“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, మే 2022, బుధవారం

టెక్సాస్ స్కూల్ షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ

నిన్న అంటే, 24 మే 2022 న ఉదయం 11.32 ప్రాంతంలో టెక్సాస్ లో షూటింగ్ జరిగింది. షూటింగ్ అంటే సీన్మా షూటింగ్ అనుకునేరు. అదికాదు. గన్ షూటింగ్. ఒక 18 ఏళ్ల అబ్బాయి తుపాకీతో కాల్పులు జరిపి 22 మందిని  చంపేశాడు. వాళ్లలో 19 మంది చిన్నచిన్నపిల్లలు. ఇద్దరు పెద్దవాళ్లున్నారు. ఒక పోలీసు కూడా ఉన్నాడు. చివరికి అతన్ని కూడా  పోలీసులు కాల్చేశారు.

అమెరికా అంతా గగ్గోలెత్తింది. గన్ కల్చర్ కు ముగింపు  పలకాలని జో బైడెన్ తో సహా అందరూ  తీర్మానించారు. చర్చిలలో ప్రార్ధనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించారు. కానీ ఏమీ చెయ్యరు. ఏమంటే, గన్ లాబీ చాలా గట్టిది. అది వాళ్ళ వ్యాపారం మరి !

హంతకుడికి ఈ మధ్యనే పట్టుమని పదిహేడు నిండాయి. వెంటనే రెండు గన్స్  కొనుక్కున్నాడు. కార్టూన్ కేరక్టర్ లాగా వేషం వేసుకున్నాడు. యుద్దానికి వెళ్ళేవాడిలాగా తయారయ్యాడు. తుపాకీ ని టెస్ట్ చెయ్యాలికదా? ముందు ఇంట్లో ఉన్న మామ్మను సరదాగా డిష్యుం అంటూ కాల్చి పారేశాడు.  గన్ పనిచేస్తోందని నిశ్చయించుకున్నాక, నింపాదిగా దగ్గర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కొచ్చి 19 మంది పిల్లల్ని  కాల్చి పారేశాడు. అడ్డొచ్చిన పోలీసుని కాల్చేశాడు. ఒక టీచర్ని కాల్చేశాడు. ఎదురుకాల్పులలో చనిపోయాడు.

గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

షూటింగ్ జరిగిన యువాల్డీ అనే ఊళ్ళో ఆ సమయానికి  కర్కాటకలగ్నం 15 డిగ్రీ ఉదయిస్తోంది. అసలు ఇలాంటి సంఘటనలకు కుజరాహువులు కారకులౌతారు. ఈ చక్రంలో కుజుడు చంద్రగురువులతో కలసి ఉంటూ మతపరమైన రాక్షసత్వాన్ని సూచిస్తున్నాడు. పైగా, రాహుశనుల మధ్యన అర్గలబందీ అయ్యాడు. ఇది చాలా భయంకరమైన క్రూరయోగం. ఈ కుజుని చతుర్ధదృష్టి అమెరికాను సూచించే మిధునరాశి  మీదుంది. చిన్నపిల్లలకు సూచకుడైన బుధుడు వక్రిగా మారి, అస్తంగతుడై, ప్లుటోతో ఖచ్చితమైన దృష్టితో చూడబడుతున్నాడు. పైగా, కుజుడు సూచించే దక్షిణపు గేట్ లోనుంచి హంతకుడు స్కూల్లోకి అడుగుపెట్టాడు.

ఇంకేం కావాలి? 20 ఏళ్లలో జరగని ఘోరం జరిగింది. పాపం ఈ స్కూల్లో చదువుకునే పిల్లల్లో  చాలామంది పేదవాళ్ళైన హిస్పానిక్ పిల్లలే.

అమెరికాలో ఉన్న రేసిజానికి, మానసికరోగాలకు, చిన్నవయసులోనే పిల్లలలో పుట్టే పెడబుద్ధులకు ఈ సంఘటన అద్దం పడుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో గన్స్ విరివిగా చాకోలెట్ల మాదిరి అమ్ముతారు. ఓరిగాన్ లో పెట్టిన ఓషో ఆశ్రమానికి కావలసిన తుపాకులను కూడా, షీలా మనుషులు టెక్సాస్ నుండే కొనుక్కున్నారు. పైగా శాంతిని ప్రబోధించే క్రైస్తవమతం కూడా అక్కడ చాలా ఎక్కువ. మరి పిల్లలకి ఇదేనా నేర్పించేది? ప్రతీ ఆదివారం చర్చిలలో ఊరకే మాయదారి శాంతివచనాలు పలకడమేనా? లేక ఇప్పుడైనా నిజాయితీగా ఈ గన్ కల్చర్ కు ముగింపు పలుకుతారా? ఏమో చూద్దాం !