచకేతు, శుక్రుల (విమానవిధ్వంసయోగం) తో కూడిన వృషభలగ్నమైంది. విమానంలో యాంత్రికలోపాలు తలెత్తి ఉంటాయి.

10.07AM కి సింహలగ్నమైంది. అక్కడే వక్రప్లూటో (మరణం) ఉన్నాడు. ప్లూటో, గురుబుధులనూ, సూర్యకుజులనూ ఆచ్ఛాదిస్తున్నాడు. వక్రబుధ, వక్రప్లూటోల వల్ల పైలట్ బుద్ధి వక్రిస్తుంది. అంటే, జడ్జ్ మెంట్ లోపిస్తుంది. జీవకారకుడైన గురువును మరణకారకుడైన ప్లూటో ఆచ్ఛాదించడం వల్ల మరణం వరిస్తుంది. సూర్య కుజులపై ప్లూటో ఆచ్చాదన భయంకరమైన యాక్సిడెంట్ ను ఇస్తుంది. ఖచ్చితంగా ఇవే యోగాలు, షష్ట్యంశ (D-60) చక్రంలో ఉండటాన్ని చూడవచ్చు.

ఈ పాయింట్స్ అన్నిటినీ అన్వయం చేసుకోండి. నేనక్కర్లేదు, మీరే చెప్పగలుగుతారు ఏం జరిగి ఉంటుందో?

ప్రస్తుతం అమెరికానుండి, మిడిల్ ఈస్ట్ నుండి, యూరోప్ నుండి, ఇండియానుండి, శ్రీలంక వరకూ ప్రతిచోటా జరుగుతున్న దుర్ఘటనలన్నిటికీ ఈ చార్ట్ లో కనిపిస్తున్న గ్రహయోగాలే కారణం. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి.

మొత్తం మీద ఈ అమావాస్య, ప్రపంచానికి ఈ బహుమతిని ఇచ్చింది !

read more " ఈ అమావాస్య గిఫ్ట్ - నేపాల్ విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ "

29, మే 2022, ఆదివారం

'సర్వసార ఉపనిషత్' - మా క్రొత్త పుస్తకం విడుదల


కృష్ణ యజుర్వేదాంతర్గతమైన 'సర్వసార ఉపనిషత్' ను మా 43 వ పుస్తకంగా నేడు విడుదల చేస్తున్నాము. పేరుకు తగినట్లే ఇది అన్ని ఉపనిషత్తుల సారమై యున్నది. దీనికి, 'సర్వసారోపనిషత్, సర్వోపనిషత్, సర్వోపనిషత్సారము' అని వేర్వేరు పేర్లున్నాయి.

నిత్యజీవితంలో మనం -- జ్ఞానం, అజ్ఞానం, బంధం, మోక్షం, పంచకోశములు, జీవుడు, ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మము అనే పదాలను చాలా సాధారణంగా వాడేస్తూ ఉంటాము. కానీ వాటి అర్ధాలేమిటో మనకు తెలియవు. తెలుసని అనుకుంటాం గాని, నిజానికి వీటి అసలైన అర్ధాలు మనకు తెలియవు. అవి సరిగా అర్ధమైతే గాని, వేదాంతము అర్ధం కాదు. వేదాంతమంటే ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానభాగం.

ఉపనిషత్తులు 108 ఉన్నాయి గాని, వాటిలో ప్రామాణికములైనవి పది ఉపనిషత్తులే. ఆదిశంకరులు వీటికి భాష్యం వ్రాశారు. వేలాది ఏళ్ల కాలగమనంలో ఎన్నో కొత్తకొత్త ఉపనిషత్తులు పుడుతూ వచ్చాయి. వాటిల్లో కొన్ని, పది ఉపనిషత్తులలోని కొన్ని విషయములను తీసుకుని వివరిస్తూ వచ్చాయి. చిన్నవైన ఈ ఉపనిషత్తులను  సామాన్యోపనిషత్తులంటారు. వాటిలో ఇది ఒకటి.

దీనిని కూడా ఉచితపుస్తకంగా విడుదల చేస్తున్నాము. Google Play Books నుండి దీనిని ఇక్కడనుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పుస్తకం తయారు కావడానికి ఎంతో శ్రమించి అతి తక్కువకాలంలో దీని టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు. అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు, సంస్థ కార్యక్రమాలలో మాకందరికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఉపనిషత్తులలోని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని చదివి అర్ధం చేసుకోండి. అసలైన హిందూమతం యొక్క స్థాయి ఏమిటో, అదేం చెప్పిందో గ్రహించండి. అలా అర్ధం చేసుకున్న విషయాలను మీమీ జీవితాలలో ఆచరించడానికి ప్రయత్నించండి. అప్పుడే ఈ దేశంలో పుట్టినదానికి సార్ధకత ఉంటుంది.

ఈ దేశంలో పుట్టి, అద్భుతమైన ఈ దేశపు ప్రాచీనవిజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే, దానిని అందిపుచ్చుకోలేకపోతే, అంతకంటే దురదృష్టం ఇంకేమీ ఉండదు మరి !

మా ఇతర పుస్తకాలలాగే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !

read more " 'సర్వసార ఉపనిషత్' - మా క్రొత్త పుస్తకం విడుదల "

25, మే 2022, బుధవారం

టెక్సాస్ స్కూల్ షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ

నిన్న అంటే, 24 మే 2022 న ఉదయం 11.32 ప్రాంతంలో టెక్సాస్ లో షూటింగ్ జరిగింది. షూటింగ్ అంటే సీన్మా షూటింగ్ అనుకునేరు. అదికాదు. గన్ షూటింగ్. ఒక 18 ఏళ్ల అబ్బాయి తుపాకీతో కాల్పులు జరిపి 22 మందిని  చంపేశాడు. వాళ్లలో 19 మంది చిన్నచిన్నపిల్లలు. ఇద్దరు పెద్దవాళ్లున్నారు. ఒక పోలీసు కూడా ఉన్నాడు. చివరికి అతన్ని కూడా  పోలీసులు కాల్చేశారు.

అమెరికా అంతా గగ్గోలెత్తింది. గన్ కల్చర్ కు ముగింపు  పలకాలని జో బైడెన్ తో సహా అందరూ  తీర్మానించారు. చర్చిలలో ప్రార్ధనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించారు. కానీ ఏమీ చెయ్యరు. ఏమంటే, గన్ లాబీ చాలా గట్టిది. అది వాళ్ళ వ్యాపారం మరి !

హంతకుడికి ఈ మధ్యనే పట్టుమని పదిహేడు నిండాయి. వెంటనే రెండు గన్స్  కొనుక్కున్నాడు. కార్టూన్ కేరక్టర్ లాగా వేషం వేసుకున్నాడు. యుద్దానికి వెళ్ళేవాడిలాగా తయారయ్యాడు. తుపాకీ ని టెస్ట్ చెయ్యాలికదా? ముందు ఇంట్లో ఉన్న మామ్మను సరదాగా డిష్యుం అంటూ కాల్చి పారేశాడు.  గన్ పనిచేస్తోందని నిశ్చయించుకున్నాక, నింపాదిగా దగ్గర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కొచ్చి 19 మంది పిల్లల్ని  కాల్చి పారేశాడు. అడ్డొచ్చిన పోలీసుని కాల్చేశాడు. ఒక టీచర్ని కాల్చేశాడు. ఎదురుకాల్పులలో చనిపోయాడు.

గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

షూటింగ్ జరిగిన యువాల్డీ అనే ఊళ్ళో ఆ సమయానికి  కర్కాటకలగ్నం 15 డిగ్రీ ఉదయిస్తోంది. అసలు ఇలాంటి సంఘటనలకు కుజరాహువులు కారకులౌతారు. ఈ చక్రంలో కుజుడు చంద్రగురువులతో కలసి ఉంటూ మతపరమైన రాక్షసత్వాన్ని సూచిస్తున్నాడు. పైగా, రాహుశనుల మధ్యన అర్గలబందీ అయ్యాడు. ఇది చాలా భయంకరమైన క్రూరయోగం. ఈ కుజుని చతుర్ధదృష్టి అమెరికాను సూచించే మిధునరాశి  మీదుంది. చిన్నపిల్లలకు సూచకుడైన బుధుడు వక్రిగా మారి, అస్తంగతుడై, ప్లుటోతో ఖచ్చితమైన దృష్టితో చూడబడుతున్నాడు. పైగా, కుజుడు సూచించే దక్షిణపు గేట్ లోనుంచి హంతకుడు స్కూల్లోకి అడుగుపెట్టాడు.

ఇంకేం కావాలి? 20 ఏళ్లలో జరగని ఘోరం జరిగింది. పాపం ఈ స్కూల్లో చదువుకునే పిల్లల్లో  చాలామంది పేదవాళ్ళైన హిస్పానిక్ పిల్లలే.

అమెరికాలో ఉన్న రేసిజానికి, మానసికరోగాలకు, చిన్నవయసులోనే పిల్లలలో పుట్టే పెడబుద్ధులకు ఈ సంఘటన అద్దం పడుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో గన్స్ విరివిగా చాకోలెట్ల మాదిరి అమ్ముతారు. ఓరిగాన్ లో పెట్టిన ఓషో ఆశ్రమానికి కావలసిన తుపాకులను కూడా, షీలా మనుషులు టెక్సాస్ నుండే కొనుక్కున్నారు. పైగా శాంతిని ప్రబోధించే క్రైస్తవమతం కూడా అక్కడ చాలా ఎక్కువ. మరి పిల్లలకి ఇదేనా నేర్పించేది? ప్రతీ ఆదివారం చర్చిలలో ఊరకే మాయదారి శాంతివచనాలు పలకడమేనా? లేక ఇప్పుడైనా నిజాయితీగా ఈ గన్ కల్చర్ కు ముగింపు పలుకుతారా? ఏమో చూద్దాం !

read more " టెక్సాస్ స్కూల్ షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ "

22, మే 2022, ఆదివారం

'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' - మా క్రొత్తపుస్తకం విడుదల

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' నుండి వెలువడుతున్న 42 వ పుస్తకంగా 'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' ఈరోజున విడుదలౌతున్నది. ఇది అధర్వణ వేదమునకు అనుబంధమైనది.

అందరూ ప్రతిపూటా చేసే అతిమామూలు పనియైన 'భోజనం చేయడాన్ని' వైదికసాధనగా మలచుకుని, దానిద్వారా అత్యుత్తమమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలన్న సులభమైన సాధనామార్గం ఇందులో చెప్పబడింది.

యోగశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో చెప్పబడిన సాధనలను అందరూ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ, దీనిలో చెప్పబడిన సాధన చాలా సులభమైనది. ఎవరైనా దీనిని చేయవచ్చు. ఫలితాన్ని మీరే చూడవచ్చు.

విశ్వమంతా ప్రాణమయమని, ఆ ప్రాణమే బ్రహ్మమనిన దివ్యానుభవాన్ని వేదఋషులు పొందారు. సరియైన భావనతో చేస్తే, దీనిని బాహ్యయజ్ఞంతోనూ అందుకోవచ్చు. అంతకంటే సులభమైన మార్గమేమంటే, మనం ఆహారాన్ని తీసుకోవడాన్నే సాధనగా మార్చుకుని కూడా ఈ స్థితిని పొందవచ్చు. దీనికే 'ప్రాణాగ్నిహోత్ర విద్య' యని పేరున్నది. ఆ విద్య ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. దీనికి నా సులభమైన వివరణను, వ్యాఖ్యానాన్ని ఈ పుస్తకంలో మీరు చూడవచ్చు.

'వేదాలలో ఏముందో తెలీకుండా బ్రాహ్మణులు దాచిపెట్టారు' అనే మాటను కొంతమంది అనడం నా చిన్నప్పటినుంచీ నేను వింటున్నాను. అది నిజమో కాదో ప్రస్తుతానికి ప్రక్కన ఉంచుదాం. ఈ నిందను దూరం చేయడానికి నావంతుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నంలో, 'వేదాలలో ఏముంది? ఏయే రహస్యసాధనలు వాటిలో ఉన్నాయి?' అనే విషయాలను నా పుస్తకాలలో తేటతెల్లంగా, స్పష్టంగా వ్రాస్తూ వస్తున్నాను. కులాలతో సంబంధం లేకుండా వీటిని నా శిష్యులకు ఉపదేశిస్తున్నాను.

నేడు, వేదోపనిషత్తుల విజ్ఞానమంతా, కులాలతో సంబంధం లేకుండా అందరికీ, ప్రింట్ లో అందుబాటులో ఉంది. చదివి, అర్ధం చేసుకుని, ఆచరించేవారు మాత్రమే కావాలి. ఇప్పుడేమీ దాపరికం లేదుకదా ! ఆచరించండి మరి.

మాది ధార్మికసంస్థయేగాని వ్యాపారసంస్థ కాదు. కనుక, మా సంస్థనుండి కొన్ని ఉచిత పుస్తకాలను కూడా క్రమం తప్పకుడా అందరికీ అందించాలని సంకల్పించాం. ఈ ప్రక్రియలో భాగమే ఈ ఉచితపుస్తకం. దీనిని మీరు google play books నుండి ఉచితంగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దీనికి వ్యాఖ్యానాన్ని వ్రాసింది నేనే అయినా, ఈ పుస్తకం వెలుగు చూడటానికి ఎంతో శ్రమించి టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు. అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు, మాకందరికీ నిరంతరం అండగా నిలుస్తున్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

నా శిష్యురాలు శ్రీలలిత చేతులమీదుగా ఈ పుస్తకం విడుదల అవుతున్నది.

మన సనాతనధర్మంలో ఉన్న విజ్ఞానసంపదను చదవండి. అర్ధం చేసుకోండి. ఆచరించండి.  ధన్యులు కండి. ఈ దేశంలో పుట్టడం ఎంతో గొప్ప అదృష్టం. మన దేశపు విజ్ఞానం అత్యద్భుతం. అమూల్యం. భారతీయులుగా, హిందువులుగా పుట్టిన అందరూ ఈ విజ్ణానానికి అర్హులే. దీనికి కులంతో సంబంధం లేదు. శ్రద్ధ ఒక్కటే అర్హత.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' 'శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది' అంటూ భగవద్గీత చెబుతోంది !

మా మిగతా గ్రంధాలను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !


read more " 'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' - మా క్రొత్తపుస్తకం విడుదల "

16, మే 2022, సోమవారం

'A Hymn To Goddess Tara' - E Book released today

ఈరోజు వైశాఖపౌర్ణమి. బుద్ధుని జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. బుద్ధభగవానుని అమితంగా ఇష్టపడే నేను ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తాను.

మూడేళ్ల క్రితం 2019 లో ఇదే రోజున జిల్లెళ్ళమూడి నుండి 'ధర్మపదం' పుస్తకాన్ని విడుదల చేశాము. నేడు ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము.

ఇంతకుముందు చెప్పినట్లుగా, 'తారాస్త్రోత్రం' ఆంగ్ల అనువాదం 'A Hymn To Goddess Tara' అనే పేరుతో అందుబాటులోకి వస్తున్నది.

ఇంగ్లీష్ మాత్రమే తెలిసినవారికీ లేదా, ఇంగ్లీష్ లో చదవడాన్ని ఇష్టపడేవారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఆంగ్లభాషలో ప్రచురింపబడటం ద్వారా ఈ పుస్తకం ఇప్పుడు అంతర్జాతీయ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. యూరప్, అమెరికాల నుంచి చాలాకాలం నుంచీ దీనికోసం ఎదురుచూస్తూ, నాకు మెయిల్స్ ఇస్తున్న కొంతమంది తెల్లవాళ్ళకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడటమే గాక, తంత్రసాధన గురించిన రహస్యాలను మరింతగా వారికి అందుబాటులోకి తెస్తుంది.

సంస్కృత శ్లోకాలను తెలుగుపద్యాలను ఆంగ్లభాషలోకి మార్చడం కుదరకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, ఇరవై ఏడు సంస్కృతశ్లోకాలను మాత్రం యధాతధంగా ఉంచి, మిగతా వివరణభాగాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయడం జరిగింది.

ఇది నా కలం నుంచి వెలువడుతున్న 41 వ పుస్తకం. ఈ పుస్తకం రూపుదిద్దుకోవడంలో ప్రధాన పాత్రధారులైన నా శిష్యురాలు అఖిలకు, ముఖచిత్రకారుడు శిష్యుడు ప్రవీణ్ కు, నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం google play books నుండి ఇక్కడ లభిస్తుంది. 'తారాస్తోత్రం' తెలుగు పుస్తకం కంటే ఎక్కువగా పాఠకులు దీనిని ఆదరిస్తారని భావిస్తున్నాం.

read more " 'A Hymn To Goddess Tara' - E Book released today "

11, మే 2022, బుధవారం

The Great Oom (Pierre Bernard/Perry Baker) - జాతక విశ్లేషణ

అమెరికాలో ఈనాడు యోగా అనేది అందరికీ తెలుసు. నేటికీ అసలైన యోగాభ్యాసమూ దాని లోతుపాతులూ తెలిసినవాళ్ళు తక్కువే అయినా, యోగా అంటే కనీసం ఆసనాలు ప్రాణాయామంగా అందరికీ తెలుసు.

అసలీ యోగా అనేది అమెరికాలో ఎప్పుడడుగు పెట్టింది? అంటే, 1893 లో వివేకానందస్వామి అక్కడకు వెళ్ళినప్పటినుండి అని చాలామంది అంటారు. కానీ అంతకు చాలాముందే అక్కడ యోగా అడుగుపెట్టింది. ఇది పియర్ ఆర్నాల్డ్ బెర్నార్డ్ అనే వ్యక్తితో జరిగకపోయినా కనీసం అతనివల్ల పాపులర్ అయిందని ప్రస్తుతం అందరూ నమ్ముతున్నారు.

ఈయన 31 అక్టోబర్ 1875 న అయోవా రాష్ట్రంలోని లియోన్ అనే ఊరిలో పుట్టాడు. ఈయన అసలు పేరు పియర్ ఆర్నాల్డ్ బేకర్. పియర్ అనేది ఫ్రెంచ్ పేరు గనుక ఈయన పూర్వీకులు ఫ్రెంచ్ వాళ్ళై ఉండవచ్చు. పెరిగి పెద్దయిన తర్వాత ఈయన ది గ్రేట్ ఓం, అమ్ని పోటెంట్ ఓం, ఓం ది మెగ్నిఫిషేంట్ అనే పేర్లతో పిలవబడ్డాడు.

1880 ప్రాంతాలలో నెబ్రాస్కా రాష్ట్రంలోని లింకన్ అనే ఊరిలో ఈయనొక భారతీయ యోగిని కలిశాడు. ఆ యోగి పేరు సిల్వాయిస్ హమాటి. ఇప్పటికి రికార్డ్ అయినంతవరకూ ఇతని వల్లనే హఠయోగా అనేది అమెరికాలో అడుగుపెట్టింది. ఇతను సిరియన్ మూలాలున్న భారతీయుడు. బెంగాల్ రాష్ట్రంలో ఇతను ఉండేవాడు. అక్కడ కాళీ ఉపాసనను, హఠయోగాన్ని, తంత్రాన్ని నేర్చుకున్నాడు.  ఈయన గురువు పేరు మహీధరుడని తెలుస్తున్నది. స్వామి రామతీర్థగారు కూడా మహీధరుడు తంత్రయోగంలో నిష్ణాతుడైన యోగి అని చెప్పారు. అప్పట్లో రామతీర్ధస్వామి ఒప్పుకున్న మరొక తాంత్రికయోగి పేరు స్వామి జ్ఞానానంద. ఈ మహీధరయోగి అనే ఆయన హమాటిని చేరదీసి ఏడేళ్ల వయసు నుండి ఇరవై మూడేళ్ళ వయసు వచ్చేవరకూ అంటే పదహారేళ్ళ పాటు అతనికి సాధనను నేర్పించాడు.  

ఈనాడు లక్షలాది మంది భారతీయులు అమెరికా మూలమూలలా ఉన్నారు. కానీ 1880 ప్రాంతాలలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు 800 కంటే తక్కువే ఉండేవారు. వారిలో ఇతనొకడు. అసలితను అమెరికాకు ఎందుకొచ్చాడు? అంటే, ఏదో ప్రదర్శనలిచ్చే ట్రూపులో సభ్యుడిగానో, గాలికి తిరుగుతూనే అతను అమెరికాకు వచ్చాడని అంటారు. అప్పటికే ఇతను హఠయోగం, తంత్రయోగాలలో నిపుణుడు. చిన్నవయసునుండే, అంటే దాదాపు అయిదేళ్ల వయసు నుండే బెర్నార్డ్ కు యోగాభ్యాసంలో శిక్షణనిచ్చాడు సిల్వాయిస్. ఇది నిజం కాకపోవచ్చు. అయితే, కొన్నేళ్లపాటైనా, ఆ శిక్షణలో రాటుదేలిన బెర్నార్డ్ 1898 జనవరిలో శాన్ ప్రాన్సిస్కోలో ఒక డాక్టర్ల బృందం ఎదురుగా ఒక  డెమో ఇచ్చాడు.

అందులో బెర్నార్డ్, 'కాళీముద్ర' అనే క్రియను ప్రదర్శించాడు. ఈ ముద్రలో ఏం జరుగుతుంది? ఊపిరిని బంధించడం ద్వారా, గుండె కొట్టుకోవడాన్ని దాదాపు ఆపేసి, ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళతారు. ప్రాణంపోకపోయినా దాదాపు శవంలాగా అవుతారు.  అప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని సూదులతో గుచ్చినా, చివరకు కత్తితో కోసినా కూడా అతనికి ఏమీ నొప్పి తెలియదు. స్వయానా కొంతమంది డాక్టర్లు ఇతని చెవితమ్మెలకు, ముక్కుకు, పెదవులకు, చెంపలకు సూదులు గుచ్చి చూశారు. ఇతనిలో చలనం లేదు. ఈ డెమో చూసిన అమెరికన్ డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఇది అమెరికన్ మెడికల్ హిస్టరీలో రికార్డ్ కాబడిన సంఘటన. ఆ తరువాత, ఇచ్చానుసారం తన గుండెను కొట్టుకోవడం ఆపేసిన యోగిగా మళ్ళీ స్వామీ రామా ప్రసిద్ధికెక్కాడు.  స్వామి రామా ఈ  డెమోను 1970 లో మళ్ళీ అమెరికన్ డాక్టర్ల బృందం ముందు చూపించాడు.

కాళీముద్ర లాంటివి తంత్రయోగంలో  చాలా చిన్న క్రియలే అయినప్పటికీ, చూచేవాళ్లకు మాత్రం దిగ్భ్రాంతి కలుగుతుంది. భారతదేశంలో మహారాజుల ఎదుట గారడీ చేసేవాళ్ళు ఇలాంటి విద్యలను పాతకాలంలో ప్రదర్శించేవారు. ఒక గుంతను తవ్వి అందులో ఈ క్రియ తెలిసినవారిని పాతిపెడతారు. చుట్టూ రాజభటులు కాపలా ఉంటారు. 40 రోజుల తర్వాత మట్టి తవ్వితే ఆ మనిషి నవ్వుతూ లేచి బయటకొస్తాడు. పాతకాలంలో ఇది చాలామంది మహారాజుల ఎదుట ప్రదర్శింపబడిన విద్యయే. అంతమాత్రం చేత ఆ మనిషి ఒక మహనీయుడూ, మహాయోగీ  కాడు, కాలేడు. కుమ్భకాన్ని సాధిస్తే దీనిని చెయ్యవచ్చు. ఇదొక గారడీ లాంటిది.

యోగ-తంత్రాలలో ఉన్నతస్థాయిలైన సవికల్ప, నిర్వికల్పసమాధి స్థితులను  చవిచూసినవారు ఇలాంటి ప్రదర్శనలను చిల్లరపనులుగా భావిస్తారు. శ్రీరామకృష్ణుల వంటి మహనీయులు ఇలాంటి ప్రదర్శనలను అసహ్యించుకునేవారు. అయితే, యోగం నిజమే, తంత్రక్రియలు నిజాలే, మన శరీరంలోని ఇన్ వాలంటరీ సిస్టం ను కూడా మనం అదుపు చేయవచ్చు అన్న విషయాన్ని ఇలాంటి యోగప్రదర్శనలు  లోకానికి తిరుగులేకుండా నిరూపిస్తాయి. ఇది సైన్సుకు అంతుబట్టని విషయం.

ఈ విషయాన్ని ప్రముఖంగా వెల్లడి చేస్తూ 'న్యూ యార్క్ టైమ్స్' పత్రిక తన జనవరి 29, 1898 సంచిక ముఖచిత్రంగా పియర్ బెర్నార్డ్ ఫోటోను ప్రచురించింది.

బెర్నార్డ్, 1905 లో 'తాంత్రిక్ ఆర్డర్ ఆఫ్ అమెరికా' ను స్థాపించాడు. అయితే అది ఎక్కువకాలం పాటు బ్రతకలేదు. 1910 లో New York Sanskrit College ని స్థాపించాడు.వేలాది సంస్కృత గ్రంధాలను సేకరించి ఇక్కడ ఉంచాడు. చాలామంది రీసెర్చి స్కాలర్లకు అది రిఫరెన్స్ లైబ్రరీగా ఉపయోగపడింది. 1918 లో క్లివ్ ల్యాండ్, ఫిలడెల్ఫియా, చికాగో, న్యూయార్క్ లలో తాంత్రిక్ క్లినిక్స్ ను మొదలుపెట్టాడు.  ఈ విధంగా ఎదుగుతున్న ఇతనికి గట్టి దెబ్బ 1910 లో తగిలింది.

తమ ఇష్టానికి వ్యతిరేకంగా తమను బంధించాడని, తన శక్తులతో తమను అదుపులో పెట్టుకున్నాడని ఇద్దరు టీనేజీ శిష్యురాళ్ళు 1910 లో ఇతని మీద కేసు పెట్టారు. ఇతనికి పరిచయమైన ఏ అమ్మాయైనా సరే, ఇతని ఆకర్షణనుండి తప్పుకోలేదని, ఇతనొక అద్భుతమైన వ్యక్తని వాళ్ళన్నారు. సెక్స్ పరమైన ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి. దానిలో ఇతని పరువు పోవడమే గాక, సందు దొరికిందని భావించిన క్రైస్తవ మిషనరీలు యోగా మీద బురద చల్లఁడం మొదలుపెట్టారు. ఇది సైతాన్ కల్ట్ అంటూ ప్రచారం చేసి ఇతని పరువు తీశారు. కానీ ఆ తరువాత ఆ అమ్మాయిలు కేసును ఉపసంహరించుకోవడంతో ఇతను గట్టెక్కాడు.

ఈ కేసుతో ఇతని పరువు పోయినా మళ్ళీ పుంజుకొని యోగా, తంత్రాలకు మంచి ప్రచారం కల్పించాడు. 1931 లో న్యూయార్క్ దగ్గరలో హడ్సన్ నదితీరంలో ఇతనికి 200 ఎకరాల ఆశ్రమం ఉండేది. కనీసం 400 మంది ఉన్నత కుటుంబాలకు చెందిన ధనికవర్గం ఇతని శిష్యులుగా ఉండేవారు. వీళ్ళలో సెనేటర్లు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ డీలర్లు, సినిమా స్టార్స్, బాక్సర్లు, అధ్లెట్లు, క్రైస్తవ ఫాదర్లు ఇలాంటి ప్రముఖులందరూ ఉండేవారు. ఈనాడు కొంతమంది కార్పొరేట్ గురువుల జీవనశైలికంటే విలాసవంతమైన జీవితాన్ని అప్పట్లోనే బెర్నార్డ్ గడిపేవాడు.

అప్పట్లో ఇతని శిష్యురాలైన ఇడా రోల్ఫ్ తరువాత 'రోల్ఫింగ్' అనే ఒక సంస్థను మొదలుపెట్టింది. దీనికి అమెరికాలో నేటికీ మంచి పేరుంది. బాడీ ఎలైన్ మెంట్ ను సరిదిద్దడం, కూర్చునే తీరును, నడిచే తీరును సరిదిద్దడం ద్వారా, చాలా నొప్పులను వీళ్ళు తగ్గిస్తారు. ఈ విద్యను ఈమె, బెర్నార్డ్ దగ్గర హఠయోగ శిక్షణలోనే నేర్చుకుంది.

నేడు అమెరికాలో అందరికీ తెలిసిన రోల్ఫింగ్, కీనీసియాలజీ మొదలైన వ్యాయమపద్ధతులకు మూలం మన హఠయోగమే.

ఇతని కజిన్ సిస్టర్ ఓరా రే బేకర్ అనే ఆమె, భారతీయ సూఫీ గురువైన ఇనాయత్ ఖాన్ భార్య అయింది. సంస్కృత కాలేజీని చూడటానికి వచ్చిన ఇనాయత్ ఖాన్ ను తన సిస్టర్ కు హిందూస్తానీ సంగీతాన్ని నేర్పమని బెర్నార్డ్ కోరాడు. ఇనాయత్ ఖాన్ ఉత్తరభారతదేశంలోని సంగీత ఘనాపాఠీల కుటుంబానికి చెందినవాడు. సంగీత పాఠాలు ప్రేమపాఠాలయ్యాయి. వీళ్లిద్దరి ప్రేమను బెర్నార్డ్ ఒప్పుకోలేదు. ఇనాయత్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. బెర్నార్డ్ టేబుల్ మీద కాగితాలలో వెదికి ఇనాయత్ అడ్రస్ పట్టుకున్న ఓరా, ఓడనెక్కి ఒంటరిగా లండన్ కు ప్రయాణం చేసి అక్కడ ఇనాయత్ ను కలుసుకుంది. లండన్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇనాయత్ ఖాన్ గురించి, నవీన సూఫీ సాంప్రదాయాల గురించి, మెహర్ బాబాతో వీరి సంబంధాల గురించి ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, 1880 ప్రాంతాలలోనే అమెరికాలో యోగా, తంత్రాలు అడుగుపెట్టాయని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇప్పుడితన్ని జాతకం పరిశీలిద్దాం.

ఇతనిది అనూరాధా నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకు కొంచం ఆధ్యాత్మిక చింతన ఉంటే, రహస్యవిద్యలైన యోగం, తంత్రం మొదలైన దారులలో తప్పకుండా నడుస్తారు. ఇది వృశ్చికరాశి గనుక, రహస్యవిద్యలతో వీరికి పరిచయాలు ఉంటాయి. గ్రహయోగాలు అనుకూలిస్తే వీరు యోగమార్గంలో ఉన్నతిని సాధిస్తారు. అదే ఇతని జాతకంలో జరిగింది.

తృతీయంలో శనికుజుల యోగాన్ని చూడవచ్చు. ఇది ఇతని జాతకంలో ఒక ముఖ్యమైన యోగం. శని విక్రమాధిపతిగా స్వస్థానంలో ఉంటూ అమితమైన ధైర్యాన్నిస్తాడు. అంతేగాక క్రమశిక్షణతో కూడిన సాధననిస్తాడు. కుజునికి ఇది ఉచ్ఛస్థానం. కనుక ఈ యోగం మొండి పట్టుదలతోకూడిన కఠోరసాధననిస్తుంది. ఇదే యోగం నవమస్థానాన్ని కూడా  చూస్తున్నందువలన, ఆధ్యాత్మికపరమైన రహస్య సాధనామార్గాలలో నడిపిస్తుంది. మకరరాశి గనుక  భారతీయ ఆధ్యాత్మిక చింతనలను ఇది ఇస్తుంది.

పంచమంలో గురుక్షేత్రంలోని రాహువు వల్ల, పరాయిమతానికి చెందిన రహస్య సాధనల భావజాలం ఒంటపడుతుంది.  ఈ క్రమంలో పరువును పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. 

ద్వాదశంలో నీచరవి, బుధ, శుక్ర, గురువుల సన్యాసయోగాన్ని చూడవచ్చు. ఇది మళ్ళీ రహస్యసాధనలను సూచిస్తుంది. ఈయనకు పెళ్లి అయినప్పటికీ, జీవితాన్నంతా యోగ, తంత్రసాధనలలోనే గడిపాడు. ఆ క్రమంలో స్త్రీలతో కలసి సెక్స్ పరమైన వామాచార తంత్రసాధనలు చేసేవాడని పుకార్లున్నాయి. అది నిజమేనని ఈ యోగం చెబుతున్నది.

1898 జనవరిలో 'కాళీముద్ర' డెమో ఇచ్చిన సమయంలో శనీశ్వరుడు వృశ్చికంలోనే ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. జననకాల చంద్రుని మీద గోచారశని సంచారం వల్ల యోగ-తంత్రాల మహత్యాన్ని లోకానికి నిరూపించే డెమో ఇచ్చాడు.

1910 లో ఇతనిమీద టీనేజీ అమ్మాయిల కేసు నడిచినప్పుడు శనీశ్వరుడు మేషంలో ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. శత్రుస్థానంలో శని నీచత్వం వల్ల కోర్టు కేసును ఎదుర్కొన్నాడు, కానీ లాభస్థానంలో ఉన్న గురువు ఇతన్ని కాపాడాడు. మోపబడిన నేరాలు డ్రాప్ అయ్యాయి.

1955 సెప్టెంబర్ లో ఈయన చనిపోయినపుడు, రాహుకేతువులు వృశ్చిక వృషభాలలో నీచస్తితులలో ఉన్నారు. గురువు నవమంలో ఉచ్చస్థితిలో ఉంటూ యోగిక్ ట్రాన్స్ లో ఈయన దేహాన్ని వదిలేసినట్లు చూపుతున్నాడు. కనుక ఇది యౌగిక మరణమేగాని మామూలు చావు కాదు. 23 ఏళ్ల వయసులో గుండెను ఆపడం డెమో ఇచ్చిన వ్యక్తి 80 ఏళ్ల వయసులో మామూలుగా అందరిలాగా ఎలా చనిపోతాడు? అయితే, ఇతని కోరికలు తీరలేదని, వాంఛలు చావలేదని, సంస్కారనాశనం జరగలేదని, మరణ సమయంలో  నీచస్థితులలో ఉన్న రాహుకేతువులు చెబుతున్నాయి. ఆసనాలు ప్రాణాయామాల వరకేగాని, ఉన్నతస్థాయి ఉపాసనలు ఈయనకు తెలీదని, వాటినీయన చెయ్యలేదని, కేవలం యోగాను ఒక బిజినెస్ గా మాత్రమే మార్చుకున్నాడని ఈ చార్ట్ చెబుతున్నది. 

80 ఏళ్ళు బ్రతికిన ఈయన 1955 లో న్యూయార్క్ లో చనిపోయాడు. ఏదేమైనా,  ఒక అమెరికన్ అయ్యుండి జీవితాంతం యోగ-- తంత్రాలను అభ్యాసం చేసి, ఎన్నో ఒడిదుడుకులకు లోనై, ఎంతో ఎదురుదాడిని ఎదుర్కొని, పరువు పోగొట్టుకున్నా కూడా, వదలకుండా వాటిని ప్రచారం చేసినవారిలో ముఖ్యునిగా ఈయనను మనం మరచిపోకూడదు.

read more " The Great Oom (Pierre Bernard/Perry Baker) - జాతక విశ్లేషణ "

దోశా ఫౌండేషన్

మొన్న సాయంత్రం బ్రేక్ ఫాస్ట్ టైంలో శ్రీమతి ఒక మాటంది.

అదేంటి? బ్రేక్ ఫాస్ట్ అనేది ఉదయం కాకుండా సాయంత్రం కూడా ఉంటుందా? అని చచ్చుప్రశ్న అడక్కండి. ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఉంటుంది. విషయం లోకి రండి.

'మా అత్త ప్రస్తుతం కోయంబత్తూర్ లో ఉంది'.

మింగుతున్న దోశముక్క నా గొంతుకు అడ్డం పడింది.

తలమీద కొట్టుకుంటూ, 'అదేంటి ఆమె డల్లాస్ లో కదా ఉండేది?' అన్నాను.

'అవును. డల్లాస్ నుంచి వచ్చి మొన్నటిదాకా హైదరాబాద్ లోనే ఉంది. ఇప్పుడు కుర్తాళం మీదుగా కోయంబత్తూర్ చేరుకుంది' అన్నది.

'అక్కణ్ణించి ఇంకా కిందకెళితే కన్యాకుమారి వస్తుంది. ఇంకా ముందుకు పోతే శ్రీలంక వస్తుంది. కొంపదీసి అక్కడకు కూడా పోతుందేమో? శ్రీలంకంతా గందరగోళంగా ఉంది. అక్కడికెళ్లొద్దని చెప్పు ఫోన్ చేసి' అన్నా ఇంకో దోశముక్కను తాపీగా నములుతూ.

శ్రీమతికి కోపం వచ్చింది.

'దేన్నీ సరిగా తీసుకోరా మీరసలు?' అంటూ గొంతు పెంచింది.

'సరిగానే తీసుకుంటున్నా చెట్నీతో కలిపి. ఇంకో దోశ వెయ్యి' అన్నా నవ్వుతూ.

'అదికాదు నేనంటున్నది మా అత్త సంగతి' అంది తగ్గి.

'సరే చెప్పు' అన్నా ఇంకో దోశ ముక్కని నోట్లో పెట్టుకోబోతూ.

'ప్రస్తుతం ఆమె 'ఈశా ఫౌండేషన్' ఆశ్రమంలో ఉంది' అంది శ్రీమతి.

ఈసారి నవ్వుతో కొరబోయింది నాకు.

నవ్వీ నవ్వీ ఆపి, తలమీద మళ్ళీ చరుచుకుని, 'ఏం మన 'దోశా ఫౌండేషన్' నచ్చలేదా?' అడిగా.

'అంటే?' అంది తను.

'రోజూ దోశలొద్దంటే వినవు నువ్వు. ఆమె మనింటికి వచ్చినరోజు కూడా దోశలే పెట్టావు. చూశావా ఆమెకి 'దోశా ఫౌండేషన్' అంటేనే విరక్తి కలిగింది. ఈశా ఫౌండేషన్ వైపు చూపు మళ్లింది. అందుకే అప్పుడప్పుడూ ఇడ్లీ చెయ్యమని నీకు చేప్పేది' అన్నా నవ్వుతూ.

'ఏ అప్పుడు 'ఇడ్లీ ఫౌండేషన్' కు పోతుందా?' అడిగింది ఎగతాళిగా.

దానికి సమాధానం చెప్పకుండా సీరియస్ గా ఆలోచిస్తూ, 'గణపతి, కులపతి, దళపతి' అన్నా.

'అవేంటి కొత్త మంత్రాలా?' అంది శ్రీమతి అయోమయంగా.

'మంత్రాలూ కాదు చింతకాయపచ్చడీ కాదు. ఎప్పుడూ నీకదే గోల. కాస్త లౌకికంలోకి రా. ఇరవై ఏళ్ళనాడు గణపతి సచ్చిదానంద భక్తురాలు కదూ ఈమె?' అడిగా ఆలోచిస్తూ.

'అవును. వీర భక్తురాలు. ఆయన్ని తెగ ఫాలో అయ్యేది' అన్నది.

అందుకే ఫస్ట్ గణపతి అన్నా. తర్వాత సిద్దేశ్వరానంద భక్తురాలైంది కదూ? అందుకే కులపతి అన్నా.  మూడోది దళపతి. అంటే, తమిళతంబి. లెక్క సరిపోలా?' అన్నా.

'ప్రస్తుతం కూడా ముందు కుర్తాళం వెళ్లి, తీర్ధం తీసుకుని అక్కణ్ణించి కోయంబత్తూర్ చేరుకుంది' అన్నది.

'అదేంటి తీర్ధం తీసుకుంటే మోక్షం రావాలే? రాలేదా? అయినా తీర్ధం కోసం అంతదూరం పోవాలా? ఇక్కడ హైదరాబాద్లో దొరకదా?' అడిగా అనుమానంగా.

'ఆ తీర్ధం కాదు' అంది కోపంగా.

'ఓహో కుర్తాళం తీర్ధం స్పెషలేమో? అవున్లే అడివి మూలికలన్నీ కలుపుతారేమో దాంట్లో?' అన్నా.

'అదేమో తెలీదు. ఇంకా కొంతమంది లేడీస్ బ్యాచ్ కూడా ఆమెతో ఉన్నారు. అందరూ కలసి ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నారు' అంది. 

'ఓహో ఆడంగుల అరవదేశయాత్రనా? రొంబ సాంబారు. అవున్లే మంత్రం తంత్రం అన్నీ కలిస్తేనే కదా మోక్షం? ట్రై చేస్తే మంచిదే' అన్నా తాపీగా దోశ నములుతూ.

'అక్కడామెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట' అన్నది.

'ఈమె వీఐపీ కాదు కదా? ఎందుకిస్తున్నారో?' అడిగాను.

'ఏమో మరి' అన్నది

'నేచెప్తా విను. డల్లాస్ లో ఉంటానని చెప్పి, డాలర్స్ కురిపిస్తే వీఐపీ ఏం ఖర్మ? దాని బాబులాంటి ట్రీట్మెంటిస్తారు. వాళ్ళక్కావలసింది ఇలాంటి బకరాలేగా మరి' అన్నా.

'ఎందుకలా?' అడిగింది.

'చెప్తా విను' అంటూ దోశకు ఫౌండేషన్ వెయ్యడం ఆపి, అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ఫోజులో చెప్పడం మొదలెట్టా.

'ఇదొక సింబియాసిస్ అన్నమాట ! స్వాములకేమో డాలర్లు కావాలి. అమెరికాలో బ్రాంచి పెట్టడానికి మీ అత్తలాంటి ఏజంట్లు కావాలి. మీ అత్తలాంటి వాళ్ళకేమో అమెరికాలో వాళ్ళ సర్కిల్లో లోకల్ గురువులుగా చెలామణీ కావాలన్న దురద ఉంటుంది.  అందుకని ఒక ఇండియా ఫ్రాంచైసీ కావాలి. కాబట్టి ఇద్దరికిద్దరూ సరిపోతారు. ఇంతే దేవరహస్యం' అన్నా.

'అవునా?' అంది ఆశ్చర్యపోతూ.

'అవును. ఇంతకుముందు మన పంచవటిలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళూ అమెరికాలో లోకల్ గురువులే. నువ్వు గమనించావా లేదో వాళ్ళూ బ్రాహ్మలే. ఈ బ్రాహ్మలకి ఇదొక జబ్బు. పంచాంగాలు, మంత్రాలూ, పూజలని చెప్పి ఎదుటివాళ్ళ దగ్గర, ముఖ్యంగా అమాయకులైన ఇతరకులాల భక్తుల దగ్గర పోజు కొట్టడం వీళ్లకున్న నయంకాని దీర్ఘజబ్బులలో ఒకటి. ఈ బ్రాహ్మణ రుబాబు భరించలేకే నిమ్నకులాలు మతాలు మారేది. అసలు క్రైస్తవం ఇంతగా ఎదగడానికి ఇన్ డైరెక్ట్ గా నీరు పోసింది మీవాళ్లే.

ఉదాహరణకు, మన ఇండియాలో కూడా చూడు. అపార్ట్ మెంట్ లోని ఆడంగులంతా కలిసి 'లలితాసహస్రనామ బ్యాచ్' అని ఒకటి పెడతారు. లేదా 'విష్ణుసహస్రనామ బ్యాచ్' అని పెడతారు. అందులోకూడా మన ఆడంగులే లీడర్లుగా ఉంటారు. పండగలని, పబ్బాలని, తిధులని, నోములని ఉన్నవీ లేనివీ చెప్పి ఆ గ్రూపుమీద అజమాయిషీ చేస్తుంటారు. పాపం అమాయకులైన ఇతరకులాల ఆడవాళ్ళు వీళ్ళ మాటలన్నీ నమ్ముతుంటారు. మన రుబాబు సాగుతూ ఉంటుంది. మనవాళ్ళు మొగయినా ఆడైనా, అమెరికా పోయినా, అంటార్కిటికా పోయినా సరే, ఈ జాడ్యం మాత్రం వదలదు. 

అందుకని అక్కడ బ్రాంచీ పెట్టాలంటే ఇక్కడనుంచి ఒక స్వాములోరి సరిటిఫికేట్ కావాలి. ఊరకే మంచిమాటలు చెబితే ఎవరు వింటారు? మంత్రాలూ, మహత్యాలూ కావాలి, లేదా సోషల్ స్టేటస్ కావాలి. ప్రస్తుతం 'ఈశా' అంటే ఒక స్టేటస్ సింబల్ గా చాలామంది అమాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు అందులో ఉన్నారు కాబట్టి. అమెరికాలో దాని బ్రాంచి అయితే తేలికగా సక్సెస్ అవుతుంది.

ఇంతా చేస్తే, ముందుగా సరియైన దారిలో సాధనచేసి అనుభవాన్ని పొందుదామని మాత్రం ఎవరికీ ఉండదు. 'ఇన్ స్టెంట్ గా గురువులైపోవాలి, వేరేవాళ్లకు బోధించాలి' ఇదే దురద ఎక్కడ చూసినా. ఇలాంటి దురదగాళ్ళకు, దురదగొండాకు స్వాములోర్లే తగులుకుంటారు. ఉన్న దురదను వదిలిస్తారు.

ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్సూ,  బిజినెస్సూ మాత్రమే. మీ అత్తలాంటి వాళ్ళకేమో ఐడెంటిటీ క్రైసిస్సు. మన స్వాములోర్లకేమో మంచి బిజినెస్సు. అయినా,  మీ అత్తకు ఈ రెండు రోగాలూ ఇంత ఎక్కువగా ఉన్నాయని నాకు తెలీదు సుమీ' అన్నా ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'ఇంతుందా దీనివెనుక? ఆమ్మో' అంది శ్రీమతి.

'అవును, చాలా ఉంటుంది కధ. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి. ఎవరి కర్మ వారిది. సరేగాని, ఇంకో దోశ పడేయ్ ఇటు. పొద్దున యోగా కొంచం ఎక్కువైంది. అందుకే 'దోశా ఫౌండేషన్' సరిపోలేదు' అన్నా.

'తిండిబోతు రామన్న' అని విసుక్కుంటూ వంటింట్లోకి దారితీసింది శ్రీమతి.

నేను ప్లేట్లో ఉన్న దోశకు మంచి ఫౌండేషన్ వెయ్యడం మొదలుపెట్టా. అదన్నమాట దోశా ఫౌండేషన్ భాగోతం.

కథ కంచికి. మనం హాల్లోకి.

read more " దోశా ఫౌండేషన్ "

5, మే 2022, గురువారం

'తారాస్తోత్రం' రెండవ ప్రచురణ విడుదల

నా తొలిరచనలలో ఒకటైన 'తారాస్తోత్రం' రెండవ ప్రచురణ నేడు విడుదలౌతున్నది.

2013 లో నేను గుంటూరులో ఉన్న సమయంలో ఆశువుగా నా మనసులో ఉద్భవించిన 27 సంస్కృత శ్లోకములు, 260 తెలుగు పద్యములు 2015 లో ఈ గ్రంధంగా రూపుదిద్దుకున్నాయి. ఈ శ్లోకములు పద్యములలో మంత్ర, తంత్ర రహస్యములు అనేకములు దాగున్నాయి.

సంస్కృతము, గ్రాంధిక తెలుగుభాషలు ఏమాత్రమూ రాని నా నోటిద్వారా ఈ అద్భుతమైన స్తోత్రం అవతరించడం, తారా మహామంత్రోపాసన వల్ల, జగన్మాత కాళి అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆ అనుగ్రహమే ఇప్పటికి పదివేల పద్యాలను నానోట పలికించింది. 50 పైగా గ్రంధాలను వ్రాయించింది. ఇది కాళీకటాక్షమే గాని వేరొకటి కాదు.

ఈ స్తోత్రంలో సమయాచార, దక్షిణాచార, వామాచార, కౌలాచారములు, కుండలినీయోగము, మంత్ర తంత్రోపాసనా రహస్యములు గర్భితములై ఉన్నాయి. సూక్ష్మగ్రాహులైన పాఠకులు వీటిని అర్ధం చేసుకోగలరు.

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై,  అప్పటిలోనే దీనిని ఆంగ్లభాషలోకి అనువదించాలని అనుకున్నప్పటికీ, ఏడేళ్ల తర్వాత మాత్రమే అది సాధ్యమౌతున్నది. ఈ ఆలస్యానికి  కారణం, శ్లోకాలను పద్యాలనూ ఆంగ్లంలోకి తేవడం అసాధ్యం కావడమే. ఈ పనిని ఆంగ్లభాషలో ఉద్దండులైన నా శిష్యులలో ఎవరైనా చేస్తారేమోనని ఏడేళ్లుగా ఎదురుచూచాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. సరే, ఇలాంటి అద్భుతమైన గ్రంధం ఒక్క తెలుగుభాషకే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతో దీనిని నేనే ఆంగ్లంలోకి అనువదించాను.

త్వరలో ఇది A Hymn To Goddess Tara అనే ఆంగ్లపుస్తకంగా విడుదల కాబోతున్నది. ఈ క్రమంలో తెలుగుప్రతిని మళ్ళీ కూలంకషంగా పరిశీలించి, కొన్ని మార్పులు చేర్పులతో, సరిక్రొత్త ముఖచిత్రంతో, రెండవ ప్రచురణగా విడుదల చేస్తున్నాము.

తొమ్మిది సంస్కృతశ్లోకములతో నానోట ఆశువుగా పలికిన మరొక అద్భుతస్తోత్రమే - 'కాళీకటాక్ష స్తోత్రం'. ప్రస్తుతం ఇది 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇప్పుడు దీనిని కూడా జిజ్ఞాసువుల పారాయణార్ధమై ఈ పుస్తకంలో పొందుపరచాము.

ఈ గ్రంధాన్ని అనేకమార్లు  తిరగామరగా చదివి, నేను సూచించిన ఎన్నో మార్పులను, డీటీపీ వర్క్ ను, ఎంతో భక్తిశ్రద్ధలతో చేసిన నా శిష్యురాలు అఖిల ధన్యురాలు. అలాగే, ముఖచిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన నా శిష్యుడు ప్రవీణ్ ధన్యుడు. వీరికి నా ఆశీస్సులు. ఈ పనిలో నిరంతరం నాకు తోడునీడగా నిలచిన నా శ్రీమతి సరళాదేవికి ఆశీస్సులు. వీరి సహకారమే లేకుంటే నా గ్రంధాలలో ఒక్కటి కూడా వెలుగుచూచేది కాదు. వీరిని నిత్యమూ రక్షించమని జగన్మాత కాళిని ప్రార్ధిస్తున్నాను.

తంత్రసాధకుల, తంత్రాభిమానుల, ఆధ్యాత్మికజిజ్ఞాసువుల దాహాన్ని ఈ గ్రంధం  తీరుస్తుందని భావిస్తున్నాం.

read more " 'తారాస్తోత్రం' రెండవ ప్రచురణ విడుదల "

లౌకికం - ఆధ్యాత్మికం

నిన్న ఏదో పనిమీద మిత్రుడు రవికి ఫోన్ చేశా. తనప్పుడే లలితాపారాయణ చేసి పూజ ముగించి లేస్తున్నాడు. ఇక ఆఫీసుకి బయలుదేరాలి. ఆ టైంలో నేను ఫోన్ చేశా.

'ఏంటి సంగతి?' అన్నాడు ఏదో అర్జెంట్ ఆఫీసు పనేమో అని.

'కంగారు పడకు. అర్జన్ట్ ఏమీ లేదు' అంటూ నేను వినిన న్యూస్ ఒకదానిని గురించి చెప్పా.

'అబ్బా ! ఇప్పుడే పూజ ముగించి లేస్తున్నా. ఇలాంటి లౌకికవిషయాలు ఇప్పుడే చెప్పాలా నువ్వు?' అన్నాడు విసుగ్గా.

నవ్వాను.

'ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా నాతో స్నేహం చేస్తున్నావు. ఇదేనా నన్నర్ధం చేసుకున్నది? ఇంకా నువ్వు చాలా ఎదగాలి. లౌకికం, ఆధ్యాత్మికం అంటూ విడివిడిగా లేవు. అవి మన మనసులో ఉన్నాయి. ఆ భేదం పోవాలి. ఉన్నది ఒకటే జీవితం. దానిని నువ్వు కంపార్ట్ మెంట్లుగా విడదీసి, ఇది పవిత్రం, ఇది అపవిత్రం, ఇది లౌకికం ఇది ఆధ్యాత్మికం అంటూ విడగొట్టి చూస్తున్నంతవరకూ ఏమీ లాభం లేదు. నీకున్నది ఒకటే మనసు, ఒకటే జీవితం. దానిని రూములుగా విడగొట్టకు' అన్నా.

'ప్రస్తుతానికి ఇంకా అంత స్థాయి రాలేదు' అన్నాడు నిజాయితీగా.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా.'లౌకికం ఆధ్యాత్మికం అంటూ రెండు లేవు నాన్నా' అనేవారు తెలుసా?' అడిగా.

'ఓహో అలా అన్నారా?' అన్నాడు.

'అవును. అన్నారు. గంగాజలానికీ, మురికినీటికీ, మంత్రాలకూ బూతుమాటలకూ ఏమీ భేదం నీకు కనిపించకుండా పోయినప్పుడే నీవు ఆధ్యాత్మికంగా ఒక కనీసస్థాయికి చేరినట్లు లెక్క అవుతుంది. నువ్వు చదువుతున్న లలితానామాలలో 'సవ్యాపసవ్య మార్గస్ధా' అంటే అర్ధం ఏమిటి? నేనిచ్చిన 'లలితాసహస్రనామ రహస్యార్థప్రదీపిక' చదవమంటే చదవవు. అటకనెక్కించావా?' అడిగా.

'అటకా? అదొక శ్రమ ఎందుకు?ఎక్కడో ఉంది చూడాలి.' అన్నాడు.

'అయితే పాత కాగితాలలో అమ్మేశావా? ఎప్పుడో రోడ్డుపక్కన బజ్జీ సమోసా తినేటప్పుడు ఆ కాయితాలు  నా పొట్లంలోకే వస్తాయేమో? అప్పుడు నా పద్యాలు నేనే చదువుకుంటూ బజ్జీలు తినొచ్చు. మరిన్ని పద్యాలు చదవాలంటే, 'అమ్మా. ఇంకొక వాయి బజ్జీలియ్యి' అని బండివాడినే అడగొచ్చు. అంతేగా? అన్నా నవ్వుతూ.

'మరీ అంతకాదులే. ఎక్కడో ఉంది. చదవాలి' అన్నాడు.

'ఉత్తపారాయణం చెయ్యడం కాదు. నామాలను చదివి అర్ధం చేసుకో. దానిని జీవితంలోకి అనువదించుకో. అప్పుడే ఏ స్తోత్రానికైనా ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. అలా చెయ్యకపోతే, పారాయణం దారి పారాయణానిదే, జీవితం దారి జీవితానిదే అవుతుంది. చాలామంది చాదస్తులు చేసేది అదే. నువ్విపుడు చేస్తున్నది తప్పని నేననడం లేదు. కానీ ఇది సరిపోదు. ఇంకా ముందుకు ఎదగాలంటే నేను చెప్పినట్టు చెయ్యి' అన్నాను.

'ఆమ్మో. అంత ఎదుగుదల అప్పుడే నాకొద్దులే. నన్నిలా సామాన్యుడిగా బ్రతకనియ్యి చాలు' అన్నాడు.

'సామాన్యుడు, అసామాన్యుడు అనేది కూడా మళ్ళీ మనసు చేసే గారడీనే. అదొక మెంటల్ బ్లాక్. అంతే' అన్నా.

'సర్లే. ఏంటంటావ్ ఇప్పుడు?' అన్నాడు.

'ఇంకా కొన్ని చెత్త న్యూసులున్నాయి. చెప్పమంటావా?' అన్నా నవ్వుతూ.

'ఇప్పటికి నా మైండ్ చెడగొట్టింది చాలు. ఇకాపు. పవిత్రంగా లలిత చదువుకుంటుంటే, లౌకిక విషయాలు  చెబుతున్నావ్ ఫోన్ చేసి' అన్నాడు మళ్ళీ కోపంగా.

'చెబుతున్నది కూడా లలితే' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'చెప్పాగా. నేనింకా అంత ఎదగలేదని. ఇక ఫోన్ పెట్టెయ్. తర్వాత మాట్లాడతా. ఆఫీసుకు టైమౌతోంది' అన్నాడు.

నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.

read more " లౌకికం - ఆధ్యాత్మికం "

4, మే 2022, బుధవారం

Elon Musk Astro Chart - Terrific Dhana Yogas

'ఎంతసేపూ యాక్సిడెంట్లు, చావులు, యుద్ధాలు, ప్రకృతి దుర్ఘటనలు ఇలాంటివి విశ్లేషణ చేయడమేనా? కాస్త మంచిమాటలు కూడా అప్పుడప్పుడు వ్రాయవచ్చు కదా?' అంటూ నిన్నరాత్రి కర్ణపిశాచి కల్లోకొచ్చి మరీ అడిగింది.

'సరే ఏం రాయమంటావో కోరుకో' అన్నాను.

'ఎలాన్ మస్క్ జాతకం రాయి. అంత డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుంది' అంటూ ముచ్చటపడింది.

'దానికి జాతకం ఎందుకు? గతజన్మలలో ఎన్నో దానధర్మాలు లెక్కలేనన్ని చేసుంటే అలాంటి జన్మ వస్తుంది' అన్నాను.

'కాదు చూడవా ప్లీజ్' అంటూ తెగ బ్రతిమిలాడింది.

'సరే పో' అని దానిని కలలోనుంచి పంపించేశా.

ఈ పోస్ట్ అలా మొదలైందన్నమాట !

ఎంతోమంది సెలబ్రిటీస్ జాతకాల లాగా ఇతనికి కూడా జనన సమయం ఎవరికీ తెలియదు.  జననప్రదేశం మాత్రం ప్రిటోరియా సౌతాఫ్రికా. పుట్టింది 28 జూన్ 1971. కర్ణపిశాచినడిగితే సాయంత్రం 6. 50 అని చెప్పింది. ఆ సమయానికి వేసిన జాతకచక్రం ఇది.   

సరే మకరలగ్న జాతకమైంది. ఇక ధనయోగాలు చూద్దాం.

భయంకర ధనయోగాలు

లాభాధిపతి అయిన కుజుడు ఉచ్ఛస్థితిలో లగ్నంలో ఉండటం భయంకర ధనయోగం.    కుజుడు చతుర్ధాతిపతి కూడా. అంటే, మనస్సును సూచిస్తాడు. కనుక ఇతను ఒక ప్లాన్ వేశాడంటే అది కనకవర్షాన్ని కురిపించాల్సిందే. ఈ జాతకంలో ఇదొక సక్సెస్ యోగం.

రాహువు లగ్నంలో ఉండటం వల్ల దూరాలోచన దురాలోచన రెండూ ఉంటాయి. శనిని సూచిస్తున్నందువలన చాపకింద నీరులాంటి భయంకరమైన ప్లానింగ్ ఉంటుంది. పైగా పట్టుదలకు మారుపేరైన మకరలగ్నం. మహామొండివాడైన కుజుని ఉచ్ఛస్థితి. ఇంతకంటే 'సక్సెస్ మంత్ర' ఇంకేముంటుంది?

లాభస్తానంలోని గురువువల్ల అమితమైన పుణ్యబలం కనిపిస్తున్నది. అందుకే ఏది పట్టుకున్నా బంగారమౌతుంది. గురువు వక్రతవల్ల ద్వాదశాధిపత్యం మంచిదౌతుంది. పరాయిదేశంలో లాభాలపంటను పండిస్తుంది. ఇదే కారణం చేత, గురువు దశమమైన తులలోకి పోతాడు. దశమంలో గురువు వల్ల పట్టిందల్లా బంగారమౌతుంది.

సుఖవిలాస యోగం

బుద్ధిస్థానమై, భౌతికసుఖాలకు ఆలవాలమైన వృషభంలో కలిగిన శనిశుక్రుల యోగం భయంకరమైన విలాస, సుఖయోగం. ఇతను తలపెట్టే ప్రతి ప్రాజెక్టునూ సక్సెస్ చేసే గ్రహానుగ్రహం ఇదే.

బుధాదిత్యయోగం

ద్వితీయ వృత్తిస్థానమై,  అమెరికాను సూచిస్తున్న మిధునంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల, మంచి తెలివితేటలూ, సౌతాఫ్రికాలో పుట్టినప్పటికీ అమెరికాలో స్థిరపడి భయంకరమైన సక్సెస్ ను సాధించడం జరిగింది. చిన్నవయసులోనే కంప్యూటర్ ప్రొగ్రామింగ్ లో విపరీతమైన తెలివి ఇందుకే కలిగింది.

రోగ యోగం

అయితే, ఇది రోగస్థానం కూడా కావడం వల్ల ఇతనికి  యాస్పర్జర్ సిండ్రోమ్ అనే రోగం దాపురించింది. ఇది ఒకరకమైన ఆటిజమే. ఈరోగం ఉన్నవాళ్లు చేసిందే చేస్తూ, పర్ఫెక్షనిస్ట్ లుగా,  ఒక విధమైన మొండి మనుషులుగా ఉంటారు. జాతకంలో ఇతర అదృష్టయోగాలు కలిస్తే, ఈ పోకడ భయంకరమైన అదృష్టాన్నిస్తుంది. లేకపోతే దురదృష్టాలతో జీవితాంతం బాధపడే మెంటల్ పేషంట్ ని చేస్తుంది. జాతకంలో ఇలాంటి సూక్ష్మమైన తేడాలుంటాయి. 

సాధారణంగా, ఉండవలసిన దానికంటే తెలివితేటలు ఎక్కువైతే, కొంచెం పిచ్చిదోరణి తప్పకుండా ఉంటుంది. లేదా నరాల సంబంధిత జబ్బు ఉంటుంది. అయిన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లు దీనికి ఉదాహరణలు.

ఇతని ముఖంలో కొంచం ఆటిజం కవళికలున్నట్లు గమనించవచ్చు.

మొండి అధికారి

లగ్నసప్తమాలైన మకర కర్కాటకాలలో ఉన్న రాహుకేతువులవల్ల, తనమాట ఎదుటివారు వినడమేగాని, ఎదుటివారిమాటను తను ఎట్టిపరిస్థితిలోనూ వినని భయంకరమైన ఎడ్మినిస్ట్రేటర్ కనిపిస్తున్నాడు. అంటే మొండి సీతయ్యన్నమాట.

ఎదురులేని యోగం

సప్తమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో పడటంవల్ల ప్రత్యర్థుల మాట చెల్లకపోవడం, ఇతనికి ఎదురు ఎవరూ నిలవలేకపోవడం, అయితే అదే సమయంలో వివాహజీవితం చెడిపోవడం కనిపిస్తున్నాయి.

గోచారం

ప్రస్తుతం ఇతనికి సప్తమశని మొదలైంది. అందుకే ట్విట్టర్ ఉద్యోగులతో మనస్పర్థలు మొదలయ్యాయి. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నప్పటికీ, ఇంకొక రెండున్నరేళ్ల తర్వాత రాబోతున్న అష్టమశని సమయంలో మాత్రం తీవ్రమైన ఒడుదుడుకులు తప్పవని అనిపిస్తున్నది.

ఏ మనిషికైనా జీవితమంతా మొదటినుంచీ చివరిదాకా ఒకేలాగా ఉండదుకదా మరి !

read more " Elon Musk Astro Chart - Terrific Dhana Yogas "

1, మే 2022, ఆదివారం

కాబూల్ బాంబు ప్రేలుడు - గ్రహాల పాత్ర

మొన్న శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఒక బాంబు ప్రేలుడు జరిగింది. ఇది మధ్యాన్నం 2 గంటలకు ఒక మసీదులో జరిగింది. ఈ దాడిలో 50 మంది పైగా చనిపోయారు. ఇంకో 60 మంది పైగా తీవ్రగాయాల పాలయ్యారు. రంజాన్ మాసపు చివరి శుక్రవారం నాడు ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న ముస్లిములలో, కొందరు ఆత్మాహుతి తీవ్రవాద ముస్లిములు చేరి, తమనుతాము పేల్చేసుకుని, వాళ్ళు ముక్కలై పోవడమే గాక, ఇంతమంది సోదర ముస్లిములని చంపేశారు. ఇస్లామంటే శాంతేనని, శాంతి తప్ప మరేమీ కాదని, మతిలేని ఈ రక్తపాతం ద్వారా ప్రపంచానికి మళ్ళీ రుజువైంది. ఆఫ్ కోర్స్ ప్రతి శుక్రవారమూ ఇది రుజువౌతూనే ఉందనుకోండి. మళ్ళీ ఇంకొకసారి కూడా రుజువైంది. జనానికి షార్ట్ మెమరీ కదా. మర్చిపోతారని అలా గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు అంతే !

ఇప్పటికీ మీకు నమ్మకం కలగలేదా? ఇస్లామంటే శాంతే. శాంతితప్ప మరేమీ కాదు. నమ్మండి. నమ్మకపోతే ప్రవక్తగారికి కోపమొస్తుంది. ఇంతా చేస్తే, ఇది షియాలు సున్నీల మధ్యన జరిగే పరస్పర చంపుకోవడం అనుకునేరు ఛా ! వాళ్ళంత రాతియుగంలో లేరు. చాలా ఎదిగారు. ఇప్పుడు సున్నీలు సున్నీలు చంపుకుంటున్నారు.

ఒవైసీగారు అదేరోజున హైదరాబాదులో మాట్లాడుతూ, ఇండియాలో ముస్లిములకు రక్షణ లేదని ఏడ్చేశారు. పాపం ! ఇక్కడ ఈయన ఏడుస్తున్న సమయంలోనే కాబూల్లో ఈ సంఘటన జరిగింది. ఎక్కడ ఎవరికి రక్షణ లేదో ఏంటో మరి !

అయినా మన పిచ్చిగాని, శుక్రవారం నాడు ప్రార్ధనలు అయిపోయాక చంపడానికి ఎవరో ఒకరు వాళ్లకు కావాలి కదా. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకున్నాక మనసంతా పిచ్చిపిచ్చిగా ఉంటుంది కదా? అర్జంటుగా ఎవర్నో ఒకర్ని చంపాలి. చేతులు మహా దురదగా ఉంటాయి. ఎవరూ  బయటవాళ్ళు దొరక్కపోతే వాళ్ళు మాత్రం ఏమ్ చేస్తారు పాపం? అందుకని వాళ్లలో వాళ్లే సరదాగా చంపుకుంటున్నారు. అలా చేసుకోమని ప్రవక్తగారి ఆజ్ఞ. వాళ్ళ తప్పేమీ లేదు.

మొన్నీమధ్యన మన ఇండియాలోనే ఒక అరబిక్ కాలేజీలో చదువుకుంటున్న ఒక ముస్లిం అబ్బాయిని, అక్కడి అరబ్బీ లెక్చరర్ గారు చక్కగా రేప్ చేశారు. ఇది పేపర్లలో కూడా వచ్చింది. మీరు సరిగ్గానే విన్నారు. అబ్బాయినే. మరి అమ్మాయిలెవరూ దొరక్కపోతే ఆ ముల్లాగారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? దాదాపుగా అలాంటిదే ఈ కాబూల్ పేలుడు కూడా !

ఇంతా చేస్తే, ధిక్ర్ అనే ఒక తంతుని సున్నీలలో ఒక వర్గం పాటిస్తుంది. ఇంకో చాదస్తపు వర్గం దీనిని ససేమిరా ఒప్పుకోదు. ముస్లిములలో సహనం చాలా ఎక్కువ కదా ! వాళ్ళలాగా లేకపోతే, వాళ్ళ తంతునే చెయ్యకపోతే, వాడు సైతాన్ భక్తుడి కిందే లెక్క. వాడికి మరణమే శిక్ష. దానిని అమలు చేసే అధికారాన్ని ప్రవక్తగారు బ్లాంక్ చెక్కు లాగా ఎప్పుడో వారికి ఇచ్చేశారు. అందుకని అలా చంపేస్తారన్న మాట !

నాన్ ముస్లిమ్స్ ఎలాగూ వాళ్ళ దృష్టిలో సైతాన్ భక్తులే. ముస్లిమ్స్ లో కూడా, వేరే వర్గం వాళ్ళు సైతాన్ భక్తులే. వాళ్ళూ వీళ్ళని అలాగే అనుకుంటారు. వెరసి ఎవరు సైతాను భక్తులో, ఎవరు కాదో, బాంబులు సమాధానం చెబుతాయి. పాతకాలంలో అయితే కత్తులు చెప్పేవి. ఇప్పుడు మోడ్రన్ యుగం కదా టెక్నాలజీ పెరగలా? అందుకని బాంబులు.  అదన్నమాట శాంతిమతం అంటే !

ఇప్పుడు జ్యోతిష్యపు కోణాన్ని చూద్దాం. 
  • శని కుజులు కలసి కుంభంలో ఉన్నారు. ఇది దుర్ఘటనా యోగం.
  • అమావాస్య పరిధి. 
  • ఒక్కరోజులో సూర్యగ్రహణం. 
  • చంపుకోడానికి చక్కని ముహూర్తమైన శుక్రవారం
  • ఉచ్ఛశుక్రుడూ, యముడూ దగ్గరి దృష్టిలో ఉన్నారు.
  • ఆఫ్ఘనిస్తాన్ ను సూచించే ధనూరాశి మొదటి డిగ్రీలకు, గురు, శుక్ర, చంద్రులకు అర్గళం పట్టిన మీనరాశి చతుర్ధం అయింది. అంటే, గృహం. అంటే ఇంట్లో విధ్వంసం. సరిపోయిందా మరి?
  • చంద్ర రాహువులు దగ్గరి 2/12 దృష్టిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాహువు పనే. 
ఇప్పుడు ఇంకో విషయం చెబుతా  వినండి.

దేవతల వరుసలోకి దేవతావేషం వేసుకున్న రాహువు జొరబడి అమృతం త్రాగాడు. ఇక్కడ ముస్లిముల వరుసలోకి సూయిసైడ్ బాంబర్లయిన ముస్లిములే మారువేషంలో జొరబడి వాళ్ళని చంపేశారు. లెక్క సరిపోయిందా మరి !

అయితే రాహువు మంచిపనే చేశాడు. వాళ్లలో వాళ్ళు చంపుకోకపోతే రాక్షసులు లోకం మీద పడతారు. కనుక రాహువు చేసినది మంచిదే. ముసలం పుట్టించి వాళ్లలో వాళ్ళే కొట్టుకుని చచ్చేటట్టు చేస్తున్నాడు. రాక్షసుల బారినుండి లోకాన్ని ఈవిధంగా కాపాడుతున్నాడు. గ్రహప్రభావం ఇలాగే ఉంటుంది మరి !

గ్రహాలను నమ్మనివారు కూడా గ్రహప్రభావానికి లోనయ్యే బ్రతుకుతారని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ !

read more " కాబూల్ బాంబు ప్రేలుడు - గ్రహాల పాత్ర "

SAD GURU - MAD GURU

తెలుగువాళ్ళలో ఎన్నో లక్షణాలు అవలక్షణాలు ఉండవచ్చుగాని, వాళ్లలో కామన్ గా ఉండే పెద్ద అవలక్షణం ఎగతాళి చెయ్యడం. గోదావరి జిల్లాలలో అయితే ఇది మరీ ఎక్కువ. కదిలిస్తే చాలు వెటకారం మాత్రమే వాళ్ళ మాటలలో ఉంటుంది. మళ్ళీ కడపజిల్లాలో కూడా ఈ పోకడలు చూచాను. అక్కడి నీళ్లలోనే ఆ లక్షణాలు ఉంటాయేమో మరి?

ఈరోజు పాలకొల్లు నుంచి ఒక వెటకారి ఫోన్ చేశాడు. ఒక శిష్యురాలిని మెట్రో రైల్ ఎక్కించి ఎండలో వెనక్కు వస్తున్నా. నా ఫోన్ నంబర్ పాతవాళ్లలో కొందరి దగ్గర ఉంది. వాళ్ళలో కొంతమంది వెటకారులూ ఉన్నారు, అహంకారులూ ఉన్నారు. అమావాస్యకీ పౌర్ణమికి వాళ్లకు పిచ్చి లేస్తూ ఉంటుంది. నన్ను కదిలించుకుని వాతలు పెట్టించుకోకపోతే వాళ్లకు తోచదు మరి ! ఏం చేస్తాం చెప్పండి? కొందరి సరదాలలా ఉంటాయి.

హైద్రాబాద్లో కూడా ఎండలు బాగానే ఉన్నాయి. మంచి ఎండలో నడుస్తున్నానేమో మహా చిరాగ్గా ఉంది.

ఆమాటా ఈ మాటా అయ్యాక, ఫోన్ పెట్టేస్తాడనుకుంటే పెట్టెయ్యకుండా, ఉన్నట్టుండి అమెరికా యాసలో ఇంగిలీషు మాట్లాడుతూ, ' కెనై ఆస్క్ యు సంథింగ్? ఆర్యూ ఏ శాడ్ గురు?' అన్నాడు.

సద్గురు అనే మాటని అలా కావాలని వెటకారంగా అంటున్నాడని అర్ధమైంది.

ఇలాంటి పిల్లకాకుల్ని ఎన్నింటిని చూచి ఉంటాను ఇప్పటికి?

వెంటనే తడుముకోకుండా, 'నో. అయామ్ ఏ మ్యాడ్ గురు' అన్నాను.

ఈ జవాబుని అతను ఊహించలేదు.

'అంటే?' అన్నాడు అయోమయంగా.

గోదావరి జిల్లాల జనాలు చాలామంది ఇంతే. ఎక్కడో సినిమాలలో విన్న డైలాగుల్ని వాడబోతూ ఉంటారు. ఆ సినిమా రైటర్స్ కి మనం తాతలమని వాళ్లకు తెలీదు. ఒక చిన్న రిపార్టీ ఇచ్చామంటే ఆ తరువాత వాళ్ళ దగ్గర డైలాగు ఉండదు.

'ఏం లేదు. శాడ్ గురు అంటే మీ ఉద్దేశ్యం ఏంటో నాకైతే తెలీదు. కొంతమంది గురువులు శాడ్ గా ఉంటారేమో? నాదారి అది కాదు. నేనొక మ్యాడ్ గురువుని. అసలు కొద్దోగొప్పో మ్యాడ్ లేకపోతే వాడసలు గురువే కాడని కూడా నేనంటాను' అన్నాను.

అప్పుడు తగ్గాడు. తగ్గి, 'అస్సలు అర్ధం కాలేదు గురువుగారు, కొంచం అర్ధమయ్యేలా చెబుతారా?' అడిగాడు.

వెంటనే కోపంగా గొంతు పెట్టి 'నీకర్థమయ్యేలా చెప్పాల్సిన పని నాకేంట్రా ఇడియట్? నీకర్మ నీది. పడు. పెట్టెయ్ ఫోన్ ' అన్నాను.

హర్తయ్యాడు

'సారీ అండి. సరదాగా జోకెయ్యబోయాను. ఏమనుకోకండి' అన్నాడు. బతిమిలాడుతూ.

'నిన్న అమావాస్య కదా. జోకులు వస్తాయని, మీలాంటి వాళ్ళకి పిచ్చి లేస్తుందనీ, అన్నీ తెలుసు. మరి మ్యాడ్ గురువంటే ఇలాగే ఉంటుంది, నీతో ప్లీసింగ్ గా మాట్లాడుతూ నువ్వు చెప్పిన ప్రతిదానికీ తందానతన అనాల్సిన అవసరం నాకు లేదు. నాకు మ్యాడ్ రేగితే, నిన్ను పంచింగ్ బ్యాగ్ గా వేలాడగట్టి మ్యాడ్ గా కిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటా' అన్నాను.

ఇంకా హర్దయ్యాడు. 

'సార్, మీరు కొంచం అతిగా మాట్లాడుతున్నారు' అన్నాడు.

'నువ్వు తెలివితేటలు ఉపయోగించి, శాడ్ గురు అనగా లేనిది, నేను మ్యాడ్ గా మాట్లాడితే తప్పయిందా? ఫోన్ కాబట్టి ఊరకే మాట్లాడాను. ఎదురుగా ఉంటే తన్ని మాట్లాడేవాడిని. అమావాస్య నీకేకాదు, నాకు ఇంకా ఎక్కువగా ఉంటుందిబే. ఎవరితోరా నీ ఎటకారాలు? చిన్నప్పుడు త్రాగిన ఉగ్గుపాలు ఒక్క గుద్దుతో కక్కిస్తా ఎదవా' అన్నా ఇంకా కోపంగా.

షాకైనట్టున్నాడు.

'అది కాదు సార్. అంత కోపమెంటండీ మీకు? ఆమ్మో. గురువులంటే ఇలా ఉంటారా?' అన్నాడు.

సడెన్ గా టోన్ మార్చి ప్రశాంతంగా నవ్వుతూ, 'అది కాదు నాయన ! నువ్వు ఇప్పటివరకూ చూసిన కుహనాగాళ్ళని గురువులని, సద్గురువులని అనుకోవడం నీ తప్పుకాదు. నీకంతవరకే తెలుసు.  అందుకే నాతోకూడా పరాచికాలాడావు. మాకు కోపం ఉండదు నాయన ! జస్ట్ మీ లాంటి అజ్ఞానులకి బోధ చేయడంకోసం అలా నటిస్తాం అంతే. నువ్విప్పుడు ఎదురుగా ఉంటే ఏమ్  జరుగుతుందో తెలుసా నాయన?' అన్నాను.

'ఏం జరుగుతుంది సార్?'అన్నాడు.

'నీ గాయాలకు ఆయింట్ మెంట్ పూసి, కాపడం పెడుతూ, నిన్ను వాటేసుకుని భోరుమంటూ ఏడుస్తాన్నాయన' అన్నాను విషాదంగా గొంతుపెట్టి.

'ఆమ్మో ఇదేంటి సార్ ఒక్క నిమిషంలో ఇలా మారిపోయింది టోన్?' అన్నాడు భయంగా.

'తప్పు నాయన ! అమావాస్య టైంలో ఇంతే. ఒకలాగా కాదు. అరవైరకాలుగా కూడా మారుతుంది' అన్నా శాంతంగా.

'గతంలో చాలాసార్లు మీకు ఫోన్ చేసి ఎన్నో అడిగాను. ఎన్నో చెప్పారు. ఆ చనువుతో ఒక జోకేశాను. సారీ ఏమనుకోకండి. మీరంటే నాకు మంచి అభిప్రాయమే' అన్నాడు భక్తిగా.

ఇదొక బిస్కెట్ మళ్ళీ. నాకు మళ్ళీ తిక్కరేగింది.

వెంటనే రౌద్రంగా టోన్ మార్చి, 'నీ మంచి ఎవడిక్కావాల్రా బోడి? సైడ్ కిక్కిచ్చానంటే చచ్చికూచుంటావ్. అమావాస్యనాడు నాకు ఫోన్ చేసి ఏషాలేత్తన్నావా బిడ్డా? నా పూర్తి అవతారాలు నీకింకా ఎరిక లేవనుకుంటా' అంటూ అరిచా.

ఈ సారి నిజంగానే భయపడ్డాడు.

'సారీ అండి. మీ మూడ్ బాగా లేనట్టుగా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తా' అన్నాడు.

'ఇంకోసారి అమావాస్య ఘడియల్లో ఫోన్ చేసి ముచ్చట్లు పెట్టుకుకున్నావంటే  మక్కెలిరుగుతైరా మాండ్లే. విషయం మాట్లాడి పెట్టెయ్. సోది పెట్టావంటే షోటోకాన్ కరాటే చూపిస్తా' అన్నా వేటగాడు లో ఎంటీఆర్ని ఇమిటేట్ చేస్తూ.

సడెన్ గా ఫోన్ కట్ అయిపొయింది.

నవ్వుకుంటూ నేనూ ఫోన్ కట్ చేశా. ఈలోపల ఇల్లొచ్చేసింది.

'అడిగిందల్లా చెబుతుంటే అలుసైపోతారంటే ఇదేనన్నమాట ! ఈ సారి మళ్ళీ చెయ్యనీ చెబుతా, మ్యాడ్ గురువా మజాకానా?' అనుకుంటూ నా రూంలోకెళ్ళి పద్మాసనం వేసుకుని, కళ్ళుమూసుకుని, ప్రశాంతంగా ధ్యానంలోకి జారిపోవడం మొదలుపెట్టా.

International Laughing Day Greetings !

read more " SAD GURU - MAD GURU "

గుండె గుడి

మా ఆశ్రమాన్ని ఎనౌన్స్ చేసినప్పటినుండీ రకరకాల ఈ మెయిల్స్ ను నేనందుకుంటున్నాను. ఇంతకుముందయితే, రకరకాల సమస్యలను ఏకరువు పెడుతూ, వాటికి నివారణోపాయాలు అడుగుతూ మెయిల్స్ వచ్చేవి.  సిన్సియర్ గా ఉన్నారని నాకనిపిస్తే ఆ సమస్యలు ఎలా పోతాయో చెప్పేవాడిని. అడిగేవారిలో తింగరితనం కనిపిస్తే అదే రకంగా జవాబులిచ్చేవాడిని. కానీ ఆశ్రమం ఎనౌన్స్ చేశాక ఈ ట్రెండ్ చాలావరకూ మారింది. ఇప్పుడు ఇంకోరకంగా వస్తున్నాయి.

'మీరు అమ్మవారి భక్తులు కదా ! మీ ఆశ్రమంలో కాళీమాతకు గుడి కడితే ఎలా ఉంటుందో ఆలోచించండి' అని ఒక మహాభక్తుడు మెయిలిచ్చాడు

'ఓకె అలాగే, మీరు స్పాన్సర్ చేసి కట్టించండి. నాకేం అభ్యంతరం లేదు' అన్నాను

'ఆమ్మో గుడంటే మాటలా? కనీసం ఏభై లక్షలు అవదా?' అన్నాడు

'అంతేనా? ఏభై కోట్లు పెట్టి అయినా కట్టవచ్చు సరదాగా ఉంటే' అన్నాను

 'ఆమ్మో. మావల్ల ఎక్కడౌతుంది?' అన్నాడు.

'అంతేలెండి. సలహాలంటే కిలోల లెక్కన ఇవ్వచ్చు. పనిమాత్రం మేం చెయ్యాలి. అప్పుడు మీకు సరదాగా ఉంటుంది. వీలైతే ఇంకో కిలో సలహాలు ఉచ్చితంగా పారేస్తారు. అంతేకదా?' అన్నాను మొహమాటం లేకుండా'

'అది కాదండి ఆశ్రమమంటే గుడి ఉండాలి కదా?' అన్నాడు పట్టు వదలకుండా.

'ఉంటుంది. గుడి ఉండదని ఎవరన్నారు. అడుగడుక్కీ ఉంటుంది' అన్నాను

'అదెలా?' అడిగాడు

'మాలో ప్రతీవాడి గుండె ఒక గుడిగా మారుతుంది మాలో ప్రతివాడూ ఒక నడిచే గుడే/ మాకు ప్రత్యేకంగా ఒక గుడి అక్కర్లేదు కాళీమాత మా గుండెల్లోనే ఉంటుంది' అన్నాను

'అర్ధమైంది' అన్నాడు

'మీలాంటి వాళ్ళకి అంత తేలికగా అర్ధం కాదు. చెప్తా వినండి. ప్రస్తుతం లోకంలో ఎన్నో గుళ్ళున్నాయి.  ఎవరి మతానికి వాళ్లకి మందిరాలున్నాయి, కానీ మనుషుల్లో ఎంతమంది మనుషులుగా ఉన్నారు? కనుక ప్రస్తుతం కావలసింది ఇంకా ఇంకా గుళ్ళు కాదు. వ్యాపారసంస్థలూ కాదు. మనిషిని మనిషిగా, ఆ తరువాత ఒక దేవతగా తీర్చిదిద్దే బడి కావాలి. అదే మా ఆశ్రమం. ఇంతకు ముందు పోస్టులలో చెప్పా చూడండి.  'మా ఆశ్రమం, మిగతా ఆశ్రమాల లాగా వ్యాపార ఆశ్రమం కాదు, ఇక్కడ వ్యాపారం ఉండదు' అని. మా దగ్గర అసలైన వ్యవహారం మాత్రమే ఉంటుంది. మీరు చూడగలిగితే, మా ఆశ్రమంలో అడుగడుగునా మీకు దైవత్వం తొణికిసలాడుతూ కనిపిస్తుంది.

మా ఆశ్రమంలో గుడి ఉండదు, ఎందుకంటే మా ఆశ్రమమే ఒక పెద్ద గుడి. అంతేకాదు, ఇది జీవితాలను మార్చే బడి. కుళ్లిపోతున్న మనిషి జీవితాన్ని దైవత్వంతో నింపే అమ్మ ఒడి. మాయతో నిండి అఘోరిస్తున్న ఈ ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడే దడి. మీరు కనీ వినీ ఎరుగని అతీతానుభవాలను ప్రసాదించే దివ్యత్వపు జడి. ఇక్కడ గుడి, సిమెంట్ కట్టడాలలో ఉండదు, మా మనసులలో ఉంటుంది, మా జీవనవిధానంలో ఉంటుంది' అన్నాను.

తిరిగి రిప్లై రాలేదు/

బహుశా ఆయన తలలో ఒక జీరో క్యాండిల్ లైటన్నా వెలిగి ఉంటుందని భావించా

అంతేకదూ !

read more " గుండె గుడి "