“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, మే 2022, బుధవారం

The Great Oom (Pierre Bernard/Perry Baker) - జాతక విశ్లేషణ

అమెరికాలో ఈనాడు యోగా అనేది అందరికీ తెలుసు. నేటికీ అసలైన యోగాభ్యాసమూ దాని లోతుపాతులూ తెలిసినవాళ్ళు తక్కువే అయినా, యోగా అంటే కనీసం ఆసనాలు ప్రాణాయామంగా అందరికీ తెలుసు.

అసలీ యోగా అనేది అమెరికాలో ఎప్పుడడుగు పెట్టింది? అంటే, 1893 లో వివేకానందస్వామి అక్కడకు వెళ్ళినప్పటినుండి అని చాలామంది అంటారు. కానీ అంతకు చాలాముందే అక్కడ యోగా అడుగుపెట్టింది. ఇది పియర్ ఆర్నాల్డ్ బెర్నార్డ్ అనే వ్యక్తితో జరిగకపోయినా కనీసం అతనివల్ల పాపులర్ అయిందని ప్రస్తుతం అందరూ నమ్ముతున్నారు.

ఈయన 31 అక్టోబర్ 1875 న అయోవా రాష్ట్రంలోని లియోన్ అనే ఊరిలో పుట్టాడు. ఈయన అసలు పేరు పియర్ ఆర్నాల్డ్ బేకర్. పియర్ అనేది ఫ్రెంచ్ పేరు గనుక ఈయన పూర్వీకులు ఫ్రెంచ్ వాళ్ళై ఉండవచ్చు. పెరిగి పెద్దయిన తర్వాత ఈయన ది గ్రేట్ ఓం, అమ్ని పోటెంట్ ఓం, ఓం ది మెగ్నిఫిషేంట్ అనే పేర్లతో పిలవబడ్డాడు.

1880 ప్రాంతాలలో నెబ్రాస్కా రాష్ట్రంలోని లింకన్ అనే ఊరిలో ఈయనొక భారతీయ యోగిని కలిశాడు. ఆ యోగి పేరు సిల్వాయిస్ హమాటి. ఇప్పటికి రికార్డ్ అయినంతవరకూ ఇతని వల్లనే హఠయోగా అనేది అమెరికాలో అడుగుపెట్టింది. ఇతను సిరియన్ మూలాలున్న భారతీయుడు. బెంగాల్ రాష్ట్రంలో ఇతను ఉండేవాడు. అక్కడ కాళీ ఉపాసనను, హఠయోగాన్ని, తంత్రాన్ని నేర్చుకున్నాడు.  ఈయన గురువు పేరు మహీధరుడని తెలుస్తున్నది. స్వామి రామతీర్థగారు కూడా మహీధరుడు తంత్రయోగంలో నిష్ణాతుడైన యోగి అని చెప్పారు. అప్పట్లో రామతీర్ధస్వామి ఒప్పుకున్న మరొక తాంత్రికయోగి పేరు స్వామి జ్ఞానానంద. ఈ మహీధరయోగి అనే ఆయన హమాటిని చేరదీసి ఏడేళ్ల వయసు నుండి ఇరవై మూడేళ్ళ వయసు వచ్చేవరకూ అంటే పదహారేళ్ళ పాటు అతనికి సాధనను నేర్పించాడు.  

ఈనాడు లక్షలాది మంది భారతీయులు అమెరికా మూలమూలలా ఉన్నారు. కానీ 1880 ప్రాంతాలలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు 800 కంటే తక్కువే ఉండేవారు. వారిలో ఇతనొకడు. అసలితను అమెరికాకు ఎందుకొచ్చాడు? అంటే, ఏదో ప్రదర్శనలిచ్చే ట్రూపులో సభ్యుడిగానో, గాలికి తిరుగుతూనే అతను అమెరికాకు వచ్చాడని అంటారు. అప్పటికే ఇతను హఠయోగం, తంత్రయోగాలలో నిపుణుడు. చిన్నవయసునుండే, అంటే దాదాపు అయిదేళ్ల వయసు నుండే బెర్నార్డ్ కు యోగాభ్యాసంలో శిక్షణనిచ్చాడు సిల్వాయిస్. ఇది నిజం కాకపోవచ్చు. అయితే, కొన్నేళ్లపాటైనా, ఆ శిక్షణలో రాటుదేలిన బెర్నార్డ్ 1898 జనవరిలో శాన్ ప్రాన్సిస్కోలో ఒక డాక్టర్ల బృందం ఎదురుగా ఒక  డెమో ఇచ్చాడు.

అందులో బెర్నార్డ్, 'కాళీముద్ర' అనే క్రియను ప్రదర్శించాడు. ఈ ముద్రలో ఏం జరుగుతుంది? ఊపిరిని బంధించడం ద్వారా, గుండె కొట్టుకోవడాన్ని దాదాపు ఆపేసి, ఒక విధమైన ట్రాన్స్ లోకి వెళతారు. ప్రాణంపోకపోయినా దాదాపు శవంలాగా అవుతారు.  అప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని సూదులతో గుచ్చినా, చివరకు కత్తితో కోసినా కూడా అతనికి ఏమీ నొప్పి తెలియదు. స్వయానా కొంతమంది డాక్టర్లు ఇతని చెవితమ్మెలకు, ముక్కుకు, పెదవులకు, చెంపలకు సూదులు గుచ్చి చూశారు. ఇతనిలో చలనం లేదు. ఈ డెమో చూసిన అమెరికన్ డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఇది అమెరికన్ మెడికల్ హిస్టరీలో రికార్డ్ కాబడిన సంఘటన. ఆ తరువాత, ఇచ్చానుసారం తన గుండెను కొట్టుకోవడం ఆపేసిన యోగిగా మళ్ళీ స్వామీ రామా ప్రసిద్ధికెక్కాడు.  స్వామి రామా ఈ  డెమోను 1970 లో మళ్ళీ అమెరికన్ డాక్టర్ల బృందం ముందు చూపించాడు.

కాళీముద్ర లాంటివి తంత్రయోగంలో  చాలా చిన్న క్రియలే అయినప్పటికీ, చూచేవాళ్లకు మాత్రం దిగ్భ్రాంతి కలుగుతుంది. భారతదేశంలో మహారాజుల ఎదుట గారడీ చేసేవాళ్ళు ఇలాంటి విద్యలను పాతకాలంలో ప్రదర్శించేవారు. ఒక గుంతను తవ్వి అందులో ఈ క్రియ తెలిసినవారిని పాతిపెడతారు. చుట్టూ రాజభటులు కాపలా ఉంటారు. 40 రోజుల తర్వాత మట్టి తవ్వితే ఆ మనిషి నవ్వుతూ లేచి బయటకొస్తాడు. పాతకాలంలో ఇది చాలామంది మహారాజుల ఎదుట ప్రదర్శింపబడిన విద్యయే. అంతమాత్రం చేత ఆ మనిషి ఒక మహనీయుడూ, మహాయోగీ  కాడు, కాలేడు. కుమ్భకాన్ని సాధిస్తే దీనిని చెయ్యవచ్చు. ఇదొక గారడీ లాంటిది.

యోగ-తంత్రాలలో ఉన్నతస్థాయిలైన సవికల్ప, నిర్వికల్పసమాధి స్థితులను  చవిచూసినవారు ఇలాంటి ప్రదర్శనలను చిల్లరపనులుగా భావిస్తారు. శ్రీరామకృష్ణుల వంటి మహనీయులు ఇలాంటి ప్రదర్శనలను అసహ్యించుకునేవారు. అయితే, యోగం నిజమే, తంత్రక్రియలు నిజాలే, మన శరీరంలోని ఇన్ వాలంటరీ సిస్టం ను కూడా మనం అదుపు చేయవచ్చు అన్న విషయాన్ని ఇలాంటి యోగప్రదర్శనలు  లోకానికి తిరుగులేకుండా నిరూపిస్తాయి. ఇది సైన్సుకు అంతుబట్టని విషయం.

ఈ విషయాన్ని ప్రముఖంగా వెల్లడి చేస్తూ 'న్యూ యార్క్ టైమ్స్' పత్రిక తన జనవరి 29, 1898 సంచిక ముఖచిత్రంగా పియర్ బెర్నార్డ్ ఫోటోను ప్రచురించింది.

బెర్నార్డ్, 1905 లో 'తాంత్రిక్ ఆర్డర్ ఆఫ్ అమెరికా' ను స్థాపించాడు. అయితే అది ఎక్కువకాలం పాటు బ్రతకలేదు. 1910 లో New York Sanskrit College ని స్థాపించాడు.వేలాది సంస్కృత గ్రంధాలను సేకరించి ఇక్కడ ఉంచాడు. చాలామంది రీసెర్చి స్కాలర్లకు అది రిఫరెన్స్ లైబ్రరీగా ఉపయోగపడింది. 1918 లో క్లివ్ ల్యాండ్, ఫిలడెల్ఫియా, చికాగో, న్యూయార్క్ లలో తాంత్రిక్ క్లినిక్స్ ను మొదలుపెట్టాడు.  ఈ విధంగా ఎదుగుతున్న ఇతనికి గట్టి దెబ్బ 1910 లో తగిలింది.

తమ ఇష్టానికి వ్యతిరేకంగా తమను బంధించాడని, తన శక్తులతో తమను అదుపులో పెట్టుకున్నాడని ఇద్దరు టీనేజీ శిష్యురాళ్ళు 1910 లో ఇతని మీద కేసు పెట్టారు. ఇతనికి పరిచయమైన ఏ అమ్మాయైనా సరే, ఇతని ఆకర్షణనుండి తప్పుకోలేదని, ఇతనొక అద్భుతమైన వ్యక్తని వాళ్ళన్నారు. సెక్స్ పరమైన ఆరోపణలు కూడా ఇందులో ఉన్నాయి. దానిలో ఇతని పరువు పోవడమే గాక, సందు దొరికిందని భావించిన క్రైస్తవ మిషనరీలు యోగా మీద బురద చల్లఁడం మొదలుపెట్టారు. ఇది సైతాన్ కల్ట్ అంటూ ప్రచారం చేసి ఇతని పరువు తీశారు. కానీ ఆ తరువాత ఆ అమ్మాయిలు కేసును ఉపసంహరించుకోవడంతో ఇతను గట్టెక్కాడు.

ఈ కేసుతో ఇతని పరువు పోయినా మళ్ళీ పుంజుకొని యోగా, తంత్రాలకు మంచి ప్రచారం కల్పించాడు. 1931 లో న్యూయార్క్ దగ్గరలో హడ్సన్ నదితీరంలో ఇతనికి 200 ఎకరాల ఆశ్రమం ఉండేది. కనీసం 400 మంది ఉన్నత కుటుంబాలకు చెందిన ధనికవర్గం ఇతని శిష్యులుగా ఉండేవారు. వీళ్ళలో సెనేటర్లు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ డీలర్లు, సినిమా స్టార్స్, బాక్సర్లు, అధ్లెట్లు, క్రైస్తవ ఫాదర్లు ఇలాంటి ప్రముఖులందరూ ఉండేవారు. ఈనాడు కొంతమంది కార్పొరేట్ గురువుల జీవనశైలికంటే విలాసవంతమైన జీవితాన్ని అప్పట్లోనే బెర్నార్డ్ గడిపేవాడు.

అప్పట్లో ఇతని శిష్యురాలైన ఇడా రోల్ఫ్ తరువాత 'రోల్ఫింగ్' అనే ఒక సంస్థను మొదలుపెట్టింది. దీనికి అమెరికాలో నేటికీ మంచి పేరుంది. బాడీ ఎలైన్ మెంట్ ను సరిదిద్దడం, కూర్చునే తీరును, నడిచే తీరును సరిదిద్దడం ద్వారా, చాలా నొప్పులను వీళ్ళు తగ్గిస్తారు. ఈ విద్యను ఈమె, బెర్నార్డ్ దగ్గర హఠయోగ శిక్షణలోనే నేర్చుకుంది.

నేడు అమెరికాలో అందరికీ తెలిసిన రోల్ఫింగ్, కీనీసియాలజీ మొదలైన వ్యాయమపద్ధతులకు మూలం మన హఠయోగమే.

ఇతని కజిన్ సిస్టర్ ఓరా రే బేకర్ అనే ఆమె, భారతీయ సూఫీ గురువైన ఇనాయత్ ఖాన్ భార్య అయింది. సంస్కృత కాలేజీని చూడటానికి వచ్చిన ఇనాయత్ ఖాన్ ను తన సిస్టర్ కు హిందూస్తానీ సంగీతాన్ని నేర్పమని బెర్నార్డ్ కోరాడు. ఇనాయత్ ఖాన్ ఉత్తరభారతదేశంలోని సంగీత ఘనాపాఠీల కుటుంబానికి చెందినవాడు. సంగీత పాఠాలు ప్రేమపాఠాలయ్యాయి. వీళ్లిద్దరి ప్రేమను బెర్నార్డ్ ఒప్పుకోలేదు. ఇనాయత్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. బెర్నార్డ్ టేబుల్ మీద కాగితాలలో వెదికి ఇనాయత్ అడ్రస్ పట్టుకున్న ఓరా, ఓడనెక్కి ఒంటరిగా లండన్ కు ప్రయాణం చేసి అక్కడ ఇనాయత్ ను కలుసుకుంది. లండన్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇనాయత్ ఖాన్ గురించి, నవీన సూఫీ సాంప్రదాయాల గురించి, మెహర్ బాబాతో వీరి సంబంధాల గురించి ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, 1880 ప్రాంతాలలోనే అమెరికాలో యోగా, తంత్రాలు అడుగుపెట్టాయని చెప్పడమే నా ఉద్దేశ్యం.

ఇప్పుడితన్ని జాతకం పరిశీలిద్దాం.

ఇతనిది అనూరాధా నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకు కొంచం ఆధ్యాత్మిక చింతన ఉంటే, రహస్యవిద్యలైన యోగం, తంత్రం మొదలైన దారులలో తప్పకుండా నడుస్తారు. ఇది వృశ్చికరాశి గనుక, రహస్యవిద్యలతో వీరికి పరిచయాలు ఉంటాయి. గ్రహయోగాలు అనుకూలిస్తే వీరు యోగమార్గంలో ఉన్నతిని సాధిస్తారు. అదే ఇతని జాతకంలో జరిగింది.

తృతీయంలో శనికుజుల యోగాన్ని చూడవచ్చు. ఇది ఇతని జాతకంలో ఒక ముఖ్యమైన యోగం. శని విక్రమాధిపతిగా స్వస్థానంలో ఉంటూ అమితమైన ధైర్యాన్నిస్తాడు. అంతేగాక క్రమశిక్షణతో కూడిన సాధననిస్తాడు. కుజునికి ఇది ఉచ్ఛస్థానం. కనుక ఈ యోగం మొండి పట్టుదలతోకూడిన కఠోరసాధననిస్తుంది. ఇదే యోగం నవమస్థానాన్ని కూడా  చూస్తున్నందువలన, ఆధ్యాత్మికపరమైన రహస్య సాధనామార్గాలలో నడిపిస్తుంది. మకరరాశి గనుక  భారతీయ ఆధ్యాత్మిక చింతనలను ఇది ఇస్తుంది.

పంచమంలో గురుక్షేత్రంలోని రాహువు వల్ల, పరాయిమతానికి చెందిన రహస్య సాధనల భావజాలం ఒంటపడుతుంది.  ఈ క్రమంలో పరువును పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. 

ద్వాదశంలో నీచరవి, బుధ, శుక్ర, గురువుల సన్యాసయోగాన్ని చూడవచ్చు. ఇది మళ్ళీ రహస్యసాధనలను సూచిస్తుంది. ఈయనకు పెళ్లి అయినప్పటికీ, జీవితాన్నంతా యోగ, తంత్రసాధనలలోనే గడిపాడు. ఆ క్రమంలో స్త్రీలతో కలసి సెక్స్ పరమైన వామాచార తంత్రసాధనలు చేసేవాడని పుకార్లున్నాయి. అది నిజమేనని ఈ యోగం చెబుతున్నది.

1898 జనవరిలో 'కాళీముద్ర' డెమో ఇచ్చిన సమయంలో శనీశ్వరుడు వృశ్చికంలోనే ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. జననకాల చంద్రుని మీద గోచారశని సంచారం వల్ల యోగ-తంత్రాల మహత్యాన్ని లోకానికి నిరూపించే డెమో ఇచ్చాడు.

1910 లో ఇతనిమీద టీనేజీ అమ్మాయిల కేసు నడిచినప్పుడు శనీశ్వరుడు మేషంలో ఉన్నాడు. గురువు కన్యలో ఉన్నాడు. శత్రుస్థానంలో శని నీచత్వం వల్ల కోర్టు కేసును ఎదుర్కొన్నాడు, కానీ లాభస్థానంలో ఉన్న గురువు ఇతన్ని కాపాడాడు. మోపబడిన నేరాలు డ్రాప్ అయ్యాయి.

1955 సెప్టెంబర్ లో ఈయన చనిపోయినపుడు, రాహుకేతువులు వృశ్చిక వృషభాలలో నీచస్తితులలో ఉన్నారు. గురువు నవమంలో ఉచ్చస్థితిలో ఉంటూ యోగిక్ ట్రాన్స్ లో ఈయన దేహాన్ని వదిలేసినట్లు చూపుతున్నాడు. కనుక ఇది యౌగిక మరణమేగాని మామూలు చావు కాదు. 23 ఏళ్ల వయసులో గుండెను ఆపడం డెమో ఇచ్చిన వ్యక్తి 80 ఏళ్ల వయసులో మామూలుగా అందరిలాగా ఎలా చనిపోతాడు? అయితే, ఇతని కోరికలు తీరలేదని, వాంఛలు చావలేదని, సంస్కారనాశనం జరగలేదని, మరణ సమయంలో  నీచస్థితులలో ఉన్న రాహుకేతువులు చెబుతున్నాయి. ఆసనాలు ప్రాణాయామాల వరకేగాని, ఉన్నతస్థాయి ఉపాసనలు ఈయనకు తెలీదని, వాటినీయన చెయ్యలేదని, కేవలం యోగాను ఒక బిజినెస్ గా మాత్రమే మార్చుకున్నాడని ఈ చార్ట్ చెబుతున్నది. 

80 ఏళ్ళు బ్రతికిన ఈయన 1955 లో న్యూయార్క్ లో చనిపోయాడు. ఏదేమైనా,  ఒక అమెరికన్ అయ్యుండి జీవితాంతం యోగ-- తంత్రాలను అభ్యాసం చేసి, ఎన్నో ఒడిదుడుకులకు లోనై, ఎంతో ఎదురుదాడిని ఎదుర్కొని, పరువు పోగొట్టుకున్నా కూడా, వదలకుండా వాటిని ప్రచారం చేసినవారిలో ముఖ్యునిగా ఈయనను మనం మరచిపోకూడదు.