“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జూన్ 2019, శనివారం

శ్రీవిద్యా రహస్యం (రెండవ ప్రచురణ) ప్రింట్ పుస్తకం విడుదలైంది


చాలామంది ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న పుస్తకం 'శ్రీ విద్యా రహస్యం' రెండవ ప్రచురణ ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్నది.

ఆధ్యాత్మిక సాధకులకు ఈ పుస్తకం ఒక భగవద్గీత, ఒక బైబిల్. ఒక ఖురాన్, ఒక జెంద్ అవెస్తా, ఒక ధమ్మపదం, ఒక గురు గ్రంధసాహెబ్ వంటిది. అన్ని ఆధ్యాత్మిక సందేహాలకూ ఇందులో సమాధానాలున్నాయి. అన్ని తాత్విక చింతనలకూ పరమావధులు ఇందులో ఉన్నాయి. 1380 తెలుగు పద్యాలతో వాటి సులభ వివరణలతో ఈ పుస్తకం ఆధ్యాత్మిక సాహిత్యచరిత్రలోనే ఒక అనర్ఘరత్నంగా వెలుగుతోంది. మొదటి ముద్రణకు విపరీతమైన ఆదరణ లభించిన కారణంగా రెండవ ముద్రణ అవసరమైంది. కాకుంటే కొంత ఆలస్యమైంది. ఇన్నాళ్ళకు ఈ పుస్తకం తిరిగి పాఠకులకు లభిస్తోంది.

కావలసినవారు రేపటినుంచీ ఈ పుస్తకాన్నిgoogle play books నుంచి పొందవచ్చు.
read more " శ్రీవిద్యా రహస్యం (రెండవ ప్రచురణ) ప్రింట్ పుస్తకం విడుదలైంది "

28, జూన్ 2019, శుక్రవారం

రెండవ లక్నో యాత్ర - 1

17 నుంచి 21 వరకూ IRITM Lucknow లో ఒక చిన్న ట్రైనింగ్. ఆరేళ్ళ క్రితం ఒకసారి లక్నో వెళ్లాను. మళ్ళీ ఇప్పుడు. అప్పుడేమో మాయావతి రాజ్యం. ఇప్పుడు యోగి గారి రాజ్యం. ఊరంతా తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి.

నార్త్ ఇండియా అంతా హీట్ వేవ్ లో మునిగి ఉంది. మునుపటి కంటే ఇప్పుడు లక్నో ఇంకా దరిద్రంగా తయారైంది. జనం ఎక్కువయ్యారు. వేడి ఎక్కువైంది. దుమ్ము పెరిగింది. వాహనాలు ఎక్కువయ్యాయి. కానీ అదే తిండి. అదే వాతావరణం. అదే మనుషులు.

ఎందుకొచ్చాంరా బాబూ? అనిపించింది. క్లాస్ రూమూ, లివింగ్ రూమూ మొత్తం సెంట్రల్ ఏసీ గనుక బ్రతికిపోయాం గాని, లేకుంటే ఆ వేడికి హరీమనేవాళ్ళం. సాయంత్రం ఏడువరకూ బజారులోకి పోలేనంత వేడి ఊళ్ళో ఉంది. మొదటిరోజు క్లాస్ అయ్యాక, సిటీ లోకి వెళ్లి దగ్గరలోనే ఉన్న ఆలంబాగ్ అనే సెంటర్లో కాసేపు అటూ ఇటూ తిరిగి వచ్చాం.

IRITM మాత్రం మునుపటి కంటే ఇంకా బాగుంది. కాలుష్యం లేదు. ఎక్కడ చూచినా పచ్చని చెట్లు, పచ్చిక, మంచి పర్యవేక్షణతో చాలా క్లాస్ గా, చాలా హాయిగా ఉంది. ఎరువులు లేకుండా కూరగాయలను క్యాంపస్ లోపలే పండిస్తున్నారు. క్యాంపస్ లోపల నీటి కొలనులు మూడున్నాయి. బోలెడన్ని పూలమొక్కలు, పక్షులు, నెమళ్ళు కనిపించాయి. మెయిన్ హాల్లో ఉన్న వివేకానందస్వామి చిత్రం చూచి సంతోషం కలిగింది.

వాన నీటిని జాగ్రత్తగా పట్టి, భూమిలోకి పంపే ప్రక్రియద్వారా నీటిని రక్షిస్తున్నారు. 'క్యాంపస్ లో మేము వాడుతున్న నీటికంటే వందరెట్లు నీటిని భూమికి అందిస్తున్నాం' అని IRITM డైరెక్టర్ ఏ. పీ . సింగ్ గారు సగర్వంగా మాతో అన్నారు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. క్యాంపస్ అవసరాలకు చాలా భాగం సోలార్ విద్యుత్తే ఉపయోగపడుతోంది. 

క్లాస్ లో చాలా భాగం పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, రైల్వేలలో వీటిని ఎలా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మొదలైన విషయాల గురించే చెప్పారు. మన దేశంలో వేస్ట్ మేనేజిమెంట్, వాటర్ మేనేజిమెంట్ సరిగా చేసి, అర్జంటుగా పొల్యూషన్ తగ్గించక పోతే, ఒక ఇరవై ముప్పై ఏళ్ళలో అనేక రోగాలతో భారతదేశ జనాభాలో సగంమంది హరీమనడం ఖాయమని, లెక్చర్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రముఖులు స్టాటిస్టిక్స్ తో సహా పవర్ పాయింట్ చేసి చూపించారు. కానీ ఎవరికీ ఈ విషయం పట్టడం లేదు. అదే విచారకరం.

ఇప్పటికే తమిలనాడులో నీటి ఎద్దడి మొదలైంది. వర్షాలు లేవు. భూగర్భ జలాలు లేవు. మద్రాస్ లో నీళ్ళను రేషన్ పద్ద్తతిలో ఇస్తున్నారట. లాటరీ తీసి అందులో పేర్లు వచ్చిన వారికి నీరు సరఫరా చేస్తున్నారట కార్పోరేషన్ అధికారులు. తిరుమల కొండపైన జలాశయాలన్నీ అడుగంటుతున్నాయని అంటున్నారు. ఇంకా రెండు నెలలు మాత్రమే అక్కడ నీరు సరిపోతుందట. వర్షాలు పడకపోతే తిరుమలలో నీరు ఉండదు. నీరు లేకుంటే భక్తులు పోలేరు. ప్రకృతిలో వస్తున్న మార్పులకు ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.

ఇప్పటికే మనకు వాతావరణంలో చాలా మార్పులు కన్పిస్తూ ఉన్నాయి. వర్షాలు లేవు. వేడి ఎక్కువైంది. దుమ్ము ఎక్కువైంది. త్రాగునీరు అడుగంటుతున్నది. తినే తిండి అంతా కాలుష్యమయం. జంక్ ఫుడ్ వాడకం ఎక్కువైంది. నేటి యూత్ లో పిల్లల్ని పుట్టించే శక్తి తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ పుట్టినా రోగిష్టి పిల్లలు పుడుతున్నారు. బయటకు అంతా బాగా ఉన్నట్లు కన్పించినా, భవిష్యత్తు అంధకారమయమే అని విసిటింగ్ లెక్చరర్స్ అందరూ ముక్తకంఠంతో అన్నారు.

ఎప్పటినుంచో నాలో ఉన్న భావాలనే మళ్ళీ వాళ్ళు మాకు లెక్చర్ ఇస్తుంటే మౌనంగా విన్నాను.

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. క్యాంపస్ లో కూడా జరిగింది. ఉదయం అయిదున్నరకి లోకల్ యోగా టీచర్స్ కొంతమంది వచ్చి లాన్స్ లో యోగా చేయించారు. 'మీలో ఎవరికైనా యోగాలో అనుభవం ఉందా?' అని అడిగారు. నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా నాకేమీ రానట్లు ఊరుకుని, వాళ్ళు చెప్పినవి చేశాను. చాలా బేసిక్ లెవల్ ఆసనాలు చేయించారు. యోగా గురించి వాళ్ళ లెక్చర్ వింటే నవ్వొచ్చింది. మౌనంగా అదీ విన్నాను. వాళ్ళంతా వెళ్ళిపోయాక స్టేజి మీద శీర్షాసనం వేసి ఒక ఫోటో దిగాను.

యోగా చెయ్యడం వల్ల వాళ్ళ జీవితాలలో ఎంత మంచి జరిగిందో వక్తలు చెప్పుకొచ్చారు. ఎంతసేపూ వారి వారి అహంకార ప్రదర్శన తప్ప, విషయం ఏమీ లేదు. జాలేసింది. పోనీలే, ఏదో కొంచం మంచిదారిలోనే పోతున్నారు కదా అనిపించింది.

మనుషుల మనస్తత్వాలు మాత్రం ఎక్కడైనా ఒకటే. అహంకారం, భయం, దురాశ, ఏం చెయ్యాలో తెలియని ఒక విధమైన ఆత్రం - ఇవి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఊర్లో తిరుగుతూ మనుషులను గమనిస్తూ ఉంటే ఎప్పుడో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది.

'ఎప్పుడు చూసినా దేనినో వెదుకుతున్నట్లు కనిపిస్తావు. మళ్ళీ ఏదీ ఉంచుకోవు. ఏదీ ఒద్దంటావు. అసలు దేనికోసం నీ వెదుకులాట?' అని ఒక ఫ్రెండ్ ముప్పై ఏళ్ళ క్రితం నన్నడిగాడు.

'మనిషి కోసం' అని  క్లుప్తంగా జవాబిచ్చాను.

మూడు దశాబ్దాల క్రితం నేను చెప్పిన ఆ జవాబు ఈ నాటికీ వర్తిస్తుంది. అదే వెదుకులాట ఈనాటికీ కొనసాగుతోంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పట్లో నావాళ్ళంటూ నాకెవరూ లేరు. ఇప్పుడు నాకోసం ప్రాణం పెట్టే మనుషులు కొందరు కాకపోతే కొందరైనా నాతో ఉన్నారు.

నిజమైన మనుషులను చూడకుండానే నేను పోతానేమో? మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో నాకసలు కనిపించడేమో? అని నా జీవితంలో చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎట్టకేలకు కొందరిని చూడగలిగాను.


(ఇంకా ఉంది)
read more " రెండవ లక్నో యాత్ర - 1 "

7, జూన్ 2019, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 36 (నేను పోయినచోటు మహా పుణ్యక్షేత్రం అవుతుంది)

జిల్లెళ్ళమూడిలో ఒకాయన నాకీ కధను చెప్పాడు.

'అమ్మ బ్రతికున్న పాతరోజులలో, అంటే, దాదాపు 1950 ప్రాంతాలలో ఈ సంఘటన జరిగింది.

వరంగల్ దగ్గర ఒక ఊర్లో ఒక ముసలాయన ఉండేవాడు. అతను చాలా పెద్ద జ్యోతిష్కుడు. అతనికి ఒక మనవడు పుట్టాడు. ఆ మనవడిని చూచి ఈ ముసలాయన ఏడుస్తూ ఉండేవాడు. ఎందుకంటే, ఆ పిల్లవాడి జాతకంలో అల్పాయుశ్షు యోగం ఉందని ఆ ముసలాయనకి అర్ధమైంది. అంటే, ఆ పిల్లవాడు చిన్నతనంలోనే చనిపోతాడు.

ముసలాయన పెద్ద జ్యోతిష్కుడే గాని, విధిని మార్చే శక్తి ఆయనకి లేదు. ఊరకే జరగబోయేది చెప్పగలడు అంతే' అన్నాడు నాకీ కధను చెబుతున్నాయన.

వింటున్న నాకు యధావిధిగా నవ్వొచ్చింది.

అలాంటి వాడికి జ్యోతిష్యం ఎందుకు? ఏడవడానికా? చాలామంది జ్యోతిష్కులు ఇలాగే మిడిమిడి జ్ఞానంతో ఉంటారు. జ్యోతిష్కునికి ఉండవలసిన లక్షణాలను గురించి చెబుతూ 'గ్రహయజన పటుశ్చ' అనే ఒక లక్షణాన్ని చెబుతాడు వరాహమిహిరుడు. అంటే, 'గ్రహములను శాంతింపజేసే ప్రక్రియలు తెలిసినవాడై ఉండాలి' అంటాడు. గ్రహములను శాంతింపజెయ్యడం అంటే, జపాలు హోమాలు చెయ్యడం కాదు. డైరెక్ట్ గా కర్మను మార్చడమే. ఇది చెయ్యలేనివాడు 'జ్యోతిష్కుడు' అనే పేరుకు తగడు. ప్రామాణిక గ్రంధాలలో ప్రాచీనులు ఇచ్చిన ఇటువంటి నిర్వచనాలతో నేటి జ్యోతిష్కులలో ఎవ్వరూ సరిపోరు. అందుకే 'నేను జ్యోతిష్కుడిని' అని చెప్పుకునే అర్హత నేటికాలంలో ఎవరికీ లేదని నా అభిప్రాయం.

నా ఆలోచనలు ఇలా సాగుతూ ఉండగా, ఆయన కధను కంటిన్యూ చేశాడు.

'ముసలాయన ఇలా ఏడుస్తూ ఉండగా, ఒక కోయవాడు అతనికి కనిపించి అతని జాతకం చూసి 'నువ్వు ఒక మహా పుణ్యక్షేత్రంలో పోతావు. అప్పుడు నీ మనవడు బ్రతుకుతాడు. నువ్వొక పని చెయ్యి. బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అని ఒక ఊరుంది. అక్కడ ఒక అమ్మగారున్నారు. ఆమె తలుచుకుంటే నీ మనవడికి ఆయుస్సు పొయ్యగలదు. వెళ్లి ఆమె కాళ్ళమీద పడు' అని చెప్పాడు.

నాకు చచ్చే నవ్వొచ్చింది మళ్ళీ.

'అంత కొమ్ములు తిరిగిన ముసలి జ్యోతిష్కుడు, ఒక కోయవాడికి తన జాతకం అసలెందుకు చూపించుకున్నాడు? తన మీద తనకే డౌటా?' అన్న అనుమానం వచ్చింది నాకు.

ఇలాంటి అనుమానాలకు ఎవరిదగ్గరా సమాధానాలు ఉండవు గనుక మౌనంగా కధను వింటున్నాను.

'ఈ మీదట ఆ ముసలాయన రైళ్ళూ బస్సులూ మారి రెండోరోజుకి జిల్లెళ్ళమూడి వచ్చి చేరుకున్నాడు. అమ్మకు తన కధంతా చెప్పాడు. అంతా మౌనంగా విన్న అమ్మ, గంధం లేపనం చేసి ఆ పిల్లవాడిని తన ఒళ్లో పడుకోబెట్టుకుని తన చేతులతో ఆ గంధాన్ని పిల్లవాడి ఒళ్లంతా పూసింది. అంతేకాదు, అప్పట్లో అర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా ఎవరొచ్చినా అమ్మే స్వయంగా వంట చేసి పెట్టేది. అదే విధంగా ఆ ముసలాయనకు ఆయన వెంట వచ్చిన మూడేళ్ళ మనవడికి కూడా వడ్డించింది.'

'ముసలాయన తృప్తిగా భోజనం చేశాడు. చివరి ముద్ద తింటూ 'అమ్మా! నేను పోయె చోటు మహా పుణ్యక్షేత్రం అయి ఉంటుందని నా జాతకం చెబుతున్నది. ఇప్పుడు నీ పాదాల వైపు చూస్తుంటే, ఆక్కడ నాకు మంచుకొండలు కన్పిస్తున్నాయి. శివుడూ పార్వతీ కన్పిస్తున్నారు. అదుగో కైలాసం ! నేను పోతున్నాను. నా మనవడిది నీదే బాధ్యత' అంటూ అమ్మ పాదాల మీద ఒరిగిపోయి అక్కడే చనిపోయాడు. ఈ దృశ్యం చూచిన నాన్నగారు మహా కంగారు పడిపోయారు.

'ఎవరో ముక్కూ ముఖం తెలియని ముసలాయన వచ్చి భోజనం చేస్తూ చేస్తూ ఒరిగిపోయి నట్టింట్లో చనిపోయాడు. పక్కనే ఒక మూడేళ్ళ పిల్లవాడు. ఎక్కడనుంచి వచ్చారో, వాళ్ళ ఊరేమిటో తెలియదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఏమీ లేవు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. నాన్నగారు దిక్కుతోచక అమ్మ వైపు చూచారు.అమ్మ యధాప్రకారం చిరునవ్వుతో అదంతా చూస్తూ ఉంది.

అప్పుడా మూడేళ్ళ పిల్లాడు వాళ్ళ అడ్రసు, ఫోన్ నంబరు మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అదొక విచిత్రం ! మూడేళ్ళ పిల్లవాడు అవన్నీ చెప్పడం ఎలా సాధ్యం? ఆ అబ్బాయి చెప్పిన ప్రకారం బాపట్ల నుంచి ఫోన్ చేయిస్తే, అబ్బాయి తండ్రి వరంగల్ దగ్గర పల్లెటూరి నుంచి ఆఘమేఘాల మీద మర్నాటికి జిల్లెల్లమూడి వచ్చాడు. ఆయన వచ్చేదాకా ఆ శవం అమ్మా వాళ్ళింట్లోనే ఉంది. మూడోరోజున ముసలాయన అంత్యక్రియలు జిల్లెళ్ళమూడిలోనే జరిగాయి. ఈ విధంగా ఆ పిల్లాడికి అమ్మ ఆయుస్సు పోసింది. అతని అల్పాయుస్సు గండం గడిచింది. అతను నిక్షేపంగా ఆ తర్వాత చాలా ఏళ్ళు బ్రతికాడు.

ఇలాంటి సంఘటనలు అమ్మ జీవితంలో కోకొల్లలుగా జరిగాయి' అంటూ ఒకాయన నాకీ కధను చెప్పాడు.

అంటే, సాంప్రదాయబద్ధంగా జ్యోతిష్యం నేర్చుకున్నవాడి కంటే, కోయజ్యోతిష్కుడు ఘనుడన్న మాట అనిపించింది నాకు. లేదా, ముసలాయన జ్యోతిష్యాన్ని సరిగా నేర్చుకుని ఉండడు. ముసలితనం వచ్చినంత మాత్రాన అన్నీ రావు. చాలాసార్లు నీరసం తప్ప ఇంకేమీ రాదు ముసలివారికి.

మనిషి జీవితంలో చేసిన అనేక తప్పులను, చీకటి దాచిపెడుతుంది. అలాగే, తెల్లవెంట్రుకలు కూడా దాచిపెట్టగలవు. జుట్టు తెల్లబడి, గడ్డం పెంచి, పంచె కడితే చాలా తప్పులు వాటి చాటున కొట్టుకుపోతాయి. ఇవి జ్ఞానానికి సూచికలు కావు. నిజమైన జ్ఞానం వీటిలో ఉండదు. కానీ లోకం వీటిని చూచి మోసపోతూ ఉంటుంది. లోకమంతా వేషం చుట్టూనే కదా తిరుగుతోంది ! అలాగే, వయసు కూడా జ్ఞానానికి సూచిక కాదు.

ఈ సంఘటనలో, అమ్మ హోమాలు చెయ్యలేదు. జపాలు చెయ్యమని చెప్పలేదు. రెమెడీలూ సూచించలేదు. డైరెక్ట్ గా ఆ పిల్లవాడి దోషాన్ని తన చేతితో తీసేసింది. డైరెక్ట్ గా వాడి కర్మను మార్చేసింది. జాతకాన్ని మార్చడం అంటే అది ! నిజమైన మహనీయులు సంకల్పమాత్రంతో జాతకాన్ని మార్చగలరు. లేదా అమ్మ చేసినట్లు చిన్న చిన్న పనులతో చెయ్యగలరు. అది ఎలా చెయ్యాలి ఎందుకలా చెయ్యాలనేది వాళ్ళ ఇష్టం. ఆ లోతుపాతులు మనకర్ధం కావు. వాటి వెనుక మనకర్ధం కాని కర్మసూత్రాలుంటాయి.

ఏదేమైనా, మనుషులందరూ అమ్మను ఈతిబాధల కోసం మాత్రమే బాగా వాడుకున్నారని నాకర్ధమైంది. కానీ, అమ్మ చెప్పిన తత్వాన్ని మాత్రం ఎవరూ పట్టుకున్నట్లు నాకనిపించలేదు.

అలాంటి వారిని ఒక్కరినైనా నా జన్మలో చూస్తాననీ, చూడగలననీ నాకంటూ నమ్మకమైతే కలగడం లేదు మరి !
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 36 (నేను పోయినచోటు మహా పుణ్యక్షేత్రం అవుతుంది) "

6, జూన్ 2019, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 35 ( మా అమ్మాయి పెళ్లి అమ్మే చేసింది )

'ఈయన ఫలానా 'ఆయన' కుమారుడు' అంటూ ఒకాయన్ని నాకు పరిచయం చేశారు జిల్లెళ్లమూడిలో.

మా చిన్నప్పుడే జిల్లెల్లమూడిలో 'ఆయన' చాలా ముఖ్యుడు కావడంతో,  'అవునా ! నమస్తే' అంటూ చేతులు జోడించి, నిన్ననే రిలీజైన 'ధర్మపదం' పుస్తకం ఆయనకు బహూకరించాను.

ఆయనా పుస్తకాన్ని చాలా నిర్లక్ష్యంగా చేతిలోకి తీసుకుని ఏదో నవలని నలిపినట్లు దానిని నలుపుతూ, పేకముక్కల్ని తిరగేసినట్లు దానిని తిరగేస్తూ నాతో మాట్లాడటం సాగించాడు.

ఒక్కసారిగా ఆయన మీదా వాళ్ళ నాన్నగారి మీదా నాకున్న మంచి అభిప్రాయం గంగలో కలసిపోయింది. పుస్తకాలను అలా కేజువల్ గా నలిపే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. అది వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యధోరణికీ, లేకి మనస్తత్వానికీ, అహంకారానికి సూచికగా నేను భావిస్తాను.

ఆయనదేమీ పట్టించుకోకుండా, 'ఫలానాయన అమ్మ బోధలనూ, సాయిబాబా బోధలనూ పోలుస్తూ ఒక పుస్తకం వ్రాశారు' అన్నాడు.

'యు మీన్ షిర్డీ?' అనడిగాను.

'అవును. ఒక పక్క అమ్మ చెప్పిన మాట, ఇంకో పక్క సాయిబాబా చెప్పిన మాటతో ఇద్దరి బోధలనూ పోల్చుకుంటూ ఆ పుస్తకం వ్రాశాడు' అన్నాడాయన.

నాకు చచ్చే నవ్వొస్తోంది లోపలనుంచి.

'నా చిన్నప్పుడు శ్రీపాదవారు వ్రాసిన 'అమ్మ - మహర్షి' అనే పుస్తకం చదివాను. అదికూడా అలాంటిదేనేమో?' అన్నాను.

'అవును. అది అమ్మ బోధలకూ, రమణ మహర్షి బోధలకూ ఉన్న సామ్యాన్ని చూపిస్తూ వ్రాసిన పుస్తకం. ఇది సాయిబాబా బోధల గురించిన పుస్తకం. మీరొక పని చెయ్యండి. బుద్ధుని మీద మీరు పుస్తకం వ్రాశారు కదా ! అమ్మ బోధలకూ బుద్ధుని బోధలకూ ఉన్న సామ్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాయండి' అన్నాడాయన.

'ఇంకా నయం ! పిల్లి తల గొరగమనలేదు' అనుకున్నా లోలోపల.

'వీళ్ళలో ఒక్కరి బోధలలో ఒకదానినైనా సరిగ్గా అర్ధం చేసుకొని జీవితంలో ఆచరించాలిగాని ఇలా వాళ్ళవీ వీళ్ళవీ పోల్చుకుంటూ పోతుంటే మనకేం వస్తుందిరా నాయనా !' అని అందామని అనుకున్నాగాని పోనీలే వయసులో పెద్దాయన బాధపడతాడు మనకెందుకని ఊరుకున్నా.

నా చూపును బట్టి నాకు విషయం అర్ధం కాలేదని అనుకున్నాడో ఏమో? ఇలా చెప్పాడాయన.

'అమ్మ బోధలు చాలా విలక్షణంగా ఉంటాయండి. ఉదాహరణకు - నీ పిల్లవాడిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యి అని మిగతావాళ్ళు చెబితే, 'కలెక్టర్లందరూ నీ పిల్లలే అనుకో అని అమ్మ చెప్పింది. అమ్మ బోధలు ఇలా ఉంటాయి' - అన్నాడాయన.

నా తలను దేనికేసి బాదుకోవాలో అర్ధం కాక, ఒక పిచ్చి చూపు చూసి, ఒక పిచ్చి నవ్వు నవ్వా.

'కలెక్టర్లందరూ నా పిల్లలే అని నేననుకోవచ్చు. కానీ వాళ్ళలా అవ్వరు కదా? అలా అనుకోవడం నా భ్రమ అవుతుంది. పిచ్చివాడు కూడా తను రాజునని నడిరోడ్డు మధ్యలో కూచుని, ట్రాఫిక్ అంతా తన ప్రజలని అనుకుంటూ ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. అది నిజమౌతుందా? వాడికి పిచ్చి అనేది మాత్రం నిజమౌతుంది. అయినా అమ్మ చెప్పింది ఇదా? వీళ్ళకు అర్ధమైంది ఇదా?' అని నాకు చాలా జాలేసింది.

ఇక ఆయనా, ఆయన కుటుంబ సభ్యులూ అమ్మ చేసిన మహిమలను ఏకరువు పెడుతూ వచ్చారు.

'మా పెద్దమ్మాయి ఇక్కడే సమర్తాడింది. దాని పెళ్లి అమ్మే చేసింది. రెండో అమ్మాయీ ఇక్కడే సమర్తాడింది. దాని పెళ్ళీ అమ్మే చేసింది. మూడో అమ్మాయి....' అని ఆయన భార్య ఇంకేదో చెప్పబోతుంటే, నేనందుకుని - 'ఆమె కూడా ఇక్కడే ఆడిందా? అన్నాను సీరియస్ గా.

ఆమె ఏదో ఫ్లో లో ఉంది. నా వ్యంగ్యం ఆమెకు అర్ధం కాలేదు. కంటిన్యూ చేస్తూ - 'అది మాత్రం ఇక్కడాడలేదు. హైదరాబాద్ లో ఆడింది. కానీ దాని పెళ్లి కూడా అమ్మే చేసింది' అందామె.

అర్జంటుగా వాళ్ళ మధ్యనుంచి పారిపోయి ఎక్కడైనా దూకి సూయిసైడ్ చేసుకుందామని నాలో బలమైన కోరిక తలెత్తింది. నిగ్రహించుకుని అక్కడే కూచున్నా.

'సమర్తాడటం, పెళ్లి చేసుకోవడం తప్ప, జీవితంలో ఇంక ఉన్నతమైన ఆశయాలు ఆదర్శాలు ఏవీ ఉండవేమో వీళ్ళకి? వీళ్ళ దృష్టిలో ఇవేనేమో ప్రపంచసమస్యలు? వరసపెట్టి పిల్లల్ని కనడం వీళ్ళ పనీనూ, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యడం అమ్మ పనీనా? ఎలాంటి మనుషుల మధ్యకు వచ్చాన్రా దేవుడా !' అనుకున్నా.

ఆయన అందుకున్నాడు.

'నలభై ఏళ్ళ క్రితం మా బాబాయి గారి మూడో కొడుకు డిగ్రీ పూర్తి చేసి ఆరేళ్ళు ఖాళీగా ఉన్నాడు. అయినా ఉద్యోగం రాలేదు. అందుకని అమ్మ దగ్గరకి వచ్చి ఉద్యోగం రావడం లేదని ఏడిచాడు' అన్నాడు.

'కష్టపడి చదివి పరీక్షలు వ్రాస్తే ఉద్యోగం వస్తుంది గాని, ఇంట్లో ఖాళీగా కూచుని ఏడుస్తుంటే ఎలా వస్తుంది? నీ ప్రయత్నం నువ్వు చెయ్యకపోతే అమ్మ మాత్రం ఏం చేస్తుంది?' అందామనుకున్నా. సభ్యత కాదని మళ్ళీ మింగేశా.

'అప్పుడు అమ్మ వాడికి ఒక కర్చీఫ్ ఇచ్చింది. దాన్ని జేబులో పెట్టుకుని వెళ్లి బాపట్ల సముద్రంలో దూకాడు. ఆ కర్చీఫ్ కొట్టుకుని పక్కనే ఉన్న సూర్యలంక నేవీ ఆఫీసర్స్ కి దొరికింది. వాళ్ళు వెదుక్కుంటూ వచ్చి వీడిని కాపాడారు. ఆ విధంగా ఆ కర్చీఫ్ రూపంలో అమ్మే వాడి ప్రాణాలు కాపాడింది' అన్నాడాయన భక్తిగా.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నందుకు మొదటిసారి నన్ను నేనే తిట్టుకున్నా. నా ప్రమేయం లేకుండానే లేస్తున్న కాళ్ళూ చేతులను చాలా నిగ్రహించుకోవలసి వస్తోంది మరి !

ఈ సోదిభక్తులందరూ ఇలాంటి చవకబారు కధలు చాలా చెబుతూ ఉంటారు. సాయిబాబా భక్తులు కూడా ఇలాంటి సొల్లు చాలా చెప్తారు. వినీ వినీ నాకు ఈ సోకాల్డ్ భక్తులంటేనే పరమ చీదర పుడుతోంది. ' డర్టీ స్లేవ్ మెంటాలిటీస్ !' అని లోలోపల తిట్టుకున్నా.

అంత విసుగులోనూ నాకొక డౌటొచ్చింది.

'అమ్మ అతన్ని రక్షించాలీ అనుకుంటే, అసలు సముద్రంలో దూకేటప్పుడే రక్షించాలి. దూకనిచ్చి, ఆ తర్వాత ఆ కర్చీఫ్ ని నేవీ ఆఫీసర్స్ కి దొరికేలా చేసి అప్పుడు రక్షించడం ఏంటి? అసలు, అమ్మ దగ్గరకు వచ్చి వేడుకున్న తర్వాత అతను సముద్రంలో దూకడం ఏంటి? అంటే, అమ్మంటే అంత గొప్ప నమ్మకం ఉందన్నమాట ఆయనకి?' అనుకున్నా.

వీళ్ళు చెబుతున్న కాకమ్మకధలలో ఎన్నో లొసుగులు నాకు కన్పిస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళ ఊహలే గాని అమ్మ చేసిన మహిమలు కావన్న నిశ్చయానికి వచ్చేశా లోలోపల.

'సృష్టిని మించిన మహత్యం లేదు' అనీ ' మహత్తత్వానికి మహిమలతో పని లేదు' అనీ అమ్మ చెబితే, వీళ్లేమో నాసిరకం మహిమలు అమ్మ చేసిందని కధలు చెబుతున్నారు. అమ్మ తత్త్వం వీళ్ళకు ఆవగింజంత కూడా ఎక్కలేదని నాకర్ధమైంది. వీళ్ళంతా ఊహలలో బ్రతుకుతున్నారు గాని రియాలిటీ వీళ్ళకు అర్ధం కాలేదన్న సంగతి నాకు స్పష్టమై పోయింది.

మనుషులందరూ పచ్చి స్వార్ధపరులు, దొంగలు. వీళ్ళకు ఉన్నతమైన తత్త్వం ఏనాటికీ ఎక్కదు, అవసరం లేదు కూడా. ఎంతసేపూ, ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు కావడం, పిల్లలు పుట్టడం, ఆస్తులు పెరగడం, అనుకున్న పనులు కావడం తప్ప ఇంకో ఉన్నతమైన ఆలోచనే వీళ్ళ బుర్రలకు తట్టదు. ఇలాంటి మనుషులను వేలాదిమందిని అమ్మ జీవితాంతం ఎలా భరించిందో అన్న ఆలోచనతో నా ఒళ్ళు క్షణకాలం గగుర్పొడిచింది.

ఆయనకు నా పుస్తకాన్ని ఇచ్చినందుకు పశ్చాత్తాపపడ్డాను.

సోకాల్డ్ సోది భక్తులంటే నాకున్న అసహ్యం ఒక్కసారిగా ఎన్నో రెట్లు పెరిగిపోయింది.  అదే సమయంలో సృష్టి లీలా, దాన్ని నడిపిస్తున్న మాయా ప్రభావమూ ఎలాంటివో అర్ధమై ఎంతో ఆశ్చర్యమూ, జాలీ, నవ్వూ మూడూ ఒకేసారి కలిగాయి.

అమ్మ ఎలాంటి మనిషి? ఎంత ఉన్నతమైన తాత్వికత ఆమెది? ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను ఆమె తన జీవితంలో అలవోకగా ఆచరించి చూపింది? వీళ్ళేం అర్ధం చేసుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇదా అమ్మ చెప్పింది? ఇదా వీళ్ళకు ఎక్కింది? 'ఛీ' అనిపించింది.

'సృష్టి ఇంతే, మనుషులింతే. ఎవరెన్ని చెప్పినా వీళ్ళ అజ్ఞానం ఏ మాత్రమూ తగ్గదు. వీళ్ళు ఎప్పటికీ ఎదగరు. ఇదింతే' - అనిపించింది.

'చక్రవర్తి దగ్గరకు వెళ్లి, దర్బారులో ఆయన ఎదురుగా నిలబడి,వరం కోరుకో అని చక్రవర్తి చెబితే, 'కేజీ పుచ్చు వంకాయలు కావాలి' అని అడుగుతారు మనుషులంతా' అన్న శ్రీరామకృష్ణుల అమృతవాక్కులు గుర్తొచ్చాయి.

మనుషుల అజ్ఞానపు స్థాయిని తలచుకుని నా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

ఆ తర్వాత ఎక్కువసేపు అక్కడ ఉండబుద్ధి కాలేదు. వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలనీ అనిపించలేదు. సెలవు తీసుకుని, అమ్మకు మనస్సులోనే ప్రణామం చేసుకుని, వెనక్కు బయల్దేరి రాత్రి పదిగంటలకల్లా గుంటూరు వచ్చి చేరుకున్నాము.
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 35 ( మా అమ్మాయి పెళ్లి అమ్మే చేసింది ) "